కంకంటివారి జలక్రీడ
సాహితీమిత్రులారా!
కంకంటి పాపరాజు గారు తన
ఉత్తర రామాయణంలో ఆరవ ఆశ్వాసంలో
సీతారాముల జలక్రీడావర్ణన లోని
ఒక పద్యం గమనించండి-
మొగములు గానరా నిగిడి కామిను లీఁదఁ
గొల నెల్లఁ జంద్రమండలము లయ్యెఁ
గుచములు గానరాఁ గొమ్మ లీఁద సరోవ
రం బెల్లఁ గమలకోరకము లయ్యె
గ్రొమ్ముడుల్ గానరాఁ గొమిరె లీఁదఁగఁదటా
కంబెల్ల గాఢాంధకార మయ్యెఁ
బిఱుఁదులు గానరా బిసరుహానన లీఁద
దీర్ఘికాంతర మెల్ల దీవు లయ్యె
బాహువుల్గానరాఁ బద్మపాణు లీఁద
నరసి యెల్ల మృణాళైకసదన మయ్యె
నంగములు గానరాఁ గాంచనాంగు లీఁద
సారసాకర మెల్ల బంగార మయ్యె
(ఉత్తరరామాయణము - 6-82)
ఈ పద్యంలో యువతులు సరస్సులో దిగి ఒక్కోసారి ఒక్కొక్క అవయవం కనబడే విధంగా ఒక్కొక్క విధమైన ఈత ఈదుతుంటే ఆ సరస్సు ఎలావుందో కంకంటివారు వర్ణిస్తున్నాడు
మొగములు గానరా నిగిడి కామిను లీఁదఁ
గొల నెల్లఁ జంద్రమండలము లయ్యెఁ
కామినులు(స్త్రీలు) ముఖాలు కనపడే విధంగా వెల్లకిలా నిలువుగా నిగిడి(సాగి) ఈదుతుంటే కొలనంతా చంద్రబింబాలతో నిండినట్లయింది ప్రతిముఖం చంద్రునిలా ఉండడంచేత
గుచములు గానరాఁ గొమ్మ లీఁద సరోవ
రం బెల్లఁ గమలకోరకము లయ్యె
కుచాలు కనబడేవిధంగా ఆ కొమ్మలు(యువతులు) ఈదుతుంటే సరస్సంతా కమలకోరకమ్ముల(తామర మొగ్గల)తో నిండినట్లుంది. వారి కుచాలు తామరమొగ్గల్లా ఉండటంతో
గ్రొమ్ముడుల్ గానరాఁ గొమిరె లీఁదఁగఁదటా
కంబెల్ల గాఢాంధకార మయ్యెఁ
కొమెరలు(యువతులు) బోర్లా పడుకొని కేశపాశాలు నీటిమీద పరుచుకొని కనబడే విధంగా ఈదుతుంటే సరస్సంతా దట్టమైన చీకటితో నిండినట్టయినది. అంతమంది స్త్రీల ముడుల నల్లదనమంతా సరస్సంతా వ్యాపించడంతో
బిఱుఁదులు గానరా బిసరుహానన లీఁద
దీర్ఘికాంతర మెల్ల దీవు లయ్యె
బిసరుహాననలు(తామరపూలవంటి ముఖాలున్న స్త్రీలు) పిఱుదులు కనబడేవిధంగా ఈదుతుంటే సరస్సుమధ్యంతా దీవులతో నిండినట్లయింది. పిఱుదులు దీవుల్లా వుండంతో
బాహువుల్గానరాఁ బద్మపాణు లీఁద
నరసి యెల్ల మృణాళైకసదన మయ్యె
నంగములు గానరాఁ గాంచనాంగు లీఁద
సారసాకర మెల్ల బంగార మయ్యె
కాంచనాంగులు(బంగారువంటి శరీరంగల యువతులు) శరీరాలు కన్పడేవిధంగా సరస్సంతా బంగారమైంది.
No comments:
Post a Comment