షట్చక్రవర్తి చరిత్రలోని నవవధువు
సాహితీమిత్రులారా!
కామినేని మల్లారెడ్డిగారి షట్చక్రవర్తి చరిత్రములో
నవవధువును ఈ క్రిందిపద్యంలో వర్ణించారు
ఎంత అద్భుతంగా ఉందో గమనించగలరు-
మగని వీక్షించి దేహళీమధ్యసీమఁ
ద్రపయు నెనుకకుఁ బ్రేమ ముందఱికిఁ దిగువ
భామ గనుపట్టె నాలీఢపాదయగుచు
మరునితోఁబోర నిలుచున్న మహిమ మెఱయ
(షట్చక్రవర్తి చరిత్రము - 5 - 114)
ఈ పద్యంలో మొదటిగా పడకింటికి వెళుతున్న ఒక నవవధువును వర్ణించాడు కవి కామినేని మల్లారెడ్డిగారు.
పడకింటి గడపవరకూ వెళ్ళి లోపల భర్తను చూచి దేహాళీ మధ్యసీమ(గడపమధ్య)లో
ఆగిపోయింది. త్రప(సిగ్గు) వెనుకకు లాగుతోంది. భర్తమీద ప్రేమ ముందరికి లాగుతోంది.
ఆలీఢపాదయై(ఒకపాదం గడపకు లోపల ఒకపాదం గడపకు వెలుపల ఉంచి) నిలబడింది.
ఆ స్థితిలో మరుని(మన్మథుని)తో పోరన్(యుద్ధంచెయ్యడానికి)
నిలబడ్డ తీరుగా ఆ యువతి కనబడింది- అని కవి వర్ణించాడు
No comments:
Post a Comment