నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు
సాహితీమిత్రులారా!
దేవులపల్లి కష్ణశాస్త్రిగారి కృష్ణపక్షంలోని
స్వేచ్ఛాగానం - 2 ను ఆస్వాదించండి-
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు
నా యిచ్చయే గాక నాకేటి వెరపు
కలవిహంగమ పక్షముల దేలియాడి
తారకామణులలో తారనై మెరసి
మాయమయ్యెదను నా మధురగానమున
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
మొయిలు దేనెలలోన పయనంబొనర్చి
మిన్నెల్ల విహరించి మెరుపునై మెరసి
పాడుచూ చిన్కునై పడిపోది నిలకు
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ
జతగూడి దోబూచి సరసాల నాడి
దిగిరాను దిగిరాను భువినుండి దివికి
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
శీకరంబులతోడ చిరుమీలతోడ
నవమౌక్తికములతో నాట్యమ్ములాడి
జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
పరుగెత్తి పరుగెత్తి పవనునితోడ
తరుశాఖ దూరి పత్రములను జేరి
ప్రణయరహస్యాలు పలుకుచు నుందు
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
అలరుపడంతి జక్కిగింత వెట్టి
విరిచేడి పులకింప సరసను బాడి
మరియొక్క ననతోడ మంతనంబాడి
వేరొక్క సుమకాంత వ్రీడ బోగొట్టి
క్రొందేనె సోనలగ్రోలి సోలుటకు
పూవు పూవునకు బోవుచునుందు
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
పక్షి నయ్యెద చిన్న ఋక్ష మయ్యెదను
మధప మయ్యెద చందమామ నయ్యెదను
మేఘ మయ్యెద వింత మెరుపు నయ్యెదను
అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను
పాట నయ్యెద కొండవాగు నయ్యెదను
పవన మయ్యెద వార్ధిభంగ మయ్యెదను
ఏలొకో యెప్పుడో యెటులనో గాని
మాయ మయ్యెదను నేను మారిపోయెదను
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
నా యిచ్చయే గాక నాకేటి వెరపు?
No comments:
Post a Comment