Wednesday, November 7, 2018

తెలుగు కథల్లో ‘నేను’


తెలుగు కథల్లో ‘నేను’
సాహితీమిత్రులారా!

ఉత్తమపురుష-ప్రథమపురుష
రచయిత కథ బయట ఉండి, తాను కనపడకుండా కథని చూపుతున్నట్లు వినిపిస్తే అది ప్రథమపురుష. కథ లోపల ఉండి ‘నేను’ రూపంలో కథని వినిపిస్తున్నట్లు చూపితే అది ఉత్తమపురుష.

ఈ రెండు రకాల తెలుగు కథల్లో, వేటి సంఖ్య ఎక్కువ? వేటి సంఖ్య తక్కువ? చెప్పటం కష్టం. అయినా ఒక అంచనా వేయటానికి ప్రయత్నించాను. నవ్య నీరాజనం కథల సంపుటి, పాతికేళ్ల కథ (1990-2014), ఈమాట అంతర్జాల పత్రిక జనవరి 2017 నుంచి నవంబర్ 2017, వాకిలి అంతర్జాల పత్రిక జనవరి 2013 నుంచి జూన్ 2016; వీటిలో వచ్చిన కథలు 557. వీటిల్లో ఉత్తమపురుషలో ఉన్నవి 228. ఈ అంకెల ఆధారంగా మొగ్గు ఎటువైపు ఉందో, ఉంటుందో ఊహించవచ్చు.

అయితే, ఈ అంచనా వేస్తున్న సమయంలో, పైన చెప్పిన 228 కథల్లో ఉన్న ‘నేను’ అన్ని కథల్లోనూ ఒకే రకంగా లేనట్లు గమనించాను. అందుకని, ఆ కథల్లో కొన్నిటిని ఎన్నుకుని, ‘నేను’ స్వరూపస్వభావాలు తెల్సుకునే ప్రయత్నం చేశాను. దాని ఫలితమే ఈ వ్యాసం.

‘నేను’ ప్రాథమిక పరిచయం
ఏ కథనయినా సరిగా అనుసరించాలంటే కథలోని ప్రధానపాత్రల ప్రాథమిక పరిచయం అవసరం. ప్రాథమిక పరిచయం అంటే పేరు ఒకటే కాదు. దానికన్నా ముఖ్యం ‘నేను’ కి చెందిన ఇతర వివరాలు. ప్రథమపురుష కథనంలో ఈ వివరాలన్నీ కథలో ప్రధానపాత్రలు ప్రవేశించినప్పుడో, ఆ తర్వాత కొద్దిసేపటికో సందర్భానుసారంగా తెలుస్తాయి. ఈ పాత్రల్తో పోలిస్తే ఉత్తమపురుషలో కథలో ప్రధానపాత్ర అయిన ‘నేను’ పూర్తిగా భిన్నమయినది. కారణం? ఇది కథ మొదట్లోనే కథలోకి వస్తుంది. అందుకని, దాని ప్రవేశంతో పాటు, దాని వివరాలు కథ ప్రారంభంలోనే తెలియాలి. అలా కాకుండా, కథ బాగా ముందుకు వెళ్లింతర్వాత ఈ వివరాలు తెలిసినా, Breakrooమోపోఖ్యానం-డబ్బింగ్ ఢమాల్, Walmart లాంటి కథల్లోలా అసలు తెలీకపోయినా; కథనం ఏ వయోలింగవృత్తి లక్షణాలకి చెందినదో తెలీకుండానే కథలో కొంత భాగం లేదూ కథంతా చదవాల్సి వస్తుంది. కథనానికీ, అవగాహనకీ మధ్య ఒక అగాధం ఏర్పడుతుంది.

కథలో, ఉన్నది ‘నేను’ ఒకటే పాత్ర
ప్రథమపురుష కథనంలో, కథ చూపించబడినట్లుగా చెప్పబడుతుంది, ‘నేను’ ఉన్న కథల్లో కథ చెప్తున్నట్లుగా చూపబడుతుంది అని ముందే అనుకున్నాం. అయితే ఈ సూత్రం ఇతర పాత్రలున్న ‘నేను’ కథలకే మాత్రమే వర్తిస్తుందేమో అనిపించింది. కారణం? కథలో ‘నేను’ అనే ఒకే పాత్ర ఉన్నప్పుడు, కథనం ఏ ఇతర పాత్రనీ ప్రత్యక్షంగా స్పృశించనప్పుడు ‘నేను’, తనతో తాను మాట్లాడుకుంది. తనలో తాను మాట్లాడుకుంది. చమ్కీ దండ అలా ఒకటే పాత్ర ఉన్న కథ. ఆ కథ మొత్తం అందుకే కాబోలు ‘నేను’ యొక్క స్వగతంలా వినపడింది.

‘నేను’ చెప్పని కథ
జ్ఞాపిక అనే కథ ఉత్తమపురుష రీతిలో మొదలవుతుంది. ‘నేను’ పేరు జ్ఞాపిక అని కథ చివర్లో తెలుస్తుంది. కథ మొదట్లో ‘నేను’ కాక ప్రశంస అనే మరో పాత్ర కనపడుతుంది. ‘నేను’ అడిగిన ఒక ప్రశ్నకు జవాబు ఒక గతసంఘటనలో ఉన్నట్లు ప్రశంస అన్యాపదేశంగా సూచిస్తుంది. ఈ గతసంఘటన వర్ణన కథ ఎత్తుగడకి భిన్నంగా ప్రథమపురుషలో జరుగుతుంది. ప్రశంస తండ్రి అయిన చిరంజీవి ఈ భాగంలో ప్రధానపాత్ర. అందులో అనేక ఇతరపాత్రలున్నాయి కాని, గతసంఘటన వర్ణించటానికి పూనుకున్న ప్రశంస మాత్రం ఉండదు. అందువల్ల, గతం ఆమెకు నేరుగా తెలిసే అవకాశం లేదు. ఇంకొకరిద్వారా ప్రశంసకు తెలిసినట్లు కూడా కథలో ఎలాంటి సూచనా లేదు. అయినా, ఆ సంఘటన తనకు వివరంగా తెలిసి ఉన్నట్లు, అదంతా తానే చెప్పినట్లు; “అదీ… జరిగింది.” అని ప్రశంస అంటుంది. కథ ఉత్తమపురుషలో ముగింపుకొస్తుంది.

ఈ కథ మొత్తం చదివింతర్వాత కథలో జ్ఞాపిక అనే పాత్ర లేకుండా చేసి, జ్ఞాపిక పాత్రని, ప్రశంసకి అప్పగిస్తే? ప్రశంసకి చిరంజీవి ‘నేను’ గా కథ వినిపించి ఉంటే? అనిపించింది.

‘నేను’ ఉన్న కథల్లో సంభాషణలు
‘నేను’ ఉన్న కథల్లో, ఇతర పాత్రలతో ‘నేను’ సంభాషణలు; మిగిలిన కథల్లో ఉన్న సంభాషణల్లాగే ఉంటాయి. అవి ఇతరపాత్రలతో సంభాషణలయితే నేరుగా మనకు యథాతథంగా వినపడతాయి. పరోక్షంలో పాత్రలు మాట్లాడుకున్న మాటలు, ‘నేను’ మళ్లీ చెప్పటం ద్వారా తెలుస్తాయి. అయితే, కొటేషన్ మార్క్స్ బట్టి, అవి ఇప్పటికిప్పుడు మాట్లాడుతున్న మాటలా, ఇంకోసారి ఇప్పుడు చెప్పబడుతున్న ఒకప్పటి మాటలా అనే దాని మీద ఒక నిర్ణయానికి రాకూడదు. కారణం? ‘స్పృహ’ అనే కథలో సంభాషణలన్నీ డబుల్ కోట్స్‌లో ఉన్నాయి. స్పర్శ, ఉక్కుపాదం, యినస్టెంట్ లైఫ్ లాంటి కథల్లో సంభాషణలు సింగిల్ కోట్స్‌లో ఉన్నాయి.

ఒకరికి మించిన ‘నేను’లు
కొన్ని కథల్లో, ‘నేను’తో పాటు కొన్ని పాత్రలు ఇంకో ‘నేను’ లేదా మరికొన్ని ‘నేను’లు అవుతాయి. ఉదాహరణకి థూ కథ. ఇందులో ఇద్దరు ‘నేను’లు ఉన్నారు. బసివిరెడ్డి నాయుడు మొదటి ‘నేను’. కుంటి జోసప్పు రెండో ‘నేను’. వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్ అనే మరో కథలో ముగ్గురు ‘నేను’ లు ఉన్నారు; అంకుర్, మాధవి, రష్మీ. ఇంకో కథ నాలుగు స్తంభాలాట-లో అయిదు ‘నేను’లు ఉన్నాయి. ఆడపావురం, పిల్ల పావురం, తిక్క పావురం, మగ పావురం, గోపురం పావురం. ఈ కథల్లో, ఎవరు చెప్పాల్సిన కథాభాగాన్ని వాళ్లు చెప్పారు.

ఒకటికి మించి ‘నేను’లు ఉన్న కథలో, ఎవరికి వారు విడివిడిగా చెప్పింది పాఠకుడు విని ఒకదానికొకటి సమర్థవంతంగా సమన్వయించుకోవాలి. వాళ్ల కథనాల మధ్య వైరుధ్యం ఉంటే క్షీరనీరన్యాయం చేయాలి. అవగాహనాశక్తికి పని చెప్పాలి. నిజనిర్ధారణ చేసుకోవాలి. కథలో ‘నేను’ల నేపథ్యం తెలీదు కనుక, ఇది కొంచెం కష్టమయిన పని. ముగింపు అంత తొందరగా అంచనాకి దొరకదు. ఇందువల్ల, ఒకరికి మించి ‘నేను’లు ఉన్న కథల్తో పోలిస్తే, ఒక ‘నేను’ ఉన్న కథలు అర్థం చేసుకోటం సులభం అనిపిస్తుంది.

ఈ కష్టం, నాపై కథ రాస్తావా? కథల్లాంటివి చదివినప్పుడు ఇంకాస్త ఎక్కువవుతుంది. ఇందులో కూడా ఇద్దరు ‘నేను’లు ఉన్నారు. కాని, వాళ్లిద్దరూ థూ కథలోలా నిజమయిన ‘నేను’లు కారు. రెండో ‘నేను’ మాత్రమే నిజమయిన ‘నేను’. అతడో రచయిత. మొదటి ‘నేను’, రెండో ‘నేను’ రాసిన కథలో పాత్ర. కథ మొదటి భాగంలో ఉన్న ‘నేను’ అసలయిన ‘నేను’ అనుకొని, అతడే కథ చివరిదాకా ఉంటాడని అనుకుంటూ కథను చదువుతాం. ఉన్నట్లుండి, కథలోకి మరో ‘నేను’ వస్తాడు. అతనొచ్చేదాకా, అప్పటిదాకా చదివిన కథలో ఉన్న మొదటి ‘నేను’, నిజమయిన ‘నేను’ అనుకుంటాం. కాని, అది నిజం కాదని; రెండో ‘నేను’ రాసిన కథలో మొదటి ‘నేను’ ఒక పాత్ర మాత్రమే అని తర్వాత కథలో మనకు తెలుస్తుంది. కథలో మొదటి ‘నేను’ నిజమయిన ‘నేను’ అనుకుని కథని చదివిన మనం, కథని సరిగ్గా అర్థం చేసుకున్నామో లేదో తెలుసుకోవటానికి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ఇలా కాకుండా, మొదటి ‘నేను’ పాత్రకి ఏదయినా పేరు ఉండి ఉంటే కథని అనుసరించటం, అర్థం చేసుకోటం ఇంకాస్త సులభమయేది.

ఒకటికి మించిన ‘నేను’లు ఉన్న కథలు చదివినప్పుడు, వీళ్లు విడివిడిగా కాకుండా కలిసి ‘మేము’గా కథ చెప్తే ఏం? అనే ప్రశ్న తలెత్తుతుంది. అందరు ‘నేను’లు చెప్పినది ఒకటి అయినప్పుడు మాత్రమే ఇది కుదురుతుంది. అప్పుడు కథని ‘నేను’గా కాకుండా, ‘మేము’గా చెప్పాలి. ‘ఆఖరికి అయిదు నక్షత్రాలు’ కథ అలాంటిదే. ఈ కథలో కొన్ని పాత్రలకి ఒక సమష్టి అనుభవం కలిగింది. అది పాఠకులకి తెలియచెప్పాలి. అందుకని కథని వాళ్లు ‘మేము’గా చెప్పటానికి పూనుకున్నారు. ‘మేము’ గానే కథని చెప్పారు.

‘నేను’ ఉన్న కథల్లో రచయిత పాత్ర
మామూలుగా ‘నేను’ ఉన్న కథల్లో ‘నేను’ పాత్ర మనముందు నేరుగా ప్రత్యక్షమవుతుంది. కాని, పైన చెప్పిన థూ కథలో, రచయిత కథాంశం చెప్పి, ఇద్దరు ‘నేను’ల్ని మనకు పరిచయం చేసి మిగిలిన కథ వాళ్ల ద్వారా వినమన్నారు. వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్ కథలో, నాలుగు స్తంభాలాట కథలో, నాపై కథ రాస్తావా? కథలో అలాంటి ఉపోద్ఘాతం లేదు. రచయితలు నేరుగా ‘నేను’ల్ని ప్రవేశపెట్టి, కథ మనకు వినపడేలా చేశారు. ఈ నాలుగు కథల్లో, ఎందులోనూ ‘నేను’ల కథనం పూర్తయిన తర్వాత రచయిత ప్రవేశించలేదు.

‘నేను’ కదలికలు, ఆలోచనలు
కథలో ఒక ‘నేను’ ఉన్నా, అంతకుమించి ‘నేను’లు ఉన్నా వాళ్ల కదలికల పైన ఎలాంటి ఆంక్షా కనపడలేదు. క్లుప్తంగా చెప్పాలంటే, వీళ్లు కథ నిండా కనపడినా తమ ఆలోచనల్ని మాత్రమే పంచుకోగలిగారు. అంతవరకే! మిగిలిన పాత్రల మనసులో ఏముందో ఆ పాత్రలు చెప్తే తప్ప, మనకు వినిపించలేదు. కాకుంటే, తక్కిన పాత్రల దేహభాష ఆధారంగా ఆ పాత్రల మనోసంద్రంలో భావతరంగాల స్వభావాన్ని, లోతును, ప్రవాహదిశను, వేగాన్ని అంచనా వేయటానికి ప్రయత్నించారు. టోరాబోరా వంటమనిషి కథలోని ‘నేనేదో మిలిటరీకి మనుషుల్ని ఎంపిక చేస్తున్నట్టుగా ఎవరో అతనికి తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా, ఇంకా స్టిఫ్‌గానే నిల్చుని ఉన్నాడు.’ ‘ఇతనితో ఎలారా దేవుడా అని నాలో సందిగ్ధం మొదలయ్యిన విషయం నా ముఖం చూసి పసిగట్టేసినట్టున్నాడు ముసలాయన.’ ‘దీన్ని సుఖాంతం చేసుకోడానికి ఏదో ఒక యుక్తి తన మదిలో మెరిసి ముఖంలో వెలిగింది.’ అనే వాక్యాలు దీనికి దృష్టాంతాలు. ఇది కాకుండా ఎదుటి మనిషి మనసులో ఏముందో తెలుసుకోటానికి ఇంకో రకంగా చేసిన ప్రయత్నం ‘కార్తికేయుని కీర్తికాయం’ కథలో కనపడింది. ఈ కథలో కార్తికేయమూర్తి రాత్రికి రాత్రి అదృశ్యమవుతాడు. అతడు రాసిన ఉత్తరాలు అతడి భార్య ద్వారా ‘నేను’ చేతికి చేరాయి. వాటిని, ‘నేను’, తన స్నేహితుడయిన విశ్వపతికి చూపెట్టి, విశ్వపతి ద్వారా కార్తికేయమూర్తి మనసులో ఏం ఉందో తెలుసుకుని చెప్పాడు.

‘నేను’ లేకుండా చోటు చేసుకున్న సంఘటనలు కథలో ఏవన్నా ఉంటే, అవి ‘నేను’ కి తెలియవు. ఉదాహరణకి, కార్తికేయుని కీర్తికాయం కథలో, కార్తికేయమూర్తి ఇంట్లోంచి అదృశ్యం కావటానికి ముందు నాలుగైదు రాత్రులపాటు ఏం చేశాడనేది, ‘నేను’కి తెలీదు. అయితే కథ ముందుకు నడవటానికి ఇది ముఖ్యం. అందుకని కార్తికేయమూర్తి భార్య అచ్యుతవల్లి మాటల ద్వారా ‘నేను’ దాన్ని తెల్సుకుంటూ మనకు తెలిపాడు.

‘నేను’ ఉన్న కథల్లో, కథాంశం
‘నేను’ ఉన్న కథల్లో కథాంశం, పూర్తిగా ‘నేను’ మీదనే కేంద్రీకృతమవ్వాలని లేదు. ఇన్‌స్టంట్ లైఫ్ కథలో ‘నేను’ మునీరా. కథలో ఆమెదే ప్రధాన పాత్ర. కథ ఆమె మీద కేంద్రీకృతమయింది. కార్తికేయుని కీర్తికాయం కథలో, కథ ‘నేను’ అనే కిరీటిది కాదు. అతని స్నేహితుడయిన కార్తికేయమూర్తిది.

భిన్నమైన ‘నేను’లు
కథలో ఉన్న ‘నేను’ నిత్యజీవితంలో మనం నిత్యం చూస్తున్న వ్యక్తే అయి ఉండాలని లేదు. అది నేటిలోంచి రేపటిని ఊహించి సృష్టించిన పాత్ర కూడా కావచ్చు. పునరావృతమ్ కథలో హాలోగ్రామ్ హెచ్. 805 అలాంటిదే.

కథల్లో, ‘నేను’ కచ్చితంగా ఒక వ్యక్తి అయి ఉండి తీరాలనీ లేదు. చీడ కథలో ఒక పూల మొక్క ‘నేను’. ఆ కథలో దాని పేరు సంపంగి. అద్దం కథలో అద్దం, తలపాగా స్వగతం కథలో తలపాగా, చివరి పిచ్చిక కథలో పిచ్చిక, రయిక ముడి ఎరగని బ్రతుకు కథలో పొంతకడవ, పాంచాలమ్మ బ్రతుకు’ కథలో దోవమ్మ పేరుతో బాట, నాలుగు స్తంభాలాటలో అయిదు పావురాలు, ఇవి కూడా ‘నేను’లే! అయితే ఇవి చదువుతున్నప్పుడు, ఇవి వేటికి ప్రతీకలు అనేది తెలుసుకోటానికి ప్రయత్నిస్తూ తదనుగుణంగా కథ చదవాలి.

‘నేను’ పరంగా కథలు రాయటం సులభమా?
‘నేను’ పరంగా కథ రాయటం సులభం అనీ, అందుకని కొత్త కథకులు ఎక్కువగా ఆ పద్ధతిలో కథ రాస్తారని అనుకోవటం పొరపాటనిపిస్తుంది. వ్యాసం మొదట్లో నేను చెప్పినట్లు ‘నేను’ ఉన్న 228 కథల్లో, చెయ్యి తిరిగిన రచయితలు రాసిన కథలు చాలా ఉన్నాయి. అందువల్ల, కథని చెప్పటానికి ఎన్నుకున్న తీరు ఎంచుకున్న ఇతివృత్తం మీద ఆధారపడి ఉంటుందని, ఒక రకంగా ఒక రచయిత ప్రతిభావంతంగా కథ చెప్పినంత మాత్రాన, ఆ రచయితకి ఇంకో తీరుగా ప్రభావవంతంగా కథ చెప్పటం రాదు అనుకోకూడదనిపించింది. ‘నేను’ పరంగా చెప్పిన కొన్ని కథలని చదివింతర్వాత అవి రచయిత పరంగా చెప్పి ఉంటే బాగుండేది అనిపించవచ్చు. లేదంటే, రచయిత చెప్పిన కథని ‘నేను’ చెప్పి ఉంటే కథ స్థాయి పెరిగి ఉండేదని తోచవచ్చు. ఇది నిర్ధారణ కావాలంటే రచయిత తన కథని రెండు పద్ధతుల్లోనూ రాసి రెండిటినీ మనకు ఉపలబ్ధం చేయాలి. కాని, ఇది ఆచరణ సాధ్యం అయ్యే పని కాదు.

దీనికి రెండు కారణాలు. ఒకటి- తన కథని ఎలా రాస్తే బాగుంటుంది? అనే విషయం మీద ఒక అభిప్రాయానికొచ్చిన తర్వాతనే రచయిత ఆ కథని అలా రాసి ఉంటాడు. అదే కథని రెండో రకంగా కూడా రాయమంటే, రచయిత కథని ఎలా రాయటం అనేది నా ఎంపిక, దాంట్లో ఇంకొకరి జోక్యం అనవసరం అనొచ్చు. రెండు-ఇష్టమనేది సాపేక్షం. ఒక రచయిత ఒక కథని రెండు రకాలుగా రాసి చూపినా-అందరూ ఒకే దాన్ని ఇష్టపడకపోవచ్చు.

అనిల్ ఎస్. రాయల్ తన కథాయణం వ్యాససంపుటిలో ఓ సూచన చేశారు. ఆయన నాగరికథ కథాసంపుటంలో మరపురాని కథ అనే కథ ఉంది. ఇది బాహ్యప్రథమపురుష రీతిలో రాసింది. దీన్ని నేను మధ్యమపురుష రీతిలో, ఉత్తమపురుష రీతిలో, నేను-మేం అని మూడు పద్ధతుల్లో తిరగరాశాను. యాళ్ల అచ్యుతరామయ్య ఆమె నవ్వు కథా సంపుటిలో ఆమె నవ్వు అని ఒక కథ ఉంది. ఇది కూడా బాహ్య ప్రథమపురుష రీతిలో రాయబడ్డ కథ. దీన్ని ఉత్తమపురుష రీతిలోకి మార్చుకున్నాను.

ఈ రెండు కథల్నీ ఇలా మార్చి రాసింతర్వాత; అసలు కథల్నీ, మార్చి నేను రాసుకున్న కథల్నీ; ఒకటికి రెండు సార్లు చదివాను. మూల కథలు మొదటిసారిగా చదివినప్పుడు ఏ అనుభూతి కలిగిందో, మార్చి రాసిన కథలు తర్వాత చదివినప్పుడు కూడా ఇంచుమించుగా అదే అనుభూతి కలిగింది. అసలు కథని ఇంకోరకంగా మార్చటానికి దాన్ని అనేకసార్లు చదివి ఉన్నాను. దాన్ని మార్చి రాసింది నేను. దీంతో, ఆయా కథల పోకడ, ముగింపు ఏంటో ముందే నాకు తెలుసు. తేడా తెలీకపోటానికి బహుశా ఇవన్నీ కారణాలు కావచ్చు.

ఇప్పుడు కొన్ని కథలు, ఒకప్పటి కథల్ని ఇప్పటి పాఠకులకోసం పునర్ముద్రిస్తున్నాయి. అలా అందించదలుచుకున్న కొన్ని కథల్ని తీసుకుని, ఆ రచయిత అనుమతితో మరో కథనరీతిలో అదే కథని తిరగరాయించి, రెండిటినీ తమ పత్రికలో ప్రచురించి, నిర్దిష్టరీతిలో పాఠకుల అభిప్రాయాలని ఆహ్వానిస్తే, ఒక కథనరీతి ఒక కథ రాయటంపై ఎలాంటి-ఎంత ప్రభావం చూపుతుందో తెలుస్తుందేమో!

(ఈ వ్యాసంలో ఉదహరించిన కథల రచయితల పేర్లు, ఆ కథలు ఉన్న కథాసంపుటాల-పత్రికల వివరాలు)

ఈమాట అంతర్జాల మాసపత్రిక: 1. నాపై కథ రాస్తావా?: పి. విక్టర్ విజయకుమార్ (డిసెంబర్ 2017) 2. టోరాబోరా వంటమనిషి: ఎ. ముత్తులింగం, అనువాదం అవినేని భాస్కర్ (డిసెంబర్ 2017) 3. జ్ఞాపిక: చిరంజీవి వర్మ (నవంబర్ 2017) 4. పునరావృతమ్: వాయుగుండ్ల శశికళ (జూన్ 2017) 5. Breakrooమోపోఖ్యానం-డబ్బింగ్ ఢమాల్: పాలపర్తి ఇంద్రాణి (నవంబర్ 2017) 6. Walmart: పాలపర్తి ఇంద్రాణి (అక్టోబర్ 2017).
వాకిలి అంతర్జాల మాసపత్రిక: 1. వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్: శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ (జనవరి 2016) 2. నాలుగు స్తంభాలాట: మండువ రాధ (మే 2016).
నవ్య నీరాజనం: 1. స్పృహ: విహారి 2. ఉక్కుపాదం: శాంతినారాయణ 3. కార్తికేయుని కీర్తికాయం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 4. ఇన్‌స్టంట్ లైఫ్: కుప్పిలి పద్మ 5. చమ్కీదండ: బండి నారాయణస్వామి 6. స్పర్శ: అబ్బూరి ఛాయాదేవి.
పాతికేళ్ల కథ (1990-2014): 1. థూ: పి.వి. సునీల్ కుమార్ 2. ఆఖరికి అయిదు నక్షత్రాలు: అబ్బూరి ఛాయాదేవి 3. చీడ: గొరుసు జగదీశ్వరరెడ్డి 4. అద్దం: స్వామి 5. తలపాగా స్వగతం: కాట్రగడ్డ దయానంద్ 6. చివరి పిచ్చిక: పాపినేని శివశంకర్ 7. రయిక ముడి ఎరగని బ్రతుకు: స. వెం. రమేశ్ 8. పాంచాలమ్మ బ్రతుకు: శ్రీ స. వెం. రమేశ్.
----------------------------------------------------------
రచన: టి. చంద్రశేఖర రెడ్డి, 
ఈమాట సౌజన్యంతో 

No comments:

Post a Comment