Wednesday, November 28, 2018

కుడితిలో ఎలకలు(కథ)


కుడితిలో ఎలకలు(కథ)



సాహితీమిత్రులారా!

గత మూడేళ్ళ లోనూ
నడుం సైజు నాలుగంగుళాలు పెరిగింది
నెత్తిన జుట్టు ఊడింది పోగా మూడొంతులు తెల్లబడింది
కలస్టరల్‌ దాదాపు రెట్టింపయింది
అదివరకే ఉన్న బీపీ యింకో ఇరవై పాయింట్లు పెరిగింది
అదివరకు లేని డయబీటిస్‌ వచ్చి కూచుంది
నలభై ఏళ్ళకే ముసలికళ కొట్టొచ్చినట్టు కనబడుతోంది

ఐతేనేం
అనుకున్నది సాధించాడు రామ్మోహన్‌!
మిలియనీర్ల జాబితాలో తన పేరూ చేర్చుకున్నాడు !

అతనీ మూడేళ్ళ నించీ రోజుకి 1718 గంటల పాటు పనిచేసిన స్టార్టప్‌ కంపెనీని నాలుగు రోజుల నాడు 700 మిలియన్లకి కొన్నది SkyHigh.com .
పన్లేవీ చెయ్యని పెద్దవాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పెద్దపెద్ద వాటాలు పుచ్చుకోగా వచ్చిన అతని వాటా స్టాక్‌ ఆప్షన్ల విలువ మిలియన్‌ ఐంది బొటాబొటీగా.
అలా అతను గత ఐదేళ్ళలోనూ గెంతిన వాటిలో ముచ్చటగా మూడో స్టార్టప్‌ మూడేళ్ళ కాలంలో అతన్ని మిలియనీర్ని చేసింది.

ప్రస్తుతానికి అదంతా పేపర్‌ డబ్బే ఐనా డబ్బు డబ్బే కదా!
ఉన్నవాళ్ళెవరైనా మాత్రం డబ్బంతా ఇంట్లో దాచుకుంటారా?
ఎలాగూ ఎక్కడో ఇన్వెస్ట్‌ మెంట్స్‌లో ఉంచాల్సిందే!
తన మిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ SkyHigh.com లో ఉందన్నమాట!

ఒక్కసారిగా ప్రపంచం మీద ఇప్పటివరకూ ఉన్న మాయతెరలు తొలిగిపోయి అసలు నిజాలు దేదీప్యమానంగా కన్పిస్తున్నాయతనికి.
నిన్నమొన్నటిదాకా పార్టీల్లో స్టాకుల గురించి చెవులు హోరెత్తేలా ఊదరగొట్టినవాళ్ళంతా ఇప్పుడతనికి ఎంగిలాకుల కోసం కొట్లాడే కాట్లకుక్కల్లా కనిపిస్తున్నారు ఎన్నేళ్ళు ఎంత సుడి తగిల్తే తనలా మిలియనీర్లు కాగలరు వాళ్ళు?
డబ్బున్నట్టు ప్రదర్శించుకోవటానికి పెద్దపెద్ద ఇళ్ళూ, లెక్సస్‌ మినీవేన్లూ కొని హడావుడి చేసే వాళ్ళంతా చాలా అమాయకుల్లాగా కనబడుతున్నారు తనలా “నిజంగా” ఉన్నవాడికి యీ పైపై హంగులెందుకుట?
పదిహేనేళ్ళనాటి తన టయోటా కరోలా లో వెళ్తూ సరదా కోసం చిరుగుల చొక్కా వేసుకున్న బిలియనీర్లా ఫీలయిపోతున్నాడత నిప్పుడు.

ఐనా
అడవిలో చెట్టు విరిగి పడితే ఎంత, పడకపోతే ఎంత? ఎవరికి పడుతుంది?
డబ్బున్నందుకు ఫలితం అది చూసి మిగిలిన వాళ్ళు అసూయ పడ్డప్పుడే కదా!
అంచేత
తనే ఓ పార్టీ ఏర్పాటు చేసి తనకు తెలిసినవాళ్ళందర్నీ పిలిచాడు.
ఎంతో డబ్బున్నట్టు పోజులు కొట్టే తెలియని తెలుగువాళ్ళని కూడా పిలిచాడు.
లోకల్‌ పేపర్‌ కటింగ్‌ వాళ్ళ కంపెనీ అమ్ముడు పోయిన వార్త బాగా బ్లో అప్‌ చేయించి ఫ్రేమ్‌ కట్టించి ప్రతి రూంలోనూ వేలాడదీశాడు. దాన్లో వేసిన గ్రూప్‌ ఫోటోలో అలుక్కుపోయి కనపడీ కనపడకుండా వున్న తన ముఖానికి చుట్టూరా ఎర్రటి మార్కర్‌తో కొట్టొచ్చేలా ఓ చక్రం వేశాడు.

పార్టీకి వచ్చిన వాళ్ళందర్నీ ఉల్లాసంగా ఆహ్వానించి, లోపలికి రావటంతోటే ఆ న్యూస్‌ ఐటమ్‌ చదివించి హడావుడి చేసేశాడు. తనొక్కడే బహుపాత్రాభినయం చేస్తున్నట్టు పార్టీలో నలుగురెక్కడుంటే అక్కడ ప్రత్యక్షమై పోయి వాళ్ళు ఏం మాట్టాడుకుంటున్నా సరే అభిమన్యుడిలా ఆ సంభాషణ లోకి జొరబడిపోయి తనెలా మిలియనీరయిందీ వాళ్ళ కళ్ళు నీరయేవరకూ వినిపిస్తున్నాడు.

స్టాక్‌ మార్కెట్లో ఎన్నడూ ఓటమనేదే ఎరగనని బల్లగుద్ది చాటిచెప్పే మాధవ్‌ కొంతసేపు భరించాడితంతా. ఆ పైన అతని వల్ల కాలేదు ఆగటం ఎంత సొంత పార్టీ ఐనా మరీ ఇంత ఆగడమా? ఎంత తప్పించుకున్నా వదలకుండా చెవికింద చేరి జోరీగలా హోరెత్తుస్తుంటే ఆత్మాభిమానం నిండుగా ఉన్న తనలాటి వాడు అడ్డుపడకుండా ఊరుకోవటమా?

“రామ్మోహన్‌ గారూ! మీకంపెనీని కొన్న తర్వాత SkyHigh స్టాక్‌ సగానికి పైగా పడింది కదా, మరి మీ ఆప్షన్ల వేల్యూ ఇంకా మిలియనుందంటారా?” అన్నాడు కుండ బద్దలు కొడుతూ.

ఒక్కసారిగా పార్టీ అంతా నిశ్శబ్దమై పోయింది. కొరకటానికి నోట్లో పెట్టుకున్న సమోసాని అలాగే పట్టుకుని అచేతనంగా నిలబడిపోయిన వాళ్ళు, నోట్లో ఉన్న బీర్‌ని గుటకెయ్యటం మర్చిపోయి పొరబోయి దగ్గుల్ని తుమ్ములుగా తర్జుమా చెయ్యటానికి తంటాలు పడుతున్న వాళ్ళు, మాట్లాడుతూ వాక్యం మధ్యలో ఆపేసి దిక్కుతోచక బిక్కచూపుల్తో దిక్కులు చూసేవాళ్ళు, .. ఇలా ఆశ్చర్యానికి నిర్వచనంగా మారిపోయింది అక్కడి వాతావరణం. అన్ని కళ్ళూ ఒక్కరి మీదికే తిరిగేయి. ఆ ఒక్కడూ ఏమైనా మాట్టాడగలడా?

మాట్టాడేడు “ఎప్పుడూ?” అని నీరసంగా, ఏడుపు గొంతుకతో.

అంతే. అందర్లోనూ ఒక్కసారిగా జీవం వచ్చేసింది. అలుముకున్న అసూయ స్థానంలో అలివికాని అవహేళన వచ్చి నిటారుగా నిలబడింది. బాధా, గౌరవం కలగలుపుకుని బాధపడుతున్న కళ్ళు చకచకా తిరస్కారాన్ని దిగుమతి చేసుకున్నయ్‌. అవన్నీ కలిసి విసవిసలుగా గుసగుసలుగా రూపాంతరం చెందుతున్నయ్‌.

మరోవంక అంతటితో ఆగకుండా, ప్రత్యర్థి బలహీనతని పూర్తిగా అర్థం చేసుకున్న మల్లయోధుడిలా విజృంభించాడు మాధవ్‌.
“అయ్యా, మీరేలోకంలో వున్నారో నాకైతే తెలీదు గాని యీ విషయం రెండు రోజుల్నుంచీ కోడై కూస్తుంది యీ లోకం. ఏ ముహూర్తాన మీ కంపెనీని కొన్నారో అప్పట్నుంచీ అన్ని నెగెటివ్‌ న్యూసే SkyHigh కి. నిన్నగాక మొన్న, వాళ్ళ వచ్చే క్వార్టర్‌ రిజల్స్ట్‌ బావుండవని ఓ రూమర్‌ పుట్టిందిి. ఆ వెంటనే ముగ్గురు పెద్ద ఎనలిస్ట్‌లు దాన్ని నిర్దాక్షిణ్యంగా డౌన్‌ గ్రేడ్‌ చేసేశారు. దాంతో 140 నుంచి 123 కి పడింది దాని స్టాక్‌. ఇక నిన్నమజ్ఝాన్నం  SkyHigh సియీవో వచ్చి సిఎన్‌బీసీ లో మాట్టాడుతూ ఈ క్వార్టరే కాదు పై క్వార్టర్లో కూడా ప్రాఫిట్స్‌లో కొంత వీక్‌నెస్‌ వుండొచ్చని ఒప్పేసుకున్నాడు. ఇంక చూడండి, అతనా మాటన్న ఆరు నిమిషాల్లో వాళ్ళ స్టాక్‌ అరవై పాయింట్లు పడింది” అనర్గళంగా, అభినయంతో కలిపి మరీ వివరించాడు మాధవ్‌, క్షణక్షణానికీ పెరిగిపోతోన్న ఉత్తేజంతో, ఉల్లాసంతో.

గతవారం అంతా ఊపిరితీసుకోవటానికి తీరిక లేకుండా పనిచేసింది రామ్మోహన్‌ వాళ్ళ  గ్రూప్‌.
నిన్నరాత్రి పదకొండు కి బగ్స్‌ అన్నీ ఫిక్సయి రిలీజ్‌కి రెడీ అయింది వాళ్ళ ప్రాడక్ట్‌. ఆ పరిస్థితుల్లో స్టాక్‌ గురించి ఆలోచించే అవకాశం కూడా ఎక్కడ ?

రామ్మోహన్‌ నెత్తిన పిడుగుల్లా పడుతున్నయ్‌ మాధవ్‌ మాటలు.
తను లెక్కలేసుకుంటున్న మిలియన్‌ డాలర్ల వేల్యూ సగానికి పైగా పడిపోయినట్టే!
నిజంగానే మిలియనీర్‌ కావాలంటే మళ్ళీ ఇంకో స్టార్టప్‌చావు తప్పదా ఏవిటి ?!

ఆరిపోయిన నోటితడిని ఓ గ్లాసుడు నీళ్ళతో అరువు తెచ్చుకుని రామ్మోహన్‌ ఏదో అనబోతుంటే
మాధవ్‌ అంటే ఎప్పుడూ మనసులో మండిపడే చంద్రశేఖర్‌ రామ్మోహన్‌ సాయానికొచ్చాడు మన శత్రువు కి శత్రువు మనకి మిత్రుడు కదా!

“మాధవ్‌ గారూ! మీరు మరీ రామ్మోహన్‌ గార్నలా భయపెట్టెయ్యకండి. ఆయన ఆప్షన్స్‌ అన్నీ వెస్ట్‌ అయ్యేటప్పటికి SkyHigh  స్టాక్‌ మళ్ళీ పెరక్కాపోదూ, మొదటి చోటుకి రాకా పోదు” అన్నాడు క్యాజువల్‌గా అన్నట్టు యాక్ట్‌ చేస్తూ.అలా అంటూనే, “రామ్మోహన్‌ గారూ! మీరేం బెంగెట్టుకోకండి, ఏది ఏవైనా గానీ మన మిత్రబృందంలో తొలి మిలియనీర్‌ మీరే!” అంటూ భరోసా కూడా ఇచ్చాడు పన్లో పనిగా, ఎప్పుడూ తను మిలియనీర్నని చెప్పీచెప్పనట్టు చెప్తుండే మాధవ్‌ కి ఓ మొటిక్కాయ వడ్డిస్తూ.

“అసలా సెక్టర్‌లో ఓ సారి ఇలా విపరీతంగా పడ్డ స్టాక్‌ ఏదీ మళ్ళీ తిరిగిరావటం ఇంతవరకు జరగనే లేదు. కావాలంటే వెళ్ళి రెసెర్చ్‌ చేసి చూసుకోండి. మళ్ళీ తిరిగిరావటం కాదు, అసలు ఇంకో రెండేళ్ళ పాటు SkyHigh ఇండిపెండెంట్‌గా నిలబడగలిగితే అదే గొప్ప విషయం” అంటూ పందెప్పుంజులాగా పుంజుకున్నాడు మాధవ్‌.

దానికి ఏం బదులు చెప్పాలో ఎవరికీ ఏవీ తోచక బిత్తరచూపులు చూస్తూ ఉండిపోయారు.

ఇవతల కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాడు రామ్మోహన్‌ వీళ్ళ మాటల్ని బట్టి చూస్తే మొదటికే మోసం వచ్చి అరమిలియన్‌ కాదు గదా అసలేవీ రాని పరిస్థితి కూడా కలిగేట్టు కన్పిస్తోందతనికి.

హఠాత్తుగా కళ్ళు బైర్లు గమ్మి, గొంతు ఎవరో నొక్కేసినట్టయిపోయి హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందేమోనని గడబిడపడిపోయాడు.

భోజనాలు రెడీ అనీ మగవాళ్ళంతా రావొచ్చుననీ ఎవరో పిలిచారింతలో. అలా అతని హార్ట్‌ ఎటాక్‌ అప్పటికి వాయిదా పడింది.

అప్పట్నుంచీ కంపెనీలు, స్టాక్‌ల విషయాలు రాకుండా చాకచక్యంగా ఇండియా రాజకీయాల గురించీ, ఆంధ్రా నించి కొత్తగా వస్తున్న వాళ్ళ గురించీ వాళ్ళ వింత వింత ప్రవర్తనల గురించీ కథలు కథలుగా చెప్పి పార్టీ ఐపోయిందనిపించాడు రామ్మోహన్‌.

మరో పక్క కొందరు మాధవ్‌ని ఆరాధనా భావంతో చూస్తూ అతని నాలెడ్జ్‌కి విస్తుపోతుంటే, గర్వాన్ని లోపలే దాచుకోవటానికి విఫలప్రయత్నం చేస్తూ మోడెస్ట్‌గా “అబ్బే, ఊరికే అప్పుడప్పుడు రెండు మూడు వెబ్‌సైట్స్‌ చూస్తుంటానంతే!” అని మందహాసంతో సర్దిచెప్తున్నాడతను.

మొత్తం మీద పార్టీ ముగిసింది రామ్మోహన్‌ ఏమాత్రం ఆశించని విధంగా.

మాధవ్‌ ఉల్లాసంగా బయల్దేరాడు తన కార్లో భార్య రాధికతో.
కొంచెం దూరం వెళ్ళేక  ఏం జరిగిందో సడన్‌గా కార్ని పక్కకి తీసి ఆపేడు.
స్టీరింగ్‌ వీల్‌ మీద తలపెట్టుకుని ఒక్కసారిగా భోరుమని ఏడ్చేసేడు!

బిత్తరపోయి “ఏమయింది, ఏమయింద”ని అరిచింది రాధిక కంగారుగా ఏ పాము కరిచిందో, ఫుడ్‌ పాయిజనింగ్‌ అయిందో నని చిందరవందరగా ఊహించుకుంటూ.
బిగ్గరగా ఎక్కిళ్ళు పెడుతూ మధ్య మధ్యలో అతను చెప్పిన మాటలన్నిట్నీ కలిపితే వాటి సారాంశం ఇది

స్టాక్‌ మార్కెట్లో క్రితం రెండేళ్ళ లోనూ కలిపి అతను సంపాదించిందంతా మొన్న నేజ్‌డేక్‌ క్రేష్‌లో ఊడ్చిపెట్టుకుపోయింది కదా యిక యిలాకాదు, కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలని మిగిలిన స్టాక్‌లన్నిట్నీ అమ్మి నాలుగు వారాల నాడు 130 కి SkyHigh.com ని కొన్నాడు మాధవ్‌, దాన్ని ఓ పెద్ద కంపెనీ కొనబోతుందనీ రూమర్‌ రావటంతో. ఐతే దాన్ని మరొకరు కొనకపోగా అదే రెండు కంపెనీల్ని కొన్నది ఈ నాలుగు వారాల్లోనూ. ఇక యీ వారం వార్తలు తెలిసినవే.

అదిప్పుడు 63 దగ్గర వుందిిి.
దాంతో అతని పోర్ట్‌ఫోలియో వేల్యూ రెండు నెలల్లోనే నూట యాభై వేలు పడి వట్టి యాభై వేలకి దిగజారిపోయింది.
మిలియనీర్నవుదామని, ముందుగానే అందరికీ అయినట్టే క్లూలిస్తూ ఇప్పుడింత తక్కువకి పడిపోయినట్టు ఎవరికైనా తెలిస్తే ఇంకేవన్నా వుందా?

అతని ఏడుపు చూసిన రాధకి జాలి పొంగుకొచ్చింది.
“ఫర్వాలేదులే మరీ అంత బాధ పడకు. ఎప్పటికైనా అది నువ్వు కొన్నచోటుకి రాకపోతుందా? అప్పుడే బయటికొద్దువ్‌ గాని” అంటూ ఓదార్చిందతన్ని.
“అబ్బా, నా అసలు బాధ అర్థం చేసుకోవటం లేదు నువ్వు! పార్టీలో నేను “Skyhigh.com స్టాక్‌ పైకి రాదు గాక రాద”ని బల్లగుద్ది  వాదిస్తుంటే ఒక్కరంటే ఒక్కరు కాదన్లేదు అంటే అది మళ్ళీ పెరుగుతుందని ఎవడికీ నమ్మకం లేదనేగా! పోనీ అట్లా కాకుండా ఏ ఏడాదికో రెండేళ్ళకో నిజంగానే పెరిగి అది మనం కొన్నచోటికి వచ్చిందనుకో! ఐనా గాని అప్పటికీ మనకొచ్చేది మనం పెట్టుబడి పెట్టిందే కదా! కాని ఆ స్టాక్‌ అక్కడిదాకా తిరిగొస్తే ఆ రామ్మోహన్‌ మాత్రం మనకన్నా ముందు మిలియనీరై పోతాడు బాబోయ్‌ !” నెత్తీ నోరూ బాదుకున్నాడు మాధవ్‌.
ఆలోచనలో పడిపోయింది రాధిక.
---------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment