Sunday, November 11, 2018

తమాషా దేఖో(కథ)


తమాషా దేఖో(కథ)




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

మహా కరుణ

అనుభవాలమీది పరువు వోణీలు తొలగించి
ముసలి సీసా వంటి
మెడలో
అంతర్ముఖాంతర్ధ తప మాల

డాబు దుప్పటి గాలి రెప రెపల నిరసించి
ఋషి కొండ దారిలో
చలిలో
అంతర్హితాంధికా రస జ్వాల

తలలోని జంట కుమ్మరి పురుగుల్ని కవ్వించి
నలుపు సమయాలలో
వేచి
ఏకాంత విహృతీ కవి మౌని

మాటకీ మాటకీ నడుమ మౌనపు సాము
జీవనోద్గత మహా
కరుణ
ఏకాగ్ర ఖేలార్త చిత్రాగ్ని

నిర్వాణ ఝాటలీ తరుఛాయ
నిర్వాద శర్వరీ శశిరేఖ
త్రిపుర
నికళంక కింకిణీ రుత చతుర
నిశ్శబ్ద నూపుర స్వన మధుర
ఒకటవ అంకం
ఒకటవ స్థలం

(కోటీశ్వర్రావు : తెల్లటి సఫారీ సూట్‌ వేసుకుంటాడు. ఎత్తుగా చలాకీగా వుంటాడు.
క్రిష్ణ : పంతొమ్మిదేళ్ళు. మొఖంలో చిన్నతనం పోలేదు. కోటీశ్వర్రావు బావమరిది )

(రాత్రి తొమ్మిదిన్నర. కోటీశ్వర్రావు, క్రిష్ణ బీచ్‌ రోడ్డు మీద రాజ్‌ దూత్‌ ఆపి ఇద్దరూ సముద్రం గట్టు దగ్గిర దిగుతారు. దూరంగా జాలారిపేట లోంచి బైఠో భజన్‌ వినిపిస్తుంటుంది.)

కోటి : అలాగొద్దమ్మా…అక్కడంతా ఛండాలం..ఇలాగొచ్చి కూర్చో…

క్రిష్ణ : (గట్టు మీద తుడిచి కూర్చుని, ఆకాశంలోకి చూసి పరవశంగా) అబ్బా పున్నం బాబూ…

కోటి : ఊఁ…ఫుల్‌ మూను…

జాలారి పేట మైకు : (పాట. ప్రేమాభిషేకం సినిమాలో వందనం అభివందనం పాట వరుసలో…)
పిలిసిన వెంటనె పలికెడి వారూ….
శ్రీ మేకు సూర్యనారాయన గారూ….
గెలవాలనీ ఎంపీ అవ్వాలనీ
అస్తం గుర్తుకి సెలవిచ్చి
సైకిలు గుర్తుకి వోటిచ్చి
ఆదరించిన సోదరా తెలుగూ సోదరా… స్వారీ…

కోటి : వోటేసినోడికి స్వారీ ఎందుకూ? గెలిసేక మేకు సూరిబాబు సారా బట్టీలకాడ్నించి వూళ్ళోకింక రాడనీసి ముందే స్వారీ చెప్పించెస్తనాడు (పెద్దగా నవ్వుతాడు)…….. (ఆగి ఆలోచనగా) ఇగటాలకేటిగానీ……… ఏటీడు కొంటాడంటావా?

క్రిష్ణ : కొనీటట్టే వున్నాడు..

కోటి : నీతో అన్నాడేటి..

క్రిష్ణ : లేదు గానీ…జాగా చూడగానే జమ్మని లెగిసేడు…కింద రెండు వాటాలూ మీద రెండు వాటాలూ కట్టుకోవచ్చునంటే..

కోటి : ఆడి దగ్గర డబ్బుందమ్మా !

క్రిష్ణ : మీకెలాగ తెలుసు ?

కోటి : మనిషి వాటం బట్టి చెప్పీయొచ్చును…పొద్దుట మనం ఎళ్ళే సరికి చూసేవా..ఎలాగ సోఫాలో కాళ్ళు నిగడదన్నీసి టీవీ చూసుకుంటున్నాడో ? ఎద్దుకి తిన్నది పుష్టీ మనిషికి ఉన్నది పుష్టీ..నీ కాడా నా కాడా చెరుకో పదీ బేంకిలో వున్నాయనుకో. మనం మాత్రం ఈ ఎండల్లంట పడి ఇలాగ చక్రపటాకీల్లాగ వూరల్లా తిరుగుతామా ? లక్ష్మీ రావులాగే హేపీగా టీవీ ముందు వెచ్చగా తొంగుంటాం.

క్రిష్ణ : (ఆలోచనగా) డబ్బున్నంత మాత్రాన హేపీగా వుంటాదంటారా? లక్ష్మీరావునీ దివాకర బాబునీ ప్రభావతీ గార్నీ ఎవళ్ళని చూసినా మొహాల్లో ఏమీ సంతోషం లేదు బాబూ…

కోటి : ఆళ్ళకేటివై బాబూ కట్టలు కట్టలు సంపాదించేరు…..ప్రభావతీ గారికేటి ఎప్పుడు చూసినా మొహానికి మీగడా పసుపూ రాసుకుని ఐస్‌ క్రీం తింటూ వుయ్యాల మీద హేపీగా కూచుంటాది. దివాకర బాబుకేఁవీ….(వొళ్ళుగా వున్నట్టు ఏక్షన్‌ చేసి) ఆడి వొంటి మీది బంగారఁవే వుంటాది ఒకైదు లచ్చలు….

క్రిష్ణ : వుంటుంది లెండి..ఆళ్ళ మొహాలు చూసేరా… ” ప్రయాస పడి పాప భారమును మోసికొనుచున్న సమస్త జనులారా ! నాయొద్దకు రండు…… ” అన్నట్టుగుంటాయి.

కోటి : (వినోదంగా) ఏసు ప్రభువుని పట్టించేవేటివై బాబూ ! నీకు మన భగవద్గీతలూ పురాణాలూ పనికొచ్చేయి కావేటి… ? ఆ జానీ గాడితోటి కవుల మీటింగులంట తిరగడం మానీసి నేను చెప్పినట్టు ఆ ఋషికొండ లేఅవుటు మీద ఫోకస్‌ చేసేవంటే…(ఛాలెంజ్‌ చేస్తున్నట్టు చెయ్యి పెట్టి) నెష్టియర్‌ ఈ పాటికో పెద్ద పండుగల నాటికో నువ్వూ నేనూ చెరుకో టాటా సూమో కొనుక్కోక పోతే నా పేరు కోటీశ్వర్రావు కాదు నేన్నీ బావనే కాను…

క్రిష్ణ : ( ముభావంగా) ఈ స్కూటర్లు చాలవా! మనకున్నది చాలదేంటండి ! డబ్బేటి చేసుకుంటారు బాబూ….

కోటి : (చికాగ్గా) ఉన్నాదున్నాదంటావు ఏటుందుమ్మా నీ కాడా నా కాడా లబోడా శంఖం ! (నచ్చచెపుతున్నట్టు) నువ్వింకా గుంటడివమ్మా ! ” పైసామేఁ హై పరమాత్మా ” . డబ్బో డబ్బో అని చీప్మినిష్టరు మొదలు సమస్త ప్రజలూ ముష్టి వెధవల్లాగ ఎక్కడ్లేని డబ్బూ చాలక అఘోరిస్తుంటే నువ్వు డబ్బెందుకంటావేటివై బాబూ ? (గట్టిగా చిరాగ్గా..) నీకు ఎక్కువైపోతే ఇదిగో ఇలాగ నాకు పడీ…

క్రిష్ణ : ఎంత సంపాయిస్తే మాత్రం ఏటి సుఖంగా వున్నారా …డబ్బెందుకు బాబూ…

కోటి : ఈడెవడండీ బాబూ….డబ్బెందుకు డబ్బెందుకని శన్నోటితోటి పదిసార్లనకువై. లక్ష్మీదేవి చల్లంతల్లి. విన్నాదంటే ” ఓహో ఈ ముష్టి వెధవలకి డబ్బెక్కడ తోసుకోవాలో తెలీక బాధ పడతన్నారు గావా ” లనీసి మన గుమ్మాల చాయలక్కూడా రాదు. ఇంకెప్పుడూ అలాగనకు చెప్తునాను .. కుర్రాడివి..వృద్ధిలోకి రావలిసినోడివి. అయినా పంతొమ్మిదేళ్ళ గుంట్నాకొడుకువి నీకీ ఫిలాసఫీలెందుకువై ? డబ్బున్నోడు సుఖంగా వున్నాడో లేడో నువ్వు చూడొచ్చేవా ? (ఒప్పుకోలుగా) నిజమే సుహంగా లేడనే అనుకో ! డబ్బున్నోడూ బాధలు పడుతున్నాడు, డబ్బు లేనోడూ బాధలు పడుతున్నాడు. అయితేనేఁవీ డబ్బు లేక బాధ పడే కంటే డబ్బుండి బాధ పట్టం తౌజండ్‌ టైమ్స్‌ బెటరు కదండి. కోఁవట్లని చూసేవా ? ఎంత సంపాదించినా పొద్దుట లెగ్గానే ” తల్లీ లక్ష్మీదేవీ ! ఇలాగొచ్చి నా గల్లాపెట్లో కూకుండిపో తల్లీ….. ” అనే వూదుబత్తులెలిగిస్తాడు. అందుకే ఆల వ్యాపారాలు ఎప్పుడూ లక్ష్మీ కళకళ్ళాడుతుంటాయి.

క్రిష్ణ : వ్యాపారం వొక్కటి బాగుంటే అయిపోయిందేటి బావగారూ…

కోటి : (చివాట్లు పెడుతున్నట్టు) రియలెష్టేటు వ్యాపారం చల్లని తల్లి. లచ్చిగాడు కోరి కోరొస్తే మోకాలడ్డం పెట్టకు. పిల్లకాక్కేటి తెలుసు వుండివేలు దెబ్బని. డబ్బు మజా నీకేటి తెలుసు. రోజులెలాగున్నాయో చూసేవా ? (భయంగా) అమ్మో ఈ కాణీ పరకా లేక పోతే దొంగ నా కొళ్ళు తొక్కీరా? ఈ దునియాలో డబ్బున్నోడే అందగాడు, డబ్బున్నోడే తెలివైన వోడు, డబ్బున్నోడే మహా నాయకుడు, ఆడే మహా మేధావి, డబ్బున్నోడే పెద్ద కవీశ్వరుడు, డబ్బున్న బాబావే మహా జ్ఞాని. డబ్బే వుంటే నీకు దొరకందేటమ్మా ? నువ్వేంటి పెద్ద ప్రొఫసర్‌వి వైస్‌ చాన్సలర్‌వి కావాలా..చెప్పు.. ఇదిగో ? కుక్క…(బుగ్గిలో పడుకున్న కుక్కని చూపించి) ఆ కుక్కకి మెళ్ళో లక్ష రూపాయలేసి పంపించేవంటే వీసీ గారు దగ్గిరుండి ” చిత్తం బత్తెం చిత్తం బత్తెం ” అని దాని శంక నాకి మరీ పీ హెచ్‌ డీలు కళా పూర్ణాలూ ఇస్తాడు. పైసా మేఁ హై పరమాత్మా. ఇంకా చదువుల భ్రమలో వున్నావు సరే నిన్ను చెడగొట్టెస్తున్నానని మీ అమ్మా మీ అక్కా గొల్లెట్టెస్తారు నాకెందుగ్గానీ..ఏనాటికైనా కోటి బావ చెప్పిందే రైటనీసి నువ్వే రియలైజవుతావులే. నాకెందుకు….

క్రిష్ణ : మిమ్మల్ననాల్ని కాదండీ. నా చదువెక్కడ చెట్టెక్కెస్తుందోనని మా అమ్మకి బెంగ…(నవ్వి)
మీరేం చెడగొట్ట లేదు లెండి. నా ఇష్ట ప్రకారఁవే…….

కోటి : నువ్వు ఇంజినీరింగు చదివీసి ఆకాశాన్ని అట్లకాడతో వూడబొడిసెస్తావని ఆవిడి ధీమా. ఆవిడొక్కర్తి చదువుకుందని ఇంక ప్రతీ వోడికీ చదువే కైలాసం అంటాది. (విరసంగా నవ్వి, ఎగతాళిగా)హ్హేటో! నేను అన్నాన్ని ఏమనుకోకు గానీ మొన్న సన్యాసి రావు గారు చెప్పేడు కదా! పది వేల కాడ మరుకో రెండు వేలిసిరెస్తే అయ్యయిటీ బుయ్యయిటీ కాదు దాని బాబుల్లాటింజినీర్లే నీ కాళ్ళ కాడ లైను కడతారు ” దాసోహం తవ శరణం ఉద్యోగం దేహి మహా ప్రభో! ” అని. నా మాటినీసి వ్యాపారం మీద ఫోకస్‌ చెయ్యి. (తెలివి తెచ్చుకున్నట్టు) ఆ అమెరికా పార్టీ వోడు కరక్టుగా రాత్తిరి పదిన్నరకి ముహూర్తం పెట్టేడు. అమిరికాలో పొద్దున్నంతా తొంగుని రాత్రుళ్ళు వ్యవహారాలు చూసుకుంటారు గావాల…..

క్రిష్ణ : ఆలకి పొద్దున్నంతా షాపింగులు బాబూ!

కోటి : నిజమేలే! చిన్నమ్మి కొద్దీ చిన్నెలూ మొగుడి కొద్దీ వన్నెలూ! ఆ రవణా రావు గారన్నాడు కదా….ఆళ్ళకి మన తిండీ వాపే మన మనుషులూ వాపే….నేను మాటాడుతుంటే మొగుడూ పెళ్ళం ఇంత పెద్ద అమిరికా ఆఫీసర్లూ నోళ్ళెళ్ళబెట్టుకు విన్నారు. ఆ నాగేస్వరీ గారయితే (మురిపెంగా లేడీస్‌ లాగ గొంతు పెట్టి) ” ఇంకా చెప్పండి కోటీ గారూ ” అని నవ్వలేక చచ్చింది…

క్రిష్ణ : (మెచ్చికోలుగా) మీ మాటల కేట్లెండి.

కోటి : (గర్వంగా) అమ్మా! అలాగనీకు. మాట కాకపోతే మన కాడేటుంది అమ్మకానికి? విన్నావా?? మనకి మాటమ్ముకు బతకమనే రాసేడు. అలుకువగా మెలుకువగా ఎవడికి చెప్పవలిసింది ఆడికి చెప్పి మండబ్బులు మనం జాగర్తగా లాగడవేఁ వాచిక తపస్సు. పేపర్లూ బోచర్సులూ అన్నీ రడీ పెట్టేవా? (వాచీ చూసుకుని) అమ్మ దీనమ్మ పదింపావిక్కడే అయిపోయింది. బే పోయింటు కోలనీ దాకా వెళ్ళాలి. బండెక్కు చెప్తాను.

జాలారిపేట మైకు : తెలుగు దేశం పిలుస్తంది రా! కదిలి రా!!

కోటి : ఎక్కడకొచ్చీమంటావు…….కార్పొరేటరు టిక్కట్టిమ్మనెళితే పన్నెండు లక్షల్తెమ్మన్నాడు బూలోకరెడ్డి. అదే పతకఁవయితే అమ్ముకు బతకనా అన్నాదిట. నువ్వు పదవై!

(ఇద్దరూ బండెక్కి కూర్చుంటారు. కిక్‌ కొడితే బండి ఎప్పటికీ స్టార్టవదు.)

కోటి : ఏటి పల్లక్కూకుని చూస్తునావు? దిగీసి కిక్కొట్టు. (క్రిష్ణ దిగి కసిగా కిక్కొడుతుంటే భుజం తట్టి నవ్వి) ఎందుకెందుకన్నావు కదా ఇదుగో ఇందుకూ డబ్బు. (పరవశంగా) ఈ అమిరికా బేరం తెగనీ చెప్తాను కనీసం మారుతీ ఖాయం. (ఉషారుగా) ఊఁ ఇంక చాలు స్టార్టయ్యింది కూచో.

(ఇద్దరూ నిష్క్రమిస్తారు)

రెండవ స్థలం

(బే పోయింట్‌ కోలనీ. కోటేశ్వర్రావు, క్రిష్ణ రమణా రావు ఇంటి దగ్గర బండాపుతారు. గేటు తీసుకుని లోపటికి నడవబోతే కోటేశ్వర్రావు క్రిష్ణ రెక్క పట్టుకుని ఆపెస్తాడు. కుక్కలు మొరుగుతున్న చప్పుడు. )

కోటి : చూడమ్మా క్రిష్ణా వ్యవహారం జాగర్తగా హేండిల్‌ చెయ్యి. ఈ రవణా రావు కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం. ఆచి తూచి మాట్లాడు. నేను చెప్పినవన్నీ జ్ఞాపకం ఉన్నట్టుగేనా?

క్రిష్ణ : (నవ్వుకుంటూ) ఊఁ వూఁ ….బెల్లం ముక్క థీరీ??

క్రిష్ణ : పెదాలు విరిచి) ప్చ్‌ ! బెల్లం ముక్క థీరీ ఈల కాడ కాదువై. ఈడికేం లేదా పోదా! స్టీల్‌ ప్లాంటు స్టోర్‌ కింగు గురువు గారు. మన కన్నా చిన్నోడికి బెల్లం ముక్క. మన కన్నా పెద్దోడయితే కుచ మర్దనం థీరీ బెష్టు.

క్రిష్ణ : డేల్‌ కార్నెగీ చిటకాలా బాబూ?

కోటి : అదేలే…..డబ్బుల్లోనూ పొజీషన్లోనూ మన కన్నా చిన్నోడైతే కాణో పరకో ఆశ పెట్టి పన్లు చేయించుకోవాలి. రిజిష్ట్రాఫీసు కాడ సబ్‌ రిజిష్ట్రార్ని చూసేవు కదా రూపాయి కాడ మరో రూపాయిసిరెస్తే గంటస్థంభం మన పేరు మీద రిజిష్ట్రేషన్‌ చేయించీసి కాయితాలూ స్వీట్లు పొట్లం పువ్వుల్లో పెట్టి మనింటికి పంపించెస్తాడు…ఆ డేల్‌ కార్నీ బూల్‌ కార్నీ ఏటి రాసేడు విన్‌ ఫ్రెండ్స్‌ యిన్ఫ్లుయెన్స్‌ పీపులు… నన్నడుగు చెప్తాను….

క్రిష్ణ : (ఆశ్చర్యంగా నవ్వుతాలుగా) మీరు మరీనూ..గంట స్థంభఁవా…

కోటి : గవరమెంటు సొమ్మేగా ఆడి మూటేం పోయింది. మనకి టైముకి ఉప్పందలేదు గానీ దివాకర బాబూ మా మాఁవా ప్రభావతీ ఇందిరా పార్కులో ఈరిక ముక్క మిగిలిపోతే వాటాలు పంచుకుని ఆల పిల్లల పేర్లమీద రిజిష్ట్రేషన్‌ చేయించుకోలేదా?

క్రిష్ణ : అక్కడిప్పుడు గజం రెండు వేలు! ఎలా మేనేజ్‌ చేసేరు బాబూ?

కోటి : నీదంతా బుక్కిష్‌ నాలెడ్జి. ఆ పుస్తకాలు చదవటం మానీసి నా యెనకాల ఆర్నెల్లు తిరిగేవంటే ఆడి బాబు లాంటి ట్రైనింగు నేనిస్తాను. రాజు తల్చుకుంటే దెబ్బలిక్కొదవా? మా మాఁవ కంట్లో పడాలే కాని శివుడి కోవిలైనా ” హాం ఫట్‌ ” మనిపిస్తాడు. ఆడ్డొచ్చినోడి మీదకి ఇన్‌కంటేక్సోడ్ని వొగ్గెస్తాడు…..సర్లే చల్లటి వేళ మా మాఁవూసెందుగ్గానీ….పద పద పదా!

(కాలింగ్‌ బెల్‌ నొక్కి నించుంటారు.)
లోపల్నుంచి : Who is it?

కోటి : (పెద్దగా) మేడం దిసీజ్‌ కోటీశ్వర్రావ్‌ ఎబౌట్‌ ది రియలెస్టేట్‌ ట్రాన్సాక్షన్‌….

(ఒక టీనేజ్‌ అమ్మాయి తలుపు తీస్తుంది.)

మేఘన : (పలకరింపుగా) O hai uncle….

కోటి : హాయ్‌ మేఘనా! హౌ ఆర్‌ యూ? మీట్‌ మై బ్రదరిన్లా క్రిష్ణా…..

మేఘ : (పొడిగా) O hello!

కోటి : డాడీ ఎండ్‌ అంకుల్‌ ఆర్‌ ఎట్‌ ది హోమ్‌ ఆర్‌ నాట్‌?

మేఘ : yes! I’ll call them. you can have a seat…. Dad! O Mom!! (పిలుస్తూ లోనికి వెళ్తుంది.)

కోటి : (చిన్నగా క్రిష్ణతో) మనింగ్లీషు బాగానే వుందా బెదరూ? ఎదవది ఇంగ్లీషు కొంచెం డవుటు గానీ లేకపోతే సెంట్రల్‌ మినిష్టరవ్వల్సిన జాతకం మంది. అమిరికా వోడితోటి ” ఠాష్‌ ఠూష్‌ ” మని తిరిగి నాలుగు జాగాలమ్మితే ఇంగ్లీషు దానంతటదే వొస్తుంది….భాష కాదు భావం ముఖ్యం అన్నాడు మా నారాయణమూర్తి బాబు….(దగ్గిరికి పిల్చి చెవిలో) ఇటు చూడు.. నువ్వు నీ కవిత్వాల్లోంచి తీసి నాలుగు ముక్కలు ఝమాయించు….. మన గురించి మా బావగారు ఇంద్రుడు చంద్రుడనీసి మేగ్జిమమ్‌ బూష్టింగియ్యి!

(లోపల్నుండి రమణా రావ్‌ గోపాల్‌ వస్తారు)
                                                                                                                                       (ఇంకా వుంది)
-----------------------------------------------------------
రచన: కనకప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment