Sunday, November 4, 2018

నిద్ర పట్టనివ్వని అలారం(కథ)


నిద్ర పట్టనివ్వని అలారం(కథ)
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

రెవరెన్డ్‌మాసిలామణి ఉపన్యాసం అనర్గళంగా సాగుతోంది. కెన్నెడీ చరిత్ర ముగిసింది నెహ్రూ చివరి రోజులు.” … మతం పాత్ర పరిపాలన వ్యవహారాల్లో పరిమితంగానే ఉంటుంది. క్యాథలిక్కు అమెరికా ప్రెసిడెంటు అవడం సాధ్యమయింది కదా! భగవంతుణ్ణి పక్కకు నెట్టిన నెహ్రూ మన ప్రియతమ ప్రధాని. ముందు ముందు స్త్రీలు, నల్లవాళ్ళు, అంటరాని వాళ్ళు ఎవరైనా దేశాలని యేలే సమయం వస్తుంది. వస్తూంది. అయితే మననందరినీ యేలే ఆ ప్రభువు ఒక్కడే. ఆయన్నే నమ్మండి …” అంటున్నారు రెవరెండ్‌ ఆజానుబాహుడు, చామన ఛాయ, తమిళ ఛాయలు గల తెలుగులో ధారాళంగా మాట్లాడుతున్నారు. తెలుగులో ఆయనే రాసిన పాట పాడారు.
“శిలువే నా శరణాయెనూరా”
ఇది తెలుగులో ప్రసిద్ధమైన భక్తి కీర్తన “శివ దీక్షాపరురాలనురా” వరసలో రాసానని చెప్పారు. ఎవరో గొణిగారు “బాబోయి, ఆ పాట జావళి, భక్తి గేయం కాదు”అని. నాలో ఓ ప్రశ్న జావళి భక్తి గీతం ఎందుక్కాదని?


అవకాశం వచ్చింది, బతుకులో పై మెట్లెక్కుతున్నాను. కానీ, ప్రతి అంతస్తూ పరాయి ఊరులా అనిపిస్తూ ఉంటుంది. ఈస్టు పాయింటులోనో డాల్ఫిన్సులోనో కమ్మటి రుచులు, రకరకాల వంటకాలూ నాగరీకులైన ఆడ, మగ స్నేహితులు పరిచయస్తులు, పోలికలు, వెటకారాలు. తెలియని అనేక భాషల వాళ్ళు. ఇంగ్లీషులోనే సంభాషణలు నుడికారం తెలియక అవస్థలు. మొత్తానికి బయల్దేరిన చోటునుంచి చాలా దూరమే వచ్చాను.


స్టేషన్‌పక్కనించి రోడ్డు మీద నడుస్తుంటే ‘వస్తావా?’ అనే నవ్వూ యేడుపూ కలిసిన గొంతుకలతో పిలుపులూ, చిరిగిన నిక్కర్ల కుర్రాళ్ళూ, బక్క చిక్కిన రిక్షావాడి ఈల, “కారొచ్చిందప్పయ్యమ్మ కారు, అది కారు కాదు నా కాలి గోరు” అని సందు చివరి నుంచి గోలగా వినపడే పాట మనసుని కెలుకుతూ ఉంటాయి.


నా ఊరేదీ? నా వాళ్ళు వీళ్ళా వాళ్ళా?

వీధిని తట్టుకోలేకపోతే చర్చిలోకి వెళతాను. నమ్మకం యెప్పుడో పోయింది. కానీ అక్కడ మామూలు మనుష్యుల్ని గురించి ఈసడింపులేకుండా మాటలు వినపడతాయి. చాలా మంది ప్రభువు మీద అపరిమితమైన విశ్వాసమున్నవాళ్ళు. నన్ను మళ్ళీ “మంచి” దారిలోకి తీసుకెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళూను. దుఃఖం, బాధా, లేమి లోంచొచ్చే లేకితనం గమనిస్తూ కూడ తట్టుకుని పరిశుభ్రతవైపూ పరిశుద్ధతవైపూ వారు నమ్మిన దారిని చూపి జనం మనసుల్లో ఆశ కల్పించి, ఆదరణ గుణాన్ని వృద్ధి చేసేందుకు ప్రయత్నించే ఫాదిరీలూనూ.


రివరెండ్‌మాసిలామణి గారి ఉపన్యాసం చర్చిలో కాదు సభలో వేదిక మీంచి సాగుతోంది. “… తెలుగులో మొట్టమొదట ముద్రించిన పుస్తకం బైబులు. దాదాపు నూటయాభై సంవత్సరాలక్రితం మతవ్యాప్తికోసం దొరలు ప్రవేశపెట్టిన తెలుగులో ముద్రణావకాశం త్వరలోనే వావిళ్ళ రామస్వామి శాస్త్రుల కంపెనీ లాంటి వాళ్ళు అందుకుని, అంతవరకూ అక్కడక్కడా కొద్దిమందికే పరిమితమైన గ్రంథాలని పరిష్కరించి ముద్రించి అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఉపయోగపడింది. ప్రభువు ఆనతి ఉంటే అలా ఒక్కో ప్రయత్నం అనేక విధాలగా ఉపయోగపడుతుంది.” నిజంగా ఇన్ని పుస్తకాలూ ఇన్ని చదువులూ సాధ్యమయ్యాయి. నాగరికత పెరిగి సుఖాలూ సుళువులూ కొందరికి అందుబాటులో ఉన్నాయి. కాని ఇంత దుఃఖం ఇంకా ఇంత మందిలో చూస్తూనే ఉన్నాం. బోధపట్టంలేదు.

మళ్ళీ వినేప్పటికి మాసిలామణిగారి గొంతు గంభీరంగా ఉంది “… గొల్లనో గొర్రెల కాపరనో భయాన్ని అసహాయతనీ తట్టుకునేందుకు సృష్టించిన కట్టుకథలని నాస్తికుల వాదన. శక్తి ఉందనీ, ధనం ఉందనీ విర్రవీగి ఇతరులని పీడించడమో లేకపోతే బలం ఉన్న వాడికి లొంగిపోడమో కంటే మనిషికున్న పరిమితులు అర్థం చేసుకుని సర్వ వ్యాప్తమైన దైవ శక్తిని నమ్ముకోడం ఉత్తమ లక్షణం కదా?”


పోనీ భగవంతుణ్ణి నమ్ముకుని సర్వశక్తివంతుడని ఒప్పేసుకుందామా రేషన్‌ రోజుల్లో చాటుగా బియ్యమమ్మి బతుకు వెళ్ళదీసుకునే మార్తమ్మ పట్టుబడి దెబ్బలు తింటే, పాలుగాడు జేబులుకొట్టి జెయిలుకెళ్ళడం, బయటికి రావడం, మళ్ళీ వెళ్ళడం అలవాటు చేసేసుకుంటే, నీలయ్య ఆరేళ్ళకే బీడీలు తాగడం నేర్చుకుంటే, తరాలుగా ఆడపిల్లలు కొబ్బరితోటల్లో భుక్తి వెతుక్కుంటుంటే కలడో లేడో తెలియని ఈ భగవంతుడే దారీ చూపెట్టడేమి?


మా పంతులుగారనేవారు “అందరికీ అవకాశాలు అందుబాటులో ఉండటానికేనర్రా, నెహ్రూ గారూ, అంబేద్కరూ పార్లమెంటుని ఒప్పించి రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు. పైగా చూడండి, ఈమధ్యన ఎన్ని స్కాలర్షిప్పులు ఇస్తున్నారో. బాగా చదువుకోండి, ఎదగండి” అని. కానీ ఆయనే చిరుగులు కుట్టిన చొక్కాలే వేసుకునేవారు. చదువుకోవడంతో ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందని అనిపించేది కాదు. అదృష్టంఉండి స్వంతంగా పట్టుదల ఉన్న వాళ్ళో, లేదా అమ్మా నాన్నల ప్రోద్బలమున్న వాళ్ళో తప్ప పిల్లలు స్కూళ్ళు ఒదిలెయ్యడం మామూలయిపోయింది. అక్కడక్కడ నాలా అడ్డాలు దాటి అవకాశాలందుకుని “పైకొచ్చినవాళ్ళు” కొంతమంది మాత్రమే. సాధారణంగా ఈ పైకొచ్చినవాళ్ళకీ వెనకుండిపోయినవాళ్ళకి మధ్యన ఒక తెర దిగుతుంది. ఒకే కుటుంబంలో కూడా వృద్ధి క్షయాల మధ్య అంతరాలు మొలకెత్తి కాలం గడిచిన కొద్దీ నాటుకుపోతున్నాయి.


మా పంతులుగారమ్మాయి సంధ్య చురుగ్గా ఉండేది. మాకిద్దరికీ calf love ఉండేది, ఇంకా లవ్‌అనే మాటకి అర్థం తెలియని రోజుల్లో. నేను ముందుకెళ్ళాను. ఆమె చదువు టీచర్సు ట్రెయినింగుతో పూర్తయ్యింది. అటూ ఇటూ కూడా అభ్యంతరాలున్నా, జంట కట్టాలన్న కోరిక కలిగింది. కలుసుకుంటూ ఉండే వాళ్ళం. ఆమెకి దేవుడంటే నమ్మకం. సుఖ దుఃఖాలకి కారణాలు ఈ జన్మలో కనబడకపోతే వెనకజన్మల్లో ఉంటాయనీ, దేవుడు లెక్క తప్పు వెయ్యడనీ వాదించేది. నేను “ఈ దరిద్రం అనే అగాధం పూడ్చడం మన తరం కాకపోయినా, వెనక్కి వెళ్ళి కారణాలు మనలోనే వెతుక్కోవద్దు. నిబ్బరంగా ముందుకి చూద్దాం” అనేవాణ్ణి. అప్పటికి నాకూ తెలీదు అసలు తిరకాసేంటో. కానీ వెతకాలనీ, వెతికి తెలుసుకున్నవాళ్ళని కలుసుకోవాలనీ ఉండేది. ఇదంతా మార్చడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న చాలా రోజులు వేధించింది.


మాసిలామణి గారు ప్రశ్నలకవకాశమిచ్చారు. నేను లేచి “దయామయుడయిన దేవుడు పేదరికమూ అందులోంచి పుట్టే రకరకాల క్రూరత్వాలూ కుళ్ళూ ఎందుకు సహించి ఊరుకుంటున్నాడో చెప్పండి” అని అడిగాను. ఆయన జవాబిచ్చే లోపల ఆరోజు సభకి అధ్యక్షులయిన ఒక పేరుగల సాంఘిక శాస్త్ర విద్యావేత్త డా. ప్రసాదు గారు “దయచేసి నన్ను చెప్పనివ్వండి” అన్నారు. రివరెండు గారు ఆశ్చర్యపోయినా కూర్చుండిపోయారు. ప్రసాదు గారు “బీద వాళ్ళు అలాగే ఎందుకుండిపోతున్నారో తెలుసా? ఎన్నో అవకాశాలున్నా ఓపిగ్గా అవి అందుకోవడం కానీ, కష్టపడి సంపాదించి కుటుంబ పోషణ చేసుకోడం కానీ లేకుండా అడ్డదారులు తొక్కడంలోనే సుఖముందనుకుంటారు. వాళ్ళల్లో చాలామందికి సూటిగా ఆలోచించడమే ఇష్టముండదు. వాళ్ళ నడవడికలోంచే వాళ్ళ కష్టాలన్నీ వస్తాయి. పిల్లల్ని చదువులు మానిపించి కూలి పనుల్లో పెట్టే తల్లిదండ్రులున్నారు తెలుసా?” అన్నారు అసలు బతగ్గలిగితే కదా చదువులు అన్నది ఆయన మేధావి బుర్రకి తట్టలేదేమో.

అడక్కుండానే వేదికమీదున్న ఓ రాజకీయ పెద్ద “పొగరండీ పొగరూ! స్టేషన్నించి మహారాణీపేటకి పన్నెండణాలడిగాడు రిక్షావాడు. ఇవ్వనంటే పక్కకి తిరిగి బీడీ ముట్టింఛాడు. వీళ్ళని ఉద్ధరించడం ఎవరి తరమండీ? మా ప్రభుత్వం అక్కడికీ వీలయినంత తంటాలు పడుతూనే ఉంది” అన్నాడు ఆ తంటాల్లో మూడు పాళ్ళు ఎవరికి చేరుతోందీ చెప్పలేదు.

మాసిలామణి గారు నిలబడ్డారు. మొహంలో విషాదం కనబడుతోంది, “ప్రశ్న నన్నడిగారు. దేవుడికి, మనిషి దుఃఖానికీ సంబంధించిన ప్రశ్న. సమాధానం నా బాధ్యత. ప్రభువు దీనుల పక్షం, అమాయకుల అసహాయుల పక్షం. భగవంతుడి సన్నిధి పేదవాడికి దొరికినట్టు క్రూరులు స్వార్థపరులు, సంపద పోగేసుకునేవాళ్ళకి దొరకదు. వాళ్ళు దేవుడివాళ్ళవడం సూది బెజ్జంలోంచి వొంటే దూరడమంత కష్టం. పేదరికంలో కష్టాలు ఓర్చుకునేవాళ్ళకి దేవుడు దగ్గరవుతాడు” కొంచెమాగి కూర్చున్నవాళ్ళలో చిన్నవాళ్ళకేసి, ఇంకోమాటు నాకేసి, నిదానంగా చూశారు “మీ ప్రశ్నకి సమాధానం పూర్తి చెయ్యలేదు కదూ! మీకు పరలోకంతో లింకులేకుండా ఇక్కడ పరిస్థితికి అవగాహన కావాలి. మతం ఓర్చుకోమంటుందిగానీ, నోరుమూసుకుని సహించమనదు నాయనలారా! క్రూసేడ్లు జరగలేదూ? రిఫర్మేషన్‌రాలేదూ? మార్చాలి సంఘాన్ని. మార్చండి. కాని సాధ్యమయినంత మంచితనంతో మనసులు మార్చండి …” ఇలా సాగింది చాలా సేపు.

వేదికమీదున్న పెద్దలకేసి తిరిగి “గమనించండి. మనమే నిజమయిన అడుక్కుతినే వాళ్ళం. వాళ్ళ శ్రమ విత్తనమేసి, డబ్బు చెట్టుని పెంచి దక్కించుకుని పెత్తనం చెయ్యడం వాళ్ళు సహించడం మానేసినప్పుడు చెల్లదు. మాలాంటి మతగురువులం ఓర్పు బోధించి మార్పు మంచితనంతో తెచ్చుకోమని చెప్పుతాం. మీరు మా మాటల వెనకాల గూడుపుఠాణీ చేస్తూ మీ పబ్బంగడుపుకుంటూంటే క్రమంగా పరిస్థితి చెయ్యిజారిపోతుంది” అన్నారు.

వింటున్న నాకు Red Dean of Canterbury Hewlett Johnson గుర్తుకొచ్చాడు. కాని ఇలాంటి కరుణలోంచి పుట్టిన అంచనాలూ సలహాలూ అసలు ప్రశ్న దగ్గిర ఎవరి కొమ్ము కాస్తాయి? అని సందేహంకూడా వచ్చింది.


దేవుడికే కాదు, గురితప్పిన తుపాకీ గుళ్ళకి కూడా లేని వాళ్ళూ చిన్న వాళ్ళూ అంటేనే ఇష్టం. సంధ్య పని చేస్తున్న స్కూలు పక్కన ఫ్యాక్టరీలో కమ్యూనిస్టుల నాయకత్వంలో పెద్దపెట్టున సమ్మె జరిగింది. కార్మికులని రెచ్చగొట్టేందుకు అతివాదులు ప్రవేశించారని పోలీసులు అనుకున్నారట. ఎవరో తెలియనివాళ్ళకోసం కాలిస్తే అందరికీ తెలిసిన వాళ్ళూ, మంచివాళ్ళూగా పేరుతెచ్చుకున్న వాళ్ళూ ముగ్గురికి గుళ్ళు తగిలాయి. అందులో సంధ్య ఒకరు. ఆమె కథ అయిపోయింది. తుపాకీ గుళ్ళకి ముందు జన్ముండదు కాబోలు, ఈ పాపఫలం అనుభవించడానికి.


మంచి పొజిషనున్న వాడికి ఏవీ అడ్డురావు దుఃఖం కూడా పలకరించి పక్కకు తప్పుకుంటుంది. సంధ్య వాలింది. నిద్రలేచేప్పటికి కొత్త పొద్దు నాముందు నిల్చుంది. ఒక IAS ఆఫీసరూ, ఒక పెద్ద బిజినెస్సు మనిషీ, ఒక పాలిటీషియనూ నాకు పిల్లనివ్వడానికి పోటీ పడ్డారు. business man నెగ్గాడు కారు కొన్నాను. పిల్లలు పుట్టి ఎదుగుతున్నారు. వాళ్ళ కోరికలన్నీ తీర్చగలుగుతున్నాను.

వెనకటి వాళ్ళెప్పుడయినా తగుల్తూ ఉంటారు. వాళ్ళ కష్టాల్లో స్వయంగా సాయపడలేకపోయినా, నా influence ఉపయోగించి వాళ్ళకి ఉపయోగపడుతున్నాను. కానీ ఈ రెండు తరహాల జీవితాలకీ ఉన్న తేడా చాలా విస్తృతమయ్యింది. నాబోటిగాడి దగ్గర రాడానికే చాలా మందికి జంకుంటూంది. అవసరం కోసం జంకుని తట్టుకుని వచ్చినా, నా పిల్లల్నీ భార్యనీ చనువుగా పలకరించే ధైర్యముండదు. ఏదో మొక్కుబడి, నాకు చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. కొంచెం ఉడుకుమోత్తనం కూడాను. నా తోటి ఆఫీసర్లలాగా మామూలు జనాల బెడద లేకుండా విలాసంగా ఎందుకు గడపలేకపోతున్నానని అప్పుడప్పుడనుకుంటాను. కానీ మళ్ళీ అలా అనుకున్నందుకు నన్ను నేనే తిట్టుకుంటూంటాను. కొందరు మొదట్నించీ పయి మెట్ల వాళ్ళు. సరదాగా మాట్లాడుతున్నట్టే ఉండి అప్పుడప్పుడు విసుర్లు వదుల్తారు. ఎదుర్కునేంత సూటిగా అన్నరు. అలా అని గుచ్చుకోడం మానదు. noveau riche అనే పలుకుబడి మొదటిసారిగా ఇలాంటి సందర్భంలోనే విని తరవాత డిక్షనరీ చూసి అర్థం తెలుసుకుని లోపల్లోపల గుంజుకున్నాను.


మనసు క్లేశమనుభవిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు పూర్తిగా కలిమినే నమ్ముకోవడం, కిందవాళ్ళని చులకనగా చూడడం బాధ కలిగిస్తోంది. వాళ్ళుకూడా బయట ఒక వేళ కులం పేరుతో రిజర్వేషన్ల తాలూకన్న ఎత్తిపొడుపులతో మానసికంగా దెబ్బలు తింటున్నారేమో. అది కప్పిపెట్టి వాళ్ళకున్న కలిమిని పొజిషన్నీ పెద్దగా అనుకుంటూ కాంప్లెక్సుల కాంప్లెక్సిటీలో సతమతమవుతున్నారేమో.


రాని నిద్రకి సిగరెట్ల ధూపం. నిద్ర మాత్రల దారిలో కలత పడ్డ మనసు కుదుట పడుతుందా? నిద్రలేపే అలారం నాలోనే ఉందేమో? అలిశెట్టి ప్రభాకర్‌కవిత కళ్ళముందు కదిలింది.

“పడుకుని ఉన్నా
గుండె
గడియారమవుతుంది
ఒక్కొక్కప్పుడు
నిద్ర పట్టనివ్వని
అలారం అవుతుంది”


చాలా రోజులయింది. చాలా పైకొచ్చాను. నా ఉనికికీ, నా మాటకీ విలవ పెరిగింది. మనుషులనించి దూరం ఎక్కువయింది.

పేరుకి దసరా పందిరి. పాట కొత్తగా ఉంది. విందామని వెళ్ళాను. కాలి గజ్జెల చిందూ, ఎప్పుడూ దూరంగా వినపడే డప్పూ, ఊరి మధ్యకొచ్చింది.

“దుక్కులు దున్నిన నాగలి
ఈ దుక్కులు నావంటున్నది
మొక్కలు నాటిన చేతులు
ఈ మొక్కలు నావంటున్నవి
కోతలు కోసిన కొడవలి
ఈ కోతలు నావంటున్నది
కమ్మరి కొలుములు రాజినయి
కుమ్మరి ఆములు మండినయి
మంగలి కత్తులు మెరిసినయి”

నేను మరుస్తున్నకొద్దీ చుట్టూ చూడడం మానేసి లోపలికి కుదించుకుపోయినప్పటినుంచీ, జీవితం చాలా మారినట్లుంది. జనం విషయం పసిగట్టేసినట్టున్నారు.

యేళ్ళ తరబడి బతుకు భయం, పవరు పెరిగిన మనస్థితీ, కింది దట్టమయిన పొరల అడుగున గడ్డకట్టిన హృదయం, మళ్ళీ ఇన్నాళ్ళకి ద్రవించి

“ఎదమెత్తనవుటకయి సొదగుందరా
అంత మదిగల అహమ్మెల్ల వదలిపోవునురా”

బతుకు వేగాన్నీ కాలం పెంచిన వ్యవహారాల తాకిడినీ తట్టుకుని కొంచెం టయిము పిల్లలకి కేటాయించాలి. ఎక్కడినుంచొచ్చారో వాళ్ళకి తెలియాలి. వెనక బతుకుల యెరుక, అవగాహనా, ముందుచూపూ కలిగించాలి. సాధ్యమేనా? వీళ్ళు నాకు దొరుకుతారా? ఇన్నేళ్ళ తరవాత? లేక రెవరెండ్‌మాసిలామణి చెప్పినట్లు పరిస్థితి చెయ్యిజారిపోతుందా?
----------------------------------------------------------
రచన: నందివాడ భీమారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment