Monday, November 5, 2018

భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం-2


భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం-2సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి.........

2. పంచమ స్కంధం – అధ్యాత్మయాత్రికులకు దారిదీపం
ఉపనిషత్తులలో వ్యష్టి సమష్టి స్థూల సూక్ష్మ కారణరూపాలైన ఎటువంటి ఉపాధులు లేని శుద్ధచైతన్యము యొక్క స్థితివర్ణన ఉన్నట్లు ఇందులో ప్రత్యస్తమితభేదము (భేదభావాలు నశించినది), సత్తామాత్రము (త్రైకాలికాభేద్యమైన బ్రహ్మసత్త, తత్త్వజ్ఞానం చేత నశించే వస్తుభేదసత్త, అధిష్ఠాన సాక్షాత్కారం చేత తొలగిపోయే ప్రాతిభాసికీ సత్త), వాచామగోచరము (వాక్కులకు అందనిది), స్వసంవేద్యము (అనుభవము చేత తెలిసికొనదగినది) అయిన బ్రహ్మముయొక్క వివరణ విద్యార్థి అరచేతిలో ఉసిరికను పెట్టి దాని రంగును, రుచిని, పరిమాణాన్ని, వస్తుగుణాన్ని సప్రమాణంగా నిరూపించినంత విశదంగా విలసిల్లింది. ఇందులో మహాపురాణ దశలక్షణాలలో ఒకటయిన స్థితి లేదా స్థానము అనే అంశం వర్ణితమయిందని పెద్దలంటారు. స్థితి ర్వైకుణ్ఠవిజయః అని సంస్కృతభాగవతం అంటున్నది. అంటే, లోకంలోని దుష్టశక్తులపై భగవంతుని యొక్క విజయమని అర్థం. భగవంతుని సృష్టిలో మహదాదితత్త్వాల విలసనకు, ఆ తత్త్వగతుడైన జీవుని ఉనికికి స్థితి అని పేరు. జీవునియొక్క ఆ ‘స్థితి’ లేదా ‘స్థానము’నకు నిమిత్తమైన భగవంతుని దుష్టసంహారలీల ఈ స్కంధంలో నోరారా వివరింపబడింది.

లోకద్రోహినరేంద్రా
నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా
వైకుంఠనాథు విజయం
బాకల్ప ‘స్థాన’ మయ్యె నవనీనాథా! (2-261)

అని ద్వితీయ స్కంధంలో శుకయోగి పరీక్షిత్తుకు ఈ స్థితిలక్షణాన్ని నిరూపిస్తాడు.

        2.1. షట్చక్రోపాసన: విరాట్పురుషతత్త్వం

అద్వితీయమైన బ్రహ్మపదార్థంపైని చిత్తాన్ని నిలిపేందుకు ఉద్దేశించిన ఈ పంచమ స్కంధానికి ఉపాసకుల మతంలో ధారణా స్కంధము అనికూడా పేరున్నది. ధారణ అంటే చిత్తవృత్తిని అదుపులోకి తెచ్చుకొని, ధ్యేయవస్తువుపై ఒకేచోట నిలిపి ఉంచటమని అర్థం. మూలాధారంలో దాగివున్న కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే ప్రక్రియలో శరీరంలోని వివిధచక్రాలకు ఆధారనిలయాలైన మూలము, నాభి, హృదయము, కంఠము, భ్రూమధ్యము, బ్రహ్మరంధ్రము – ఇత్యాదులలో కాని, బాహ్యములైన విష్ణురూపాలపైని కాని మనస్సును ఏకాగ్రంగా తదాకారవృత్తితో నిలకడగా ఉంచే యోగవిశేషం ఇందులో ఉపదేశింపబడింది. అందువల్ల భగవానుడైన విరాట్పురుషుని స్థూలదేహము యొక్క భౌతికవర్ణన, భూగోళ వర్ణన, ఖగోళ వర్ణన, పాతాళలోక వర్ణన ఈ స్కంధంలో ఎంతో విపులంగా ఉన్నాయి. జీవన్ముక్తివివేకాన్ని కోరి షట్చక్రోపాసన కావించే యోగసాధకులు ఈ లోకాలను ధ్యానధారణలో నిలుపుకొని, విరాట్పురుషతత్త్వావధారణ మూలాన కేవలానుభవానందస్వరూపమైన బ్రహ్మవస్తువును దర్శించాలని దీని తాత్పర్యం.

        2.2. జీవుల కర్మఫలవిచారం

పంచమ స్కంధంలో భువనకోశవర్ణన అతివిపులంగా ఉన్నది. ఈ భువనకోశంలో వెలసిన వివిధలోకాలలో సమస్త చరాచరజీవకోటీ నెలకొని ఉన్నది. ఆ జీవకోటి తమతమ ఏయే కర్మఫలంగా ఎటువంటి జీవితం అనుభవింపవలసి ఉంటుందో మనము ఈ స్కంధాన్ని చదివి తెలుసుకోవచ్చు. పూర్వకర్మమనేదొకటి ఉన్నదని, జీవులు పూర్వపు జన్మలలో చేసుకొన్న పుణ్యపాపకర్మలను బట్టి వారివారికి ఆయా సుఖదుఃఖాలు యథాయథంగా నిర్దిష్టసమయాలలో కలుగుతుంటాయని శుకయోగి భాగవతాన్ని బోధిస్తున్న పలుసందర్భాలలో పరీక్షిత్తుకు చెప్తాడు. ఫలానుభవాన్ని గోచరింపజేసేది ఆ మునుపు చేసిన కర్మమేనని, ప్రకృతిబద్ధులు రాగద్వేషాలను అదుపులో ఉంచుకొనకపోతే ముప్పు తప్పదని వివరించాడు. అందువల్ల ఈ స్కంధంలో జీవులాచరించే దుష్కర్మలకు ఫలితమైన నరకలోకాల వర్ణన అతివిపులంగా చేయబడింది. అది చదివినవారు తామంతకు మునుపు చేసిన చెడుపనులకు పశ్చాత్తాపాన్ని పొంది, పాపవర్తనను మాని, భక్తిభావాన్ని అలవరచుకొని సాధుస్వభావులు కావడానికి ఈ వర్ణనమంతా ఉపకరిస్తుంది.

సంస్కృతంలో ఈ పంచమ స్కంధం ఇరవై ఆరు అధ్యాయాల సంక్షేపరచన. అందులో ఉన్న 666 శ్లోకాలు, గద్యాలలో నిడివిని బట్టి శ్లోకాలకంటె గద్యభాగమే ఎక్కువ. శ్లోకాలు వృత్తవైవిధ్యానికి, క్షణక్షణం మారే చిత్రగతులకు పుట్టినిళ్ళు. తెలుగులో ఈ మొత్తం రెండు ఆశ్వాసాలుగా 352 గద్యపద్యాలలో ఇమిడిపోయింది. గంగనామాత్యునికి ఛందోవైవిధ్యం పట్ల ప్రత్యేకాభిమానమేమీ లేనందున తెలుగు కావ్యాలలో సుప్రసిద్ధాలైన చంపకోత్పల శార్దూలమత్తేభ వృత్తాలను; జాత్యుపజాతులలో ఆటవెలది, తేటగీతి, సీసము, కందాలను; ఆశ్వాసాంతాలలో మాత్రం ఒక మాలినిని, ఒక మత్తకోకిలను ఎన్నుకొన్నాడు. భాషలో విశేషప్రయోగాలను చేయలేదు. ప్రాసస్థానంలో రేఫ-శకటరేఫల సాంకర్యం చేయరాదన్న లక్షణకవుల కోవలోనివాడు కాడు. ఆయన దృష్టంతా దురవగాహమైన వేదాంతార్థాన్ని సర్వసుబోధంగా తెలుగుచేయటం పైనే నిలిచింది. జీవవిచారం, కర్మవిచారం, తత్త్వవిచారం, బ్రహ్మవిచారం ఆయనకు అభిమానవిషయాలు.

        2.3. జీవులకు వృత్తికల్పన

దుష్టశక్తులపై శ్రీ భగవానుని విజయమైన ‘స్థితి’ని వర్ణించిన తర్వాత శుకయోగి పరీక్షిత్తుకు ‘వృత్తి’ని వివరించి చెప్తాడు. ఈ ‘వృత్తి’ యొక్క నిర్వచనం సంస్కృత భాగవతం పన్నెండవ స్కంధంలో

వృత్తి ర్భూతాని భూతానాం చరాణా మచరాణి చ
కృతా స్వేన నృణాం తత్ర కామాచ్చోదనయాపి చ. (12. 7. 13)

అని కనిపిస్తుంది. సర్గ విసర్గాలతో ఈ సృష్టిలో వెలసిన చరాచరజీవులూ సంతోషంగా జీవించేందుకు గాను వాటివాటికి అనువైన వృత్తులను కల్పించటం – అని ఈ మాట అర్థం. ఆ వృత్తులలో ఉన్నవారు స్వభావప్రేరణ వల్ల ఆచరించే వివిధశుభాశుభకర్మముల యొక్క ఫలితవిచారం – ముఖ్యంగా అశుభకర్మముల యొక్క విపరీతపరిణామాల విపులమైన చర్చ ఈ స్కంధంలో చేయబడింది.

        2.4. పురాణరచనాశిల్పం

కథాప్రసక్తనీయాలైన అంశాలను సాంగోపాంగంగా నిర్వర్ణించటమే గాక, ప్రధానమైన ఇతివృత్తానికి ఎటువంటి ప్రత్యక్షసంబంధం లేని అనేక గౌణవిషయాలను వర్ణించటం కూడా మహర్షిప్రోక్తములైన పురాణముల రచనాశిల్పంలో ఒక భాగం. అయితే ఆ విషయాలన్నీ పౌరాణికంగా ఎటువంటి పూర్వోత్తరాన్వయమూ లేని నిరాధార రచనలు కావు. భగవదవతారం ఏయే కాలాలలో జరిగిందో, ఆయా కాలాలలోని భగవదంశసంభూతులైన రాజుల వంశాలను సగౌరవంగా వర్ణించటం కూడా వేదవ్యాసమహర్షి రచనాశిల్పంలో భాగమే. అందువల్ల ఈ స్కంధంలో ముమ్మొదట స్వాయంభువ మనువు కాలం నుంచి ఆ యుగసంధికాలం వరకు భూమండలాన్ని పరిపాలించిన అనేకమంది రాజుల పుణ్యచరిత్రలను పేర్కొనటం జరిగింది. నాలుగవ స్కంధంలో స్వాయంభువుని పెద్దకొడుకైన ఉత్తానపాదుని మొదలుకొని, ప్రాచీనబర్హి కాలం దాకా వెలసిన రాజుల కథలను గురించి వివరించిన తర్వాత ఈ ఐదవ స్కంధంలో మనువు రెండవ కొడుకైన ప్రియవ్రతుని వంశక్రమం చెప్పబడింది.

ప్రియవ్రతుడు అన్నగారు ఉత్తానపాదుని వలెనే ధర్మమార్గరతుడై మనువంశరాజులకు ఆదర్శంగా రాజ్యపాలన కావిస్తాడు. పుట్టుకతోనే ఆయనకు మహాపురుషలక్షణమైన శమదమాదిసద్గుణసంపత్తి చేకూరుతుంది. జన్మాంతరసంస్కారం వల్ల వైరాగ్యోదయం కలిగి, నారదమహర్షి వంటి మహాత్ముని ఉపదేశభాగ్యం లభిస్తుంది. నివృత్తిమార్గం లోకి ప్రవేశించినా, రాజధర్మగతుడై ఉంటూనే సంసారబంధాలకు అతీతంగా వర్తించటం నేర్చుకొంటాడు. భువనకోశానికి కేంద్రబిందువుగా ఉన్న జంబూద్వీపాన్ని, దాని చుట్టూ ఇతరద్వీపాలను, సముద్రాలను ఉపకల్పించి, భూతలంలో అనేకానేక నదీపర్వతాలను నెలకొల్పిన పుణ్యాత్మునిగా అతనికి ప్రసిద్ధి కలుగుతుంది. ఒకప్పుడు సూర్యుడు ఆకాశమార్గాన సంచరిస్తున్నపుడు ప్రియవ్రతుడు సూర్యరథాన్ని అనుసరించి తన రథాన్ని నడిపించాడట. అతని రథచక్రాల ఒరపిడి వల్ల నేల చీలి, సముద్రాలు ఏర్పడినట్లు ఈ కథ మనకు చెబుతున్నది. ఆ విధంగా ఏర్పడిన ద్వీపాలు, సముద్రాలను గురించిన విపులమైన వర్ణనం ఈ భాగంలో వస్తుంది.

ప్రియవ్రతుని కొడుకు అగ్నీధ్రుడు – ధర్మసమ్మతంగా, సకల ప్రజానురంజకంగా రాజ్యపాలన చేసినవాడు – చివరికి ఒక అప్సరస సౌందర్యానికి ముగ్ధుడై, ఆమె యందు నాభి అనే మహనీయుణ్ణి సుతునిగా పొందుతాడు. నాభి కాలంలో వైదికకర్మలు నిర్నిరోధంగా కొనసాగుతాయి. భగవదవతారం ఎటువంటి పుణ్యధనుల ఇండ్లలో సంభవిస్తుందో చెప్పటానికి ఈ ఉపక్రమణిక అంతా ఉపకరిస్తుంది.

        2.5. శ్రీ ఋషభావతారం, నవయోగుల కథ

నాభిరాజు ఒకప్పుడు వేదోక్తప్రకారం ఒక మహాయజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞవేదికపై శ్రీ మహావిష్ణువే సాక్షాత్కరించి, స్వయంగా తాను నాభి యింట జన్మింపగలనని వరాన్ని ప్రసాదించి, తన వాగ్దానం ప్రకారం వారింట ఋషభుడనే పేరిట ఉదయించి, రాజర్షితల్లజు డవుతాడు. ఆ విధంగా గృహస్థాశ్రమంలో ఉంటూనే మానవులు పరమహంసపదాన్ని చేపట్టవచ్చునని శ్రీ ఋషభావతారం లోకానికి వెల్లడిచేస్తుంది.

ఋషభునికి నూరుమంది కొడుకులు పుడతారు. వారిలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్భుడు, కీకటుడు అని తొమ్మిదిమంది పేర్లమీద దేశాలను ఏర్పరించి ఋషభుడు వారివారికి ఆయా దేశాల రాచరికం అప్పగిస్తాడు. ఎనభైఒక్కమంది కొడుకులు బ్రహ్మావర్తంలోని వివిధప్రాంతాలకు వెళ్ళి బ్రహ్మనిష్ఠులై బ్రాహ్మణ్యంలో స్థిరపడతారు. తొమ్మిదిమంది మాత్రం విషయవాసనలకు దూరంగా ఉంటూ అధ్యాత్మవిద్యాసంపన్నులై నవయోగులని ప్రఖ్యాతిని గడిస్తారు. వారిలో పెద్దవాడి పేరు ‘కవి’ కావటం వల్ల వారికి నవకవులని కూడా ప్రసిద్ధి ఏర్పడింది. కంటికి కనుపిస్తున్న ఈ సమస్తభూతసృష్టి ఏ విధంగా ఏర్పడింది? భగవంతుడు నిజంగా ఉన్నాడా? లేడా? అని సందేహించేవారికోసం వారు లోకసంచారం చేసి, స్థూల సూక్ష్మాత్మకమైన చరాచరవిశ్వమంతా భగవద్రూపమే అని, భగవదన్యమైన వస్తువు వేరొకటి లేదని – ఒక్కొక్కరూ ఒక్కొక్క విధమైన ప్రమాణాన్ని చూపిస్తూ ప్రచారం చేస్తారు. భరతవర్షంలో ఆరూఢభక్తుడైన విదేహదేశాధిపతి నిమి సత్త్రయాగం చేస్తున్నప్పుడు వారక్కడికి వెళ్ళి ఆయనకు అధ్యాత్మతత్త్వాన్ని బోధిస్తారు. ఆ కథంతా భాగవతం ఏకాదశ స్కంధంలో సాకల్యంగా వివరణకు వస్తుంది.

నవయోగులలో పెద్దవాడైన కవి రాజుకు ఆత్యంతికక్షేమానికి భాగవతధర్మమొక్కటే సిద్ధిసాధకమని విశదీకరిస్తాడు. కర్మమునందు కర్తృత్వము (ఈ పని చేసినది నేను కాబట్టి కర్త అయినవాని ఫలము నాది), భోక్తృత్వము (జాగ్రత్ స్వప్న సుషుప్తులనే అవస్థలలో భోగకర్తను నేను) అన్న జీవవిచార భావాలు లేనప్పుడు భగవత్ప్రేరణ సిద్ధించి భక్తిమార్గం అలవడుతుందని ఆయన ఉపదేశసారం. ఆ తర్వాత కవి తమ్ముడు రవి నిమిరాజుకు భాగవతుల లక్షణాలను చెబుతాడు. మనస్సు భగవంతునికి సమర్పితమైనప్పుడు జీవునియొక్క వాసనాప్రేరితాలైన కర్మలన్నీ వేయించిన విత్తనాలలాగా అంకురించే శక్తిని కోల్పోతాయని, అందువల్ల కర్మఫలాన్ని అనుభవించేందుకు మళ్ళీ జన్మమంటూ ఉండదని, ప్రారబ్ధం నశించిన తర్వాత భోగ్యావసరం లేక జీవన్ముక్తి కలుగుతుందని వివరిస్తాడు. మూడవవాడు అంతరిక్షుడు విష్ణుమాయ వలన సంసారబంధం కలుగుతున్నదని, ఆ మాయాశక్తి వలన పుట్టిన మహదాదితత్త్వాలు ఆ శక్తి ఉపసంహృతమైనప్పుడు తొలగిపోతాయని అంటాడు. నాల్గవవాడు ప్రబుద్ధుడు రజోగుణపరిణామంగా ప్రవర్తిల్లే అధర్మకార్యమైన దుఃఖనివృత్తికి భక్తి ఒక్కటే కర్తవ్యమని ప్రబోధిస్తాడు. బాహ్యాభ్యంతరాలలో శుచిగా ఉండటం, సాధుజనుల సహవాసం, సాత్త్వికాహారం, స్వధర్మనిష్ఠ, మనోవాక్కాయముల పవిత్రత, సర్వకాల సర్వావస్థలలో కష్టాలను సహింపగల ఓరిమి, బ్రహ్మయజ్ఞనిర్వహణార్థం వేదాధ్యయనం, ఆత్మవంచన పరవంచనలు లేని ఆర్జవం, శీతోష్ణసుఖదుఃఖాదిద్వంద్వాలకు సహిష్ణుత, ఋతుకాల భార్యాసంగమరూపమైన బ్రహ్మచర్యం, త్రికరణశుద్ధిగా ఇతరులను హింసింపకుండటం, తనను బ్రహ్మముగా అనుభవానికి తెచ్చుకొనేందుకు ప్రయత్నించటం, నిత్యసంతుష్టి, భాగవతశాస్త్రమునందు ఆస్తిక్యబుద్ధి, సంచారశీలమైన మనస్సుయొక్క గతిని ప్రాణాయామంతోనూ, ఇహపరాలు రెండింటికీ పనికిరాని వాక్ప్రచారాన్ని మౌనంతోనూ, కర్మచాంచల్యాన్ని కోరికలను నిగ్రహించుకోవటం ద్వారాను నియమింపగలగటం, పాపసంకల్పాలను దరిచేయనీయని అంతఃకరణశుద్ధి, సత్యసంధత మొదలుగా గల భక్తిపరమాదర్శాలను ఉపదేశిస్తాడు. ఆ తర్వాత పిప్పలాయనుడు ముందుకు వచ్చి రాజుకు భగవత్స్వరూపాన్ని ధ్యానించటం ఎలాగో నేర్పి, శరీరగతులు ఆత్మజ్ఞానాన్ని పొంది అహంకారలయాన్ని సాధించటమే పరమార్థసాధకమని ప్రబోధించిన విషయం అచ్చమూ భాగవత విషయతాత్పర్యమే. మాలిన్యం లేని మనస్సులో తప్ప ఆత్మబింబదర్శనం సాధ్యం కాదని ఆయన అంటాడు. పిప్పలాయనుని తమ్ముడు ఆవిర్హోత్రుడు నిమిరాజుకు కర్మయోగాన్ని కరతలామలకం చేస్తాడు. ఇంద్రియజయాన్ని సాధించినవారే కర్మత్యాగానికి అర్హులని బోధిస్తాడు. అహంకారమనే హృదయగ్రంథిని త్రెంచివేసి, సర్వకర్మములను భగవంతునికి సమర్పిస్తే క్రమక్రమంగా నైష్కర్మ్యసిద్ధి కలుగుతుందని, భగవన్మహిమానుభవాన్ని చెందిన ఆత్మనిష్ఠే సన్మార్గమని ఆయన ప్రవచనం. ఆ తర్వాత ద్రమీళుడు ధర్మోద్ధరణార్థం భగవంతుడు వివిధకాలాలలో అవతరించినప్పటి గుణకర్మవిశేషాలను వివరించి, ఆ లీలలను సన్నుతించటం నేర్పుతాడు. తదనంతరం చమసుడు వేదోక్తకర్మలను సాధనాలుగా గ్రహించి వాటి పరిణామస్వరూపమైన ఆనందాన్ని పొందగోరినవారి వివేకస్థితిని, భగవత్ప్రాప్తిమార్గాన్ని విశదీకరిస్తాడు. నవకవులలో చివరివాడు కరభాజనుడు తన అన్నలు పరిపరి విధాలుగా చెప్పిన విషయమంతటినీ ఒక్క ‘భక్తి’ అన్న సద్ధర్మంలో ఇమిడ్చి, భగవంతుని ఆరాధనాపద్ధతులను, యుగయుగాలలో ఆయన మూర్తద్రవ్యాన్ని ఆశ్రయించి క్రియాచరణానికి పూనుకొన్నప్పటికి రూపనామాలను, గుణకర్మలను నిరూపించి, భగవన్నామసంకీర్తన వల్ల మనోమాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో రాజుకు చెబుతాడు. ఏకాదశ స్కంధంలో మనకు వారి అమోఘమైన ఆ దర్శనసారం పరిచయ మవుతుంది.

చిత్రమేమంటే, పంచమ స్కంధం ఆరంభంలో పరీక్షిత్తు శుకయోగిని కర్మబంధాలలో తగుల్కొనక ఆత్మారాములైన ఉత్తానపాద ప్రియవ్రతుల వంటి పుణ్యధర్ములకు సంసారాసక్తి ఏ కారణం వల్ల ఏ విధంగా కలిగిందని అడుగుతాడు. శుకయోగి అందుకు సమాధానంగా మహాపురుషుల జీవితాలలో ఎటువంటి ఎటువంటి ఊహింపరాని ఘటనలు జరుగుతాయో వివరించటం మొదలుపెడతాడు. ఋషభపుత్త్రులను గురించి, ఋషభపుత్త్రులలో నవయోగులను గురించి ప్రస్తావన వచ్చేసరికి అధ్యాత్మశాస్త్రగంభీరిమ వల్ల విషయం విషయాంతరంలోకి దూకుతుందని తెలిసిన శుకయోగి వారి పేర్లను మాత్రం చెప్పి,

“వ. (తొమ్మండ్రును) భాగవతధర్మప్రకాశకు లైరి; భగవన్మహిమోపబృంహితంబు లగు వారల చరిత్రంబులు ముందఱ నెఱింగించెద” (5-1-64)

అని ఈ పంచమ స్కంధంలో వారి గురించి విస్తరింపక తర్వాత చెబుతానని విషయాన్ని అప్పటికి దాటవేస్తాడు. మహాపురుషులకు భవబంధాలు ఎట్లా కలుగుతాయి? అని పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెబుతాడు. అంతటితో శుకయోగి ఆ విషయాన్ని మర్చిపోతాడని మనమనుకోకూడదు. ఆ తర్వాత ఎప్పుడో ఏకాదశ స్కంధంలో వాసుదేవ నారద సంవాదం వచ్చినపుడు ఆకస్మికంగా ఈ నవయోగుల ప్రస్తావనను తెస్తాడు. నారదుడు విదేహదేశపు రాజు నిమికి ఋషభపుత్త్రులు చేసిన పరమార్థోపదేశాన్ని వివరించినట్లుగా చెబుతూ శుకయోగి ‘తర్వాత చెబుతా’నని ఈ పంచమ స్కంధంలో అన్నమాటను గుర్తుంచుకొని నవయోగుల కథనప్పుడు సవిస్తరంగా చెబుతాడు. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే – ఎక్కడి పంచమ స్కంధం! ఎప్పటి ఏకాదశ స్కంధం! భాగవత కర్త కథాకథనంలోని చిన్న చిన్న విషయాలను కూడా ఏ మాత్రం మర్చిపోకుండా ఎంత శ్రద్ధగా గుర్తుంచుకొని పూర్వోత్తరాలను ఎంత సమయోచితంగా అనుసంధిస్తాడో ఈ సన్నివేశాన్ని బట్టి పాఠకులు సులభంగానే గ్రహిస్తారు. పోతనగారి భాగవతం ఎంత దురుద్ధరమైన స్థితిలో మన చేతికందినా, పంచమ స్కంధాన్ని తెలుగుచేసిన బొప్పరాజు గంగన కాని, ఏకాదశ స్కంధాన్ని పరిపూర్ణించిన వెలిగందల నారయ కాని ఈ విషయంలో తొట్రుపడక జాగరూకులై ఉండటం విశేషం.

మళ్ళీ ప్రకృతకథకు వద్దాము. ఋషభుడు సలక్షణంగా రాజధర్మాన్ని నిర్వహించి, పరమార్థవిదుడై అంత్యకాలంలో పరమహంస జీవితం గడుపుతాడు. ధర్మతత్పరు లైనవారు ఆయన జీవితోదంతాన్ని, బోధనల సారాన్ని ఈ స్కంధంలో తప్పక తెలుసుకోవాలి. జైన మతస్థులు కూడా తమ అధ్యాత్మగురువులైన తీర్థంకరులలో ఒకరిగా శ్రీ ఋషభాచార్యులను పరిగణించటం విశేషం. భారతీయధర్మంలో వెలసిన వివిధ మతాల తులనాత్మకపరిశీలన కావించేవారు వీరిరువురి బోధనలను తప్పక అధ్యయనం చెయ్యాలి.

        2.6. జడభరతుని కథ: భక్తితత్త్వం

ఋషభదేవుని సుతులందరిలో పెద్దవాడు అతని తర్వాత రాజ్యానికి వచ్చిన సుప్రసిద్ధుడు భరతుడు. ప్రజానురంజకుడైన ఆ రాజు పేరుమీదుగా అప్పటి వరకు అజనాభవర్షమని పిలువబడుతున్న భూమిభాగానికి భారతవర్షమని సరికొత్తగా వ్యవహారం ఏర్పడింది. సార్వభౌముడై దేశాన్ని ఒక్క గొడుగు క్రింద పరిపాలించి, ముసలితనం వచ్చాక అతను రాజధర్మానుసారం వానప్రస్థాన్ని స్వీకరిస్తాడు. మనోలయానికి అడ్డు నిలిచే బంధహేతువులైన సర్వసంగాలను త్యజించి, తపోదీక్షను గైకొన్న ఆ మహానుభావుడు అంత్యకాలం సమీపించిన చివరి రోజులలో కర్మవశాన మళ్ళీ బంధాలలో చిక్కుకొని, ఒక జింకపిల్ల పైని మమకారం పెట్టుకుని, అదే ప్రాణంగా జీవిస్తూ, ఆ బంధం వల్ల ఉత్తరజన్మలో హరిణమై పుడతాడు. ఆ విధంగా జననమరణాల చక్రభ్రమణంలో కొట్టుమిట్టుకులాడి, కొంతకాలానికి మళ్ళీ మనుష్యజన్మను పొందిన తర్వాత – కర్మలన్నీ ఫలకారణాలేనని గ్రహించి, కర్మారంభాన్ని కూడా విడిచిపెట్టి, నిష్కామజడత్వాన్ని అవలంబించి, జడభరతుడని పేరుపొందుతాడు.

ఒకనాడు తన ప్రాంతానికి వచ్చిన రహూగణుడనే రాజుకు భరతుడు పరమార్థసారాన్ని, జీవేశ్వరుల తత్త్వాన్ని వివరించటం ఈ స్కంధంలో పరమగంభీరంగా అమరింది. విష్ణుపురాణంలోని రెండవ అంశంలోనూ ఈ జడభరతోపాఖ్యానం ఒక గంభీరమైన భాగం. డా. వేదుల సూర్యనారాయణ శర్మగారు తమ గొప్ప రచన అంతరార్థభాగవతములో ఈ సన్నివేశం అంతరార్థాన్ని అద్వైతపరకంగా వివరించారు:

“ఈ కథ కర్మవాసనలు ఎట్లు పరిణమిస్తాయో విప్పిచెప్పింది. పుణ్యకర్మలతో ముక్తిసాధనలు నడిపినవారు కూడా చివరకు ఏదో ప్రబలమైన కర్మవాసనచే తిరిగి జన్మం పొందుతారనీ, మృగంగా పుట్టిన జన్మలో కూడ పూర్వజన్మజ్ఞానంతో తరించడం జరుగుతుంటుందని, అసంగయోగం ఒక్కటే కర్మవాసనలు నశింపు చేయగలదనీ, అసంగయోగం జీవితాంతం వరకూ నడిపినపుడు మరణకాలంలో జన్మవాసనలేవీ స్ఫురింపవనీ, అదే మోక్షహేతువానీ, ముక్తిమార్గానికి అసంగయోగ ప్రాధాన్యాన్ని వివరించడమే ఈ కథాకల్పనకు కారణంగా గమనించాలి. అసంగయోగం వల్ల జ్ఞానావిర్భావమూ, జ్ఞానావిర్భావం వల్ల అసంగయోగమూ లభించడానికి పరస్పరకారణాలుగా తెలిసికొని అసంగంతో జ్ఞానాన్ని, జ్ఞానంతో అసంగతత్త్వాన్ని అలవరచుకోవాలి.

భరతుడంటే జీవుడు. భరత అంటే బరువు యొక్క భావం అని అర్థం. భారం వహించడం అన్నమాట. భరత కలవాడు భరతుడు అవుతాడు. వాసనాభారం వహించిన జీవుడు ఇచ్చట భరతుడుగా చెప్పబడ్డాడు. భరతుడు రెండు జన్మలలోను భరతుడుగానే పేరు పెట్టబడ్డాడు. దానినిబట్టి భరత శబ్దానికి అంతరార్థంవుందనీ, వాసనాభారం వహించే జీవుడని దానికి అంతరార్థమనీ తెలిసికోవాలి. రెండవజన్మలో అంగిరసుడు అనేవాడు భరతుని తండ్రి. అంగము అనేదే స్వార్థంలో అణ్ ప్రత్యయం చేస్తే దేహము అనే అర్థంలో అంగము అవుతుంది. అంగము అంటే దేహం అన్నమాట. అంగము కలది అంగీ అని అవుతుంది. రసం అంటే జన్మనిచ్చే వాసన అని అర్థం వుంది. కాన దేహధారణకు కారణరూపమైన వాసనయే అంగీరసుడంటే. ఆ వాసనారూపం వల్లనే జీవుడు పుట్టేడు. అతడే భరతుడనే అంతరార్థం ఇందులో వస్తుంది. ఇదే అంగీరసుని పుత్రుడు భరతుడన్న కథావాక్యానికి అంతరార్థంగా భావించాలి.

అంగీరసునకు ఇద్దరు భార్యలు. అనగా అపరాశక్తి, పరాశక్తి. వాసనలు రెండు రకాలు. తిరిగి తిరిగి జన్మనిచ్చేవి ఒక రకం వాసనలు. అవి అపరాశక్తివి. ముక్తినిచ్చే సత్కర్మవాసనలు మఱొక రకం. అవి పరాశక్తివి. మొదటిది ప్రవృత్తిమార్గం కలది. రెండవది నివృత్తిమార్గం కలది. అంగిరసునికి మొదటి భార్యవల్ల తొమ్మండుగురు బిడ్డలు కల్గేరు. అంటే అపరాశక్తి వల్ల నవవిధములైన రసములు పుట్టేయన్నమాట. అవే కర్మవాసనాప్రాబల్యం కల్గి ‘పునరపి జననం పునరపి మరణం’ కల జన్మపరిభ్రమణం ఇచ్చే నవరసాల కర్మలు. అవి అపరాశక్తి యొక్క ప్రవృత్తిమార్గం వల్లనే కల్గుతాయనేదే అంగీరసునికి ప్రథమభార్య యందు తొమ్మండుగురు కొడుకులు పుట్టేరన్నదాని అంతరార్థంగా భావింపవచ్చు. అంగీరసుని రెండవ భార్య అనగా పరాశక్తి యొక్క మార్గం. వెంటనే ఆ జన్మలోనే ముక్తినివ్వగల సత్కర్మవాసనలు దానివల్ల ఫలిస్తాయి. ఆమెవల్ల పురుషుడు, స్త్రీ పుట్టేరు. పురుషుడు అంటే జీవుడు తనలోనికి చేర్చుకొనే పరమాత్మ. స్త్రీ అంటే ఆ పరమాత్మ వుండటానికి కారణమైన జీవునియొక్క సాత్త్వికగుణ ప్రకృతి అని అంతరార్థం. ప్రకృతిపురుషవివేకంతో ఆ జన్మలో సత్కర్మవాసనా నాశం కల్గి ముక్తి లభిస్తుందని చెప్పడానికే ముక్తి నొందవలసిన భరతుడు అంగీరసుని రెండవ భార్యకు అనగా పరాశక్తికి పుత్రుడుగా పుట్టేడని చెప్పడం జరిగింది. అంగీరసుని మొదటిభార్య బిడ్డలు భరతుని ఆదరించలేదని చెప్పడం, అపరాశక్తికి సంభవించిన ఐహికములైన వాసనలేవీ భరతుణ్ణి అంటియుండలేదని చెప్పడమే అని భావించాలి.” — (1999 నాటి ముద్రణ: పుటలు. 94 – 95)

ఈ జడభరతోపాఖ్యానం భాగవత పంచమ స్కంధంలోని ముఖ్యఘట్టాలలో ఒకటి. ఇందులోని ప్రతీకలను శంకర – మధ్వ – రామానుజుల అద్వైత – ద్వైత – విశిష్టాద్వైత దర్శనాల సారాన్ని అనుసరించి వ్యాఖ్యాతలు వివిధరీతుల విపులంగా వివరించారు. ఆ వివరణకు వారు ప్రమాణీకరించిన ఉపనిషద్వాక్యావళిని పాఠకులు శ్రద్ధాసక్తులతో సమన్వయించుకొని, నిత్యానుసంధానంలో మననం చేయవలసి ఉంటుంది. అదీగాక ఆ వ్యాఖ్యలను బట్టి పాఠకులకు శ్రీమద్భాగవతాన్ని సాధకులు ఎన్ని విధాలుగా దర్శింపవచ్చునో తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అతిగహనమైన వేదాంతసారాన్ని బోధిస్తూ అద్భుతమైన సంవిధానశిల్పంతో ఎంతో ఆకర్షణీయంగా రచింపబడిన ఖండం ఇది.

        2.7. భువనకోశ వర్ణనం

మనువంశ రాజుల కథాకథనం తర్వాత ప్రధానంగా ఇందులో భువనకోశపు స్వరూపవర్ణన ఉన్నది. ఆధునికవిజ్ఞానశాస్త్రంతో పరిచయం ఉన్న పాఠకులకు ఇందులోని భూగోళ ఖగోళ విజ్ఞానాల స్వరూపమంతా శాస్త్రదృష్టి లోపించిన కట్టుకథే కాని కంటికి కనిపించే భౌతికసత్యం కాదన్న అపార్థం కలిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రసక్తమైనది కేవలం ఐహికదృష్టితో కావించిన వర్ణన కాదని మనము గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని గ్రహించినవాడు కనుకనే పరీక్షిత్తు ఈ సన్నివేశంలో –

“గుణమయంబును, స్థూలరూపంబును నైన శ్రీహరి శరీరం బగు నీ లోకంబునందు నిలిపిన చిత్తం బగుణం బగు; సూక్ష్మంబును, నాత్మజ్యోతియు, బ్రహ్మంబు నైన వాసుదేవుని యందు నిల్చు.” (5-2-14)

అని శుకయోగితో అంటాడు. సత్త్వరజస్తమస్సులతో కూడిన ఈ సమస్తవిశ్వం ఆ విశ్వాత్ముని యొక్క స్థూలరూపమని భావించి, ఆ స్థూలరూపంలో గోచరిస్తున్న అద్భుతావహమైన సౌందర్యాన్ని, మహిమను ధ్యానంలో ధారణ చేసినట్లయితే, శ్రీ వాసుదేవుని సర్వాంతర్యామితను స్వానుభవంలో అర్థం చేసికొని, ఆ పరమేశ్వరుని సూక్ష్మతత్త్వాన్ని దర్శించటం సాధ్యమవుతుంది. సకలలోకోత్తరుడని మనము భావిస్తున్న ఆ భగవానుని ఉనికి కల్పితమాత్రం కాదని; కేవలసత్యమని తెలియజెప్పడమే ఈ సన్నివేశ వర్ణనలోని అంతరార్థం. నిర్గుణమైన ఆత్మతత్త్వాన్ని తంత్రమార్గంలో తెలుసుకొనగోరినవారు ప్రాథమికదశలో యంత్రాలకిచ్చే ప్రాధాన్యం ఎటువంటిదో, భువనకోశవర్ణనలో భూగోళస్వరూపానికి ఉన్న ప్రాధాన్యం కూడా అంతే. ఇదంతా ధ్యానానికి కూర్చున్న సాధకుల కోసం.

        2.8. సాధనరహస్యం

భగవత్తత్త్వరహస్యాన్ని తెలుసుకోవటం అంత సులభం కాదు. ఎక్కడో ఏదో చదివినంత మాత్రాననో, ఎవరో ఏదో చెబితేనో అది బోధపడదు. అందుకే దానిని కేవలానుభవానందస్వరూపం అన్నారు. ఈశ్వరుని శక్తివిలాసం ఎంత ఇంద్రియాతీతమో అంత ఇంద్రియానుభవయోగ్యం. గురువు యొక్క సదుపదేశాన్ని పొంది, సాధన మొదలుపెట్టి, ఈ భువనాల స్వరూపాన్ని ధ్యానిస్తుంటే క్రమంగా ఈశ్వరుని దివ్యశక్తి మానవమనోమందిరంలోకి ప్రవేశిస్తుందని శ్రీమద్భాగవతం బోధిస్తున్నది. విశ్వరూపాన్ని గ్రహించి అటువంటి దివ్యానుభవాన్ని సాధించిన సాధకులే సిద్ధులు. ఆ సిద్ధి సాధనకోసమే భాగవతాన్ని శుకయోగి పరీక్షిత్తుకు వినిపిస్తాడు. లేకపోతే, నిర్విక్రియుడైన శుకమహర్షి స్వయంగా తానై వచ్చి వినుపింపగోరటం ఏమిటి? శాపగ్రస్తజీవితాన్ని గడుపుతూ, ప్రాయోపవేశం చేసి, కర్మావధికోసం ఎదురుచూస్తున్న పరీక్షిత్తు ఆ విశ్వరూపుని కథను మనసారా వినటం ఏమిటి? స్వరబ్రహ్మభూషితమైన వాగ్వీణపై వేదవ్యాసమహర్షి ఆ ఆత్మసంగీతాన్ని మనకోసం శ్రవణపర్వంగా మ్రోగించటంలోని అంతరార్థం ఏమిటి? శ్రవణ మననాదుల యందు శ్రద్ధావంతులైన సాధకులకు, భాగవతధర్ములకు రమ్యమైన కథాతత్త్వముఖంగా బ్రహ్మోపపదేశమే.

ఈ పంచమ స్కంధమంతా భగవంతుని స్థూలరూపాన్ని ధ్యానమార్గంలో దర్శించి, స్వప్రకాశానందమయమైన ఆయన సూక్ష్మరూపాన్ని స్వానుభవంలో తెలుసుకొనగోరిన సాధకుల మననధారణ కోసమే తప్ప కేవలం భూగోళ ఖగోళ విజ్ఞానాలను సమీకరించాలనే ఐహికదృష్టి శుకయోగికి లేదు. ఆ విధమైన ధ్యానధారణ వల్ల శుద్ధము (ఎన్నడూ ఎటువంటి దోషాలూ లేని ఆత్మము యొక్క స్వస్వరూపం), బుద్ధము (బోధరూపమైనది), ముక్తము (బంధాలకు అతీతమైనది), కేవలము (అద్వితీయమైనది), అఖండము (అనంతము, అఖిలాత్మకము అయినది), సచ్చిదానందస్వరూపము (నిత్య జ్ఞాన సుఖైక స్వరూపమైన బ్రహ్మము) అయిన భగవత్తత్త్వాన్ని గ్రహించినవారికి – స్థూలరూపం నుంచి సూక్ష్మరూపంలోకి ప్రవేశింపజేసే సాధనరహస్యం అర్థమవుతుందని ఆయన ఉద్దేశం.

        2.9. నరకలోకాల వర్ణన

పంచమ స్కంధం చివర వివిధ నరకలోకాల వర్ణనం ఉన్నది. నరకము అంటే నృ = మానవులయొక్క, అక = పాపముల ఫలితాన్ని అనుభవించటానికి విధింపబడిన భోగస్థానమన్నమాట. ఆ నరకములు అనేకప్రకారాలుగా ఉంటాయి. వాటిలో ఇరవైఎనిమిదింటి వివరణ ఈ స్కంధంలో చేయబడింది. అవన్నీ వివరణమాత్రానికే గాని చేసికొన్నవారికి చేసికొన్నంత ఫలితం. ఆ లోకాలన్నీ యాతనాభూములు. అక్కడ కేవలం జీవుల యొక్క పాపాలకు శిక్ష విధించటం ఒక్కటే ఉద్దేశం కాదు. లోకంలో ప్రతిషిద్ధలక్షణమైన అధర్మాన్ని కావించేవారి శ్రద్ధావైసాదృశ్యం బహురీతులుగా ఉన్నట్లే, వారికి కలిగే కర్మఫలాలు కూడా బహురీతులుగా ఉంటాయి. అనాదిసిద్ధమైన అవిద్య వలన కామనలు చెలరేగి పాపకర్మలను చేయించినప్పుడు, అందుకు పరిణామంగా సిద్ధించే ఫలాలను అనుభవించటం వల్ల జీవునికి మళ్ళీ చిత్తపరిశుద్ధి, నైర్మల్యం కలుగుతాయి. అందుచేతనే ఆనాటి పౌరాణికులు యాతనానుభవంలో మనస్సును పశ్చాత్తాపతప్తం కావించి, ఆ పాపసంకల్పాలు మళ్ళీ తలయెత్తకుండా ప్రక్షాళింపగల మహాశక్తి ఉన్నదని నిశ్చయించారు. ఆ విధంగా దుష్కర్మఫలాన్ని అనుభవించిన జీవునికి మళ్ళీ సన్మార్గంలోకి ప్రవేశించి, ఆత్మౌన్నత్యాన్ని సాధించేందుకు మరొక అవకాశం లభిస్తుంది. అందుచేత దోషకర్మకు ప్రాయశ్చిత్తంగా కష్టాలను విధించటం జరిగింది.

3. శ్రీరామాంకితమా? శ్రీకృష్ణాంకితమా?
పోతనగారు తెనుగుచేసిన భాగవతం శ్రీరామచంద్రునికి అంకితమైంది. “పలికించెడువాఁడు రామభద్రుం” డని పోతనగారు తానే ప్రథమ స్కంధం అవతారికలో (1-16) చెప్పుకొన్నారు. భాగవతం ప్రథమ స్కంధాంతంలోనూ, ద్వితీయ స్కంధం మొదలుకొని ద్వాదశ స్కంధం వరకు గల స్కంధాది స్కంధాంతాలలో ఉన్న పద్యాలన్నీ – ఒక్క ఈ పంచమ స్కంధంలోనూ, ఏర్చూరి సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోనూ తప్ప – అన్నీ శ్రీరామాంకితం గానే ఉన్నాయి. ప్రథమ స్కంధం మొదట గల ఇష్టదేవతాప్రార్థనలో శ్రీరామస్తుతిని గల పద్యాలు లేవు. ప్రథమ స్కంధంలోని తొలిపద్యం శ్రీకృష్ణాంకితంగా ఉన్నది. అవతారికాలోని అంకితం పద్యాలు శ్రీకృష్ణాంకితంగా ఉన్నాయి. పోతనగారికి శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించి –

“మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబు దెనుంగు సేయుము; నీకు భవబంధంబులు దెగు” (1-15)

అని ఆనతిచ్చేంతవరకు ఆయనకు శ్రీరామచంద్రార్పణం చేయాలన్న ఉద్దేశం రాలేదేమో అనుకోవాలి. ఆ మహాకవి చిత్రించిన నాటకీయమైన అవతారికలోని సన్నివేశకథనానికి లోగిన విమర్శకులు కృతిరచన పూర్తయిన తర్వాత కృత్యాదిరచన జరిగినందువల్ల పెక్కు మార్పులు చోటుచేసుకొన్నాయేమో అన్న అంశాన్ని పరిశీలించినట్లు కనబడదు. అవతారికను బట్టి భగవత్సాక్షాత్కారం జరిగిన తర్వాతనే ఆయన కృతిరచనకు శ్రీకారం చుట్టాడని నిశ్చయించాలి. కృతిరచనకు, కృత్యాదిరచనకు నడిమికాలంలో తనకు అంకితం చేయమని అడిగిన రాజును ధిక్కరింపవలసివచ్చిందేమో. మనుజేశ్వరాధములను తిరస్కరింపవలసివచ్చిందేమో. అగ్నికి ఆజ్యం తోడయినట్లు ఓరుగల్లుపై మహమ్మదీయుల దండయాత్ర మరికొంత కాలానికి జరిగి స్కంధాల విధ్వంసానికి మరింత దోహదమయిందేమో చెప్పలేము. అందదుకులుగా ఉన్న అవతారికను వ్రాతప్రతులతో మళ్ళీ ఒకసారి సరిపోల్చి పునఃపరిష్కరిస్తేనే గాని భాగవతకావ్యస్వరూపాన్ని గురించి నిర్ధారణగా ఏ సంగతీ చెప్పటానికి వీలులేకుండా ఉంది.

భాగవతం ఆద్యపద్యం శ్రీకృష్ణస్తుతి. స్కంధాద్యంతపద్యాలలో శ్రీరామాంకితం కాని పద్యాలు గంగనార్యుని ఈ పంచమ స్కంధంలోనూ, సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోనూ తప్ప మరెక్కడా లేవు. సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోని తొలిపద్యంలోని విశేషణాలు లక్ష్మీసమేతుడైన శ్రీమహావిష్ణువును ప్రతిపాదిస్తున్నాయి. వాటిని శ్రీరామాంకితంగా అన్వయించటం సమంజసంగా ఉండదు. పోతనగారి వలెనే ఏర్చూరి సింగన తొలిపద్యాన్ని శ్రీకృష్ణాంకితం గానూ, స్కంధాంతంలో శ్రీరామాంకితం గానూ పద్యాలను కూర్చాడనుకోవాలి. షష్ఠస్కంధం చివర “రాజీవరాజపూజా, శ్రీజిత గోపీకటాక్షసేవాంతరవి, భ్రాజితమూర్తి! మదోద్ధత, రాజకులోత్సాద! రామరాజాఖ్యనిధీ!” అని ఉన్న (6-527) పద్యంలోని రామరాజాఖ్యనిధీ! అని ఉన్న దళాన్ని బట్టి ఆ స్కంధాంతపద్యాలను శ్రీరామాంకితంగా అన్వయించుకొంటే పోతనగారి మార్గం అప్రతిహత మైనట్లవుతుంది. కొన్ని వ్రాతప్రతులలో షష్ఠ స్కంధం మొదట “శ్రీ విశ్వభారభరణ, ప్రావీణ్యవిభాసమాన ఫణిరాణ్ణిభబా, హావిపులవిజయదోహల, రావణమదకరిమృగేంద్ర! రామనరేంద్రా!” అన్న అద్భుతావహమైన పద్యమొకటి ఉన్నది కాని, అది పోతనగారి మార్గానుసారి కాదని కాబోలు, పరిష్కర్తలు దానిని స్వీకరింపలేదు. మునుపే చెప్పినట్లు పోతనగారి ప్రథమ స్కంధంలోని తొలిపద్యం, అవతారికలోని షష్ఠ్యంతాలూ శ్రీకృష్ణాంకితంగా ఉన్నాయి. ప్రథమ స్కంధం చివరి నుంచి పద్యాలు శ్రీరామాంకితంగా ఉన్నాయి. ఈ పంచమ స్కంధం వ్రాతప్రతులు పెక్కింటిలో ఆశ్వాసాదిపద్యం శ్రీకృష్ణపరం గానూ, కొన్నింటిలో మాత్రం శ్రీరామపరం గానూ ఉన్నది. శ్రీరామపరంగా ఉన్న ఆ పద్యంలోని విశేషణాలు కొంత ప్రాథమికంగానూ, ఆ రచన కొంత కృతకంగానూ కనుపించటంవల్ల గంగనార్యుడు తన వంతు భాగవతభాగాన్ని శ్రీకృష్ణాంకితం చేశాడనే పూర్వముద్రణల పరిష్కర్తలు నిర్ణయించారు.

శ్రీకర! కరుణాసాగర!
ప్రాకటలక్ష్మీకళత్ర! భవ్యచరిత్రా!
లోకాతీతగుణాశ్రయ!
గోకులవిస్తార! నందగోపకుమారా! (5-1-1)

ఇది పంచమ స్కంధంలోని మొదటి ఆశ్వాసంలోని తొలిపద్యం. సలక్షణంగా ఉన్నది. దీని స్థానంలో –

శ్రీసీతానయనోత్పల!
శ్రీసతిసహజన్మ! త్రిదశసేవిత! యాశా
వాసప్రకాశ! జయ భా
షాసురపతిహరణ! రామచంద్రనృపాలా!

అని కొన్ని కొన్ని వ్రాతప్రతులలోని పద్యం. ఎవరో పద్యరచనలో అకృతకృత్యులైన సామాన్యుల కూటరచనమని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. దీనిని ప్రమాణంగా స్వీకరించటం కంటె గంగనామాత్యుడు తన పంచమ స్కంధాన్ని శ్రీకృష్ణాంకితం చేశాడనే భావించటం మేలు.

ద్వితీయాశ్వాసం చివరను –

జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత! ని
ర్మలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభభూషణాంగ! యు
జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ! శ్రీ
నిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా! (5-2-163)

శ్రీతరుణీహృదయస్థిత!
పాతకహర! సర్వలోకపావన! భువనా
తీత! గుణాశ్రయ! యతివి
ఖ్యాతసురార్చితపదాబ్జ! కంసవిదారీ! (5-2-164)

దండితారిసమూహ! భక్తినిధాన! దానవిహార! మా
ర్తాండమండలమధ్యసంస్థిత! తత్త్వరూప! గదాసికో
దండసుదర్శనాంక! సుధాకరార్కసునేత్ర! భూ
మండలోద్ధర! ణార్తపోషణ! మత్తదైత్యనివారణా! (5-2-165)

అన్న పద్యాలున్నాయి. ఇవి శ్రీకృష్ణాంకితాలు. వీటిలో మొదటి పద్యం కొన్ని వ్రాతప్రతులలో –

జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత! ని
ర్మలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభభూషణాంగ! యు
జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ! శ్రీ
నిలయ! నిశాచరేంద్రఘననీరదమారుత! రాఘవేశ్వరా!

అన్న రూపంతోనూ, చివరి పద్యం –

దండితారిసమూహ! భక్తినిధాన! దానవిహార! మా
ర్తాండవంశసుధాబ్ధిపూరసుధామయూఖ! గదాసికో
దండసుదర్శనాంక! సుధాకరార్కసునేత్ర! భూ
మండలేశ! నతార్తిపోషణ! మత్తదైత్యనివారణా!

అన్న మార్పుతోనూ శ్రీరామాంకితంగా ఉన్నాయి. రెండవ పద్యం ఏ మార్పూ లేకుండా శ్రీకృష్ణస్తుతిపరకంగానే ఉన్నది. ఎందువల్లనో శ్రీకృష్ణాంకితంగా ఉన్న పద్యాలూ, శ్రీరామాంకితంగా ఉన్న పద్యాలూ రెండూ సంతృప్తికరంగా లేవు. ఉన్నంతలో ఏదో ఒక అర్థం చెప్పుకొని సరిపెట్టుకొనవలసినట్లే ఉన్నాయి కాని, మహాకవిరచితాలుగా కనబడవు. “ఉ,జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ!” అన్నప్పుడు ఉజ్జ్వల = ప్రకాశమానమైన, తులసీ = తులసి మాల యొక్క, కురంగమద = కస్తూరీమృగమదము యొక్క, వాసన = వాసనము (సురభీకరణము, గుబాళింపు) చేత, వాసిత = పరిమళిస్తున్న, దివ్య = మనోహరమైన, దేహ = శరీరము గల స్వామీ అని అర్థం చెప్పుకోవాలి. మొదటి పద్యంలో “జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత!” అన్న తర్వాత, వెంటనే ఆ రెండవ పద్యంలో పునఃకథితంగా “అతివిఖ్యాతసురార్చితపదాబ్జ!” అనటం సముచితంగా లేదు. శ్రీకృష్ణార్థంలో “శ్రీనిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా!” అన్నదాని కంటె శ్రీరామాంకితంగా ఉన్నప్పటి “శ్రీనిలయ! నిశాచరేంద్రఘననీరదమారుత! రాఘవేశ్వరా!” అన్న దళమే కొంత భావశుద్ధితో సమంజసంగా అనిపిస్తుంది. శ్రీకృష్ణాంకితంగా శ్రీ = లక్ష్మీదేవికి, నిలయ = ఆవాసమైన, శరీర = తనువు గలవాడా, కృష్ణ = శ్రీకృష్ణా, ధరణీధర = భూదేవిని వక్షఃస్థలమున ధరించిన స్వామీ అని విడదీయటమూ, ఆ సమస్తభిన్నమైన రూపచిత్రమూ సరిగా లేవు. అంతకంటె, శ్రీనిలయ = శ్రీదేవీస్వరూపిణి అయిన సీతాదేవికి ఆవాసస్థానమవైన ప్రభూ, నిశాచరేంద్ర = రాక్షసరాజు లనెడి, ఘననీరద = దట్టంగా కమ్ముకొన్న మబ్బులకు, మారుత = తూలగొట్టే వాయుదేవుడ వైనవాడా అని శ్రీరామపరంగా అర్థం చెప్పుకోవటం సులభం. రెండింటిలో ఏ పాఠాన్ని తీసుకొందామన్నా ఆ వెంటనే ఉన్న (5-2-164) పద్యంలోని “శ్రీతరుణీహృదయస్థిత” అన్న సంబుద్ధి కొంత చర్చనీయం. ఇందాక శ్రీదేవికి ఆవాసమైన అన్నాడు కాబట్టి, ఇప్పుడు శ్రీదేవి హృదయంలో నెలకొన్నవాడు (ఆమె తన శరీరమందు, తాను ఆమె హృదయమునందు ఉన్న దంపతులు వారు) అని భావించాలి. “పాతకహర! సర్వలోకపావన!” అన్నదీ సరిగా లేదు. ఈ పంచమ స్కంధంలో వివిధపాపాలను చేసినవారికి భోగస్థానములైన వివిధనరకాల విపులవర్ణన ఉన్నది కాబట్టీ, శ్రీమన్నారాయణుని నామసంకీర్తనం సర్వపాపాలను హరింపజేస్తుందన్న ప్రస్తావం ఉన్నది కాబట్టీ “పాతకహర!” అన్న శ్రీకృష్ణసంబోధన సార్థకం గానే ఉన్నది కాని, ఆ వెంటనే సర్వలోకాలను పవిత్రీకరించేవాడా అర్థంలో “సర్వలోకపావన!” అన్న పునరుక్తి ఏ మాత్రం సమంజసంగా లేదు. పైగా మొదటి ఆశ్వాసం మొదటి పద్యంలోని “లోకాతీత! గుణాశ్రయ!” అన్నదే ఇందులో “భువనాతీత! గుణాశ్రయ!” అని పునరావృత్తమయింది. వ్రాతప్రతులను మళ్ళీ ఒకసారి తైపారువేసి పాఠాలన్నింటిని సమీకరించి సరిచూస్తే కాని సరైన పాఠమేదో, గంగనామాత్యుని రచన ఏదో తెలియరాని అస్తవ్యస్తపరిస్థితి నెలకొని ఉన్నది. పోతనగారి వలె ఆశ్వాసాదిని శ్రీకృష్ణాంకితం గానూ, ఆశ్వాసాంతంలో శ్రీరామాంకితం గానూ సరిచేయాలని తొలిరోజులలోనే ఎవరైనా ప్రయత్నించారేమో! అనుకొనవలసి వస్తున్నది. ప్రస్తుతస్థిత్యనుసారం అర్థావగతిని బట్టి బొప్పరాజు గంగనామాత్యుని పంచమ స్కంధం శ్రీకృష్ణాంకితమని అనుకోవటమే మేలు.
-----------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment