Wednesday, November 14, 2018

త్రిశంకు లోకం


త్రిశంకు లోకం



సాహితీమిత్రులారా!


“మూడ్రోజులు పోయిన తర్వాత మళ్ళా వస్తే కుట్లు విప్పేస్తాను. దెబ్బ మాని పోతుంది. మచ్చ కూడా మిగలక పోవచ్చు. మరేమీ పరవా లేదు.”

ఆడ పిల్ల కదా మచ్చ పడితే బాధ పడుతుందేమోనని సముదాయించే ధోరణిలో ఊరడింపు మాటలు చెప్పేడు డాక్టర్‌ పరాంకుశం.

“పెద్ద దెబ్బ తగిలిందేమిటోయ్‌ మచ్చా గిచ్చా అంటున్నావు. ముఖం మీద కానీ తగిలిందా?” పక్క గదిలోంచి రామేశం గారి గొంతుక వినిపించింది.

“ముఖం మీద కాదండి. ముంజేతి మీద. ఆరు కుట్లు పడ్డాయండి. రొటీన్‌ ఇంజరీ కేసేనండి” అంటూ బోర విరుచుకుని ఊపిరి పీల్చేడు పరాంకుశం, అదేదో బ్రహ్మవిద్య చేసినవాడిలా.

పరాంకుశం ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో చదువు పూర్తి చేసి ఆ ఊళ్ళో కొత్తగా ప్రేక్టీసు పెట్టిన రోజులవి. చూడ్డానికి బొత్తిగా కుర్రాడిలా కనిపించేవాడు. పుస్తక పరిజ్ఞానం బాగానే ఉంది కానీ అనుభవంలో ఇంకా చెయ్యి తిరగలేదు. అప్పటికే ఊళ్ళో అరడజను మంది డాక్టర్లు ఉన్నారేమో, పోటీలో నెగ్గుకు రావాలంటే క్లినిక్‌ ని మంచి స్థావరంలో పెట్టాలి. లేదా అనుభవం ఉన్న వైద్యుడి దగ్గర కొద్ది కాలం శిష్యరికం చేసి ఆ ప్రేక్టీసుకి తను వారసుడుగా నిలవాలి.

“ప్రేక్టీసు నిలదొక్కుకునే వరకు మీ ఇంటి ముందు వాటాలో ఉంటే కొంచెం సదుపాయం గానూ ఉంటుంది, సర్దుబాటుగానూ ఉంటుంది” అని ప్రాధేయపడ్డాడు పరాంకుశం.

“…”

“మీరొక్కరూ ఉంటున్నారు. ఇల్లంతా ఖాళీగానే ఉంది కదా. మీకు చేదోడు వాదోడుగా ఉంటాను. ఆలోచించండి.”

ఇచ్చకపు మాటలకి గభీమని లొంగే తత్వం కాదు రామేశం గారిది. అందుకని ఏ సమాధానమూ ఇవ్వలేదు.

“మీ దగ్గరగా ఉంటే వైద్యంలో మెళుకువలు కూడ నేర్చుకోవచ్చని అనుకుంటున్నాడండి. పైగా చూడబోతే మీ దృష్టి మందగిస్తోంది. ఉండనియ్యండి. మనిషి సహాయం ఉంటుంది” అని పక్క నున్న ఆప్తమిత్రుడు గోపాలం ప్రోత్సహిస్తూ ఒక సిఫారుసు చేసేసరికి రామేశం గారు మౌనం తోనే అర్థాంగీకారం చూపించేరు. అప్పటినుండి పరాంకుశం మీదా, అతని ప్రేక్టీసు మీదా చెరొక కన్నూ పారేసి చూస్తూ ఉంటున్నారు రామేశం.

“దెబ్బ ఎలా తగిలిందేమిటమ్మా. ఏదీ ఇలా వచ్చి ఒక సారి నాక్కూడా చూపించు,” అంటూ పేషెంటుని తన వైపు ఒక సారి రమ్మని రామేశం గారు కేకేసేరు. వచ్చిన పేషెంట్లని అందరినీ ఆయన చూడరు. అప్పుడప్పుడు ఒకరిని ఎంపిక చేసి పిలుస్తారు. మంచీ చెడ్డా ఒక సారి మాట్లాడి పంపేస్తూ ఉంటారు.

“ముళ్ళ కంచె గీసుకుందండి” అంటూ మడిచిన ముంజేయి పైకెత్తి చూపించింది.

ఆమె వయస్సు ఇరవై ఉండొచ్చు. ముఖంలో వర్చస్సు లేదు. లోతైన బావిలో కదలిక లేని నీళ్ళలా జడ స్థితిలో  ఉన్న ముఖ కవళిక. ఆరోహణ, అవరోహణ లేని ఏకస్వరపు మాట తీరు. ఎవరివో పరిచయస్తుల పోలికలు ముఖంలో కనిపించేయి కానీ ఇదమిద్ధంగా ఎవరూ స్ఫురణకి రాలేదు. తన జీవితంలో ఎంతమందిని చూసేడో ఆయన!

“ఇది ముళ్ళ గీకుడు కాదమ్మా. గాటు లోతుగా పడి ఉండకపోతే ఆరు కుట్లు పడవలసిన అవసరం ఏమిటి వచ్చింది? నిజంగా ఏమిటి జరిగిందో చెప్పమ్మా.”

రామేశం గారు ఈ ప్రశ్న అడుగుతూన్నప్పుడు ఆయన గొంతుకలో అభిమానం, బుజ్జగింపు ధ్వనించేయి కానీ అభియోగం కాని, గద్దింపు కాని ధ్వనించ లేదు. కొత్త మళుపు తిరుగుతూన్న కథ ఏమిటో చూద్దామని పరాంకుశం పక్క గదిలోంచి వచ్చేడు.

కుడి మోచేతి వెనక భాగంలో మొదలయి అంగుళం నర మేర ఆరు కుట్లనీ పరిశీలిస్తూ, మడచి ఉన్న పేషెంటు ముంజేతిని తన చేతులోకి తీసుకుని రామేశం గారు ఆ మడతబందు కీలుని ముందుకు చాచేరు. మణికట్టుకి కొంచెం కిందుగా బాగా మానిపోయిన మచ్చ మరొకటి కనిపించింది, అయన కంటికి. అది కూడా దరిదాపు రెండంగుళాల పొడుగు ఉంది. మణికట్టు వరకూ వెళ్ళిన ఆయన కళ్ళు ఆమె చేతి వేళ్ళమీద పడ్డాయి. ఆమె వేళ్ళని తన చేతులోకి తీసుకుని పళ్ళతో కొరకబడి గార రంగుతో చూడ్డానికి చాలా అనారోగ్యంగా కనబడుతూన్న ఆ గోళ్ళని నిమురుతూ…

“ఏమోయ్‌ పరాంకుశం! ఏమిటోయ్‌ నీ రోగనిర్ణయం?”

“ఇన్‌ ఫెక్‌ షన్‌ అయుంటుందంటారా?”

“ఇప్పుడు అడగవలసిన తరువాత ప్రశ్న ఏమిటోయ్‌”

రామేశం గారి రెండవ ప్రశ్నతో రోగనిర్ణయం ఇన్‌ ఫెక్‌ షన్‌ కాదని పరాంకుశం గ్రహింపుకి వచ్చేసింది. తర్వాత అడగవలసిన ప్రశ్న ఏమిటో తెలియక బుర్ర అడ్డుగా ఆడించేసేడు.

“ఏమమ్మా, నీది కుడి చేతి వాటమా? ఎడం చేతి వాటమా?”

ఆ అమ్మాయి ఇదమిద్ధంగా ఏ సమాధానమూ ఇవ్వకుండా భుజాలు ఎగరేసింది.

“అమ్మా నీది కుడి చేతి వాటం కదూ?” మళ్ళా అడిగేరు.

“…”

“ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో తెలుసా?” అని రామేశం పరాంకుశాన్ని అడిగేరు.

రామేశం గారి ప్రశ్న లోని అంతరార్ధం అర్ధం కాక, “మీరే చెప్పండి” అని తప్పించుకున్నాడు పరాంకుశం.

“ఏమమ్మా ఆ పైట చెంగు కొంచెం పక్కకి తప్పించి ఆ ఎడం చెయ్యి కూడా ఒక సారి చూపించు.”

పరాంకుశం నిర్విణ్ణుడై కళ్ళప్పగించి ఆమె చూపించిన చేతిని చూస్తూ అలా ఉండిపోయేడు.

ఆ చేతి నిండా గీతలు గీసినట్టు దెబ్బలు మానిన మచ్చలే. ఒకటి కాదు. ఒక రకం కాదు. అంగుళం పొడుగున్నవి. రెండంగుళాల పొడుగున్నవి. కుట్లు పడ్డ మచ్చలు. వాటంతట అవే మానిన మచ్చలు. నిలువుగా. అడ్డుగా!

“ఒక్క మనిషికి ఇన్ని దెబ్బలా? ఎలా తగిలేయి? ఎందుకు తగిలేయి?” అప్రయత్నంగా పరాంకుశం నోట్లోంచి వస్తూన్న ప్రశ్నల వర్షాన్ని ఆపడానికా అన్నట్లు రామేశం మధ్యలో కలుగజేసుకున్నారు.

“పరాంకుశం! అకర్మక క్రియ కాదోయ్‌ వాడవలసినది. సకర్మక క్రియ.”

ఈ వ్యాకరణపు సవరింపు వినేసరికి పరాంకుశం ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయింది. కుడి ఎడమల తారతమ్యం ఇప్పుడు తెలిసింది. తన ప్రశ్నలో వ్యాకరణాన్ని సవరించి, “ఎవరు కొట్టేరు? ఎందుకు కొట్టేరు అని అడగాలంటారా, లేక ఆత్మనేపదాన్ని వాడి ఎందుకు కొట్టుకున్నావు? ఎలా కొట్టుకున్నావు? అని అడగమంటారా?” అని పరాంకుశం సమ ఉజ్జీలో సమాధానం  చెప్పి తను తెలుగు పండితుడి కొడుకునే అని నిరూపించుకున్నాడు.

“మనకి వ్యాకరణాలతో తగవులాట ఎందుకు లెద్దూ! అమ్మాయిని రెండు రోజులపాటు “అబ్సర్వేషన్‌” లో ఉంచి చూడ్డం మంచిదనిపిస్తోంది. అమ్మా నీ పేరేమిటమ్మా?”

“కామాక్షి”

“కామాక్షిని ఆఫీసు లోకి  తీసుకువెళ్ళి పేరు, చిరునామా, కావలసినవాళ్ళ పేరు, చిరునామా, వగైరా విశేషాలన్నీ నమోదు చేసి రెండు రోజులు “అబ్సర్వేషన్‌” లో ఉంచండి” అని పరాంకుశం చిన్న హుకుం ఒకటి జారీ చేసి రామేశం గారి గదిలోకి వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

“ఇది “బోర్డర్‌ లైన్‌ పెరసనాలిటి డిసార్డర్‌” అని నా అనుమానం” అన్నారు రామేశం.

“బోర్డర్‌ లైన్‌ పెరసనాలిటి డిసార్డర్‌” అన్న పేరు వినగానే తను మెడికల్‌ కాలేజీలో రుక్కు పట్టేసిన పాఠాలు జ్ఞాపకం వచ్చేసేయి పరాంకుశానికి. ఇహ ఉండబట్ట లేక “ఇవన్నీ తనంతట తాను తగిలించుకున్న దెబ్బలేనేమో. అడిగి వస్తానుండండి,” అని పరాంకుశం లేవబోయాడు.

“కూర్చోవోయ్‌ పరాంకుశం. అడగవలసిన తొందర ఏమీ లేదు. అడుగుదాంలే. అడిగినా పిల్ల నిజం చెబుతుందని నమ్మకం ఏదీ? అబ్సర్వేషన్‌ లో పెడుతున్నాము కదా. ఈ “బోర్డర్‌ లైన్‌ సిండ్రోమ్‌” తో బాధ పడే వాళ్ళ నిఘంటువులో “నేను”, “తాను”, “నా అంతట నేను”, “తనంతట తాను”, “కావాలని” మొదలైన మాటలు, భావాలు ఉండవు. వీళ్ళకి “తనపర” వ్యత్యాసం తెలియదు. వీళ్ళ శరీరానికీ ఆత్మకీ మధ్య ఉండే లంకె దరిదాపుగా తెగిపోయినట్లే. కనుక తమని తామే కొట్టుకుంటున్నారో, మరొకరు వాళ్ళని కొడుతున్నారో తెలుసుకునే విచక్షణ జ్ఞానం వీరికి ఉండదు. వాళ్ళ అస్థిత్వం అంతా ఎవరిదీ కాని త్రిశంకు లోకం. ఇంగ్లీషులో చెప్పాలంటే, “దె ఆర్‌ ఇన్‌ నో మేన్‌ స్‌ లేండ్‌.””

“మా ఎల్లోపతీ పరిభాషలో చెప్పాలంటే ఈ రకం త్రిశంకు లోకం లో ఉన్న వ్యక్తులు రెండీంటికీ చెడ్డ రేవళ్ళ లాంటి వాళ్ళు. అటు ఆలోచనా కేంద్రాలు రోగగ్రస్తమైనప్పుడు వచ్చే “స్కిజోఫెర్నియా” వంటి “కాగ్నిటివ్‌ డిసార్డర్స్‌” లక్షణాలని ఒక పక్కా, ఇటు మనస్థితికి సంబంధించిన “డిప్రెషన్‌” లక్షణాలని ఒక పక్కా రకరకాల పాళ్ళల్లో ప్రదర్శిస్తూ ఉంటారని వైద్య సిద్ధాంతం ఉండడం ఉందండి.”

“సిద్ధాంతం అన్నావు కనుక ఏదో మాటవరసకి చెబుతున్నాను. సిద్ధాంతాలూ నిర్వచనాలూ అక్షరాలా పాటిస్తే మనందరిలో కూడా ఏదో ఒక రకం “పెరసనాలిటీ డిసార్డర్‌” కొద్దో గొప్పో కనిపిస్తూనే ఉంటుంది. చాదస్తం ఒక రకం వ్యక్తిత్వ దోషం. దీన్ని ఇంగ్లీషులో “కంపల్సివ్‌ పెరసనాలిటీ డిసార్డర్‌” అంటారు. అహంభావం ఒక రకమైన “నార్సిసిజం”. మరొకళ్ళని గభీమని నమ్మలేకపోవడం, గభీమని క్షమించ లేకపోవడం, ఊరికే తప్పులు పట్టడం “పెరనోయా” లక్షణాలు. ఇవి శ్రుతి మించకుండా, మరొకరికి హాని చెయ్యకుండా ఉన్నంత సేపూ చికిత్సలూ అభిచర్యలూ అక్కర లేదు.

“అందుకని ఎవరి శరీరాలని వాళ్ళు కత్తితో కోసుకుని హాని చేసుకునే వాళ్ళంతా ఈ మానసిక వ్యధలతో కృంగి కూలిపోతున్నారని అనుకోడానికీ వీలు లేదు. తలనొప్పి మీద అమృతాంజనం ఎలా పనిచేస్తుందో నేను నీకు చెప్పక్కరలేదు, పరాంకుశం. తలనొప్పి బాధని కప్పెడుతూ ఈ లేపనం మరొక రకం చిరు బాధని కలుగజేస్తుంది. కత్తితో కోసుకోవడం కూడా అలాంటిదే. ఎన్నో విధాల సవ్యంగా వుండి సజావుగా జీవితాలు సాగిస్తూన్న వాళ్ళు కూడా ఉద్వేగాత్మకమైన మనోకల్లోలాలని ఎదుర్కొన్నప్పుడు కోత వల్ల కారే రక్తాన్ని చూసి, కోత వల్ల పుట్టే నొప్పిని భరించి అసలు సంక్షోభాన్ని వెనక్కి తోసేసి ఉపశమనం పొందుతూ ఉంటారు.”

“నేను మాత్రం ఇటువంటి కేసుని ఎప్పుడూ చూడలేదండి”

“తొందర పడకోయ్‌ ఇప్పుడు చూస్తున్నావు కదా. అయినా మన దేశంలో ఇటువంటి కేసులు, పూర్వపు రోజుల్లో, డాక్టర్ల వరకూ వచ్చేవి కావు. దృష్టి దోషం అనో, చెడుపు అనో, చిల్లంగి అనో, దయ్యం అనో, పూనకం అనో రకరకాల పేర్లు పెట్టి నాటు వైద్యాలు చేస్తామంటారు కాని వైద్యుడి దగ్గరకు వెళ్ళరు.”

“వెళ్ళితే డబ్బు ఖర్చు అయిపోతుందని ఒక బెంగ. మనవాళ్ళకి అన్ని ఉచితంగా కావాలంటారు. గవర్నమెంటు ఆసుపత్రులలో ఉచితంగానే రంగునీళ్ళు పోస్తారు. అవి పని చేసి చావవు. రోగం ముదురుతుంది. అప్పుడు మనదగ్గరకి వస్తారు. రోగాలని మొక్కగా ఉన్నప్పుడు ఒంచాలి గాని మానైతే ఒంగవు.” కొత్తగా ప్రేక్టిసు పెట్టిన పరాంకుశం తన సాధక బాధకాలని చెప్పుకున్నాడు.

“అందుకనే వైద్యుడు రోగిని చూసేటప్పుడు డబ్బు ప్రసక్తి రాకూడదు. డబ్బుతో నిమిత్తం లేకుండా వైద్యం జరిగిపోవాలి. డబ్బు అదే వస్తుంది.”

“మరి నాలాంటి వాడి గతి ఏమిటి కావాలండి. బోలెడంత డబ్బు గుమ్మరించి చదువుకున్నాను.”

“చూడవోయ్‌. నేను ఈ వూళ్ళో నలభై ఏళ్ళ బట్టి హొమియోపతీ వైద్యం చేస్తున్నాను. ఎప్పుడు ఎవ్వరినీ ఒక్క చిల్లి గవ్వ ఇమ్మని అడగలేదు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చేరు. ఇవ్వని వాళ్ళు ఇవ్వ లేదు. నిజానికి ఉన్న వాళ్ళల్లోనే మందు పుచ్చుకుని ఉడాయించిన వాళ్ళు ఎక్కువ. లేని వాళ్ళే తృణమో పణమో ఎప్పటికప్పుడు నా చేతిలో పెట్టే వారు. నేను వైద్యం చేసి గొప్పవాణ్ణి అవలేదు. కాని నాకీ ఊళ్ళో ఉన్న పరపతి ఎంతో తెలుసా?” సగర్వంగా ప్రశ్నించేరు, రామేశం.

“మీరు మెడికల్‌ కాలేజీకి వెళ్ళి బోలెడు డబ్బు ఖర్చు పెట్టలేదు కనుక మీరు “ఫ్రీ” గా వైద్యం చేసినా మీకు గిట్టుబాటు అయింది. మరి…”

“అలాగే! నీ కోణం నుండే చూద్దాం. మన ఊళ్ళో సుబ్బారాయుడు డాక్టరు గారిని తెలుసు కదా. నీలాగే ఆయన కూడా ఆంధ్రా మెడికల్‌ కాలేజీ లో గోల్డ్‌ మెడలిస్టు. ఇప్పుడంటే ఆయన పేరూ, ప్రతిష్టా ఈ జిల్లా అంటా పాకి పోయింది కాని, ఆయన కొత్తగా ఈ ఊళ్ళో ప్రేక్టీసు పెట్టినప్పుడు నీ లాగే చిన్న కుర్రాడు. ఆయన దమ్మిడీ అడిగి పుచ్చుకునే వాడు కాదు. ఎవరింటికి పిలచినా కాదనకుండా సొంత జటకాలో వెళ్ళే వాడు. జట్కా కూలికని జట్కా వాడే అర్ధ రూపాయి పుచ్చుకునేవాడు. ఎన్ని ఇళ్ళకి వెళితే అన్ని అర్ధలు. తనకి ఇవ్వ వలసిన ఫీజు ఇంత అని ఎప్పుడూ అడిగేవాడు కాదు. అయినా ఆయన ప్రేక్టీసు అవధులు లేకుండా పెరిగింది. ఆయన బంగారంతో మేడలు కట్టెయ్యలేదు కాని, బాగానే గణించేడు.”

“మీరు మీ వైద్యం అంతా స్వయంకృషితో నేర్చుకున్నదే అంటున్నారు కదా. ఈ మానసిక వైద్యంలో ఉన్న మెళుకువలు మీకింత బాగా ఎలా తెలిసాయండీ?”

“చూడు పరాంకుశం! హోమియోపతీ వైద్యం నిజానికి మానసిక వైద్యమోయ్‌ మేము మానసిక లక్షణాలకి బాగా ప్రాధాన్యత ఇస్తాం.

“అంతే కాకుండా “వైద్యులు విద్యార్ధిగా నాలుగేళ్ళల్లో నేర్చుకున్న దాని కంటె “హౌస్‌ సర్జన్‌ గా ఒక ఏడాదిలో ఎక్కువ నేర్చుకుంటారు” అనే నుడికారం ఎప్పుడు వినలేదుటోయ్‌ వైద్యానికి కావలసినది అనుభవం. పుస్తక పరిజ్ఞానం ఉండాలి. కాదనను. కాని అనుభవం నేర్పిన పాఠాలని మరచిపోలేము. అందుకనే ఎమ్‌ బి. బి. యస్‌ లు అరడజను మంది ఈ ఊళ్ళో బల్ల కట్టు వేల్లాడదీసినా నా హోమియోపతీ ప్రేక్టీసుకి ఇంతవరకు ఢోకా రాలేదు.”

“అయితే మీరనేది ఇటువంటి కేస్‌ మీ అనుభవంలో ఇంతకు పూర్వం తగిలిందంటారు?”

“దరిదాపు పాతిక ఏళ్ళ కిందటి సంగతి. స్మృతిపథం లోంచి చెరిగిపోతూన్న సంఘటన. చాలమట్టుకు వివరాలు మరచిపోయాను. కాని కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రం రేఖామాత్రంగా మనస్సులో ఉండిపోయాయి. ఆ కేసుకీ ఈ కేసుకీ కొట్టొచ్చినట్టు పోలికలు ఉన్నాయి. కాలం మార్పుతో మనం వాడే భాష మారింది. చదువులతో మన దృక్పథం మారుతోంది. దానితో రోగనిర్ణయం మారినట్టు మనకి అనిపిస్తుంది.”

“ఆ కథ చెబుతారా?”

“ఇది కట్టుకథ కాదోయ్‌ నిజంగా జరిగిన సంఘటన. చెబుతాను విను.

“రామశాస్త్రి గారి కోడలికి దయ్యం పట్టింది.” అని మొదలుపెట్టేరు.

“రామశాస్త్రి గారు ఎవరండోయ్‌” అంటూ పక్క గదిలోని నర్సు బిరబిరా వచ్చింది.

“నేను పిఠాపురంలో పని చేస్తూన్నప్పుడు రామశాస్త్రి గారి పక్కింట్లోనే మేము అద్దెకు ఉండే వాళ్ళం.”

పిఠాపురం పేరు వినగానే వీధి అరుగు మీద కూర్చుని లెక్కలు చూసుకుంటూన్న గోపాలం కూడా లోపలికి వచ్చేసేడు, కథ వినడానికి. ఆయన పిఠాపురం మనిషి.

“రామశాస్త్రి గారు బాగా పేరున్న సంస్కృత పండితుడు. ఆస్తిపరుడు. పిఠాపురంలో బాగా పలుకుబడి ఉన్న పెద్ద. కోడలికి దయ్యం పట్టిందని నలుగురి నోటా పడితే పరువు పోదూ? కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. అలాగే దయ్యం పట్టిందన్న విషయం దాగదని శాస్త్రి గారు స్వానుభవం మీద తెలుసుకునే లోగా నన్ను సంప్రదించడానికి మన ఊరు వచ్చేరు.”

“దయ్యం పడితే మీరేమి చెయ్య గలరండీ, భూతవైద్యుడి దగ్గరకి వెళ్ళాలి కానీ?” అన్నాడు గోపాలం.

“హోమియోపతీ మందు ఇచ్చి కుదర్చగలరా అని అడగడానికి వచ్చేరు.”

“దయ్యం పడితే హోమియోపతీ మందేమిటండీ, ఎక్కడా వినలేదు. మీరు వెటకారం చేస్తున్నారు” అని నర్సు నవ్వాపుకోలేక మూతిని కొంగుతో కప్పుకొంది.

“అది దయ్యమని మొదట్లో ఆయనా అనుకోలేదు. ఉత్తరోత్తర్యా ఊళ్ళో ఉన్న పిల్లా పెద్దా, చిన్నా చితకా కలసి అది దయ్యమే అని తీర్మానించేరు.”

“అప్పుడు మీరు ఆ దయ్యానికి అదే ఆ దయ్యం పట్టిన కోడలికి మందిచ్చి కుదిర్చేరు?”

నర్సు మాటలలోని వ్యంగ్యాన్ని గమనించి, “మందివ్వడం ఇచ్చేనమ్మా. దాని వల్లే కుదిరిందో మరో మంత్రం వల్ల కుదిరిందో నాకు తెలియదు. కాని ఇది నిజంగా జరిగిన విషయమమ్మా, నర్సమ్మా! ఇది ఆ రోజులలో నలుగురికీ తెలిసిన విషయమే. ఆఖరికి కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడ ఆయన రాసిన బాణావతి అన్న పుస్తకంలో ఈ విషయం క్లుప్తంగా ప్రస్తావించేరు.”

ఈ దెబ్బతో నలుగురూ నమ్మకంగా వింటున్నారని నిర్ధారణ చేసుకుని, రామేశం గారు మళ్ళా అందుకున్నారు.

“నేను మందు ఇవ్వడం అంటే ఇచ్చేను గాని…తమాషా ఏమిటంటే ఆ దయ్యాన్ని ఒదలగొట్టుకునే ఉపాయం ఆ దయ్యమే చెప్పింది…..

“తన చేత కాశీ యాత్ర చేయించి, గంగలో స్నానం చేయించి, గయలో పిండప్రదానం చేయించి, ఇంకా ఏవేవో కర్మ కాండలు చేయిస్తే తను పార్వతిని ఒదిలి వెళ్ళిపోతానని పార్వతి నోటి ద్వారానే చెప్పింది, ఆ దయ్యం.

“నేనిచ్చిన మందు పని చేస్తుందని నాకు అంటే నమ్మకం ఉంది కానీ, కాశీ వెళ్ళి దయ్యాన్ని ఒదలగొట్టుకోవాలన్న కోరిక వారి ఇంటిల్లిపాదికీ ఉందని నేను గమనించి, కాశీ వెళ్ళినందువల్ల ఒరిగే నష్టమేముంటుందిలే అని “సరే అలాగే వెళ్ళి రండి” అన్నాను.

“రామశాస్త్రి గారు భార్య కామాక్ష్మమ్మతో పాటు కొడుకునీ కోడలు పార్వతినీ వెంటపెట్టుకుని కాశీ యాత్ర చేసుకుని తిరిగి వచ్చేరు.”

వింటూన్న వాళ్ళకి కొంచెం నమ్మకం కలిగినట్టుంది. మధ్య మధ్యలో చొప్పదంటు ప్రశ్నలు వెయ్యకుండా కుదురుగా కూర్చుని వింటున్నారు. రామేశం గారు మళ్ళా అందుకున్నారు.

“కాశీకి వెళ్ళిన బృందంలో నాలుగు శాల్తీలు, ఒక దయ్యం ఉంటే, తిరిగొచ్చిన బృందంలో ఐదు శాల్తీలు  ఉన్నాయి. దయ్యాన్నైతే సునాయాసంగానే ఒదలగొట్టుకున్నారు కానీ, ఆ దయ్యాన్ని ఒదలగొట్టించిన భూతవైద్యుణ్ణి ఒదలగొట్టించుకోలేకపోయారు, రామశాస్త్రి గారు.  తను పార్వతి పక్కన లేకపోతే విడచి పెట్టిన దయ్యం మళ్ళా పట్టుకునే ప్రమాదం నికరంగా ఉందని అతని పేరు మరచి పోయాను, కనుక కాశీశాస్త్రి అందాం కాశీశాస్త్రి అందరికీ నచ్చచెప్పి ఒప్పించేడు.  అప్పటినుండీ మనిషి మీద వేసిన కన్ను తియ్యకుండా, పగలనక, రాత్రనక, అహర్నిశలూ పారూని కనిపెట్టుకునే ఉన్నాడు కాశీ!

“ఏతా వాతా పార్వతి జబ్బు నయమయిందనీ, పార్వతి ఒక పిల్లని కూడా కన్నదనీ, దరిమిలా కాశీశాస్త్రి కాశీ ఉడాయించేశేడని కర్ణాకర్ణిగా విన్నాను.

“కాశీశాస్త్రి రామశాస్త్రి గారింట తిష్ట వేసిన కొత్తలో పార్వతి అన్నదమ్ముడికి ఒక విచిత్రమైన రుగ్మత వచ్చింది. రామశాస్త్రి గారికీ నాకూ ఉన్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని నన్ను సంప్రదించడానికి తొండంగి నుండి తుని వచ్చేడు.

“అతని పేరు మరచిపోయాను కానీ మనిషి మంచి స్పురద్రూపీ, ధృఢకాయుడూ. చెక్కి నిలబెట్టిన శిలావిగ్రహం లాంటికాయవాటు శరీరం. శారీరకంగా కాని, మానసికంగా కాని ఏమీ లోపాలు  ఉన్నవాడిలా కనపడ లేదు. ఏదో రాతకోతల వ్యవహారాలు మాట్లాడడానికి వచ్చి ఉంటాడనుకున్నాను. కాదు, మందు పుచ్చుకోడానికి వచ్చేనన్నాడు. సావకాశంగా కూర్చుని లక్షణాలు చెప్పమని అడిగేను.

“ఒకటే ఒక లక్షణం అన్నాడు. తను పరాగ్గా ఉన్నప్పుడు ఎవరో వెనకనుంచి వచ్చి కొట్టి పారిపోతూ ఉంటారుట.”

“ఎవరో కొడుతూ ఉంటే పోలీసుల దగ్గరకి వెళ్ళి ఫిర్యాదు చెయ్యాలి కాని వైద్యుడు మందేమి ఇస్తాడు?” అని గోపాలం తన అభిప్రాయం వ్యక్తం చేసేరు.

“నేనూ అలాగే అనుకున్నాను. కాని నా అనుభవంలో ఇలాంటి కథనాలు ఎన్నో విన్నాను. అందుకని మౌనంగా అతను చెప్పే విషయం ఓపిగ్గా వినడమే ఉత్తమ మార్గం అని అనిపించింది.

“అప్పుడు చెప్పేడు. ఆ కొడుతూన్న వ్యక్తి ఎవరో. ఒక ఆడ మనిషిట. ముఖం చూడడానికి ఎప్పుడూ అవకాశం చిక్కలేదుట. ఎవరా అని చూడడానికి ముఖం తిప్పేసరికి అక్కడ ఎవరూ కనిపించేవారు కాదుట.”

“ముఖం చూడకుండా ఆడ మనిషి కొడుతున్నాదని ఎలా చెప్పేడండీ?”

“గలగలమంటూ గాజులు తొడిగిన ముంజేయి, ఆ చేతిలో కత్తి స్పష్టంగా కనిపించేవిట!”

వింటూన్న అందరి ముఖాల్లోను కత్తి వేస్తే రక్తపు చుక్క లేదు.

“ఇలా చెపుతూ ఆ ఆసామీ ఉత్తరీయం తొలగించి తన ఎడమ చేతిని ముందుకు చాపి చూపించేడు. ఆ చేతి నిండా గాట్లు. కత్తి దెబ్బలకి పడ్డ గాట్లు!

“ఎవరో అతనిని కత్తితో కొట్టేరన్నది నిర్వివాదాంశం. ప్రత్యక్షంగా నిదర్శనం కనిపిస్తోంది. ఆడ మనిషి గాజుల చేతులు కనిపించేయని చెబుతున్నాడు. పక్కకి వచ్చి కొట్టిన మనిషి అకస్మాత్తుగా ఎక్కడికి పోతుంది?” గోపాలం చిన్న విశ్లేషణ చేసేడు.

“ఆడ మనిషి గాజుల చేతులు అనగానే నా అనుమానం మరొక పక్కకి దారి తీసింది, గోపాలం. అందుకని, ఆ దెబ్బలు ఇంట్లో ఉండగా తగిలేయా, నిద్రలో కాని తగిలేయా మొదలైన విషయాలు కొన్ని వాకబు చేసేను. ఇంట్లోనే మరొకరెవరైనా  కొడుతున్నారేమోనని నా అనుమానం. వాళ్ళ జాడ తెలిసికూడా కప్పెడుతున్నాడేమో.

“రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, పెరట్లో పనులు చేసుకుంటూన్నపుడు, అలా ఒక వేళ అంటూ లేదుట. ఎప్పుడో ఒకప్పుడు ఆవిడ వచ్చి కొట్టి వెళ్ళిపోతూ ఉండేదని చెప్పేడు.”

“పార్వతిని పట్టి వేధించిన దయ్యం ఇప్పుడు ఈ అన్నదమ్ముణ్ణి పట్టుకుందేమో” అంది నర్సు.

“దయ్యాన్ని అదుపు ఆజ్ఞలలో పెట్టగల కాశీశాస్త్రి ప్రభావం ఏదైనా ఉందేమోనని నా అనుమానం” అని గోపాలం తన సిద్ధాంతాన్ని వెలిబుచ్చేడు.

“మీమీ పరిధులలో మీరిద్దరూ ఒక విధంగా రైటే. శాస్తుర్లు గారింట దయ్యం సంగతి ఊరూ వాడా అంతా తెలుసేమో ఇది మరొక దయ్యం అయుంటుందని సరిపెట్టుకున్నారు చాలమంది. మరొక కాశీ యాత్ర చేస్తే దీనిని కూడా ఒదుల్చుకో వచ్చని కొందరు ఉచితంగా సలహా కూడా ఇచ్చేరు.

“మరొక కాశీ యాత్ర చెయ్యడం అస్సలు మంచి పని కాదనీ, శాస్త్రిగారింటికి వచ్చిన దయ్యాలన్నిటిచేతా కాశీ యాత్ర చేయించి విముక్తి ప్రసాదిస్తారన్న వార్త నాలుగు మూలలకీ పాకిందంటే దేశంలో ఉన్న దయ్యాలన్నీ వీరి ముంగిట్లోనో, చూరులోనో వేల్లాడుతూ ఉంటాయని రాజకీయాలలో ప్రవేశం ఉన్న వాళ్ళు ఆరాట పడ్డారు.

“కాశీ యాత్ర ప్రస్తావన వచ్చినప్పుడల్లా కాశీశాస్త్రి గుర్తుకు వస్తున్నాడనీ, ఆ ఆషాడభూతి పేరు  తన ఎదురుగా చెప్పవద్దనీ కోపంతో ఒంటి కాలిమీద లేచిపోయేవాడుట ఈ పార్వతి అన్నదమ్ముడు.

“ఈ కథనం అంతా విన్న తర్వాత ఇది మానసిక రోగమో, దయ్యమో అప్పట్లో పూర్తిగా అర్ధం కాలేదు. అదృష్టవశాత్తూ హోమియోపతీలో రోగానికో పేరు, లక్షణానికో మందు అంటూ ఏమీ లేదు. మేము మనిషి మానసిక ప్రవృత్తినీ, మనిషి నైజాన్ని చూసి మందు ఇస్తాము. అంటే “వుయ్‌  ట్రీట్‌ ద పేషెంట్‌ నాట్‌ ద డిసీజ్‌ కనుక అప్పుడు నాకు తోచిన మందు ఇచ్చి పంపించేను.”

“అయితే ఇప్పుడు అర్థం అయిందంటారా?” గోపాలం అడిగేడు.

“ఇప్పుడు ఈ కామాక్షిని చూసిన తరువాత పార్వతి అన్నదమ్ముడికి పట్టిన దయ్యమేమిటో మరికొంచెం బాగా అర్ధం అవుతోంది.”

“ఈ రకం మానసికమైన జబ్బులు కొన్ని సంసారాలలో వంశానుగతంగా వస్తూ ఉంటాయిట. ఒకరి వంశంలో ఒక సారి వచ్చిందంటే, అదే వంశంలో మళ్ళా జబ్బు లక్షణాలు కనిపించడానికి సావకాశాలు ఎక్కువట. మిగిలిన సంసారాలతో పోల్చి చూస్తే ఒకసారి కనిపించిన కుటుంబాలలో ఈ జబ్బు ఐదింతలు ఎక్కువగా వస్తుందిట. ” ఏదో పుస్తకం పట్టుకొచ్చి అందులో చూసి చదువుతున్నాడు పరాంకుశం. “ఏదీ కామాక్షిని మరొకసారి ఇటు రమ్మని పిలుద్దామా? ఆ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలు కనుక్కుందికి మరొక రెండు ప్రశ్నలు అడిగి చూడొచ్చు.”

కామాక్షి మళ్ళా గదిలోకి వచ్చింది. రామేశం గారు చూపించిన కుర్చీలో కూర్చుంది. కామాక్షి ముఖంలో తను ఎప్పుడో ఎక్కడో చూసిన మనిషి పోలిక ఇప్పుడు మరికొంచెం స్ఫుటంగా కనిపించసాగింది.

” అమ్మా మీది ఏ ఊరు?”

“పిఠాపురం.”

“మీ ఇంటిపేరు ఏమిటమ్మా?”

చెప్పింది.

ఈ సమాధానంతో రామేశం గారి దవడలో పట్టు తప్పిపోయి కిందికి వేలాడిపోయింది.

“పిఠాపురంలో రామశాస్త్రిగారనే పండితుడొకాయన ఉండేవారు. ఆయన ఎవరో తెలుసా?”

“ఆయన మా తాతగారు.”

“అయితే నువ్వు పార్వతి కూతురివా?”

“అవును.”

“మీ మావయ్య ఒకాయన ఉండేవాడు కదూ?”

“మా మావయ్యే మీకు చూపించుకోమని పంపేడు.”

అమ్మాయి మోచేతిమీది కుట్లని మరోసారి పరీక్షిస్తూ, “నువ్వు ఇక్కడ రెండు రోజులు మా పర్యవేక్షణలో ఉండమ్మా. పరాంకుశం గారు స్పెషలిస్టుకి చూపించే ప్రయత్నాలు చేస్తారు” అంటూ కుర్చీ లోంచి లేచి, “పరాంకుశం, కుట్లు బాగా వేసేవయ్యా. గుడ్‌ వర్క్‌” అని పరాంకుశాన్ని ఒకసారి పొగిడి పెరటి భాగంలో ఉన్న పడక గదికి దారి తీసేరు.
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment