Sunday, November 25, 2018

స్వామి డి. ఆనంద్‌ మహరాజ్‌ కథ


స్వామి డి. ఆనంద్‌ మహరాజ్‌ కథ
సాహితీమిత్రులారా!

నేనూ, చంటిగాడూ, వాడూ ఒకటో క్లాసు నుంచి ఎస్సెల్సీ దాకా కలిసి చదువుకున్నాం. ఒక్క తెలుగు మేస్టారి క్లాసులో తప్ప మిగిలిన క్లాసులన్నిట్లోనూ ఆఖరి బెంచీలోనే కూచునేవాళ్ళం. ఎందుకంటే ముందు బెంచీలన్నీ ఆడపిల్లలకీ, వాళ్ళ వెనకాల బెంచీలన్నీ బాగా మార్కులు తెచ్చుకునే బడుద్ధాయి వెధవలకి కేటాయించే వారు. అదే మమ్మల్ని అక్కడ కూచో పెడితే ఇంకేమన్నా ఉందా, ఆ అరాళకుంతలల కుంతలాలు కత్తిరించో, బెంచీకి ముడిపెట్టో ఆనందించే వాళ్ళం కదా!

మేం క్లాసులో అలా ఆనందించటం ఎందుకో ఎవరికీ ఇష్టం ఉండేది కాదు. తెలుగు మేస్టారి క్లాసులో మాత్రం అందరం తలో చోటా కూచునే వాళ్ళం, పేపర్లతో విమానాలు చేసి బోర్డు మీదకి విసరడం మాకున్న మాంచి కాంపిటీషన్‌ ఆట గనక.

ఆఖరి బెంచీలో కూచుని నేనూ, చంటిగాడూ చుక్కలాటలాడుకుంటూ ఉంటే, వాడు మటుకు డిటెక్టివ్‌ నవలలు చదువుకుంటూ నోట్సు రాసుకుంటూ ఉండేవాడు. పీపాలో శవం, చీరవిడిచిన వనిత, భయంకర రక్తపిశాచి మొదలైన పుస్తకాలు వాడికి వేదపారాయణాలు. డిటెక్టివ్‌ వాలి, పరశురాం, ముఖ్యంగా డిటెక్టివ్‌ యుగంధర్‌, అతని అసిస్టెంట్‌ రాజు వాడికి హీరోలు. అప్పటినుంచీ వాడు యుగంధర్‌ అయితే, నేనెలాగూ రాజునే కాబట్టి వాడికి నేనే అసిస్టెంట్‌ని సలహాలకి, సంప్రదింపులకీనూ.

కొమ్మూరి సాంబశివరావు, టెంపోరావు వాడి అభిమాన రచయితలు. అదిగో ఆ రోజుల్లోనే మొదలైంది శివరాం గాడి పేర్ల వేట. అసలు ఈ టెంపోరావు ఎవరూ, ఆడా, మగా? ఇంటిపేరు ఏమిటీ, అసలు పేరు ఏమిటీ .. అది కనిపెట్టడానికి డిటెక్టివ్‌ పని మొదలుపెట్టి, ఆ విధంగా తనదంటూ ఒక ప్రత్యేకమైన ప్రవృత్తి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రవృత్తినే అమెరికా వచ్చాక అసలు వృత్తిగా మార్చుకున్నాడు. ఇంటిపేరు.కామ్‌, వంశవృక్షం.కామ్‌, అసలుఎవడీవెధవ.కామ్‌ వగైరా కంపెనీలకి వాడు అధిపతి. అమెరికాలో ఉన్న తెలుగువారి కూపీ తీయడం, అంటే, మర్యాదగా చెప్పాలంటే వాళ్ళ గురించి రిసెర్చ్‌ చెయ్యడం ఆ కంపెనీల వ్యాపారం. ముందు అమెరికనైజ్డ్‌ తెలుగు పేర్లని ఒక పెద్ద డేటాబేస్‌లో పెట్టాడు. అప్పుడప్పుడూ కొన్ని స్పెషల్‌ టెక్నిక్స్‌ కూడా వాడుతూంటాడు. ఉదాహరణకి, ఒకాయన పేరు జాన్‌. పి. శాస్త్రి అని ఉందనుకోండి. అర్జంటుగా అతన్ని తెల్లారగట్ల నాలుగ్గంటలకి ఫోన్‌ చేసి, “ఏం గురూ ఎలా ఉన్నావు, ఏమిటి సంగతులు?” అని గాఢనిద్రలో టకటకా శుద్ధతెలుగులో గబగబా మాట్లాడేయడం. అవతల ఆ ఆర్టిఫిషియల్‌ అమెరికన్‌ గాడు అసలైన తెలుగువాడైతే, అసంకల్పిత ప్రతీకార చర్యగా వెంఠనే తెలుగులో మాట్లాడేస్తాడు. కాకపోతే వాడి మాతృభాషలోనో, ఇంగ్లీషులోనో అడ్డమైన తిట్లూ తిడతాడు. జాన్‌ పి. శాస్త్రి తెలుగువాడే అని తెలిశాక మిగిలిన టెక్నిక్స్‌ వాడి, ఆ మహానుభావుడి పూర్తిపేరు గానగార్దభుల పరమేశ్వర శాస్త్రి అని కనిపెట్టి కస్టమర్‌ని సంతోషపెట్టి వ్యాపారం వృద్ధి చేసుకుంటాడు శివరాం.

ఇంతవరకూ వాడికొచ్చిన కేసులన్నీ పెద్ద ఇబ్బంది లేనివే. ఆస్టిన్‌లో ఒకబ్బాయి అర్జంటుగా ఇండియా వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్ళిచూపులు చూసేసి, వరించేసి తన వీసా హెచ్‌1 నుంచి గ్రీన్‌ కార్డుకి మారిపోయేలోపుగా పెళ్ళాడేసి, వేంఠనే అమెరికా తీసుకెళ్ళిపోవాలని తహతహ లాడిపోతున్నా డనుకోండి. ఆ వీరుడి అమెరికనైజ్డ్‌ పేరుని తెలుగులోకి తర్జుమా చేసి, ఆ పెళ్ళిసంబంధం మంచిదా, కాదా? ఆ రాజ్‌ ఎఫ్‌. రావు అసలు పేరు, కులం, గోత్రం ఏమిటీ, ఎయిడ్స్‌ వగైరా ఆధునిక రోగాలేమైనా ఉన్నట్టు దాఖలా ఉందా? నిజంగానే కంప్యూటర్‌ ఉద్యోగం చేస్తున్నాడా, లేక కంపు కొట్టే చైనీస్‌ రెస్టారెంట్‌లో గిన్నెలు తళతళా మెరిపించే డిష్‌వాషర్‌ ఉద్యోగం చేస్తున్నాడా? వగైరా ఆంతరంగిక విషయాలు కూపీ .. అదే రిసెర్చ్‌ చేయమని ఆవదాల వలస నుంచి ఆవేదనతో అభ్యర్థించిన ఓ ఆడపిల్ల తండ్రి సవాలక్ష ప్రశ్నలకి ఆట్టే అవస్థ లేకుండా ఇన్‌ఫర్‌మేషన్‌ సంపాయించి, డబ్బు సంపాయించే టెక్నాలజీ శివరాంకి కరతలామలకం. ఎవరిదైనా సరే, ఆంధ్రా జాతకం అంటే గ్రహాలూ, నక్షత్రాలూ, వక్రవీక్షణాలూ మొదలైన విశేషాలు, అంతకంటే ముఖ్యమైన అమెరికా జాతకం అంటే ఆ పెళ్ళికొడుకువెధవ డబ్బు సంపాయించగలడా, లేడా, లేదా పెళ్ళికూతురుగారు డిస్కో శాంతి టైపా లేక సతీ సావిత్రి టైపా అని కూలంకషంగా డిటెక్టివ్‌ పని చేయగలిగిన టెక్నాలజీ డెవలప్‌ చేసిన శివరాం గాడికి ఛాలెంజ్‌ అనిపించిన ఓ కేసు ఇన్నాళ్ళకి తగిలింది.

నిజానికి ఇదసలు కేసు కాదు. అంటే, వాణ్ణి ఎవరూ ఈ విషయం ఇన్వెస్టిగేట్‌ చెయ్యమని అడగలేదు. అమెరికాలో చాలా మంది తెలుగు ఫోక్స్‌ లాగా శివరాం కూడా కావల్సిన దాని కంటె ఎక్కువ, అంటే తడిపి మోపెడు డబ్బు సంపాయించగానే ఎందుకైనా మంచిదని గుళ్ళూ, గోపురాలకి చందాలివ్వడం, చెలామణీ అవడానికి చాలా మనీ అవసరమైన ట్రస్టీలు అవడం, సంతోషిమా వ్రతాలూ, సత్యనారాయణ వ్రతాలూ పుట్టినరోజు పండగల్లాగా, రిపబ్లిక్‌ డే సెలిబ్రేషన్‌ లాగా పదిమందినీ పిలిచి, పెర్సనల్‌గా కొలుచుకోవలసిన దేవుణ్ణి పబ్లిక్‌గా తన్మయత్వంతో తపస్సు చేయడాలూ లాటి కార్యక్రమాలు మొదలుపెట్టాడు. వీటిలో ఒక ముఖ్యమైన భాగం తనకి అన్ని విధాలా తగిన స్వామీజీని ఒకర్ని ఎన్నుకోవడం. ఆ వేటలో తగిలిన కేసు ఇది.

ఈ స్వామీజీ గారి ఫోటో ఎప్పుడు చూసినా అన్ని పేపర్లలోనూ పడుతూ ఉంటుంది. ఆయన ఏ ఊళ్ళో ఎన్నాళ్ళు ఎవరింట్లో ఉంటారు, ఉపన్యాసాలు ఎప్పుడు, వగైరా విశేషాలు రెగ్యులర్‌గా అందరికీ ఆయన కిచెన్‌ కేబినెట్‌లో ఉన్న భక్తులు తెలియపరుస్తూ ఉంటారు ఇండియాలో చెవిటివారికి శుభవార్త తెలిపే నాటు వైద్యుల వారు ప్రతీ ఊళ్ళోనూ వారానికి ఒక హోటల్లో దిగే పద్ధతిలో. ఎటొచ్చీ ఈ స్వామీజీ లాటి పేరు శివరాంగాడు ఎక్కడా వినలేదు.

సాధారణంగా అందరికీ ఏదో స్వామి తారక రామానంద అనో, అమితాబ్‌ బచ్చనానంద అనో సింపుల్‌గా ఉంటాయి పేర్లు. కానీ, ఈయన పేరు మటుకు స్వామి డి. ఆనంద్‌ మహరాజ్‌. మామూలు మనుషులు జాన్‌ పి. శాస్త్రి అనో, రాజ్‌ ఎఫ్‌. రావు అనో మార్చుకోవడం మామూలే గాని ఇలా అసలు సిసలు కాషాయ వస్త్రధారి పేరు అమెరికనైజ్డ్‌ చేసుకుని, పేరు మధ్యలో ఇంగ్లీష్‌ అక్షరం తగిలించుకోవడం శివరాం గాడికి చాలా కుతూహలం కలిగించింది. అంతకంటే ముఖ్యంగా అసలు పేర్లు కనిపెట్టే వాడి ప్రావీణ్యానికి చాలా ప్రొఫెషనల్‌ ఛాలెంజ్‌ అనిపించింది. అందుకే వాడు ఈ స్వామి గారి అసలు పేరు ఏమిటి, ఆ పేరులో ఉన్న డి అనే అక్షర రహస్యం ఏమిటి? అని అపరాధ పరిశోధన మొదలు పెట్టాడు.

షిక్చాగోలో జరిగిన సభలో భగవద్గీత మీద ఎనభై వేల ఆరు వందల తొంభై రెండో తెలుగు వ్యాఖ్యానాన్ని శ్రీ స్వామి డి. ఆనంద్‌ గారు ఆవిష్కరించడానికి ఒప్పుకున్నారు. శివరాం కేవలం ఆరు వందల డాలర్ల డొనేషన్‌కి మొదటి సీట్లలో ప్రత్యేకమైన కుర్చీ సంపాయించాడు. అలాటి సీట్లలో ఉన్న వారిని ఆశీర్వదిస్తూ స్వామిగారు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. శివరాం ఆ సభకోసం పెట్టుకున్న తెల్లటి భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి మీసాలు సవరించుకుంటూ సభానంతరం స్వామీజీ గారిని చాలా కాజువల్‌గా, భక్తితో, “మీపేరులో ఉన్న డి అనే ఇంగ్లీష్‌ అక్షరం అర్థం ఏమిటి స్వామీ?” అని డైరెక్ట్‌గా అడిగేశాడు, ఎంతయినా కాషాయాలు కట్టుకున్న వాళ్ళు కఠోరమైన అబద్ధాలు చెప్పరు కదా అనే ధైర్యంతో.

స్వామిగారి చిరుమందహాసం కొంచెం మందగించింది ఆ ప్రశ్న విని. పక్కనే ఉండి ఆయన కంటే కొంచెం చిన్న కమండలం పట్టుకున్న రెండో నెంబరు స్వామి శివరాంకేసి తీవ్రంగా చూస్తుండగా మందగించిన మందహాసాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చేసుకుని, “అదే నాయనా ఎంతో విలువైన  మంత్రాక్షరం, అందులోనే ఉన్నది పెన్నిధి” అని శివరాంకి తత్వబోధన చేసి భక్తుల చేత మడిగా, విడివిడిగా కాళ్ళకి దణ్ణం పెట్టించుకోడానికి తరలి వెళ్ళారు.

………………………………..
అది, లాస్‌ ఏంజెలస్‌ లోనో, న్యూజెర్సీ లోనో ఇలా ఇందుగలదందు లేదనే ఓ డాక్టర్‌ గారి భవంతి. ఎప్పుడూ ఎవరో ఒక స్వామీజీని వాళ్ళింట్లో ఉంచుకుని, వాళ్ళ డబ్బూ, దస్కం కిందికి పోకుండా పైపైకి మాత్రమే పోడానికి ప్రైవేటు వ్రతాలూ, పబ్లిక్‌ ప్రసంగాలూ ఏర్పాటు చేసి ఆ డాక్టర్‌ గారు చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అమెరికాలో దస్కం అంటే నాజ్‌డాక్‌ విలువ పెరగడం అని అర్థం. ఆ మాటకొస్తే అమెరికాలో డాక్టర్లలో వితరణశీలం ముచ్చటగా మూడు రకాలు. మొదటిది భర్త డాక్టరు, భార్య కాదు. వీళ్ళు పరవాలేదు. సదరు డాక్టరు భర్త సంపాయిస్తూ ఉంటాడు. ఆ సంపాదన కంటిన్యూ అవడానికీ, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ దావాలు పడకుండా ఉండడానికీ ఆ సదరు భార్య గారు స్వామీజీలకి కొంచెం సేవ, దేవుడికి డైరెక్ట్‌గా కొంచెం సేవ, మరీ బావుండదేమోనని తెలుగు సంఘాలకీ, కలాపోసనకీ కొంచెం విరాళాలు ఇస్తూ ఉంటారు. రెండో రకం భార్య డాక్టరూ, భర్త ఏదైతేనేం లెండి … ఆయన ఉద్యోగం అంత ఇంపార్టెంటు కాదు … అతని ముఖ్యమైన డ్యూటీ మటుకు, ఆవిడ సంపాయించిన డబ్బుని అతితెలివిగా ఇన్‌వెస్ట్‌ చేసి అవతల పారేసి, గూబ వాయించుకుంటూ, ఆవిడని గౌరవంగా చూసుకుంటూ ఉంటాడం. డొనేషన్‌ మాట వచ్చినప్పుడు మాత్రం భార్యసలహా పాటిస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా పరవాలేదనే చెప్పాలి. ఇక మూడో రకం వాళ్ళు భార్యాభర్తలిద్దరూ డాక్టర్లు. వీళ్ళు అందరికన్నా నాసిరకం. ఎందుకంటే ఇద్దరిలో ఎవరు గొప్ప డాక్టరో తేల్చుకోలేక, ఎవరికి డొనేషన్‌ ఇచ్చే అధారిటీ ఉందో తెలియక, ఎవ్వరికీ, ఏ సంఘానికీ దొరక్కుండా “కనుక్కుని చెప్తాను, మళ్ళీ పిలవగలరా” లాటి ఒరిజినల్‌ డైలాగులు చెప్పి తప్పించుకు తిరుగుతారు. అప్పుడప్పుడు పేపర్లలో కలర్‌ ఫోటోలు పడే అవకాశాలు ఉన్నప్పుడూ, చిన్నాపెద్దా మహాసభాలలో స్టేజీ మీద నుంచోబెట్టి జేజేలు కొడతారని తెలిసినప్పుడూ స్వామీజీలకీ, గుళ్ళూ గోపురాలకీ విరాళాలు ఇవ్వడం వీళ్ళ స్పెషాలిటీ. పాతికా పరకా డొనేషన్‌ అడిగే వాళ్ళతో మాట్లాడడం, ఇవ్వడం దర్జాకి లోటు. కొండొకొచో నా ఈ ఒరిజినల్‌ థీరీ ఆఫ్‌ డొనేషన్స్‌ డాక్టర్స్‌ అందరికీ వర్తించదు సుమా.

ఈసారి శివరాం గాడు మళ్ళీ స్వామి డి. ఆనంద్‌ మహరాజ్‌ గారి డిగంబర రహస్యం కనుక్కుందామని శ్రీమతి మరియు శ్రీ డాక్టరు గారి ఇంట్లో సత్సంగ్‌కి అంటే ఏమిటో నాకూ వాడికీ కూడా సరిగ్గా తెలీదు లెండి కేటరింగ్‌ చేస్తున్న పావని రెస్టారెంట్‌ వారి సర్వీసులో పులుసు, కూరలూ వేడి చేసే పనివాడి పాత్ర ధరించాడు. ఎంతో అమాయకంగా స్వామి గారిని “మీపేరులో తమాషాగా డి. అనే ఇంగ్లీషు అక్షరం ఉందే, అంటే ఏమిటో?” అని అడిగాడు. వెంఠనే ఆయన రెండో శిష్యుడి కమండలం కంటే ఇంకా చిన్న కమండలధారి అయిన మూడో శిష్యుడు కన్నెర్ర చేసి కర్ర ఎత్తబోతుండగా, స్వామి గారు మానికా లుయిన్‌స్కీ కేసులో చిక్కిపోయిన బిల్‌ క్లింటన్‌ మొహంలా పెట్టి “అందులోనే ఉన్నది నాయనా పెన్నిధి. అదే పరమావధి” అన్నారు అప్పుచేసి పప్పుకూడు సినిమాలో అదే దెబ్బ అదే మనిషి అన్న డైలాగు టైపులో పనివాడి అవతారంలో ఉన్న శివరాం కేసి అనుమానంగా చూస్తూ.

ఎన్టీఆర్‌ సినిమాలో మారువేషాలు వేసినట్టు ఇలా మరికొన్ని ఇన్‌వెస్టిగేటివ్‌ అవతారాలు ఎత్తి, విసుగెత్తి పోయాడు శివరాం. నేను మొన్న మా ఆవిడ ఆజ్ఞానుసారం మా అబ్బాయిని కరాటే క్లాసులో డ్రాప్‌ చేద్దామని కారులో వెడుతూండగా, సెల్‌ ఫోన్‌ మోగింది. “గురూ, అర్జంటుగా ఈ కేసులో నీ ఇన్‌టర్‌ప్రిటేషన్‌ కావాలి”. అది డిటెక్టివ్‌ యుగంధర్‌ గాడి గొంతుక. చెప్పానుగా, నేను వాడి అసిస్టెంట్‌ రాజునని. అప్పుడప్పుడు వాడు ఇలా నన్ను పిలవడం మామూలే. “అదే గురూ, ఈ స్వామి డి. ఆనంద్‌ మహరాజ్‌ సంగతి” అని వాడు పడుతున్న తంటాలు వివరించాడు. మొదటి క్లూ ఆయన ఎప్పుడూ అమెరికాలోనే ఉంటాడు. “అవున్లే ఈ మధ్య చాలా మంది కాషాయ వస్త్రధారుల్ని అమెరికా జనాభా లెక్కల్లో చేర్చేశారుగా”. రెండో క్లూ, ఆయన ఎప్పుడూ డాక్టర్లు, బిజినెస్‌ వాళ్ళు లాటి డబ్బున్న పుణ్యాత్ముల ఇళ్ళలోనే ఉంటూ మిగిలిన వాళ్ళకి పాపవిమోచన జరిగే మార్గాలు సెలవిస్తూ ఉంటారు. ఇదివినగానే నాక్కొంచెం బుర్ర వెలగడం మొదలయ్యింది.
“ఒరేయ్‌, ఆయన ఎప్పుడైనా పరిత్రాణాయ సాధూణాం శ్లోకం చదువుతాడా?” అనడిగాను.
“నీకెలా తెలిసింది గురూ?” ఆశ్చర్యపోయాడు శివరాం.
“అది సరే, ఈయనకి, ఒక పబ్లిసిటీ బ్రొషూర్‌ ఉందా?” అనడిగాను. నా బుర్ర కొంచెం జోరుగా పనిచెయ్యడం మొదలెట్టింది.
“లేకేం, పంచరంగుల బ్రొషూర్‌ ఉంది”
“అందులో స్వర్గీయ స్వరణ్‌ సింగ్‌ తోటీ, మెగాస్టార్‌ చిరంజీవి తోటీ, ఒకళ్ళో ఇద్దరో చీర కట్టుకున్న దొరసానుల తోటి గాని గుండు గీయించుకున్న వాళ్ళ తోటి గాని ఫోటోలున్నాయా?”
“అరే, కొంపతీసి ఈయన నీకు బాగా తెలుసా?” శివరాం మరోసారి ఆశ్చర్యపోయాడు.
“అవునూ, ఈయనకి ఇండియాలో ఒక అనాధాశ్రమం లేదా వికలాంగుల పాఠశాల లాటివి కూడా ఉన్నాయా?” విజృంభించాను.
“ఓరి బాబోయ్‌, అమ్మ నాయనోయ్‌, నీ వ్యాఖ్యానం చూస్తే నా డిటెక్టివ్‌ పాండిత్యం ఎందుకూ పనికొచ్చేలా లేదు, నా అహం దెబ్బ తింటోంది” వాపోయాడు యుగంధర్‌.
“ఏం లేదు నాయనా, ఇప్పుడు నిన్ను అడిగిన ప్రశ్నలన్నీ, అమెరికాలో స్వామీజీగా చెలామణీ అవ్వడానికి ప్రూవెన్‌ ఫార్మ్యులా. ఒక డజన్‌ అందరికీ తెలిసిన శ్లోకాలూ, మరొక డజన్‌ ఎవరికీ తెలియని స్టాకు శ్లోకాలూ, చిల్లర మంత్రాలూ, నువ్వూ నేనూ సాధారణంగా వెళ్ళని ఒక పల్లెటూళ్ళో ఒక ఆశ్రమం, హృదయవిదారకమైన చిన్న పిల్లల విషాదాన్ని ఆదుకుంటున్నట్టుగా ఉన్న సంస్థ, ఇవన్నీ ఆ ఫార్మ్యులాలో భాగాలు.”
“నీ ఎనాలిసిస్‌ బ్రిలియంట్‌గానే ఉంది గానీ, నా అసలు ప్రశ్న, అంటే స్వామీజీ గారి పేరులో ఉన్న ఇంగ్లీషు అక్షరం డి అంటే ఏమిటి అయ్యుంటుంది?” శివరాం ప్రశ్న.

సడెన్‌గా నాకు ఓ ఆలోచన తట్టి “నీకింకా తెలియలేదా యుగంధర్‌ మహాశయా! డి అంటే దౌర్భాగ్యం గురూ,.. లేదా దొంగలు, లేదా దోచుకోడం. అంటే ఇలాటి దొంగస్వాములవారు దేశాన్ని దోచుకోడం నిజంగా మన దౌర్భాగ్యం, ఏమంటావు?” అన్నాను త్రిపురనేని రామస్వామి చౌదరి లేదా శ్రీశ్రీ లాటి నాస్తికుల ధోరణిలో.
“ఆ పోదూ మరీనూ, ఎంతయినా అంత డైరెక్ట్‌గా తన బండారం బయటపెట్టుకునేంత డన్స్‌ ఎవడూ ఉండడు”
“అఫ్‌ కోర్స్‌ నాకూ తెలుసులే. ఇంకేమైనా క్లూస్‌ చెప్పు. నువ్వు డైరెక్ట్‌గా అడిగినప్పుడు స్వామి గారు ఏమంటాడు?” అన్నాను. చెప్పొద్దూ, నాకూ క్యూరియాసిటీ పెరిగిపోతోంది.
“ఒకసారి ఆ పేరులోనే ఉన్నది నాయనా పెన్నిధి అంటాడు, అదే పరమావధి అని మరోసారి అంటాడు, దివ్యానుభూతి అంటాడు, దైవానుగ్రహం అంటాడు. అంతేగాని అసలు సంగతి చెప్పడు. అన్నింటికీ ముందు ఒక నవ్వు, తరవాత ఒక నవ్వు … ఇదీ కార్యక్రమం.” ఇలా తన డిటెక్టివ్‌ సమాచారం అంతా విశదీకరించాడు శివరాం.
“ఏమిటీ ఆ పేరులోనే ఉన్నది పెన్నిధి అన్నాడా?”
“చాలా సార్లు అన్నాడు గురూ”
ఆమాట వినగానే నాబుర్ర ఓ వెలుగు వెలిగింది.
“తెలిసింది తెలిసింది .. అసలు డి అంటే నాకు తెలియదు గాని వ్యుత్పత్తి అర్థం మటుకు ఖచ్చితంగా డయాస్పోరా, డి అనగా డయాస్పోరా” అన్నాను సగర్వంగా.
“డయాస్పోరా ఏమిటి గురూ, కలరా మలేరియా లాగ … ఆ మాటే నేనిప్పటి వరకూ వినలేదు” శివరాం మూడోసారి ఆశ్చర్యపోయాడు.

“అదేలే, ఈ మధ్య అమెరికాలో తెలుగు వాళ్ళకి కొత్త కేకలొచ్చాయి. అందులో ఈ డయాస్పోరా అన్న మాట ఒకటి … అంటే పవిత్ర తెలుగు దేశాన్ని వదిలేసి అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ పూర్వం జ్యూయిష్‌ వాళ్ళలా సెటిల్‌ అయిపోయిన తెలుగు వాళ్ళన్నమాట. అలాగే అమెరికాలో సెటిల్‌ అయిపోయి ఆనందిస్తున్న ఈ స్వామి గారు డయాస్పోరానంద స్వామి గారన్న మాట” అన్నాను.

సడెన్‌గా శివరాం సైలెంట్‌ అయిపోయాడు. అంతకంటే సడన్‌గా “ఆహా, ఆహా” అన్నాడు, గట్టిగా అరుస్తూ… మీకు తెలుసో తెలీదో, ఈ ఆహా అన్న మాట భాషని బట్టి, చెప్పదల్చుకున్న దాన్ని బట్టి, రకరకాలుగా అనవచ్చు. అరవ్వచ్చు. ఇప్పుడు మటుకు వాడు “యురేకా” అనే అర్థం వచ్చే పద్ధతిలో అరిచాడు.
“ఒరేయ్‌, ఏమయిందిరా నీకూ..” నేను కంగారు పడ్డాను.
“యురేకా, యురేకా” ఫోన్‌లో గెంతుతున్నాడు యుగంధర్‌.
“రహస్యం తెలిసిపోయింది మైడియర్‌ వాట్సన్‌” అన్నాడు షెర్లాక్‌ హోమ్స్‌.
“ఏం తెలిసిందిరా నీ పిండాకూడూ..” విసుక్కున్నాను.
“అదేరా మనందరం అమెరికా ఎందుకొచ్చామో, ఆయన కూడా అందుకే వచ్చాడు. ఎటొచ్చీ ఆయన టెక్నిక్‌ వేరు .. అనగా డబ్బు కోసం … అనగా డాలర్‌ కోసం .. డి అనగా డబ్బు .. అనగా డాలర్‌. తరచు ఇక్కడికి వచ్చే స్వాములు డాలరానంద స్వాములు. తను వచ్చిన పని మర్చిపోకుండా ఈ డి. అన్న అక్షరాన్ని పేరులో తగిలించుకున్నాడు మన స్వామీజీ. అమ్మయ్య, ఇప్పటికి ఈ మిస్టరీ సాల్వ్‌ అయింది..” ఊపిరి పీల్చుకున్నాడు శివరాం.

“అది సరే, తన పేరులో  ఈ మహరాజ్‌ ఏమిటీ?” అన్నాను వాడి జనరల్‌ లాజిక్‌ ఒప్పుకుంటూనూ…
“అదీ చాలా సింపుల్‌ గురూ. ఆఫ్టరాల్‌ మన తెలుగు వాళ్ళు సీజన్‌ బట్టి స్వామీజీలని మారుస్తూ ఉంటారు కానీ గుజరాతీ వాళ్ళూ మిగిలిన నార్త్‌ ఇండియన్స్‌ అలాక్కాదు. అంచేత ఎందుకైనా మంచిదని వాళ్ళ గౌరవార్థం మహరాజ్‌ అని పేరుకి ఆఖర్న తగిలించుకున్నారు వారు..” సగర్వంగా వ్యాఖ్యానించాడు శివరాం.
“ఓకే గురూ .. ఉంటాను మరి .. సాములార్ని కొలిచేముందు కాస్త ముందూ వెనకా చూసుకోడం మంచిది. ఉద్ధరించడానికి మనదేశంలోనే కోట్లకొద్దీ జనం ఉన్నప్పుడు, మన ప్రవాసాంధ్రుల మీద ఎందుకో ఇంత అభిమానం … మళ్ళీ మాట్లాడదాం తరవాత” అని సెల్‌ఫోన్‌ ఆఫ్‌ చేస్తుండగా మా సుపుత్రుడు వెనకాల సీటు లోంచి నిద్ర లేచి…
“డాడీ, యు ఆర్‌ సపోజ్‌డ్‌ టు డ్రాప్‌ మి ఎట్‌ మై కరాటే క్లాస్‌, హౌ కం వుయార్‌ హోమ్‌? అమ్మా ఈజ్‌ గోయింగ్‌ టు కిల్‌ యూ” అని ఆశ్చర్యపోతున్నాడు. నేను కూడా డి అయిపోయాను సుమా … అంటే డంగయి పోయానన్నమాట. అపరాధ పరిశోధనలో ఉన్న తమాషాయే అది, ఆ సస్పెన్స్‌లో మిగిలిన ప్రపంచం మర్చిపోతాం. ఇంతకీ మా ఆవిడ నన్నీ అపరాధానికి బతకనిస్తుందో లేదో, అదీ పెద్ద సస్పెన్స్‌.
--------------------------------------------------------
రచన: వంగూరి చిట్టెన్‌ రాజు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment