Tuesday, November 13, 2018

తమాషా దేఖో - 2 (కథ)


తమాషా దేఖో - 2 (కథ)




సాహితీమిత్రులారా!

తమాషాదేఖో రెండవ కథను ఆస్వాదించండి............

(వర్ధమాన హోంబిల్డర్‌ కోటీశ్వర్రావ్‌, అతని బావమరిది కృష్ణ సాగిస్తున్న కస్టమర్ల వేట క్రితం భాగం తరవాయి ఇప్పుడు చదవండి)

(లోపల్నుండి రమణా రావ్‌ గోపాల్‌ వస్తారు)

రవ : ఏంటండీ కోటీస్స్రారు? క్రిష్ణార్జునులు ఇలాగొచ్చీసేరు?

కోటి : (గోపాల్ని చూపించి) అదే వారు రమ్మంటే వొచ్చేఁవండి….

గోపా : (పరధ్యానంగా) రమ్మన్నానా? ఆఁ ఆఁ నాగూ రమ్మందేమో..

నాగే : (లోపల్నుండి వచ్చి కోటేశ్వర్రావుని చూసి నవ్వి) హాఁయ్‌ కోటీ గారూ….

కోటి : (చనువుగా) హాయ్‌ మేడమ్‌ …హౌ ఆర్‌ యూ?

నాగే : We are grrreat! How are yooou? (సోఫాలో కూలబడి తమాషాగా) మేం బాగున్నామండీ…మీరేఁవో బీచ్‌ రోడ్‌ లో మాకు కోటలు కట్టిస్తామన్నారనీ (కళ్ళు అరి చేతుల్తో పెద్దవి చేసి) కళ్ళల్లో వత్తులేసుకుని చూస్తున్నామండీ…

కోటి : యెస్‌ యాస్‌ మేడమ్‌. వియ్‌ హేవ్‌ మెనీ డిఫరెంట్‌ ప్రోపర్టీస్‌…..ఇఫ్‌ యూ సీ ది లేఅవుట్స్‌ ఎండ్‌ మేకే డెసిషన్‌ వియ్‌ విల్‌ గివ్‌ యూ దీ బెస్ట్‌ సైట్‌! సో దట్‌ ఎవిరి బడీ ఫీల్‌ హేపీ…

గోపాల్‌ : (చిరాగ్గా) వాళ్ళని నిలబెట్టి ఏంటీ ఇంటర్వ్యూ? కూర్చోండీ!

నాగే : అయ్యో కూచోండి కూచోండీ..మా బావగారిల్లు మీ ఇల్లే అనుక్కోండి….

( కూర్చుంటారు).

కోటి : థేంక్యూ సార్‌! నాకు మీరు చెప్పాలేటి మేడం…..ఈ వూళ్ళో అందరూ మనకి ఆప్త బంధువుల్లాటి వోళ్ళేనండి…మా రవణా రావు గారయితే మాకు గురువుగారి తోటి సమానం….ఆయనిల్లు మా యిల్లు కాకపోతే మరేటండి…..

రవ : (అనుమానంగా) నా ఇల్లు మీ ఇల్లెలాగయింది? అతను మాయల క్రిష్ణుడూ ఇతను వాళ్ళ బావ మరిదీ….నువ్వు మాట వరసకన్న ముక్కే సాక్ష్యం పెట్టుకుని ఇతను డఫేదార్నీ డవాలా బంట్రోతుల్నీ తెప్పించి ఇల్లు ఖాళీ చేయించీ గలడు…ఇతన్తో జాగర్త…!

కోటి : తమ దయవల్ల మా ఇళ్ళు మాకున్నాయి గానీ ఏటండి బాబూ ఆవిడ్నలా అడలగొట్టెస్తారు? ఉక్కు పిడి మాయావి గారు మీ ఉక్కు మాయల ముందు మేఁవెంతండి…(నాగేశ్వరి, గోపాల్‌ తో) ఇతను మా బావ మరిదండి. సివిలింజినీరు యూనివర్సిటీ ఫస్టు గోల్డు మెడలిష్టు…. ఇతను ప్లాన్‌ రాసేడంటే మీరు మరింక తిరిగి చూసుకో అఖ్ఖల్లేదు….(క్రిష్ణ మోచేత్తో కోటేశ్వరావు డొక్కలో పొడుస్తాడు)…

కోటి : (నెమ్మదిగా) ఉండమ్మా చెప్పనీ… నీ గురించి నేనూ నా గురించి నువ్వూ కాకపోతే ఇంకెవడు కొడతాడు? ఎవల్డబ్బా ఆడు కొట్టుకోడానికైతే మొహమాటం గానీ పరస్పరం తప్పులేదు….అందుకే ఏ వ్యాపారానికైనా ఇద్దరుండాలి! (గట్టిగా) ఏదమ్మ క్రిష్ణా ఆ ప్లాను కాపీలు….

రవ : (కలగ చేసుకుని ప్లాన్‌ కాపీల కట్టలకేసి చూసి) ఏటమ్మా కోటీస్రావ్‌ ఆ లేఅవుట్లన్నీ మీవే? కోటీస్వర్రావు కేటి? వూళ్ళో సగం జాగాలు ఈయనవీ మిగతావి ఈళ్ళ మాఁవ్వీ. (తమాషాగా, రాగంతో) మాటలా కోటలా…..మహమ్మహమ్మాట్లు మాటలు మాట్లు కోటలు కోటలు కోట్లు…….

కోటి : చూడండెక్కడ కావాలో చెప్పండి మరి పన్లో పని మీ తమ్ముడు గారు మరదలు గారి పక్కనే మీకూ కట్టించెస్తాం ఒక్కోట…

రవ : అదుగో చెప్పేనా…(అరిచెయ్యి చాచి చూపించి) అదుగో రాయీ సున్నం ఇవిగో ద్వార గుమ్మాలు…..కోటేస్వర్రావని వూరికే అన్నారా…

కోటి : ఇందులో అతిశయం ఏఁవీ లేదండి…గురుద్వారా దగ్గిర బిస్వాస్‌ గార్నడగండి మేం కట్టించిన డూప్లెక్సుల సంగతి. ఇప్పుడు మీకిలా నవుతాలుగానే వుంటాది కానీ ఒక్క 2000 వరుకూ ఆగండి, ఈ వూళ్ళో ” మా గుమ్మం ముందు నిలబడ్డావూ అద్దె కట్టు! ” అని నిలదీసే రొజులొస్తాయి . అటుసైడు పొద్దుటే లేచి డాబాల మీదకెళితే ఇండస్ట్రీల పొల్యూషనల్లా ఇళ్ళమీదికి ఆకుపచ్చగా ఏసిడ్‌ లాగ దిగుతోంది మీరు అబ్జర్వ్‌ చేసేరో లేదో! ఇంక ఢిల్లీ బోంబే లాగే మనఁవూ ముక్కులకి గుడ్డలు కట్టుకుని రోడ్డుమీద బళ్ళు తియ్యాలి. ఏదో మనవాళ్ళూ అమిరికాలో రైట్‌ రోయల్‌గా అలవాటయిపోయుంటాదీ పొల్యూషనదీ లైక్‌ చెయ్యరనీసి ఇంత లెక్ఖన చెప్పటం గానీ మీరు కాదంటే ఎగరేసుకు పోడానికి విజయవాడ నుండీ హైడ్రాబాడ్‌ నుండీ పార్టీలు రడీగా లేకేటండి?!

నాగే : కోపగించుకోకండీ మా బావగారు నవుతాలు మనిషి..

కోటి : అబ్బే కోపఁవనీసి కాదండి విషయం చెప్పక పోతే తెలీదు చూడండి. మీ బావగారితోటి వ్యవహారాలు మాకు కొత్తేటండి మాతోటి డీలింగు ఆయనక్కొత్తా?! (నాగేశ్వరీ కేసీ గోపాల్‌ కేసీ తిరిగి) ఆయనిగటాలకేట్లెండి గానీ మీరు గనక ప్లాట్స్‌ చూసి ఒక డెసిషన్‌ కొచ్చేరంటే (క్రిష్ణని చూపించి) ఇదుగో మా వోడే ఫ్త్లసాసైన ప్లానేసి కట్టించుతాడు మీకు …. ఇండియా వొచ్చినప్పుడు ఒకళ్ళ ఇంట్లో దిగఖ్ఖల్లేకుండా హేపీగా బీచొడ్డున మీ బంగళా మీ కారూ మీ తోటా ఎంజాయ్‌ చేసుకోవచ్చును…..ఇప్పట్లో నా మాటినీసి కొనుక్కోండి గోల్డ్‌ మైను లాంటి సైటు! ఈ ఛాన్సొదిలీసుకున్నారంటే మీదటికి మీ డాలర్లు కూడా అందుకోలేని గడ్డురోజులొస్తాయి.

నాగే : (సందేహంగా) ఎంతేంటండి?

కోటి : ఇదిగోటండి ఈ కార్నరు బిట్టు….ఈస్ట్‌ ఫేసింగు, ఈశాన్యం పెరిగింది! మీరు పొద్దుట లేచి సముద్రం వేపు చూసుకుంటూ బాలమురళీ క్రిష్ణ గారి పాటలు వింటూ పళ్ళు తోఁవుకోవచ్చు……మీరు క్లాసికల్‌ మ్యూజిక్‌ అంటే లైక్‌ చేస్తారు కదా?! ఇటు సైడు అప్పల పాత్రుడు గారనీసి ఏలూరు కలక్ట్రండి ఇంక రిటారయిపోయొచ్చెస్తారు. ఇటు సైడు రాజేష్‌ బాబు గారు కొనుకుంటారని ఆళ్ళ మనుషుల చేత కబురు పెడితే ఇయర్‌ మార్కు చేసేఁవు…..

రవ : అబ్బో సినిమా వాళ్ళే!

కోటి : కాకపోతే మామూలోళ్ళం తట్టుకోగలఁవేటండి? ఈ లేఅవుట్లంట ఆఫీసర్లూ, అమిరికా వోళ్ళూ తప్పితే సినిమా వోళ్ళూ మేగ్జిమం లైక్‌ చేస్తనారు….

రవ : పాత్రుడా? పాత్రుడంటే…మనవాళ్ళే?

కోటి : దీనికి మన వాళ్ళేటి పైవాళ్ళేటి….డబ్బున్నోడూ డబ్బుల్లేనోడూ అని రెండే! ఇందులో మినిమమ్‌ అయ్యేయెస్‌ కేడర్‌ కెవరూ తక్కువ లేరండి……ఎన్నారైస్‌ కాబట్టి మీకు చూపించడం కాని అలగా కలగా అవకాశఁవే లేదు…. (నాగేశ్వరితో) అసలిక్కడ నా మాటినీసి మీరు టేకప్‌ చేసేరంటే ఇక్కడికొచ్చినా మీకు ఈ డర్టీ ఇండియాలో వున్నట్టుగే ఉండదు. ఇండియాలోనే అమిరికా సృష్టించుకోవచ్చును….. ” మంచి కల్చరూ స్టేండింగూ ఉన్న వాళ్ళకే ఇద్దాం కోటీస్సరారూ ఎవళకి పడితే ఆలకివ్వొద్ద ” ని మా రాజుగారి పంతం మీద మీకు ఆఫర్‌ చెయ్యడఁవండి పార్టీలేక్కాదు!

గోపా : ఎంతో ముందు అది చెప్పరు….

కోటి : అఛ్చా దానికేటుంది….(పోకెట్‌ కేల్‌క్యులేటర్‌ తీసి) తొమ్మిదివందల గజాలు…. సిక్స్‌ లేఖ్సండి….రెండున్నర వైటు…మిగతాది అడ్జిస్మ్టెంట్‌ చేయించమని రాజుగార్నడుగుదాం…ఏదో మీకూ వెసులుబాటుగా ఉండాలి….రిజిష్ట్రేషన్‌ ఇంక్లూడెడ్‌ !

నాగే : (అలోచనగా..డాలర్స్‌ లోకి కన్వర్ట్‌ చేసుకుని, స్థిరంగా) కొనచ్చనుకోండి మాకిదేం పెద్ద…ఇదిగో! ఇప్పుడిలాగే కబుర్లు చెప్పి you will sell us the lot but తీరా మేం వెళ్ళేక who will look after the house?

కోటి : మంచివాళ్ళే! కష్టమర్‌ ఈజ్‌ కింగ్‌ తెలుసండీ! గుమ్చీ లాటి వాచిమేన్ని పెట్టి మేం దెగ్గిరుండి సంరక్షణ చేయిస్తాము. మీరు ఆ పైయేడు మళ్ళీ వొచ్చేనాటికి ఇల్లూ చుట్టూ అరిటి చెట్లూ కొబ్బరి చెట్లూ కుక్కా స్విమ్మింగ్‌ పూల్తోటి సహా రడీ చేయించి అప్పచెప్తాఁవు! (క్రిష్ణతో) మన కార్డూ బ్రోచరూ వారికివ్వు…..(నాగేశ్వరితో) ఇదిగోటండి! వుయార్‌ కోటి భానూ డెవలపర్స్‌, ప్రమోటార్స్‌ ఎండ్‌ బిల్డార్స్‌……సర్వీసంతా ప్రొఫెషనల్‌గా వుంటాది మీకేమ్‌ డవుటక్ఖల్లేదు! సో దట్‌ ఎవిరిబడీ ఫీల్‌ సేటిస్ఫైడ్‌……

నాగే : (పాడుతుంది) కోటి భాను సమ ప్రభా….! (కార్డు చూసి చదువుతుంది)
D. Koteeswara Rao, M. Com., M. A. (Econ.), B. L., M. L. (C. L.).
Koti-Bhanu Developers, Promoters & Builders……. … O my! ఇన్ని డిగ్రీలే?

కోటి : (వినయంగా) డిగ్రీలకేటుందండి తొన్నాడు రాత్రి న్యూస్‌ పేపరు చదివి మర్నాడెల్లి రాస్తే ఉర మరగా ఏభయ్‌ మార్కులొస్తాయి… ఆ పైన కేంపస్‌ లో మీ దయ వల్ల మనకాపాటి గుడ్‌ విల్‌ ఉంది లెండి….

క్రిష్ణ : మా బావగారు ఎగ్జామ్స్‌ కెళ్ళి కట్టలు కట్టలు ఎడిషనల్స్‌ తీస్తారండి….ఏం రాస్తారో! మార్చిలో ఎకనామిక్స్‌ పేపరలాగే!

రవ : స్లిప్పులు పెట్టెస్తారా?

కోటి : మంచివాళ్ళే ఈ పాటి దానికి స్లిప్పులెందుకూ… ఎకనామిక్సు లక్ష్మీ శాస్త్రం స్లిప్పులు పెడితే కళ్ళు పోతాయి! గుండ్రంగా పెద్ద పెద్ద అక్షరాల్తోటి ” కుక్క సచ్చిపోయింది పిల్లి సచ్చిపోయింద ” ని రాసినా ఆ దిద్దే వాళ్ళు పేస్‌ మార్కులేసెస్తారు…అదిప్పుడెందుగ్గాని వెన్‌ డూ యూ వాంటూ సీ ది సైట్‌ మేడమ్‌?

నాగే : మరీ చెట్టెక్కి కూచున్నారు? ఇదుగో… Six lakhs is too much… మీరు సరిగ్గా చెప్తే మా ఫ్రెంద్స్‌ another five families are visiting from the states… మరి చూ…

రవ : (మాటకి అడ్డం పడి, ఆరోపిస్తున్నట్లు) ఇదుగో మేం అన్నదమ్ములం ఒకటే మాటా ఒకటే బాణం…మా మధ్యన డివైడ్‌ ఎండ్‌ రూల్‌ పెట్టకండి……ఇండియా వొస్తే మా ఇంట్లో దిక్కండా వాళ్ళకి వేరే ఇళ్ళూ జాగాలూ ఎందుకూ…..? (క్రిష్ణ తోటి) చూడవయ్యా మీ బావ (కోటితో) ఆర్లక్షలే? అందులో మీకెంతండి? ఓ లక్షేనా…..?

కోటి : ( కొంచెం చికాగ్గా) ఊఁ లక్ష! మీరు చూస్తుండగానే?! నమ్మండి నమ్మక పొండి ఇందులో మాకు పెద్దగా మిగిలేదేం లేదు…..ఏదో ఇదొక సర్వీసు కింద చేస్తున్నాము మా పెట్రోల్‌ డబ్బులు మాకొచ్చెస్తే చాలు బాబూ… నలుగురికిళ్ళు కట్టించి చూపిస్తే అదొక తృప్తి! ఇచ్చెడు వానికి ఇచ్చును దైవం….

రవ : (క్రిష్ణతో) చూడు మీ బావ బీదరుపులు…..

గోపా : (క్రిష్ణని గమనించి పరిశీలనగా) ఇతను మీ బావమరిదా?

కోటి : అవునండి. హీ ఈజ్‌ మై వైఫ్స్‌ బ్రదర్‌ ఎండ్‌ దె ఆర్‌ ఆల్సో అవర్‌ రిలేషన్‌ ఫ్రం మై మదర్స్‌ సైడ్‌ సార్‌

గోపా : నీ పేరేంటన్నావు?

క్రిష్ణ : క్రిష్ణమోహనండి. జే క్రిష్ణ మోహన్‌

నాగే : జే అంటే…

క్రిష్ణ : (మొహమాటంగా) జనమంచి

రవ : జనమంచి వాళ్ళా? కళ్ళేపిల్లి జనమంచా గరీబ్‌ సాయిబ్‌ పేట జనమంచా?

క్రిష్ణ : ఏమోనండి !… (బావకేసి చూస్తాడు)

కోటి : గరీబ్‌ సాయిబ్‌ పేటేనండి. ఎప్పుడో మూడువందలేళ్ళ కిందట జనమంచీ డొక్కమంచీ ముక్కమంచీ ఊరుమంచీ దిబ్బమంచీ ఇలాగ పద్ధెనిమిది కుటుంబాలవాళ్ళు ఎక్కడ్నుంచో ఈ గరీబ్‌ సాయిబ్‌ పేటొచ్చి సెటిల్మెంటయిపోయేరుట. ఇప్పుడు మీరు అమిరికాలో సెటిలైపోయినట్టు….

రవ : ఇంటి పేరుకి తగినట్టూ మంచి కుర్రాళ్ళా వున్నావయ్యా! మీ బావెనక తిరిగితే ఆ మంచి కాస్తా ఊష్‌ కాకీ మని ఎగిరిపోతుంది జనంలో మిగిలిపోతావు జాగర్తా మరి!

కోటి : మంచితనానికీ మర్యాదకీ మీకాడే ట్రైనింగిప్పించాలి బాబూ! మొహం చూసి చెప్పీడానికి మీకాడేం ప్రియ దర్శిని ఉన్నాదేటండి? అలా ముద్రుళ్ళాగున్నాడు గాని జనాల్లోకొచ్చినప్పుడేనండి కుర్రాడి మంచి. అతన్ని నేను చెడగొట్టేదేటి మీలాటి నాలాటి పెద్ద మనుషులు నలుగురికి నేర్పుతాడు మోళీలు? పీటలు దిగి రానీ చూపిస్తాను నా పిర పిరలు అన్నాదిట. మావోడి మంచీ చెడ్డా మీకేటి తెలుసు, ఇంట్లో వున్న వాళ్ళం మమ్మల్నడగండి ఇతగాడి మంచీ చెడ్డా…

క్రిష్ణ : (నామోషీగా) ఎహే….ఎల్లండీ…..

రవ : అదేంటండీ అలాగన్నారు మీ బావమరిదిని మీరు ఎనకేసుకు రావాలి….మంచీ చెడ్డా అంటే గుర్తొచ్చేడు దుర్మార్గుడు… ఏవీ మా సంతాన క్రిష్ణన్‌ గాడి కాయితాలు తెస్తాఁవన్నారు తెచ్చేరా..? బిల్లుల మీద కూచున్నాడు కాయితాలిచ్చీదాకా కదిలీటట్టు లేడు. ఆళ్ళావిడ ఎప్పుడు కనిపించినా కారాపించీసి ‘ కాకితం యెన్నడా? ’ అని అగ్గగ్గలాడుతోంది……

కోటి : తేకేఁవండి మొన్నే రిజిష్ట్రేషన్‌ అయిపోయింది. నేనూ మా వోడూ ఏవో పన్లమీద తిరుగుతున్నాఁవు కాయితాలు పంపించటం కుదిరింది కాదు…(బేగ్‌ లోంచి తీసి) ఇవిగో కాయితాలు ఇదిగో రసీదు, చూసుకోండి!

రవ : (గబ గబా దస్తావేజులు తిప్పి, స్వగతం లాగ) ఇదేటిది తెలుగులో రాయించేరు?
(పైకి గట్టిగా) అరవ్వాళ్ళ జాగా తెలుగులో చేయించేరేటి రిజిష్ట్రేషను….ఆళ్ళకి అర్థం అవకుండానా?

కోటి : అరవ్వారి రిజిష్ట్రేషనయితే మటుకూ ఇప్పుడు అరవ డాక్యుమెంట్‌ రైటర్లెక్కణ్ణుంచొస్తారండి? ఇంగ్లీషులో అయితే టైప్త్లిసు బండ బూతులు బాదెస్తునారు ….మనకి తెలిసిన డాక్యుమెంట్‌ రైటర్చేత తెలుగులోనే పూచీ కత్తులన్నీ ఎత్తి రాయించేను…….మందగ్గిర మీకు అలాటి భయాలేఁవీ అక్ఖర్లేదు…. ఏదిలాగివ్వండి….చూడండి. (చదువుతాడు)

భీముని పట్నం తాలూకా భీముని పట్నం సబు డిపో చేపల దిబ్బడి పాలెం వాస్తవ్యులు శ్రీ అవ్వారి బాల సుందర రాజు సన్నాఫు లేటు పెద గంగ రాజు, మత్స్యకారం వారు…….అయ్యెన్నెస్‌ వజ్రబాహు కంటోన్మెంట్‌ పోస్టు బంగళా నెంబరు పదిహేడు వాస్తవ్యులు శ్రీమతి డాక్టర్‌ ఐరావతం సెంథిల్‌ నాథన్‌ వైఫాఫు శ్రీ సంతానక్రిష్ణన్‌ సెంథిల్‌ నాథన్‌ గృహకృత్యం వారికి రాయించి ఇచ్చిన క్రయ చీటి

రవ : గృహకృత్యం ఏటండీ ఆవిడి గోషాస్పటల్లో పెద్ద డాక్టరైతేనూ…?

కోటి : మరా సంగతి ముందే చెప్పేరు కాదే? పోన్లెండి మించి పోయింది లేదు…ఇన్‌కం టేక్స్‌ పర్పస్‌కి ఇలాగయితేనే బెటరు…..ఇదిగో ముఖ్యఁవయిన పోయింటు పూచీకత్తుల క్లాజు పకడ్బందీగా ఎత్తి రాయించేను విన్నారు కాదు…(చదువుతాడు) ఈ ఆస్తి మీ పుత్ర పౌత్ర వంశ పారంపర్యాభివృద్ధి పర్యంతమూ వాపీ కూప తటాక సమేతముగనూ, గృహ జల తరు నిధి నిక్షేపముల తోనూ మీ యదేఛ్చగా సుఖాన అనుభవించ వలెను. ఈ క్రయము అమలు పరుచుటలో మిమ్ములకు గాని మీ వారసులకు గాని మా వలన గాని మా వారసుల వలన గాని మా జ్ఞాతులవలన గాని ఎన్నడునూ ఏవిధమయిన తగాయిదాలూ కలుగజేయు వారము కాము. ఇహ మీదట ఈ క్రయం మూలకముగా ఏవిధమయిన సివిలు క్రిమినలు లావాదేవీలు తటస్థించిననూ అవి అన్నియూ మా స్వంత ఖర్చులతో, మా స్థిర చర ఆస్థుల జవాబుదారీ మీద మేమే స్వయముగా పరిష్కరించి ఈ క్రయమును మీ పేరిట నిరాటంకముగా అమలు జరుపగల వారము…ఇంత లాగ ఎవడూ రాయించడండీ! ఇదుగో (కాయితాలు బల్లమీద పడీసి) మీ సంతాన క్రిష్ణన్‌ గారూ సంతానం హేపీగా అనుభవించుకోమనండి!

రవ : వుట్టినే ఇస్తున్నట్టు మాటాడరేటి..కష్టార్జితం…జాలార్లు కదా ఆళ్ళ కాడేటుంటాయి స్థిర చరాస్థులు జవాబుదారీ చూపించీడానికి? చేపల వలా బుట్టానూ….

గోపా : (నిష్టూరంగా దీర్ఘంగా) ఆ వున్న చెక్కా ముక్కా మీ సంతానక్రిష్ణన్‌ గారు లాగీసేకా!

కోటి : చదివింపులు కష్టార్జితం ఎలాగయ్యేయి? హేటో గురువు గారి లాజిక్కు……జాలార్లనీసి అంత తక్కువెష్టిమేషన్‌ ఏసుకోకండి! కొమ్ము కోనాలు రెండు పడితే నెల్లాళ్ళు వైభోగం. డబ్బిస్తే మాత్రం సరియయిన చోట జాగా సెట్టవడం అదెంత అదృష్టం అనుకున్నారు. స్థల యోగం వుండాలి….ఆయనికి మీరు జాగా గిఫ్టుకింద ఇస్తనారంటే కన్యాదానం ఎంతో ఇదీ అంత పుణ్యం తెలుసండి!

రవ : నిజఁవే లెండి వాడికి ఫ్రీవే కదా! (సముదాయింపుగా) థేంక్సండీ..వ్యవహారజ్ఞులు! అక్కడ దొరకడఁవే అసాధ్యమనుకున్నాఁవు….

కోటి : యువార్‌ వెరీ వెల్కమ్‌ సార్‌! అసాధ్యాల్ని సుసాధ్యం చెయ్యటఁవే మన ప్రత్యేకత! మా మీద భరోసా వేసి మీరు హేపీగా ప్రశాంతంగా వుండండి బాబూ అని చెప్తే విన్రు కాయితాలమీద బెంగెట్టీసుకున్నారు! మనుషుల్లో ఉన్నాదండీ కాయితాల్లో ఏటున్నాది?

నాగే : O.. ప్రశాంతీ అంటే గుర్తొచ్చింది… I wanted to ask you.. ……..మిమ్మల్ని కిందటిమాటే అడగాలనుకుని I forgot పుట్టపర్తి వెళ్ళటానికి transportation ఎలాగో చెప్పండి కోటీ గారు…. Trains are better or.. బస్సు బెటరా?

కోటి : బస్సయితే బెష్టండి మేడమ్‌! యూ ప్లీజ్‌ టేక్‌ ది వీడియో కోచ్‌ బస్‌ ఆప్షన్‌ సో దట్‌ ది చిల్డ్రన్స్‌ ఫీల్‌ హేపీ! తెల్లారి ఆరు గంటలకి ఇక్కడెక్కితే సాయంత్రానికల్లా అక్కడ దిగిపోతారు. లింగరాజు డాక్ట్రగారనీసి మా బెష్టు ఫ్రెండు. సాయి డివోటీస్‌. ఆళ్ళ వీడియో కోచయితే పిల్లల్తోటి మీకు పూచీ పేచీ వుండదు. మా డాక్ట్రగారిది బ్రెమ్మాండమయిన టేష్టు లెండి. హమ్మాప్కే కవున్‌, దిల్‌ వాలా దుల్హణియా వో జాయేంగే ఇలాటి బంపర హిట్‌ మూవీలు చూసుకుంటూ మీరిలాగ చిన్న కునుకు తీస్తూ వుండగా అలాగ ప్రశాంతీ నిలయంలో దిగిపోతారు…..బస్సులోకే మీ కాళ్ళ కాడికి కాఫీలూ టిఫిన్లూ భోజనాలూ సమస్తం సప్లయ్‌ చేస్తారు. ఆ ఉప్మా వుంటాదండి …..పుట్టపర్తి వెళ్ళీ తోవలో తిన్నంత టేష్టీ వుప్మా నా జన్మలో ఎక్కడా తిన్లేదంటే నమ్మండి….మిరప కాయ కూడా వొదలబుద్ధెయ్యదు.

నాగే : (భక్తిగా) O yeah! రుచంటే సాయి సుధ!

కోటి : మరలాగే అనుకోవాలండి…ఇంట్లో మా ఆడాళ్ళు చేసిన వుప్మాలు ఎత్తుకెత్తు నెయ్యి పోసినా ఆ రుచేదండి?

క్రిష్ణ : అక్కతో చెప్తానుండండి!

కోటి : చెప్పు నాకేం భయఁవా? అది చేసిన టిఫిను నాకూ పిల్లలికీ పెట్టి ఆఫీసుకి పంపించీసి తనకీ మా అమ్మకీ బొల్లయ్యరు కొట్టునుండి ఇడ్లీలు తెప్పించుకుంటుంది మీ అక్క. సేమియా పాయసం వొక్కటే దానికొచ్చిన పిండి వంట….. మిమ్మల్నేటంటాను మీ అమ్మననాలి…..చదువొక్కటి చెప్పించెస్తే అయిపోయిందా? ఆవిడొకర్తి, మీ ఊకా మావయ్యోకడూ …..చదివీ చదివీ పుస్తకాలు చదివీ మని పాటే పాట……….

గోపా : (ఆశ్చర్యంగా) ఊకా గారు?? ఊకా గారు మీ చుట్టాలా?

కోటి : చుట్టాలేటండి స్వయానా ఈయన మేనమావ..

క్రిష్ణ : అవునండి మా మాఁవయ్య!

కోటి : ఈళ్ళ ఫేమిలీలో కాంబాబనీసి పిలుస్తారు…..(ఎత్తిపొడుపుగా) వారు ఊరుమంచీ వీరు జనమంచీ….ఆయన మీకు తెలుసా ఏటండి…

గోపా : ఆయన పొయెట్రీ కధలూ అవీ చదివేనండి…. prolific writer …..బాగా ఫేమస్‌ కదా…! ఈ వూరేనా?

కోటి : ఈ ఊరు కాదండి హైడ్రాబాడ్‌…..(క్రిష్ణతో) వేసవి శలవుల్లోన ఏవో కవులమీటింగులున్నాయి కావోలమ్మా? వొస్తున్నారన్నారండి…..మా వోడూ కవేనండి….ఇతనేం తక్కువ తిన్లేదు…

నాగే : (అతిశయంగా, దెబ్బ తిన్నట్టూ) ఇదుగో! మా గోపీ అలా హంబుల్‌గా వున్నాడు గాని He is a very fine writer…. you know? కవన గోపాలం అని చదివేరా?

క్రిష్ణ : ఆఁ ఆఁ కవన గోపాలం మీరు రాసేరా?

గోపా : అదెప్పటిదో! (మాట మారుస్తాడు)…..నువ్వేం రాస్తున్నావు…చెప్పు?!

కోటి : (తనలో) రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు. వ్యవహారం ఫైసల్‌ చేద్దామని అమిరికా వోడి దగ్గిరికొస్తే ఈళ్ళిక్కడ కవుల మీటింగు పెట్టెస్తారో ఏటో! (పైకి) మా వోడూ కవేనండి. మొన్న విజయవాడెళ్ళి ప్రైజు కూడా అందుకునొచ్చేడు….ఏటమ్మా ఆ కవిత్వం? చదువూ…? మండేలా మండేలా…

గోపా : (ఆసక్తిగా) అచ్ఛా! ఏదీ…?

క్రిష్ణ : అబ్బా ఇక్కడెందుకు బావగారూ…

కోటి : తప్పులేదు చదువమ్మా. విద్యున్నది దాచుకోడానికా? పెద్దవాళ్ళొచ్చి అడిగినప్పుడు కాదనకుండా మనకి తెలిసిన్నాలుగూ గడ గళ్ళాడి ఏకరబెట్టెస్తేనే ఆ విద్యకి శోభ….(తొడ గిల్లి) ఇతను కవిత్వం వింటే గానీ జాగా కొనీటట్టు లేడు….మురిపించుకోకుండా చదువ్‌…….

క్రిష్ణ : (తప్పనిసరిగా)….అంతా గుర్తులేదు….

కోటి : గుర్తున్నమటుక్కే చదువు….అయినా మరిచిపోడానికి ఇదేఁవన్నా బ్రహ్మవిద్యా? చివర్లంట రైమింగ్‌ వర్స్డు వేసుకుంటూ పోతే అదే కవిత్వం….చదవ్వై సొండు గాడివి…..

క్రిష్ణ : (పౌరుషంగా) అలాగే పొయెట్రీ అంటే అంత చవగ్గా లేదు లెండి…అంతరాంతర జ్యోతిస్సీమల్ని వెలిగించాలి……

కోటి : సిగరట్‌ లైటరిమ్మన్నావా?

నాగే : అతన్నలా వెక్కిరిస్తే అతనేం చదువుతాడండీ…

కోటి : వుట్టినే ఇగటాలకన్నానండీ…..కవిత్వం విలువ మాకు తెలీకేఁవండీ. చచ్చి ఏ స్వర్గానున్నారో మా నాన్నగారు రోజూ పొద్దుట లెగ్గానే ఓ పుంజీడు పద్యాలో శ్లోకాలో రాయకుండా కాఫీ చుక్కైనా తాగీ వాళ్ళు కారు…..

గోపా : ఎవరండీ మీ నాన్నగారూ…?

కోటి : పండుతొండ మేషారంటారండి……పోయేర్లెండి మీకు తెలీదు…చెవిటి రాణీ కాలేజీలో సాంస్కృట్‌ పండిట్‌ చేసి రిటారయిపోయేరు….ముసిలికాలంలో స్టేంపు వెండరు చేస్తే కాని దినం వెళ్ళింది కాదండి! కవిత్వాలే కావలిస్తే మా పాతింటికి రండి….అటక నిండా ఇవే…..మొన్నే ఇంక విసుగొచ్చి అద్దెల వాళ్ళ పిల్లల్ని కాగు పొయ్యిలోకి వేసీసుకో మన్నాను…. మా నాన్నగారికీ మీలాగే కవిత్వాలంటే వెర్రండి! నాకింకా గుర్తేను….ఇంక పోతారనగా ముందు రోజు నన్ను పిలిచి ” వొరే చిన్నవాడా! కవిత్వాలొద్దు నాన్నా! డాక్యుమెంట్‌ రైటరు నేర్చుకో! టైపూ షార్ఠేండూ నేర్చుకో! ” అని చేతిలో చెయ్యి వేయించుకున్నారు…(తెప్పరిల్లి) చదువమ్మా నువ్వేగం చదివీ!

క్రిష్ణ : (నెమ్మదిగా చదువుతాడు)

ఆఫ్రికా హృదయాలు నిండేలా
అంతటా స్వప్నాలు పండేలా
ఆలోచనా శిఖలు మండేలా
అందరం పచ్చగా వుండేలా

అవును
చివ్వున నినాదమై లేచావుగా మండేలా
అవునవును
క్రెవ్వున కేకై మ్రోగావుగా మండేలా
నీ జాతి కన్నీళ్ళ చారికలలో చంద్రుడై ప్రతిఫలించిన వేళ
నీ చూపు శతృవును దావాగ్ని కీలలా ముట్టడించిన వేళ

స్పర్శించు మిత్రమా స్వాతంత్య్ర పవనాలు
వర్షించు….? స్వా…..?!
……..ఏదో వుంది! మర్చిపోయేను…….

నువ్వు చాచిన ఈ నల్లని చేతినే అందుకుంటాము
నువ్వు రాసిన ఈ చల్లని గీతినే పాడుకుంటాము

(అభిప్రాయం కోసం గోపాల్ని చూస్తాడు)

గోపా : బావుంది..కానీ..చల్లని గీతి ఏంటి? రైమింగ్‌ అయిందనా?

కోటి : నేను చెప్పేను కదండి…అంటే అన్నాడంటారు. నాతోటి కవిత్వాలు మాటాడాలంటే మావోడికెంత టెక్కో! ఆళ్ళ సర్కిల్‌ వేరు వారి లెవిలు వేరు. ఏటుందండి ఇందులో కూసు విద్య…(నవ్వుతూ)
కానీవోయ్‌ గురూ వో మండేలా
కాగు బిందీ డేగిసాలూ నిండేలా
స్థాళీ పాకం వంటలు వండేలా
ఓ కాణో పరకో నీకూ ఉండేలా…….

గోపా : తిప్పి తిప్పి చివరికి అక్కడికే తీసుకొచ్చేరు…..

కోటి : ఇతనేదో రాస్సేడు ఆళ్ళేదో ప్రైజిచ్చీసేరు గాని…ఓ కాణో పరకో లేకపోతే ఆయనలాగ జైళ్ళంట పడి తిరుగుతాడంటారా! (గోడ గడియారం పన్నెండు కొడుతుంది) అదుగో జయం…..! (నాగేశ్వరితో) మరి నేను చెప్పవలిసింది చెప్పేను…చూడండి మీ ఇష్టం…..(వెళ్తాం అన్నట్టు లేచి నించుంటారు)

నాగే : మీరలా చెప్తుంటే let me be frank….tempting గానే వుంది కోటీ గారూ….మా బావగారేమో మీదంతా మాటల గారడీ అంటారు….(నవ్వుతుంది) O I am totally confused… మేం కొనెళిపోతే ఎవరైనా occupy చేసేసేసుకుంటే? మంచి watchman ఎవడైనా దొరుకుతాడా….?

కోటి : దొరక్కపోడానికిదేం అనుపానఁవా పులిపాలా… వాచిమేన్లకేటి మేడమ్‌ నివగాం కిచ్చాడా బైరిపడా అటుసైడు కరువొచ్చి పనుల్లేక మలమల్లాడతన్నారు….మీరు నెలకో పది డాలర్లిలాగిసిరెస్తే మీ సైటు కనిపెట్టుకుని పడుండటానికి వందమంది లైను కడతారు……ఇతన్నడగండి! (క్రిష్ణతో) ఎవరమ్మా అతను నివగాఁవా మొన్న ముషిడివాడ మన సైటు మీదికొచ్చి బండికడ్డంగా పడిపోయేడు? ” చిమింటు కట్టలు రెండీసి రెండీసి ఒక్క భుజాన్నేసుకుని మోసెత్తాను బాబూ….పనిప్పించు బాఁవు వింజినీరు గారూ… ” అని కళ్ళనీళ్ళ పర్యంతఁవైపోతేడు……..మీ దయ వల్ల పనోళ్ళకేం తక్కువ లేదు…

క్రిష్ణ : నివగాం కాదు బావగారూ అచ్యుతాపురం…..ఇదే ఫస్టైము గావాల ఇక్కడికి రాడం…బేజారయిపోయి కళ్ళంట్నీళ్ళు పెట్టీసుకుంటున్నాడు…….

గోపా : (ఆదుర్దాగా) పనిచ్చేరా? ఇచ్చేరా…?

క్రిష్ణ : మా బావగారికి తెలిసినోలున్నారు సార్‌ సన్యాసి రావు గారనీసి. ఆయన్దగ్గిరిప్పించేరు…… మా పనోళ్ళు మాకే సరిగ్గా సరిపోతారు సార్‌…మావన్నీ చిన్న వర్క్‌..

కోటి : (క్రిష్ణ కాలి మీద బూటుతో తొక్కి) చిన్న వర్క్సు ప్రస్తుతానికండి ఇతని చదువొకటి అడ్డుందని చిన్న ప్రోజక్స్టే టేకప్‌ చేసేము. ఎన్నారై నగర్‌ అనీసి కిలారు బ్రదర్స్‌ తోటి త్రీ క్రోర్స్‌ ప్రోజక్టొకటి టేకప్‌ చేస్తనాఁవండి…..(నాగేశ్వరితో, గుండెలమీద చెయ్యేసుకుని) మీ మంచికోరి చెప్పిన మాటండి….ది సైట్‌ ఈజ్‌ ఎ జామ్‌ ఎండే క్రీమ్‌ ఎండే గోల్డుమైన్‌… మరచ్చూసుకోండి. (రవణారావుతో) ఎళ్ళొస్తాం గురువు గారూ శాన దయుంచండి….(గోపాల్‌తో) గుడ్‌ నైట్‌ ఎండ్‌ స్వీట్‌ డ్రీమ్స్‌ సార్‌!…(మెట్లు దిగిపోతారు. గోపాల్‌ వాళ్ళతోటే మెట్లు దిగి గేటుదాకా వస్తాడు)

(బయటికొచ్చి బండి స్టార్ట్‌ చెయ్యబోయి ఆగి)

కోటి : ఏటోనువై నానుముచ్చు బేరం తెగదూ ముడి పడదూ!

క్రిష్ణ : అబ్బా ఆకలేస్తంది బాబూ……….

కోటి : ఆకలి దంచుకుంటోంది….బైట తినెద్దాఁవా? ఇంతద్ధరాత్రి హొటల్లేటుంటాయిలే! ఇంత సేపు కూచోబెట్టి మాటాడేడు గాని కాఫీ చుక్కలన్నా పోసేడు కాడు చూడు ఠొప్పాసి నాకొడుకు….

క్రిష్ణ : మీరు కాఫీ టీ అవీ తాగరనీసి తెలుసు కాబోలు.

కోటి : అబ్బే ఈడా? ఒంటి మీద మట్టి కూడా ఎరువివ్వడు, ఇతను కాఫీ ఇస్తాడా?…..మీ ఇంటికెల్దాఁవా మా ఇంటికెల్దాఁవా? మా ఇంటికొద్దులే మీ ఇంటికే పదా….సెకెండ్షో వొదిలీసేరు. తిడితే తిట్టింది గానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి మీ అమ్మ పెట్టినట్టు అన్నం ఎవరూ పెట్టరు…పదా….

(గేటు దగ్గర్నుండి గోపాల్‌ కేకేస్తాడు)

గోపా : ఇదుగో ఏయ్‌ బాబూ…!

క్రిష్ణ : సార్‌! పిలిచేరా? (దగ్గిరికెళ్తాడు. కోటేశ్వర్రావు బండి మీదే కూర్చుని చూస్తుంటాడు)

గోపా : Just a minute! ఆ తుల్సికోట దగ్గిరికి రా! ప్లాట్సవీ కాదు గానీ…మీది ఈ వూరేనా?

క్రిష్ణ : ఈ వూరే సార్‌..

గోపా : (చిన్నగా) ఇదిగో! నాకు వూరల్లా తిరగాలనుంది…..ఒక్కణ్ణే!

క్రిష్ణ : దాందేఁవుంది సార్‌! వెంకటేశ్వరా టేక్సీ సర్వీసు మా బావగారి ఫ్రెండ్స్‌దేనండి…కారైతే కారు వేనైతే వేనూ బుక్‌ చేయిద్దాఁవు…

కోటి : (కుతూహలంగా మెడ ఎత్తి) వారికేం కావాలంటే మొహమాటం ఒద్దూ మన ఫోన్నెంబర్లవీ ఇవ్వమ్మా..!

గోపా : ప్చ్‌ ..కారు గురించి కాదు బాబూ…

క్రిష్ణ : వూఁ…?

గోపా : నువ్వు….నువ్వు నాతో కలిసి తిరుగుతావా? నాకిక్కడ ఎవరూ…

క్రిష్ణ : (అయోమయంగా) నేనా సార్‌? (మొహమాటంగా) మీ మేడమ్‌ గారూ అన్నయ్య గారు ఫేమిలీ అంతా కల్సి సైట్‌ సీయింగ్‌కి వెళ్తాఁవంటే చెప్పండి…..

గోపా : (చికాగ్గా..) వాళ్ళ పన్లు వా… (నిగ్రహించుకుని) వాళ్ళతో కాదు! సైట్‌ సీయింగ్‌ అని కాదు. ….(విడమర్చి చెపుతున్నట్టు) గుళ్ళూ గోపురాలూ బీచీలూ కావు……గుళ్ళకీ షాపులకీ తిరిగి తిరిగి ప్రాణం విసుగేస్తుంది….(నవ్వుతాడు)….వూరికే నాకు ఈ వూళ్ళో వీధులూ బజార్లూ లైబ్రరీలూ ఇళ్ళూ అన్నీ …మనుషులు మసిలే చోట్లన్నీ తిరగాల్ని వుంటుంది….నేను చిన్నప్పుడు ఇక్కడే పెరిగేను….ఇప్పుడంతా మారిపోయింది…..నాకు ఎవరూ తెలీదు కదా…. I feel like a total stranger ……ఒక్కణ్ణే ఎక్కడికెళ్ళినా ఏదో లోన్లీగా వుంటుంది…. you know …

క్రిష్ణ : (సందేహంగా) నేను…నాతో ఏం చూస్తారు సార్‌ మా ఇల్లు కూడా పెద్ద బాగోదు….ఆ సందుల్లోకి మీరు రాలేరండి…….

గోపా : (వారిస్తున్నట్టు) అలాటిళ్ళు చూడాలనే…. (ఎలా చెప్పాలో అర్థం కానట్టు ఆలోచించి) ఇదీ ఒకరకం సైట్‌ సీయింగ్‌ అనుకో! (స్థిరంగా) Yes! This is a different kind of site-seeing. I don’t want to visit dead attractions. I want to see places alive with people…..you know?! నువ్వు నా గైడువనుక్కో…. I’ll pay your fees ….

క్రిష్ణ : (కంగారుగా) అచ్చీ ఫీజులేంటి సార్‌ ఫీజులకేటున్నాది…..(అనుమానంగా) అంటే ఎలాటి సైట్సండి?

గోపా : నువ్వు మామ్మూలుగా పొద్దున్నే లేచి ఎక్కడెక్కడి కెళ్తావో అలాంటి సైట్లు….నేనొక్కణ్ణే అయితే ఎక్కడికెళ్ళాలో తెలీదూ…. and I won’t fit in..

క్రిష్ణ : పొద్దుటేనా? పొద్దున్న లేవగానే పాల పేకట్లకెళ్తాను…..తరవాత మా అమ్మకి కొళాయి నీళ్ళు. తరవాత కాఫీ తాగీసి డంగలా కెళ్తాను….?!

గోపా : డంగలావా? డంగలా అంటే?

క్రిష్ణ : డంగలా అంటే……పంది మెట్టు మీద…….నక్కప్పల్నారాయణ గారి డంగలా సార్‌! ఎక్సర్సైజులకి సార్‌ వెయిట్సు…దండీలు బస్కీలు…..

గోపా : సరే అక్కడికే పదా. Tomorrow morning….?

క్రిష్ణ : (అనుమానంగా, నవ్వాపుకుంటూ) అక్కడేం జిమ్స్‌ లాగుండదు సార్‌! బుగ్గి బుగ్గిగా వుంటుంది….

గోపా : అలాటి బుగ్గిగా వుండే ప్లేసెస్‌కి తీస్కెళ్తావనే నిన్ను బతిమాల్తునానోయ్‌! పాష్‌ ప్లేసెస్‌కయితే I could always go with Nagoo and kids …..ఏం? వొస్తావా రేప్పొద్దున్న?

క్రిష్ణ : డంగలా మా ఇంటికి దగ్గిర సార్‌ మీరే మా ఇంటికొచ్చీండి….?

గోపా : మీ ఇంటికా? Directions ఇస్తావా?

క్రిష్ణ : డెరెక్షన్సేం అక్కల్లేదు సార్‌ చేపలగ్గురారం బీచీ బ్రెమ్మం గారి మఠం దగ్గిర జనమంచి వాళ్ళిల్లంటే మీకు ఏ రిక్షావోడయినా చెప్పెస్తాడు…..

కోటి : (బండి మీంచి మెడ ఎత్తి అసహనంగా) ఏంటి నన్ను రమ్మంటావా? (చిన్నగా) ఏటి కవిత్వాలా?

క్రిష్ణ : లేదు బావగారూ ఒచ్చీసేను (బండి స్టార్ట్‌ చేసిన చప్పుడు).

మూడవ స్థలం.
(అమోఘరత్నం గారిల్లు.)

కోటి : నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా తియ్యి తలుపు….

క్రిష్ణ : అందరూ పడుక్కున్నట్టున్నారు..

(లోపల్నుండి అమోఘ రత్నం తుళ్ళిపడి లేచినట్టు గట్టిగా)

అమో : ఎవళ్ళు పడుక్కున్నారు….అమ్మో దొంగ….. నాయినా నువ్వా? ఇంకా కంబైన్డ్‌ స్టడీ చేసుకోడానికి తవిటి రాజు దగ్గిరికి వెళ్ళేవనుకున్నాను సెకెండ్షో కెళిపోయేరా?

కోటి : సెకెండ్షో కెవడెళ్ళేడండీ..అమిరికా నుండి పెద్ద ప్రొఫెసిరు గారొస్తే మీ వోడ్ని పరిచయం చెయ్యడానికి తీసుకెళ్ళేను…ముందూ వెనకా చూసుకోకుండా బడ బళ్ళాడ్డమే తప్పించి నా మనస్సు తెలుసుకున్నారు కాదు….

అమో : నాకెందుకు తెలీదూ నీ మనస్సు గుంటవెధవని జాగాలనీ కంట్రాక్టులనీ డబ్బుల రంధిలో తిప్పుతునావు….మా రాఁవయ్య కాబట్టే మా భూఁవమ్మి పెట్టేడనీ! నీ వుపకారం మరిచిపోను తండ్రి తండ్రీ!

కోటి : తిప్పితే తిరిగిపోడానికి చిన్న కూచా బొప్పా? మీతోటి తగువుకి నాకు ఓపిక లేదు గానీ ముందు అన్నం పెట్టండి…(టేబిల్‌ దగ్గర కూర్చుని) భానేదీ?

అమో : (వెక్కిరింపుగా) భానేదీ?….మేడమీద పడుకున్నారు మీ భానూ పేనూ. పెళ్ళాం పిల్లలూ ఇప్పుడు గుర్తొచ్చేరా?

కోటి : నన్ను తిట్టకుండా మీకు దినం గడవదు… ” బీత్త్‌ గయే దిన్‌ అల్లుడ్ని తిట్టకుండానే ” అని బాధ పడతారని అక్క వరసన్న అభిమానంతోటొస్తాను..మీరు పెట్టిన్నాలుగూ తిండానికి.

అమో : నా వంట బావుంటుందనొస్తావు (వడ్డిస్తుంది) బైటయితే ఖర్చు నీకు!

కోటి : (క్రిష్ణతో) ఏటా గురువు గారు తులిసి కోటెనకాల నీతోటి గుస గుసలు?

క్రిష్ణ : ఆయనకి సైట్‌ సీయింగ్‌ చేయించాలిట….

కోటి : ఓసింతేనా. నరహరికి ఫోన్‌ చెయ్యి బండి కావాలని….(అత్తగారితో) నెయ్యి వెయ్యండి.

అమో : నెయ్యిలేదు నాయినా నూనె వేసుకో! వెన్న దాస్తే నీ చిన్నకూతురు తినీసింది….

కోటి : మీ ఇంట్లో నెయ్యి లేదని చెప్పండి దాన్నెందుకంటారు… ” అల్లుడుతోటొచ్చినోడికి నూని లేదూ అల్లుడు గారికి నెయ్యి లేదూ ” అందిట వెనకటికి మీలాటత్తగారే…అలాగుంది మీ మర్యాద.

అమో : రోజూ వొచ్చే అల్లుడివి చాలు నీకీ మర్యాద.

క్రిష్ణ : బండి కాదు బావగారూ…..ఆయనకి ఈ వూర్లోన గల్లీలూ లైబ్రీలూ ఇళ్ళూ స్లమ్సూ అన్నీ చూడాలనుందిట…..నన్ను ఊరు చూపించడానికి రమ్మన్నారు.

కోటి : (ఆశ్చర్యంగా) ఆఁ? అమిరికా వోళ్ళు తిరపతీ అన్నవరం అనడిగినోడ్ని చూసేను! నాకు మొదట్నుంచీ డవుటేనమ్మా. మనిషి అదొక వాటంగా ఉన్నాడు. బీచొడ్డున బంగళా కట్టిస్తానువై బాబూ అంటే ఏదో అతన్లో అతనే గుణించుకుంటాడు కాని మొహం ఎత్తేడు కాడు చూసేవా? అమిరికాలో కుళ్ళు కాలవలూ స్లమ్సూ వుండవు కదా దీవేస్తంది గావాల. మన రాఁవులమ్మకీ ఎల్లమ్మకీ చెప్పి కల్లు పాకల సైడు తీసికెళ్ళు ఆయన తనివి తీరినన్ని స్లమ్సు! అదీ మంచిదేలే ముందు స్లమ్సన్నీ చూపించి ఎన్నారై నగర్‌ చూపిస్తే దాన్లోని మజా ఏటో తెలుస్తుంది. ముందు అతనిక్కావలిసిన చెత్త కుప్పలూ మురికి వాడలూ అన్నీ చూపించీ. (చివాట్లు పెడుతున్నట్టు) కవిత్వాలడిగితే మురిపించుకోకుండా చెప్పీ, తెలిసిందా? ముద్దొచ్చినప్పుడే సంకెక్కి పోవాలి.

క్రిష్ణ : (పరధ్యానంగా) వూఁ…

అమో : ఇందాకట్నించీ చూస్తునాను నోట్లో పిడస నవఁలవూ మింగవూ ఏఁవిట్రా ఆ తిండీ?

క్రిష్ణ : అ ఆఁ….. నువ్విందాక తవిట్రాజంటే గుర్తొచ్చేడు….బావగారూ!

కోటి : ఊఁ?

క్రిష్ణ : మన కంటే చిన్నోడయితే బెల్లఁమ్ముక్క…

కోటి : ఊఁ. (ఉషారుగా) మన కంటే పెద్దోడయితే మర్దనా….చెప్పు!

క్రిష్ణ : మరి మన సాటివాడయితే….?

కోటి : (ఆలోచించి) మన సాటోడితోటి డీల్‌ చెయ్యటం…అమ్మా అదే అన్నిటి కంటే పరమ కష్టం బెదరు! మా ఆఫీసులో ముప్పూడి వాడ్ని చూసేవు కదా! ఆడూ నేనూ ఒక్కియరే సర్వీసులో జాయినయ్యేఁవు. చిన్నప్పట్నించీ ఒక్కంచం ఒక మంచం అన్నట్టుగుండీ వోళ్ళం. ఆడు ఓవర్‌ టైమనీసి ఉల్ఫాగా డబ్బులు చేసుకుంటుంటే నేనేం అనలేదు. మరి నేను వ్యాపారాల మీద తిరిగి కాణో పరకో చేసుకుంటే ఆడికెంత కన్నెర్రో చూసేవా? వాటర్‌ కూలర్‌ దగ్గిర కనపడి ఏటి బావా కులాసా? అంటే అసలు నేనెవరో తెలీనట్టు మొహం దుంప లాగ అటు తిప్పుకుని పోతునాడు. అన్నదమ్ముల్లాగుండీ వాళ్ళఁవి! మన వల్ల ఎన్నో వుపకారాలు పొందేడు. మరేదీ? ఆ రిగార్డేటుంచుకున్నాడా? అంతేనమ్మా! నీటికి నాచు తెగులు జాతికి జాత్తెగులూ…..

అమో : ఏం నాన్నా తవిటిరాజు నిన్నేఁవేనా అన్నాడా?

కోటి : ఎవరు ఆ కోఁవట్ల కుర్రాడా?

క్రిష్ణ : ఊఁ…(అమ్మతో) అబ్బే లేదమ్మా…వుట్టినే! అతను లెఖ్ఖలు బాగా చేస్తాడు…

కోటి : (అల్లరిగా) అనీసి నీకు దొబ్బు తెగులుగా వుందా? మా ముప్పూడి బావ లాగ…..

క్రిష్ణ : నాకెందుకూ. నేనూ చేస్తాను లెఖ్ఖలు. (ఉక్రోషంగా) ఎప్పుడు చూసినా పిడి కొట్టుకుంటూ కూచుంటాడు…..మేథ్సొస్తే సరా?! ఇంగ్లీషేం రాదు లెండి! Thus అనడానికి “దుస్‌ ” అంటాడు……(నవ్వుతాడు).

కోటి : ఎవడో ఆఫ్రికాలో మండేలా వోడి గురించి గుండెలు కరిగేలా రాస్సేవు కవిత్వాలు. నీ క్లాసులో వున్న తవిట్రాజంటే నీకు కన్నెర్ర…శంకర మఠంలో ప్రతీ ఆదివారం ధర్మో రక్షతి రక్షితహా అని లెక్చర్లు పడ దంచీసి దశరాలకి తిరపతెళ్ళి ఆళ్ళింట్లో పిల్లితో సహా అందరికీ గుళ్ళు కొట్టించెస్తాడు మా ముప్పూడి బావ. ఆడి చిన్నప్పట్నుంచీ ఫ్రెండుని, తెల్లారి లేస్తే మొహం మొహం చూసుకుంటే గాని దినం వెళ్ళదు నామీద ఆడికి పీకల దాకా వున్నాది కడుపు నొప్పి! (చెయ్యి తిప్పి) హ్హేటో….! మా నారాయణమూర్తి బాబన్నాడు కదా…..మనిషికొక్క దొబ్బు తెగులు మహిలో సుమతీ!

క్రిష్ణ : దొబ్బు తెగులంటే ఏటి బావ గారూ? జెలసీవా…?

కోటి : జెలసీ అంటే కన్నెర్ర కదూ?! ఎన్వీ అంటే..? అదో రకం దొబ్బు తెగులు కావోలు. ప్రొఫషనల్‌ రైవల్రీ అంటాడు సన్యాసిరావు గారు….. ఇంగ్లీషులో ప్రతీ దానికీ శాస్త్ర ప్రకారం అష్ట విధాలు తీస్తారు. దీన్లో మళ్ళీ రక రకాల్లే……. మొగోల మధ్య ఇదో రకం…ఆడోల మధ్యన అదో రకం. మా అమ్మకీ ఆ కందర్ప వాళ్ళావిడికీ చూడు. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది…… మంచివాళ్ళు కారా అంటే అదీ లేదు! జెలసీ! ఎన్వీ! రైవల్రీ…..కన్నెర్ర…. మచ్చరం….. కడుపునొప్పి…..చెప్పడం కష్టం గురూ! తప్పదు! (కంచం పట్టుకుని లేచి) మీ కవుల్లోన ఎవరూ వీటి గురించి రాయరేం! ఎప్పుడూ మానవత్వం మరో ప్రెపంచం సోదర భావం దీన జనోద్ధరణా సర్వ మత సమానత్వం అనీసే రాస్తారు కదూ….అవున్లే లేకపోతే మీకు ప్రైజులెవడిస్తాడు!

క్రిష్ణ : చలం గారు రాసేరు..జెలసీ అని.

కోటి : మరాయన రాసిన బుక్కు చదివేవా….? దీనికేటి మందు కనిపెట్టేడా?

క్రిష్ణ : ఏమో! చదివేను…..చదివినప్పుడు బావున్నట్టుంటుంది! (విడ్డూరంగా) రమణాశ్రమం వెళిపోయి మరి రాయడం మానీసేరు……..!

కోటి : మరి మీ కవులందరూ ఆయన రాసిన బుక్కు చదివి ఏ దొబ్బు తెగుళ్ళూ లేకుండా హేపీగా వున్నారేటమ్మా? (పగలబడి నవ్వి) ఇదేటి చూసేవు…..మా మాఁవ….(చెప్పబోయి ఆగిపోయి) ఒద్దులే కుర్రాడివి…..కడుపులో ఉన్న తెగుళ్ళ గురించి రాసుకుంటే చెండాలంగా ఉంటాది! మండేలా వోడి మీద రాసుకో!! ప్రైజులూ అవీ చేసుకోవచ్చు. నువ్వు బుక్కులు రాసి రాసి ముసిలోడివైపోయేక శ్రీశ్రీ గారి లాగ నీకూ బొమ్మ పెడతారు.

అమో : మీ బావ మాట వినకు నాన్నా! స్పర్ధయా వర్ధతే విద్యా అని సాటి వాళ్ళ మధ్య అలాగ మెరమెచ్చాలుంటాయి అవి సహజం. దానికేఁవిటున్నాది…….

క్రిష్ణ : నీకూ కమలత్తకీ మధ్యనున్నట్టుగా?

అమో : అవునురా అంట్ల చిప్ప వెధవా…గుడ్డొచ్చి పిల్లని భ్రమించిందిటా! ఇహ చాలు గీతోపదేశం వెళ్ళి చేతులు కడుక్కుని డాబా మీద పడుక్కోండి పొండి.

(పక్క బట్టలు పట్టుకుని వెళ్తారు)

రెండవ అంకం

ఒకటవ స్థలం
(అమోఘ రత్నం గారిల్లు. తెల్లవారు ఝాము ఐదు గంటలు. నైసు (ఐదేళ్ళు), బూర(నాలుగేళ్ళు) గౌన్లేసుకుని, వల్లి (ఏడాదిన్నర) లాగేసుకుని వాకట్లో చేరతారు. క్రిష్ణ తువ్వాలు రాజపుత్రుల్లాగ తలపాగా చుట్టుకుని ఒక చేతిలో చీపురు కట్ట ఇంకొక చేతిలో అంట్ల గిన్నెల్లోది పిడి ఉన్న మూతా కత్తీ బల్లెం లాగ పట్టుకుని)

క్రిష్ణ : నైసు ముండా! బూర ముండా!! వల్లి ముండా!!! నా సైనికులారా! నా మహా ప్రజలారా!!

పిల్లలు : (వరసగా లైన్లో నించుని) వూఁ..

క్రిష్ణ : వూఁ కాదు మూర్ఖులారా…ప్రభూ అనాలి!

పిల్లలు : ప్లబూ…

క్రిష్ణ : ప్లబూ కాదు.. సంటిముండలు సరేలే! మీ లాటి సంటిముండలకీ ఎంటిముండలకీ చిన్న చిన్న పాపలకీ పిట్టలకీ ఉడతలకీ ఎక్కాలు కూడా సరిగ్గా రాని ఇన్‌సిగ్నిఫికెంట్‌ క్రీచర్సుకీ రాజా ఎవరూ?

పిల్లలు : నువ్వే!

క్రిష్ణ : (కరుగ్గా) కాదు!

బూర : (సందేహంగా) కిట్టమాయ్య….

క్రిష్ణ : ఖాథు! ధిక్కారము!!

నైసు : మీరే ప్రభూ!

క్రిష్ణ : గుడ్‌ బోయ్‌! అందుకే నువ్వు నా సేనాధిపతివి.

బూర : షి ఈజ్‌ నాటే బోయ్‌…

క్రిష్ణ : సైన్యంలో ఉన్నప్పుడు బోయే….! ఊఁ చెప్పండి! మీ బొజ్జల మీద స్కెచ్చి పెన్నులతో ఆవు బొమ్మలూ పిల్లి బొమ్మలూ పిట్ట బొమ్మలూ వేసే ఆ కళా పిపాసి ఎవరతను?

పిల్లలు : మీరే ప్రభూ…

క్రిష్ణ : మీరు బజ్జోకుండా అమ్మమ్మని ఏడిపించడాలకి దిగితే ఆ పాటా ఈ పాటా పాడి మీ పీకలు నొక్కే ఆ మహా గాయకుడో?!

పిల్లలు : మీరే ప్రభూ…

క్రిష్ణ : మరి మీకు గాజులూ పూసలూ గౌనులూ బూటులూ రాటులూ టూటులూ గంగుల టాటులూ కొని తెచ్చే ఆ మహా దాత?

వల్లి : మాయ్యా? పింకుగా ఉంటాయీ అవా?

క్రిష్ణ : అవేనే ద్రోహీ! పింకుగా మెత్తగా తియ్యగా చల్లగా వుంటాయి కదా గంగుల టాటులూ ..అవే!

పిల్లలు : అన్నీ అబద్ధాలే!

క్రిష్ణ : అబద్ధాలు కావు నేనే ఆ మహా దాతని..ఇదిగో మీ డాడీ నేనూ ఈ అమిరికా వోడి బేరం తెగ్గొట్టగానే ముందు బూటు హవుసు సాయిబు దగ్గిర మీకే బూటులూ టాటులూ……(క్రిష్ణ, వెనక పిల్లలూ గెంతుతూ వలయాలుగా తిరుగుతూ పాడతారు) ఆనందం బాయెనహా..ఒహో అహా…ఒహో!

అమో : (కళ్ళాపి బకెట్‌తో లోపలికొచ్చి) బావుంది నాయినా వెర్రి పాటలు! అర్ధరాత్రి అంకమ్మ శివాలని ఆ అంట గిన్నేఁవిటి ఈ చీపురు కట్టేఁవిటి? పాల పేకట్లేవిరా?

క్రిష్ణ : (పాట ఆపకుండానే)
నీ పాలపేకట్లవీగో..అహా..ఒహో…
నీ కొళాయ్‌ నీళ్ళు పట్టీసేను పొహో..ఒహో….
ఆ గోపాల్‌ గారు వొస్తునారుటహా…టొహో…
నాక్కాఫీ చుక్కా? గీఫీ చుక్కా? కహాఁ…కహో……(పైనుండి కేక మోహన్‌! క్రిష్ణ మోహన్‌!)

క్రిష్ణ : (గబ గబా చొక్కా తొడుక్కుని) అమ్మో మాగో బూచాడొచ్చీసేడు అమిరికా పప్పోతాడు మీరు మేడమీదికి పారిపోండి…….పారిపోండి……(వీధి గది కర్టెన్‌ వేసి పైకొచ్చి)వొచ్చేరేంటి సార్‌!

గోపా : ఊఁ…రెడీ? (పక్కనున్న రాఘవని చూపించి) ఇతను మా ఫ్రెండు…రాఘవ. స్టేట్స్‌ నుండొచ్చేరు……

క్రిష్ణ : నమస్తండి…

రాఘ : ఏంటి బాబూ మా మాకేంటి స్పెషల్‌ సైట్‌ సీయింగంట…..

క్రిష్ణ : డంగలా కెల్దాఁవన్నారు సార్‌…రాత్తిర….

రాఘ : ఊఁ ఊఁ…. We would like to do a scientific study of Indian poverty in the globalized economic structure…. ఇదుగో…(చేతిలో బేగ్‌ చూపించి) నోట్‌ బుక్స్‌ ….డేటాకి! డంగలా అంటే పూర్‌ పీపుల్స్‌ జిమ్మేనా?

క్రిష్ణ : (మొహమాటంగా నవ్వి) చూస్తారు కదండి!…(వెనక్కి తిరిగి, కర్టెన్‌ కొంచెం తప్పించి చిన్న గొంతుతో) అమ్మా! అమ్మా! నాక్కాఫీ వొద్దు నువ్వు తాగీ…

అమో : అదేఁవిటి ఫిల్టర్‌ వేసీసేను తాగీసి పొండి!

క్రిష్ణ : నాకొద్దు నువ్వు తాగీ….

(అమోఘరత్నం ఏదో అంటుంటే మాట వినిపించు కోకుండా చెప్పులేసుకుని మెట్లు దిగి పోతాడు.)

రెండవ స్థలం

(తెల్లవారే ముందు గుడ్డి వెల్తురు. నక్కా అప్పలనారాయణ గారి డంగలా. శ్రీ వీరాంజనేయ వ్యాయామ మండలి అని ఒక చెక్క బోర్డు నిమ్మకాయలు, ఎండు మిరప కాయలు గుచ్చిన మేకుకి వేళ్ళాడుతూ ఉంటుంది. ఒక పెద్ద మేడ పక్కన బుగ్గి జాగాలో తడకలు రేకులతో కట్టి ఉంటుంది. కోడి పుంజు ఒకటి కూస్తూ పెట్టని తరుముతూ కారు దిగిన వాళ్ళకి అడ్డం వస్తుంది. చిన్న తడక తలుపు, పక్కన బల్ల మీద ఆంజనేయుడి రాతి బొమ్మ, సిందూరం భరిణె వుంటాయి. తలుపు తీసుకుని వంగి లోనికెళ్తారు.)

గోపా : (సంతోషంగా) ఓహో! ఇదా…..(వాసన పీల్చి, రాఘవతో) చూడు! కళ్ళాపి చల్లిన వాసన?!

రాఘ : (కలయ చూస్తూ) Doesn’t look like much of a gym to me!

క్రిష్ణ : (చెప్పులిప్పి చేత్తో పట్టుకుని) ఇంకా ఎవరూ రాలేదు సార్‌! ఇంకొచ్చెస్తారు…..ఆది బాబూ! ఆదీ…..?

(ఆదిబాబు వెయిట్స్‌ గుండెల మీంచి దింపి కింద పెట్టి లోనుండి పైకొస్తాడు. టైలరు కుర్రాడు. పొట్టిగా ధృడంగా వుంటాడు. లంగోటీ కట్టుకుని, నారింజ రంగు సిందూరం బొట్టు పెట్టుకుని వుంటాడు.)

ఆది : (క్రిష్ణని చూసి) ఏటి క్రిష్ణా స్పాట్‌ కావాలా..? (రాఘవనీ గోపాల్నీ గమనించి, కంగారుగా) ఆగండాగండి సార్‌! చెప్పులిప్పీసి స్వామి చిందూరం పెట్టుకోని లోపటకి రాండి. (నిక్కర్లు చూసి అనుమానంగా) లంగోటీలున్నాయా? లంగోటీఉండాలి. లంగోటీ లేకపొతే గురువు గారు డంగలా లోకి రానియ్యరు బాబూ……..

గోపా : (క్రిష్ణని చూసి, అయోమయంగా) లంగోటీలా….?

క్రిష్ణ : సారీ సార్‌! నా లంగోటీ ఇక్కడే ఉంటాది..మీకు చెప్పడం మర్చి పోయేను….(ఏమీ తోచక నిలబడిపోతారు)

రాఘ : ఈ ఆంజనేయుళ్ళూ అవీ మాకు నమ్మకం లేదండీ. మీ జిమ్‌ లో మెంబర్షిప్‌ కావాలంటే ఆంజనేయుడి భక్తులవ్వాలా ఏంటి? …and whats wrong with boxer shorts??

ఆది : భక్తులనీసి కాస్సార్‌…అయమ్‌ స్వారీ బట్‌ రూలీజ్ది రూల్‌ రూల్‌ ఫరాల్‌ అన్న ప్రకారం డంగలా గురువు గారి కుటంబరంల ఒక్కోవిల్లాగ నదిపిస్తన్నాము సార్‌..క్రిష్టీన్సు ముస్లిమ్సు ఎవులైనా సరే స్వామికి దండం పెట్టి చిందూర బొట్టు లేకుంట నోపలి కొదలం బాబూ….(క్రిష్ణతో) జానీ వొస్తాడు కదా..!

రాఘ : ఇలాటి పోలసీలు ఎక్కడా విన్లేదు….మీ గురువు గార్ని పిలు!

                                                                                                                                       ఇంకా వుంది)
-----------------------------------------------------------
రచన: కనకప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment