కథన కుతూహలం – 2
సాహితీమిత్రులారా!
ఆధునిక భేతాళకథలలో రెండవ కథ ఆస్వాదించండి............
పట్టు వదలని విక్రమార్కుడు, తన కారుని నడుపుకుంటూ నిన్నటి చోటికే మళ్లీ వచ్చాడు. దారికి ఒక పక్కగా కారు ఆపాడు. వెలుగుతున్న కారు శిరోదీపాలని అలానే ఉంచాడు. ఆ వెలుతురులో కొంచెం దూరం నడిచి, తనక్కావాల్సిన చెట్టు మీదకి ఎక్కాడు. అక్కడ కొమ్మల్లో ఉన్న శవాన్ని భుజం మీద వేసుకుని నెమ్మదిగా క్రిందగా దిగాడు. శవాన్ని కారు దాకా మోసుకొచ్చాడు. భుజం మీదనుంచి దాన్ని దింపి కారుకి ఆనించాడు. పడిపోకుండా ఓ చేత్తో గట్టిగా పట్టుకుని, ముందు తలుపు తీసి శవాన్ని రెండు చేతుల్తో ఎత్తి తన పక్కసీట్లో కుదేశాడు. తలుపులు బిగించి కారుని కదిలించాడు. చలిగాలి మరమీట నొక్కితే బేతాళుడు నిద్ర లేచే ప్రమాదం ఉంది. అందుకని దాని జోలికి పోలేదు. సమయం ఎంతయిందో ఒకసారి చూసుకున్నాడు. నిన్నటికన్నా ఇవ్వాళ ఒక పావుగంట ఆలస్యమయింది. అయినా పర్లేదు. ఎంత నెమ్మదిగా వెళ్లినా తన గమ్యస్థానానికి ఒక ముప్పావుగంటలో చేరుకోగలడు.
వేగనిరోధిని కుదుపుకి, మేలయిన నిద్రనుంచి మేల్కొన్న బేతాళుడీకీసారి చూడకుండానే అర్థమయింది తాను దాక్కుని ఉన్న శవం ఎక్కడ ఉన్నదీ! దాన్ని కారులో ఎవరు తీసుకువెళ్తున్నదీ!
ఓ క్షణం తర్వాత విక్రమార్కుడి వంక చూసి, “రాజా! నువ్వు నన్నెందుకు తీసుకువెళ్తున్నదీ నాకు తెలుసని నీకూ తెలుసు. పాత తెలుగు జానపదచిత్రాలు నువ్వు చాలానే చూసి ఉంటావు. వాటిల్లో కథానాయకుడు, కథానాయికని రక్షించటానికి మారువేషం వేసుకుని వస్తాడు. వచ్చింది కథానాయకుడని, కథానాయికని రక్షించటానికి అలా వచ్చాడని ప్రతి ప్రేక్షకుడికీ తెలుస్తుంది. కాని, ప్రతినాయకుడికి మాత్రం తెలీదు. కొంప తీయకుండా నేను, అలాంటి ప్రతినాయకుడ్ని అనుకుంటున్నావేమో నువ్వు. కానే కాదు. అయితే అతడిలాగే పగ తీర్చుకోవటానికి నీకో కథ చెపుతాను. రామయ్యలా దిక్కులు చూడటం మానేసి, నేను చెప్పేది విను. వింటూనే నీ వాహనం నడుపు,” అని మొదలుపెట్టాడు.
ప్రాయోజకులు దొరకడానికీ, ప్రకటనలు వేయడానికీ, ఆగి ఆగి మాట్లాడటానికీ బేతాళుడున్నది టీవీ సీరియల్ కాదు. నిజజీవితం. అందుకని తాను చెప్పాలనుకున్నదాన్ని ఏకబిగిన చెప్పుకుంటూ పోయాడు.
“ఆ రోజు బుధవారం. అలవాటు ప్రకారం మన పాఠకరావు పొద్దున్నే లేచి పాలపాకెట్లతో పాటు ‘నూతన’ వారపత్రిక తాజా సంచిక కొనక్కొచ్చుకున్నాడు. గబగబా బ్రష్ చేసుకున్నాడు. అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. తనే గ్యాస్ స్టవ్ వెలిగించి కొంచెం కాఫీ కలుపుకుని ఆ మంత్రజలాన్ని గొంతులో పోసుకున్నాడు. కడుపులోకి అది పూర్తిగా దిగకముందే, ఎవరో ఆమంత్రించినట్లు పరుగుపరుగున నడుస్తూ ముందు గదిలోకి వచ్చాడు.
స్థిమితంగా ఒక చోట కూర్చుని నింపాదిగా కథల పేర్లూ, రచయితల పేర్లూ చూశాడు. ‘ఊహూ’ అనుకుంటూ లోపలి పేజీల్లోకి వెళ్లాడు. పదో పేజీలో ఉన్న మొదటి కథని ఒక నిమిషం పాటు అనిమేషుడై చదివాడు. ‘ఈ ధోరణి మరీ పాతది’ అని గొణిగాడు. ఇరవయ్యో పేజీలో ఉన్న రెండో కథలోకి కొన్ని సెకండ్లపాటు విప్పారిన కండ్లతో చూశాడు. ‘నా వల్ల కాదంటే కాదు!’ అని అన్నాడు. ముప్పయ్యో పేజీలో ఉన్న మూడో కథ దగ్గర ఆగిపోయాడు. కాసేపు దాని లోకి చూపు సారించాడు. నలభయ్యో పేజీలో ఉన్న నాలుగో కథ దాకా వెళ్లకుండానే మూడో కథనే చదవటం మొదలు పెట్టాడు.”
అక్కడిదాకా చెప్పి, ఇలా ప్రశ్నించాడు బేతాళుడు.
“రాజా! ఇవాళ పాఠకరావు కథలు చదివిన పద్ధతి నిన్నటిలా లేదు. ఈ మార్పు ఎందుకో తెలీలేదు. దాంతో పాటు నాకు ఇంకొన్ని అనుమానాలు కలిగాయి. పత్రికలో కథల పేర్లు చూసి, అతడు అన్న ‘ఊహూ’కి అర్థం ఏవిటి? మొదటి కథని కాసేపు చదివి ‘ఈ ధోరణి మరీ పాతది’ అని, అతడెందుకు గొణుక్కున్నాడు. అది చాలదన్నట్లు, రెండో కథ చూసీ చూడగానే ‘నా వల్ల కాదంటే కాదు’, అని ఎందుకు అనుకున్నాడు? నాలుగో కథ దాకా వెళ్లకుండానే, మూడో కథ దగ్గరే ఎందుకు ఆగిపోయాడు? దాన్నే ఎందుకు చదవాలని నిర్ణయించుకున్నాడు? ఈ ప్రశ్నలకి తెలిసి కూడా ‘మౌనమే నా భాష ఓ మూగ మనసా?’ అని నువ్వు అనుకున్నావనుకో. శరవేగంతో ప్రవహిస్తున్న జలధిలో, శిలలకు తగిలి శకలాలయే అలల గతే నీ తలకు కూడా పడుతుంది.”
ఆ మాటలు విన్న విక్రమార్కుడికి, బేతాళుడిలో తెలుగు సినిమా పాటలపైనే కాకుండా, తెలుగు భాషపై సైతం దురదృష్టవశాత్తూ గట్టి పట్టున్న ఒక వర్ధమాన కవి ఉన్నాడనిపించింది. అది ఒక క్షణంపాటే. మరుక్షణమే అతడికి తన తక్షణకర్తవ్యం గుర్తొచ్చింది. రెండు నిమిషాలపాటు అర్థార్థియై అర్ధనిమీలితనేత్రుడై ఆలోచించి ఇలా అన్నాడు.
“బేతాళా! తాను ఏ రోజు చదవబోయే కథలు ఎలా ఉంటాయో పాఠకరావుకి కూడా తెలీదు. అందుకని, పరిస్థితిని బట్టి అతడు మొదట చదివే కథని ఎన్నుకునే పద్ధతిని మార్చుకుంటాడు. నేడు, నిన్నటిలా లేకపోవటానికి కారణం అది.
ఇక నీ ప్రశ్నల గురించి. బుధవారం వచ్చిన పత్రికలో కథల పేర్లు, ఏది ముందుగా చదవాలో నిర్ణయించుకోవటంలో పాఠకరావుకి ఏ మాత్రం సహాయపడేలా లేవు. అందుకనే పత్రిక తెరవగానే అతడు ‘ఊహూ’ అన్నది.
కథ పేరు తర్వాత, చదువుకోవటానికి కథని ఎన్నుకునే విషయంలో సహాయపడేది దాని ఆరంభం లేదా ఎత్తుగడ. ఒకప్పుడు తెలుగులో వచ్చిన కథల్లో ఎక్కువ భాగం, ఒక వర్ణనతో ప్రారంభమయ్యేవి. కథలో అంతర్భాగంగా, అనివార్యంగా కనపడే ఆ వర్ణనకీ కథకీ సంబంధం ఉందా లేదా అనేది అప్పటి పాఠకులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కాలక్రమేణా ఈ ధోరణి తక్కువయింది. కథ, ఉన్నట్లుండి ఆరంభం కావటం ఎక్కువయింది. ఉన్నట్లుండి అంటే ఒక భావప్రకటనతోనో, భౌతికచర్యతోనో, సంభాషణతోనో ఇప్పుడు కథల్లో అధికభాగం మొదలవుతున్నాయి.
పాఠకరావు పదవపేజీలో చూసిన కథ, ఒక వర్ణనతో మొదలయింది. అందుకనే ‘ఈ ధోరణి మరీ పాతది’ అని అతడు అనుకోవటం జరిగింది. ఇరవయ్యవ పేజీలో కథ, లేఖారూపంలో ఒక సంబోధనతో మొదలయింది. అలాంటి కథల్లో సన్నివేశ విభజనా ఉండదు. సంభాషణలూ ఉండవు. పాత్రలు నేరుగా మన ముందు ప్రత్యక్షం కావు. స్వగతం రూపంలో ఒక ఏకపక్ష కథనం మాత్రం ఉంటుంది. ఆ రకమైన కథలు కొన్ని ఇంతకుముందు పాఠకరావు చదివి ఉన్నాడు. ఆ కతలు చదవటం వల్ల వెతే కాని తనకి పెద్ద ఉత్సు‘కత’ కలగని విషయం అతడికి జ్ఞాపకం వచ్చింది. అందుకే అతడు ‘నా వల్ల కాదంటే కాదు’ అని అన్నాడు. మూడో కథ అతడికిష్టమైన ఆకస్మిక రీతిలో ఒక సంభాషణతో ఆరంభమయింది. అందుకనే నాలుగో కథ జోలికి పోకుండా, అతడు మూడో కథ దగ్గరే ఆగిపోయాడు. వెంటనే దాన్నే చదవటం మొదలు పెట్టాడు.
ఈ కథా ‘ధర్మ సూక్ష్మాలు’ తెలిసి ఉన్నట్లయితే ఇన్ని అనుమానాలు నీకు వచ్చేవి కావు. అంతే కాదు. పాఠకరావు, నిన్నటిలా ఇవాళ ఎందుకు కథని ఎందుకు ఎన్నుకోలేదో నీ అంతట నీకే అర్థమయేది.”
అలా విక్రమార్కుడికి మౌనభంగం కలగ్గానే బేతాళుడి ప్రభావంతో శవం రెక్కలు విప్పుకున్న విహంగమయింది. కారులో ‘పయనించే ఓ చిలకా! పాడయిపోయెను గూడూ’ అనే పాట ప్రారంభమయింది.
(సశేషం)
-----------------------------------------------------------
రచన: టి. చంద్రశేఖర రెడ్డి,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment