భారతీయ సాంప్రదాయంలో గురువు పాత్ర
సాహితీమిత్రులారా
భారతీయ సాంప్రదాయం ఆచార్యులకు అగ్ర తాంబూలం ఇచ్చింది. గురువును లేక ఆచార్యుని త్రిమూర్త్యాత్మకంగా చిత్రించడం మన సంప్రదాయంలోనున్న మహోన్నత దృష్టాంతము. 'గు' అనగా అంధకార బంధురము. 'రు' అనగా ప్రకాశ వంతమైన తేజస్సు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞాన ప్రకాశాన్నందించడమే నిజమైన గురువు యొక్క కర్తవ్యము. ఆధ్యాత్మికంగానూ , సామాజికంగానూ గురువు ప్రాధాన్యత ఎనలేనిది.
విద్యార్థి , గురువు మఱియు గురుకులము భారతీయ సంప్రదాయంలో పెనవేసుకొన్న బంధాలు. ఇవే విద్యాభివృద్ధికి, సంస్కృత వికాసానికి ఆలంబనాలు. గురు శిష్యుల పరస్పర అన్యోన్యత, సౌజన్యత విద్యాభివృద్ధికి దిశానిర్దేశమయ్యాయి. ‘‘ అన్నదానం మహాదానం విద్యాదానమతః పరమ్ l అన్నేన క్షణికా తృప్తిః యావజ్జీవం తు విద్యయా ll “ అంటూ విద్యాదాన ఔన్నత్యాన్ని చాటిచెప్పిన దేశం మనది. అందుకే పంచమహాయజ్ఞాల్లో 'అధ్యాపనం బ్రహ్మవిద్యా' అంటూ పేర్కొన్నారు. విద్య వల్ల తాను మాత్రమే విరాజిల్లితే అతడు ఆచార్య స్థానానికి అనర్హుడు. విద్యార్థి స్థాయికి దిగివచ్చి ఆతనిని తీర్చిదిద్ది తనతో సమానంగా అంటే ఒక దీపం మరో దీపాన్ని ప్రజ్వలించినట్లు చేయడం ఆచార్యుని ప్రథమ కర్తవ్యం. ఆచార్యుడు, దేవుడు ఒకే సారి వస్తే అచార్యునికే అగ్రపీఠం అంటాడు కబీర్ దాసు (गुरु गोविन्द दोऊ खड़े काको लागूं पायं। बलिहारी गुरु आपने जिन गोविन्द दियो बताय). అందుకే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ 'శ్రీ గురు చరిత్ర' ప్రవచనం లో ఓ గమ్మత్తైన మాట అంటారు. దుష్ట సంహారం కోసం పొందిన భగవంతుని అవతారం చాలా తేలిక. గురువుగా అవతరించి కొన్ని తరాలను ఉద్ధరించడం అవతార ప్రక్రియ లో ఒక క్లిష్టమైన విషయమంటారు వారు. అందుకే గురుపరంపర ఆగకూడదంటారు.
'సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్ l
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్ ll '
ఈశ్వరుని మొదలుకొని , శంకరాచార్యులను మధ్యనిడి , మా గురువు వరకు ఎవరెవరు ఆచార్యులున్నారో వారందరికీ నమస్కారము అని ఈ శ్లోకార్థము.ఈ పరంపర సంప్రదాయమే లేకుంటే మన సంస్కృతి ఏమయ్యేది? మన విజ్ఞానం ఎలా పరిఢవిల్లేది?
నిజమైన ఆచార్యుడు, సమాజ క్షేమాన్ని కోరే ఆచార్యుడు తాను కష్ట పడి సంపాదించిన జ్ఞానాన్ని అర్హత గల వారికి అందజేయడం కోసం హోమాలు సైతం చేస్తాడని తైత్తిరీయ ఉపనిషత్తు దృష్టాంతం చెపుతుంది.
'ఆ మా యంతు బ్రహ్మచారిణః స్వాహా
వి మా యంతు బ్రహ్మచారిణః స్వాహా
ప్ర మా యంతు బ్రహ్మచారిణః స్వాహా
ద మా యంతు బ్రహ్మచారిణః స్వాహా'
అంటే మేధా శక్తి గల వారు, ఇంద్రియ నిగ్రహులు, కోపహీనులు (శాంత స్వభావులు ) అయిన అర్హులు విద్యార్థులుగా రావాలి. శిష్యులను వుద్ధరించాలనే ఈ తపన గురువులను అగ్రస్థానం లో కూర్చోపెడుతుంది.
గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. అందుకే “गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः“ అంటుంది గురుగీత. విద్యకూ జ్ఞానానికీ బీజం నాటడం ద్వారా బ్రహ్మ, మనస్సు వికల్పం గాకుండా బ్రహ్మజ్ఞాన పరిష్వంగన అయి వుండడం కోసం మరియు సదా ప్రబోధన చేయడం ద్వారా విష్ణుత్వం గురువుకు ఆపాదించబడింది. బ్రహ్మజ్ఞానంలో భౌతికజ్ఞానం లయం చేయడమనే స్థితికి శిష్యుణ్ణి తీసుకొని రావడం శివతత్త్వానికి ప్రతీక.
గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నది అతిశయోక్తి గాదు. కేవలం విషయ సేకరణ జ్ఞానాన్ని అందించటం లేదు. విద్యను ఒక సముద్రంతో పోలిస్తే గురువు మేఘం వంటి వాడు. సముద్రంలోని క్షారగుణాన్ని నిబద్ధించి స్వచ్చమైన జ్ఞానధారను శిష్యులకు ఉపాధిగా ఇస్తుంటాడు గురువు. బుద్ధి జ్ఞానాల ఆంతర్యాన్ని టి.ఎస్.ఇలియట్ అన్న ఆంగ్లకవి ఇలా చిత్రీకరిస్తాడు:
Where is the Life we have lost in living?
Where is the wisdom we have lost in knowledge?
Where is the knowledge we have lost in information?
Information నుండి knowledge లోతుల్లోకి వెళ్లి wisdom ను అందించడమే గురువు సమాజానికి చేసే మహోపకారము.
ఇన్ని సత్ క్రియలు చేసే గురువు ఎలాంటి వాడై ఉండాలో కూడా మన సంప్రదాయం చెబుతుంది. శ్రోత్రియం మరియు బ్రహ్మ నిష్ఠ గురువుల కుండ వలసిన సద్గుణాలు. ప్రస్థానత్రయాల ప్రజ్ఞ శ్రోత్రియుల లక్షణం. విద్యార్థికి ఆత్మజ్ఞానప్రబోధం చేయడానికి కావలసిన వస్తుసామగ్రి శబ్ద రూపంలో గ్రహించి తేట తెల్లంగా చెప్పడానికి శ్రోత్రియం ఉపకరిస్తుంది. మరి బ్రహ్మనిష్ఠా? ఇది అత్యంత అవసరమైన గుణం. తాను స్వయంగా ఆత్మజ్ఞానానుభూతిని పొంది ప్రబోధించడం బ్రహ్మనిష్ఠకు పరాకాష్ట. నరేంద్రుడు 'దేవుణ్ణి చూచారా' అని ఎందర్ని అడిగినా ఒక్క రామకృష్ణ పరమహంస మాత్రం దేవుణ్ణి చూశానని, చూపించ గలనని భరోసా ఇవ్వగలిగాడు. ఈ రెండు గుణాలే కాక గురువు శాంతుడు, వినయశీలి, ఆచారశీలి, బుద్ధిమంతుడు అయి వుండాలన్నారు మన పూర్వీకులు.
‘శాంతో దాన్తః కులీనశ్చ వినీతః శుద్ధ వేషవాన్l
శుద్ధాచారస్సుప్రతిష్ఠః శుచిర్దక్షః సుబుద్ధిమాన్ ll
అధ్యాత్మజ్ఞాననిష్ఠశ్చ తంత్ర మంత్ర విశారదః l
నిగ్రహస్సు గ్రహీశక్తో గురురిత్యభిదీయతే ll ’
'బుద్ధి చెప్పు వాడు గ్రుద్దితేనేమయా ' అంటాడు వేమన. శిష్యుణ్ణి సన్మార్గంలో ఉంచడానికి ఒక దెబ్బ కొడితే అది మంచికే గాని చెడుకు గాదన్న సంగతి పెద్దలు గ్రహించాలి.
సామృతైః పాణిభిర్ఘ్నన్తి గురవో న విషోక్షితై: l
లాలనాశ్రయణో దోషాః తాడనా శ్రయణో గుణాః ll
గురువు శిష్యులను తన అమృతహస్తాలతో కొడతాడే కానీ చెడు అక్షంతలతో కాదు. ఈ శ్లోకార్థమే “లాలనే బహవో దోషాః తాడనే బహవో గుణాః l తస్మాత్ పుత్రం చ శిష్యం చ తాడయేత్ న తు లాలయేత్ ll“ – లాలించడం వలన చాల దోషాలు ఉన్నాయి. కొట్టడం వలన చాల గుణాలు ఉన్నాయి. అందువలన పుత్రుని శిష్యుని కూడ కొట్టి మంచి మార్గంలో పెట్టాలి అని సుభాషితకారులన్నారు. అంతే కాక “లాలయేత్ పంచవర్షాణి దశ వర్షాణి తాడయేత్ l ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ ll“ – పుత్రునికి అయిదు సంllలు వచ్చే వరకు లాలించాలి. తర్వాత పది సంllలు కొట్టి మంచి మార్గంలో పెట్టాలి. పుత్రునికి పదహారు సంllలు వచ్చిన తర్వాత మిత్రునివలె చూసుకోవాలి అని సుభాషితకారులన్నారు. ఇట్లా మన భారతీయ సంప్రదాయంలో పుత్రునికి , శిష్యునికి అభేదాన్ని చెప్పారు. పుత్ర, శిష్యులు ఇరువురూ గురువుకు పుత్రులే అని భారతీయ సంస్కృతి తెలియజేస్తున్నది.
ఇంతగా గురువును గూర్చి చెప్పిన మన సంప్రదాయం ఇప్పటి విద్యా పద్ధతులకు అనుగుణంగా నిలబడుతుందా? అదేమో గురుకుల సంప్రదాయము. ఇప్పటిదేమో తద్భిన్నమైన సంప్రదాయము. అప్పట్లో గురువు నీడలో శిషులు విద్యాభ్యాసం చేసేవారు. గురుకులంలోనే వుండేవారు. నేడు అలా కాదు. గురు శిష్యుల మధ్య అంతరాలు పెరిగాయి. దూర శ్రవణ విద్య, అంతర్జాలం ద్వారా గురువుతో సంబంధాలు, వీడియో మరియు ఆడియో లాంటి సరికొత్త పోకడలు నేటి అంతర్జాతీయ విద్యా రంగలో క్రొత్త మలుపులు. విద్యా వస్తువు సైతం సమూలంగా మారింది. ఆత్మజ్ఞానమంటే ఏమో అవసరం లేదు. డబ్బెలా సంపాదించాలి? అవసరాల్ని సృష్టించి, పెంచి, అప్పులిచ్చి, వస్తువుల్ని ఎలా విక్రయించాలి? ఇలాంటి భావనలు (consumerism tendencies) ప్రబలంగా విద్యారంగం లో చోటు చేసుకొన్నాయి.
ఇలాంటి జీవన యానంలో గురువు స్థానం ఎక్కడ? ఇది విశ్లేషించుకోవలసిన విషయము. మన సాంప్రదాయాన్ని నేటి పద్ధతులకు అన్వయంచుకొని ఎలా సంరక్షించుకోవాలి? నేటి గురువు ఈ కాలపు అవసరాల రీత్యా నిత్యం తన జ్ఞానాన్ని పెంచుకోవలసిన అవసరం ఎంతో వుంది. అలాగే శిక్షణా శైలి కనుగుణంగా శిక్షణా నైపుణ్యాన్ని(teaching skills) పెంపొందించుకోవాలి. నైతిక ప్రవృత్తి విద్యార్థులలో పెంపొందించడం కోసం తాను ధార్మికగ్రంథాధ్యయనం చేయాలి. విద్యాభ్యాసనా సమయంలో లోపించిన నైతిక ప్రమాణాలే నేటి సామాజిక రుగ్మతలకు కారణమన్న సత్యాన్ని గురువు దృఢంగా విశ్వసించాల్సిన సమయమిది. ‘Analytical knowledge, emotional knowledge and spiritual knowledge are the integral part of the overall education’ అన్న సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా శిష్యుణ్ణి తీర్చిదిద్ద గలిగే వాడే నేటి గురు స్థానానికి అర్హుడు. 'గూగుల్' కావలి హద్దుల్లోకి వెళ్లి విషయాలను విశ్లేషించి సారాన్ని సారవంతంగా శిష్యునికందించాల్సిన అగత్యం గురువుపైనుంది అనడంలో సందేహం లేదు. అతి కష్టమైన విషయాన్ని సూక్ష్మంగా అన్వయించి అఖండంలో అణువునూ, అణువులో అఖండాన్ని సాక్షీభూతం చేస్తూ సాగరాన్ని సైతం ఘటంలో ఇమిడ్చి ఇవ్వగల నేర్పరి నేటి నిజమైన గురువు. అతనే ఆచార్య స్థానానికి అర్హుడు. సదా సత్కారార్హుడు.
--------------------------------------------------------
రచన- డా. కరణం నాగరాజ రావు,
మధురవాణి సౌజన్యంతో
No comments:
Post a Comment