Monday, July 23, 2018

మెయి బూదిపూత మాగాణి


మెయి బూదిపూత మాగాణి

సాహితీమిత్రులారా!పునుకల్ జూచిన కాజగడ్డలు, ఫణుల్ పొల్పారు కాజాకు లే
మననౌ జాబిలి కాజపూ, వెరువు పెల్లై సారమౌ దుబ్బుల
ల్లిన యుండల్, మెయి బూదిపూత తెలిఢిల్లీభోగముల్, చేను నీ
వనెదన్ మా పితృపాదులమ్మని పొలంబౌదీవు – విశ్వేశ్వరా!

శోభనాద్రిగారని పూర్వం నందమూరు గ్రామంలో ఒక బ్రాహ్మణ గృహస్థు ఉండేవాడు. ఆయన గొప్ప దాత. ఆయన దాతృత్వానికి ఆస్తి అంతా కరిగిపోయింది. పొలాలన్నిట్నీ దాదాపు అమ్మి మరీ దానం చేశాడట. నకనకలాడే కడుపులతో వచ్చి త్రేన్చుకుంటూనూ, చినిగిన గుడ్డలతో వచ్చి క్రొత్త బట్టలు కట్టుకొనీనూ పోయేవారట ఆర్తులు– చీకట్లను వదిలి వెల్తురును మోసుకుపోతున్నట్లు. ఆయన కాశీనుంచి ఒక లింగం తెచ్చి ఒక ఆలయాన్ని నందమూరులో కట్టి ఆ శివుణ్ణి ఆ గుళ్ళో ప్రతిష్ఠించాడు. తన చేతిలో పెల్లురేగిన దాతృత్వ శౌర్యాగ్నికి ఆయన కొడుకులకు దారిద్ర్యం మిగిలితే-– ఆ గుడిలోని శివుణ్ణి, బంగరుకొండ చేదాల్చినవానిని (శివుని విల్లు మేరుపర్వతము) చూపించి, ఈయనను సేవించండి అని చెప్పి గతించాడట.

ఆయన కుమారుడైన విశ్వనాథ సత్యనారాయణ వారి వూరిలోని ఆ విశ్వేశ్వరుని మీద ‘మా స్వామి’ అనే పేర వ్రాసిన విశ్వేశ్వర శతకము లోనిది పై పద్యం.

ఈ విశ్వేశ్వర శతకము చాలా విలక్షణమైనది. ఈ శతకంలోని తొలి రెండు పద్యాలూ శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్యంలో తొలి రెండు పద్యాలుగా అమర్చుకున్నాడు ఆయన. ఈ శతకం 1916లో ప్రారంభం చేసినా 1926లోగాని ముగించలేదట. ఇది విలక్షణమైనదని ఎందుకన్నానంటే పరమేశ్వరునితో ఎన్ని రకాలుగా ముచ్చట్లు చెప్పాడో, ఎన్ని చోట్ల ఆశ్చర్యం పొందాడో, ఎంత బ్రతిమలాడాడో, ఎంత అలిగాడో, ఎంత కోపపడ్డాడో, ఎంత భక్తిభావాన్ని వెలార్చాడో, శివుణ్ణి ఎంత పరిహాసం చేశాడో, ఎన్ని వైవిధ్య భావాలను రాశిపోశాడో, ఎంత ప్రతిపద్య చమత్కారం చూపాడో, ఎన్ని అద్భుతమైన సమాసాలు గుప్పించాడో, ఎన్ని విధాలుగా స్వామిని సంబోధించాడో, ఎంత ఛందస్సుందరంగా పద్యాలను పొదిగాడో– అది కేవలం అనుభవైకవేద్యమే తప్ప– వివరించాలంటే ప్రతి పద్యమూ ఒక గ్రంథమౌతుంది. నిజానికి ఈ ఒక్క పద్యం ఒక దృష్టాంతముగా ఉటంకించబడుతున్నది గాని వంద పద్యాల్లో కనీసం తొంభై పద్యాలు ఎత్తి చూపవలసినవి ఉన్నాయి.

‘నీవో యౌవనమూర్తివౌదువు అన్నపూర్ణాంబికాదేవిన్ జూచిన వృద్ధవోలె మదికిం దీపించు’ అని ఆశ్చర్యపోతాడొక పద్యంలో. ‘ముమ్మొన కర్రతో తడుముకొంచున్ లచ్చిగేహంబు ముందర నిల్చున్ భవదీయ భిక్షుకత కంతం బెప్డు విశ్వేశ్వరా’ అని వింతపడతాడొక చోట. ‘నీతో సయ్యాటములాడెదను, ఎట్లో సైరింతువు మత్కృత పరీహాసంబు’ అని సమాధానపడతాడు. ‘ఏమి కాపురమయ్యా మీది, ఆ కొండకోయతకు నీ యొయ్యారమే, బూదిపూతే నచ్చింది. నీకామె సొగసు నచ్చింది. ఒక ఏనుగు మొగమాయన్నూ, ఒక ఆరుమొగాలాయన్నూ కన్నారురయ్యా సంతానము’ అంటూ పరిహాసం చేస్తాడు. నీకు అభిషేకం చేద్దామంటే నమకంగూడా రాదు. ‘హూణ వాక్కావ్యామోదము ముక్తిత్రోవెదురు చుక్కైపోయె’ అని బాధపడతాడు. ‘నా మొర నీకు విన్పించదా? అసలు నాలో దోసమేముందో నిరూపించవయ్యా ముందు’ అని నిలదీస్తాడు. ‘నా బ్రతుకు ఎండి బీడువడి నెఱ్ఱెలై ఉంది. నీ కరుణ వర్షాగాఢజీమూతాల కుంభవృష్టి కురిపించవయ్యా’ అని వేడుకుంటాడు.

పద్యాలు క్రమంగా చదువుకుంటూ వస్తే– చివరలో ఒక దశలో ఆయనకు శివసాక్షాత్కారం అయిందా అనే నమ్మకమైన భావం చాటే పద్యాలు కనిపిస్తాయి. ‘నీపై విశ్వాసమునుంచితిన్ వదలకప్పా’ అన్న తర్వాత, ‘ఆకర్ణించెద నేమియో ప్రమథ శంఖారావమో, నన్నిదే కైకో నీవరుదెంతు వీ ధ్వని యదే గాబోలు విశ్వేశ్వరా’ అని శివుని రాకను గమనిస్తాడు. ఆ తర్వాత దర్శనమై ‘శౌక్లద్యుత్యూర్జిత దీపితావయవ సమ్లానంబు నీ మూర్తి ఏమనుదు మద్భాగ్యంబు’ అంటాడు. ‘నీదు రాక గురుతింపన్ లేనె’ అని తనకు తాను నమ్మకం చెప్పుకుంటాడు. ‘రమ్ము తీర్చెద పథాయాసంబు’ అని తన పాదాలు అందించమంటాడు. ‘నా కన్నులన్ బడివచ్చు బాష్పములు, కంఠవ్యగ్ర గాద్గద్యముల్, మై కేడించిన లేత చెమ్మటలు, రోమాంచాలు’ అని పరవశపడిపోతాడు. నీ కారుణ్యము కోసం అంగలార్చిన దినాల్లో నా ‘జిహ్వాగ్రవాణీ కింకింకిణి నూపుర స్వనములెంతే దట్టమైపోయె’ – నేడీ కారుణ్యము చూసి నాకసలు నోరేరాదు – అంటాడు. ఈశ్వరుణ్ణి దృష్టం కావించుకున్న మహా భక్తుడిగా కనిపిస్తాడు విశ్వనాథ ఈ శతకంలో.

అసలు పద్యం వ్రాయడాన్ని ఆయన పరీక్షగా తీసుకుంటాడనిపిస్తుంది, ఏ పద్యమైనా కూడా. విసర్గపూర్వక అక్షరాలు ప్రాసగా తీసుకుంటాడు. ద్విత్వాక్షరలు సరేసరి. సంయుక్తాక్షరాలు క్త్య, గ్వ్య లాంటి వాటిని ప్రాసలో పెట్టుకొని అశ్వధాటిగా పద్యాన్ని పరిగెత్తిస్తాడు. ‘నైశాటప్రాణ మరున్మహాభుజగవంశస్వామి’, ‘దైవత జగద్ద్రుశ్రీప్రసూన ప్రభాస్రగ్వ్యుత్పత్తులు’, ‘సంసరణాంభోధి మహాపదద్రిధుత తృష్ణావీచి కల్లోలగహ్వరము’లాంటి మైళ్ళు మైళ్ళు పొడుగుండే సమాసాలు బిగిస్తాడు. ఇదుగో ఈ పద్యం గమనించండి:

మీ దాతృత్వమొ, తండ్రి దాతృత్వయొ మీ మీ మధ్యనున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబులేదిట్లురా,
ఏదో లెక్కలు తేల్చుకో! మొరటుతో నేలా! యొడల్ మండెనా
ఏదో వచ్చినకాడికమ్మెదను సుమ్మీ! నిన్ను విశ్వేశ్వరా!

వ్యావహారిక భాషను ఎంత సహజంగా, అలవోకగా పద్యంలో నిబంధించాడో చూడండి.

ఈ శతకంలోని తొలి పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షం కావ్యములో తొలి పద్యంగా పెట్టుకున్నాడనుకున్నాము గదా. ఆ పద్యంలో ‘చిద్గగన ప్రాలేయాంశువు’ అనే పదముంది. ‘ప్రా’ అనే ద్విత్వాక్షరం ముందున్న ‘న’ అనే అక్షరం లఘువుగా వాడాడు. ఒకే సమాసం మధ్యలో వున్నప్పుడు ద్విత్వాక్షరం ముందున్న లఘువు గురువౌతుంది గదా, నీ కావ్యం తొలి పద్యంలోనే ఛందోదోషముంది అనీ, మరికొన్ని విషయాలనూ ఉటంకిస్తూ, కొత్త సత్యనారాయణ చౌదరి అనే పండితుడు తీవ్ర విమర్శ లేవనెత్తాడు. దరిమిలా పాత సత్యనారాయణగారి అనుయాయులూ వ్యతిరేకులూ — కొత్త సత్యనారాయణగారి సమర్థకులూ వ్యతిరేకులూ, వీరందరూ పుంఖానుపుంఖాలుగా విమర్శలూ ప్రతివిమర్శలూ చేసుకున్నారు 1960లలో, ఆంధ్రపత్రికలో. చాలా తుములంగా సాహిత్య సమరం జరిగి చాలా కాలం కొనసాగింది. మనవాళ్ళకు సహజబుద్ధులెక్కడికి పోతాయి. ఆ విమర్శల్లో అంతర్లీనంగా బ్రాహ్మణ అబ్రాహ్మణ కులవాదాలూ సాహిత్యేతర వ్యాఖ్యలూ చోటుచేసుకున్నాయి. సాహిత్యప్రియులు ఎంతో ఆత్రంతో వచ్చేవారం ఎవరు ఎవర్ని సమర్థిస్తారో, ఎవరు ఎవర్ని ఖండిస్తారో అని ఎంతో కుతూహలంగా ఎదురుచూసేవారు. ఆ ఖండనమండనలన్నీ క్రోడీకరించి ఎవరైనా పుస్తకంగా వేశారో లేదోగానీ మళ్ళీ వాటిని చదవడానికి దొరకలేదు. ఇదంతా విషయాంతరం లెండి.

ఇక పైన చెప్పిన పద్యానికి వద్దాం. తండ్రి చేసిన దానాల ఫలితంగా ఉన్న పొలమంతా ఊడ్చుకుపోగా ఒకట్రెండు ఎకరాలు మిగిలినట్లున్నాయి. అదీ మాగాణీ పొలం. ఆ పొలం ఆయనకు శివునిలాగా కనిపించిందో, శివుడే ఆ పొలంలాగా కనిపించాడోగాని– నువ్వు మా తండ్రి అమ్మని పొలానివనిపిస్తున్నదయ్యా అంటున్నాడు. శివుని వంటిమీది బొమికలు పొలంలో మొలిచిన కాజగడ్డలుగానూ, ఆయన మెడలోని పాములు కాజాకులుగానూ, జాబిల్లి కాజపూవుగానూ, శివుడి వెంట్రుకల ముడులు చేలో ఎరువు చల్లినప్పుడు అక్కడక్కడా ఎక్కువ పడినచోట దట్టంగా మొలిచిన దుబ్బులుగానూ, తెల్లని బూదితో అలముకున్న శివుని శరీరం తెల్లని ఢిల్లీ భోగాల వరిగింజల కంకుల్తో పరచుకున్న పొలంగానూ కనిపించి, ‘మా పితృపాదులమ్మని పొలంబౌదీవు విశ్వేశ్వరా’ అని వర్ణిస్తున్నాడు. పోతూ పోతూ వారి తండ్రి మిగిల్చింది ఆ కొద్దిపాటి పొలం. చూపించి పోయింది శివుడిని. ఆ రెండూ ఆయన దారిద్ర్య నిర్వాపణాలే. ప్రయోజనంలో మాత్రమే గాక ఆకారంలో కూడా ఇద్దరికీ పోలికలు కనిపెట్టి, అదీ ఇదీ ఒకటే అని రూపించుకున్న అందమైన భావన ఇది. పద్యాల్లో ప్రౌఢిమ, భావాల్లో శబలత, ఊహల్లో విశృంఖలత– భావకవిగా ప్రారంభమైనా దరిమిలా ఏ ఉద్యమంలోనూ ఇమడనంతగా ఎదిగిన హిమాలయ శిఖర సదృశుడైన కవి విశ్వనాథ.
(‘ఢిల్లీ భోగాలు’ వరి ధాన్యంలోని మేలు రకాల్లో ఒకటి)
----------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment