Monday, July 9, 2018

గెలుపు - (అనువాద కథ 1వ భాగం)


గెలుపు - (అనువాద కథ 1వ భాగం)



సాహితీమిత్రులారా!




“ఆ కాలంలో ఈ కాస్మోపొలిటన్ క్లబ్ అన్నది పురాణాల్లో చెప్పిన మేరుపర్వతం వంటిది. దేవతలు దిగివచ్చి పాతాళాన్నుండి పైకివచ్చే రాక్షసులను ఇక్కడే కలుసుకుంటారు. మధ్యలో మా లాంటివాళ్ళు ఏమీ అర్థంగాక తిరుగుతుంటారు. వాళ్లని మీరు చూడగలరు కానీ ఏం చేస్తున్నారన్నది అర్థం కాదు. ఇద్దరి దయాదాక్షిణ్యాలూ మాకు కావాలి. కాబట్టి వినయమే ప్రధానం అన్నట్టు ఉండేవాళ్ళం,” అన్నారు ఎస్.ఆర్. నమశ్శివాయం.

మేము బ్లాక్ లేబుల్‌ విస్కీ చివరి రౌండ్‌లో ఉన్నాం. ఆయన బ్రాండ్ అది. మందు కొట్టడానికి పిలిస్తే ఆయన అదే అడుగుతారు. అప్పుడు మాత్రం ఆ కళ్ళలో ఒక చిన్న మెరుపు అలా వచ్చి పోతుంది. అంతే తప్ప, మనిషి లోపల ఏముంటుందోనన్నది బయటకి అసలు కనిపించకుండా దాచుకున్న శరీరం ఆయనది. కళ్ళు కూడా రెండు రంధ్రాల్లా ఉంటాయి. వాటిలోకి చూస్తే లోపల నుండి ఎవరో శ్రద్దగా మనల్ని చూస్తున్నట్టు మాత్రం తెలుస్తుంది.

నా తల ఒకవైపుకి వాలిపోయింది. ఎందుకనో లేచి ఇంటికెళ్ళాలనిపించింది. పెద్ద నీటి సంచిలా బరువుగా కుర్చీని ఆక్రమించుకునుంది నా శరీరం!

“ఎందుకోయ్, అలా కదులుతూనే ఉన్నావు?” అడిగాడు సహదేవుడు.

“ఏం లేదు,” అన్నాను.

“కాళ్ళాడించకు మరి,” అన్నాడు. నేను కుర్చీకిందకి కాళ్ళు లాక్కున్నాను.

“బాత్రూముకెళ్ళాలా?” అనడిగాడు ప్రభాకర్.

“లేదు.”

కాస్మోపొలిటన్ క్లబ్‌లో మేము మామూలుగా ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటాం. తమిళంలో మాట్లాడకూడదనే నియమాలేం లేవు. అయినా, మందు మొదలయితే ఇక పొరపాటున కూడా తమిళ మాటలు రాలవు. కాస్మోపొలిటన్ క్లబ్ బ్రిటిష్‌వాళ్ళ కాలం నాటిది. ముప్పై అడుగులకు పైగా ఎత్తున్నగోడలు, శంఖాకారపు పెంకుల కప్పు. ఉక్కు బీములకు వేలాడుతున్న ఫేన్లు తిరుగుతూ ఉంటాయి. అవి కూడా డెబ్బై ఎనభైయేళ్ళ నాటివే! కుర్చీలను, టేబుళ్ళనూ పది మంది పనివాళ్ళుంటే తప్ప కదపడం కుదరదు. కర్రతో చేసిన ఆ కుర్చీలన్నీ చాలా పెద్దవే. నాలాంటోళ్ళు ఈ కుర్చీల్లో కూర్చుంటే కాలి బొటనవేలితో మాత్రమే నేలను తాకగలరు. తెల్ల దొరలవి పెద్ద విగ్రహాలయి ఉండుండాలి. వాళ్ళే అసురులేమో; అయితే మరి దేవతలు…?

ఎస్.ఆర్. నమశ్శివాయం మిగిలిన విస్కీని నోట్లోకి ఒంపేసుకుని గ్లాసు దూరంగా పెట్టారు. సహదేవుడు ఆయన గ్లాసు నింపుదామని సీసా అందుకున్నాడు.

“ఒద్దు,” అన్నారు నమశ్శివాయం.

“ఎందుకు?” అడిగాడు ప్రభాకర్.

“ఇప్పుడు కాస్త మత్తుగా ఉంది. ఒంటిలో డెబ్బైరెండు మరలుంటాయి. అన్నిట్నీ ఒకటి రెండు చుట్లు తిప్పి గ్రీజ్ ఆయిల్ పోసినట్టుంది. ఇంజిన్ శబ్దం చెయ్యకుండా పరిగెడుతోంది…” అన్నారు నమశ్శివాయం.

ఆ కాలంలో అంబాసిడర్‌కి పూర్వం స్టాండర్డ్ కార్ల లోకల్ ఏజెంట్‌గా ఉండేవారు నమశ్శివాయం. కార్లు తయారు చేసేది స్టాండర్డ్ కంపెనీ; అమ్మేవారు మైదీన్ ఖాన్ అండ్ సన్స్. నమశ్శివాయం ధనికుల్ని వెళ్ళి కలిసి, వాళ్ళ మనసుల్లో స్థానం సంపాయించి వాళ్ళ చేత కారు కొనాలన్న కాంక్షని కలిగించేవారు. కారు అన్నది పాత రోజుల్లో రాజుల భవనాల ముందు ఉండే రథం లాంటిది లేదా మఠాధిపతులకు ముందు నడిచే ఏనుగు లాంటిది లేదా దేవాలయంలో ఇవ్వబడే అగ్రతాంబూలం వంటిది లేదా అందమైన మలయాళ దాసీని తనకు మాత్రమే ఉంచుకోవడం లాంటిది. కారుండటం అంత గొప్ప- అన్న విషయాన్ని వాళ్లకి ఆసక్తి కలిగేలా చెప్పాలి.

ధనికులతో అలవాటుగా మాట్లాడటంవల్ల దానికి తగిన ఒక భాష, వేషం, బాడీ లేంగ్వేజ్ ఆయనకు వంటబట్టింది. ఇప్పటికీ, ఇంత పెద్దవాడయ్యాక కూడా, ఒక్కో మాటలోనూ ఆ పాత వినయం ధ్వనిస్తూనే ఉంటుంది. ఈ కాస్మోపొలిటన్ క్లబ్‌కి ఇప్పుడు వస్తున్నవాళ్ళలో సీనియర్ మోస్ట్ నమశ్శివాయమే. ఆయనకి తొంభైయారు దాటాయి. పట్టు కాల్షరాయి, లినెన్ కోటుతో తెల్ల దొరలు తిరిగిన రోజుల్లోనే క్లబ్‌ మెంబరయిపోయారు. ఆయన ఆ రోజుల్లో ఇక్కడ చూసిన వాళ్ళంతా చనిపోయాక కూడా వారానికి మూడు రోజులు క్లబ్బుకు వస్తున్నారు.

కాస్మోపొలిటన్ క్లబ్‌కి ఇప్పుడు వస్తున్నవాళ్ళకు ఆ బిల్డింగ్ గురించో, దాని చరిత్ర గురించో తెలుసుకోవాలన్న ఆసక్తి కించిత్తయినా లేదు. క్లబ్‌ చుట్టూ ఉన్న పెద్ద మైదానం, పెద్ద పెద్ద చెట్లు, దట్టమైన తోటలూ మాత్రమే వాళ్లకి ప్రధానాంశం. ఈ సిటీలో ఇంత విశాలమైన ప్రాంగణం మరే క్లబ్బుకీ లేదు. ఈ పాతకాలం మందపాటి గోడలు, పెద్ద కిటికీలు, తుప్పుపట్టిన చువ్వలు, ఎర్ర మొరాకో తోలున్న సింహాసనంలాంటి కుర్చీలు, టేకు కర్రతో వేయబడ్డ ఫ్లోరింగు- వీటన్నిటికీ అద్దంపట్టే అన్ని కథలూ నమశ్శివాయం దగ్గరే ఉన్నాయి. మందు ఒకటి రెండు రౌండ్లయ్యాక ఆయనతో మాట్లాడటం, ఆ క్లబ్ పాత వాతావరణాన్ని ఇంకాస్త ఆసక్తికరంగా మారుస్తుంది.

ఇలా చరిత్ర కథలు చెప్పేవారందరూ దానికి మర్మాన్ని, భయాన్నీ ఎందుకు జోడిస్తారో నాకు అర్థం కాదు. అది నమశ్శివాయం నైజం అయుండచ్చు. ఏది చెప్పినా కాస్త పురాణాలు ఇతిహాసాల ఉపమానాలు కలిపి మాత్రమే చెప్పగలరు.

“దేవతల్ని కలుసుకోవడం అన్నది అరుదైన అవకాశం కదా? వరాలు అడగొచ్చు…” అన్నాడు ప్రభాకర్.

అతను ఆయనచేత మాట్లాడించాలనుకున్నాడు. అయితే ఆయన ఎప్పట్లాలేరు అని నాకనిపించింది. మామూలుగా రెండు పెగ్గులవ్వగానే చాలా సహజంగా ఉండాలన్నట్టు, కాళ్ళూ చేతులూ చాపుకుని, ఎడంవైపు ఒంపుతిరిగిన నవ్వొకటి విసురుతూ, ఒక్కొక్కరి వంకా చూస్తూ మాట్లాడటం మొదలు పెట్టేవారు. మాటలు కొనసాగే కొద్దీ గతం నుంచి ఎన్నెన్నో సంఘటనలు, చిన్న చిన్న కబుర్లు, వర్ణనలు పెల్లుబికివస్తాయి. అందుకు భిన్నంగా ఈ రోజు తనలో తానే మునిగిపోయున్నట్టు తోచింది.

బయటకు లాక్కొచ్చేయాలనట్టు సహదేవుడు ప్రయత్నిస్తున్నాడు. “ఆ రోజుల్లో కాస్మోపొలిటన్ క్లబ్‌లో మెంబర్ అవ్వడం సులువు కాదు కదా? మొదట్లో మీరేం పెద్ద స్థాయి వ్యాపారం చెయ్యలేదు, ఎదిగింది తర్వాతి రోజుల్లోనే అన్నారు కదా, మరి అప్పట్లోనే ఇక్కడ ఎలా మెంబర్‌షిప్ సంపాయించారన్నదే ఆశ్చర్యంగా ఉంది!” అన్నాడు.

“నేను మెంబర్ అయింది చాలా కాలం తర్వాతే. అంబాసిడర్ ఏజెన్సీ తీసుకుని, డబ్బు సంపాయించి, బంగ్లా, కారు, ఫిక్సెడ్ డిపాజిట్‌లు జీవితంలోకి వచ్చాకే ఇక్కడ మెంబర్ అయ్యాను. అప్పుడు కూడా నాలుగేళ్ళు వెయిట్ చెయ్యాల్సొచ్చింది. ఆ రోజుల్లోనే డెబ్బైవేలు కట్టాను. ఆ డబ్బుకి సిటీలో పెద్ద ఇల్లు కొనొచ్చు. అంత డబ్బు మరి!” అన్నారు నమశ్శివాయం.

“అంతకు ముందువరకూ ఇక్కడికి వ్యాపారం కోసం వచ్చేవాణ్ణి. ఇక్కడున్న ఇద్దరు మేనేజర్లు నా స్నేహితులు. వాళ్ళలో ఎవర్నో కలవడానికన్నట్టు లోపలికి వచ్చేవాణ్ణి. అప్పట్లో ఈ కూటమంతా ఈ నగరపు పెద్దమనుషులతో నిండిపోయుండేది. జమీందార్లు, మిల్లు ఓనర్లు, మోటర్ కంపెనీల యజమానులు కూర్చుని తాగుతుండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళలో సగంమంది తెల్లదొరల్లా మారిపోయారు. మిగిలివాళ్ళు అలా మారేందుకు ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళ సంభాషణలన్నీ వాటి గురించే.

కబుర్ల కాలక్షేపంలో మునిగిపోయున్నవాళ్ళ దగ్గరకెళ్ళను. ఒంటరిగా కూర్చున్న వాళ్ళను సమీపించి మాటలు పెట్టుకుంటాను. ఎవరికోసమో కాచుకునుంటారు కాబట్టి వాళ్ళొచ్చేంతవరకు నాతో మాటలు సాగిస్తారు. కాలక్షేపానికి నాలాంటివాళ్లతో మాట్లాడటం బాగుంటుంది వాళ్లకి. నా బాడీ లేంగ్వేజ్ చూడగానే నేను ధనికుణ్ణి కాదని, ఏదో అమ్మడమో కొనడమో నా ఉద్దేశం అని పసిగట్టేస్తారు. కూర్చోమని చెప్పరు. నిల్చునే మాట్లాడేవాణ్ణి. ఎవరో కొందరు మాత్రం అక్కడి సిబ్బందిని పిలిచి ఒక ముక్కాలి పీట(స్టూల్) వేయమనేవారు. అది ఆరోజుల్లో పెద్ద ఉదారత అనే చెప్పుకోవాలి.

అయితే నా జీవితంలో పెద్ద వ్యాపార లావాదేవీలన్నీ ఈ కాస్మోపొలిటన్ క్లబ్‌లోనే జరిగాయి. ఈ క్లబ్ లేదంటే నాకు జీవితమే లేదనికూడా చెప్పొచ్చు. నా కర్మభూమి ఇదే!” మళ్ళీ ఆయన తన గ్లాసువైపు చూశారు. ఆయన చూపుని అర్థం చేసుకుని సహదేవుడు గ్లాసు నింపాడు. చేతికందుకుని తిప్పుతూ, “రాయల్ కోట్స్ అన్న కంపెనీ గురించి విన్నారా?” అనడిగారు.

“అవును. పందొమ్మివందలా డెబ్బైలో అది లాకౌట్ చేసేశారు కదా?” అన్నాను.

“ఒకప్పుడు ప్రత్తి పరిశ్రమని స్థాపించినవారు శివశైలం జమీందారు; రామానుజ నాయక్కర్ అని ఆయన పేరు. మైకేల్ గ్రీన్స్ అన్న తెల్లదొరతో కలిసి ప్రారంభించారు. ఆ రోజుల్లో ఇక్కడ ప్రత్తిని దారంగా మార్చే మిల్లులు లేవు. దక్షిణభారతంలోనే మొట్ట మొదటి కాటన్ మిల్లు వారిదే. కాబట్టి డబ్బులు కురిసేవి. తర్వాతి జమీందారు పెత్తనానికొచ్చాక అది పది రెట్లయింది.

అతని పేరు రంగప్ప నాయక్కర్. అమెరికా వెళ్ళి చదివొచ్చినోడు. ఆ రోజుల్లో లండన్ వెళ్ళి చదవడమే ప్రసిద్ధి. అమెరికాలో చదివొచ్చినోడు అతనొక్కడే. ఆ టెక్కే వేరు. ఈ క్లబ్బులో వందమందున్నా ఇతను అమెరికాలో చదివొచ్చినోడని ప్రత్యేకంగా తెలిసిపోయేది. ఆ నిక్కులో… నవ్వకండి, నిజంగానే తెలిసేది. ఆక్స్‌ఫోర్డ్‌లోనో కేంబ్రిడ్జ్‌లోనో చదివొచ్చినవాళ్ళు బ్రిటిష్ ప్రభువుల్లా ప్రవర్తించేవాళ్ళు. వెడల్పయిన కాలరున్న షర్ట్ వేసుకుని మెడని వెనక్కి వాల్చుకుని గడ్డం పైకెత్తుకుని ఉంటారెప్పుడూ. ఎవర్నయినా పిలవాలంటే చేయి చాచి చిటికెనవేలుని కదిపేవారు. రెప్పలు సగం కిందకివాల్చి ఎక్కడో ఒక లలితగీతాన్ని వింటున్న ధోరణిలో ఉంటారు. మాటల్లో నడకలో ఒక ఆడంగితనం కనిపిస్తుంది. చేతులు తిప్పడం, తలవంచి సెలవివ్వడం, కౌగిలించుకునేలా ఆహ్వానించడం- ఇలా. ఇప్పుడవి స్టేజ్ మీద మేజిక్ చేసేవాడి చేష్టల్లా అనిపిస్తాయి. రెండు కాళ్ళనూ దగ్గరగా పెట్టుకుని కత్తెరలా నడుస్తారు. డాన్స్ చేసేప్పుడూ అంతే.

ఇలాంటి ఏ చేష్టలూ అమెరికాలో చదివినవారిలో ఉండవు. వాళ్ళు అప్పుడే ఒక మొరటు గుర్రంమీంచి దిగివచ్చినట్టు కనిపిస్తారు. బల్లగుద్ది నవ్వుతారు. రెండు వేళ్ళతో చుట్టని పట్టుకుని ధీర్ఘంగా పొగపీలుస్తారు. దేన్నీ లెక్కచేయని కొంటె నవ్వొకటి వారి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. అవును. అదే, క్లింట్ ఈస్ట్‌వుడ్ నవ్వది!

బ్రిటిష్ చదువులు చదివినవాళ్ళు ఎప్పుడూ గొప్ప విలువల్ని మోసుకు తిరిగేవాళ్ళలా కనిపిస్తారు. అమెరికాలో చదివినవాళ్ళు ఎటువంటి విలువలమీదా నమ్మకం లేనివాళ్ళలా ఉంటారు.

నాకు రంగప్ప బాగా నచ్చేవాడు. నన్ను మిగిలినవాళ్ళలా ట్రీట్ చేసేవాడు కాదు. నా భుజంమీద చేయి వెయ్యడానికీ నా కాలర్ సవరించడానికీ చూడగానే భుజం తట్టి నవ్వి స్వాగతించడానికీ వెనకాడేవాడు కాదు. ఆయనతో సమానంగా కుర్చీలో కూర్చోబెట్టే మాట్లాడేవాడు. నాకు నచ్చిన బ్రాండ్ ఆర్డర్ చేసేవాడు. తాగే ముందు చియర్స్ చెప్పేవాడు హాయిగా. నాతోనే కాదు అందరితో అతను అలానే ఉండేవాడు. కాబట్టి ఇక్కడున్న అందరికీ అతనొక లక్ష్య పురుషుడిలాంటోడు. ఒకసారి ఇలానే అతను…”

…నేను ఇంటికి వెళ్ళాలి,” అన్నారు నమశ్శివాయం.

ఆయన ఏదో తడబడుతున్నట్టు ఊహించిన సహదేవుడు, “ఉండండి. ఇంకా ఏం చీకటిపడలేదు. నేను మిమ్ముల్ని ఇంట్లో దిగబెట్టి వెళ్తాను,” అన్నాడు.

“నా మనవడొస్తాడు,” అన్నారు నమశ్శివాయం.

“మనవణ్ణి రావద్దని చెప్పేయండి. నేనే ఇంటికి తీసుకెళ్ళి దిగబెడతాను,” అని బలవంతపెట్టాక చేతి సైగతోనే హాఫ్‌బాయిల్డ్‌కి ఆర్డర్ ఇచ్చాడు సహదేవుడు.

“ఒకసారి అతను ఏం చెప్పాడు?” అన్నాడు ప్రభాకర్.

“ఏం లేదు,” అన్నారు నమశ్శివాయం.

“అరే చెప్పండి. ఇక్కడెవరూ లేరుగానీ…”

“ఏం లేదు. ఊరికే ఏవో మాట్లాడుకుంటుంటాము. అందులో ఒకటి,” అన్నారు నమశ్శివాయం.

నేను సైగ చేశాను. ఎలాగైనా ఆయన చెప్తారని నమ్మకం. బలవంత పెట్టక్కర్లేదు. ముసలివాళ్ళు రహస్యాలు దాచుకోలేరు. ఎందుకంటే వాటివల్ల వాళ్లకొచ్చే నష్టమేమీ లేదు. నమశ్శివాయం గ్లాసులో ఉన్నదంతా ఒకే గుక్కలో పోసుకుని చేత్తో నోరు తుడుచుకున్నారు. రెండు చేతులూ జోడించుకుని కళ్ళు మూసుకుని బేక్ రెస్ట్ మీదకి తల ఆన్చారు. ముప్పావు శతాబ్దిగా తల వాల్చిన మొరాకో తోలు హెడ్ రెస్ట్ అది. దాని మీద తలాన్చి ఫేన్ గాలిని ఆస్వాదిస్తూ ఉండిపోయారు.

డబుల్ ఎగ్ హాఫ్‌బాయిల్డ్‌ రాగానే ప్రభాకర్ ఆయన్ని తట్టాడు. కళ్ళు తెరిచి, ఎక్కడున్నామని ఆలోచిస్తున్నట్టు చూసి, ఒక్క క్షణంలో తేరుకుని హాఫ్‌బాయిల్డ్‌ని తుంచుకుని ఆస్వాదిస్తున్నట్టుగా తిన్నారు నిదానంగా. తర్వాత “రంగప్పలా ఆడవాళ్ళకి నచ్చే మగాడిని నేను ఎప్పుడూ చూడలేదు,” అన్నారు. నేను ఆయన్ని దీక్షగా చూశాను.

“అర్జునుడు కద!” అన్నారు గుడ్డుని నోట్లో పెట్టుకుంటూ. “పోకిరోడా మంచోడా యోధుడా స్త్రీలోలుడా అని తేల్చుకోలేని మనిషి అర్జునుడు…” నములుతూ చేయి పైకెత్తి, “అయితే అర్జునుడు అంతమంది ఆడవాళ్ళను జయించింది వాడు గొప్ప విలుకాడు కావడంవల్ల కాదు. వాడు హస్తినాపురి చక్రవర్తికి తమ్ముడు కాబట్టి- అని రంగప్ప ఒకసారి చెప్పాడు.”

“ఆ ప్రస్తావన ఎందుకొచ్చింది?” అన్నాడు ప్రభాకర్.

“ఇక్కడ నాట్రాయన్ అనొక జమీందారు ఉండేవాడు. అతని దగ్గర ఒక అయ్యంగార్ అమ్మాయి ఉండేది. కోమలవల్లి ఆమె పేరు. మంచి అందగత్తె. వజ్రాలు, స్వర్ణాభరణాలు, పట్టుపీతాంబరాలు రాశిపోసి దాచుకున్నాడామెను. అందరికీ ఆమె మీద ఒక కన్ను. క్లబ్బులో సగం మాటలు ఆమె గురించే. ఆమెకు ఎంత ధనమైనా ఇచ్చి తెచ్చుకోడానికి ఎందరో కాచుకొని ఉన్నారు. కాబట్టి నాట్రాయన్‌కు ఒక గర్వం ఉండేది, ఎవరికీ దొరకని కోమలవల్లి తనకి దక్కిందని. ఒకసారి మాటల్లో నాట్రాయన్ అన్నాడు- కోమలవల్లిని ఎవరూ ఆకర్షించలేరు, అపహరించలేరు. ఆమె నా మీద పంచప్రాణాలు నిలుపుకునింది- అని. తాగి ఆడుతున్న జనాల మధ్య కోమలవల్లి గురించిన మాటలు సాగుతుండగా, ‘నేను లోబరుచుకుని చూపిస్తాను!’ అని రంగప్ప శపథం చేశాడు. నాట్రాయన్‌ కోపంగా, ‘చేసి చూపించు చూద్దాం…’ అని సవాలు విసిరాడు. వేయి రూపాయలు పందెం కాచాడు. రంగప్ప ఒప్పుకున్నాడు. పదిహేను రోజుల్లో ఆమెను వెంటబెట్టుకుని ఏర్కాడుకు వెళ్ళిపోయాడు రంగప్ప. దాని గురించి చాలా కాలం నవ్వుతూ మాట్లాడుకున్నాం.

అలా ఒక సాయంత్రం నవ్వులూ ఆటపట్టింపులుగా సాగింది సంభాషణ. ఒక దశలో ఉత్సుకత ఆపుకోలేక నాట్రాయుడు అడిగాడు రంగప్పని- కోమలవల్లిని ఎలా లోబరచుకున్నావూ? అని. రంగప్ప నవ్వుతూ అతని భుజాన చేయివేసి, ‘అందం, యౌవనం ఇవన్నీ అక్కర్లేదు. డబ్బుకి లొంగని ఆడదంటూ ఎవరూ ఉండరు…’ అన్నాడు. ‘అయితే ఆ డబ్బుని ఎలా ఆమె వ్యక్తిత్వం దెబ్బతినకుండా ఇవ్వాలన్నదే ప్రధానం!’ అని రంగప్ప అనగానే నలుగురూ బల్ల గుద్ది కేకలు పెట్టారు.

వాస్తవానికి ఆ సంభాషణలో నేను తలదూర్చకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు జమీందార్లు, పెద్దవాళ్ళు. అయినప్పటికీ ఒళ్ళు మరిచి, ‘అది అందరికీ వర్తిస్తుందా?’ అని అడిగాను. రంగప్ప నాకేసి ఎరుపెక్కిన కళ్ళతో చూస్తూ, ‘వర్తిస్తుంది. డబ్బుతో లోబరుచుకోలేని ఆడవాళ్ళు కొందరుండచ్చు. అలాంటివాళ్లు ఒక యాభై మంది ఈ నగరంలో ఉండే అవకాశం ఉంది. ఈ స్టేట్ మొత్తంగా తీసుకుంటే వేయిమందుండచ్చు. వాళ్ళందరూ దేవతలు. వాళ్ళను చూడగానే ఆ విషయం తెలిసిపోతుంది. మిగిలిన కోట్లాది ఆడవాళ్ళను డబ్బుతో జయించవచ్చు.’ అన్నాడు.

నాకేమైందో తెలీదు. బల్ల గుద్దుతూ, ఇదంతా వట్టి మాటలు! అని కోపంగా అన్నాను. ‘వట్టి మాటలేం కాదు. అలా ఉండకూడదు అని నేను ఆశపడ్డ కాలం కూడా ఉండేది. దేవుడా! ఈ స్త్రీ చివరివరకు లొంగకూడదు అని వేడుకుంటూ ఎందర్నో ప్రయత్నించాను. ఒక ఘట్టంలో వాళ్ళు లొంగిపోతుంటే పెద్ద ఆశాభంగానికీ బాధకీ గురయ్యేవాణ్ణి. వాళ్ళతో సంభోగించాక ఉప్పరిగలో నిల్చుని ఏడ్చేవాణ్ణి. ఏ నమ్మకంతో బతకాలో తెలీకపోయేది. ఇంతవరకు యాభై సార్లకు పైగా స్నేహితులతో పందెం కాచాను. ఒక్కసారి కూడా ఓడిపోలేదు.’ అన్నాడు రంగప్ప.
-----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్ 
మూలం: బి. జయమోహన్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment