Wednesday, July 25, 2018

పోతనామాత్యుని జీవన దృక్పథం


పోతనామాత్యుని జీవన దృక్పథం


సాహితీమిత్రులారా!


సీ. కమనీయ భూమి భాగములు లేకున్నవే
        పడియుండుటకు దూది పరుపులేల?
   సహజంబులగు కరాంజలులు లేకున్నవే
        భోజన భాజన పుంజమేల?
   వల్కలాజిన కుశావళులు లేకున్నవే
        కట్టదుకూల సంఘంబులేల?
   గొనకొని వసియింప గుహలు లేకున్నవే
        ప్రాసాద సౌధాది పటల మేల?

తే.  ఫలరసాదులు కురియవే పాదపములు
     స్వాదుజలముల నుండవే సకల నదులు
     పొసగ భిక్షము బెట్టరే పుణ్య సతులు
     ధన మదాంధుల కొలువేల తాపసులకు

ఈ పద్యం బమ్మెర పోతనామాత్యునిది. ఆయన ఆంధ్రీకరించిన మహాభాగవతం ద్వితీయ స్కంధం లోనిది. తెలుగు భాగవతం నుంచి నచ్చిన పద్యం ఏరడం కంటే కఠినమైన పని పద్యాలంటే ఇష్టమున్న వాండ్లకు మరొకటి ఉండదు. భాగవతం లోని కొన్ని వేల పద్యాలు పాత తరం తెలుగువారి నోళ్ళల్లో నానుతున్నాయి.

పోతన అనగానే ఒక వినమ్రుడైన, నిరాడంబరుడై భక్తి తన్మయత్వంతో సొక్కిపోతున్న ఒక వ్యక్తి రూపం మనసులో సాక్షాత్కరిస్తుంది. తనను నరాంకితం చేస్తాడేమో ననే అనుమానంతో కన్నీరు పెట్టే సరస్వతీ దేవిని ఓదార్చే ఒక పవిత్రమూర్తి గోచరిస్తుంది. అత్యంత సాధారణంగా జీవిస్తూ, భగవద్ధ్యానం తప్ప మరొకటి ఎరుగని ఒక సాధు పుంగవుని ఆకృతి స్ఫురిస్తుంది. కవిత్వాన్నీ జీవితాన్నీ వేర్వేరుగా భావించక జీవితమెంత భక్తి భరితమో కవిత్వమూ అంతే భక్తిమయం చేసుకుని ఆ భావాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి అలానే బ్రతికిన ఓ ఉత్తమ వ్యక్తి రూపరేఖ భావ గోచరమౌతుంది.

పోతన గురించి అలాంటి అభిప్రాయమే జనానికి కలగడానికి కారణం – లోకంలో ప్రాచుర్యంలో ఉన్న కథలే అనడం సగం నిజం మాత్రమే. అసలు ఆ అభిప్రాయానికీ, ఆ కథల ప్రాచుర్యానికీ కూడా కారణం ఆయన కవిత్వమే అని చెబితేనే పూర్తి నిజం చెప్పినట్లవుతుంది. భాగవతం లోని వివిధ ఘట్టాల్లో భగవంతుని గురించీ ఆయన లీలల గురించీ రాసేటప్పుడు ‘అనుభవించి పలువరించిన’ ఆ ఆప్తతలు, పోతన కవిత్వం ఎడలనే కాక కవి అంటే కూడా ఒక ఆత్మీయతతో కూడిన మెచ్చుదలను కలిగిస్తాయి. జీవితం విషయంలో ఆయన దృక్పథమే వేరు అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. అలాంటి భావాలు వెలారుస్తూ రాసిన పద్యాల్లో మకుటాయమాన మైంది పై పద్యం.

ఈ పద్యం ఏ సందర్భం లోనిది అనేది అంత ముఖ్యం కాదు. ఏ సందర్భంలో చెప్పినా, ఎవరు ఎవరితో ఎందుకు చెప్పినా, ఆ పద్యం లోని భావం ఆ మహాకవి వైయక్తిక జీవితానికి ఒక టీక అని మాత్రం అనిపిస్తుంది. జీవితం పట్ల ఆయన దృక్పథాన్ని నిక్కచ్చిగా, నిజాయితీగా చెప్పిన పద్యం అది. ఆయన బ్రతికిన పద్ధతికి అద్దం, ఆ పద్యం. అయినా, పద్య సందర్భం చెబుతాను. శుకయోగి పరీక్షిన్మహారాజుకు, విశ్వమయుడైన విరాట్పురుషుని గురించీ, జ్ఞానీ అజ్ఞానుల ప్రవర్తన గురించీ తెలుపుతూ ‘అజ్ఞాని మాయలో భ్రమిస్తాడు, జ్ఞాని జాగరూకుడై మెలగుతాడు. సంసారం సుఖమనుకోడు. శరీర ధారణకు అవసరమైనంత మేరకే భోగాలను అంగీకరిస్తాడు’ అని చెపుతూ ‘బుద్ధిమంతుడు ఈ రకంగా భావిస్తాడు’ అనిచెప్పే సందర్భం లోది పై పద్యం.

పడుకోడానికి ఇంత నేల ఉండగా తల్పాలూ శయ్యలూ కావాలా? తినడానికి దేవుడిచ్చిన చేతులుండగా బంగారూ, వెండీ పళ్ళాలు కావాలా? నార చీరలూ, పట్టలూ ఉండగా పీతాంబరాలు అవసరమా? ఉండటానికి గుహలుండగా ఆశ్రమాలూ ప్రాసాదాలూ అవసరమా? తినేందుకు చెట్లు పండ్లిస్తుండె, తాగేందుకు నదులు నీరిస్తుండె. ఇంటింటా ఉండే పుణ్య గృహిణులు భిక్ష పెడతారాయె. తపసు చేసుకునే వారికి ఇంకేం కావాలి? ధనమదంతో కళ్ళు కనిపించని వారిని ఎందుకు ఆశ్రయించాలి? ఇదీ పద్య భావం.

ధనమదాంధుల కొలువేల తాపసులకు? అన్నాడు పోతన. తాపసులకేనా? సాధారణ జనులకు మాత్రం ఎందుకు? ఆత్మగౌరవం కలవాడు ఇతరులను ఎందుకు ఆశ్రయించాలి? సహజంగా స్వేచ్చగా బ్రతకడానికి ఈ ప్రపంచంలో లేనిది ఏమున్నది? పరిమళవంతంగా బ్రతుకును పండించుకోడానికి ఎంత అనువు లేదు?స్నానానికీ పానానికీ భుక్తికీ నిద్రకూ అన్నిటికీ అవకాశాలున్నపుడు ధనాధిపుల కాళ్ళ వద్ద ఉండాల్సిన అవసరమేముంది? ఈ అభిప్రాయాన్ని ఎంతో చక్కగా చెబుతుందీ పద్యం.

ఈ పద్యం చదవగానే ముందు స్ఫురించేది ఓహో ఎంత అందంగా చెప్పాడో అనే భావన. ఒక ఆత్మగౌరవం కలిగిన మనిషి, వ్యర్థాడంబరాలకు వ్యామోహం చెందని మనిషి, శరీర పోషణ మాత్రాన్ని ఎంత సులభంగా నిర్వహించుకోవచ్చునో ఎంత బాగా చెప్పాడో అనే మెప్పు కలుగుతుంది. ఆ చక్కటి భావం వల్ల ప్రసన్నతా పూర్వకమైన పరిసరాలు ఆ పద్యం చుట్టూ ఆవరించుకున్నాయి. అయితే, తాత్పర్యపు వెలుగులో పద్య నిర్మాణం లోని సొగసును నిర్లక్ష్యం చేయనక్కర లేదు. పద్యం చెప్పడంలోని అలవోక తనము, సహజత్వము అంతే అందంగా ఉన్నాయి. పోతన సహజపాండిత్యం కలిగిన వాడుగా పేరున్నవాడు. గణాలు కిట్టించుకుంటూ రాయడం గానీ, ఒక భావం ఒక పాదంలో పట్టక పైపాదంలో ఇరికించడం గానీ, యతిప్రాసల కోసం ఏవో పదాలను కృతకంగా తెచ్చిపెట్టుకోవడం గానీ ఆయన చాలా పద్యాల్లో కనపడదు. అంత్య ప్రాసలు ఆయన బలహీనతా – బలమూ కూడా. సాధారణంగా పోతన అన్ని పద్యాల్లో ఉండే ప్రసన్నత పై పద్యం లోనూ ఉన్నది. ధారాశుద్ధీ, శ్రవణ సుభగతా, భావం ఏ పాదానికి ఆ పాదం విరగడమూ, ఒక్క వ్యర్థ పదమూ లేకపోవడమూ – నిర్మాణ దృష్ట్యా ఈ పద్యానికి అందం సంతరించి పెట్టాయి. పద్య సౌందర్యమూ, భావ సౌందర్యమూ కలగలిసిన అందం ఈ పద్యం.

“నా గీతం జాతిజనుల గుండెలలో ఘూర్ణిల్లా”లని ఆకాంక్షించాడు ఆధునిక కవి. ఆ కొలబద్దకు సరిగ్గా అతికిపోయే కవి పోతన. ఆయన పద్యాలు జాతిజనుల గుండెల్లోనే కాదు రసనల మీద కూడా నివసిస్తున్నాయి. విశ్వనాథ వారన్నట్లు “పోతన్న తెలుగుల పుణ్యపేటి.”
----------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment