Monday, July 16, 2018

నాచన సోమన అపురూప పద సంచయం


నాచన సోమన అపురూప పద సంచయం


సాహితీమిత్రులారా!
తెలుగులో భారత, భాగవతాలకు ఉన్నంత ప్రజాదరణ గల మరో గ్రంధం హరివంశం. ఇందులో కేవలం కృష్ణునికీ, అతని వంశీకులకూ సంబంధించిన కొన్ని కథలు వివరించబడ్డాయి. తెలుగులో హరివంశ కావ్యాన్ని రచించిన వారు ఇద్దరు. ఒక్కరు ఎఱ్ఱాప్రగ్గడ. రెండవ కవి నాచన సోమన. భారతం సంస్కృతం నుంచి అనువాదమైతే, హరివంశం సంస్కృత హరివంశాన్ని అనుసరించి వ్రాసింది మాత్రమే. అది స్వతంత్ర రచన. ఎఱ్ఱన హరివంశాన్ని సంపూర్ణంగా, అంటే పూర్వోత్తర భాగాలుగా వ్రాస్తే, సోమన ఉత్తర భాగం మాత్రమే వ్రాశాడు. అందుకని దానికి ‘ఉత్తర హరివంశం’ అనే పేరు వాడుకయింది. ఎఱ్ఱన ఉత్తరభాగంలో ఉన్న రెండు మూడశ్వాసాల కథను సోమన విడిచివేశాడు. అలాగే, ఎఱ్ఱన వ్రాయని ఒక కథను తను వ్రాశాడు. హరివంశాన్ని భారతం యొక్క పరిశిష్ట భాగంగా భావిస్తారు. అందుకని భారతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, దీనికీ అంత ఉంది. బహుశా, ఆ ప్రాధాన్యతను గుర్తించే ఎఱ్ఱనా, సోమనా హరివంశాన్ని రచించి వుంటారు.

తెలుగు సాహిత్యంలో నాచన సోమన స్థానం ప్రత్యేకమైనది. ఈయన కవిత్రయం తరువాతి కాలం వాడు. శబ్ద రత్నాకర కర్త ఇతన్నీ, ఇతని గ్రంధాన్నీ పరిచయం చేస్తూ “అది మిక్కిలి ప్రౌఢము గానూ, భారతము కంటె ఎల్ల విధముల విశేషించినది గానూ కానంబడుచున్నది. ఇతనిని సర్వజ్ఞుడందురు. అట్లనుటకు సందేహింప బని లేదు” అని అంటాడు. పరవస్తు చిన్నయ సూరి ఐతే “ఘను నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్” అన్నాడు. యుద్ధ వర్ణనలోనూ, రాయబారాలు నిర్వహించిన పట్టుల లోనూ, నాచన సోమన తిక్కన ప్రజ్ఞను పుడికి పుచ్చుకున్నాడని కొందరు పెద్దలు భావించారు.

ప్రాచీన తెలుగు కవుల్లో నాచన సోమన ఒక విలక్షుణుడైన కవి. తెలుగు సాహిత్యంలో అతనికి ఒక ప్రత్యేకమైన స్థానముంది. ఆయన రచించిన ఉత్తర హరివంశం ఒక విశిష్టమైన కావ్యం. ఆశ్వాసాంతాల్లో సోమన తనను గురించి నాలుగు విశేషణాల్లో చెప్పుకున్నాడు. సకల భాషా భూషణ, సాహిత్య రస పోషణ, సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాధ అనేవి ఆ నాలుగు విశేషణాలు. హరివంశమనేది భారతానికి పర భాగం కాబట్టి, తిక్కన సోమయాజి పూర్తి గావించిన భారతానికి తాను రాసిన ఉత్తర హరివంశం కొనసాగింపుగా సంభావింపబడాలని భావించాడు. అందుకని ఆశ్వాసాంతాల్లో తిక్కనను పేర్కొనడమే గాక, ఆయన సృష్టించి అంకితమిచ్చిన హరిహరనాధునికే తన హరివంశాన్నీ అంకితమిచ్చి తద్వారా తాను తిక్కన సోమయాజి అంతటి వాడినని ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకున్నాడు.

నాచన సోమన సంవిధాన వైలక్షణ్యమూ, రస పోషణా, నవీన గుణ సనాధత్వమూ అలా వుంచితే ఉత్తర హరివంశంలో సోమన ప్రయోగించిన సామెతలూ, జన బాహుళ్యంలో అంతగా ప్రచారంలో లేని పలుకుబడులూ, జాతీయాలు ఆయన నవీన ప్రియత్వాన్ని పట్టిచూపుతాయి. వాటిని స్థూలంగా పరిచయం చేయడమే ఈ వ్యాసోద్దేశం. అపురూపమైన పద సంచయం ఆయన వాడుకలో కనిపిస్తుంది.

నరకాసురుడు స్వర్గం మీద దండయాత్ర చేసినపుడు దిక్పాలకులందరూ అతని సైన్యంతో యుద్ధం చేస్తారు. వఋణునితో హయగ్రీవుడనే దనుజుడు తలపడతాడు. ఆ రాక్షసుని ధాటికి మూర్చ పోయి లేచి, ఇక యుద్ధంలో ఉండలేక వఋణుడు వెళ్ళిపోతాడు. ఆ పోవడం ఎలా ఉందంటే “బీరపు బొత్తయు గట్టుకుని పోయె, పోయిన పోకై” అంటాడు సోమన. బీరము అంటే డొల్ల గాంభీర్యము. యుద్ధంలో నిలవనూ లేడు, ఓటమి ఒప్పుకోనూ లేడు. దొంగ, బడాయితనం పొత్తము గట్టుకుని – బొత్తి లాగా, పొట్లంగా చేసుకుని అన్నట్లు, పోయిన పోకై – అదే పోకగా వెళ్ళిపోయాడట. ఇలాంటి సందర్భంలోనే, ఇదే విధంగా యుద్ధంలో ఓడిపోయి యముడూ మరలి పోతాడు. “ఇట్టిక సూడని వాడో, యొట్టిడుకున్నాడో యనుచు ఉల్లసమాడం బట్టగుచు మగిడి చూడక పట్టణమునకేగె లజ్జ బండతనమునన్” – ఇటుక దెబ్బ తిన్నవాడిలాగా తిరిగి చూడకుండా పారిపోయినాడట, ఒట్టు పెట్టుకున్నట్లు, పైగా లజ్జ బండతనమునన్, అంటే ఒకవైపు తలెత్తుకోలేనంత సిగ్గూ, మరో వైపు ఆ సిగ్గు బైటకు కనిపించనీయకుండా లక్ష్యం లేనట్టు నటించే మొండి తనమూ – ఈ రెంటి కలగలుపు, అన్నమాట.

నరకుడు యుద్ధంలో గెలిచిన తర్వాత ఊర్వశిని చేపట్టాలని తలచి ఆమె వద్దకు చేరి సంభాషించిన సందర్భం చాలా ఆసక్తికరంగా వుంటుంది. నా మీద అంత కోరిక గల వాడివైతే నా దగ్గరకు ఎప్పుడైనా వచ్చావా, అంటుంది ఊర్వశి. నువ్వు శత్రువు దగ్గర వుంటే నేను ‘మిండరికంబు చేతకు వస్తానా, అంటాడు నరకుడు. పోనీ, నీ దగ్గరికైనా నన్ను పిలిపించుకోవచ్చు గదా అంటుంది. నరకుడు, ఉద్ధతుడైన రాక్షసుడు. వానికి ఇటువంటి చమత్కారాలూ వ్యంగ్యాలూ, సున్నితాలూ కొరుకుడు పడవు. “పగవాడట దేవేంద్రుడు, మగువా నీవతని కొలువు మానిసివట, నిన్ తగవు చెడి పిలువ బనుచో మగ తనమే? ఇట్టి లంజె మాటలు గలవే?” అంటాడు, మొరటుగా. అప్పుడు వాడి మొరటు మాటలకు నొచ్చుకుని ఊర్వశి ఇలా అంటుంది. “లంజియ కాదు నేను, విను, లావున నీ వమరేంద్రు గెల్చి, నన్నుం జెఱవట్టి తెమ్మని వినోదము చేసితి గాక చిత్త మెల్లం జెడియుండ రిత్త యొడలం జవి చేరునె? చిల్కవోయినం బంజరమేమి సేయ? రసభంగము సంగతిలోన మెత్తురే?” నిజమే. నేను పొత్తుల దాననే. నీవేమో నీ ప్రతాపంతో ఇంద్రుని గెలిచావు. కానీ నన్ను చెరపట్టి లాక్కు రమ్మన్నావు. అది నీ వినోదం. చెరబట్టడం ఏం వినోదం? నీకు వినోదం గావచ్చు గానీ, చెరబట్ట బూనితే నా మనస్సు బాధ పడదా? మనసంతా చెడి ఉన్నపుడు మన పొందులో సరసమేమి వుంటుంది. రసభంగాన్ని గూడ గమనించలేని నువ్వేమి రసికుడవు. పరస్పర సౌమనస్యం లేని సంగతి చిలుక లేని పంజరం కదా. అటువంటి ఖాళీ పంజరం ఏమి చేసుకోడానికి? అని సున్నితంగా ఎత్తిపొడుస్తుంది.

నరకునికి ఊర్వశి మీద కోరిక ఉండవచ్చు కానీ ఆమెకు వాడంటే ఏహ్య భావమే. అయినా, ఏమి చేయగలదు? వాడు బలవంతుడు, ఉద్ధాతుడు, మొండివాడు, అరసికుడు. వాడిని ఏదో విధంగా తప్పించుకోవాలి. స్వర్గంలో ఎందరో పూదీవెల లాంటి స్త్రీలు ఉండగా “సంత నెన్నడో జవ్వనమమ్ముకున్న గడసాని ననుంగవయం దలంచితే, పువ్వులు వేడుకైన గడివోయిన వాళ ముడువంగ వచ్చునే” అంటుంది. నరకునికి తన మీద అసహ్యం పుట్టించటానికి ప్రయత్నం అది. సంతలో యవ్వనాన్ని అమ్మకానికి పెట్టుకొని పరువం కోల్పోయిన దానను. పైగా గడసానిని (గడ అంటే సమూహము). పూలపై ఎంత మక్కువ ఉన్నప్పటికీ వాడిపోయిన పూలెవరైనా పెట్టుకుంటారా? నువ్వు నన్ను కోరడమూ అంతే” అంటుంది. దానికి నరకుని జవాబు “ఎంత దరిగిన మిరియాలుఁ జొన్నలు సరిపోవే” అని. ఎంత గడసాని అయినా ఊర్వశి ఊర్వశే గదా. మిరియాలు ఖరీదైన, విలువైన దినుసు. జొన్నలు సామాన్యమైనవి. మిరియాలు తరిగితే మాత్రం – జొన్నల విలువ చేయవా? చాప చిరిగినా చదరంతైనా కాకపోతుందా అనే అర్ధం లోనిది ఈ సామెత. నరకునికి జొన్నల సంగతి కూడా తెలుసును కాబోలు.

నరకుడు మునుల వద్దకు వెళ్ళి యజ్ఞ హవిర్భాగాలు తనకు అర్పించమని అడుగుతాడు. మునులతన్ని వెటకారం చేసి “కనికని కొర్రెవడింటి కంబము చేసెన్” అంటారు. కొర్రు అంటే ఇంటి చూరులోకి వాడే సన్నటి కర్ర. దానిని స్తంభంగా ఎవరైనా వాడతారా అని ఎగతాళి. దానికి నరకుని సమాధానం, యుద్ధంలో దేవతలందర్నీ జయించిన నాకు కాకుండా, వోడిపోయిన వారికివ్వడం, “శిరస్సుండగ మోకాలున సేసలు వెట్టుట” లాంటిదట. ఎంత సమయోచితంగా ఉందికదా ఈ పోలిక.

ఒక బ్రాహ్మణుడు తన భార్య ప్రసవించగానే శిశువులు చనిపోతూ వుంటే కృష్ణుని శరణు వేడి, తన భార్య ప్రసవించబోతున్నదనీ, శిశువుని యముడు గ్రసించకుండా చూడమనీ, వేడుకుంటాడు. కృష్ణుడు ఆ పనికి అర్జునుని నియోగిస్తాడు. కానీ, శిశువును యముని బారి నుండి అర్జునుడు కాపాడలేక పోతాడు. అప్పుడు బ్రాహ్మణుడు అర్జునుని నిందిస్తూ “పారెడు బండ్లకు కాళ్ళు సాపగా నలవడు నన్న! పోటు మగడై ఇటు జేసితి గాక” అంటాడు. వేగంగా పోయే బండ్ల మీదికి వేగంగానే లంఘించాలి గానీ, కాళ్ళు జాపితే ఎక్కగలమా! నువ్వేదో పోటు మానిసి వనుకున్నాను, అని నిష్ఠూరమాడడం అది.

కృష్ణుడు పట్టణంలో లేని సమయం జూసి, పౌండ్రక వాసుదేవుడు యాదవ రాజధానిపై దండెత్తుతాడు. అప్పుడు అతనికీ సాత్యకికీ యుద్ధం జరుగుతుంది. పౌండ్రకుడు సాత్యకితో “మీ వంశమందు తాకొర్వజాలు వారిజూపుము, కుమ్మరావమున రాగి ముంతలేరంగ గలవె” అంటాడు. కుమ్మరి ఆవంలో కింద పడితే పగిలిపోయే మట్టిపాత్రలుంటాయి గాని, గట్టి రాగి పాత్రలుంటాయా, అని ఉపాలంభన. దానికి సాత్యకి ప్రతిసమాధానం “ప్రేలకు, జీలుగు వెరిగిన మాలెకు కంబంబు గాదు” అని. జీలుగు బాగా తేలికైన, బెండైన కొయ్య. అది ఎంత ఏపుగా పెరిగినా ఇంటికి స్తంభంగా పనికిరాదు. నువ్వూ అంతే – అని అన్నమాట.

హంస డిభకులు అనే ఇద్దరు రాజకుమారులు తమ మిత్రుడైన జనార్దనునితో కలిసి వేటకు పోయి, అడవిలో తపస్సు చేసుకుంటూన్న దూర్వాసుని చూస్తారు. గృహస్త ధర్మాన్ని కాదని ఇలా ముక్కు మూసుకొని కూర్చుంటే ముక్తి కలుగుతుందా అని పరిహాసం జేస్తూ “పరిగల నేరినం గొలుచు పాతటికిం గలదే” అంటారు. కోతలన్నీ అయిపోయాక ఇంకా ఏమైనా అడుగూ బొడుగూ మిగిలుంటే ఏరుకునేది పరిగ. పరిగ ఏరితే నాలుగైదు చేటలు వస్తాయేమో గానీ పాతట్లో దాచేటన్ని వస్తాయా అని ఎకసెక్కం. విప్రకుమారుడైన జనార్దనుడు సజ్జనుడు. దుష్టులైన హంస డిభకులతో వున్నందున తనకూ కీడు కలుగుతుందేమోనని చింతిస్తూ అనుకుంటాడు, “వరుగుతో దాగరయు ఎండవలసినట్లు” అని. దాగర అంటే పెద్ద పళ్ళెం లాంటి పాత్ర. ఏవైనా ఒరుగులూ వడియాలూ లాంటివి ఎండబెత్తాల్సి వస్తే దాగరలో పోసి ఎండబెడతారు. ఎండుతున్న వడియాలతో పాటు దాగర కూడా ఎండాల్సి వస్తుంది కదా. ఈ హంస డిభకులతో కలిసి ఉన్నందుకు వారికి రాబోయే ఇబ్బందులు తనకూ కలగవచ్చు, అని జనార్దనుడు అనుకుంటాడు.

దూర్వాసుడు కండ్లు తెరిచి హంస డిభకులను చూసి, వారి ఆగడాలకు కోపం వచ్చినా నిగ్రహించుకొని, వీరెలాగూ కృష్ణుని చేతిలో చచ్చేవారే, ఇంక శాపమివ్వడం ఎందుకు అనుకుని ఇలా అంటాడు, “చక్రధరుడు బారి సమరనున్నాడు మిమ్మింక కోపమేల నాకు, తెరగు మాలి తవుడు దిని చచ్చువానికి, విషము పెట్టువాడు వెర్రి గాడె”. తవుడు తిని చచ్చేవాడికి వేరే విషం పెట్టాలనుకోవడం ఎందుకు? హంసుడు ముని మీద కోపంతో ఇక్కడే వుండటం “నక్క బగ్గానం బట్టిన యట్లు బిర్ర బిగియంగా..” అనుకుంటాడు. నక్కను పగ్గాన పట్టుకోడం అనేది తమాషా ఐన ఊహ. జానపదుల వాడుక మాటలు తెలిసినవాడే ఇలా వాడగలడు.

హంస డిభకుల ఆగడాలకు బాధ పడిన మునులు కృష్ణుని వద్దకు వచ్చి, వారి ఆగడాలను వివరిస్తూ “పులి పేదవడిన పసులవాండ్రె ఎక్కాడిరను కత వచ్చెనాకు – మునుల లోపల నాలుక ముల్లు విరిగె” అంటాడొక ముని. చక్కని సామెతా, అందమైన జాతీయమూ. పసులవాండ్లు, అంటే గొడ్లు కాచేవాళ్ళు పశువులను పులి నుండి రక్షించాలి. కానీ పులి బలహీనమైతే, కాపరులే పులికన్నా పశువులను ఎక్కువగా బాధ పెట్టినట్లైంది నా పని, ఇది పిల్లి పిచ్చిదైతే ఎలుక వెక్కిరించిదనే సామెత లాంటిది. నాలుక ముల్లు విరగడం అంటే మాట్లాడలేక పోవడం. ఈ హంస డిభ్కుల చేతిలో బాధలు అనుభవించి, దీనుడనై మిగిలిన ముని సంఘంలో తలెత్తుకోలేక, నోరెత్తలేని వాడనైనాను, అని చెప్పడం.

హంస డిభకులు తమ తండ్రిని రాజసూయం చేయమని ప్రోత్సహిస్తారు. అప్పుడు జనార్దనుడు వారితో, రాజసూయం చేయాలంటే దిగ్విజయం చేసి రాజుల్ని గెలవాలి. కృష్ణుని వోడించడం మీచేతనవుతుందా. నరకునీ, కంసునీ, మురాసురునీ, చాణూరాదులనూ చంపిన కృష్ణునికి మీరొక లెక్కా, అంటూ “మద్దులు మునింగి పార, వెంపళ్ళు తన కెంత బంటీ అంటాడు. మద్ది చెట్ల లాంటి మహా వృక్షాలే మునిగి పోతే, రెండడుగుల ఎత్తు కూడా లేని వెంపలి చెట్లు మునగడానికి ఎంత లోతు కావాలె. అని అంటాడు.

ఈ జనార్దనుడు కృష్ణ భక్తుడు. హంస డిభకుల పంపున కృష్ణుని వద్దకు దూతగా పోతాడు. వారి ప్రల్లదాలను కృష్ణునికి వివరించలేక మొహమాట పడుతుంటే, కృష్ణుడు భయం లేకుండా చెప్పడం దూత ధర్మం అని ప్రోత్సహిస్తూ, “పాముకాటు చీర దుడిచినంబోవునే” అంటాడు. వారి ఆటోపం “దువ్వు జూచి నక్క యొడలు గాల్చుకున్న వడవు” లా ఉన్నదంటూ “పిడుగు వ్రేసిన తల టొప్పి యాగునే” అని ప్రశ్నిస్తాడు కృష్ణుడు. దూతకృత్యం నిర్వర్తించి వచ్చిన జనార్దనుడు, హంస డిభకుల ముందు కృష్ణుని పొగుడుతుంటే సహించలేక “చెరువు విడిచి కాలువ బొగడం జనునే” అంటాడు హంసుడు.

బాణాసురుని కుమార్తె ఉష, అనిరుద్ధుని కలలో చూచి మోహించి విరహం అనుభవిస్తూ చెలికత్తెతో అన్న మాట, “జాదుల ఇల్లు సొచ్చి సెక జల్లెడి వెన్నెల వెట్టికొందునే”. జాజిపూల కుటీరంలోకి పోయి, సెగ చిమ్మే వెన్నెలను పెట్టుకున్నానే అని వగపు. ఆమె కల లోకి వచ్చినవాడు అనిరుద్ధుడని తెలుసుకొని, ఉషతో చెలికత్తె అంటుంది “అలిగి తన్నిన పరుప బయింబడినట్ల” యిందిలే అని. ఉష తను ప్రేమించినవాడు శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్ధుడని తెలుసుకొని,

దనుజకులవైరి శౌరి నందనులు నట్ల
రక్కసులు మనవారు వారలకు మనకు
పొసగునె నడుమ బెట్టిన పూరిగాలు
నేల చిత్రరేఖా తుది నింత సణుగు

అంటుంది తన చెలికత్తె చిత్రరేఖతో. మనమేమో రాక్షసులము. కృష్ణుడూ అతని కొడుకులూ, మనవడూ, రాక్షసులకి శత్రువులు. వారికీ మనకూ పొసగుతుందా? “నడుమ బెట్టిన పూరి గాలు” – పూరి అంటే పచ్చగడ్డి. ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అంత శత్రుత్వం అన్నమాట.

ఇంకా ఇలా అంటుంది, అనిరుద్ధుని నీవు ఇక్కడకి తీసుకువచ్చినా, “అతనిచ్చట మెలగుట మా తండ్రి విన్న మేలగునే, ప్రేవుల లోన సురియ ద్రిప్పిన కలపన బిండైన చెలిమికత్తెలు నగరే”. పేగులలో చురకత్తి తిప్పినంత బాధ కలుగుతుంది. కలపనబిండి అంతే బాధ. క్షోభ. బయటకి చెప్పలేని బాధ. అంటే, అతను తను ప్రేమించిన వాడు అని తండ్రికి చెప్పలేని క్షోభ. అటువంటి స్థితిలో తను వుంటే స్నేహితురాళ్ళలో నగుబాటు గదా, అని అన్నమాట.

అనిరుద్ధుడు తన కూతురితో ఉన్నాడన్న సంగతి తెలిసి బాణాసురుడు “ఏనటే నాకూతురినటే మానవుడటే నగరు చొచ్చి మా కులమునకున్ హాని యొనరించె కన్నుల కానడు తలయెత్త రోత గాదే నాకున్” అంటాడు. అదే సందర్భంలో “మనుజాంగనలన్ బట్టుట దనుజులకున్ చెల్లుగాక, దనుజాంగనలన్ మనుజులు పట్టుటకును దొరకునిరే, బెండులు మునింగి గుండులు దేలెన్” అని అంటాడు. మానవ కాంతలను రాక్షసులు చెరపట్టటం లోక సామాన్యమే కానీ రాక్షస వనితను మానవుడు చేపట్టటం బెండులు మునిగి గుండులు తేలినట్టుగా ఉన్నది అని అర్ధం. బెండు తేలిక నీళ్ళల్లో తేలుతుంది, రాతి గుండు ముణుగుతుంది, కదా.

బాణాసురుడు అనిరుద్ధుని చెరసాలలో బంధించాడనే విషయం తెలిసి, ద్వారకలోని అమ్మలక్కలు అనుకునే మాటల్లో “పాలలో పండ్లు పిసికిరమ్మ” అనుకుంటారు.

“అఖిల లోకాధీశుడగు చక్రధరు నింట
నొక కీడు మాట నేడొదవె నమ్మ
బాల్యంబు నంద శంబరు జంపె
ప్రద్యుమ్ను డతని లావెల్లిద మయ్యెనమ్మ.
కీడు లేదన దేవకీ దేవి బలగమొ
ప్పిన పాలలో పండ్లు బిసికిరమ్మ”

అన్ని లోకాలనూ ఏలే కృష్ణుడింట్లోనే ఇన్నాళ్ళకు ఇటువంటి కీడు జరిగింది కదా. చిన్నప్పుడే శంబరాసురుని చంపిన ప్రద్యుమ్నుని పరాక్రమం నగుబాటు చెందినట్లయింది గదా – అతని కుమారుడైన అనిరుద్ధుని ఒక రాక్షసుడు బంధించడం. దేవకీ దేవి బలగానికి ఎప్పుడూ ఏ కీడు ఉండదు. అటువంటిది పాలలో పండ్లు పిసికినట్టయింది కదా అని అర్ధం. ఈ పాలలో పండ్లు పిసకడం అనేది ఒక విచిత్రమైన ఊహ. పాలు రుచి కోల్పోయినప్పుడు రుచి కోసం పాలలో పండ్లు పిసుకుతారు. అలాగే, పాలు పలచ నైనప్పుడు చిక్కదనం కోసం పండ్లు పిసికి కలుపుతారు. ఇన్నాళ్ళకి దేవకీ దేవి ఇంట పాలు రుచినీ చిక్కదనాన్నీ కోల్పోయినాయి. ఎటువంటి దశ వచ్చింది, కృష్ణుని ఇంటికి, అని వాపోవడం ఇది.

ఇంతవరకూ వివరించినవి నాచన సోమన వాడిన అపురూప పదాలలో కొన్ని మాత్రమే. ఆయన వాడిన జాతీయాలూ, స్థానిక పలుకుబడులూ కోకొల్లలు. మచ్చుకి మరికొన్ని. వీటి అర్ధాలు మీ ఊహకే వదిలి పెడుతున్నాను.

“నువ్వుల, కండ్లను, నోర బోసుకున్నారముగా దలంపుము”
“మాడిన నేమి చేసెదవు, మంత్రపు నీళుల చల్లవచ్చునే”

నాచన సోమన తన ఉత్తర హరివంశంలో వాడిన చిత్రశబ్దాలను పరామర్శించే ప్రయత్నం మాత్రమే నేనిక్కడ చేశాను. ఆయన కవిత్వ వైశిష్ట్యం గురించి, సంవిధాన నైపుణి గురించి, పద్య నిర్మాణ నిర్వహణాదుల గురించీ చెప్పాలనే ప్రయత్నానికి ఈ వ్యాసం సరిపోదు. అది ఈ వ్యాసం ఉద్దేశమూ కాదు. ‘ఒకడు నాచన సోమన ఉక్కివుండు’ నని విశ్వనాథ సోమనను ప్రత్యేకంగా ప్రశంసించాడు. సోమన చిత్రశబ్దాలను అలా వుంచితే, ఆయన తన కావ్యంలో సృష్టించిన శబ్ద చిత్రాలూ సామాన్యమైనవి కావు. ఉత్తర హరివంశం ఒక విలక్షణమైన కావ్యం. సోమన విలక్షుణుడైన కవి.
-------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment