Saturday, July 14, 2018

కథన కుతూహలం – 1(కథ)


కథన కుతూహలం – 1(కథ)



సాహితీమిత్రులారా!


ఆధునిక భేతాళకథలను ఆస్వాదించండి-

పట్టు వదలని విక్రమార్కుడు, తాను వచ్చిన కారుని దారికి ఓ పక్కన ఆపాడు. కారు శిరోదీపాల (హెడ్‌లైట్లకు వచ్చిన తిప్పలు) వెలుతుర్లో కొంచెం దూరం వేగిరంగా నడిచి, ఓ చెట్టు మీదకి ఎక్కాడు. దాని మీద ఉన్న ఓ శవాన్ని భుజం మీద వేసుకుని నెమ్మదిగా క్రిందకు దిగాడు. నింపాదిగా అడుగులు వేస్తూ, తన కారు దగ్గరకి చేరాడు. కారుకి ఎడమవైపున్న ముందు తలుపు తెరచి శవాన్ని తన పక్కసీట్లో కూచోపెట్టాడు. తలుపులకి తాళం వేసి కారుని కదిలించాడు. ఉక్కగా అనిపించడంతో ‘చలి మర’ మీట నొక్కాడు. శీతలగృహంలా ఉన్న పార్థివదేహం-కారు కుదుపులు-మరింత చల్లదనం. ప్రశాంతంగా నిద్రిస్తున్న బేతాళుడు ఉలిక్కిపడి లేచాడు.

కళ్లు తెరిచి, ఒకసారి ఆవులించాడు. తానెక్కడున్నదీ అర్థం కాక అటూ ఇటూ చూశాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని చూసి గుర్తుపట్టాడు. ‘మీరా?’ అన్నట్లు తల పంకించాడు. విక్రమార్కుడు. ఆయనతో తనకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. తన అనుభవాలు తాను కథలుగా వినిపించటం, తాను తన అనుమానాలు అడగటం, ఆయన వాటిని తీర్చటం, ఆయనకు మౌనభంగం కాగానే తాను తన నివాసానికి ఎగిరి వెళ్లటం. ఇంతకుముందు ఇది చాలాసార్లు కొన్ని సంవత్సరాలపాటు జరిగింది. ఈసారి ఎన్ని నెలలపాటు జరగనుందో?

గతమంతా తలపుకొచ్చి, బేతాళుడి కుడి దవడ కండరం బిగుసుకుంది. కొన్ని తెలుగు నవలల్లో కథానాయకుడికి కొన్ని దశాబ్దాలపాటు అలా జరిగింది. అది అతనికే కాకుండా అప్పుడప్పుడు తనక్కూడా ఎందుకు జరుగుతోందో బేతాళుడిక్కూడా తెలీటంలేదు. అలా జరగటం పాఠకులని ఊపేసిందని మాత్రం అతడికి తెలుసు.

ఓ క్షణం తర్వాత సదరు బేతాళుడు, విక్రమార్కుడి వంక చూసి, “రాజా! నిన్ను నేను అర్థం చేసుకోలేకపోవటానికి నువ్వేమీ కొందరి నోటిలో కొంకర్లుపోతున్న తెలుగుభాషవి కాదు. నిజం చెప్పాలంటే నన్ను లేపిన నీ మీద నాకు, బతికేంత కోపంగా కూడా ఉంది. నేను మంచి పీడకలలో ఉన్నపుడు ఆ తియ్యటి అనుభవం నాకు లేకుండా చేసిన నీ మీద కసి తీర్చుకోవాలనిపిస్తోంది. నీకు కూడా నిద్ర లేకుండా చెయ్యాలనిపిస్తోంది. అందుకని గతంలో లానే ఓ కథ చెపుతాను. కారు నడపడం మీదనే దృష్టి పెట్టి, నేను చెప్పేది విను,” అని ఊపిరి ఆపుకోవటానికన్నట్లు ఒక క్షణం ఆగాడు.

“ఒక చిన్నమాట. అనగా అనగా అని నేను కథని రొటీనుగా మొదలుపెడతాను అనుకోకు. రొడ్డకొట్టుడు నాకు ఇష్టం ఉండదు. అందుకని ఏ ఉపోద్ఘాతం లేకుండానే కథని చెప్పటం ఆరంభిస్తాను,” అని మొదలుపెట్టాడు.

“పాఠకరావు ఓ సాహిత్య వీరాభిమాని. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ రకరకాల ఒత్తిళ్లు. తాను కోరుకున్నంతగా తెలుగుకథకి చేరువ కాలేకపోయాడు. కొన్నేళ్లుగా ఉద్యోగవిరమణానంతర విశ్రాంతజీవనం గడుపుతున్నాడు. దాంతో, పాతా కొత్తా తేడా లేకుండా ఎక్కడ తెలుగు కథ కనపడుతుందా అని ఎదురుచూస్తున్నాడు. దొరికిన ప్రతి కథా తాను చదువుతున్న మొదటి కథే అనుకుంటున్నాడు. కనపడిన ప్రతి కథనీ దీక్షగా, పరీక్షగా చదివేస్తున్నాడు. ఈ రెండు సంవత్సరాల్లో కొన్ని వందల కథలు చదివి ఉంటాడు. అయినా మనిషి మారలేదు. ఆతడి కాంక్ష తీరలేదు.

ఆ రోజు శుక్రవారం. పొద్దున్నే లేచి పాలపాకెట్లతో పాటు తెలుగునేల వారపత్రిక తాజా సంచిక కొనుక్కొచ్చుకున్నాడు. భార్య చేసి ఇచ్చిన కాఫీ, నాలుగు గుక్కల్లో మింగేసి పడక్కుర్చీలో కూలబడ్డాడు.

పత్రికలో ఉన్న నాలుగు కథల పేర్లు నింపాదిగా చూశాడు. ఉన్నట్లుండి అతని పెదాల మీద ఒక చిరునవ్వు పుచ్చపువ్వులా విచ్చుకుంది. కుడిచేతి వ్రేళ్లతో ఓ చిటికె వేశాడు. ఆ చప్పుడు సద్దు మణగకముందే అతడి భృకుటి ముడివడింది. మందాతిమందగమనంతో అతడి చూపు ఇంటి పైకప్పు వైపు మళ్లింది. పైసా ఖర్చు లేకుండా రంగులు మార్చిన ఒకప్పటి తెల్లటి పంకా రెక్కలు తప్ప కొత్త వస్తువులేవీ అతనికి కనపడలేదు. సీను మారింది. పడకకుర్చీలో ఆసీనుడయ్యాడు. మొదటి కథ, చివరి రెండు కథలూ కాకుండా, రెండో కథ చదవడం మొదలించాడు.”

అక్కడిదాకా చెప్పి, ఆగిపోయాడు బేతాళుడు.

“రాజా! పచ్చిగా చెప్పాలంటే ఈ పాఠకరావు ప్రవర్తన నాకెందుకో పిచ్చిగా కనపడింది. పత్రికలో ఉన్న కథల పేర్లు చూసినప్పుడు అతడి మొహం తీగపై ఒక నవ్వుపువ్వు ఎందుకు పూచింది? చిటికె వేసిన మరుక్షణంలోనే అతడి కనుబొమలెందుకలా వింటి రూపం ధరించాయి? తన ఇంటి పైకప్పు ఎలా ఉంటుందో అతడికి తెలియదా? దాని వంక ఎందుకు అతడలా చూశాడు? ఇదంతా చాలదన్నట్లు, మొదటి కథ కాకుండా, రెండో కథ చదవటం ఎందుకు మొదలుపెట్టాడు? ఈ ప్రశ్నలకు జవాబు తెలిసికూడా చెప్పకపోయావో నీ తల, దాచటానికి కాకుండా చూపటానికి పనికొస్తున్న ఇప్పటి తెలుగు సినిమా కథానాయికల దుస్తుల్లా చీలికలు పేలికలుగా చినిగిపోగలదు!”

స్టీరింగుని గట్టిగా పట్టుకున్న విక్రమార్కుడి కళ్లముందు ఒక రింగు, కలరింగు చేసుకుని రింగులురింగులుగా తిరిగింది. ఆ తర్వాత పాఠకరావు పత్రిక చదివిన సన్నివేశం అతడి కళ్లకి కట్టినట్లు కనపడింది. దాన్ని మనోఫలకమ్మీద యథాతథంగా ముద్రించుకుని, విక్రమార్కుడు జవాబు చెప్పటం మొదలుపెట్టాడు.

“బేతాళా! పాఠకరావు ప్రవర్తనలో నీకు కనపడిన పిచ్చితనం నాకేమీ కనపడటం లేదు. చాలామంది రచయితలు కథకి సంబంధించిన మిగిలిన విషయాల మీద పెట్టే శ్రద్ధ, కథకి పేరు పెట్టటం మీద పెట్టరు. గంటల తరబడి కూర్చుని రాసిన కథకి నామకరణం నిమిషంలో చేసేస్తారు. ఈ ధోరణికి కొత్త కలాలే కాదు, పేరున్న కొందరు రచయితలు కూడా మినహాయింపు కాదు. చివరకు వాళ్లకు ఏమీ తోచకపోతే, హిట్టయిన సినిమా పేరో, పాట పల్లవో, కథలో పాత్ర పేరో తమ కథకి పేరుగా పెట్టేస్తారు. దాంతో ఆ పేర్లు ఇంతకుముందే తెలిసిన పేర్లలా ఉంటాయి. ఒక్కోసారి అవి కథ ఇతివృత్తాన్ని, కొండొకచో కథ ముగింపుని, కథ పూర్తిగా చదవకముందే బట్టబయలు చేస్తాయి. కథాకురుక్షేత్రయుద్ధంపై పాఠకభీష్ముడి ఆసక్తిని చంపటానికి అలాంటి పేర్లు శిఖండి పాత్ర ధరిస్తాయి.

కథలు చదవటంలో విస్తారమయిన అనుభవం ఉన్న సంపాదకులు, వారితో పాటు పాఠకులూ కథ పేరుని బట్టి కథకుడి నాడినీ, కథ స్థాయినీ ఇట్టే పట్టేస్తారు. ఒక్కోసారి, పేరును బట్టే ఒక కథని పక్కలో పెట్టుకోవాలా, పక్కకి నెట్టేయాలా అన్నది నిర్ణయించేస్తారు. అలాంటి అనుభవజ్ఞుల్ని కథ ముగ్గులోకి దింపాలంటే, ఇతివృత్తం సమకాలీన సమస్యను స్పృశిస్తే సరిపోదు. కథనం విశిష్టంగా ఉంటే చాలదు. కథ పేరులో సైతం వైవిధ్యం ఉట్టిపడాలి.

పాఠకరావు కొన్న పత్రికలో మొదటి కథ పేరు మూడు ముళ్ల బంధం. ఆ పేరు చూడగానే పాఠకరావుకి అది ఒక సినిమా పేరు అని, ఆ కథ ఒక సాంసారిక జీవితానికి సంబంధించిందనీ అర్థమయింది. తన తెలివితేటలవల్ల ఆ కథారహస్యం తేటతెల్లమవటంవల్ల అతడికి వల్లమాలిన సంతోషం కలిగింది. అదే అతడిని నవ్వుకునేలా చేసింది.

మూడో కథ పేరు రాలిపోయే పువ్వా. అది ఒక సినిమా పాట పల్లవి. పేరునిబట్టి, కథలో ప్రధానపాత్ర చివరికి చనిపోతుందని అతడికి మొదటే తెలిసిపోయింది. దాంతో ఆనందం పట్టలేక ఓ చిటికె వేశాడు.

నాలుగో కథ పేరు కరుణించని వరుణుడు. ఆ కథ ఓ కరువు ప్రాంతానికి చెందినది అని అతి సులభంగా అర్థమయేసరికి అతని భృకుటి ముడివడింది.

ఇక రెండో కథ పేరు అరణ్యంలో అల్పపీడనం. కార్చిచ్చు అనేది అరణ్యంలో రగిలేది. అల్పపీడనం సముద్రంలో కలిగేది. వీటికి భిన్నంగా జరగడం ప్రకృతిధర్మానికి విరుద్ధం. ఒక వైరుధ్యాన్ని సూచిస్తున్న ఆ కథ పేరులో ఎంతో వైవిధ్యం ఉంది. దాని ఆధారంగా పాఠకరావు ఆ కథాంశాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు అతని దృష్టి అప్రయత్నంగానే ఇంటి పై కప్పు వైపుకి మళ్లింది. తన ప్రయత్నంలో విఫలమయిన అతడిని ఆకట్టుకోవటంలో రెండో కథ పేరు సఫలమయింది. ఒకసారి కథ పేరు వయస్కాంతలా పనిచేసినపుడు ఎవరు చేయగలిగిన పనయినా ఒకటే, టక్కున ఇనుములా దానికి అతుక్కుపోవటం. అదే అనుభవం మన పాఠకరావుకు కూడా ఎదురయింది!”

అలా విక్రమార్కుడికి మౌనభంగం కాగానే, ముందు సీట్లోంచి శవంతో సహా బేతాళుడు మాయమయ్యాడు. విక్రమార్కుడి కారు లోంచి “నీ సుఖమే నే కోరుతున్నా! నిను వీడి అందుకే వెళుతున్నా!” అనే పాట మొదలయింది.
---------------------------------------------------------
రచన: టి. చంద్రశేఖర రెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment