Wednesday, July 4, 2018

చూపులు కలిసిన శుభవేళ


చూపులు కలిసిన శుభవేళ




సాహితీమిత్రులారా!



తెరయెత్తించిరి దేవదానవ గురుల్ దీక్షాకళాకోవిదుల్
తరుణీరాజతనూభవాంతరమునన్ దట్టంపు గౌశేయమున్
తెర యెత్తించెను వారలిద్దర మనోదేశంబులన్ గాముడున్
సరి నన్యోన్య ముఖేందుమండల దిదృక్షా కౌతుకాంభోనిధిన్

సీ.
నెలతుక చూడ్కి వెన్నెల గాసిన గుమారు
వీక్షణాంభోనిధి వెల్లివిరియు
బతి చూడ్కి తామరల్ పరువంబు నొంద దొ
య్యలి చూపుటళులు చిట్టాడుచుండు
సుదతి చూపమృతంపుసోనయై కురిసిన
వరుదృష్టి యనిమిషత్వమును బొందు
నధిపు దృష్టి ప్రవాహంబు పెల్లడరిన
నింతి దృఙ్మీనంబు లీతలాడు
తే.
వరుస గౌతుక కల్లోలవలన మొలయ
రాగ మకరంద మత్తత ప్రజ్వరిల్ల
సంచిత ధ్యాన మను ప్రకాశము తలిర్ప
జిఱుత సిగ్గను వలలోన జిక్కువడక

చూపులను వర్ణించే కవిత్వమంటే ఎందుకో నాకు చాలా ప్రీతి. ఏ కావ్యం చదివినా అందులో చూపుల గురించి పద్యాలేవైనా ఉన్నాయేమోనని ఆసక్తితో చూస్తూ ఉంటాను. సంస్కృతంలో కాళిదాసు మొదలుకొని, తెలుగులో ఇప్పటి బేతవోలు రామబ్రహ్మం వరకూ ఎందరో ప్రాచీన ఆధునిక కవులు, రకరకాల చూపులను వర్ణించారు. చూపులను రకరకాలుగా వర్ణించారు. చూపులు పలికించే భావాలు, చిలికించే రసాలు ఎన్నెన్నో. ధర్మరాజు ‘కడకంట నివ్వటిల్లెడి చూడ్కి’ మానిత సంపదలను అందించింది. హిరణ్యకశిపుని సంహరించే సమయాన నారసింహుని ‘దృష్టి విక్షేపము’ నలుదిక్కులా భయంకరంగా ప్రసరించింది. అసూయతో, కోపంతో సత్యభామ, ‘హెచ్చిన కనుదోయి కెంపు, తన చెక్కుల గుంకుమపత్ర భంగ సంజనిత నవీనకాంతి’ని వెదజల్లింది. అదే సత్యభామ చూపు, నరకాసురునితో పోరే వేళ, ఒకవైపు అమృతాన్ని ఇంకొకవైపు అగ్నిజ్వాలలనూ కురిపించింది. బృందావనంలో గోపికల చూపులు భక్తిరస నిర్భరాలు. వారు ‘మాధవుని యుజ్జ్వలరూపము చూడ్కి తీగలన్ జిక్కగబట్టి’, అతన్ని తమ హృదయంలో దాచేసి, ‘వెలిం జనకుండ నేత్రముల్ గ్రక్కున’ మూసేసుకుంటారు. ఇలా, నవరసాలను ఒలికించే ఎన్నో రకాల చూపులను కవులు మనకి పద్యాలలో సాక్షాత్కరింపజేసారు. ఆదిశంకరులయితే, అమ్మవారి చూపులలో నవరసాలనన్నింటినీ ఒకే శ్లోకంలో వర్ణించారు!

అయినా, అన్ని రసాలలోకి రసరాజమైన శృంగారానిదే పైచేయి. వలపులు చిందే చూపులలోని అందమే వేరు! అందులోనూ, తొలిచూపుల పలకరింపులు మనసులను గిలింతలు పెడుతూ మరింతగా అలరిస్తాయి. పెళ్ళిపీటల మీద, సిగ్గుబరువుతో రెప్పలు ఎత్తలేక, పక్కనున్నవారిని కంటితుదలతో చూసే ప్రక్కచూపుల నేర్పు, మన్మథుడు నేర్పే ప్రథమ విద్య అంటారు విశ్వనాథ. ప్రేయసీ ప్రియుల తొలిచూపులను శృంగార రసోల్లాసంగా తెలుగులో వర్ణించిన మొట్టమొదటి కవి నాకు తెలిసి తిక్కన. ఉత్తరాభిమన్యుల వివాహ సందర్భంలో, తెర తొలగిన వేళ ఒకరినొకరు చూసుకున్న క్షణంలో, వారి మధ్య మొగ్గతొడిగిన సిగ్గు కోరికల అన్యోన్యాలోకాలను, ‘వరు చూడ్కి ముద్దియ వదనంబుపై బాఱి’ అనే అందమైన సీసంలో మనోహరంగా వర్ణిస్తాడు తిక్కన. అది రసధ్వనికి గొప్ప ఉదాహరణ. తిక్కన పెట్టిన ఒరవడిలో తర్వాత చాలామంది కవులు అలాంటి వర్ణనలు చేసారు. పై పద్యాలు కూడా ఆ కోవకి చెందినవే. అయినా సరికొత్త ఊహలతో, తొలిచూపులలోని తాజాదనం గుబాళిస్తున్నాయివి.

పెళ్ళివారిలో ఒక పక్షంవారు దేవతలు, మరొక పక్క రాక్షసులు. సుముహూర్త వేళ అయ్యింది. వారి వారి పురోహితులు, వధూవరుల మధ్యనున్న దట్టని కౌశేయాన్ని అనగా, పట్టుతెరను పైకి ఎత్తించారు. ఇంతవరకూ సన్నివేశ చిత్రణ మాత్రమే. ఆ తర్వాత కవి కల్పనా చాతురి ఆ సన్నివేశానికి కొత్త వెలుగును సంతరించింది. ఎత్తబడింది వధూవరుల మధ్యనున్న పట్టుతెర ఒక్కటే కాదట. సరిగా అదే సమయానికి మరొక తెర కూడా ఎత్తబడింది. ఎక్కడంటే, వధూవరుల మనసులలో– అన్యోన్య ముఖేందుమండల దిదృక్షా కౌతుకాంభోనిధిన్. అన్యోన్య = ఒకరొకరి, ముఖ ఇందుమండల = ముఖాలనే చంద్రబింబాలను, దిదృక్షా = ద్రష్టుమ్ ఇచ్చా దిదృక్షా, అంటే చూడాలనే కోరిక, కౌతుక = అమితమైన ఉత్సాహం అనే, అంభోనిధిన్ = సముద్రములో. వధూవరుల మనసులలో, ఒకరినొకరు చూసుకోవాలనే కోరికా ఉత్సాహం ఉవ్వెత్తుగా ఎగసిపడుతోంది. కానీ మధ్యన తెర ఉండడంతో అది సాధ్యం కాలేదు. దాని వల్ల, దాటడానికి శక్యంకాని పెద్ద సముద్రంలా తయారయ్యింది. అంతలో మధ్యనున్న తెర ఎత్తబడింది. ఇక వారి చూపులకు అడ్డం ఏముంది. ఆ ఉత్సాహమనే సముద్రంలో అవి హాయిగా ప్రయాణించే నావకి తెర ఎత్తబడినట్టే ఇక! ఆ తెర ఎత్తించినది ఎవరు? కాముడు. పురోహితులు కళ్యాణం జరిపించి తమ కార్యాన్ని ముగించారు. మన్మథుడు ఆపై జరిగే వారి ప్రణయానికి తెర తీసాడు. ఆ ప్రణయ ప్రయాణం, చూపుల కలయికతో మొదలయ్యింది.

తర్వాత సీసం, వధూవరుల చూపుల ప్రయాణం ఎలా సాగిందో, అద్భుతమైన పోలికలతో వర్ణించే పద్యం. నెలతుక చూడ్కి అంటే అమ్మాయి చూపు, వెన్నెల కాసింది. కుమారు వీక్షణాంభోనిధి అంటే అబ్బాయి చూపు అనే సముద్రం, వెల్లివిరిసింది, అంటే ఉప్పొంగింది. చంద్రుని చూడగానే సముద్రం ఉప్పొంగడం ఒక కవి సమయం. చెలి చూపు వెన్నెలకి చెలుని చూపు కడలి ఉప్పొంగిందన్న మాట. పతి చూడ్కి తామరల్ పరువంబు నొంద = పతి చూపులనే తామరలు పరువాన్ని పొందాయి, అంటే విచ్చుకున్నాయి. తొయ్యలి చూపుటళులు చిట్టాడుచుండు = ఇంతి చూపులనే తుమ్మెదలు (అళులు) ఆ తామరల చుట్టూ ముసురుకున్నాయి. పతి చూపులనే తామరలు వికసించగానే, వాటి చుట్టూ ఇంతి చూపులనే తుమ్మెదలు తిరుగాడాయి. సుదతి చూపమృతంపుసోనయై కురిసిన = వధువు చూపు అమృతపు జల్లులా కురిసింది. వరుదృష్టి యనిమిషత్వమును బొందు = వరుని చూపు అనిమిషత్వాన్ని పొందింది. అనిమిషులు అంటే దేవతలు. అమృతపు జల్లులో తడిసిన చూపు అమరత్వాన్ని పొందింది అని ఒక అర్థం. అసలర్థం ఏమిటంటే, అనిమిషత్వం అంటే రెప్పపాటు లేకపోవడం. అంటే వరుడు రెప్పపాటు లేకుండా చూస్తూ ఉన్నాడని. అధిపు దృష్టి ప్రవాహంబు పెల్లడరిన = భర్త దృష్టి అనే ప్రవాహం అంతకంతకూ వెల్లువై సాగింది. రెప్పపాటు లేని చూపు నిరంతరంగా ప్రవహించడంలో ఆశ్చర్యం ఏముంది! ఇంతి దృఙ్మీనంబు లీతలాడు = భార్య దృక్కు (అంటే చూపు లేదా కన్ను) అనే చేప (మీనం) ఈతలాడిందిట. కళ్ళను చేపలతో పోల్చడం ఒక ప్రసిద్ధమైన పోలిక. అయితే ఆ చేపలిప్పుడు భర్త చూపుల నదిలో హాయిగా ఈదులాడుతున్నాయి అనడం కొత్త అభివ్యక్తి.

ఇదీ సీస పద్యం నాలుగు పాదాలలో కవి చేసిన మనోహర ఊహా విహారం! మరి ఎత్తుగీతి సంగతి ఏమిటి? సీస పద్యం, నాలుగు పాదాల తర్వాత తేటగీతితో కానీ ఆటవెలదితో కానీ ముగుస్తుంది. దానికే ఎత్తుగీతి అని పేరు. సీస పద్య పాదాలను చక్కని శిల్పంతో మలచినప్పుడు, ఆ శిల్పానికి ఏమాత్రం లొచ్చు రాకుండా ఎత్తుగీతిని కూర్చడం చాలా ముఖ్యం. ఈ పద్యంలో సీస పాదాలలో చక్కని శిల్పాన్ని కవి నిర్మించాడు. ఒక్కొక పాదంలో ఒక్కొక కొత్త ఉపమానం. ఒక్కొక ఉపమానం చూపులలో ఉన్న ఒక్కొక విశేషాన్ని ధ్వనిస్తున్నాయి. మొదటి పాదంలో చూపుల చల్లదనం, రెండవ పాదంలో చూపుల వికాసం, మూడవ పాదంలో చూపుల దివ్యత్వం, నాల్గవ పాదంలో చూపుల నిరంతరత్వం సూచింపబడ్డాయి. పద్యశిల్పం అక్కడితో ఆగలేదు. ఒక పాదంలో ఉన్న రెండు భాగాలలో ఒక భాగం వధువు చూపు, మరొక భాగం వరుని చూపు గురించిన వర్ణన. ఒక పాదంలో పొడుగు భాగం వధువుకయితే, మరొక పాదంలో పొడుగు భాగం వరునికి. ఇలా, పద్య పాదాలను వధూవరుల చూపుల మధ్య సరిసమానంగా విభజించడమే కాదు, వాటి మధ్య కార్య కారణ సంబంధాన్ని కూడా నిర్మించడం ప్రౌఢశిల్పం. ఇంత శిల్పాభిరామంగా నిర్మించిన సీసపద్య భవనానికి గోపురశిఖరం లాంటి ఎత్తుగీతిని ఇంకెంత అందంగా రూపొందించాలి? సీసపద్య పాదాలలో సాగిన పోలికల పరంపరనే మరొక రెండు పోలికలతో ఎత్తుగీతిలో కూడా కొనసాగించవచ్చు. అప్పుడది సాధారణ శిల్పం అవుతుంది. ఎత్తుగీతి పాదాలను పైపాదాలతో ముడిపెట్టి, అందులో చెప్పిన ఒకో విషయానికీ ఒక పరిపూర్ణతను చేకూర్చగలిస్తే, అదీ ప్రౌఢశిల్పం. సరిగ్గా అలాంటి శిల్పాన్ని ఇక్కడ నిర్మించాడు కవి.

ఎత్తుగీతి పద్యం మొదలు పెడుతూనే ‘వరుస’ అన్నాడు. అంటే క్రమాలంకారం వస్తోంది చూడండి అని చెప్పడం. క్రమాలంకారం అంటే పై నాలుగు పదాలలో చెప్పిన నాలుగు అంశాలకు సంబంధించి, అదే వరసలో మరి నాలుగు వాక్యాలను చెప్పి పూరించడం అన్నమాట. ఏమిటా క్రమ పూరణలు? తెలుగులో సాధారణంగా వాక్యానికి చివరన క్రియ వస్తుంది. అంచేత క్రియలను వెతికి పట్టుకొంటే మనకు వాక్యం దొరుకుతుంది. కౌతుక కల్లోలవలన మొలయ, రాగ మకరంద మత్తత ప్రజ్వరిల్ల, సంచిత ధ్యాన మను ప్రకాశము తలిర్ప, చిఱుత సిగ్గను వలలోన జిక్కువడక– ఇవీ ఆ నాలుగు వాక్యాలు. వీటిలో వచ్చిన ఒలయ, ప్రజ్వరిల్ల మొదలైన నాలుగు క్రియలూ అసమాపక క్రియలు. అంటే వాటితో వాక్యానికి ముగింపు ఉండదు. పై సీస పాదాలలో ఒకొక్క పాదం ఒకో క్రియతో ముగుస్తోంది. ఈ ఎత్తుగితిలో వాక్యాలను ఆయా సీసపాదాలతో క్రమంగా కలిపి చదువుకోవాలి.

కౌతుక కల్లోలవలన మొలయ. కౌతుక = కోరిక అనే, కల్లోల = పెద్ద అల, వలనము = తిరుగుడు, ఒలయ = చుట్టుకొనగా. సీసపద్యం మొదటి పాదంలో అబ్బాయి చూపు అనే సముద్రం ఉప్పొంగింది అని చెప్పుకున్నాం కదా. అలా ఉప్పొంగిన సమయంలో, కోరిక అనే ఒక పెద్ద అల గుడుసుళ్ళు తిరుగుతూ కమ్ముకొంది అని అర్థం. అమ్మాయి చూపు వెన్నెల కురిసింది. అబ్బాయి చూపు సముద్రంలా ఉప్పొంగింది. ఆ చూపులో కోరిక అనే పెద్ద అల గుడుసుళ్ళు తిరుగుతూ ఎగిసిపడింది. ఎంత అందమైన పూరణ! అలాగే మిగతా మూడు పాదాలు.

రాగ మకరంద మత్తత ప్రజ్వరిల్ల- అంటే ప్రేమ అనే మకరందపు మైకం ప్రజ్వరిల్లగా అని. రెండవ పాదంలో వరుని చూపు తామరలు వికసించాయి. వధువు చూపు తుమ్మెదలు వాటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. పెళ్ళికొడుకు చూపులలో అనురాగం అనే మకరందం నిండి ఉంది. వధువు చూపులనే తుమ్మెదలు ఆ మకరందాన్ని గ్రోలి మత్తెక్కాయన్న మాట!

సంచిత ధ్యాన మను ప్రకాశము తలిర్ప- అంటే నిరంతర ధ్యానమనే కాంతి అతిశయించగా అని. మూడవ పాదంలో అమ్మాయి చూపు అమృతాన్ని కురిసింది. అందులో నిమగ్నమైన అబ్బాయి చూపు రెప్పపాటు లేకుండా దివ్యత్వాన్ని పొందింది. అలా రెప్పపాటు లేకుండా చూస్తున్న ఆ చూపు ఒక నిరంతర ధ్యానంలో మునిగినట్టు గొప్ప కాంతిని ప్రసరించింది!

చిఱుత సిగ్గను వలలోన జిక్కువడక- అంటే చిరు సిగ్గు అనే వలలో చిక్కుపడకుండా అని. నాల్గవ పాదంలో పతి చూపు వెల్లువగా ప్రవహించింది. అందులో ఇంతి చూపులనే చేపలు ఈదులాడాయి కదా. అవి సిగ్గు అనే వలలో చిక్కుబడకుండా స్వేచ్ఛగా ఈదులాడాయట. తన భర్తను చూడనివ్వకుండా ఒకవైపు మనసులో చిరుసిగ్గు అంకురించింది. అయితే, దాన్ని తప్పించుకొని చూపులు యథేచ్ఛగా సాగాయన్నమాట. చూపులను చేపలతో పోల్చారు కాబట్టి సిగ్గును వలతో పోల్చడం చాలా చక్కని పద చిత్రం!

ఇలా, ఎత్తుగీతిలోని నాలుగు పాదాలు, సీస పద్యంలో నాలుగు పాదాలకూ గొప్ప వెలుగునూ జిలుగునూ సంతరించి పెట్టాయి. ఒక పద్యాన్ని ఆసాంతం శిల్పసౌష్ఠవంతో, మధురమైన కల్పనలతో సృష్టి చేయడానికి చక్కని ఉదాహరణ ఈ పద్యం!

ఇంతకూ ఈ పద్యాలు రచించినది ఎవరో, ఇవి ఎక్కడివో చెప్పనే లేదు కదూ! ఈ రెండు పద్యాలూ ఒక కావ్యంలోవి కావు, ఒక కవి రచించినవీ కావు. అయినా ఒకదానికొకటి సరిగ్గా అతికిపోవడం చిత్రం. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, ఒకటి ప్రద్యుమ్న చరిత్రము అనే కావ్యం లోనిదయితే, మరొకటి అనిరుద్ధ చరిత్రము అనే కావ్యం లోనిది. మొదటిది అనిరుద్ధ చరిత్రములో పద్యం. అందుకే అక్కడ దేవదానవుల ప్రసక్తి వచ్చింది. వధువు బాణాసురుని కూతురైన ఉష. వరుడు కృష్ణుని మనుమడు, ప్రద్యుమ్న కుమారుడు అయిన అనిరుద్ధుడు. అనిరుద్ద చరిత్రము రచించిన కవి పేరు పెమ్మన బావన. రెండవ పద్యం ప్రద్యుమ్న చరిత్రము లోనిది. దీనిని రచించినది పొన్నాడ పెద్దిరాజు. ఇందులో వరుడు ప్రద్యుమ్నుడే అవ్వాలి. వధువు బహుశా రుక్మి కూతురు రుక్మవతి అయి ఉండవచ్చు.

కొన్ని వర్ణనా పద్యాలు తప్ప, ఈ రెండు కావ్యాలూ పూర్తిగా లభించలేదు. ఈ కవులిద్దరూ ఎక్కడివారో, ఏ కాలం వారో కూడా తెలియలేదు. క్రీ.శ. 1560 పూర్వులని పరిశోధకుల అభిప్రాయం. పూర్వ కావ్యాలలో తమకు నచ్చిన పద్యాలను, ముఖ్యంగా వర్ణనలను, కొందరు ఏర్చికూర్చి సంకలన గ్రంథాలుగా ప్రకటించేవారు. అలాంటి గ్రంథాలలో పెద్దపాటి జగన్నాథ కవి సంకలనం చేసిన ప్రబంధ రత్నాకరం ఒకటి. ప్రబంధ రత్నాకరంలోని పద్యాలను, ఇంకొక అజ్ఞాత కవి సంకలించిన మరొక పేరులేని సంకలన గ్రంథంలోని పద్యాలనూ కలిపి, వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రబంధ రత్నావళి అనే గ్రంథంగా ప్రకటించారు. ఇందులో సుమారు నూరుమంది కవుల పద్యాలున్నాయి. పై రెండు పద్యరత్నాలూ ఈ గ్రంథంలోనివి. తంజావూరు పుస్తక భాండాగారాల వంటి చోట్ల మరుగుపడి ఉన్న తాళపాత్ర గ్రంథాలను ఉద్ధరించి ప్రచురించి తెలుగువాళ్లందరికీ అందుబాటు లోకి తెచ్చిన పరిశోధకులలో మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రముఖులు. ఎక్కడా గ్రంథస్థం కాక చెల్లాచెదురుగా ప్రజల నోళ్ళలో మాత్రమే అనుశ్రుతంగా వస్తూ వచ్చిన చాటుధారలను కూడా ప్రభాకర శాస్త్రి చాటు పద్యమణిమంజరి అనే పేర సంకలనం చేసారు. ఆ మహనీయులకు తరతరాల తెలుగు సాహిత్యాభిమానులు, పరిశోధకులు ఋణపడి ఉన్నారు.
----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment