జీవితానికి ఎన్ని రంగులో!!!(కథ)
సాహితీమిత్రులారా!
శ్వేత ఉత్తరం రాసింది! ఉత్తరం చదువుతుంటే నాలో సంతోషం ఉప్పొంగుతోంది. చిన్నారి శ్వేత పెద్దదయిపోయింది. పద్నాలుగేళ్ళు! బాల్యానికి గుడ్ బై చెప్పి యవ్వనంలోకి అడుగుపెడుతూ .. ఇంకా ప్రపంచం తెలియని ఊహాలోకంలో తేలిపోతూ … ఇప్పుడు శ్వేత ఎలాగుందో! చూడటానికి బంగారుబొమ్మే! నా పోలికలేమైనా ఉంటాయా? మన పిల్లలలో మన ప్రతిబింబం చూసుకోవాలని ఉంటుంది. శ్వేతకు తెలుగు నేర్పిస్తున్నానని రాసింది మాలతి. ఐనా ఇంత బాగా రాయగలదా? నమ్మలేక పోతున్నాను. మాలతి రాసిందేమో! రైటింగు బాగుంది. ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాను.
ప్రియమైన బామ్మా!
ఈ ఉత్తరం నేను స్వయంగా రాస్తున్నాను. నమ్మకం కలగటం లేదా? ప్రపంచపు ఎనిమిదో వింత లాగా ఉందా? ఇప్పుడు నేను చాలా ఎదిగాను. నా ఎత్తు ఐదు అడుగుల మూడు అంగుళాలు. మనసు ఎదిగిన ప్రతివ్యక్తి ఎనిమిదవ వింత అనవచ్చు. కాదు. మొదటి వింత! నన్ను చూస్తే … ఆశ్చర్యపడతావేమో! అంతే కాదు. నేను తెలుగు నేర్చుకున్నాను. ఎలా, ఎందుకు నేర్చుకున్నానో చెప్తాను. ఏడాది క్రిందట మేము .. అంటే అమ్మ, డాడీ, నేనూ, దీపూ ఒక రిసెప్షన్‌కి వెళ్ళాము. ప్రమీల ఆంటీ కొడుకు రవీంద్ర పెళ్ళి అయింది. రవీంద్ర పెళ్ళికూతురు ఒక తెలుగు అమ్మాయి. పేరు అనూరాధ. పట్టుచీర కట్టి నగలు పెట్టారు. బుగ్గమీద చుక్క ఎంత బాగుందో!
“హార్వెస్ట్” అంటే అదొక పెద్ద రెస్టారెంట్. తెలుగు పద్ధతిలో రంగుముగ్గులతో, పూలమాలలు, దీపాలతో అలంకరించారు. నాకు ఆ అలంకరణ చాలా నచ్చింది. భోజనానికి ముందర కూచిపూడి డాన్స్ ప్రోగ్రాం పెట్టారు. అది అయ్యాక అనూరాధ పాట పాడింది. ఆ పాట చాలా బాగుంది. ఈ వసంతాలలో అనే పాట కళావతి రాగంట! ఆపాట నాకు చాలా నచ్చింది. ఆ రాగం చాలా బాగుంది. అమ్మ పాటకి అర్థం చెప్పింది. తెలుగు చాలా చక్కటి భాష అనిపించింది. తెలుగు సినిమాలు చూస్తుంటాము. నాకు ఆ భాష అర్థం కాదు. “ఉఠ్ఠి వాగుడు” అంటుంది అమ్మ.
కానీ కొన్ని సినిమా పాటలు చాలా బాగుంటాయి. నాకు సాఫ్ట్ మ్యూజిక్ ఇష్టం. అనూరాధ పాట విన్నాక నాకు తెలుగు నేర్చుకోవాలనిపించింది. సంగీతం కూడా! వెంటనే మొదలు పెట్టాను. ఆరు నెలల్లో చాలా నేర్చుకున్నాను. అక్షరమాల, గుణింతాలు, సంయుక్తాక్షరాలు వచ్చేశాయి. అమ్మ తప్పులు దిద్దుతుంటే ఒక ఏడాదిలో రాయటం కూడా వచ్చేసింది. వచ్చింది కదూ! మేము వచ్చే నెలలో అక్కడికి .. ఇండియా వస్తున్నాము. నాకు ఒక తెలుగు ఫ్రెండ్ ఉంది. “ఇండియా చాలా డర్టీ ప్లేస్. వేడి ఎక్కువ. ఆవకాయ, గోంగూర తింటారు. హారిబుల్. వొళ్ళంతా మండి పోతుంది” అని భయపెడుతోంది. ఐ డోంట్ కేర్. “మా బామ్మ ఎక్కడ వుంటే అక్కడికి, అరణ్యమైనా, మౌంట్ ఎవరెస్ట్ అయినా సరే, వెడతాను” అన్నాను. బాగా జవాబు చెప్పాను కదూ! నాకు మీ అందరినీ చూడాలని ఉంది. ఆంధ్రా చూడాలని ఉంది. హైదరాబాద్ చూడాలని ఉంది. తాతయ్యకి నా నమస్కారాలు. ప్రేమతో … శ్వేత.
చక్కగా రాసింది! ప్రసాద్, మాలతి, పిల్లలు వస్తున్నారు. ఈ వయసులో కళ్ళారా పిల్లల్ని చూసుకోగలగటం కంటే ఆనందం ఏముంది! క్రిందటి సారి వచ్చినప్పుడు శ్వేత ఇంకా చిన్నపిల్ల. ఎన్ని పేచీలు పెట్టింది! పసిపిల్ల అప్పుడూ అంతే. నా ఒళ్ళో కూచోపెట్టుకుని గోరుముద్దలు తినిపించాలని, కథలు చెప్పాలని, జోలపాడి నిద్రపుచ్చాలని ఉబలాటపడిన నన్ను ఎన్ని తిప్పలు పెట్టేది! పిలిస్తే పారిపోయేది. దగ్గరగా వచ్చేది కాదు. క్రిందటి సారి వచ్చినప్పుడు సరికొత్త పేచీలు. “రైస్ తినను. పిజా, బర్గర్ కావాలి” అంది. ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతుంది. అప్పటిదాకా అవేమిటో పేరుకూడా వినలేదు నేను. ఎక్కడనుంచి తీసుకురాను?
“అవన్నీ ఇక్కడ దొరకవు. నీకోసం ఆలూ కూర, పూరీ చేసింది బామ్మ. ఆ! చాలా టేస్టీగా ఉంది చూడు” అని మాలతి మరిపించాలని చూసింది. “పూరీ … ఆలూ! షిట్. ఇక్కడ నాకు బాగా లేదు. స్విమింగ్ లేదు. సైకిల్ లేదు..” అని అలిగి పడుకుంది.
అప్పటికప్పుడు రమేష్ బజారుకి వెళ్ళి సైకిల్ కొనితెచ్చాడు. హోటల్స్‌కి తీసుకెళ్ళి పాస్ట్రీలు, ఐస్‌క్రీములు తినిపించాము. గ్రహచారం చాలక ఒకసారి చీమ కుట్టింది. “వాటే హారిబుల్ ప్లేస్! ఇప్పుడే వెళ్ళిపోదాం..” అంటూ గొడవ చేసింది. ఒకరోజు కోతులనాడించేవాడు వచ్చాడు. ఆట చూసినంతసేపు పకపకా నవ్వింది. తర్వాత కోతి కావాలని పేచీ పెట్టింది. డాబా మీదనుంచి దూకేస్తానంది. ఒకరోజంతా కాపలా కాశాము. హడలి చచ్చిపోయాం. రమేష్ ఊరంతా వెతికి ఒక రాబిట్‌ని కొనితెచ్చాడు. దానికోసం ఒక అట్టపెట్టె, చిల్లులతో. దానికి కారెట్ తినిపిస్తూ కోతిని మర్చిపోయింది శ్వేత. దాని తప్పులేదు.
దాని రెండవయేట తల్లి దాన్ని వదిలేసింది. ఏడాది పిల్ల! జాలికూడా లేదు. తల్లి వదిలేసిన పిల్లలు ఎలా ఉంటారు? ముత్యాల్లాగా, ముద్దబంతిపూలలాగ ఉంటారా? చచ్చుదద్దమ్మల్లాగో, రాక్షసుల్లాగో తయారవుతారు. టెర్రరిస్టులు అవుతారు. మాలతి పుణ్యమా అని శ్వేత మామూలు మనిషి అయింది. మంచిపిల్ల కాగలిగింది.
ఎంతచక్కగా రాసింది ఉత్తరం! ఇంతకన్న ఆనందమేమిటి అంటోంది మనసు. అంతా దేవుడి దయ అనుకోవాలి. ప్రసాద్ అమెరికా వెడుతున్నప్పుడు అనుకున్నానా! మమ్మల్ని లక్ష్యపెట్టకుండా అమెరికా అమ్మాయిని చేసుకుంటాడని! ఎదురుదెబ్బ తగిలింది. మధ్యతరగతి వాళ్ళం. ఎన్నో కోరికలు నిగ్రహించుకుని, మనసు సరిపెట్టుకుని పిల్లల్ని పెంచి పెద్ద వాళ్ళని చేశాం. ప్రసాద్ అమెరికా వెళ్ళి రెండేళ్ళు అయింది. ఆ ఉత్తరం వచ్చింది.
“నేను పెళ్ళి చేసుకుంటున్నాను. ఆనీ చాలా మంచి అమ్మాయి. ఇక్కడికి వచ్చాక ఇండియన్, అమెరికన్, నీగ్రో తేడాలు మరిచిపోతాము. వాళ్ళూ మనలాంటి వాళ్ళే. ఎవరి విలువలు వాళ్ళకి ఉంటాయి. వాటిని గౌరవించాలి. మనిషి అంటే మంచి మనసు ఉండటం ముఖ్యం. పెళ్ళి అయాక మేము ఇండియాకి రావాలనుకుంటున్నాము. మీరు తప్పకుండా ఆనీని ఇష్టపడతారు. నాకు తెలుసు. మమ్మల్ని రమ్మంటారా?” అది వాడి ఉత్తరం సారాంశం.
కోడలంటే మన తర్వాత మన ఇల్లు నిలబెట్టేది. మన కుటుంబ మర్యాద, గౌరవం కాపాడే వ్యక్తి. మన అలవాట్లు, ఆచారాలు ఆ అమ్మాయికి అర్థమౌతాయా? గౌరవించగలదా? మన భాష కాదు. ఇంగ్లీషులో ఆంతర్యాలు విప్పుకుని మాట్లాడగలమా? గౌన్లు, స్కర్టులు వేసుకునే ఆ పిల్లని కోడలుగా మన్నించగలనా? మన పూజలూ పండగలూ వస్తే మనతో కలిసి ఆనందించగలదా? ఆచరించగలదా? కల్చర్ కదా మనుషుల్ని దగ్గర చేస్తుంది. ఆదూరం దాటగలమా? వాడు దేశాలు, సముద్రాలు దాటి వెళ్ళాడు. వాడికి తేడాలు లేకపోవచ్చు. మేము ఇక్కడే, పుట్టిన చోటే ఉన్నాం. ఏడుపు ఆపుకుని బాధని కంట్రోల్ చేసుకుని మార్పుని అంగీకరించాలని సమాధానపడి తప్పకుండా రమ్మని రాశాం. కన్నవాళ్ళని వొదులుకోలేము కదా! అప్పుడే లత పెళ్ళి కూడా కుదిరింది. పెళ్ళికి వచ్చారు ప్రసాద్, ఆనీ. అందరికోసం కానుకలు తెచ్చారు. ఆనీ నిజంగానే బాగుంది. సౌమ్యం గానూ ఉంది. అమెరికన్లు, యూరోపియన్లు పాలిపోయినట్లు తెల్లగా ఉంటారు కానీ వాళ్ళలో అందం లేదు అనుకునేదాన్ని. ఆనీని చూస్తుంటే నా అభిప్రాయం తప్పు అనిపించింది. ఆ శరీరంలో నునుపు, తెలుపులో గులాబీ కలిసిన రంగు, కళ్లలో మిలమిలలు, బంగారు రంగు జుట్టు, దేవకన్యలు ఇలాగ ఉంటారేమో అనిపించింది. ప్రసాద్‌ని చూసి ముచ్చట వేసింది… మంచి భార్య దొరికిందని. పెళ్ళికి బంధువులంతా వచ్చారు. ఆనీ నమస్తే చెప్తే అందరూ సంతోషించారు.
ఆనీని పార్లర్‌కి తీసికెళ్ళి మన పద్ధతిగా మేకప్ చేయించి చీర కట్టి నగలు పెట్టాము. అన్నీ సరదాగా చేయించుకుంది. నాకెంపుల నెక్లెస్ ఇచ్చాను. చాలా సంతోషించింది. “థాంక్యూ మమ్మీ” అంది కౌగిలించుకుని. ఆయనని నన్ను డాడీ మమ్మీ అని పిలిచింది. మన వంటల పేర్లు కొన్ని తెలుసు. వెంకాయ్ కూర, కొభరి పచాడి అంటే సరదాగా నవ్వుకున్నాం. ముగ్గులు వెయ్యటం నేర్చుకుంది. గోరింటాకు పెట్టుకుంది. దూరం నుంచి చూస్తే ఏదైనా భయంగానే ఉంటుంది. ఈస్ట్, వెస్ట్ అనే పరిథులు మనం గీసుకున్నవే. మన మనసులో ఉంటాయి. మనసు విశాలమైతే అన్నీ చెరిగిపోతాయి. అడ్డు కాలేవు. జీవితం విశాలమౌతుంది. కావాలనుకుంటే కలిసిపోగలం. రంగులు, దూరాలు అడ్డురావు అనుకున్నాం. ఏదో అగాధం అనుకున్నది తేలికగా దాటేసినట్లు అనిపించింది. ఆ సంతోషంలో మనసంతా సందడి, వింత కాంతులు. ప్రపంచం అంచులు చూసినట్లు అనుభూతి. వాళ్ళ పెళ్ళయి రెండేళ్ళు అవుతుండగా పాప పుట్టింది. శ్వేత అని పేరు పెట్టారు.
ఆ పేరు నేనే చెప్పాను. ఆనీకి అభ్యంతరం ఉంటుందేమో అనుకున్నాను కానీ ఆనీ ఏమీ అనలేదు. మమ్మల్ని అమెరికా రమ్మని రాసేవారు. మాకు ఇక్కడ తీరిక ఏది! రమేష్ చదువుకుంటున్నాడు. లతా వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. లతకు నెల తప్పిందని తెలిసింది. ఏడవనెలలో సీమంతం చెయ్యాలి. తర్వాత పురిటికి తీసుకురావాలి. అమెరికా ఎలా వెళ్ళగలం! పైగా ఆయనకి కొడుకుల చేత ఖర్చు పెట్టించటం ఇష్టం లేదు. “నేను వెళ్ళగలిగితే నా డబ్బు తోనే వెడతాను” అనేవారు. మేము వెళ్ళకుండానే అంతా అయిపోయింది. ప్రసాద్, ఆనీ డైవోర్స్ తీసుకున్నారు. “పిల్లలి పాలు పట్టటం, గుడ్డలుతకటం, భర్త, వంట, రొటీన్. ఈ లైఫ్ నాకు బోర్ కొడుతోంది. నేను పిల్లని పెంచలేను” అందిట ఆనీ. పిల్లని సమంగా చూడటం లేదని ప్రసాద్‌కి కోపం వచ్చిందట. జాబ్ వదిలెయ్యమన్నాడుట.
“నువ్వు నీ జాబ్ వదిలేస్తావా?” అని అడిగిందట ఆనీ! బాస్‌తో కాంప్‌లకి వెళ్ళేది. ప్రసాద్ తరచూ ఆఫీసుకి సెలవు పెట్టాల్సి వచ్చేది. ఏమైనా అంటే “నువ్వు ఇండియన్ హజ్బెండ్‌వి. నిన్ను సహించటం నావల్ల కాదు. డైవర్స్ తీసుకుందాం. పిల్లని నువ్వే పెంచుకో” అందిట.
భార్య అన్నీ సహిస్తేనే వివాహబంధం అతుకుతుంది. ఇంకా ఏం గొడవలు పడ్డారో. భార్యా భర్తల మధ్య అనేకం ఉంటాయి. అదొక విచిత్రమైన బంధం!
ఇద్దరు ప్రత్యర్థులు తుఫానులో తప్పనిసరిగా ఒకే పడవ ఎక్కినట్లు! బ్రతకాలంటే, మునిగి పోకుండా ఉండాలంటే ఒకరికొకరు సహకరించక తప్పదు. వాళ్ళిద్దరి మధ్యా ఇంకా ఏంజరిగిందో మాకు ఎక్కువ తెలియదు. విడిపోయారు.
ఆ సంగతి తెలిసి చాలా బాధ పడ్డాము. కానీ ఏం చెయ్యగలం. ఇండియన్స్ మనం ఏవో విలువలు నమ్మి ఉన్నదాన్నే పట్టుకుని వేళ్ళాడతాం. చాలా కోల్పోతున్నామా? వాళ్ళు ఏవో వెతుక్కుంటూ ఉన్నదాన్ని వదిలేసి కొత్తదాని వెంట పరిగెడతారు.
ఏమైనా అధికంగా పొందగలుగుతున్నారా? ఇదివరకు పెళ్ళిచేసుకున్నాక ఇష్టం లేకపోయినా బలవంతంగా కలిసి బ్రతికేవారు. ఇప్పుడు ఇష్టపడి పెళ్ళి చేసుకుని కూడా విడిపోతున్నారు. ఎప్పుడూ మనసుకి సమాధానం లేదా! ఏమిటీ జీవితం! కొన్నాళ్ళు ఇంట్లోనే నానీని పెట్టి, కొన్నాళ్ళు డేకేర్‌లో ఉంచి ప్రసాద్ శ్వేతని పెంచుతున్నాట్ట.
పిల్లకి జ్వరంగా ఉన్నా ఆఫీసుకి, ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చేదిట. వింత వ్యథి! అంతదూరంలో పిల్లతో ప్రసాద్ ఎన్ని కష్టాలు పడుతున్నాడో! ఇంతమంది ఉండి కూడా శ్వేత అక్కడ అనాథలా పెరుగుతోంది. నాదగ్గర ఉంచమంటే ప్రసాద్ వినలేదు. ఎల్లలు లేవు అనుకున్న నా అభిప్రాయం మారిపోయింది. “కల్చర్‌గాప్ దాటడం కష్టం. అసాధ్యం. ద్వేషించక, విడిపోక తప్పదు. అది ట్రాజెడీ. దుఃఖం భరించాలి. మరిచిపోవటానికి కాలం కనికరించాలి” అనుకునేదాన్ని.
రమేష్‌కి పెళ్ళి నిశ్చయమైంది. ప్రసాద్ శ్వేతని తీసుకుని వచ్చాడు పెళ్ళికి.
“శ్వేతని మా దగ్గర ఉంచు. సంబంధాలు చూస్తాము. మళ్ళీ పెళ్ళి చేసుకో” అని చెప్పాం. “ఇప్పుడు చేసుకోను” అన్నాడు.
రమేష్ పెళ్ళి బాగా జరిగింది. పెళ్ళికి అన్నయ్య, వదిన వచ్చారు. వాళ్ళమ్మాయి మాలతి పోస్ట్ గ్రాడ్యుయేట్. సంబంధాలు చూస్తున్నారు. ఇంకా కుదరలేదు.
“నేను ప్రసాద్‌ని పెళ్ళి చేసుకుంటాను” అని వాళ్ళమ్మతో చెప్పింది. ఆ మాట అందరిలో సంచలనం కలిగించింది. ఇద్దరికీ ఎనిమిదేళ్ళ తేడా ఉంది. రెండవ పెళ్ళి. అన్నయ్యకి ఇష్టంలేదు. వదిన మాలతి మనసు మార్చాలని చూసింది కానీ అది వినలేదు.
“రెండో పెళ్ళి ఐతే ఏమిటి? ఎంతమందికి ఎఫ్ఫైర్స్ ఉండటం లేదూ. అంతకంటె మంచిమనసుతో పెళ్ళి చేసుకుంటే తప్పేమీకాదు. నేను బేబీని పెంచగలను” అంది. అప్పటికే శ్వేతకి మాలతి దగ్గర చనువు ఏర్పడింది.శ్వేత పేచీలు పెడుతుంటే ఎలాగో మరిపించి నవ్వించేది. తనతో తిప్పుకుని ఆడించేది.
ప్రసాద్ ఇంకో రెండు వారాలు సెలవు పొడిగించి మాలతిని పెళ్ళి చేసుకుని తనతో తీసుకెళ్ళాడు. జీవితాలు ఎట్లా మలుపు తిరుగుతాయో ఆశ్చర్యం వేసింది. మూడేళ్ళ తర్వాత మాలతికి కొడుకు పుట్టాడు. అప్పుడు అన్నయ్య వదిన అమెరికా వెళ్ళారు.
ఆ మూడేళ్ళలో శ్వేత మాలతిని “అమ్మ” అని పిలవటం నేర్చుకుంది. శ్వేతకి మాలతి తన కన్నతల్లి కాదని తెలుసు. ఐనా మాలతంటే ప్రేమ. అలాగే అందరూ శ్వేత మాలతి సొంత కూతురు అనుకుంటారు. శ్వేతని ముద్దు చేస్తుంది. మళ్ళీ డిసిప్లిన్‌లో ఉంచుతుంది. ఆ చాకచక్యం ఉంది మాలతికి.
ఆనీ వెళ్ళిపోయిందన్న బాధ మరిచిపోయాను. ప్రసాద్ మీద, శ్వేత మీద నాకెంత ప్రేమ ఉన్నా, ఆనీ మీద నాకు రావలిసినంత కోపం రాలేదు. నాలో నాకే ఒక జిజ్ఞాస ఆనీ ఆంతర్యం గురించి. తనలో మమకారం లేదా? నేను ఇండియన్‌ని గనుక కుటుంబం యొక్క ఆనందం ఆలోచించి సమాధాన పడ్డాను. ఆనీ అమెరికన్! తన ఇష్టాలు, ఆంబిషన్స్ ముఖ్యం. భర్త, పిల్లలు దాని తర్వాతే.
భారతీయుల కున్న విశాలదృష్టి, విశ్వశ్రేయోభిలాష, ఇంకెవరికీ లేవు. అదే కదా మన సంస్కృతిలో ఉన్న గొప్ప! విశిష్టత! నేను ఆ నాడు సమాధాన పడబట్టే ఈనాడు మా కుటుంబం ఇంత ఆనందంగా ఉన్నాము. నాలో నేను ఇండియన్ని అయినందుకు గర్వం, తృప్తి కలుగుతుంటాయి. ఆనీ తన సుఖం చూసుకుని వెళ్ళిపోతే ప్రసాద్ ఎన్ని కష్టాలు పడ్డాడు! మళ్ళీ మాలతి ధర్మమా అని ప్రసాద్ కుటుంబం నిలబడింది. ఆయన ఉత్తరం చదివి “శ్వేతకి నీ పోలిక వచ్చింది రాయటంలో!” అన్నారు పరిహాసంగా. అందరూ వస్తున్నారంటే … చాలా సంతోషంగా ఉంది. జీవితానికి ఎన్ని రంగులు!
………………………………………………..
వాళ్ళు వచ్చారు. అందరి కోసం రెండు సూటుకేసుల నిండా గిఫ్ట్‌లు తెచ్చారు. చీరలు, షర్టులు, బెడ్‌షీట్స్, వాచీలు, నైటీలు, చాకొలెట్లు, మేకప్ సామాగ్రి, టూల్స్ … ఒకటా అమెరికన్ వస్తువుల అందమే, నాణ్యతే వేరు. అందుకే అందరికీ అంత క్రేజ్! రమేష్ ముందరే వచ్చాడు భార్యని కూతుర్ని తీసుకుని, సాయంగా ఉండాలని.
అన్నయ్య వదిన వచ్చారు. లత కుటుంబంతో సహా వచ్చింది. నాలుగు రోజులు ఉండి వెళ్ళారు. ఆ నాలుగు రోజులు పెళ్ళివారి ఇల్లులా ఒకటే సందడి. భోజనాలు కాఫీ ఫలహారాలతో క్షణం తీరేది కాదు. మధ్య మధ్య షాపింగులూ, ఔటింగులూ. ఎక్కడికి వెళ్ళినా రెండు కార్లలో అందరం బయల్దేరే వాళ్ళం. లైఫ్ ఎంజాయ్ చెయ్యటం అంటే ఇదే అనిపించింది.
అందరం తలా ఒక పని చేస్తుంటే అలసట ఉండేది కాదు. రమేష్ బజారు పనులు చూస్తుంటే ప్రసాద్ కూరలు తరిగేవాడు. దోసెలు వేయటం కూడా వచ్చు. లత భర్త శ్రీను పిల్లల్ని తయారుచేసేవాడు. ఆవకాయ గోంగూరే కాదు, అవియల్, ఆవడలు, పాలక్ పనీర్, కొఫ్తా .. చేసి తినిపించాం శ్వేతకి. రాత్రి కథలు చెప్పమని పిల్లలందరూ నాదగ్గర చేరేవారు. దీపూకి తాతయ్య దగ్గర బాగా చేరిక అయింది. తెలుగు మాట్లాడటం వచ్చేది కాదు వాడికి. పిల్లలందరిలో శ్వేత ప్రత్యేకంగా కనిపించేది. నిజంగా ప్రత్యేకమైనదే. ఆ వొంటిరంగు, నీలికళ్ళు, ఎర్రజుట్టు! బంగారుబొమ్మ అనిపించింది చూడగానే. సన్నగా పొడుగ్గా కాళ్ళు, తీరైన ముక్కూ కళ్ళూ బార్బీ డాల్ అనాలేమో! స్కర్ట్, జీన్స్, ఫ్రాక్ .. ఏది వేసుకున్నా అందంగా ఉంటుంది.
తెలుగు రాయటం, చదవటం నేర్చుకున్నందుకు శ్వేతని అందరూ అభినందించారు. రాయటం బాగానే వచ్చింది కానీ మాట్లాడితే అమెరికన్ ఏక్సెంట్ ఉంటుంది. తరచూ ఓ.కె! అంటుంది. అమరచిత్రకథ, పంచతంత్ర .. పిల్లల పుస్తకాలన్నీ చదివేసింది అప్పటికే. నవలలు చదువుతోందిట! పొయిట్రీ ఇష్టం అంది. ఒకరోజు శ్వేత బుక్ రాక్ లోంచి ఒక పుస్తకం తీసి చూస్తుంటే “ఆ నవల బామ్మ రాసింది” అన్నారు ఆయన. శ్వేత నమ్మలేనట్లు చూసింది. “బామ్మ రాసిందా? ఇది ఒకటేనా? ఇప్పుడు కూడా రాస్తున్నావా?” అని అడిగింది.
“అది ఒకటే. రాయటం ఎప్పుడో మానేశాను” అన్నాను. “ఇప్పుడెందుకు రాయటం లేదూ?” అని అడిగింది నాకు దగ్గరగా వచ్చి. ఏమని చెప్పను? శ్వేతకి అర్థమవుతుందా? నిజానికి ఈ వయసులోనే ఎక్కువ అనుభూతి, అర్ద్రత, సాంద్రత ఉంటాయేమో! ఔను. సరోజినీనాయుడు ఆ వయసులోనే చక్కటి కవిత్వం చెప్పింది.
“అది ఒక పెద్దకథ!” అన్నాను నవ్వుతూ.
“పెద్దకథా? ఏమిటది?” అని అడిగింది శ్వేత.
“ఆకథకి నేను విలన్ని” అన్నారు ఆయన మధ్యలో కల్పించుకుని నవ్వుతూ. శ్వేత ఆశ్చర్యంగా మా ఇద్దర్ని మార్చిమార్చి చూసింది.
“మీ బామ్మ నాకు దుష్టుడు, రాక్షసుడు అనే బిరుదులు ఇచ్చింది” అన్నారు మళ్ళీ నవ్వుతూ.
“చెప్పు బామ్మా” అంది శ్వేత సోఫాలో నాపక్కనే కూర్చుంటూ. నేను ఆయన వైపు చూశాను. “చెప్పు. నీకథ! మంచి శ్రోత దొరికింది. దీపూ ఎవరైనా మనని పొగుడుతుంటే మనం అక్కడ ఉండకూడదు. పద గార్డెన్‌లోకి వెడదాం” అంటూ దీపూని తీసుకెళ్ళారు. శ్వేత కుతూహలంగా చూస్తోంది.
“చెప్పాలంటే చాలా ఉంది. నువ్వు ఇప్పుడు చూస్తున్న ప్రపంచం వేరు. ఆడవాళ్ళు చదువుకుంటున్నారు. మొగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రపంచసుందరి పోటీల్లో కూడా పాల్గొంటున్నారు. ఆరోజుల్లో అంటే సుమారు నలభై ఏళ్ళ క్రిందట స్త్రీకి ఇల్లే ప్రపంచం. చదువుకున్నా సరే ఇంట్లో ఉండి, వంట చేస్తూ పిల్లల్ని పెంచుకుంటూ భర్తకి సేవచేస్తూ ఆనందించాలి. ఇంటి గడప దాటటమే తప్పు. ఆరోజుల్లో మా అమ్మ మెట్రిక్ పాసయింది. నాన్న గారికి ఆడపిల్లలు కూడా చదువుకోవటం, సంగీతం పాడటం ఇష్టం. అక్కయ్యకి సంగీతం చెప్పించారు. పన్నెండేళ్ళకే శ్రావ్యంగా త్యాగరాజ కీర్తనలు పాడుతుంటే ముచ్చటపడి కచేరీ చేయించారు. పెళ్ళయిన రోజు వాళ్ళ అత్తవారు అక్కయ్య చేత పాడించి మెచ్చుకున్నారు. కానీ తర్వాత అక్కయ్య మళ్ళీ పాడలేదు. అక్కయ్యకి రేడియోలో పాడాలని చాలా కోరిక ఉండేది. ఎప్పుడూ కాన్పులూ, పిల్లలూ, వంట, అనారోగ్యాలు. కోరికలు తీరటానికి అవకాశమేదీ!
ఐనా దేవుడి దగ్గర పాడుకుంటూ కంఠం నిలబెట్టుకుంది. పిల్లలు పెద్దవాళ్ళై కొంచెం అవకాశం చిక్కాక రేడియో ఆడిషన్‌కి వెడతానంది.
“ఈ వయసులో నీకు ఇదేం బుద్ధి! నలుగురూ నవ్వుతారు. నువ్వు స్టేజీ ఎక్కి కచేరీలు చెయనక్కర్లేదు. నేను సంపాదిస్తున్నది చాలటంలేదా” అంటూ బావగారు కేకలేశారు. దానిపాట ఏడుపుగా మిగిలిపోయింది.
“వెరీ అన్‌ఫెయిర్. ఇన్‌హ్యూమన్!” అంది శ్వేత. “ఔను. అమానుషమే. అన్యాయమే. ఆడపిల్లగా పుట్టటమే శాపం. మా అత్తయ్య కూతురు లలితకి పదహారవ ఏట పెళ్ళి చేశారు. దాని దురదృష్టం! పెళ్ళయిన ఏడాదికే భర్త పోయాడు. అత్తవారింట్లో మాటలు పడలేక, చాకిరీ చెయ్యలేక పుట్టింటికి వచ్చేసింది. మళ్ళీ స్కూల్లో చేరింది. వాళ్ళ అత్తయ్య కొడుకు రఘు దాని పెళ్ళి చేసుకుంటానన్నాడు. తండ్రి ఒప్పుకోలేదు. లలిత కూడా “మళ్ళీ పెళ్ళి” చేసుకోను అంది.
అప్పటికే వీరేశలింగం గారు వితంతువివాహాలు జరిపించి సంఘంలో సంస్కరణ తెచ్చినా వితంతువివాహానికి ఆమోదం లేదు. ఏదో తప్పుగా అపవిత్రంగా భావించేవారు. రఘు ఇంటికి వస్తూ తనతో స్నేహంగా ఉండటంతో లలిత అతనితో ప్రేమలో పడింది. ఒకరోజు కోరికకు లొంగి పోయారు. లలిత తను తప్పు చేశానని చెప్పి ఆత్మహత్య చేసుకుంది.” “ఆత్మహత్య ఎందుకు?” శ్వేత ప్రశ్నించింది. “ఆడవాళ్ళ మెదడు అట్లాగ కండిషన్ చెయ్యబడింది. పవిత్రంగా ఉండాలని, నిప్పులాంటిది అనిపించుకోవాలని. ఏదైనా పొరపాటు జరిగితే ఆత్మహత్య చేసుకునేవారు… బావిలో పడి, విషం తాగి” “పవిత్రమంటే?”
ఎన్నో మాటలు అలవాటుగా అనేస్తాము కానీ అర్థం చెప్పాలంటే ఆలోచించాల్సి వస్తుంది. “పవిత్రమంటే శుద్ధమైంది. కల్మషం లేనిది. ప్యూర్! పెళ్ళికాక ముందు అమ్మాయి వర్జిన్‌గా ఉండాలి. పెళ్ళి అయాక పతివ్రతగా ఉండాలి. పరాయి మొగవాళ్ళతో స్నేహం చెయ్యకూడదు. బోయ్‌ఫ్రెండ్స్ ఉండకూడదు…” అంటూ వివరిస్తున్నాను. “ఓ అదా!” అంది శ్వేత అర్థమైనట్లు. నేను నవ్వాను. “ఆ. అదే. భార్య మీద అనుమానం వస్తే రాముడు సీతని అడవికి పంపించినట్లు పుట్టింట్లో వదిలేసేవారు. భర్త మళ్ళీ పెళ్ళి చేసుకునేవాడు. మొగవాడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా తప్పులేదు. భార్య పుట్టింట్లో అందరికీ చాకిరీ చేస్తూ ఏడుస్తూ బ్రతకాలి!” “అన్యాయం! డబుల్ స్టాండర్స్డ్! తాతయ్య ఏం చేశారూ! నువ్వు ఏం తప్పు చేశావూ?” శ్వేత కుతూహలం ఆపుకోలేక పోతోంది.
“నాది వేరేకథ. మా నాన్న గారికి ఆడపిల్లలు కూడ చదువుకోవటం ఇష్టం అని చెప్పాను కదూ. నన్ను కాలేజీలో చేర్పించారు. అప్పటికి ఆడవాళ్ళు చదువుకుంటున్నారు. అంటే డిగ్రీ చదువులు. రెండేళ్ళు చదివాక మంచి సంబంధం వచ్చిందని పెళ్ళి చేశారు. పెళ్ళి అవగానే నాచదువు ఆగిపోయింది. ఇంకా చదువుకుంటానని అడగాలని కూడా తెలీదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినటమే తప్ప స్వంత ఆలోచన ఉండేది కాదు. ఆ దశలో అత్తవారింటికి వచ్చాను. నేను కవిత్వం రాస్తుండేదాన్ని. కథలు రాయాలని ఉండేది. ఆలోచనలు చెప్పిరావు కదా! మనకి తీరికగా ఉంది రమ్మంటే రావు కదా!
ఏ పని చేస్తుండగానో ఒక ఊహ వస్తే గబుక్కున వదిలేసి వెళ్ళి రాసేదాన్ని. అందమైన ఊహలు మనసులోంచి జారిపోకుండా పట్టుకోవాలని ఆతృత. ఒకసారి ఆయన చూశారు.
“తాతయ్యా?” అని అడిగింది శ్వేత.
“ఆ. ఏం రాస్తున్నావు, మీ అమ్మకు ఉత్తరమా?” అనడిగారు.
“కాదు. కథ” అన్నాను. తీసుకుని చూశారు.
కొత్తగా బయటి ప్రపంచాన్ని, జీవితాన్ని చూస్తున్న అనుభవం. వెల్లువలా జలపాతంలో ఉక్కిరి బిక్కిరి చేసే అనుభూతులు. నన్ను మెచ్చుకుంటారని ఎదురుచూస్తున్నాను.
“ఎందుకీ పిచ్చిరాతలు! వేళకి పనులు చేసుకోక ఎందుకీ కవిత్వాలు! వెళ్ళు గుండీలు కుట్టు” అన్నారు కాగితాలు పారేస్తూ.
లేత మనసేమో కన్నీళ్ళు జలజలా రాలాయి. అవమానం, మనసులో రోషం. ఆ షర్టు రేపు వేసుకోవటానికి కావాలి. తొందర లేదు. నేనేదో పనిమనిషినైనట్టు ఆర్డర్.
కాఫీ వేడిగా ఇచ్చినా చల్లారిపోయిందని మళ్ళీ చెయ్యమనటం, కూర బాగా చేసినా “వంట ఇలా తగలడిందేం? పొయ్యిమీద పడేసి కథ రాస్తున్నావా?” అని దెప్పటం. భర్తలు ఇలాగే ఉంటారా? ఎందుకిలా హింసిస్తారు? అని ఆశ్చర్యపడేదాన్ని.
“భర్త ఇంకొంచెం తెలివిగా, అనురాగంతో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది!” అనుకునే దాన్ని. ఆయన ఇంట్లో లేనప్పుడు, నిద్రపోతున్నప్పుడు భయపడుతూ రహస్యంగా రాసేదాన్ని. పుస్తకాలు చదివేదాన్ని. నాలో ఆలోచనలు పెరిగాయి. వివేచన కూడా పెరిగింది.
“ఆడవాళ్ళయితే ఏమిటి? వాళ్ళకి మనసులేదా బుద్ధిలేదా మనుషులు కారా! మనిషి అనేవాడు తనకే కాదు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా సహించకూడదు. ఎదుర్కోవాలి. పోరాడాలి!” అనుకునేదాన్ని. అప్పుడు ప్రసాదు పుట్టాడు. అమ్మా వాళ్ళింట్లో ఉన్నప్పుడు అన్నయ్య చేత కథ పోస్టు చేయించాను.
అది పత్రికలో వచ్చింది. ఆయనకి చెప్పాలని కూడా అనిపించలేదు. మా అత్తగారికి తెలిసింది. సంతోషిస్తూ ఉత్తరం రాశారు. ప్రసాద్‌కి మూడవ నెల వచ్చాక వచ్చాను. మళ్ళీ పాతకథ మొదలు. ఒక కథ పత్రికలో పడింది. అంటే నాకు కథలు రాసే టాలెంట్ ఉందన్నమాట. ఇంకా కథలు రాయాలి అనుకున్నాను. వీలు చేసుకుని రాస్తుండేదాన్ని. మా అత్తగారు మా దగ్గర కొన్నాళ్ళూ, మా మరిది దగ్గర కొన్ని రోజులూ ఉండేవారు. నాకు మళ్ళీ నెల తప్పింది. మా అత్తగారు మా దగ్గర ఉండటానికి వచ్చారు.
నేను పురిటికి వెడితే కొడుకు దగ్గర ఉండాలని. ఒకరోజు ఆయన ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి ప్రసాదు ఏడుస్తున్నాడు. నేను పాలు కలుపుతున్నాను.
అత్తగారు ఎత్తుకుంటారనుకున్నాను. వాడు ఆగకుండా ఏడుస్తున్నాడు. “నువ్వు కథలూ కావ్యాలూ రాసుకుంటూ మాకు తిండి పెట్టవా? పిల్లవాడికి పాలు పట్టక చంపేస్తావా? నీకు సన్మానాలూ పేరూ కావాలనుకుంటే పెళ్ళెందుకు చేసుకున్నావూ? నీకు మొగుడెందుకు పిల్లలెందుకు! రచయిత్రివై పోవాలనుకుంటే మీ అమ్మ దగ్గర పుట్టింట్లో పడి వుండాల్సింది” అన్నారు.
మనసులో భయపడుతూనే “పెళ్ళయ్యాక ఇదే నా ఇల్లు కదా! పుట్టింటికి ఎందుకెళ్ళాలి? ఇక్కడ రాసుకోకూడదా, చదువుకోకూడదా?” అనడిగాను.
“అదంతా నాకు తెలీదు. మా అవసరాలు చూడాలి. అంతే” అన్నారు. అవసరాలు తీరుస్తూనే ఉన్నాను కదా. మరి ఎందుకీ నిర్బంధం? అది పురుషాహంకారం. ప్రేమని చంపేస్తుంది. అప్పుడది భార్యాభర్తల అనుబంధం కాదు. బానిసత్వం.
ఎంతో శ్రద్ధతో రాసి ఒక కథ పూర్తిచేశాను.అత్తగారితో చెప్పి పోస్టాఫీసుకి వెళ్ళి పోస్ట్ చేసి వచ్చాను. ఆయన మధ్యాహ్నం ఆఫీసు నించి ఇంటికి వచ్చారు. భోజనాలయ్యాక గదిలో పడుకున్నారు.
“ఇవేళ పత్రికకి కథ పంపించాను” అన్నను సంకోచిస్తూనే. కథ పడితే తెలుస్తుంది కదా.
“నువ్వే వెళ్ళావా?” అంటూ లేచి కూర్చున్నారు.
“దగ్గరే కదా. నేనే వెళ్ళాను”
“ఇవేళ పోస్టాఫీసంటావు. రేపు కోర్టుకి వెడతావు విడాకులు కావాలని!” తప్పు చేశానా అని ఆలోచిస్తున్న నా చెంపమీద చెళ్ళుమని దెబ్బ పడింది.
“కొట్టారా! నిజంగా కొట్టారా! నన్ను కొట్టారా?” చెంప తడుముకుంటున్నాను. నమ్మలేకపోతున్నాను. తల తిరిగిపోతోంది. మనసు విరిగిపోతోంది. నా మీద అసహ్యం. జీవితం మీద అసహ్యం నిండిపోతోంది. వీడెవడు అసలు? వీడితో నాకేం సంబంధం!.. ఉండకూడదు అనుకుంటూ చెంపమీద చెయ్యితో అలాగే గది బయటికి వచ్చాను.
“ఏమిటి .. ఏమైంది!” అనడిగారు అత్తయ్య గారు ఆదుర్దాగా. అప్రయత్నంగా చెయ్యి తీశాను. ఆవిడ చూశారు… ఎర్రగా కందిన బుగ్గ. “వాడి గొంతు వినిపిస్తుంటే ఏమిటో అనుకున్నాను. కొట్టాడా?” అంటూ ఆవిడ నా కళ్ళలోకి చూశారు. వెంటనే గదిలోకి వెళ్ళారు.
“నీకేమైనా బుద్ధుందా! భార్య మీద చెయ్యి చేసుకుంటావా? మన ఇంటా వంటా లేదు. ఇంకెప్పుడూ ఇలాగ జరగటానికి వీల్లేదు” అంటూ కేకలు వేశారు. ఆయన తల వంచుకున్నారు. ఆ రాత్రి మామధ్య మాటలు లేవు. మర్నాడే మా నాన్నగారు వచ్చారు నన్ను తీసికెళ్ళటానికి. నేను వెళ్ళేముందర మా అత్తగారు నాతో, “మనసులో పెట్టుకోకు. మరిచిపో. వాడి తప్పు ఉంది. వాడికి తెలీటం లేదు. నీ తప్పూ ఉంది.వాడి విషయంలో కొంత నిర్లక్ష్యం జరిగింది. కానీ వాడంత తొందర పడకూడదు.
కూర నీకైనా మాడచ్చు నాకైనా మాడచ్చు. వాడి కోపమంతా నువ్వు తనని లక్ష్య పెట్టటం లేదని. ఎంతో తొందర పడ్డాడు. నువ్వు కూడా తొందర పడకూడదు” అన్నారు.
నేను నాన్న గారితో వచ్చేశాను. ఇంక మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళను అనుకున్నాను. మనసులో బాధ అవమానం రగిలిపోతుండగా ఒక నవల రాశాను. పోటీకి పంపించాను. స్త్రీలుతలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు. ఎంతమంది స్త్రీలు ఉద్యోగాలు చెయ్యటం లేదూ.. ఆఫీసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు.. పుస్తకాలు రాస్తున్నారు. మంత్రి పదవుల్లో ఉన్నారు. రిసెర్చి కూడా చేస్తున్నారు.
కానీ భర్త పిల్లలు అనే బంధాలకి లొంగిపోతుంది. తనే బంగారు సంకెళ్ళు వేసుకుంటుంది స్త్రీ. మరి పురుషుడికి ఆ బాధ, బంధం ఎందుకు లేవు? నా భార్య, నా పిల్లలు అని మమకారం ఉండదా? ఈ భార్య పోతే ఇంకొక భార్య వస్తుందని ధీమా! స్త్రీకి ఈ మమతానుబంధం లేకపోతే జీవితానికి అర్థమే పోతుంది. జీవించాలనే కోరికే ఉండదు. ఒక కళాకారిణికి ఒక గమ్యం సాధన ఉంటాయి. ఒక భక్తురాలికి అన్వేషణ ఉంటుంది. కానీ ఒక సాధారణ స్త్రీ ఎలా బ్రతుకుతుంది ఒక గమ్యం లేకుండా, నా అనేవాళ్ళు లేకుండా? స్త్రీని చిన్నచూపు చూసే ఈ సంఘంలో స్వతంత్రించిన స్త్రీ జీవితం తెగిన గాలిపటం అవుతుంది. స్త్రీ ఎవరికోసమో కాక తన కోసం బ్రతకటం ఇంకా నేర్చుకోలేదు. ఈ సంఘంలో, కుటుంబంలో ఇంకా గౌరవనీయమైన స్థానం సంపాదించాలి.
దానికోసం పోరాడాలి. అంటే ఆర్థికస్వాతంత్య్రం ఉండాలి. తనని తను పోషించుకోగలగాలి. ఉద్యోగం చెయ్యాలి. నేను నా చదువు పూర్తి చేస్తాను… ఈ ఆలోచనలలో నేను ఉండగా రమేష్ పుట్టాడు. బారసాలకి ఆయన, అత్తగారు వచ్చారు. “మూడవ నెల రాగానే పిల్లల్ని తీసుకుని వచ్చెయ్” అన్నారు అత్తగారు. “బి.ఏ. పరీక్ష రాద్దామనుకుంటోంది” అంది మా అమ్మ. “అక్కడే చదువుకోవచ్చు. నేను ఇంకా కొన్నిరోజులు అక్కడే ఉంటాను” అన్నారావిడ.
ప్రసాద్ వాళ్ళ నాన్నని వదలటం లేదు, నా వొళ్ళో రమేష్ ఉండటం చూసి. “ఎప్పుడు వస్తావ్?” అని అడిగారాయన.
“ఇప్పుడు రాను. రాయాలనుకుంటే పుట్టింట్లోనే ఉండమన్నారు కదా!” అన్నాను.
“ఎందుకు రావు? చదువుకుంటానని అమ్మతో చెప్పావుట. అది నాకెంత అవమానమో బాధో నీకు తెలుసా? … మాట్లాడవేం?”
“మీకేనా అవమానం? బాధ! నాకు లేవా? నాకు అవమానం జరగదని నమ్మకం కలిగినప్పుడు వస్తాను” అన్నాను. ఆయన ముభావంగా ఉండిపోయారు.
నా నవలకి రెండవ బహుమతి వచ్చింది. నాకు కొత్తగా ఒక శక్తి వచ్చినట్లనిపించింది. ఆత్మవిశ్వాసం కలిగింది. నేను “రచన” చేస్తూ జీవించగలను అనుకున్నాను.
ఆయన, అత్తగారు కంగ్రాచ్యులేట్ చేస్తూ ఉత్తరం రాశారు. అప్పుడే ప్రసాద్‌కి జబ్బు చేసింది. టైఫాయిడ్. హైఫీవరు. నాన్న అని పలవరించేవాడు. వాళ్ళ నాన్న కోసం బెంగ పెట్టుకున్నాడు. జ్వరం తగ్గటంలేదు.
నాన్నగారు ఆయన్ని రమ్మని రాస్తానన్నారు. అప్పుడే నాలో మథనం మొదలైంది. నా సంగతి ఎట్లా ఉన్నా పిల్లలకి తండ్రి కావాలి. పిల్లలకి ఆయన్ని దూరం చెయ్యకూడదు. ఆయన ప్రవర్తనలో తప్పు ఉంది. ఐనా పెళ్ళి చేసుకున్నాక ఆ ప్రమాణాన్ని పాటించకపోవటం నేను కూడా తప్పు చేస్తున్నానేమో.
సుఖం లోనూ కష్టంలోనూ కూడా ఒకరికొకరు తోడుగా జీవిస్తాం అని కదా ప్రమాణం. “చావు మనని విడదీసేదాకా” అని వివాహం శాశ్వతబంధం. మెడలో మంగళసూత్రం కట్టించుకున్నాను. తలంబ్రాలు పోసుకున్నాము, మధుపర్కాలు కట్టుకుని. కొంగులు ముడివేసుకుని అగ్నిచుట్టూ ప్రదిక్షిణాలు చేశాము. అన్నీ బూటకమేనా! నాటకమేనా!
ఇప్పుడు లొంగిపోయినా జీవితంలో ఓడిపోకూడదు. ప్రమాణం పాటించాలి. ప్రసాద్ కోసం వెళ్ళిపోతాను. వెళ్ళటం అవమానం కాదు. వెళ్ళటం నా ధర్మం అనుకున్నాను. అందరి సుఖసంతోషాల కోసం అనుకున్నాను. ప్రసాద్ బెంగపెట్టుకున్నాడు మీకోసం. రమ్మని రాశాను. వెంటనే వచ్చారు. ఆయన్ని చూడగానే ప్రసాద్ ముఖంలోకి నవ్వు వచ్చింది.
ఆయనే దగ్గర ఉండి మందులూ అవీ ఇచ్చారు. ఆరాత్రే జ్వరం తగ్గు ముఖం పట్టింది. నాచేతికొక పెద్ద బౌండు బుక్ ఇచ్చారు చూడమని. తెరిచిచూస్తే దానిలో పేజీల నిండా క్షమించు క్షమించు అని రాసి ఉంది.
లక్ష సార్లు రాశారుట. నేను కదిలిపోయాను. కరిగిపోయాను. కళ్ళలో నీళ్ళు వచ్చాయి. పిల్లలిద్దర్నీ తీసుకుని ఆయనతో ఇంటికి వచ్చాను. అంతా మా అత్తగారి చలువ. ఆవిడ మూలంగానే ఆయనలో అంత త్వరగా మార్పు వచ్చింది. ఆవిడే గనుక మామూలు అత్తగార్లలా కొడుకుని రెచ్చగొట్టి ఉంటే మేము విడిపోయి ఉండేవాళ్ళం…” అంటూ చెప్పటం ముగించాను.
“ఐతే తాతయ్య విలన్ నించి హీరోగా మారిపోయారు. మరి ఆ తర్వాత నువ్వెందుకు రాయలేదు. ఎందుకు మానేశావు?”
“తాతయ్య నన్ను “కథలు రాయి” అనేవారు. కానీ నేను మళ్ళీ రాయలేకపోయాను. ఎందుకో నాకే తెలియదు. సృజనాత్మక లక్షణం చచ్చిపోయిందేమో! ఇంటి పనులు శ్రద్ధగా చేసేదాన్ని. పిల్లలకి చదువు చెప్పేదాన్ని. పనివాళ్ళ పిల్లలకి కూడా చదువు చెప్పేదాన్ని. పిల్లలకి గుడ్డలు కుట్టేదాన్ని. మహిళాసమాజానికి వెళ్ళి సేవాకార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. అది నాకు తృప్తినిచ్చేది. ఒక ప్రయోజనం ఉన్న పని చేస్తున్నాను అనే భావం నాకు సంతోషం కలిగించేది.” శ్వేత నారెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది.
“నీ పెద్దకథ ఇంకా పూర్తికాలేదు బామ్మా. నువ్వు మళ్ళీ కథలు రాయాలి ఇంకా రాయాలి” అంది ఒక మంచి మిత్రుడు సలహా ఇస్తున్నాట్లు. “నువ్వు రాయగలవు” అంది నాకు నమ్మకం కలిగిస్తూ.
శ్వేత దగ్గర ఒక డైరీ ఉంది. దానిలో ఆరోజు తను కొత్తగా నేర్చుకున్న తెలుగు పదాలు రాసుకుంటుంది. వాటిని మననం చేస్తుంది. ఒకప్పుడు తెలుగు భాష నాప్రాణం. కవిత్వం చదువుతుంటే ఆరుచి అమృతం తాగినట్లు ఉండేది. ఆమత్తులో నేనూ రాసేదాన్ని.
తర్వాత నా గురించి నేనే పట్టించుకోలేదు.
ఇన్నాళ్ళకి ఇప్పుడు నా మనవరాలు అడుగుతోంది. ఇక్కడ పిల్లలకి ఇంగ్లీష్ తప్ప తెలుగు రావటం లేదు ఇప్పుడు. ఎవరూ తెలుగు పుస్తకాలు చదవటం లేదు. సినిమాలు తీసినా, చూసినా అది తెలుగా? ఎప్పుడో ఒక మంచి తెలుగు సినిమా వస్తుంది.
ఇంక తెలుగు భాష అంతరించిపోతుందా? పోదు. తెలుగు భాష చిరంజీవి. అమరమూర్తి. ఎక్కడో అమెరికాలో పుట్టి పెరుగుతున్న నా మనవరాలు తెలుగు నేర్చుకుని నా గుండె తట్టి లేపుతోంది. అమెరికాలో ఆంధ్ర! దూరాలు తగ్గిపోతున్నాయా! భాష వారథి!
……………………………………….
వాళ్ళు ఇంక నాలుగు రోజుల్లో వెళ్ళిపోతారు. మధ్యలో నాలుగు రోజులు మెడ్రాస్ వెళ్ళి వచ్చారు అన్నయ్య దగ్గరికి. మాలతికి తల్లిదండ్రుల దగ్గర ఉండాలని ఉంటుంది కదా.
ఉయ్యాల బల్ల మీద కూర్చుని పుస్తకం చదువుతోంది శ్వేత. నా నవల చదవటం మొదలుపెట్టింది. నేను మాలతి తీరికగా వరండాలో కేన్ చెయిర్స్‌లో కూర్చున్నాం. మాలతి కబుర్లు చెప్తోంది. దీపు స్కూల్లో చేరాక మాలతి కూడా ఉద్యోగం చేస్తోంది.
“అక్కడ పనిమనుషులు ఉండరు. ఎవరిమీదా ఆధారపడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. ఇక్కడలా పవర్ లేకపోవటం, నీళ్ళు రాకపోవటం లాంటి ప్రాబ్లెంస్ ఉండవు. చాలా స్మూద్‌గా జరిగిపోతాయి పనులు. చాలా సుఖంగా ఉన్నామనిపిస్తుంది. కానీ సడన్‌గా ఏదో జరుగుతుంటుంది. ఎందుకో ఎక్కడికో తెలియకుండానే పరుగులు పెడుతున్నట్లు ఉంటుంది. హెల్ప్‌లెస్‌గా అయిపోతాం…”
“ఎందుకేమిటి? డాలర్ల కోసం!” అన్నాను నవ్వుతూ.
“ఔను. అక్కడ మాల్స్ చూస్తుంటే నాకూ అనిపిస్తుంది ఇన్ని వస్తువులు, ఇంత ఉత్పత్తి అవసరమా అని. ఇక్కడ మనం ఒకే వస్తువుతో కాలం గడుపుకుంటాం సాధారణంగా. అక్కడ ఒక వస్తువులో డిఫెక్టును మాడిఫై చేస్తూ దానికంటే నాణ్యమైన వస్తువును మార్కెట్ చేస్తూనే ఉంటారు. సెక్యూరిటీకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. బద్ధకం అనేది ఉండదు. చూడము. కానీ ఇన్ని జాగ్రత్తలూ ఎందుకూ పనికిరాలే దనిపిస్తూ పెద్దవీ, చిన్నవీ కూడా ఆకస్మిక సంఘటనలు జరుగుతుంటాయి. ఏదో టెన్షన్ ఉంటుంది.”
“మనం ప్రకృతికి దూరంగా పోతున్నకొద్దీ ఎక్కువ రక్షణ కావాల్సి వస్తుంది.అప్పుడప్పుడు ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటుంది” అన్నాను.
“టీవీలో లోకల్ న్యూస్ చూపిస్తుంటారు. బ్రతకటం ఎంత బాధ అనిపిస్తుంది అత్తయ్యా. ఒక బేబీ సిట్టర్ తన బాయ్ ఫ్రెండ్‌తో గడపాలని బేబీకి నిద్రమందు ఇస్తే ఆ బేబీ చచ్చిపోయింది. తల్లి తర్వాత ఏడిస్తే ఏం లాభం! ఇంకొక పిల్లవాడు డే కేర్లో ప్లేపెన్‌లో ఆడుకుంటుంటే ఏదో డిఫెక్ట్ వల్ల ప్లేపెన్ ముడుచుకుపోయింది. ఆ రాడ్స్ మధ్య పిల్లవాడి మెడ ఇరుక్కుపోయి ఊపిరాడక చచ్చిపోయాడు. అందులో డే కేర్ ఆవిడ తప్పులేదు. కానీ పిల్లవాడి ప్రాణం రాదు కదా. అక్కడ పిల్లల్ని పెంచటం చాలా కష్టం, ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ. ఇక్కడైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు పిల్లల్ని చూడటానికి.” అని చెప్తోంది మాలతి.
“లేదు మాలతీ. ఇప్పుడు ఇక్కడా అంతా మారిపోయింది. పెద్దవాళ్ళతో కలిసి ఉండటం లేదు ఎవరూ. ఇక్కడా క్రెష్‌లూ అవీ వచ్చేశాయి. పిల్లల్ని ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. సంపాదిస్తున్నారు. కావలసిన వస్తువులు కొనుక్కుంటున్నారు. టీవిలు ఫ్రిజ్‌లు మాత్రమే కాదు. స్కూటీలు, కార్లు, కొత్తగా మార్కెట్‌లో ఏ పరికరం వస్తే అది .. ఇంక డ్రెస్సులూ అవీ చెప్పక్కర్లేదు. కానీ మనస్థిమితం లేకుండా పోయింది ఈ సుఖాలు ఉన్నా. ఇది పోటీ ప్రపంచం. కనపడని హింస అనుభవిస్తున్నాడు మనిషి” అంటున్నాను. ఫోను మోగింది. మాలతి అందుకుని మాట్లాడింది. “ప్రసాద్, నీకు ఫోను. ఢిల్లీ నుంచి.” అని పిలిస్తే ప్రసాద్ వచ్చి అందుకున్నాడు.
ప్రసాద్ మాట్లాడుతూ “ఆనీ” అనగానే ఉలికిపడ్డాను. మనసులో తెలియని ఆందోళన. ఫోన్ పెట్టేశాక ప్రసాద్ చెప్పాడు. “ఆనీ చేసింది. ఢిల్లీ నుంచి. వాళ్ళ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ పనిమీద వచ్చారుట. ఇక్కడ ఒక మల్టీ నేషనల్ కంపెనీ ప్రాజెక్ట్ ఒకటి స్టడీ చెయ్యటానికి. వచ్చే ముందర అక్కడ మా ఆఫీసుకి ఫోన్ చేసిందిట. ఇండియా వెడుతున్నానని చెప్పటానికి. నేను ఫామిలీతో హైదరాబాద్ వెడుతున్నానని తెలిసిందట.” “ఆనీతో నీకు మాటలు ఉన్నాయా?” కనుబొమలు చిట్లిస్తూ అడిగాను. “ఎప్పుడేనా ఫోన్ చేస్తుంది. తన సంగతులు చెప్తుంది. అప్పుడు వెంటనే మళ్ళీ పెళ్ళి చేసుకుని మళ్ళీ విడిపోయారు. ఇప్పుడు చాలా మంచి పొజిషన్‌లో ఉంది. బాగా సంపాదిస్తోంది.” అన్నాడు. “ఐతే ఏమంటుంది?” కంట్రోల్ చేసుకోలేక పోతున్న అసహనం నా గొంతులోకి వచ్చింది.
“శ్వేతని చూడాలని ఉందిట. చూపిస్తావా అని అడిగింది”
“చూపించటమంటే మన ఇంటికి వస్తుందా?”
“ఒబెరాయ్‌లో ఉంటాను, రమ్మంది. మాలతి ఇష్టం.” అన్నాడు ప్రసాద్.
“అత్తయ్యని, మామయ్య గారిని చూస్తానందా?” మాలతి అడిగింది.
“లేదు” అన్నాడు ప్రసాదు.
“మమ్మల్ని అప్పుడే మరిచిపోయి ఉంటుంది” అన్నాను నేను.
“ఐతే శ్వేతని తీసుకుని నువ్వూ నేనూ వెడదాం. శ్వేత చూస్తానంటే. ఇష్టపడితే.” అంది మాలతి.
మాలతి మామూలుగానే ఉంది. ఏ విధమైన ఆదుర్దా కనిపించలేదు. భర్త మీద నమ్మకం! నా మనసుకే ఏదో కంగారు. ఏదైనా సమస్య వచ్చిపడదు కదా!
“ఐ హావ్ నథింగ్ టు డూ విత్ దట్ లేడీ!” అంది శ్వేత ముందు, వినగానే. మాలతి ఏమని నచ్చచెప్పిందో, వెళ్ళటానికి ఒప్పుకుంది చివరికి. “ఆనీ ఏం చెయ్యగలదు? శ్వేత మీద హక్కు లేదు తనకి. చూస్తానంది. అంతే. తల్లి కదా!” అంది మాలతి నా అనుమానాలు గ్రహించి. ఇన్నేళ్ళ తర్వాత ఆనీ ఎందుకు వచ్చింది మా మధ్యకి!
తనకి శ్వేత కావాలంటుందా? ఆనీ రమ్మంటే శ్వేత వెళ్ళిపోతుందా! మనసు లోపలి పొరల్లో ఒణుకు. సముద్రంలో వాయుగుండంలా కడుపులో బాధ కదులుతూ దిగులు నన్ను కృంగదీస్తోంది. వాళ్ళు ముగ్గురూ వెళ్ళారు.
ఆనీకి ఇస్తానని పెర్‌ఫ్యూం ఇండియాస్ స్పెషల్ “జీనత్” తీసికెళ్ళింది మాలతి. బ్లూజీన్స్ మీద ఎంబ్రాడరీ చేసిన వైట్ బ్లౌజ్ వేసుకుంది శ్వేత. జుట్టుకి స్కార్ఫ్ కట్టుకుంది. కట్ చేసిన ముంగురులు నుదుటి మీద పడుతూ ముద్దు వస్తోంది.
మాలతి మైసూర్ సిల్క్ చీర కట్టుకుంది. ముత్యాలు పెట్టుకుంది. ఈ కాలం ఆడపిల్లలు అందంగా ఉండటం తెలుసుకున్నారు.
………………………………….
వాళ్ళు ముగ్గురూ తిరిగివచ్చేదాకా నాప్రాణం .. నాలోలేదు. వాళ్ళు లోపలికి వచ్చి మాట్లాడకుండా కూర్చున్నారు. నేను ఆగలేకపోతున్నాను.
“హోటల్ ఎలా ఉంది? కృష్ణ ఒబెరాయ్‌కేనా వెళ్ళారు?” ఏదో అడిగాను.
“ఫైవ్ స్టార్ హోటల్‌కేం. దివ్యంగా ఉంది” అన్నాడు ప్రసాద్.
“ఆనీని చూశారా? శ్వేతని చూసి ఏమంది?” మళ్ళీ ప్రశ్నించాను.
“నాకళ్ళని నమ్మలేక పోతున్నాను అంది” అంది శ్వేత కొంటెగా నవ్వుతూ.
“చాలాసేపు తను వచ్చిన పని గురించి చెప్పింది. ఏం తింటారని అడిగింది. కాఫీ చాలు అన్నాము. కాఫీ తాగాము” అంది మాలతి.
“నీకు ఏ ఐస్‌క్రీం ఇష్టం అనడిగింది నన్ను. బటర్‌స్కాచ్, కసాటా ఇష్టం అన్నాను. కసాటా తెప్పించింది.” అంది శ్వేత. “శ్వేతకి ఒక గిఫ్ట్ ఇచ్చింది. శ్వేత తీసుకోలేదు. గోల్డ్ చైన్. “నేను శ్వేత నించి ఏమీ అడగటం లేదు. ఈ చిన్న గిఫ్ట్ ఉంచుకోమను. లేకపోతే నేను బాధపడతాను అంది ప్రసాద్‌తో.
“యూ నీడ్ నాట్” అంది శ్వేత ఆనీతో.
“యు ఆర్ ఎ చార్మింగ్ లిటిల్ డెవిల్” అంది శ్వేత తలమీద ముద్దు పెడుతూ ఆనీ.
తర్వాత మేము వచ్చేశాము. వచ్చినందుకు మాకు థాంక్స్ చెప్పింది. ” అంటూ ముగించింది మాలతి. తర్వాత నా వెనకాల లోపలికి వచ్చి నాచేతిలో చిన్న వెల్వెట్ బాక్స్ ఉంచి. “ఇది ఆనీ ఇచ్చింది. తర్వాత ఎప్పుడో శ్వేతకి ఇమ్మంది. ఇది శ్వేతకి చెందాలి అంది. నన్ను లోపలికి పిలిచి శ్వేతకి తెలియకుండా ఇచ్చింది” అంది.
పెట్టె తెరిచి చూశాను. నా కెంపుల నెక్లెస్. ఏవో బాధ సంతోషం కూడా కలిగాయి. “ఆనీ ఎలాగుంది?” అని అడిగాను.
“ఆనీ! .. ఇండిపెండెంట్‌గా ఉన్న లేడీని చూస్తే చాల ఎడ్మిరేషన్ కలుగుతుంది” అంది మాలతి. వాళ్ళు వెళ్ళిపోతే ఈ కబుర్లు చెప్పుకోటాలు, నవ్వుకోవటాలు, పిల్లల తగువులూ ఉండవు. మనసులో ఏ ఉత్సాహమూ ఉండదు. పూలన్నీ కోసేసిన చెట్టులా ఉంటుంది. బెడ్‌రూంలో ప్రసాదూ మాలతీ సూట్‌కేసులు సర్దుకుంటున్నారు.దీపూ వాళ్ళ తాతయ్య దగ్గర ఉన్నాడు. ఇద్దరూ విడియో గేంస్ ఆడుతుంటారు. శ్వేత ఉయ్యాల మీద కూర్చుని పుస్తకం చదువుతోంది. షాంపూ చేసిన జుట్టు మెరిసిపోతోంది. దగ్గరగా వెళ్ళి జుట్టు బాగా ఆరిందా అని చూస్తూ పక్కనే కూర్చుని “నీ జుట్టు బాగుంటుంది” అన్నాను.
“ఈ షాంపూకి మంచి బౌన్స్ వస్తుంది” అంది. అంటే పట్టుకుచ్చులా జారటం కాబోలు. ఏం చదువుతోందో నని భుజం మీదుగా చూశాను. “జురసిక్ పార్క్”! రెండుసార్లు చదివింది మళ్ళీ చదువుతోంది.
నేను చదువుతానని రమేష్ కొత్త పుస్తకాలు కొనితెస్తుంటాడు. మళ్ళీ చదువుతోంది. “నిన్న “సినారే గజళ్ళు” తీశావు చదవటానికి. చదివావా?” అనడిగాను. “రెండు పాటలు చదివాను. కవులు చిన్న మాటలతోనే బయటి ప్రపంచాన్ని లోపలి మన మనసుకి చూపిస్తారు కదు బామ్మా!” అంది.
నాకు ఆనందం కలిగింది. ఆశ్చర్యం కూడా వేసింది. “నీకు ఇదంతా అర్థమవుతుందా?” అన్నాను.
పుస్తకం పక్కన పెట్టి నా మొహంలోకి తీక్షణంగా చూసింది. చూస్తూ “నేను పదేళ్ళ నించీ స్కూల్‌కి వెడుతున్నాను. చదువుకుంటున్నాను. ఈ మాత్రపు జ్ఞానం నాకుండదా?
నేనంత బుద్ధి తక్కువ దాన్ని స్టుపిడ్‌ని అనుకుంటున్నావా?” అని అడిగింది. దాని మొహం ఎర్రబడింది కూడా. అట్లా అడిగినందుకు నొచ్చుకుంటూ “నా బంగారు తల్లికి కోపం వచ్చిందా! నువ్వు బాలసరస్వతివి. నీకు దిష్టి తగులుతుందని నాభయం. చీ చీ స్టుపిడ్ అనుకుంటానా? నానవల బాగుంది అన్నావు. బాగా రాశాను అన్నావు.
నువ్వు తెలుగు నేర్చుకున్నావు. ఊహలు ఉన్నాయి. నువ్వు రైటర్‌వి ఐతే సంతోషిస్తాను. ఇంకా బాగా తెలుగు అభివృద్ధి చేసుకుని నా నవలని ఇంగ్లీషులో రాస్తావా” అనడిగాను దాని మొహం నావైపు తిప్పుకుని. వెంటనే చప్పట్లు కొట్టి నవ్వుతూ “నాకు నిజంగా కోపం వచ్చిందనుకున్నావా బామ్మా! నేను ఆక్ట్ చేశానంతే. నేను నటించగలను. మా స్కూల్లో నాకు డ్రమటిక్స్‌లో ప్రైజ్‌లు వచ్చాయి.” అంది. నేను కూడా నవ్వేశాను. “ఔను. నీకు నిజంగా కోపం వచ్చిందనుకున్నాను. అది సరే. నిన్ను చాలా రోజుల నించి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నిజం చెప్తావా మరి!” అన్నాను అనునయంగా.
“నిజమే చెప్తాను. అడుగు బామ్మా” అంది శ్వేత నన్ను ఉత్సాహపరుస్తూ. చాలా సార్లు శ్వేతను అడగాలనుకున్నాను ఆ ప్రశ్న. అడగలేకపోయాను ఇప్పటిదాకా.
“నీకు ఆనీ అంటే కోపమా?” అడిగాను.
కొంచెంసేపు ఆలోచిస్తున్నట్లు సీరియస్‌గా ఉండిపోయింది శ్వేత.
“నాకు కోపం లేదు. కోపమెందుకూ?” అంది.
“ఆనీ చేసింది తప్పు కాదూ! అప్పుడు నువ్వు బేబీవి. నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అందుకని నీకు ఆనీ మీద కోపం ఉంటుంది అనుకుంటున్నాను.” అన్నాను.
“తప్పేముంది? తనకు ఏం కావాలో వెతుక్కుంది!” అంది.
“ఐతే మంచి చెడు, తప్పు అనేవి లేవా?”
“మనిషికి ఫ్రీడం ఉండాలి. మనకి ఎందులో సంతోషం దొరుకుతుందో ఆ విధంగా జీవించటం స్వేచ్చ అంటే. నిర్బంధం ఉండకూడదు. లైఫ్ అంటే జీవించటం.. సంతోషంగా బ్రతకటం. నీ ఇష్టాల్ని చంపేసుకోవటం కాదు.” అంది తనకి గట్టి అభిప్రాయాలున్నట్లు. “నిర్బంధం లేకపోతే తాగుతారు. డ్రగ్స్‌కి అలవాటు పడతారు. దొంగతనాలు చేస్తారు” అన్నాను.
“అవి చెడు అలవాట్లు. మానసిక బలహీనత. వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తారు” అంది. “మరి వాళ్ళని ఎవరు రక్షిస్తారు? తన సుఖం చూసుకోవటం స్వార్థం కాదా! కుటుంబం కోసం త్యాగం చెయ్యటం గొప్ప విషయం కాదా!” అన్నాను. “గొప్ప ఏముంది! నీకు అందులో సంతోషం ఉంది. నీకు నీ ఫామిలీ కావాలి. వాళ్ల కోసం పని చెయ్యటంలో నీకు ఆనందం దొరుకుతుంది. నీకు ఏది చెయ్యాలని ఉందో అది చెయ్యగలగటం మంచి.
మీరాని ఎందుకంత ఆరాధిస్తారు? కుటుంబంకోసం ఏం చేసింది! తన సంతోషం భజనలు పాడుకోవటంలో ఉంది. భక్తిలో ఉంది! అది స్వార్థం కాదా! తన ఆనందం కోసం భర్తని, రాజుని, సంఘాన్ని లెక్క చెయ్యలేదు. నువ్వు కోరుకున్న లాగ జీవించాలి! కోరుకున్నది సాధించాలి. అదే పరిపూర్ణమైన జీవితం. నీ శక్తి సామర్య్థాలని బట్టి మదర్ థెరెసా కావచ్చు. టెన్నిస్ ప్లేయర్ కావచ్చు. స్పేస్‌లోకి వెళ్ళచ్చు… ఒక ఆర్టిస్ట్ కావచ్చు. ఇంత ప్రపంచం ఉంది. భర్త, పిల్లల నీడలో ఉండటం సెక్యూరిటీ కోసం స్వేచ్చని జీవితానందాన్ని వదులుకోవటం చీమ జీవితం. ఇంకా హీనం..”
ఆ తరవాత శ్వేత ఏమంటుందో నాచెవులకి వినిపించలేదు. చీమ జీవితమా!
గుహల కాలం, అడవిలో అరాచకం, అభద్రతా భావం, స్వేచ్చా ప్రణయం దాటి సుస్థిరమైన శాంతి భద్రతల కోసం ఈ సాంఘిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. వ్యక్తి స్వేచ్చ అవాంఛనీయం అనుకున్నాం. ఆపాఠం మరిచిపోయామా! మళ్ళీ ఆ చక్రం లోకే వెడుతున్నామా?
“శ్వేత చిన్నపిల్ల! దాని మాటలకేమిటి?” అనుకుని ఊరుకోలేకపోతున్నాను. స్త్రీ ఈ గృహపరిథిని ఛేదించుకుని ఎదిగి ఇంకా ఉన్నత శిఖరాలని అందుకుంటుంది. దీన్ని మించిన బ్రహ్మానందమేదో పొందుతుందా? అటువంటి ఆనందం నిజంగా ఉందా? ఎవరు చెప్తారు? ఆనీ చెప్పగలదేమో! ఔను. ఆనీ చెప్పగలదు అనుకున్నాను. ఏ పని చేస్తున్నా ఊరికే ఉన్నా కూడా శ్వేత మాటలే గుర్తుకు వస్తున్నాయి.
“నాది చీమ జీవితమా!” అనుకుంటే నాలో ఉన్న గర్వమంతా కూలిపోతున్నట్లుగా ఉంది. నిజమైన ఫెమినిజం ఏమిటి? నేను పొందుతున్నాననుకుంటున్న ఆనందం అబద్ధమా? ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యటం, మొగవాళ్ళు వంటపని ఇంటిపని చెయ్యటమా? ఫెమినిజం. ఇది కూడా డివిజన్ ఆఫ్ లేబరే కాదూ! ఇప్పుడు మొగవాళ్ళు ఇంటిపనులు చేస్తూనే ఉన్నారు. ఆడవాళ్ళు చేసిన ఇంటిపనికి లెక్కకట్టి డబ్బులు పుచ్చుకోవటమా? అది యజమాని పనిమనిషి సంబంధమౌతుంది కానీ భార్యాభర్తల సంబంధం కాదు.
స్త్రీకి తనకు నచ్చిన పురుషుణ్ణి పెళ్ళి చేసుకునే స్వతంత్రం ఉండాలి. ఇద్దరికీ కలవనప్పుడు వివాహబంధం శాశ్వతం కానవసరం లేదు. వివాహబంధంలో పవిత్రత, శారీరకమైన అపవిత్రత కూడా బూటకాలే. ఒక స్త్రీ, పురుషుడు మనసా వాచా ఇష్టపడి దాంపత్యం చెయ్యటమే రైటు. ఇవన్నీ నేను అర్థం చేసుకోగలిగాను. అంగీకరిస్తున్నాను. అంతేకాదు. మేము నేను, ఆయనా ఒక స్థాయీభావాన్ని చేరుకున్నాం అనుకుంటున్నాను. సంసారంలో భార్యాభర్తల మధ్య ఎన్నో భేదాలు, అపార్థాలు వస్తాయి. వాళ్ళ మధ్య కొంచెం సహనం, కొంచెం అనురాగం ఉంటే క్రమంగా ఆ సంచారీభావాలు అంతరించి ప్రేమ ఏర్పడుతుంది. రససిద్ధి కలుగుతుంది.
ఇద్దరూ కలిసి జీవితాన్ని అనుభవించటం, ఆనందించటం నేర్చుకుంటారు. ఒకే స్త్రీ, ఒకే పురుషుడు జీవితాంతం కలిసి ఉండాలా? ఆ సెక్స్‌లైఫ్ బోర్ కొట్టదూ అని ప్రశ్నిస్తుంటారు ఆధునికులం అనుకునే భౌతికవాదులు. కేవలం శారీరిక సుఖమే కోరుకుంటే .. విసుగే పుడుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధం కేవలం శారీరికం గాక మానసికమైన అనుబంధం. ఆత్మల సంయోగం ఐతే ప్రతిరాత్రి వసంతరాత్రి కాకపోయినా జీవితంలో ప్రతిరోజూ ఒక నూతనమైన అనుభూతి, మానసిక పరిణతి అనుభవంలోకి వస్తాయి. ఇదే భారతీయుల ప్రణయ సిద్ధాంతం. వివాహం యొక్క ఆదర్శం. మేము ఈ స్థితిని చేరుకున్నాం అనుకుంటున్నాను. అది కూడా భ్రమేనా! ఆరోజు రాత్రి డబుల్‌బెడ్ మీద నేను ఇటూ అటూ కదులుతున్నాను నిద్రపట్టక.
“ఏమిటాలోచిస్తున్నావ్!” అనడిగారు ఆయన నానడుం మీద చెయ్యివేసి. నవ్వాను.
“ఏమీలేదు. శ్వేత మాటలు గుర్తువచ్చాయి. నేను చీమని అనుకుంటున్నాను… మనిషి ఎంత గొప్ప వాడు! అనుకుంటాం. ఈ అనంతమైన సృష్టిలో మనిషి ఒక చీమ. మనమంతా చీమలమే!” అన్నాను.
“ఒక చీమ ఇంకొక చీమకి గుడ్‌నైట్ చెప్తోంది” అన్నారు ఆయన దగ్గరగా జరిగి.
…………………………………………………..
వాళ్ళు వెళ్ళిపోయారు. చేరినవెంటనే ఫోన్ చేశారు. మమ్మల్ని అమెరికా రమ్మని చెప్పారు. ఆయనకేం, ఇంజనీరింగు స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్తూ రోజు గడిపేస్తారు. టి వి చూస్తారు. నేను పనిలేనప్పుడు ఉయ్యాల బల్ల మీద కూర్చుంటున్నాను.
అక్కడ కూర్చుంటే శ్వేత గుర్తు వస్తుంది. ఎన్ని సంగతులు చెప్పేది! కబుర్లపోగు. “అక్కడ కూడా వైఫ్ బీటింగ్ ఉంది బామ్మా. నా ఫ్రెండ్ మాగీ ఉంది. వాళ్ళ అమ్మా, నాన్నా ఇద్దరూ తాగుతారు. బాగా తాగుతారు. తాగి కొట్టుకుంటారు. మాగీ స్కూలికి రాగానే “ఇవేళ మామాం పెదవి చిట్లి రక్తం వచ్చింది” అని ఒకరోజు చెప్తే మర్నాడు “మాడాడ్ తలకి బొప్పి కట్టింది ఇవేళ” అని చెప్తుంది. వాళ్ళిద్దరూ రోజూ కొట్టుకోవాల్సిందే. ఇంట్లో వస్తువులన్నీ పగిలిపోతుంటాయి. దాని గురించి మళ్ళీ కొట్టుకుంటారు” అని పకపకా నవ్వి నన్ను నవ్వించింది.
అది గుర్తుచేసుకుని నవ్వుకుంటుంటే ఫోన్ రింగయ్యింది.
వెంటనే లేచి వెళ్ళి అందుకున్నాను.
“హల్లో..”
“హలో .. అమ్మా! నేను ప్రసాద్‌ని”
ప్రసాద్! పేరు వినగానే సంతోషం. దూరాన ఉన్నప్పుడు మాటవినిపిస్తేనే చూసినంత సంతోషం.
“ప్రసాద్! అంతా కులాసా యేనా!” ముందర క్షేమ వార్త వినాలి.
“ఆ! నాన్న గారికి దగ్గు తగ్గిందా! మందు వేసుకుంటున్నారా?”
“అన్నీ తగ్గాయి. ఇప్పుడు బాగున్నారు. క్లాసులు చెప్తున్నారు. విశేషాలేమిటి..”
“అమ్మా! ఒక సంగతి చెప్పాలి. ఒక రకంగా బాడ్ న్యూస్ … ” అని ఆగాడు.
“శ్వేతకి ఏమీ అవలేదు కదా .. దీపూ..” నా గుండె వేగంగా కొట్టుకుంటోంది.
“శ్వేతకి ఏమీ అవలేదు. మేమంతా క్షేమమే. ఆనీ .. ఆనీ చచ్చిపోయింది. షి ఈజ్ డెడ్” అన్నాడు.
“అయ్యో! ఆనీ .. ఎప్పుడు? ఎట్లాగ?” నాకు మాటలు రావటం లేదు.
చాలాసేపు అనిపించిన అరనిముషం నిశ్శబ్దం తరవాత చెప్పాడు.
“ఆనీ మళ్ళీ పెళ్ళి చేసుకుందని చెప్పాననుకుంటాను. అప్పుడు ఒక కొడుకు పుట్టి ఆ కొడుకుని ఆనీ భర్తే చూసుకునేవాడు. పెంచాడు. రెండేళ్ళ తర్వాత అతను ఆక్సిడెంట్‌లో చచ్చిపోయాడు… రిచ్ ఫెలో. చాలా ఆస్తి వదిలిపోయాడు.”
“ఊ.”
“పిల్లవాడి బాధ్యత ఆనీ మీద పడింది. ఇదంతా న్యూస్ పేపర్లో, టి.వి.లో వచ్చింది. ఆనీ జీవితమంతా రాశారు.”
“అప్పుడేమయింది?”
“నాలుగో ఏట స్కూల్లో వేసింది. అప్పటినించే మాట వినేవాడు కాదుట. ఆరో ఏట హాస్టల్లో చేర్పించింది. పిల్లల్ని కొట్టేవాడుట. వస్తువులు దొంగిలించే వాడుట. స్కూళ్ళు మార్పించింది. పదేళ్ళు వచ్చేసరికి రెండు సార్లు హాస్టల్ నించి పారిపోయాడుట. ఇంట్లోంచి డబ్బు తీసుకుపోయి ఫ్రెండ్స్‌తో తిరిగేవాడుట. వాడికి టీనేజ్ ఫ్రెండ్స్ ఉన్నారుట. డబ్బు ఇవ్వాలి. దొంగతన ంగా డబ్బు, విలువైన వస్తువులు తీసుకెళ్ళేవాడు. నగలు కూడా దొంగతనం చేశాడుట. వారం క్రిందట హాస్టల్ నించి వచ్చాడుట. డబ్బు కావాలన్నాడుట. ఆనీ డబ్బు ఇవ్వను .. ఏం చేస్తావ్ అందిట. వెంటనే పిస్టల్ తీసి రెండు సార్లు కాల్చాడు. వెంటనే పారిపోయాడు… పోలీసులు పట్టుకున్నారు. పన్నెండేళ్ళు ఉంటాయేమో! ఏం చెయ్యగలము!.. నీకు చెప్పాలనిపించింది.. చాల బాధ అనిపించింది. ఆనీ ఇంక లేదు. ఎక్కువ వరీ అవకు… చేసేదేమీ లేదు.. బై .. ఫోన్ పెట్టేస్తున్నాను..” పెట్టేశాడు ప్రసాద్.
ఎక్కడిదో అర్తనాదం … నా గుండెలో ప్రతిధ్వనిస్తుంది. ఎవరిది! పన్నెండేళ్ళవాడు. తల్లిని చంపాడు . ఎందుకు? ఎందుకు! ఏం చెయ్యలేము. ఏం చెయ్యలేమా? ఎందుకూ? ఎందుకని! ఏమీ చెయ్యలేము… తల పట్టుకుని కూర్చుండిపోయాను. ఆయన గార్డెన్‌లో ఉన్నారు.
ఆయన వచ్చేదాకా అలాగే కూర్చున్నాను. రాగానే అంతా చెప్పాను. పదేళ్ళపిల్లవాడు … జైల్లో … పోలీసుల మధ్య! కొడుతుంటారేమో! బాధపడతాడా! భయపడతాడా! మొండికేస్తాడా? వాడు ఏం చేశాడో వాడికి తెలుసా అసలు!
ఆరాత్రి నాకు నిద్ర పట్టలేదు. “రేపు గుడికి వెడదాం” అన్నారు ఆయన. నాకు నిద్ర పట్టని రాత్రి “రేపు గుడికి వెడదాం” అంటారు.
…………………………………….
ఒక వారం గడిచింది … మెల్లగా .. భారంగా.
సాయంత్రం పిల్లలు చదుకోటానికి వచ్చారు. పనివాళ్ళ పిల్లలు ముగ్గురు. “ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో! వీళ్ళు పెద్దవాళ్ళై తమని ఉద్ధరిస్తారని, ముసలి తనంలో పోషిస్తారని వాళ్ళ తల్లిదండ్రులు ఆశపెట్టుకుంటారు వీళ్ళ మీద. నాలుగు అక్షరాలు నేర్పించి మంచి పౌరులు కావాలని నేను ఆశపెట్టుకుంటున్నాను” అనుకుంటున్నాను.
ఫోను రింగయింది. అందుకున్నాను. మాలతి! ఎదురుచూస్తున్నాను .. మళ్ళీ ఫోను వస్తుందని. చాలా మాట్లాడాలని ఉంది.
“మాలతీ ఎలాగున్నారు? శ్వేత ఏమంటోంది? తనకి అంతా తెలిసిందా!” అడిగాను.
“తెలిసింది. తెలియకుండా ఎలా ఉంటుంది? టి.వి. చూస్తుంది. పేపర్స్ అన్నీ చదువుతుంది. ఏదీ దాచలేము. ఒక రోజంతా చాలా మూడీగా ఉంది. ఎవరితోనూ మాట్లాడలేదు. ఆరాత్రి శ్వేత దగ్గరే పడుకున్నాను. మర్నాడు దానికి ఇష్టమైన గోల్ఫ్ ఆడటానికి వెళ్ళింది. అక్కడినించి వచ్చాక మామూలుగా అయిందనిపించింది. నా చెయ్యి పట్టుకుని “ఐ హావ్ నథింగ్ టు డు విత్ డట్ ఉమన్” అంది. హేరీ గురించి మేము మాట్లాడుకుంటుంటే “ఆ పిల్లపాముని మన ఇంటికి తీసుకురావద్దు” అంది గట్టిగా. తీసుకురాము అని చెప్పాను. ఆ ఉద్దేశం మాకు లేదు. కానీ ప్రసాద్ వాడికి తక్కువ శిక్ష పడేలాగ చూడమని, మేము గార్డియన్స్‌గా ఉంటామని జూవెనైల్ కోర్టుకి ఎప్పీల్ చేశాడు.” అని చెప్పింది.
ఒక సంతోషరేఖ విరిసింది నాలో.
నేను చీమని కాదు. నాది తల్లిమనసు. ప్రపంచాన్ని పాలించే తల్లి మనసు.
నా నమ్మకాలు నా ఊహలూ తప్పుకావు.
తన సంతానాన్ని పెంచే బాధ్యత స్త్రీది. అందుకే నేను స్వేచ్చని సమర్థించలేకపోయాను.
పిల్లల్ని కనటమే కాదు, సక్రమంగా పెంచాల్సిన బాధ్యత స్త్రీది. బాధ్యత బానిసత్వం కాదు.
స్త్రీకి స్వతంత్రం ఉండాలి. తగిన భర్తని పొందటానికి, కోరుకున్న జీవితం సాగించటానికి.
కానీ అంతకంటె ముఖ్యమైన బాధ్యత ఉంది. పిల్లల్ని ప్రేమతో పెంచటం. తల్లి ప్రేమలో పెరగని పిల్లలు ఆర్ద్రత ఎరగని రాక్షసులవుతారు. తల్లిప్రేమలో పెరిగిన పిల్లలు సత్వసంపన్నులవుతారు. ఈ నాటి స్త్రీ పురుషుడితో పోటీ పడి సుఖం, ధనం, అధికారం వెంట పరుగుపెడుతుంది.
మగవాడిని మించాలని స్త్రీ సహజమైన కరుణని ప్రేమని చంపేసుకుంటోంది. ఈనాటి ప్రపంచంలో హింస పెరగటానికి కారణం మగవాడి ఐశ్వర్యకాంక్ష, అధికారదాహం. స్త్రీ కూడా పురుషుణ్ణి అనుకరిస్తే ఈ ప్రపంచాన్ని ఎవరు రక్షిస్తారు? స్త్రీ మూలశక్తి!
ఆడని మగని కూడ స్త్రీ తన గర్భంలో మోసి కంటుంది. కనటమే కాదు. ప్రేమతో పెంచుతుంది. రక్షిస్తుంది. అదే మాతృప్రేమ. మొగవాడు తేనేటీగ! కనటానికి పనికివస్తాడు. కండబలంతో పరిశ్రమ చెయ్యగలడు.
ఆడదాని గుండెలో ఉండే అమృతపు పొంగు వాడికేది! తన సంతానాన్ని రక్షించుకోవటం వాడికేమి చాతనవును! వాడికి గర్భసంచీ లేదు. ఈ తల్లిప్రేమ లేదు. ఈ రక్షణ బాధ్యత సహజంగా లేదు.
తరతరాల సంస్కారంతో ఇప్పుడు బాధ్యత నేర్చుకుంటున్నాడు. ఈనాటి సంస్కారంతో స్త్రీ తన బాధ్యత మరిచిపోతోంది. ఆనాటి స్త్రీ పరిథి ఇల్లు. ఈనాటి స్త్రీ పరిథి ప్రపంచం. ఆనాటి గృహిణి తన సంతానాన్ని సత్ప్రవర్తనులుగా తీర్చినట్లు ఈనాటి స్త్రీ ఈ ప్రపంచాన్ని మరమ్మత్తు చెయ్యాలి.
ఆధునిక స్త్రీ ఇష్టంలేని దుష్టుడైన భర్తని తిరస్కరించినట్లు సమర్థురాలు శక్తిమంతురాలు అయిన స్త్రీ దోపిడీని హింసని పెంచే ప్రభుత్వాల్ని పడగొట్టాలి.
శ్వేతా! వింటున్నావా? ఈ బామ్మ ఆత్మఘోష. నువ్వు ఈ సందేశాన్ని ప్రపంచానికి అందించాలి! ఇంత హింస విజృంభిస్తున్నా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఇంత ఆనందం, అందం మిగిలే ఉన్నాయంటే మంచి తల్లిదండ్రులే కారణం!!!!
--------------------------------------------------------
రచన: ఎ. ఎస్. మణి,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment