Saturday, July 7, 2018

ప్రభావతీ ప్రద్యుమ్నం – 3


ప్రభావతీ ప్రద్యుమ్నం – 3సాహితీమిత్రులారా!


ప్రభాతీ ప్రద్యుమ్నం మూడవ భాగం చివరిభాగం
ఆస్వాదించండి-

నీళ్ళు నవుల్తూ ఉండిపోయింది చిలక!
“చెప్తావా, చంపమంటావా?” బెదిరించింది శుచిముఖి దాన్ని నొక్కిపడుతూ.
“నన్ను కొట్టూ, చంపు. ఎవరికీ చెప్పనని ఒట్టేస్తే గాని ఆ విషయం బయటపెట్టను” అంది చిలక మొండిగా. అలాగే ఒట్టేసింది శుచిముఖి.
ఇలా చెప్పింది చిలక “వజ్రనాభుడికి సునాభుడనే తమ్ముడున్నాడు. అతనికి చంద్రవతి, గుణవతి అనే యిద్దరు కూతుళ్ళు. ఒకనాడు నారదుడు యిక్కడికి వస్తే వాళ్ళిద్దరూ ఆయన ఆశీర్వాదం కోసం ఆయన్ని పూజించేరు. ఆయన దానికి సంతోషించి “మీ భర్తలకి మీమీద చెరగని ప్రేమ ఉండుగాక! మీకు చక్కటి సంతానం కలుగ్గాక!” అని దీవించేడు. ఐతే అప్పుడు పక్కనున్న దాదులు ఊరుకోలేక “వీళ్ళకి ఎవరు భర్తలౌతారో కూడా దయచేసి మీరే చెప్పండి” అనడిగారాయన్ని.
కొంత సేపు ఆలోచించేడు నారదుడు.
“ద్వారకానగరంలో వుండే గద సాంబులనే వాళ్ళు వీళ్ళకి భర్తలౌతారు” అని ఆనతిచ్చేడు నారదుడు.
దాంతో బిత్తరపోయేరు వాళ్ళు!
“తిని కూర్చుని తిప్పలు తెచ్చి పెట్టుకున్నాం కదా! ఎక్కడి ద్వారక, ఎక్కడి గదసాంబులు? ఈ సంగతి రాజుకి తెలిస్తే ఇక మన మెడల మీద తలలుండవ్‌” అని గప్‌చుప్‌గా ఊరుకున్నారు వాళ్ళంతా.
ఐతే గుణవతీ చంద్రవతులు మాత్రం అప్పట్నుంచీ గదసాంబుల్నే తల్చుకుంటూ వాళ్ళకోసం నోములూ వ్రతాలూ చేస్తున్నారు. వాళ్ళు చిన్నప్పట్నుంచీ నన్ను పెంచి పెద్ద చేసేరు గనక వాళ్ళకి కొంత ఉపకారం చేద్దామని నేనే ద్వారకకి వెళ్ళి రాయబారం నడుపుతానని వాళ్ళతో చెప్పి వెళ్ళొస్తూ దార్లో ఆ ఉత్తరం తీసుకొచ్చా.నన్ను ప్రభావతి చూస్తే కొంపలంటుకుంటయ్‌. నేను త్వరగా వెళ్ళి వాళ్ళకి కనపడకపోతే వాళ్ళెంతో బాధపడతారు కూడా. దయచేసి నన్నొదులు” అని బతిమాలింది చిలక శుచిముఖిని.
“ఐతే వాళ్ళచేత ఈ కథ నిజం అని చెప్పించు. అప్పుడొదిలేస్తా నిన్ను”
అందుకు ఒప్పుకుంది చిలక. వాళ్ళ అంతఃపురానికి తీసికెళ్ళింది. చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి వాళ్ళని పిలిచింది.
ఆనందంగా పరిగెత్తుకొచ్చారు అక్కచెల్లెళ్ళు!
హంస రెక్కల్లో చిక్కుకుని ఉన్న చిలకని చూసేసరికి తెల్లబోయేరు!
“మీరేం భయపడొద్దు. ఈ హంస ప్రమాణం చేసింది “నీకూ నిన్ను పంపిన వాళ్ళకీ మంచేగాని ఏమీ చెడు జరగనియ్యన”ని.” అంటూ తనకీ ఆ హంసకీ జరిగిన కథ వినిపించింది చిలక, ప్రభావతి విషయం రానివ్వకుండా.
శుచిముఖి చిలకని వదిలేసింది.
“గదసాంబులిద్దర్నీ కలిసి మీ విషయాలు చెప్పేను. వాళ్ళకి మీరంటే ఇష్టం కలిగింది. మిమ్మల్ని తప్పక పెళ్ళాడుతామన్నారు. త్వరలో ఇక్కడికి వచ్చే ఉపాయం చూడబోతున్నారు” అని తను చేసుకొచ్చిన పని చకచక వినిపించింది చిలక.
శుచిముఖి కూడా, “వాళ్ళిక్కడికి రావటానికి నేనో ఉపాయం చేస్తాను. నేను మీ అక్క ప్రభావతి మిత్రురాల్ని.ఆమె యీ చిలకని పట్టుకు రమ్మంటేనే ఇలా వచ్చా. ఇప్పుడు మీతో కూడా స్నేహం కుదిరింది. మీ రహస్యం ఆమెకి తెలీకుండా సర్ది చెప్తాలే, మీరు భయపడకండి” అని వాళ్ళకి చెప్పి ఎగిరి ప్రభావతి దగ్గరికెళ్ళింది.

“అదృష్టం అంటే నీదే! అది ప్రద్యుమ్నుడు పంపిన లేఖేనటగా! చదువుకున్నావా?” అని పరామర్శించింది ప్రభావతిని.
ఆమె కూడా నవ్వుతూ, “అది సరే, ఆ చిలకెక్కడ? దాన్నెందుకొదిలేసొచ్చావ్‌?” అనడిగింది.
“ఇంకా దాని గొడవెందుకు? నీ ప్రియుడు నీకు రాసిన లేఖ ఇంకెవరి చేతా పడకుండా మనకే దొరికింది కదాని సంతోషంలో దాన్ని వదిలేశా” అని దాటేసింది శుచిముఖి. “ఆ లేఖంతా చదువుకున్నావ్‌ కదా! అప్పుడు నేను నీగురించి అంత చెప్పినా కిక్కురుమననివాడు యిప్పుడింతగా తపించిపోవటం ఆశ్చర్యమే! ఐనా నీ అందం గురించి విన్న వాడు నీరుగారి పోకుండా ఉండటానికి అతని గుండె ఇనుమా, రాయా? .. అంతా బాగానే ఉంది. ఇక అతన్ని యిక్కడికి రప్పించటానికి ఓ ఉపాయం ఉంది. నువ్వు అవకాశం చూసుకుని నీ తండ్రికి నా గురించి గొప్పగా చెప్పు. కథలు చెప్పటంలో నాకు నేనే సాటి అనీ, నాకు అన్ని విద్యలూ తెలుసుననీ, అతన్ని మెప్పించగలననీ బాగా బోధించు. ఆ తర్వాత విషయం నేను చూసుకుంటా” అని మార్గం ఉపదేశించింది ప్రభావతికి.

ఇంతలో ఓ రోజు వజ్రనాభుడు అంతఃపురానికి వచ్చేడు. ఆ సందర్భంలో, “మన కొనన్లలో తిరిగే హంసల్లో శుచిముఖి అనేదొకటి కనీవినీ ఎరగని విద్యలన్నీ తెలిసింది ఉంది. మాటల్లో, కథల్లో, రకరకాల విద్యల్లో దానికదే సాటి! మీరొకసారి దాని ప్రతిభని చూడాలి” అని చెప్పిందతంతో ప్రభావతి. “అలాగే, ఇప్పుడే చూద్దాం, పిలిపించు దాన్ని” అన్నాడతను ఆసక్తిగా.
శుచిముఖిని రప్పించింది ప్రభావతి. తన ముందు కూర్చోబెట్టుకుని, “శుచిముఖీ, నీ విద్యల గురించి చెప్తే ముచ్చట పడి నా తండ్రి వినాలనుకుంటున్నాడు. ఏదీ, నీకు తెలిసిన శాస్త్రాల గురించి చెప్పు” అనడిగింది.
ఇక విజృంభించింది శుచిముఖి. కాణాదం, గౌతమీయం, సాంఖ్యం, జైమినీయం, యిలా అన్ని మతాల్నీ పూర్వపక్షాలు పెంచుతూ,తర్వాత వాటిని ఖండిస్తూ సిద్ధాంతాలు చేసింది. కావ్యాలు, నాటకాలు, అలంకార శాస్త్రాలు, కామశాస్త్రం కరతలామలకాలుగా చూపించింది. వజ్రనాభుడు ఆనందపారవశ్యంతో ఉక్కిరిబిక్కిరయేడు.

ఆ శాస్త్రప్రసంగం అయాక, “నువ్వు అన్ని లోకాలూ తిరిగేదానివి. నీక్కూడా వింతగా అనిపించిన విశేషాలేవైనా ఉన్నాయా?” అనడిగేడతను కుతూహలంగా.
“ఎన్నో చూశా గాని అన్నిట్లోకీ విచిత్రంగా అనిపించింది భద్రుడనే ఓ నటుడి నాట్యప్రదర్శన. ఇదివరకో మునుల సభలో గొప్పగా నాట్యం చేసి వాళ్ళచేత వరాలు పొంది ఇప్పుడు ఏడుదీవుల్లోనూ ప్రదర్శనలిస్తున్నాడు” అంటూ అతని ప్రదర్శనలో చూసిన అద్భుతాల్ని వినిపించింది శుచిముఖి. వజ్రనాభుడికి కుతూహలం పెరిగిపోతోంది. “నేనూ అతని గురించి కొంత విన్నా. అతని నాట్యం చూడాలని అనుకుంటున్నా. నువ్వెలాగైనా అతనిక్కడికి వచ్చేట్టు చెయ్యి” అనడిగేడు శుచిముఖిని. “అలాగే” అని అతంతో చెప్పి, “ఇంక వెళ్ళి రానా?” అని ప్రభావతితో అంటూ ఆమె తనతో కొన్ని అడుగులు నడుస్తుంటే, “ఇదంతా నీ ప్రియుడి కోసమే చేస్తున్నా. తొందర్లోనే నీ కోరిక తీరబోతోంద”ని ఆమెకి చెప్పి వెంటనే ద్వారకకి వెళ్ళి కృష్ణుడితో భద్రుడికి వజ్రనాభుడి అనుమతి దొరికిందని చెప్పింది శుచిముఖి. అలాగే, గదసాంబుల గురించి నారదుడన్న విషయం కూడ చెప్తే ప్రద్యుమ్నుడితో వాళ్ళిద్దర్ని కూడా సహాయంగా పంపటానికి నిర్ణయించేడు కృష్ణుడు.
ఇక ఇంద్రుడికి యీ విషయం చెప్పాలి.
అంతలో ప్రద్యుమ్నుడు తన కోసం ఎదురుచూస్తూంటాడని గుర్తొచ్చి అతని భవనంలో దిగింది శుచిముఖి. వజ్రపురంలో ప్రభావతి అతని కోసం ఎదురుచూస్తూ తపిస్తోందని వివరించిందతనికి.
“ఇప్పుడే రెక్కలు కట్టుకు వెళ్ళి ఆమె ముందు వాలాలనుంది నాకు. కాని ఆ రాక్షసుడి అనుమతి దొరకటం ఎలా?” అని వాపోయేడు ప్రద్యుమ్నుడు.
“నీకేం బెంగక్కర్లేదు. దానిక్కావల్సిన పథకం అంతా సిద్ధంగా ఉంది. ఆ పని మీదే నీ తండ్రి నిన్ను పంపబోతున్నాడిప్పుడు. నేను కూడా స్వర్గానికి వెళ్ళి ఈ విషయం ఇంద్రుడికి చెప్పి అక్కణ్ణించి వజ్రపురానికి వెళ్ళి నీకోసం చూస్తుంటా” అని బయల్దేరింది శుచిముఖి.

కృష్ణుడు ప్రద్యుమ్నుణ్ణీ, గదసాంబుల్నీ పిలిపించేడు వెంటనే.
వాళ్ళు ముగ్గురూ కలిసి వజ్రపురానికి వెళ్ళి వజ్రనాభుణ్ణి చంపాలని ఆదేశించేడు.
ప్రద్యుమ్నుడు భద్రుడిగా, గదుడు పారిపార్శ్వకుడిగా, సాంబుడు విదూషకుడిగా వెళ్ళాలని వివరించేడు.
నటుల వేషాల్లో, అందుకు తగిన పరివారాల్తో, భద్రుడి కున్నలాటి సంగీత వాద్యాల్తో వెళ్ళి వజ్రపురం చుట్టుపక్కల ప్రదర్శన లివ్వసాగేరు వాళ్ళు.
వజ్రనాభుడు విన్నాడీ విషయం. వెంటనే వచ్చి తన ముందు ఆడమని కబురు పంపేడు.
అలా వజ్రపురం లోకి ప్రవేశించారు వజ్రనాభుడి పాలిటి యములు! కూతుళ్ళ ప్రియులు!!

ప్రదర్శన సమయం వచ్చింది!
శుచిముఖి కన్యలు ముగ్గురికీ వాళ్ళ ప్రియుల విషయం చెప్పి వుంచింది.
ప్రద్యుమ్నుడికి ప్రభావతి అతని ప్రదర్శనకి వస్తున్నట్టు చెప్పి ఆమె ఎక్కడ కూర్చుంటుందో కూడా చూపించింది.
తన వైభవాన్నంతా ప్రదర్శిస్తూ కొలువు తీరేడు వజ్రనాభుడు!
అంతఃపుర స్త్రీలు ఎవరికీ కనపడకుండా నాట్యప్రదర్శన చూట్టానికి వచ్చి కూర్చున్నారు.
తన అద్భుత మాయా ప్రభావంతో గంగావతరణం నాటకం ఆడించేడు ప్రద్యుమ్నుడు. దాన్లో ఉన్న పాత్రల ఆకారాలు ధరించటంలో, గంగ గమనాన్ని చూపటంలో, కైలాసం లాటి పర్వతాల్ని కళ్ళక్కట్టినట్టు చిత్రించటంలో, అడవులు, పక్షులు, మృగాల్ని సైతం పుట్టించటంలో అతని ఇంద్రజాలం జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. దగ్గరున్న డబ్బునీ సొమ్ముల్నీ బహుమతులుగా అతని మీదికి విసిరేరు వాళ్ళు.
అతను ఇన్ని వేషాల్లో అందరికీ కనిపిస్తున్నా ప్రభావతికి మాత్రం అతని అసలు రూపమే కనబడుతోంది!
ప్రదర్శన దిగ్విజయంగా ముగిసింది.
ప్రభావతి ఉన్న చోటు వంకా, వజ్రనాభుడి వంకా మార్చి చూస్తూ అతను చివరగా, “ప్రభావతీ! నా మీది నీ ప్రేమతో నా జన్మ తరించింది. నువ్వు పంపిన రాజహంసి నీ విషయం చెప్పిందగ్గర్నుంచి నిన్నే తల్చుకుంటున్నా. ఈ రాత్రికే మన కలయిక. ఇక నీ సేవకే నా జీవితం అంకితం” అనే సరికి
ఆమెకి ఎక్కడలేని సిగ్గూ, భయం ముంచుకొచ్చేయి.
చెక్కిళ్ళు ఎరుపెక్కేయి.
అది చూస్తున్న శుచిముఖి ఆమెని మందలించింది సున్నితంగా “ఇంత మంది మధ్య నువ్వంతగా సిగ్గుపడక్కర్లేదు. అతనన్న దాన్లో రెండో అర్థం నీకు తెలీలేదా ఏమిటి?”
“రెండో అర్థం ఏమిటింక మరీ ఇంత విచ్చలవిడిగా అందరిముందూ ఈ రాత్రికే వస్తున్నానంటుంటే!” అంది ప్రభావతి కంగారుగా.
“నీ ప్రియుణ్ణి మరీ అంత తేలిగ్గా అంచనా వెయ్యకు. అతనన్న మాటలు నీకలా అర్థమయ్యాయి తప్ప వజ్రనాభుడికి అవి తనని పొగుడ్తూ అన్నట్టు అనిపిస్తాయి. అలా ఎవరిక్కావల్సిన అర్థం వాళ్ళకొచ్చేట్టు మాట్టాడేడతను. కనక నీకేం బెంగక్కర్లేదు. నీ రహస్యం యింకెవరికీ తెలియదులే” అని వివరించింది శుచిముఖి.

ప్రదర్శకులు వాళ్ళ విడుదులకి బయల్దేరేరు.
ప్రభావతి కూడ రాగవల్లరితో కలిసి తన అంతఃపురాని కెళ్ళింది.
సిగ్గు, భయం, లజ్జ, కోరిక అన్నీ కలగలిసి ఆమెని ముంచెత్తుతున్నాయి.
చెలికత్తెలు ఆమె కోసం తెస్తున్న పూలలో తుమ్మెదగా మారి దూరి వెళ్ళేడు ప్రద్యుమ్నుడు!
సంపెగ నూనెతో తలంటి ఆమెకి సుగంధస్నానం చేయించింది రాగవల్లరి.
అద్భుతంగా అలంకరించుకుంది ప్రభావతి.
రకరకాల బొట్లు పెట్టుకుని చూసుకుంది.
అనేక విధాలైన ఆభరణాల్ని మార్చి మార్చి పెట్టుకుచూసింది.
ఐనా తన ప్రియుడికి ఏవైతే యిష్టమౌతాయో తెలిసేదెలా?
ఒకచోట నిలవలేక చేసిన పన్లే చేస్తూ చూసిన వస్తువులే చూస్తూ తిరుగుతోంది.
కాలం గడుస్తోంది. ఆమె ఆరాటం పెరిగిపోతోంది.
“ఒక్కో క్షణం ఒకో ఏడాదిలా గడుస్తుంటే యింకా రాడేమిటి? ఏదైనా అడ్డొచ్చిందేమో! ఎవరికైనా తెలిసిందో ఏమో! అసలు ఈ అంతఃపురంలోకి ఎలా రాగలుగుతాడు తను? … ఇదంతా నా దురదృష్టం ఎవర్ననుకునీ ఏముందీ” అంటూ బాధపడింది శుచిముఖినీ రాగవల్లరినీ పిలిచి.
తన విరహాన్ని పెంచుతున్న చంద్రుణ్ణీ చల్లగాలినీ తిట్టిపోసింది.
మన్మథుణ్ణి కోపగిద్దామంటే తన ప్రియుడు ఆ మన్మథుడి మరో రూపమాయె!
వ్యథ భరించలేక మూర్ఛ పోబోతుండగా
నిజరూపంతో ముందు నిలిచేడు ప్రద్యుమ్నుడు!

“నేను వచ్చేశాను చూడు” అంటూ కౌగిలించుకున్నాడామెని.
భయం, వణుకు, లజ్జ పుట్టుకొచ్చాయామెకి!
అతని చేతులు విడిపించుకుని పారిపోయింది లోపలికి!
శుచిముఖినీ, రాగవల్లరినీ చూసి వేడుకున్నాడు ప్రద్యుమ్నుడు “నా పుణ్యాలఫలం మీ చెలి. ఆమెని త్వరగా తీసుకొచ్చి మీరే పెళ్ళిపెద్దలై మాకు గాంధర్వ వివాహం చేయించాలి”
“సరే, ఇప్పుడే వస్తాం” అని ప్రభావతి దగ్గరికి వెళ్ళేరు వాళ్ళు.
ఎన్నో రకాలుగా బుజ్జగించి, బెదిరించి, లాలించి మెల్లగా ఒప్పించి తీసుకొచ్చేరు.
పాణిగ్రహణం చేయించేరు.
పెళ్ళిమంత్రాలు చదివింది శుచిముఖి.
గాంధర్వ వివాహం జరిగిపోయింది.
తెల్లవారటంతో నిద్రలేచేడు ప్రద్యుమ్నుడు.
“రాత్రులు ఇక్కడికి వస్తా గాని పగలు విడిదిలో కనపడకపోతే ప్రమాదం. కనక యిక్కడినుంచి నా విడిదికి సొరంగం కల్పిస్తా. నువ్వు దాని ద్వారం రహస్యంగా ఉండేట్టు చూడు” అని ఆమెకి చెప్పి అలాగే వెళ్ళేడు తన విడిదికి.
ప్రభావతి దగ్గరి కొచ్చేరు శుచిముఖీ రాగవల్లరులు.
ఆమె వాలకం చూసి రకరకాల చతురోక్తుల్తో సరసాలాడేరు.
ఇంతలో అక్కడికొచ్చేరు
గుణవతీ చంద్రవతులు
ప్రభావతిని చూట్టానికనే నెపం పెట్టుకుని
శుచిముఖితో తమ ప్రియుల విషయం మాట్టాట్టానికి!

ప్రభావతిని చూసేసరికి వాళ్ళకీ విషయం అర్థమైంది.
“అక్కకి రాత్రి ఏదో విశేషమే కలిగినట్టుంది చూశావా! గడుసుదే! బయటివాళ్ళెవరూ రావటానికి లేని అంతఃపురంలో ఎలా సాధించిందో!” అని ఆమెని ఆటలు పట్టించటం మొదలెట్టేరు వాళ్ళు.
తన రహస్యం వాళ్ళకి తెలిసిందని తెల్లబోయింది ప్రభావతి.
ఆమె పరిస్థితి గమనించిన శుచిముఖి వాళ్ళ గుట్టు కూడ బయటపెడితేగాని పరిస్థితి అదుపులోకి రాదని గుర్తించింది.
“ఆగండాగండి. మీరు చదివిన ఆకే తనూ చదివింది మీ అక్క కూడా. కాకపోతే మీకన్నా పెద్దది కాబట్టి ఆమె కోరిక ముందు తీరింది. మీలో ఎవరూ తక్కువ కాదులే” అంది వాళ్ళ గుట్టు రట్టు చేస్తూ.
ప్రాణం లేచొచ్చింది ప్రభావతికి.
“ఎలాగెలాగ? వీళ్ళక్కూడా ఏదో రహస్యం ఉందన్నమాట! నా మీదొట్టు. నువ్వు చెప్పాల్సిందే” అని శుచిముఖిని బలవంతం చేసింది.
వాళ్ళ వ్యవహారం అంతా ఆమెకి వినిపించింది శుచిముఖి.
“ముగ్గురం తోడుదొంగలం అయ్యాం” అని నవ్వుకున్నారు వాళ్ళు.
“బాగానే ఉంది గాని నీ ప్రియుడితో చెప్పి వాళ్ళ ప్రియుళ్ళు కూడా వచ్చేట్టు చూడాలి” అని ప్రభావతితో చెప్పి, “ఆమె ప్రియుడికి మాయశక్తులున్నయ్‌. వాళ్ళని రప్పించటం అతని వల్లే ఔతుంది. అందుకే మీ విషయం చెప్పాల్సొచ్చింది. ఇక మీరు మీ యిళ్ళకి వెళ్ళండి. అతంతో మాట్టాడి ఈ రాత్రికే మీ ప్రియులు వచ్చే ఏర్పాటు నేను చేస్తా” అని పంపింది గుణవతీ చంద్రవతుల్ని.

ఆ రాత్రికి ప్రద్యుమ్నుడి విడిదికి వెళ్ళి అన్నదమ్ములు ముగ్గుర్నీ ఓ చోట కూర్చోబెట్టి అందరి ప్రేమ కథల్నీ వినిపించింది శుచిముఖి. “హన్నా! నువ్వేదో ఇంద్రుడి పని మీద వచ్చావనుకుంటే అసలు విషయం యిదా!” అని ఒకర్నొకరు అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు.
తను తయారుచేసిన సొరంగం ద్వారా వాళ్ళని వాళ్ళ ప్రేయసుల దగ్గరికి పంపేడు ప్రద్యుమ్నుడు.
అలా కొంత కాలం ఆనందంగా గడిపాయి ఆ మూడు జంటలూను.
ఇంతలో అమ్మాయిలు ముగ్గురూ గర్భవతులయేరు.
తొమ్మిదినెలల తర్వాత ప్రభావతి ప్రభావంతుణ్ణి, చంద్రవతి చంద్రప్రభుణ్ణి, గుణవతి గుణవంతుడు, కీర్తిమంతుడు అనే కవలల్నీ కన్నారు.
ఆ పిల్లలు పుట్టటమే పూర్ణ యవ్వనంతో, వేదవేదాంగ పారంగతులుగా, అస్త్రవిద్యా దక్షులుగా పుట్టేరు.
అంతలో వాళ్ళ విషయం తెలిసింది వజ్రనాభుడికి!
కోపంతో మండిపడ్డాడు.
“ఈ అంతఃపుర ద్రోహం చేసిన వాళ్ళు ఏలోకం వాళ్ళో ఆ లోకానికి ఆఖర్రోజులొచ్చినయ్‌. వాళ్లని ప్రాణాల్తో పట్టుకురండి పొండి” అని తన సేనాపతుల్ని పంపేడు వీరావేశంతో ఊగిపోతూ!
అలా ఎందరో వెళ్ళేరు గాని
ఒక్కరూ తిరిగి రాలేదు!
ఇంక లాభం లేదని తన సైన్యం అంతటితో వెళ్ళి తన కూతుళ్ళ అంతఃపురాన్ని ముట్టడించేడు వజ్రనాభుడు!
“చిన్నపిల్లలు ఇంతసేపు యుద్ధం చేసేరు. ఇక మనం కూడా రంగం లోకి దిగాల్సిందే” అని ప్రద్యుమ్న గద సాంబులు సొరంగం ద్వారా అంతఃపురంలోకి వెళ్ళేరు.
వజ్రనాభుణ్ణి చంపటానికి ప్రద్యుమ్నుడు వెనకాడుతుంటే
ప్రభావతే అతని కత్తి తీసి చేతి కిచ్చి, “నీకేం అనుమానం వద్దు. యుద్ధానికెళ్ళి అతన్ని చంపు” అని పంపింది.

మిగిలిన వాళ్ళందర్నీ అంతఃపుర రక్షణకి ఉంచి తనొక్కడే రాక్షససైన్యాన్ని ఊచకోత కోసేసేడు ప్రద్యుమ్నుడు!
చివరికి వజ్రనాభుడే అతంతో తలపడ్డాడు.
ఇంతలో హంసలు వెళ్ళి యుద్ధవార్తని కృష్ణుడికీ ఇంద్రుడికీ అందించినయ్‌.
వెంటనే వచ్చి వాలేరు వాళ్ళు కూడా.
ఇంద్రుడు అద్భుతమైన రథాల్ని వాళ్ళ ముగ్గురికీ ఇచ్చేడు.
కృష్ణుడు తన చక్రాన్ని ప్రద్యుమ్నుడి దగ్గరికి పంపేడు.
దాన్ని ధరించి అతను వజ్రనాభుణ్ణి సంహరించేడు!

దేవదుందుభులు మోగేయి!
పుష్పవృష్టి కురిసింది!
వజ్రనాభుడి రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసి నలుగురు బిడ్డలకీ పంచి ఇచ్చేడు కృష్ణుడు.
కొడుకులూ, కోడళ్ళతో ఆనందంగా ద్వారకకి చేరుకున్నాడు!
అందరూ ఎంతో కాలం ఎన్నో సౌఖ్యాలనుభవించేరు!
----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment