నత్కీరుడు… నిబద్ధతా
సాహితీమిత్రులారా!
శ్రీ కాళహస్తి మాహాత్మ్యంలో ధూర్జటి, నత్కీరోపాఖ్యానం ఆలంబనగా చేసుకొని … ఈ నాటికీ వర్తించే ఒక విషయంమీద అతని అభిప్రాయాన్ని వెలిబుచ్చేడని నేను భావిస్తున్నాను.
స్థూలంగా కథ ఇది:
పూర్వం దక్షిణదేశాన్ని పాండ్య రాజు పరిపాలించేవాడు. ఆ రాజుదగ్గర వంశపారంపర్యంగా వచ్చిన సరస్వతీదత్తమైన ఒక “శంఖపీఠం” ఉంది. దాని ప్రత్యేకత… దాని మీద కవులైనవారు ఎవరైనా కూర్చుంటే మరొక్కరు కూచుందికి అవకాశం కల్పిస్తుంది. అలా కల్పించలేదంటే, కూచున్న వ్యక్తి కవి కాదన్నట్టే లెఖ్ఖ. అటువంటి శంఖపీఠంపై కూర్చున్న అతని ఆస్థాన కవులలో అగ్రగణ్యుడు నత్కీరుడు.
ఒకసారి ఆ రాజ్యంలో “ధాత కరువు” వంటి చెప్పలేని క్షామం వస్తుంది. వర్షాలు లేక, తిండిలేక ఆ రాజ్యంలోని ప్రజలు అల్లల్లాడుతుంటారు. ఆ రాజ్యంలో ఒక గ్రామంలోని ప్రజలందరూ వలస పోతుంటే, అక్కడ ఒక శివాలయంలోని పూజారి కూడా దేవునికి నమస్కరించి “స్వామీ! నీ సంగతి నువ్వు చూసుకో. కరువు తీరేక మళ్ళీ వచ్చి నీ సేవ చేసుకుంటాను” అంటాడు. దానికి శివుడు, “నేను నీ కొక పద్యం రాసిస్తాను. నువ్వు మహారాజు దగ్గరకి పోయి ఆ పద్యం చూపించు. నీకు వెయ్యి మాడలు బహుమానంగా ఇస్తాడు. ఈ కరువు తీరేదాకా పనికొస్తుంది. ఈ లోపున మంచి వర్షాలు పడి పరిస్థితి మామూలు స్థితికి వస్తుంది,” అని చెప్పి పంపిస్తాడు.
రాజసభలో పద్యం వినిపించగానే నత్కీరుడు ఫక్కున నవ్వుతూ ఆ పద్యంలో “సింధు రాజకన్య కేశములు సహజ గంధము కలిగి ఉన్నాయన్న” మాటకు ఆక్షేపణ చెబుతూ, “ఇది తప్పు. ఇలా చెప్పకూడదు. ఆది కవిత్వ సంప్రదాయాలకి అనుగుణంగా లేదు. ఇలా రాయవచ్చునా” అని అనగానే, ఆ పూజారి చిన్నబుచ్చుకుని, మహానుభావులారా. ఈ పద్యం నేను రాసింది కాదు. ఈ మహారాజు మీద పరమేశ్వరుడు రాసి ఇచ్చేడు. ఇందులోని తప్పొప్పులు నిర్ణయించగలశక్తి నాకు లేదు నన్ను క్షమించండి” అని వెనుతిరుగుతాడు.
వెనక్కి తిరిగి వచ్చిన పూజారిని ఈశ్వరుడు “ఏమయింది? ఉట్టి చేతులతో వచ్చేవు?” అని అడిగితే, ఈశ్వరుడి రాసిన పద్యాన్ని తిరిగి అప్పగిస్తూ, “స్వామీ, నిన్ను నమ్ముకుని రాజసభకి వెళితే, నిండు సభలో నా పరువు పోయింది. ఇంక ఏమిటి చెప్పమంటావు? అయినా, ప్రపంచంలో, ఎవరికైనా తమ జ్ఞానాన్ని ప్రదర్శించడం వల్ల రాజగౌరవం దక్కుతుంది గాని పక్కవాళ్ళ జ్ఞానం వల్ల సమ్మానం రాదు గదా. నత్కీరుడివల్ల నేను పడ్డ దుఃఖము కరువుతో పడ్డ బాధకంటే అతీతమైనది. అయినా, నా అదృష్టం ఇలా ఉంటుండగా చివరకి నిన్నూ, నత్కీరుణ్ణీ నిందించి ఏమి లాభం? బిక్షమెత్తుకునైనా ఎలాగో ఒకలాగ ప్రాణం నిలబెట్టుకుని కరువు తీరేక మీ సేవ చేసుకుందికి వస్తాను. నాకు శలవు ఇప్పించండి,” అని వేడుకుంటాడు.
దానికి శివుడు మనసు కరిగి, ” ఏమిటీ! నత్కీరుడు పద్యం తప్పుపట్టేడా? ఏదీ పద చూద్దాం ఆ తప్పేమిటో” అని పూజారిని తీసుకుని రాజ సభకు వెళ్ళి,
“ఈ మహారాజు మీద నేను సాహిత్యసురభిళంగా పద్యం చెప్పి పంపిస్తే, ఎవడో నత్కీరుడట అసూయతో ఏదో తప్పుపట్టాలిగదా అని తప్పు పట్టేడట. ఏమిటి ఆ తప్పు? లక్షణమా? అలంకారమా? పదబంధమా? రసమా? ఎక్కడ తప్పుందో చెప్పమనండి?” అని నిలదీస్తాడు.
దానికి నత్కీరుడు మునపటిలాగే తప్పు ఎత్తి చూపిస్తూ, “లోకంలో ఎక్కడైనా జుత్తుకి సహజమైన సువాసన ఉంటుందా? అలా ఉంటుందని అంటే ఎవ్వరైనా నవ్వరా?” అని సమాధానం చెబుతాడు.
దానికి ఈశ్వరుడు ఈ మాత్రం తెలీదా అన్నట్టు, “నీకు తెలీదేమో!జుత్తుకి సహజమైన సువాసన లేకపోవడమేమిటి? పార్వతీ దేవి జుత్తుకి సహజమైన సువాసన ఉంది. తెలుసా?” అని ఉదాహరణ చూపించి సమర్థించుకోబోతాడు.
అప్పుడు నత్కీరుడు,”పార్వతీ దేవికి ఉంటే ఉండొచ్చు. అంతమాత్రం చేత భూమి మీద స్త్రీలందరి జుత్తూ సహజ సువాసన ఉంటుందని చెప్పకూడదు. కోపం తగ్గు. దేవలోకంలో ఉన్న వస్తువులు భూమి మీద ప్రత్యక్ష ప్రమాణాలు కావుగదా.” అంటాడు.
దానికి శివుడు అలిగి, పెంకిగా,”నే నెవ్వరో తెలుసునా” అన్నట్టు తన నుదిటిమీద కన్ను చూపిస్తూ ఒక హస్తవిక్షేపం చేస్తాడు.
దానికి అంతకంటే పెంకిగా నత్కీరుడు “ఒక్క కన్నే కాదయ్యా.. నీ తలచుట్టూ కళ్ళున్నప్పటికీ, పద్యం తప్పుకాదని ఎవడూ అనడు. ఇక్కడ నీ మాయాప్రతాపాలు చెల్లవు,” అని అంటాడు.
దానికి శివుడు రుద్రుడై “నువ్వు కుష్టురోగంతో బాధపడు, ఫో!” అని శపిస్తాడు.
దానికి ఒక్కసారి తన హద్దులు తెలుసుకున్నవాడై, శివుడి పాదాలమీద పడి,”స్వామీ! పొరపాటయిపోయింది. పరమదయాళువివి నువ్వు. నాకు శాపవిమోచన మార్గాన్ని వివరించు,” అని వేడుకుంటాడు.
అప్పుడు ఈశ్వరుడు శాంతించి, “కైలాస శిఖరాన్ని చూసినప్పుడు నీకు శాపవిముక్తి అవుతుంది,” అని అంతర్థానం అవుతాడు.
జరిగినదానికి నత్కీరుడు విచారిస్తూ,”కవిత్వప్రమాణాలు కాపాడవలసిన భారాన్ని నేనెందుకు భుజాలకి ఎత్తుకున్నాను. ఈ శంఖపీఠంపై కూర్చున్న మిగతాకవులలాగే నేనూ నోరుమూసుకుని ఊరుకుంటే పోయేది గద. అనవసరంగా దేవునితో ఎందుకు వాదనకు దిగేను? ఈ కుష్టురోగాన్ని ఎలా భరించడం? ఎన్ని నదులు దాటాలి? ఎన్ని అడవులు తిరగాలి? ఎన్ని కొండలు ఎక్కాలి? ఎన్ని నిర్జనప్రదేశాల్లోంచి పోవాలి? ఇవన్ని దాటి నేను ఎప్పుడు కైలాస శిఖరం చూడగలుగుతాను? ఆ పేరు వినడం తప్ప ఎన్నడూ చూసి ఎరగనే” అని విచారిస్తూ ఉత్తరదిశగా బయలుదేరి వెళ్తాడు.
***
శివుడు నత్కీరుణ్ణి నిలదీసిన ప్రశ్నల ద్వారా, మనకి కవిత్వానికి ఒక లక్షణం, అందులో కొన్ని అలంకారాలూ, పదబంధాలూ, ఉండడమే గాక, అది రసనిష్యందంగా ఉండాలని తెలుస్తుంది. నిజానికి కవిత్వం స్వీయానుభూతినో, శ్రుతపూర్వమైన అన్యుల అనుభూతినో, ప్రతిబింబిస్తూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నత్కీరుడి అధిక్షేపణ ద్వారా, మరొక సూక్ష్మవిషయం తెలుస్తోంది. కవులు తమ స్వీయానుభవాలని సాధారణీకరించేటపుడు, ఆ అనుభూతికి ఆలంబనమైన వస్తువు మరొకరి అనుభూతి పరిధిలో లేకపోవచ్చునన్న సత్యాన్ని గుర్తెరిగి ఉండాలి. వెనకటికి ఒక శ్రీమంతుడు “దానికేముంది, కోడుగుడ్డంత బంగారం ఎవరిదగ్గరైనా ఉంటుంది” అన్నాడట. అలాగ తన అనుభూతి అందరి అనుభూతిగా, ప్రతీదీ సామాన్యీకరించకూడదు. ఆ అనుభూతి ప్రకటన తీరు “Suspension of Disbelief” కి ఆస్కారం ఇవ్వకపోతే, కొత్తవస్తువుగురించి చెప్పినపుడు రసభంగమవుతుంది.
ఈ నిబద్ధత ఒక్క సాహిత్యంలోనే కాదు, ప్రతివారికీ కొన్నికొన్ని విషయాలపట్ల తమకి తాము ఎన్నుకున్న నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధతకి పరీక్షాసమయం వచ్చినపుడు నిరూపించుకోకపోతే అది కేవలం ఆదర్శంగా మిగిలిపోతుంది. ఆ సందర్భం మన యజమానితోనో, మన పై అధికారితోనో, ప్రభుత్వానికి వ్యతిరేకంగానో రావచ్చు. శివుడి పద్యంలోని తప్పుని ఎత్తిచూపకుండా శంఖపీఠిమీది ఇతరకవుల్లా “నాకెందుకు?” అని తప్పించుకోవడం సాహిత్యంపట్ల వాళ్ళ నిబద్ధత లేకపోవడాన్ని సూచించినట్టు, పరీక్షాసమయంలో మన ఆదర్శానికి దన్నుగా నిలబడకపోవడం మన నిబద్ధతా రాహిత్యాన్ని సూచిస్తుంది. అయితే తప్పుని ఎత్తి చూపించేటప్పుడు, వ్యక్తి తన పరిధుల్నీ, పరిమితుల్నీ మరిచిపోకూడదు. ఒక్కొక్కసారి, వాదనలో మనం గెలిచామన్న సంతోషం (లేదా అహంకారం) మనచేత కొన్ని దురుసు మాటలు మాటాడిస్తుంది. దానివల్ల కొన్ని అనర్థాలు ఎదురౌతాయి. అటువంటి బలహీనతలకు మనం లోనుకాకూడదు. వాదనలో గెలుపు వ్యక్తిమీద గెలుపు కాదు. ఆ సందర్భంలో గెలుపు అన్నివేళలా మన గెలిచినట్టు కాదు. వాదనలో విభేదం ఒక విషయంలో అభిప్రాయభేదం తప్ప వ్యక్తులతో విభేదం కాదు. ఈ సున్నితమైన విషయాలు చాలా స్పష్టంగా మనకి అవగాహన అయి ఉండాలి.
మరొక్క విషయం, వాదనలో మనం ఓడిపోయినపుడు, చాలా ఉదాత్తంగా మన అపజయాన్ని అంగీకరించాలి తప్ప, శివుడిలా ఆ సందర్భానికి చెందని మన ప్రత్యేకతలూ, ప్రతాపాలూ చూపించకూడదు. అదే పని మన వాదో, ప్రతివాదో చేసినపుడు, అతను తన అపజయాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తించి, హుందాగా అక్కడితో ఆ వాదనని సమాప్తం చెయ్యాలి. లేకపోతే, సందర్భం గాడి తప్పుతుంది. We should allow the defendant to realize and digest his defeat; and, we should also know, that it takes time. We shall also behave the same way given our roles are reversed.
కవిత్వం ద్వారా వ్యక్తిత్వాలని ఉదాత్తం చేసుకోలేకపోతే, కవులకీ సామాన్యులకీ తేడా ఏమిటి?
***
(పద్యాలు చదవాలనుకుంటున్న వాళ్ళకి మచ్చుకి కొన్ని:
దానికి నవ్వుచు నృపసభ
లో నత్కీరుండు పలికె “లోకము నగదే
పూనుకొని సహజ గంధము
వేనలికిం గలదటన్న వేయి దెరగులన్!”
“తప్పిది, చెప్పరాదు, కవితా సమయంబున కొప్పుగాదు, నీ
విప్పగిదిన్ రచింప దగునే?” యన, విప్రుడు చిన్న వోయి, “నా
కప్పరమేశ్వరుండు వసుధాధిపుపై రచియించి యిచ్చినా,
డొప్పును దప్పు నేనెరుగ, నుత్తములార!” యటంచు గ్రమ్మరన్.
వచ్చి పార్వతీసు వంక కనుంగొని
అతని పద్య మతని కప్పగించి
నిన్ను నమ్మిపోయి నిండిన సభ సిగ్గు
చెడితి ఉన్నకథలు వేర చెప్పనేల?
“తానెరిగిన విద్య నృపా
స్థానములో నెరపంగ కీర్తి సమకూరుంగా
కే నరునకు బరవిద్యా
ధీనత భూపాల సభల దేజము గలదే?”
“నీ మాట నమ్మి పోయిన
నా మోసము జెప్పనేల? నత్కీరునిచే
నే మాట పడ్డ దుఃఖము
క్షామ వ్యధ కొలది గాదు, సద్భక్త నిధీ!”
అని మరియు నిట్లనియె..
నా భాగ్యం బిటులుండగా దుది నిను నత్కీరునిం దూరగా
నే భావ్యం? బిక జాలు, నిక్కరవుచే నిట్లైతి నెందైన గా
నీ భైక్షంబున గుక్షి బ్రోచుకొని, దీనిం దీర్చి నేవత్తు, దే
వా! భద్రంబగు నీకు, నన్ననుపవే?” యన్నం గృపా మూర్తియై.
కట కట! యన్నత్కీరుం,
డట! కవితయు దప్పు వట్టె నట! యటు పదమీ
యెటువలెనో తెలిసెద?” నని,
నిటలాక్షుడు వచ్చి కుంభినీపతి సభలోన్.
ఈ రాజన్యునిమీద నే కవిత సాహిత్యస్ఫురన్మాధురీ
చారుప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు పాటించి న
త్కీరుండూరక తప్పువట్టెనట యేదీ లక్షణంబో,అలం
కారంబో,పదబంధమో రసమొ చక్కంజెప్పుడాతప్పనన్.
అనవుడు, నా నత్కీరుడు
మునుపటి వలె దప్పటన్న ముక్కంటియు వా
ని కనియెన్, “గిరితనయా
ఘన కచభారంబు సహజగంధం” బనుచున్.
“అగజకు నైనం దగు, నిల
మగువలకుం దగదు, మాను మత్సరమింకన్,
గగన ప్రసూన వాదము
జగతిం బ్రత్యక్షమునకు సరి యన దగునే?”
“లూలామాలపు మాటలు
చాలు” ననిన నలిగి, తన నిజంబగు రూపం
బాలోన జూపవలె నని,
నీలగ్రీవుండు నిటల నేత్రము జూపన్.
“తల చుట్టువార గన్నులు
గలిగిన బద్యంబు దప్పు గాదన వశమే
వల దిచ్చట నీ మాయా
విలసనములు పనికి రావు విడువు” మటన్నన్.
శపియించెం బ్రతి భాషల
గుపితుండై రుద్రుడతని “గుష్ఠ వ్యాధిం
దపియింపు” మనుచు దానికి
నపరిమిత భయమ్మునంది యతడిట్లనియెన్.
“స్వామీ ద్రోహము జేసితిం, దెలుపవే శాపాంత ముద్యత్కృపా
ధామా! నా” కనుచున్ బదాబ్జముల మీదం బడ్డం, ఆ భక్త ర
క్షామందారుడు శాంతి బొంది యనియెం “గైలాస శైలంబు గం
టే మానుం బద” మన్న, నందులకు దా డెందంబునం గుందుచున్.
“ఈ కవితాభి మానము వహించితినేటికి? శంఖపీఠిపై
నీ కవులున్నయట్లు వసియింపక దేవునితోడ నేల చా
ర్వాక మొనర్చితిం? గడు భరంబగు కుష్ఠరుజా విషాద మే
నే కరణిన్ ధరింతు? నిక నెన్నడు చూచెద వెండి గుబ్బలిన్?”
ఎన్ని మహానదుల్, వనములెన్ని, గిరీంద్రము లెన్ని బోయవీ
ళ్ళెన్ని, మృగంబులెన్ని, జనహీనములైన పథంబులెన్ని నే
నిన్నియు దాటి ఏ కరణి ఈశ్వరు శైలము చూడబోయెదన్
కన్నదిగాది విన్నయది గాని సదాశివ ఏమి చేయుదున్.
----------------------------------------------------------
రచన- నౌడూరి మూర్తి,
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో
No comments:
Post a Comment