Friday, January 31, 2020

కొత్తవరవడి


కొత్తవరవడి




సాహితీమిత్రులారా!

ఆరుద్రగారి కవిత ఆస్వాదించండి-

కవిత కోసమె నేను పుట్టాను
క్రాంతికోసము కలము పట్టాను
ఎండమావులు చెరిపి పండువెన్నెల నిలిపి
గుండెవాకిలి తలుపు తట్టాను

మందికోసము గుడిని కట్టాను
మమతలన్నీ ముడుపు కట్టాను
అగుపడని దైవం ఆరగించదు సుమ్ము
అందుకే అవి పంచిపెట్టాను

పంచవన్నెల చిలుక పట్టాను
పంజరంలో అదిమి పెట్టాను
పక్షిలా నాగుండె పరితపించుచు మండె
పంజరాలను పగులగొట్టాను

ముళ్ళలో ఒక పువ్వు చూశాను
మోజుపడి అది తుంచివేశాను
గుచ్చుకొన్నదా ముల్లు విచ్చుకొనదా పువ్వు
పూలుకోయుట విడిచి పెట్టాను

నీటిలో ఒక నీడ చూశాను
నీడకై గాలమ్ము వేశాను
చిక్కలేదొక మీను చిక్కుకున్నది నేను
చింపి వలలను పారవేశాను

మందికోసం నడుం కట్టాను
మంచి కోరుచు కేక పెట్టాను
మందుడొక్కడు లేచె మంచితనమును తూచె
మలుపుదారిని తేతు పట్టాను

అద్దమందున నిజము చూశాను
అద్దాని కై  దారికై వేశాను
అనుసరించిన జనత అలసిపోవుటచేత
మనసులో నిట్టార్చి వగచాను

నిన్ను నాలో కలుపుకొన్నాను 
నన్ను నేనే తెలుసుకున్నాను
కోర్కెనై వెలుగునై కొమరాల జిలుగునై 
కొత్తవరవడి మొదలు పెట్టాను.
(ఆరుద్ర రచనలు / కవితలు) 
(విపుల సంకలనం - 1985)

Wednesday, January 29, 2020

సౌందర్యాధిదేవత


సౌందర్యాధిదేవత




సాహితీమిత్రులారా!

ఫారశీ భాషలో ఫిరదౌసీ వ్రాసిన షాఃనామా-లోని
కవిత ఇది. దీన్ని దాశరథిగారు తెనిగించారు.

యవనికాభ్యంతరమ్మున యువతి మోము
భాను బింబంబుకన్నను భాసురమ్ము
కొమ్మ, సొగసైతయేన్గుదంతమ్ము బొమ్మ!
తరణి తనువల్లి మహితమందారవల్లి


నెలత బుగ్గలు లేతదానిమ్మ పూలు
ఆమె పెదవులు జ్వలియించు అగ్నిశిఖలు
పడతి చనుదోయి రజత కుంభమ్ములౌర!
కనులు కాటుకపిట్ట రెక్కలను బోలు

ఆమె మైతావి కస్తూరినతిశయించు
గొలుసు గొలుసులు గొలుసులు వెలది కురులు
కాంత పదివ్రేళ్లు పదివెండి కలములౌర!
ఎవరి ఫాలాన నేమి లిఖించగలవొ!

చందమామపై కస్తూరి చల్లినపుడు
ఎవ్వరైనను చూచిరో! యే నెఱుంగ,
నా చెలియ మోముపై వ్రాలి నాట్యమాడు
నీలి కురులను చూడ రారేమి మీరు?
                                                                              (ఆలోచనాలోచనాలు నుండి)

Monday, January 27, 2020

తాటాకు బొమ్మలాట


తాటాకు బొమ్మలాట




సాహితీమిత్రులారా!

ఇది శ్రీశ్రీ వ్రాసిన కవిత
పోయెట్రీ వర్క్ షాప్ నుండి
తీసుకోవడం జరిగింది.

తాటాకు బొమ్మలాట
తాటాకు బొమ్మరింట 
దాగున్న సూరీడా!-

       ఆరని కంటి నీరే 
       ఏరయి పారే వేళా
       ఊగని ఉయ్యాలగా - నా
       ఒడిలో నిదురపోరా!

తాటాకు బొమ్మరింట 
దాగున్న సూరీడా!
నా చిట్టి సూరీడా!

      జోలపాడే కన్నీరే ఈ
      లోకాలె చీకటాయె ఆ
      ఎండమావి అలగా జనం

      గాయపడ్డ మా మనసే
      ఆరని కొరివాయె
      తూలిపడ్డ ప్రజలకే
      కూడు నీడ కరువాయె
      బీడు పడ్డ నేలమీద
      వానచినుకు పడదాయె

అమ్మచేతి మందారం నా
అందమైన బంగారం

       చెందామర చేరువైన
       ముచ్చటైన మూలధనం

నీరులేని మేఘం వచ్చి 
నెత్తురే చిందెనురా!
అన్నం లేని బాననిండా
కన్నీరే పొంగెనురా!


Saturday, January 25, 2020

కప్పిచెప్పువాడు కవి


కప్పిచెప్పువాడు కవి 




సాహితీమిత్రులారా!

ముకుందవిలాసంలోని ఈ పద్యం గమనించండి-
ఇది భద్రాదేవి కన్నులను గురించి చెప్పే పద్యం.

ఒకయేటఁ జిక్కె మీనము
నొకనెలకేఁ చిక్కెఁ పద్మమొక పగటింటన్
వికలతఁ జిక్కెంగుముదము
టకి నయనసమంబులగునె జడగతులెపుడున్
              (ముకుందవిలాసము - 1-219)
భద్రాదేవి నేత్రసామ్యాన్ని పొందటానికి
చేప, తామర, కలువ ప్రయత్నించాయట.
దానిలో చేప ఒక ఏట (సంవత్సర కాలంలో)
కృశించిపోయిందట.
తామర ఒక నెలలోనే చిక్కిపోయిందట.
కలువ ఒకరోజులోనే చిక్కిపోయిందట.
కావున అవి భద్రాదేవి నయన సామ్యం
పొందలేక పోయాయని తెలుస్తున్నది.

కానీ దీనిలోని అసలు అర్థం అదికాదట -
మరి ఎలా అంటే -

చేప ఏటిలో(నదిలో) చిక్కిపోయిందట
తామర ఒక నెలకే చిక్కె (వెన్నెలలో) చిక్కిందట
(అంటే వెన్నెలలో తామర ముడుచుకు పోతుంది)
కలువ ఒక పగటింట(పగలులో) చిక్కెనట
(అంటే పగలు సూర్యుని వెలుతురులో
కలువ ముడుచుకుపోతుంది) ఈ విధంగా అవి
భద్రాదేవి నయనాల సామ్యం కాలేక పోయినవట.
చిన్న పదాల విరుపుకూడాకాదు పునరుక్తిచే
చమత్కరించారు ఈ కవి కాణాదం పెద్దనామాత్యుడు.

Thursday, January 23, 2020

భృంగ పంచకం


భృంగ పంచకం


సాహితీమిత్రులారా!

తెలుగులో భృంగ పంచకం పేరుతో ఐదు పద్యాలున్నాయి. ఇవి ఎవరు రాశారో తెలీదుగానీ, శ్రీనాథుడని కొందరి అభిప్రాయం. ఈ ఐదు పద్యాల చుట్టూ మాంచి కత కూడా అల్లిపెట్టారు మన పూర్వులు. కథలో కెళితే.....

పూర్వం ఒక మహారాజుకు సౌందర్యవతి అయిన భార్య ఉండేది. రాజులకు అనేక మంది భార్యలు ఉండటం సహజం వారిలో ఈవిడ చిన్నదిగా అనుకోవచ్చు. మహారాజు వల్ల పూర్తి చెందక మదనజ్వరంతో వేగిపోతోంది. ఆ రాజ్యంలో మంత్రి ముసలివాడు కావడంతో, అతని కుమారుని ఆపదవిలోకి నియమించాడు రాజు. కొత్తమంత్రి మంత్రాంగనిపుణుడేకాదు అసాధారణ సౌందర్యవంతుడు. రాణిగారి కన్ను ఇతనిపైబడింది. చాతుర్యధుర్యయైన చేటికచేత రాయబారాలు నడిపింది.  అతడేమి తక్కువవాడా! వచ్చిన అవకాశాన్ని వదులుకొనే అరసికుడా! వచ్చిన చిక్కల్లా ఆమెతో సంగమం ప్రమాదకరం కావున జాగ్రత్తగా వ్యవహరించాలి. "కామాతుకాణాం నభయం నలజ్జ" అనికదా! కామాతురత భయాన్ని దాటి పురికొల్పింది. చీకటి పడిన తరువాత రాణిదూతిక ఏర్పరచిన సంకేతాన్ని అనుసరించి, ఆమె భవనానికి చేరుకున్నాడు. మదనక్రీడా పారవశ్యంలో వారికి సమయం తెలియలేదు.
ఇంతలో మహారాజు నెమ్మదిగా తన భవనం నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నాడు. ఆరోజు సప్తమో? అష్టమో ?చంద్రుడుకూడా ఆలస్యంగా ఉదయించాడు. ఈ పరిస్థితి చూచిన చెలికత్తె

తుమ్మెదపై పెట్టి అన్యాపదేశంగా మంత్రిని హెచ్చరించింది.
మాయురె భృంగమా! వికచమల్లికలన్ విడనాడి తమ్మిలో
నీయెడ పూవుదేనియల నింపు జనింపగ గ్రోలి సొక్కియున్
బోయెదనన్న భ్రాంతి నిను బొందదు రాజుదయించె నిప్పుడే
తోయజపత్రముల్ వరుసతో ముకుళించె జలింపకుండుమా!

(ఈ పద్యం పైకి కనిపించే భావం - ఓ తుమ్మెదా మంచి మల్లెలను విడచి తామరపువ్వులోని మకరందం మీదమోజుతో ఇక్కడ చేరావు. ఎంసేపటికీ విడిచిపెట్టి వెళ్ళిపోదామని అనుకోవడంలేదు. చంద్రుడు ఉదయించినాడు. తామరరేకులు ముడుచుకుంటున్నవి. ఇప్పుడు బయటికి పోలేవు. కదవిక లేకుండా జాగ్రత్తగా ఉండు.
దీనిలోని ధ్వని(ఆంతర్యం)- ఓ మంత్రిశేఖరా నీ భార్యను విడిచి, రాణితో క్రీడిస్తూ ఆలస్యం చేశావు. ప్రభువు వస్తున్నాడు. (రాజు - ప్రభువు, చంద్రుడు). అయినా భయపడక దాక్కో.)

లోపల ఉన్న ఇద్దరూ ఈ హెచ్చరికతో జాగ్రత్తపడ్డారు. ఈ పద్యం విన్న మహారాజుగారు చెలికత్తెను ప్రశ్నించగా. ఆమె తామరలను చూచి చెప్పానని చమత్కరించింది.
మంత్రి దాగినచోటు ఇరుకు, గాలి లేదు. బాధతో అటూ ఇటూ కదులుతున్నాడు. మహారాజు ఆ సంగతి కనిపెడితే ప్రమాదమని చెలికత్తె చతురిక మళ్ళీ ఇలా హెచ్చరించింది.

అలికులవర్య! పద్మముకులాంతమందు వసింప నేరమిన్
జలనము సెందె దేమి నవసారసమిత్రుడు రాకయుండునా
తొలగక యందె యుండు మిక తోయజవైరి తిరంబె రాత్రి యీ
కలవర మేల తుమ్మిదను గానక యూరట యురకుండుమా!

(తుమ్మెదా! ముకుళితమైన తామరలో ఉండలేక కదులుతున్నావెందుకు! ఈ చంద్రుడు స్థిరమా? సూర్యుడు రాకుండా ఉంటాడా? కలవరపడక ఊరటతో ఊరుకో.
మంత్రి పరంగా- ఓ మంత్రివరా! నీవు దాక్కొన్న ఇరుకు ప్రదేశంలో ఇబ్బందిగా ఉండవచ్చు స్థిరంగా ఉండు ఆయన వెళ్ళిన తరువాత ఒంటరి సమయం వస్తుంది. అప్పటిదాకా సద్దుచేయక జాగ్రత్తగా ఉండాలి.)

ఆ మాటలు విని మంత్రి ధైర్యంతో, ఓర్పుతోవేచి ఉన్నాడు. అతని ఇంటి దగ్గర ధర్మపత్ని ఇతని గురించి ఆందోళన చెంది, రహస్యంగా వాకబు చేసింది. భర్త వ్యవహారాలు ఆమెకు కొంత తెలుసు. రాణిగారి ఇంటికి వెళ్ళాడని తెలిసి, అక్కడ ఏమి ప్రమాదం వచ్చిందో అని ఆదుర్దాగా బయలుదేరి వచ్చింది. ఆమె వచ్చి బయటపడి విచారణ చేస్తే గుట్టు రట్టవుతుందని చతురిక ఆమెకు ఇలా చెప్పింది.

అలినీ తత్తరమేల నేడు నిదె నీ యాత్మేశుడౌ భృంగమున్
జలజాసక్త మకరంద పానవశతన్ సానందుడై యున్న వా
డులు కింతేనియు లేక నీ వరుగుమీ యొప్పారు నిప్పాట నీ
చెలువుండుం బరతెంచు వేకువను రాజీవంబు పుష్పించినన్

(ఆడు తుమ్మెదా నీ భర్త పద్మినీ మకరందపాన వివశుడై ఉన్నాడు.
ఆనందంలో మునిగి ఉన్నాడు. నీవు భయపడవద్దు. తెల్లవారి రాజీవం విచ్చుకోగానే,
నీ నాథుడు వస్తాడు. ప్రస్తుతానికి నెమ్మదిగా వెళ్ళిపో.)

మంత్రి భార్యకు జరిగింది అర్థమై వెళ్ళిపోయింది.
రాజు రాణితో మదనకేళిలో తేలి, అలసి నిద్రించాడు. రాణికూడా ఆ స్థితికే వెళ్ళింది. తెల్లవార వచ్చింది.
ఇక దాక్కున్న మంత్రి వెళ్ళిపోవటానికి అవకాశం వచ్చిందని చతురిక మంత్రికి అర్థమయ్యేలా
ఈ విధంగా అన్నది.

పతి నిద్రించిన వేళ రా దగునయో పద్మారి! యీ కేళికా
యతనంబందు రతిశ్రమ న్విభుడు నిద్రాసక్తుడై యుండె నీ
శత పత్రేక్షణ మోము వాంచినది నీసామర్ధ్యముం జూపదో
కతి వేగంబుగ నేగుమా తొలగి మాయాత్మల్ సుఖం బందగన్

ఈ పద్యభావాన్ని గ్రహించిన, మంత్రి జాగ్రత్తగా ఇవతలకు వచ్చి వేగంగా వెళ్ళిపోయాడు.
మరునాటి ఉదయం అవసరమైన రాచకార్యాలు ఉండటంవల్ల విశ్రాంతి తీసుకోకుండానే
హడావిడిగా మంత్రి కొలువుకూటానికి వెళ్ళాడు. మహారాజు పేరోలగంలో ఉన్నాడు. పైనున్న
తెరల చాటున నుంచి రాణి చూస్తూంది. కొలువుకు వచ్చే తొందరలో మంత్రి ముందురోజు రాత్రి
ప్రేమావేశంలో రాణి తన మెడలో వేసిన పచ్చల హారాన్ని తీసి దాచకుండా అలాగే వచ్చాడు.
దాన్ని రాజు చూస్తే గుర్తుపడతాడు. ప్రమాదం. రాణి కలతచెంది ఈ అపాయాన్ని ఎలాగైనా
తొలగించమని చెలికత్తెను కోరింది. చతుర అయిన చతురిక మారువేషంతో ఒక భట్టువలె వచ్చి,
ఆస్థానమంతా కలయజూచి ఈ పద్యం చదివింది.

అతుల సంభాంతరస్థిత బుధవళి కెల్ల జొహారు, వీరరా
హతులకు మేల్జొహారు, సతతోజ్జ్వల విక్రమ సార్వభౌమ సం
తతికి జొహారు, వైభవవితాన పురందరుడైన యట్టి భూ
పతికి జొహారు, మానపరిపాల జొహారు ప్రధాని శేఖరా!

అందరినీ స్తోత్రం చేసినట్లు కనిపించినా తనను ప్రత్యేకంగా మానపరిపాల అనటం మంత్రికి
పట్టిచ్చినట్లుగా ఉంది. భట్టును చూసి చతురిక అని గ్రహించి, తనను చూసుకొని,
తడుముకొని, పచ్చల హారాన్ని గురించి తెలుసుకొని, మెడలో నుంచి
ఇతర హారాలతో దాన్నీ కలిపి బయటకు కనబడకుండా తీసి, కవిత్వానికి సంతోషించి
ఇస్తున్నట్లుగా కుహనాభట్టుకు బహూకరించాడు. మిగతావారు,
రాజు ఏవో బహుమతులిచ్చి పంపారు.
ఈ ఐదు పద్యాలలో ఇమిడిన అందమైన కథ ఇది. 

Tuesday, January 21, 2020

విశ్వగుణాదర్శం - వేంకటాధ్వరి


విశ్వగుణాదర్శం - వేంకటాధ్వరి




సాహితీమిత్రులారా!

18వ శతాబ్దిలో నివసించిన వేంకటాధ్వరి రచించినది విశ్వగుణాదర్శం.
ఇది ఒక చంపూకావ్యం. ఇందులో హిమాలయాల్లోని బదరికాశ్రమం నుండి
మొదలై సేతువువరకు గల విష్ణుక్షేత్రాలను గురించిన, తీర్థాలను గురించిన వివరాలను వర్ణణాత్మకంగా వివరింపబడింది. దీనిలో కృశాను, విశ్వావసులనే ఇద్దరు గంధర్వులు, విమానారూఢులై దేశపర్యటన చేస్తున్నప్పుడు  జరిగిన సంభాషణల రూపంలో ఈ విశేషణాలన్నీ ఉంటాయి. అందులోనూ, శేషశైలం(తిరుపతి కొండ) మొదలుకొని, సేతువు పర్యంతం విస్తరిల్లిన ప్రదేశాలన్ని విపులంగా, వివరంగా వేంకటాధ్వరి వీక్షించాడు.

దక్షిణభారదేశంలోని ప్రజల ఆచారవ్యవహారాలు, సాంఘికరీతులు, రాజకీయ ధోరణులు, మతవ్యవహారాలు, దేశవ్యవస్థను గురించి కూడ రచయిత చెప్పాడు. చెన్ననగరాన్ని వర్ణించే సందర్భంలో, తిరువళ్లిక్కేణిలో వెలసిన పార్థసారథిని గురించి ప్రస్తావించాడు. ఆ సందర్భంలోనే, ఆనాటి ఆంగ్లేయ పాలకుల, పరివాలనా విధానాన్ని
గురించి చెప్పాడు. హూణులు శౌచాది క్రియాహీనులని విమర్శించాడు.
ఈస్టిండియా కంపెనీవారి పాలన చెన్నపట్టణంలో జరుగుతున్న సమయంలో
ఈ గ్రంథం వెలువడినట్లు తెలుస్తుంది.

ఈ గ్రంథాన్ని 1914లో కామేశ్వరరావు, 1915లో ఏ. దేవరాజు పెరుమాళ్ళు,
1877లో తాతాచార్యులు, 1917లో వేంకటరామకృష్ణకవులు
ఆంధ్రానువాదం చేసివున్నారు.

దీనిలోని ప్రారంభ శ్లోకం ఇక్కడ చూద్దాం-

స్రగ్ధర -
శ్రీరాజీవాక్ష వక్షఃస్థలనిలయ రమాహస్తవాస్తవ్య లోల
ల్లీలాబ్జానిష్పతన్తీ మధురమధుఝరీ నాభిపద్మే మురారేః
అస్తోకంలోకమాత్రాద్వియుగముఖశిశోరాననేష్వర్ప్యమాణం
శఙ్ఖప్రాన్తేనదివ్యంపయఇతివిబుధైశ్శఙ్క్యమానాపునాతు

శ్రీమహావిష్ణువు వక్షస్థలనివాసి అయిన శ్రీమహాలక్ష్మి తన చేతిని విలాసార్థముగా ధరించిన తామరపువ్వులోని నుండి జారుచున్న తేనెధారను ఆ లక్షీదేవి తన పతిఅయిన విష్ణువునాభికమలమున తన బిడ్డయైవుండు బ్రహ్మనోట సంకు(శంఖు)తో పోసే పాలు అని
దేవతలు తలుచుకొనేట్లు ఆ మకరందధారయే ఈ కావ్యమును దీన్ని
చదివే చదువరులను పవిత్రం చేయుగాక అని మంగళాశీర్వాదం ఇస్తున్నాడు కవి..

ఎంతటి ఊహోకదా!

Sunday, January 19, 2020

వందేమాతర గీతం కథేంటి?


వందేమాతర గీతం కథేంటి?


Bankimchandra Chattapadhay.jpg

సాహితీమిత్రులారా!

వందేమాతర గీతం అంటే
తెలియనివారుండరంటే
పెద్దవింతేమీకాదనుకుంటా
 దీనివెనుక కథ తెలినివారు
చాలమందే వుండవచ్చు. అసలు అదేవరు ఎందుకు వ్రాశారు
ఇది మన జాతీయగీతం/పాట. దీన్ని బంకించంద్ర చటర్జీగారు వ్రాశారు.
అదెలా జాతీయగీతంగా మారింది అంటే దానివెనుకు కథ వుంది.
1838 జూన్ 27న ఈయన జన్మించారు. ఈయన సాహితీ వ్యాసంగమంతా ఒక ఎత్తయితే ఒక వందేమాతరగీతం ఒక ఎత్తు. ఆయనకు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. దీన్ని విడిగా ఒక పాటగా వ్రాయలేదు. దేశభక్తిని ప్రబోధించే ఒక నవల ఆనందమఠం(1882) అనేది. 1773లో బెంగాల్లో చెలరేగిన కరువు, ఒక సంతాలీల ముఠా ఆంగ్లేయుల నెదిరించి ఖజానాలు దోచుకోవడం ఈ నవల్లోని ఇతివృత్తం. దీనిలో సాధువులు దేశమాతను కొలిచే సందర్భంలో వందేమాతం గీతంగా వ్రాయబడింది.

ఆకాలంలో ఈ నవలను  చదివిన 
ఎందరో స్వాతంత్య్రం పట్ల ఆకర్షింతులై
ఉద్యమాల్లో పాల్గొన్నారు. దీనివల్ల ఇది చాల ప్రముఖమైన
దేశభక్తి గేయంగా మారింది. దీనితో వందేమాతర ఉద్యమంకూడా వచ్చింది.
తరువాతి కాలంతో మన స్వాతంత్య్రం రావడం మన రాజ్యాంగ నిర్మాతలు
దీన్ని జాతీయ గేయంగా గుర్తించడం జరిగింది.