విశ్వగుణాదర్శం - వేంకటాధ్వరి
సాహితీమిత్రులారా!
18వ శతాబ్దిలో నివసించిన వేంకటాధ్వరి రచించినది విశ్వగుణాదర్శం.
ఇది ఒక చంపూకావ్యం. ఇందులో హిమాలయాల్లోని బదరికాశ్రమం నుండి
మొదలై సేతువువరకు గల విష్ణుక్షేత్రాలను గురించిన, తీర్థాలను గురించిన వివరాలను వర్ణణాత్మకంగా వివరింపబడింది. దీనిలో కృశాను, విశ్వావసులనే ఇద్దరు గంధర్వులు, విమానారూఢులై దేశపర్యటన చేస్తున్నప్పుడు జరిగిన సంభాషణల రూపంలో ఈ విశేషణాలన్నీ ఉంటాయి. అందులోనూ, శేషశైలం(తిరుపతి కొండ) మొదలుకొని, సేతువు పర్యంతం విస్తరిల్లిన ప్రదేశాలన్ని విపులంగా, వివరంగా వేంకటాధ్వరి వీక్షించాడు.
దక్షిణభారదేశంలోని ప్రజల ఆచారవ్యవహారాలు, సాంఘికరీతులు, రాజకీయ ధోరణులు, మతవ్యవహారాలు, దేశవ్యవస్థను గురించి కూడ రచయిత చెప్పాడు. చెన్ననగరాన్ని వర్ణించే సందర్భంలో, తిరువళ్లిక్కేణిలో వెలసిన పార్థసారథిని గురించి ప్రస్తావించాడు. ఆ సందర్భంలోనే, ఆనాటి ఆంగ్లేయ పాలకుల, పరివాలనా విధానాన్ని
గురించి చెప్పాడు. హూణులు శౌచాది క్రియాహీనులని విమర్శించాడు.
ఈస్టిండియా కంపెనీవారి పాలన చెన్నపట్టణంలో జరుగుతున్న సమయంలో
ఈ గ్రంథం వెలువడినట్లు తెలుస్తుంది.
ఈ గ్రంథాన్ని 1914లో కామేశ్వరరావు, 1915లో ఏ. దేవరాజు పెరుమాళ్ళు,
1877లో తాతాచార్యులు, 1917లో వేంకటరామకృష్ణకవులు
ఆంధ్రానువాదం చేసివున్నారు.
దీనిలోని ప్రారంభ శ్లోకం ఇక్కడ చూద్దాం-
స్రగ్ధర -
శ్రీరాజీవాక్ష వక్షఃస్థలనిలయ రమాహస్తవాస్తవ్య లోల
ల్లీలాబ్జానిష్పతన్తీ మధురమధుఝరీ నాభిపద్మే మురారేః
అస్తోకంలోకమాత్రాద్వియుగముఖశిశోరాననేష్వర్ప్యమాణం
శఙ్ఖప్రాన్తేనదివ్యంపయఇతివిబుధైశ్శఙ్క్యమానాపునాతు
శ్రీమహావిష్ణువు వక్షస్థలనివాసి అయిన శ్రీమహాలక్ష్మి తన చేతిని విలాసార్థముగా ధరించిన తామరపువ్వులోని నుండి జారుచున్న తేనెధారను ఆ లక్షీదేవి తన పతిఅయిన విష్ణువునాభికమలమున తన బిడ్డయైవుండు బ్రహ్మనోట సంకు(శంఖు)తో పోసే పాలు అని
దేవతలు తలుచుకొనేట్లు ఆ మకరందధారయే ఈ కావ్యమును దీన్ని
చదివే చదువరులను పవిత్రం చేయుగాక అని మంగళాశీర్వాదం ఇస్తున్నాడు కవి..
ఎంతటి ఊహోకదా!
No comments:
Post a Comment