Saturday, January 25, 2020

కప్పిచెప్పువాడు కవి


కప్పిచెప్పువాడు కవి 




సాహితీమిత్రులారా!

ముకుందవిలాసంలోని ఈ పద్యం గమనించండి-
ఇది భద్రాదేవి కన్నులను గురించి చెప్పే పద్యం.

ఒకయేటఁ జిక్కె మీనము
నొకనెలకేఁ చిక్కెఁ పద్మమొక పగటింటన్
వికలతఁ జిక్కెంగుముదము
టకి నయనసమంబులగునె జడగతులెపుడున్
              (ముకుందవిలాసము - 1-219)
భద్రాదేవి నేత్రసామ్యాన్ని పొందటానికి
చేప, తామర, కలువ ప్రయత్నించాయట.
దానిలో చేప ఒక ఏట (సంవత్సర కాలంలో)
కృశించిపోయిందట.
తామర ఒక నెలలోనే చిక్కిపోయిందట.
కలువ ఒకరోజులోనే చిక్కిపోయిందట.
కావున అవి భద్రాదేవి నయన సామ్యం
పొందలేక పోయాయని తెలుస్తున్నది.

కానీ దీనిలోని అసలు అర్థం అదికాదట -
మరి ఎలా అంటే -

చేప ఏటిలో(నదిలో) చిక్కిపోయిందట
తామర ఒక నెలకే చిక్కె (వెన్నెలలో) చిక్కిందట
(అంటే వెన్నెలలో తామర ముడుచుకు పోతుంది)
కలువ ఒక పగటింట(పగలులో) చిక్కెనట
(అంటే పగలు సూర్యుని వెలుతురులో
కలువ ముడుచుకుపోతుంది) ఈ విధంగా అవి
భద్రాదేవి నయనాల సామ్యం కాలేక పోయినవట.
చిన్న పదాల విరుపుకూడాకాదు పునరుక్తిచే
చమత్కరించారు ఈ కవి కాణాదం పెద్దనామాత్యుడు.

No comments:

Post a Comment