గోడలు
సాహితీమిత్రులారా !
కళ్ళుతెరిచేసరికి సన్నగా అర్ధం కాని నొప్పి .
ఎక్కడనేది కూడా స్పష్టంగా లేదు. కణతలు రుద్దుకుంది అనాలోచితంగా.
రాత్రి ఎప్పుడు నిద్ర పట్టిందో ఎప్పుడు మెళుకువగావుందో తెలీని స్తితిలో ఎప్పుడు తెల్లవారిందో గమనించనే లేదు.
ఒక్క క్షణం ఎక్కడవున్నదీ అంతు పట్టలేదు.
కళ్ళుతిప్పి గదినంతా ఓసారి పరికించింది.గట్టిగా కాళ్ళు చాపుకుందుకు కూడా లేని నాలుగు మూరల వెడల్పు మరో నాలుగు మూరలెక్కువున్న పొడవులోవున్న చీకటి కొట్టది.
చీకటి కొట్టు ......
అవును ఎన్నిసార్లు అమ్మను విసుక్కోలేదు...ఈ చీకటి కొట్టునించి బయటకు వెళ్తామా? అని...
కాని ఇప్పుడా చీకటికొట్టే సుఖంగా తోస్తోంది.
తొలిసంపాదన చేతికందగానే ఎవరైనా చీరో సారో నగో కొంటారు కాని తను మాత్రం ఎంతో ఇష్టపడి కొనుక్కున్నది... మంచి అద్దం.
దాని ఖరీదువిని తల్లి బుగ్గలునొక్కుకున్నా లెఖ్ఖచెయ్యలేదు.
అమ్మకు ఎలా చెప్పాలి మసక బారి, ఓ పక్క పగిలిపొయి మిగిలిన అద్దం పెంకులో ఎప్పుడు చూసుకున్నా కనిపించేది అయితే ఓ కన్ను లేదూ ఓ వైపు సగం చెక్కిలి ,కాస్త చెవి భాగం ...కాదంటే బొట్టు పెట్టుకుందుకే పనికి వచ్చేది.
ఎప్పుడన్నా సరదా పడి కాస్త దూరంగా పెట్టిమొహం చూసుకుందామన్నా కనిపించేది ఓ జీభూతం మాత్రమే.
అందరూ అంటారు తనెంతో అందంగావుంటుందని.
ఒక్కసారి తనివితీరా చూసుకుందామన్నా అద్దమైతే కొనగలిగింది కాని , అరచెయ్యంత కిటికీ లోంచి వెలుగు వెల్లువనెలా రప్పించగలదు....అద్దాన్ని ఇటుతిప్పి అటు తిప్పి ఉహు ..ఏం లాభం లేకపోయేది.
అందుకే ఆశ ఆశగానే మిగిలిపోయింది.
అప్పుడో ఇప్పుడో తల్లిమీద విరుచుకు పడేది...
"ఈ పశువుల కొట్టం నించి విముక్తి లేదా? వేరే ఇంటికి వెళ్ళిపోదామని"
" నోరుమూసుకో ... ఇక్కడ నీబాబు సంపాయించి కుప్పలు కుప్పలు పెట్టిపోయాడా .. ఎంత అద్దె పొయ్యాలి వేరే ఇల్లంటే ..
మాటలా?"
అయినా తను గొణుగుతూనేవుండేది.
ఇంటివాళ్ళింట్ళొ అమ్మ వంటచేస్తుంది ..అందుకే అద్దెలేకుండా ..ఈ చిన్న గది ఇచ్చినది.
పూర్వం ఇక్కడ వాళ్ళు గేదెనో కుక్కనో కట్టేసివుంటారనడానికి ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.
ఎన్నిసార్లు అమ్మ తననూ తోడు తీసుకెళ్ళాలని ప్రయత్నించలేదు?
ఉహు ..పడనిచ్చివుంటే ఈపాటికి వంటలక్కగా...
ఓ రకంగా అదే బాగుండేదేమో..
ఆ ఇంట్లో రాత్రి గడపడమే నరకంగావుంటే పగలల్లాకూడా...
తల్లీ కూతుళ్ళూ ఇరుక్కుని రాత్రంతా ఆగదిలో పడుకోవడం.. నరకమే వేలుకదిపే వెసులుబాటుకూడ వుండదు.. ఏవైపు పడుకుంటే ఆవైపు తిమ్మిరెక్కిపోవలసిందే..
తిక్కలేచినప్పుడల్లా గొణుక్కోవడం మామూలే.
" ఇంకెన్నాళ్ళు? ఏదో ఒకరోజున ఈ దరిద్రం వదిలేసి పారి పోవలసిందే ?" గట్టిగానే అంది విసుగ్గా..
" ఎక్కడి కి వెళతావు, నిన్నెవరిక్కడ వెళ్ళనిస్తారని... " తల్లీకూతుళ్ళ వాగ్యుద్ధానికి నాంది అది.
మిగతా ఇద్దరూ బెదిరిపోయి కళ్ళు గట్టిగా మూసుకునేవారు..
" ఎవడి వలలోనో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటావా?" " మరే నువ్వేగా మాకు ఆదర్శం... అలాంటి వలలో పడే ఇలాగున్నావుగా.. "
ఆ మాటల యుద్ధానికో అంతుదొరికేదికాదు.
" నాకు తెలుసు ... నేను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే నాజీతం డబ్బులు నీకందవనేగా..."
" నా ఖర్మ అంతా నా ఖర్మ ..." తల్లిచేత్తో తలబాదుకోవడం ...
తెల్లారితే అమ్మ ఆవిషయం మరచిపోయేది. మాటాడటం మామూలయేది ...
అయితే అమ్మ అనుకోలేదు ...
ఆరోజు ఉదయమే మామూలుగానే పనికి వెళ్తున్నాననే అనుకుంది...
కాళ్ళకు వెండి మెట్టెలు, మెడలో పసుపు తాడు.. కొత్త చీర చేతులనిండుగా పచ్చ గాజులు..
మెడలో నల్లపూసలు
ఎర్రనీళ్ళు దిష్టి తీసి లోనికి రానిచ్చింది అమ్మ. కాని ఆ కళ్ళనిండుగా కోపమే..
ఆ పెళ్ళి ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తూనేవుంది.
అయినా తీపి తినిపించి ఇద్దరికీ ఉన్నంతలో భోజనం అమర్చింది.
తిరిగి వెళ్ళేప్పుడు మాత్రం అమ్మ బయటకే రాలేదు. కొత్త చీరకు మట్టంటకుండా, కుచ్చెళ్ళు ఓ చేత్తో ఎత్తిపట్టుక్కుని కొత్త హైహీల్స్ టకటకలాడిస్తూ పక్కన వాసుతో ఎంత గర్వంగా బయటకు కదిలింది..
గుమ్మంలో నించున్న చెల్లెళ్ళిద్దరినీ వెనక్కు తిరిగి చూస్తే మనసు ద్రవించింది.
" వీళ్ళకేదైనా చెయ్యాలి..."
వాసు మంచి వాడు తన మాట కాదనక పోవచ్చు.. ఇద్దర్నీ ఆ ఊబిలోంచి ఎలాగైనా బయటకు లాగాలి..'
కాని అది కలేనా మళ్ళీ తనే ఇక్కడికే వచ్చి పడేట్టుందా?
కిర్ మంటూ తలుపు చప్పుడు.. ఎనిమిది దాటినట్టుంది..
చెల్లాయిలిద్దరూ రెడీ అవుతున్నారు..లేచి వాళ్ళకు మొహం చూపించడానికి మనసొప్పలేదు.
అందుకే కళ్ళుమూసుకుని నిద్ర నటించింది.
ఇద్దరూ స్కూల్ కి వెళ్ళిపోయాక, లేద్దామనుకుంది.. ఈ లోగా అమ్మ వంటముగించుకుని వచ్చినట్టుంది.
కొంగుచాటునుండి మూతపెట్టివున్న గిన్నె గట్టుమీదుంచి దగ్గరకువచ్చి చెయ్యినుదుటి మీదుంచి చూసింది . ఆస్పర్శలో ఎంత పరామర్శ. ఎంత ఓదార్పు! అమ్మ ప్రేమ చాటడానికి ఇంతకంటే మాటలెందుకు ఒక్కసారి చిన్నప్పటిలా అమ్మవళ్ళో దూరి పడుకోవాలనిపించింది.కాని అలా చెయ్యలేదు, ఎందుకు చెయ్యలేకపోయిందో తెలియదు.
"లేచి మొహం కడుక్కో " ఏమీ జరగనట్టుగా ఎప్పటిలాగే ఎలా అనగలిగింది అమ్మ.
బిడియంగా లేచి బ్రష్ చేసుకుంది.
అమ్మ తెచ్చినట్టుంది ప్లేట్లో వేడీవేడి ఇడ్లీలు రెండు పెట్టి ఇచ్చింది.
అమ్మ మొహం చూడాలంటేనే గిల్టీగావుంది.గొప్పగా బాధించేవిషయం ఏం జరిగిందని అమ్మ అడగకపోవడం.
ఏం జరిగిందని నిజంగా అడిగితే ఏం చెప్పాలి?
ఎలా చెప్పాలి?
కాని అమ్మ ఆమాటే ఎత్తలేదు.
నాలుగురోజులు ..వారంగామారింది. పెళ్ళి అనేది ఓకలగా అనిపిస్తోంది.
నిజంగా ఆపీడకల నిజం కాకపోయుంటే ఎంతబాగుండేది?
మానసికంగా శారీరికంగా చిక్కబట్టుకున్నాననుకునే లోగా జరిగిందది...
ఈ పది రోజుల్లో అమ్మ ఎలా సవరించుకు వస్తోందో కాని ఒక్కరోజూ ఉద్యోగం గురించి కాని డబ్బుగురించి కాని ఒక్క మాటా ఎత్తలేదు.తనకూ ఉద్యోగానికి వెళ్ళాలనిపించలేదు. గాయపడిన శరీరం కోలుకున్నా మనసు కుదుటపడటం నత్తనడకలాగే సాగుతోంది.
చెల్లాయిలు స్కూల్ కి వెళ్ళారు
అమ్మ ఇంకారాలేదు.. కిర్ర్ మంటూ తలుపు చప్పుడు తలెత్తింది గుమ్మం నిండుగా వాసు..
ఏదీ ఆకళ్ళల్లో పెళ్ళికిముందు గంతులు వేసిన ప్రేమ? ఎక్కడినించి వచ్చిందీ ప్రస్తుత కాఠిన్యం?
ఎం జరుగుతోందో తెలిసేలోగానే జుట్టుపట్టుకులాగి బయటకీడ్చాడు
"చెప్పాపెట్టకుండా పారిపోయొస్తే వదిలేసి గాజులు తొడుక్కు కూచుంటా ననుకున్నావా? ఇదిగో అదిగో అని చూస్తే నీలుగుతున్నావా? ఉద్యోగం మానితే నీఅబ్బ ఇల్లెవడునడుపుతాడే ..పద... "
ప్రతిఘటించే వ్యవధికూడా ఇవ్వకుండా ఎక్కడ అందితే అక్కడ కొడుతూ తన్నుతూ ఈడుస్తున్నాడు.. డొక్కలో తగిలిన బలమైన కాలి దెబ్బకు అప్రయత్నంగానే పలికింది నా గొంతు ' అమ్మా....'
ఏం జరిగిందో తెలిసే లోగానే ఓమూల పడిఉన్నాను గోడక్కొట్టుకున్న వేలు విరిగినంత నొప్పి ..
పెదవిచిట్లి రక్తం ధారలు కట్టింది ..కళ్ళు బైర్లు కమ్మాయి అయినా ఎలా వాసు చేతిలోంచి బయట పడ్డనా అనే అనుకుంటున్నాను..
పక్కింటి వాళ్ళు అడ్డుపడ్డారా..తలవిదిలించి చూసాను
కలో మాయో అర్ధం కాలేదు. ఎదురుగా అమ్మ అపరకాళిలా కాలెత్తి ఫెఢీ మని తన్నింది పైపైకి వస్తున్న వాసు గుండెల మీద
" నాకూతురి మీద ఈగ వాలినా ఇక్కడినించి కదిలేది నీ శవమే అది నీకు ఇప్పటికే అర్ధమయిఉండాలి
" వాసు మొహం పాలిపోయింది.
మొగుడూ పెళ్ళాలమధ్య గొడవ పెద్దది చెయ్యకు ఎవరో అమ్మకు సలహా ఇచ్చారు.
గొడవా... ఏం జరిగిందో నీకు తెలుసా రా ఇటురా బరబరా ఆమెను ఈడ్చుకు వచ్చి నన్ను సర్రున వెనక్కు తిప్పి నా వీపుమీద సిగరెట్ వాతల్ను చూపి
ఇవి చూసాక కూడా వోపిక పట్టానంటే నా కూతురే సమర్ధించుకోగలదని కాని
ఇలా దాన్ని బేలను చేసాక నేను చూస్తూ ఊరుకోను
అది నోరువిప్పి చెప్పక్కరలెదు ఇన్నాళ్ళుగా అది వాడి మాటేత్తలేదంటేనే అర్ధమయింది -అది పడ్డనరకమేమిటో
నాపిల్లనాకు భారం కాదు
కాస్సేపు నిశ్శబ్దం
ఆలోచించుకో మిగతా ఇద్దరూ ఆడపిల్లలే వాళ్ళపెళ్ళిల్లెలా చేస్తావు
ఈ అమ్మమ్మ కబుర్లు మానవమ్మా ..
వాళ్ళను నచ్చిమెచ్చిన వాళ్ళే చెసుకుంటారు
వాళ్ళకోసం దీని జీవితాన్ని వాడికి బలివ్వను..
అమ్మ నాదాకా వచ్చి నాచెయ్యిపట్టి లోపలకు తీసుకెళ్ళింది.
భేషజాలు వదిలి అమ్మ అక్కున చేరాను
అమ్మ నిశ్శబ్దం కూడా మాటాల్లాగే వినిపించింది నాకు
ఇరుకైన గోడలు ఎంతోవిశాలంగా తోచాయి
అమ్మనిశ్శబ్దాన్ని అనువదించుకుంటే
' శైలూ.. పుట్టింది మొదలు గోడలమధ్య ఉక్కిరి బిక్కిరై మరెక్కడికో పారిపోదామనుకుంటాము కాని మనం పోయేది గోడల మధ్యనుండి గోడల్లోకే అవి లోపలైనా వుంటాయి వెలుపలా వుంటాయి
మనం జీవించేదే గోడలమధ్య గోడల్లో గోడల్లా...
-----------------------------------------------------
రచన - స్వాతి శ్రీపాద,
సుజనరంజని సౌజన్యంతో
No comments:
Post a Comment