Thursday, May 30, 2019

అందమేఆనందం


అందమేఆనందం
సాహితీమిత్రులారా!

"సాయంత్రం మా ఆఫీస్ పార్టీకి వస్తున్నావుగా?సరిగ్గా ఆరింటికి వచ్చి తీసుకెళ్తాను" అటు వైపు ఫోన్ లో రాఘవ అడుగుతున్నాడు. అంత కన్నా దబాయిస్తున్నాడు అంటే సరిపోతుంది. స్మితకి తెలుసు, తనను అన్ని చోట్లకు ఎందుకు రమ్మంటాడో.నా గాళ్ ఫ్రెండ్ ఎంతో అందగత్తె అని అందరి ముందూ చెప్పుకోవటం అతనికో సరదా, చాలా గర్వకారణం. నిజానికి చెప్పుకోతగ్గ అందగత్తే స్మిత. మంచి ఎత్తుకి తగ్గ శరీర సౌష్టవం,ముట్టుకుంటే మాసిపోయే పచ్చని శరీర ఛాయ. నిజంగానే కలువల వంటి కళ్ళు. ముక్కు మాత్రం కాస్త పెద్దగా ఉంటుంది కానీ, అన్నిట్లో కలిపి చూస్తే, చక్కగానే ఉంటుంది. "సరే వస్తాను కానీ కొంచం త్వరగా వెళ్లిపోవాలి, రేపుఎగ్జామ్ ఉంది."చెప్పింది స్మిత."అయితే, లేత నీలంరంగు చీర, మొన్నదీపావళికి కొనిచ్చానే,అది కట్టుకో.అన్నీ మ్యాచింగ్ వేసుకుని,చక్కగా రా" అధికారపూర్వకంగా చెప్పాడు రాఘవ.

రాఘవలో తనకు నచ్చనిది అదొక్కటే. ఏది చెప్పినా, నువ్వు చేసి తీరాలి అన్న విధంగా చెప్తాడు. మిగతా ఎందులోనూ అతనంత ధారాళంగా తన అమ్మ,నాన్న కూడా ఉండరనిపిస్తుంది స్మితకు. కావాలంటే గంటలు గంటలు తనతో షాపింగ్ చేస్తాడు. తానే మంచి మంచి చీరలు,డ్రెస్సులు కొనిస్తాడు. తనకి డ్రైవింగ్ వచ్చేవరకూ ప్రతి వారం అతనే బ్యూటీ పార్లర్ కూడా తీసుకెళ్లేవాడు. థాంక్స్ చెప్తే నవ్వేస్తాడు "నువ్వు అందంగా ఉంటే, నాకేగా లాభం" అని జోక్ చేస్తాడు. త్వరలో పెళ్లి మాటలు మాట్లాడటానికి వాళ్ల వాళ్ళు వస్తారు అని కూడా చెప్పాడు. అతనూ చాలా అందగాడని చెప్పలేకపోయినా, మనిషి బాగా మేన్‌టేన్ చేస్తాడు. మంచి బ్ర్యాండెడ్ దుస్తులనే వాడతాడు.

మగవాళ్ల పార్లర్ కి వెళ్ళి మొహానికి ట్రీట్మెంట్లు చేయించుకుంటాడు. క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్ళి వ్యాయామం చేస్తాడు. బాంక్ లో పని చేస్తున్నా, మార్కెటింగ్ రంగంలో ఉండటం వల్ల, మనిషి రూపం మీద ఎదుటివాడి మర్యాద ఆధార పడి ఉంటుందని గట్టిగా నమ్మినవాడు. ఎమ్బీఏ చదువుతున్న స్మితకి రాఘవ బాంక్ లో పరిచయం అయ్యాడు. సంవత్సరకాలంలోనే చాలా దగ్గరయ్యారు ఇద్దరూ. స్మిత ఫైనల్ పరీక్షలు అయిపోగానే పెళ్లి చేసుకుందాము అని అడుగుతున్నాడతను.

సాయంత్రం చాలా శ్రద్ధపెట్టి ముస్తాబయ్యింది స్మిత. ముందే పార్లర్ కి వెళ్ళి వత్తైన తన జుట్టుని చక్కటి ముడి వేయించి, ముత్యాలతో అలంకరించింది. బయలు దేరే ముందు అమ్మ ఓసారి దిష్టి తీసేసింది, అంత అందంగా ఉంది స్మిత.

సాయంత్రం బయట కార్ పెట్టి, లోపలికి వచ్చిన రాఘవ కళ్ళలోనే ప్రశంస కనబడిపోతోంది. త్వరగా వచ్చేస్తామని అమ్మ,నాన్నకి చెప్పి ఇద్దరూ బయలుదేరారు. కారు ఎక్కాక ఉత్సాహంగా అన్నాడు రాఘవ "నీకో మంచి వార్త. అమ్మ, వదిన నీ నగల షాపింగ్ గురించి ప్లాన్ చెయ్యటం మొదలుపెట్టారు. వచ్చే అమావాస్య దాటాక, మంచిరోజు ఉందట, మీ ఇంటికి మావాళ్ళందరూ వస్తున్నారు" అని. "నా పరీక్షలకు ఇంకా మూడు నెలలు టైమ్ ఉంది కదా, అప్పుడే పెళ్ళైతే ఎలా?"గాభరాగా అడిగింది స్మిత. "డోంట్ వరీ. ముహూర్తాలు నీ పరీక్షల తర్వాతే. అంతలో నీ షాపింగ్ అన్నీ చేసుకో. కానీ, నీకు కొనాలనుకున్న వాటిల్లో, నాకు ఒక్క కోరిక మాత్రం తీరదు" అన్నాడు. "ఏమిటో?" ఆశ్చర్య పోయింది స్మిత. "ఏంలేదు, నీ ముక్కు కాస్త లావు కదా, వజ్రాలముక్కెర కొనాలన్నా నీకు అంత బావుండదు" అల్లరిగా అన్నాడు.

"ఫరవాలేదు, వడ్డాణానికి తగ్గ నడుముందిలే" తిప్పి కొట్టింది స్మిత. సాయంత్రం పార్టీలో చాలా ఎంజాయ్ చేశారు. ఈరోజు స్మితను "నా కాబోయే భార్య" అని కొత్త పరిచయం చేసేసాడు అందరికీ. అందరి కళ్ళూ స్మిత మీదే, గర్వంతో అతని ఛాతీ ఉప్పొంగి పోయింది. రాత్రి స్మితను ఇంటి వద్ద దిగబెట్టి "త్వరగా పడుకో, లేకపోతే కళ్ళ కింద నల్ల చారలు వచ్చేస్తాయి " అని హెచ్చరించి మరీ వెళ్లాడు రాఘవ. నవ్వుకుంటూ వెళ్ళి పడుకుంది అతను చెప్పినట్టే.

రాఘవ అన్నట్టే వాళ్ల వాళ్ళు ఫోన్ చేసి ఫలానా రోజు వస్తామని అడిగారు. స్మిత తల్లి తండ్రి వాళ్ళను సంతోషంగా ఆహ్వానించారు. అనుకున్నరోజు రానే వచ్చింది. ఆ సాయంత్రం రాఘవ తల్లి తండ్రి, అన్నా,వదిన, రాఘవతో కలిసి వచ్చారు. రాఘవ అందరినీ అందరికీ పరిచయం చేశాడు. మీ ఇద్దరూ మాట్లాడుకోండి అని పెద్ద వాళ్ళు రాఘవను, స్మితను పైన డాబా మీదకు పంపేశారు. ఇన్నాళ్లుగా పరిచయం ఉండి ఎంతో దగ్గరైన వాళ్లిద్దరికీ ఈ సందర్భం కొంత కొత్తగా, కొంత వింతగా ఉంది. కొద్ది సేపు మౌనం తరువాత స్మిత అడిగింది "మీ అన్నయ్య, వదిన నీకంటే బాగా పెద్దవాళ్ళా?" కొంచం మొహం చిట్లించుకున్నాడు రాఘవ "మరీ పెద్ద వాళ్ళేం కాదు, అలా కనబడతారు అంతే. వాళ్ల పెళ్లై ఆరేళ్లైంది, ఇద్దరు పిల్లలు కాగానే అడుగో అలా తయారైంది మా వదిన. కాస్త తగ్గమని అన్నైనా చెప్పడు, మా అమ్మా చెప్పదు.” కాస్త చిరాగ్గా అన్నాడు. "సరేలే, అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ. నేను పెళ్లికి ముందే ఒక విషయం నిన్ను అడగాలని అనుకున్నాను, నువ్వు కాదనవని నమ్మకం ఉంది." చెప్తూ ఆగాడు. ఇన్నాళ్లలో అడగనిది ఇప్పుదేముందో స్మితకు అర్థం కాలేదు. అమ్మ, నాన్న ఎంతో కొంత కట్న కానుకలు ఇస్తారు ఎలాగూ. బెంజికారు వంటి గొంతెమ్మ కోరికలేమైనా ఉన్నాయా ఇతని మనసులో అని చిన్న సందేహం రాకపోలేదు స్మితకు. “నాతోనా? అమ్మ నాన్న తోనా?" స్మిత అడిగింది. "ఇది నిర్ణయించు కోవలసింది నువ్వే. నన్ను ఎంతో అర్థం చేసుకున్నావని నా నమ్మకం. నువ్వు డబ్బు గురించి ఏ మాత్రం హెసిటేట్ చెయ్యద్దు, అవన్నీ నేను చూసుకుంటాను." చెప్పుకు పోతున్న రాఘవను ఆపింది స్మిత "అసలు ఇంతకూ విషయం ఏంటి రఘూ?" సూటిగా అడిగింది.

"నాకు నీ ముక్కుకు వజ్రాల ముక్కు పుడక చూడాలని ఉంది" చెప్పాడు. "ఓస్ అంతేనా, నీ కోసం ముక్కు కుట్టించు కుంటానులే" నవ్వింది స్మిత. "అది కాదు రా. కుట్టించే ముందు, నీ ముక్కు కొంచం సరి చేయించుకుంటే బావుంటుంది. చంద్రుడిలో మచ్చలా, నీలో ఉన్న ఒకే ఒక్క లోపమది. ఎంత మంది మోడెల్స్, సినీ తారలూ చేయించుకుంటున్నారు ఈ రోజుల్లో. నాకు తెలిసిన టాప్ సర్జెన్ ఉన్నారు ఈ ఫీల్డ్ లో. ఆయన దగ్గరే ప్రఖ్యాత మళయాళం సినీ తార డయానా కూడా ముక్కు సరిచేయించుకుంది. నేను చెప్పాను కదా, డబ్బు ఆలోచించకు " చెప్తున్నాడు రాఘవ. అతను చెప్తున్నది విని షాక్ తిన్నది స్మిత. ఇంజెక్షన్ అంటేనే భయపడిపోయే తాను, ఇలాంటిది ఊహించుకోను కూడా లేదు. "లేదు లేదు రఘూ, ఇది నా వల్ల కాదు. ప్లీస్, ఇంకేదైనా చెప్పు కానీ, ఇది టూ మచ్. దాని వల్ల అంత నా అందం తరిగిపోయిందనిపిస్తోందా నీకు? నో వే." తెగేసి చెప్పింది. చాలా బతిమాలాడు రాఘవ ఆమెను. కొంచెం కరిగింది, మా అమ్మ, నాన్నను అడుగుతా అన్నది. ఒప్పుకోలేదు రాఘవ. “ఇది మన ఇద్దరి మధ్య విషయం రా. నువ్వు తెలివైన దానివి, చదువుకున్నావు. ఎవరి సలహాలు, పర్మిషన్లు నీకు అవసరం లేదు. నీ మనసు ఒప్పుకోవాలి అంతే." స్పష్టంగా చెప్పాడు. "ఇప్పుడే నేనేమీ చెప్పలేను రఘు. నాకు కొంచం సమయం కావాలి" స్థిరంగా పలికింది స్మిత. ఇద్దరూ కిందకు దిగి వచ్చారు. అక్కడ అప్పుడే అందరూ వియ్యంకుల వరుసలు కలిపేసుకుని సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. రాఘవ అమ్మ స్మితను దగ్గర పిలిచి ఆప్యాయంగా కూర్చోపెట్టుకుంది. ఇంతకు ముందు ఆవిడను స్మిత ఒకటి రెండు సార్లు కలిసింది కూడా. వాళ్ళందరి ఆనందం చూసి స్మితకు కొంచం గిల్టీ గా అనిపించింది. రఘు చెప్పిన విషయం ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. వాళ్ళు వెళ్ళిపోయాక రాత్రంతా ఒంటరిగా ఆలోచించింది. రెండ్రోజుల తర్వాత రాఘవకు ఫోన్ చేసి, ఒకసారి ఆ సర్జన్ ను కలవాలని, ఆ తర్వాత తన నిర్ణయం చెప్తానన్నది. అలాగే కానీ, ఆ తరువాతే ముహూర్తాలు పెట్టుకుందామన్నాడు రాఘవ. ఒప్పుకోక పోతే, అతన్ని వదులు కోవాలని చెప్పకనే చెప్పాడని అర్థమైంది స్మితకు.

ఇద్దరూ వెళ్ళి సర్జన్ ను కలిసారు. ఆయన చాలా ఓపికగా రైనోప్లాస్టీ(ముక్కు సరిచేయటం), అందులో సాధక బాధకాలు అన్నీ వివరించి చెప్పారు. ఆపరేషన్ తర్వాత ముక్కు లోపల బ్యాండేజ్ లు వేస్తారని, ముక్కు పైన స్ప్లింట్ వేస్తారని, కొన్ని రోజులు నోటితో ఊపిరి పీల్చాలని విడమర్చి చెప్పారు. వాపు దాదాపు సంవత్సరం పాటు వస్తూ పోతూ ఉంటుందిట. కొన్ని కేసుల్లో చిక్కులు రావచ్చట కూడా. నాసికా రంధ్రం మూసుకు పోవటం, ముక్కు చివర నరాలు దెబ్బతినటం ఇంకా కొన్ని ఆయన వివరిస్తుంటే, స్మిత హడలిపోయిన మాట నిజం. కానీ రాఘవ మీది ప్రేమ స్మిత భయాలన్నిటినీ అధిగమించింది. కొంత అయిష్టంగానే ఒప్పుకుంది. రాఘవ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. "ఐ లవ్ యూ సో మచ్" అని ఒక వంద సార్లు చెప్పి ఉంటాడు. తమాషా ఏమంటే, ఇరు వైపులా తల్లి తండ్రులకూ ఇది నచ్చలేదు. అవసరమా అని చెప్పి చూశారు. ఎప్పుడూ ఇవ్వటమే కానీ, ఏమీ అడగని ప్రాణ సమానమైన రాఘవ కోసం చేస్తానన్నది స్మిత. పరీక్షలు అయ్యాక, ఆపరేషన్ పెట్టుకున్నారు. ముందు రోజు రాత్రి ఆ హాస్పిటల్ లో చేరింది స్మిత. ఎనిమిది వరకూ ఉండి, పొద్దున్నే అయిదుకే వస్తానని వెళ్లాడు రాఘవ. స్మిత అమ్మ అక్కడే ఉండిపోయింది. ఏమీ తినద్దని పాలు మాత్రం ఇచ్చారు. నిద్ర పట్టక తన స్పెషల్ రూమ్ నుండి బయటకు వచ్చి అటూ ఇటూ తిరగ సాగింది స్మిత.

అటు పక్కన కామన్ రూములు ఉన్నాయి. చిన్న హాస్పిటల్ కావటం వల్ల ఎక్కువ పేషెంట్స్ లేరు. లోపల ఎవరో ఉన్నారు, బయట కుర్చీలో ఒకావిడ కూర్చుని ఉంది. చూడటానికి చాలా సంపన్నురాలిగా కనిపిస్తోంది. కట్టిన చీర, ఎత్తు మడమల చెప్పులు, అందంగా కత్తిరించిన జుట్టు భుజాల వరకు పడుతుంటే, చెవుల్లో వజ్రాల హ్యాంగింగ్స్ మెరుస్తున్నాయి. ముఫ్హై లోపలే ఉంటుంది. తానే నవ్వి పలకరించింది. పేరు స్వప్నిక అట. కానీ తనకోసం కాదు, ఎవరో పేదపిల్లకు మొహం కాలి పోతే, వాళ్ళ చ్యారిటీ తరఫున డబ్బు పోగుచేసి, ఆ అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ కోసం తీసుకొచ్చిందట. వాళ్ల చ్యారిటీ స్త్రీల కోసమేనట. వచ్చేవారం ఒక బుగ్గ సరిగ్గా లేకుండా పుట్టిన పసి పాపకు ఆపరేషన్ చేయిస్తున్నారట. డబ్బు చాలనప్పుడు తానే స్వయంగా ఇస్తుందట. నెలకు ఒకటైనా ఇలాంటివి చేస్తుందిట తాను. అభినందించకుండా ఉండలేక పోయింది స్మిత. స్మిత తాను ఎందుకొచ్చిందో చెప్పింది. "ఇంత అందంగా ఉన్నారు, మోడెలింగ్ కోసమా ముక్కు సరిచేయించుకోవటం?" అనేసింది స్వప్నిక. "కాదు, నా ప్రాణమైన నా వుడ్ బీ కోసం" మెరిసే కళ్ళతో చెప్పిన స్మితను అదో లా చూసింది స్వప్నిక.

"పెళ్లైయ్యక పిల్లలు వద్దనుకున్నారా?" అడిగింది స్వప్నిక. "ఛ ఛ, అదేం మాట. అలాంటిదేమీ లేదే. అసలు దీనీకేం సంబంధం? ముక్కు ఆపరేషన్ వల్ల పిల్లలు పుట్టరని ఎక్కడా లేదే?" కొంచం కోపంగా అడిగింది స్మిత. "మరి, పిల్లలు పుట్టాక, పొట్ట ఎత్తుగా అయిపోతే, అక్కడ లైపో సక్షన్ చేయించుకుంటారా? తొమ్మిది నెలలు మోసి, పిల్లల్ని కన్నాక సాగిపోయిన చర్మం కోసం ఏం చేస్తారో ఇప్పుడే ఈ హాస్పిటల్లోనే కనుక్కోండి. పిల్లలకు పాలిచ్చి పెంచాక, బ్రెస్ట్ ఎన్‌హ్యాన్స్మెంట్ చేయించుకుంటారా? లేక వాళ్ళకు పాలే ఇవ్వరా? మరి, ఎన్నో కేసుల్లో పిల్లల్ని కన్న స్త్రీలు వారి గర్భాశయం వదులైపోయి, దగ్గినా, తుమ్మినా కొద్దిగా మూత్రం పడుతూ అవస్థ పడతారు. అలా కనుక మీకు అయితే, మీ ఆయన అసలు సంసారం చేస్తారా మీతో? ఎన్ని ఆపరేషన్స్ చేయించుకుంటారు?" సూటిగా అడిగింది స్వప్నిక.

దిమ్మేరపోయింది స్మిత. ఆమె మాటలు బాణాలై గుచ్చుకుంటుంటే ఏడుపొచ్చేసింది స్మితకు. ఏడుస్తూ తన రూమ్ లోకి వెళ్లిపోయింది. అమ్మ హడలిపోయింది ఏం జరిగిందో అని. అలాగే ఓ పది నిముషాలు ఏడుస్తూ ఉండిపోయింది. "ఏమ్మా, భయంగా ఉందా?"లాలనగా అడిగింది అమ్మ. ఇరవైరెండేళ్ళు తనను అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ చేతుల్లో ఒదిగిపోయింది. ఆ చేతుల ముడతలు ఏనాడైనా కనిపించాయా తన కళ్ళకు? అమ్మ నవ్వితే కళ్ల కింద పడే గీతలు, మెడ మీది సాగిన చర్మం, ఏనాడైనా నాన్నకు కనిపించాయా? ఏ కొత్త చీర కట్టుకున్నా, మహాలక్ష్మిలా ఉన్నావు అని మనస్పూర్తి గా మెచ్చుకుంటారే నాన్న. మరి తనకు? సృష్టి లో కెల్లా అందమైనది తన అమ్మే కదా. మరి ఇదేంటి? తాను చేస్తున్నదేoటి?

అంతలో స్వప్నిక లోపలికి వచ్చింది. "సారీ స్మితా. బాధ పెట్టినట్టు ఉన్నాను కదూ. ఎంతో మంది ఆడపిల్లలు ప్రకృతి కోపించి, జన్యు పరమైన వికృతులతో పుడుతుంటే చూస్తున్నాను. వారి భర్తల చేతిలోనే దెబ్బతిని, అందవికారులవటం చూశాను. కానీ ఇంత అందమైన నువ్వు ఇలాంటి పొరబాటు చేస్తుంటే ఆగలేక పోయాను. నీలాంటి అమ్మాయి లభించటమే అదృష్టం అనుకునే మగాడు నీకు దొరకాలి అనిపించింది. ఇలా బాహ్య రూపానికి ప్రముఖ్యాన్నిచ్చే మనిషి కాదు. ఈ ఆపరేషన్లో ఏదైనా తేడా వచ్చి,మొహం పాడైతే నీ వుడ్ బీ నీ వైపు చూస్తాడా?తప్పుగా మాట్లాడి ఉంటే, క్షమించు" అని చెప్పి వెళ్లిపోయింది. ఒక పావుగంట అలా పడుకుండిపోయింది స్మిత. లేచి, వెళ్ళి మొహం కడుక్కొచ్చి, అమ్మకు చెప్పింది "ఇంటికి వెళ్దాం పదమ్మా. ఈ పెళ్లి జరగక పోయినా నువ్వు బాధపడనని మాట ఇవ్వు". అమ్మ మొహంలో ఎంతో ఆనందం.
--------------------------------------------------
రచన - బృంద తంగిరాల, 
సుజనరంజని సౌజన్యంతో

No comments:

Post a Comment