Saturday, May 18, 2019

వాచోపన్యాసం


వాచోపన్యాసం 




సాహితీమిత్రులారా !


"యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ" - ఉపనిషత్తుల్లోని ఉవాచ

వాచీ.
గడియారం.
ఘటీయంత్రం.
తోయయంత్రం.

వాచీతో ఉన్నదొక పేచీ. వాచీ ఒక సవ్యసాచి. పెద్దముల్లు పెద్దన్న ధర్మన్న. నింపాదిగా నిదాననంగా కాలధర్మం తప్పకుండా పనిచేయిస్తాడు పెద్దన్న. చిన్నముల్లు అర్జునుడితో సమానమే. కాలం అనే భయంకరమైన అక్షయవీరుడికి, ఇంకో అక్షయవీరుడేగా కావలసింది? సరిజోదు లేకపోతే కాలం భూతం మింగెయ్యదూ? చిన్నముల్లు ఆపటానికి ప్రయత్నిస్తుంది. చాలాసార్లు విఫలమైనా ప్రయత్నిస్తూనే ఉంటుంది.

దేశానికో వాచీ. భూమ్మీద నిలబడి తూర్పు వెళ్ళే రైలెక్కితే మారే ప్రతిదేశానికి ఒకో విధమైన కాలం, దానికొక వాచీ. భూమ్మీద నిలబడి పడమర వెళ్ళే రైలెక్కితే మారే ప్రతిదేశానికి ఒకో విధమైన కాలం, దానికొక వాచీ. దిశకో వాచీ. దేశం లాగే దిశకో వాచీ. దిసమొలకో వాచీ. దీని గురించి చెప్పనే అక్ఖరలా.

చిన్నప్పుడు వాచీ. పెద్దవుతూ వాచీ. పెద్దయ్యాక వాచీ. చిన్నప్పటి వాచీ - అపురూపం. చూసుకున్నదే చూసుకుని అబ్బో అని మురిసిపొయ్యే కాలం. అక్కడా కాలమే విచిత్రంగా! పెద్దవుతూ వాచీ - ఒక రూపం. ఓ సారి చూసుకున్నాక, స్నేహితులకు చూపించాక వదిలేసే కాలం. అబ్బో అబ్బో ధాటి కాస్త తగ్గి పడుండే కాలం. అక్కడా కాలమే విచిత్రంగా! యవ్వనంలో వాచీ - ఒక పం పం. షోకిల్లా కాలం. పిల్లకు చూపించుకొని జబర్దస్తుగా ఫీలైపోయే కాలం. మగ స్నేహితులకు చూపించుకోటం నామోషీ అయిపోయే కాలం. అక్కడా కాలమే విచిత్రంగా! యవ్వనమైపోయాక వాచీ. కాంఫిడెన్సు కాలం. బోష్టింగు కాలం. పొగరుబోతు కాలం. బడాయి కాలం. ఎంత డబ్బు ఉంటే అంత పెద్దవాచి కాలం.

వాచీ లేకపోతే మనం లేము. అంతే, మరో మాట లేదు. ఎందుకా? పెళ్ళాం దగ్గరికెప్పుడెళ్ళిపోదామా అని చూస్కోటానికి కావల్సింది వాచీనే! లేకపోతే ముద్దులు మురిపాలు దక్కనిదీ మనకే! ఆఫీసు నుంచి బయటపడేదెప్పుడూ అని చూస్కోటానికి కావల్సింది వాచీనే! లేకపోతే బాసుగారి తొత్తులమైపోయేదీ మనమే! పరీక్షలు రాయాలంటే కావల్సింది వాచీనే! లేకపోతే ఫెయిలైపోయేది మనమే! పోటీల్లో చూసుకోవాల్సింది వాచీనే! లేకపోతే అందరికన్నా ఆఖరుగా నిలబడేది మనమే! పాటల్లో చూసుకోవాల్సింది వాచీనే! లేకపోతే రెండోసారి మన పాట మనమే వినుకోవాలి. వంటల్లో చూసుకోవాల్సింది వాచీనే! లేకపోతే మాడి మసైపోయిన పదార్థాలు తినాల్సింది మనమే!

ఇహ ఎక్కడ పెట్టుకోవాలన్నా అక్కడ ఇమిడిపొయ్యేది వాచీనే. జేబులో వాచీ! జుబ్బా జేబులో పెట్టుకుని ఊరకే బయటకు తీసి చూసుకునే కాలం. పైన ఒక బొడిపె ఉండి నొక్కుతే తెరుచుకుని ముల్లుల్ని చూపించేది. పెండ్యులం వాచీ! అటు నుంచి ఇటు ఉయ్యాల ఊగుతూ కళ్ళు బైర్లు కమ్మించేది. వర్తమాన వశీకరణం దీన్నుంచే పుట్టిందని ప్రతీతి. నిలువుస్తంభం వాచీ! ఊళ్ళో పనికిమాలిన పోకిరీలంతా ఆ స్తంభం చుట్టూ చేరి రచ్చబండ చేసే కాలం. ఆ వాచీ ఎన్నో ఊసుపోక కబుర్లకీ, గాలి కబుర్లకు నిలువు సాక్ష్యం. గోడ వాచీ! ఎటు తిరిగినా నిన్నే చూస్తూ ఉండే వాచీ. నీ ప్రతి అడుగును శాసించ గలిగింది ఈ వాచీనే!

ఇలా రకరకాలు. ఇంకా ఎన్నో ఉన్నయ్. చిత్రచిత్రాలు. చిత్రవిచిత్రాలు. ఎడమ చేతి వాచీ! కుడి చేతీ వాచీ! ఎడమ చెయ్యి వాచీ కోమలమైన వాచీ. అందుకే ఆడవాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు. కుడి చెయ్యి వాచీ కర్కశమైన వాచీ. అందుకే మగవాళ్ళు తక్కువగా పెట్టుకుంటారు. వాళ్ళు కూడా పాపం నాజూగ్గా కనపడదామని ప్రయత్నం. పెద్ద బెల్టు వాచీ. చిన్న బెల్టు వాచీ. నాజూకు బెల్టు వాచీ. పెద్దవజను వాచీ. చిన్నవజను వాచీ. వజనే లేని వాచీ.

బంగారపు వాచీ. వెండి వాచీ. రత్నాల వాచీ. పగడాల వాచీ. నవరత్నాల వాచీ. ఐరను వాచీ. అల్యూమినియం వాచీ. ప్లాస్టిక్కు వాచీ. కొబ్బరికాయ వాచీ! చీపురుపుల్లల వాచీ! అనకాపల్లి వాచీ. సత్యనారాయణస్వామి వాచీ! గుళ్ళో మండపంలో ఉండే వాచీ! అరసవిల్లి వాచీ! శ్రీముఖలింగం వాచీ! గర్భగుళ్ళో సూర్యకిరణాల వాచీ! నాలుగు రూపాయల వాచీ. నలభై రూపాయల వాచీ. నాలుగొందల వాచీ. నాలుగువేల వాచీ! నాలుక్కోట్ల వాచీ! అక్కడా కాలమే, ఇక్కడా కాలమే! తేడా ఏవిటో ఆ వాచీకి, ఆ కాలానికీ తెలియాలె.

కోటలో గంట. అదో కాలం. అదో వాచీ! రూపు లేకపోయినా ఒక ఖచ్చితమైన వాచీ. అర్థరాత్రప్పుడు పన్నెండు గంటలు. పన్నెండు మోతలు. ఠంగు ఠంగు మోతలు. ఎట్లా తెలుసు కొట్టేవాడికి? అదో విచిత్రమైన కాలం. అయినా ఖచ్చితమే! అదీ మన పూర్వీకుల కాలం. అదే ఆ కలపు వాచీ. బోలెడు జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చే వాచీ!. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చే వాచీ! గంట అనే కాలపు సమయం, ఈ గంట కొట్టటం నుంచే వచ్చింది. గంటంటే గుళ్ళో గంట అనుకునేవు, కాదులే కానీ, అది కోటలో గంట.

ఈ వాచీకి ప్రకృతికి బ్రహ్మాండమైన సంబంధం ఉన్నది. గడియారవృక్షం అని ఒక చెట్టు ఉంది. ఆ వృక్షవిశేషమేమంటే గడియకొక పండు కింద పడేస్తుంది. ఆ పడ్డ చప్పుడు బట్టి, ఒక గడియ అయ్యిందని జనాలకు తెలిసేది. పొద్దున పొద్దున్నే కిందపడ్డపళ్ళన్నీ గంపల్లోకెత్తేసి కాలం లెక్కలు మళ్ళీ మొదలెట్టేవారు..
మరి పిందెల కాలంలో, ఆకురాలు కాలంలో, తుఫాను కాలంలో ఏం చేసేవాళ్ళో తెలియదు కానీ!

సరే అదలా పక్కనబెడితే వాచీకి ఇంకో పిట్ట కథ ఉన్నది. ఒకటేవిట్లే, ఒహ రెండు చెపుతా కాచుకో! కొంతమందికి ఇవ్వగానే వా అని ఏడ్చి ఛీ అని విసరి కొట్టేవారనిన్నీ, అందువల్లే దానికి వాచీ అని పేరొచ్చిందనీ నా పిట్టకథ. కొంతమందికి ఇవ్వగానే వహ్ అని పొంగి సీ అని ముద్దెట్టుకునేవారనిన్నీ, అందువల్ల వాహ్ సీ ప్రకృతి రూపమైతే వాచీ వికృతి రూపమనీ - ఇలా ఇంకోటి కట్టా పిట్టకథని. ఇలా ఎన్నైనా చెప్పుకుపోవచ్చు. ఆగని వాచీ ముల్లులాగా!

ఈ వాచీకి మహాభారత యుద్ధానికి బ్రహ్మాండమైన సంబంధం ఉన్నది. ఈ వాచీల్లోని భాగాలు ప్రతిదీ ఒకదానికొకటి ప్రాణం పోసేవే. సాయం చెయ్యకపోతే ఒక దాని ప్రాణం ఒకటి తీసేసే గుణం ఉన్నవే! మహాభరత యుద్ధమే వాటి మధ్య. సఖ్యత కుదిరిందా ఐదు ఊళ్ళలా ఐదు ముల్లులు. కుదరలేదా ఐదు దెబ్బలేసి యుద్ధమే. అలా ఒహ రోజు ఒహటి జరిగిందిట. ఎక్కడ? కురుక్షేత్రంలో. సాత్యకి ద్రోణాచార్యుడిని ఓడించాడు ఒక రోజు యుద్ధంలో. ఆచార్యుణ్ణి ఒడించాడా ? ఎలా? అసలే యుద్ధం. అందునా భారత యుద్ధం. మహాభారత యుద్ధం.

ఓ రోజు, ద్రోణాచార్యుడు సాత్యకిని ఒరే నువ్వెంత నీ ఆటలెంత అని పరాభవించేస్తూ ఉండగా సాత్యకికి ఒక ఛాన్సు దొరికి, దొరికించుకొని లాగి ఆచార్యుడి ధనుర్భంగం కావించాట్ట. వార్నీ అని ఆచార్యుడు ఆశ్చర్యపోతూ, ఆగు సత్తి, నాదగ్గర వాచీ లేదు కానీ నువ్వొక ఘడియ ఆగు, ఇంకో ధనస్సు పుచ్చుకోనీ నీసంగతిజేస్తానని ఇంకో ధనువు అందుకోబోతుంటే దొరికింది సందని వాచీకి పెద్దముల్లులాంటి సారథిని సత్తిబాబైన సాత్యకి ఏసేసాట్ట. పెద్దముల్లు లేకపోటంతో చిన్నముల్లు గిరగిరా తిరుగుతూనే ఉన్నట్టు గుర్రాలు గిర్రున తిరిగి పరుగందుకున్నాయిట. ముల్లు లేకపోతే సమయమెంతో తెలీకపోయినా అవి, ఆ గుర్రాలు, అలా వాచీకుండే కీ లా గిరగిరా తిరగటం ఆచార్యుణ్ణి రక్షించింది. ఆయన ఆ గడియల వాచీకి దణ్ణం పెట్టుకున్నాట్ట, గుర్రాల్ని, గడ్డాన్నీ నిమురుకుంటూ. అందువల్ల దేని ప్రాముఖ్యం దానిదే. కీ లేపోతే ముల్లు లేదు. ముల్లు లేపోతే కీ ఉపయోగమూ లేదు. అలా వాచీకి భారతానికి లంకె ఉన్నది.

సద్దామునేసేప్పుడు తలారివాడు వాచొంక చుస్తూ ఆ సమయానికి దబ్బున ఏసేసాడు. బిన్ లాడెనునేసేసేప్పుడు ఆ సీలు తన వాచొంక చూస్కున్నాట్ట. బెర్లిను గోడ పడిపోయినప్పుడు కొన్ని వాచీలాగిపోయినాయట. పటేలు నిజామును శంకరగిరి మాన్యాలు పట్టిద్దామని వాచీ చూసుకుని టైమిచ్చాట్ట. ఎన్నో చెప్పుకోవచ్చు - ఇలా ప్రపంచ చరిత్ర అంతా వాచీలతో నిండిపోయింది. అదీ వాచీ గొప్పతనం. అదీ వాచీ ప్రాముఖ్యం. అదీ వాచీ ప్రామాణికత.

హిట్లరు వాచీ. జిన్నా వాచీ. రామానుజం వాచీ. ఐన్స్తైను వాచీ! ఇలా అదో రకం విభాగం.

అయ్యా, ఇలా వాచీ మీద ఒక ఆవు వ్యాసం రాసెయ్యొచ్చు.

ఓం తత్ సత్!
----------------------------------------------------------
రచన - - మాగంటి వంశీమోహన్, 
సుజనరంజని సౌజన్యంతో

No comments:

Post a Comment