Wednesday, May 22, 2019

యుగధర్మం


యుగధర్మం


                                                                         
 
సాహితీమిత్రులారా!

గుమ్మంలో ఆటో ఆగిన చప్పుడు విని పేపర్ చదువుతున్న గురునాధం గారు తలెత్తి చూసి, కుర్చీ లోంచి లేచి భార్యని ఉద్దేశించి కేక పెట్టారు, " సుగుణా ! చూడు ఎవరు వచ్చారో "అంటూ.
                     "బ్రేక్‌ఫాస్టు" తయారు చెయ్యడం కోసం రవ్వదోశ పిండి కలుపుతున్న సుగుణమ్మ చెయ్యైనా కడుక్కోకుండా అలాగే బయటికి వచ్చింది. అంతలో ఆటో దిగిన పిల్లలు "తాతయ్యా", "బామ్మా" అంటూ పరుగున వచ్చి వాళ్లని కౌగిలించుకున్నారు. పిల్లల్ని ప్రేమగా చేరదీసుకున్నారు వాళ్లు.
 "వీళ్లిద్దరూ కలిసి వచ్చారేమిటో! వీళ్ల మధ్య ఇంత సయోధ్య ఎప్పటినుండో" అన్నారు గురునాధం గారు అన్యాపదేశంగా.
                    సామాను తీసుకుని లోపలకు వచ్చిన కొడుకుల్నీ, కోడళ్లనీ చూసి పలకరించింది సుగుణమ్మ, "అంతా బాగున్నారా ? ఇదేమిటి ఇలా ఉత్తరమైనా రాయకుండా వచ్చారు, ఇబ్బందులేం లేవుకదా" అంటూ ఆత్రంగా అడిగింది
                          "ఉత్తరం రాయకపోడమేమిటండీ అత్తయ్య గారూ! మీ అబ్బాయి నాల్గు రోజుల క్రితమే కార్డు రాసి పోస్టు చేశారు. పోస్టులో మిస్సయ్యింది కాబోలు. అది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది కదా. అందులో కొత్తేముంది కనక" అని జవాబు చెప్పింది పెద్ద కోడలు రజితాంబ.
                             " ఊరకనే రారు మహాత్ములు! వీళ్ల రాకకు కారణం ఏమిటో" అనుకున్నారు గురునాధం గారు మనసులో.
                             "రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు కదా, తరవాత మాట్లాడుకుందాం. ముందు స్నానాలు చేసి వచ్చి కాఫీ, టిఫిన్లు కానివ్వండి. మీరు స్నానాలకి వెళ్లండి, ఈలోగా నేను కాఫీలూ అవీ తయారుచేస్తా " అన్నారు సుగుణమ్మ గారు వంట గదిలోకి దారి తీస్తూ.
                           " ఆగండి అత్తయ్యా! మీకా శ్రమ వద్దు. క్షణంలో నేను వచ్చి ఆ పని చూస్తా " అంటూ బట్టలు తీసుకుని బాత్‌రూం కి పరుగెట్టింది చిన్న కోడలు సువర్ణ మాల.
                        ఎప్పుడూ చుట్టం చూపుగా వచ్చి, అత్తగారిచేత వండించుకు తిని వెళ్లే వాళ్లకి ఈమాటు ఇంత సద్బుద్ధి ఎలా వచ్చింది చెప్మా - అని విస్తుపోయారు మామగారు. వాళ్లలో వచ్చిన మార్పు ఆయనకు వింతగా కనిపించింది. తెల్లబోయినట్లు చూశారు ఆయన కొడుకుల వైపు.
                          "ఈ నెలలోనే రిటైరైపోతున్నట్లు నువ్వు రాసిన ఉత్తరం చూసాక మాకు మనసు నిలవ లేదు. తమ్ముడూ నేనూ కూడబలుక్కుని, చెరో పదిహేను రోజులూ సెలవు పెట్టి వచ్చేశాం, నీకు దిగులుగా ఉండకుండా కంపెనీ ఇవ్వాలని. పిల్లలకిప్పుడు సెలవులేలే. ఇకపోతే మీ పెద్ద కోడలికే సెలవు దొరకడం కష్టమయ్యింది. చివరకు ఎలాగో సాధించాలే " అన్నాడు పెద్ద కొడుకు ఎంతో ఇదిగా.
                      " అవును నాన్నా! ఈమధ్య మీ చిన్న కోడలూ, పిల్లలూ కూడా తెగ ఇదైపోతున్నారు, మిమ్మల్ని చూసి చాలా కాలం అయ్యిందంటూ. ఇదే తగిన సమయం కదాని మేమూ బయలుదేరి వచ్చేశాము" అన్నాడు చిన్న కొడుకు కూడా.
                       గురునాధం గారి కళ్లు ఆనందంతో మెరిశాయి. "ఈ ఆత్మీయత కోసమే కదా పెద్దవాళ్లు దేవిరించేది" అనుకున్నారు మనసులో ఆయన. కొడుకులు చూపిస్తున్న అభిమానం ఆయనకు చాలా సంతోషాన్ని కల్గించింది. మెరిసే కళ్లతో వాళ్ల వైపు ఆప్యాయంగా చూశారు ఆయన.
                          *                    *                    *                    *
                          ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనేక ప్రైవేటు కాలేజీల్లో అది కూడా ఒకటి. గురునాధం గారు ముప్ఫై ఏళ్లుగా అందులో మాథమాటిక్సులో లెక్చరర్‌గా పనిచేస్తూ, ఆ ఊరి వాళ్ల మెప్పునూ, ఆత్మీయతనూ పొందగలిగారు. సుగుణమ్మ గారు కూడా ఆయనకు తగిన భార్యగా, ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది.. నిరాడంబరమైన వాళ్ల జీవన శైలి ఆ ఊరిలోని జనాలకి బాగా నచ్చడంతో, వాళ్లను ఒక ప్రత్యేకమైన గౌరవంతో చూసేవారు. ఆ ఊరు వచ్చిన కొద్ది రోజులకే గురునాధం గారు, అది ఎఫిలియేటెడ్  కాలేజీయే కదా, ఎలాగా ట్రాన్సుఫర్లు ఉండవని, పల్లెటూరిలో ఉన్న చిల్లర మల్లర ఆస్తులన్నీ మొత్తం అమ్మేసీ, కొంత బ్యాంకు లోను తీసుకునీ, ఐదువందల చతురపు గజాల స్థలంలో రెండు గదుల చిన్న ఇల్లు కట్టుకునారు. అంతకు మించిన ఆస్తిలేవీ లేవు వాళ్లకు.
                      గురునాధం గారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వాళ్లు పెద్దవాళ్లై, ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉంటున్నారు. వాళ్లకు పెళ్లిళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారు. పెద్ద కోడలు ఉద్యోగస్తురాలు,  చిన్న కోడలు గృహిణి మాత్రమే. గురునాధం గారు రిటైర్ ఔతున్న వార్త తెలిసి వచ్చారు వాళ్లు, కొద్ది రోజులు ఉండివెళ్లే ఉద్దేశంతో.చూస్తూoడగా గురునాధం గారికి "రిటైర్" కావలసిన సమయం వచ్చేసింది.
                         ఇన్నాళ్లూ విద్యార్ధుల అభివృధ్ధే తన ధ్యేయంగా, విద్యా దానమే తన కర్తవ్యంగా జీవించిన గురునాధం గారికి సగౌరవంగా వీడ్కోలు చెప్పాలని, కాలేజీ ఆడిటోరియంలో సభని ఏర్పాటు చేశారు ఆ కాలేజీ మేనేజిమెంటువారు. ఆ సభకు విద్యార్ధులూ, వారి తల్లితండ్రులూ, ఊరి పెద్దలే కాకుండా, చాలా రోజుల క్రితం ఆయన దగ్గర చదువుకుని ఇప్పుడు పెద్ద పెద్ద  ఉద్యోగాలలో ఉన్న పూర్వ విద్యార్ధులు కూడా రావడం విశేషం !
                             సభ గొప్పగా జరిగింది. రకరకాల బహుమతులతో ఆయనను ఘనంగా సత్కరించి, అధ్యాపకుడిగా విద్యా రంగానికి ఆయన చేసిన సేవల్ని మనసా కొనియాడారు చాలా మంది. మిత్రులు, సహోద్యోగులు ఆయన పదవీ విరమణ చేస్తున్నందుకు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉపన్యాసాలిచ్చారు. ఆ కళాశాల యాజమాన్యం ఆయనకి పూలదండవేసి, పండిత సాలువా కప్పి, పదివేలు రొఖ్ఖంతో ఉన్న పర్సు బహూకరించి గౌరవించారు.
                            గురునాధం గారి కళ్లు చెమర్చాయి. "రేపటి నుండి నేనుకూడా ఈ కాలేజీకి గేటు బయటి జనంలో ఒకణ్ణి కదా" - అన్న భావం  ఆయన మనసుని కలతపెట్టింది.. అలా అనుకునేసరికి ఆయనకు నీరసం వచ్చినట్లయ్యింది. ఎలాగో నిగ్రహించుకుని అందరికీ వీడ్కోలు చెప్పి, దుఃఖంతో బరువెక్కిన హృదయంతో బయటికి వచ్చేశారు ఆయన. కొడుకులు వెంట ఉండి అయన్ని ఇంటికి తీసుకెళ్లారు.
                    మనుమల రాక ఒక విధంగా గురునాధం గారి మనసుకి స్వాంతన నిచ్చిందని చెప్పవచ్చు. వాళ్ల బుడి బుడి పలుకులు వింటూ, వాళ్లతో ఆడుతూ ఆయన తన దిగులును చాలా వరకు మర్చిపోగలిగారు. సుగుణమ్మకు ఇంటి బాధ్యత పెరగడంతో అయనతో నిదానంగా రెండు మాటలు మాట్లాడడానికి కూడా ఆమెకు తీరిక దొరకటం లేదు. రాత్రి కూడా ఆమె అలసటతో వచ్చి, మంచం మీద వాలగానే సొమ్మసిలినట్లు వెంటనే నిద్రపోతోంది. అక్కడితో ఇక గురునాధం గారికి మనుమల తోడిదే లోకమయ్యింది.
                    ఆ సాయంకాలం కొడుకులూ, కోడళ్లూ కూడబలుక్కుని, పిల్లల్ని పెద్దవాళ్ల మీద వదలి, తొలి ఆట సినిమాకి వెళ్లారు. సుగుణమ్మ వంట ముగించి, పిల్లలకు అన్నాలు పెట్టింది. ఆపై తనూ భర్తా కూడా తిన్నాక, వండినవనీ డైనింగ్‌టేబులు మీద సద్ది వచ్చి,  పిల్లల్ని నిద్రపుచ్చి, తానూ అలాగే పడుకుని నిద్రపోయింది. గురునాధం గారికి మాత్రం నిద్ర పట్ట లేదు. భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఆయన కళ్లు మూసుకుని పడుకుని ఉండిపోయారు. సినిమాకి వెళ్లిన వాళ్లు తిరిగివచ్చినా ఆయన లేచీ ప్రయత్నం చెయ్యలేదు. తమ వెంట తీసుకు వెళ్లిన డూప్లికేటు తాళంచెవితో తలుపు తెరుచుకు వాళ్లు లోపలకు వచ్చారు.
                     వాళ్లు నలుగురూ బట్టలు మార్చుకుని వచ్చి భోజనాలకు కూర్చుని గుసగుసగా ఆమాటా ఈమాట చెప్పుకుంటూ  భోజనాలు చెయ్యసాగారు. క్రమంగా వాళ్ల సంభాషణ తండ్రికి రాబోయే "ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యూయిటీ" వగైరాల మీదికి మళ్లింది.
                    "అన్నయ్యా, నాన్నకున్న సర్వీసుకి డబ్బు బాగానే వస్తుంది కదూ! ఈ మధ్య లెక్చరర్లకు కూడా పెన్షనూ వగైరా బెనిఫిట్సు బాగానే ఉన్నాయని విన్నా" అన్నాడు చిన్న కొడుకు మాటల సందర్భంలో. వెంటనే సంభాషణ అటు మళ్లింది.
                    "వస్తుంది. కాని ఎంతన్నది నాకు సరిగా తెలియదు. ఎంతైనా కానియ్యి, ఇక మనం అమ్మా నాన్నల్ని ఇక్కడ ఉండనీయొద్దు. మనదగ్గరకి తీసుకు వెడదాం. ఇక ఈ ఇంటితో పనేమిటి ! దీన్ని అమ్మేసి, ఆ డబ్బు మనం చెరిసగం తీసుకుని, ఆపైన హౌసింగ్ లోనుకి పెట్టుకుని, మనిద్దరం చెరో ఫ్లాటు తీసుకుందాం. అక్కడితో మనకు ఇక అద్దెకొంపల పీడ విరగడై పోతుంది" అన్నాడు పెద్ద కొడుకు.
                  "ఔనండీ, ఈ ఐడియా చాలా బాగుంది. ఆ తరువాత, అత్తయ్య గారిని ఒకళ్లం, మామయ్య గారిని ఒకళ్లం దగ్గర అట్టేపెట్టుకోవచ్చు. అది ఎంతో సదుపాయంగా ఉంటుంది" అంటూ బావగారిని మెచ్చుకుంది చిన్నకోడలు.
                  "చాలాబాగుంది! అలాగే చేద్దాం. అత్తయ్యగారిని నేను అట్టేపెట్టుకుంటా. ఈ '"బేబీ సిట్టర్సు"తో నాకు చాలా ప్రోబ్లంగా ఉంది. ఆమె నాకు ఆసరాగా ఉంటారు" అంది పెద్ద కోడలు ఆనందంగా.
                   వెంటనే తోక తొక్కితే త్రాచు పాము లేచినట్ట్లు ఖస్సున లేచింది చిన్న కోడలు. " ఔ నమ్మా ! బెనిఫిట్లన్నీ నీకే కావాలి. నేనేమో నా పిల్లలతోపాటుగా, మామగారికి కూడా చాకిరీ చేస్తూ నాల్గు గోడల మధ్య పడి మగ్గి మన్నైపోవాలి...అంతే కదూ" అంటూ బుసలు కొట్టింది ఆమె
                          అన్నదమ్ము లిద్దరూ సందిగ్ధంగా ఒకళ్ల వైపు ఒకళ్లు చూసుకున్నారు. వాళ్ల ముఖాల్లో రంగులు మారాయి.
                        "స్వర్ణా,నువ్వేం బాధపడకు. నాన్నకు ఇంతో అంతో పెన్షన్ వస్తుంది కదా, నువ్వొక పని మనిషిని, ఎప్పుడూ ఇంటిలోనే ఉండి నీకు సాయం చేసేందుకు పెట్టుకుందువుగానిలే" అన్నాడు చిన్న కొడుకు భార్యకు ఓదార్పు కోసం.
                      " బాగుంది వరస" అంది పెద్ద కోడలు రజిత నిరసనగా, " పెన్షన్ మొత్తం మీరే తీసుకోవాలంటే కుదరదు. అది "ఫామిలీ పెన్షన్" కదా, అందులో అత్తయ్యకు సగం ఉంది. ఆమెకూ ఇవ్వాలి" అంది.
                      "మరే పాపం! మంచి తెలివినే చూపిస్తున్నావు. అత్తయ్య నీ దగ్గర వుండి నీకు అడుగడుగునా సాయపడేది చాలదా? దానికి ఏ విలువా లేదంటావా?" చిన్నకోడలు స్వర్ణ పెద్దకోడల్ని నిలదీసి అడిగింది.
                       అభిప్రాయ భేదాలు మొదలవ్వగానే అప్రయత్నంగా వాళ్ల గొంతుకలు రెచ్చిపోయాయి. గుస గుసలుగా మొదలైన సంభాషణలు క్రమంగా పెరిగి కేకల్లోకి వచ్చాయి. పక్క గదిలోనే ఉన్న గురునాధం గారు అసహనంతో పక్క మీద అటూ, ఇటూ  దొల్లసాగారు. పక్కనే ఉన్న మరో మంచంమీద పడుకుని ఉన్న సుగుణమ్మ మాత్రం గాఢనిద్రలో ఉండి, ఆదమరచి , చిన్నగా గుర్రుపెడుతూ, హాయిగా నిద్రపోతోంది. డైనింగ్ టేబుల్ దగ్గరి సంభాషణలేవీ ఆమె చెవికి చేరలేదు..
                         వెంటనే భార్యకు వత్తాసుగా మాట్లాడాడు పెద్ద కొడుకు. ' నిజమేరా తమ్ముడూ! మీకు తెలిసిన విలువలు మాకు తెలియవు మరి! అమ్మ మాతో ఉంటే ఆమె పోషణ భారం మాదే కదా ! పైగా అమ్మ జబ్బుమనిషి కూడా. ఎప్పుడు ఏ అనారోగ్యం వస్తుందో ఎవరికి తెలుసు ? మందులూ, డాక్టర్ ఫీజులు అంతాఎంత ఖర్చు ఉంటుందో ఏమో..... ఎవరికి తెలుసు ? పెన్షన్‌లో ఆమె వాటా ఆమెకు ఇస్తే ఏ అవసరానికైనా తడుముకోకుండా డిపోజిట్ చేసి ఉంచవచ్చునని మీ వదిన అభిప్రాయపడింది. అందులో తప్పేమిటిట" అంటూ టొకాయించి అడిగాడు తమ్ముణ్ణి.
                    ఇంక వాళ్ల మాటలు వినాలనిపించ లేదు గురునాధం గారికి. అప్పుడే మెలకువ వచ్చినట్లుగా, ఆవలించి ఒళ్లువిరుచుకుని, లేచి కూర్చుని చిన్నగా దగ్గి, గుక్కెడు మంచినీళ్లు గొతుకలో పోసుకుని, ఏమీ ఎరుగనట్లు మళ్లీ పడుకున్నారు ఆయన. అక్కడితో మాటలు ఆపేసి  పడుకోడానికి వెళ్లిపోయారు వాళ్లు.
                        పడుకుని కళ్లు మూసుకున్నారన్న మాటేగాని, గురునాధం గారికి ఆ రాత్రి ఒకపట్టాన నిద్ర పట్ట లేదు. కొడుకుల సంభాషణ ఆయన మనసును బాగా కలత పెట్టింది. ఏవేవో ఆలోచనలు మనసును దొలుస్తూండడంతో ఆయన నిద్రపోలేకపోయారు. నెమ్మదిగా తలెత్తి పక్క మంచం వైపు చూసిన ఆయనకు, నిర్మలంగా, పసిబిడ్డలా అమాయికంగా నిద్ర పోతున్న సుగుణమ్మ కనిపించింది. బెడ్‌లైటు వెలుగులో బేలగా కనిపిస్తున్న భార్య ముఖం వైపు చూస్తూ, " నన్నే నమ్ముకుని బ్రతుకుతున్న ఈ అమాయకురాలికి ఎట్టి పరిస్థితిలోనూ నేను అన్యాయం చెయ్యను" అనుకున్నారు. ఒక అభిప్రాయానికి వచ్చాక ఆయనకు నెమ్మదిగా నిద్ర పట్టింది.
                           *                   *                    *                      *
                         మరునాడు బ్రేక్‌ఫాస్టు టైంకి అందరూ టేబుల్ దగ్గరకు చేరారు. కోడళ్లు తెలివిగా ముందే పిల్లల్ని తెమిల్చి దొడ్లో ఆడుకోమని పంపించేశారు. కొడుకులూ, కోడళ్లూ మంచి టెన్షన్‌లో ఉండడం గమనించారు గురునాధం గారు. కానీ ఏమీ మాట్లాడకుండా, గంభీరంగా ఒక కుర్చీలో కూర్చుని, శ్రద్ధగా ఆ రోజు పేపర్ చదువుకుంటున్నారు..
                          సుగుణమ్మ ఉప్మాతో ఉన్న కేసరోల్ తెచ్చి బల్లమీద ఉంచుతూ, "ఒంట్లో నలతగా ఉండి పూరీ - కూరా చేద్దామనుకునీ చెయ్యలేకపోయా. ఉప్మా చేశా" అంది, సంజాయిషీ చెపుతున్నదానిల.
                           పెద్దకోడలు వెంటనే అందుకుని, "అదేమిటి అత్తయ్య గారూ ! ఒంట్లో బాగుండనప్పుడు ఈ ఉప్మా మాత్రం ఎందుకు చేశారు? మాతో ఒక్కమాట చెపితే మేం చేసీవాళ్లం కదా. మీరింక రెస్టు తీసుకోండి వంట  నేను చేస్తా" అంటూ ముందుకు వచ్చి టేబులు మీద ఉన్న ప్లేట్ల దొంతర లోంచి ఒక్కొక్క ప్లేటే తీసి, అందులో ఉప్మా పెట్టి, స్పూన్ వేసి ఒక్కొక్కళ్లకీ అందించసాగింది.
                          అది చూసి చిన్న కోడలు, తనూ ఖాళీ గ్లాసులు నీళ్లతో నింపి, ఆ ప్లేట్ల  పక్కన ఉంచి, అక్కడే ఉన్న నేతి గిన్నె అందుకుని వడ్డించడానికి సిద్ధంగా నిలబడింది. చిన్న కొడుకు భార్య వైపు మెప్పుగా చూశాడు.
                           పెద్దకోడలు అత్తగారివైపు తిరిగి, "మీరూ రండమ్మా, మీ అబ్బాయిల్తో కూర్చుని మీరు కూడా చల్లారక ముందే ఉప్మా తిందురుగాని" అంటూ ఆమెను మామగారి పక్కనున్న కుర్చీలో కూర్చోమని బలవంతం చేసి కూర్చోపెట్టింది.
                      ఎన్నడూ ఎరుగని ఈ ఆత్మీయతలు చూడగానే "ఇది కలా, నిజమా" అనే సందేహం వచ్చింది సుగుణమ్మగారికి. కాని, డైనింగ్ టేబులు చుట్టూ మూడు జంటలూ అలా నిండుగా కూర్చుని టిఫిన్ తినడం ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది. కోడలు వడ్డించిన వేడి వేడి ఉప్మా చెంచాతో టీసుకుని తింటూ మురిసిపోయింది ఆమె, కొంతసేపు అందరూ తినడం మీదే దృష్టిని కేంద్రీకరించారు.
                        ఉప్మా తినడం పూర్తిచేసి నెమ్మదిగా అసలు విషయంలోకి వచ్చాడు పెద్దబ్బాయి. " ఇంకా మీరు ఇక్కడే ఎందుకు ఉండాలి నాన్నా ! రేపు మాతో మీరూ హైదరాబాదు వచ్చెయ్యండి.ఇక్కడి సంస్థానమంతా కట్టిపేట్టేద్దాం.. ఏకంగా అందరం అక్కడే ఉంటే సరిపోతుంది, ఏమంటావు ?"
                          వెంటనే అన్నగారికి వత్తాసుగా, "ఔను నాన్నా ! మీరు రిటైరు అయ్యాక కూడా ఎందుకు ఇంకా ఈ ఊరినే పట్టుకు వేళ్లాడాలి మనం!  మీకు గ్రాట్యూయిటీ అనీ, ప్రోవిడెంట్‌ఫండనీ ఏవేవో సొమ్ములు వస్తాయి కదా? దానికి తోడుగా ఈ ఇల్లు కూడా అమ్మేసి, ఇంకా డబ్బు తక్కువైతే బ్యాంకు లోనుకి పెట్టుకుంటే, నేనూ అన్నయ్యా చక్కగా, మా మా ఆఫీసులకు దగ్గరగా ఉండేలా చూసుకుని చెరో ఫ్లాటూ తీసుకుంటాం. మీరు కూడా మాతోపాటే, నాదగ్గర ఒకళ్లు, అన్నయ్య దగ్గర ఒకళ్లు ఉండవచ్చు. స్వంత ఇళ్లే కనుక వసతిగా ఉంటుందికూడా! ఏమంటారు" అన్నాడు చిన్నబ్బాయి గుక్క తిప్పుకోకుండా.
                             "నిజమే నత్తయ్యా! మరిది మంచి మాట చెప్పాడు. ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండడంకన్న మాతో ఉండడమే బాగుంటుంది కూడా" అంది పెద్ద కోడలు బెల్లింపుగా
                             తెల్లబోయింది సుగుణమ్మ. భర్త వైపు బేలగా చూసింది. పెళ్లైనది మొదలు తానూ భర్తా ఎప్పుడూ పది రోజులకంటే ఎక్కువ చెరోచోటా ఉన్నది లేదు. పొద్దు సంజకు మళ్లాక ఇప్పుడు ఆ ఏర్పాటు ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు. అంతేకాదు, ఇల్లు అమ్మడం అన్నది కూడా ఆమెకు సమ్మతం కాదు. ఈ  ఇల్లు తాము దగ్గరుండి  మనసు పెట్టి కట్టించుకున్నది. ఈ ఇంటిలో ప్రతి ఇటుక చాటునా ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి తమకు. తన పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు. ఇక్కడే తను ఆడపడుచుకి పెళ్లి చేసింది.....ఇలా ఎన్నెన్నో బాధ్యతలకు, బంధాలకు జ్ఞాపిక ఈ ఇల్లు. ఇది తన ఆశల హరివిల్లు, ఆనందపుటలరులు పూసిన పొదరిల్లు ! దీనిని అమ్మెయ్యడం అన్న మాట ఆమె భరించలేదు.
                          గురునాధం గారు ఒక్కసారి భార్య వైపు చూసి, నిదానంగా ఆఖరి చెంచా ఉప్మా కూడా తినడం పూర్తి చేసి, మంచినీళ్లు త్రాగి, కుర్చీ కమ్మీ మీదే ఉంచబడిన చిరు తువ్వాలుతో మూతి తుడుచుకుని కుర్చీలో సద్దుకు కూర్చున్నారు, ఈ పరిస్థితి వస్తుందని ముందే తెలుసు కనుక, ఆయన ఏమీ చెలించలేదు. కాని ఆయన ఏం చెపుతారో వినాలని ఆత్ర పడుతున్నారు తక్కిన వాళ్లు.
                       గొంతు సవరించుకుని ధృఢమైన కంఠస్వరంతో చెప్పసాగారు గురునాధం గారు., "అమ్మాయిలూ, అబ్బాయిలూ ! ఇన్నాళ్లూ మీకెవరికీ తెలియని కుటుంబ విషయాలు కొన్ని, నేను మీకీవేళ చెప్పాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి.........
                      అబ్బాయిలూ! మీకు మీ నాన్నమ్మ గుర్తుందికదూ ! కాని ఆమె నన్ను కన్న తల్లి కాదన్నది మీకు తెలియదు. ఆమె మా నాన్నకి రెండవ భార్య, నాకు సవతి తల్లి. వ్యాపారం దెబ్బతినడంతో మనసు చెడి, అకస్మాత్తుగా వచ్చిన గుండె పోటుతో మరణించారు మా నాన్న. అప్పటికి నేనింకా బి. ఎస్సి. ఫైనల్ ఇయర్‌లో ఉన్నా. కబురు తెలిసి వెంటనే ఇంటికి పరుగెత్తా. నేను వెళ్లేసరికి మీ నాన్నమ్మ అంటే నా మారుటితల్లి, తన ఆరేళ్ల కూతుర్ని గుండెలకు హత్తుకుని, మా నాన్న శవం దగ్గర కూర్చుని గుండెలవిసిపోయేలా ఏడుస్తోంది. ఆ ఏడుపులో నాకు, భర్త మరణించాడన్న దుఃఖంతోపాటుగా, ఇక మా భవిష్యత్తు ఏమిటి - అన్న ఆర్తనాదం కూడా వినిపించింది. వెంట్నే నేనొక నిర్ణయానికి వచ్చా.
                      అంత వరకు నేను ఆమెను "పిన్నీ" అని పిలిచే వాడిని.అప్పుడుమాత్రం "అమ్మా" అని పిలవాలనిపించింది. "అమ్మా ! ఏడవకమ్మా. నాన్నను నేను నీకు తెచ్చి ఇవ్వలేనుగాని ఇకనుండి నీకూ, చెల్లికీ నేను అండగా ఉంటానమ్మా" అని చెప్పి ఆమెను ఓదార్చా. వాళ్లని అలాగే చూసుకున్నా కూడా.
                       ఆ తరవాత కొన్నాళ్లకి మీ అమ్మ నాకు సహధర్మచారిణి అయ్యింది. మీ తాతయ్య నేను అడక్కపోయినా నాకు పదివేలు రొఖ్కం వరదక్షిణగా ఇచ్చారు. వెంటనే నే నా డబ్బుని, నా చెల్లెలి పెళ్లి కోసం బ్యాంకులో దాచా. ఇంతవరకు మీ అమ్మ ఆ డబ్బును గురించి నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నేనేంచేసినా ఎప్పుడూ మీ అమ్మ నన్ను "ఎందుకు" "ఏమిటి" అని అడిగిన పాపాన పోలేదు ఎప్పుడూ. ఆమె నన్నంతగా నమ్మింది."
                      ఊపిరి పీల్చుకోడానికి ఒక్క క్షణం ఆగారు గురునాధం గారు. అంతలో చిన్న కొడుకు ఏదో మాట్లాడ బోతే, ఆయన చేతి సైగతో వారించి, ఒక గుక్క మంచినీళ్లు త్రాగి మళ్లీ చెప్పడం మొదలు పెట్టారు.....
                  "నే నిదంతా మీకు చెపుతున్నది మీ మెప్పూ, మెహర్భానీలకోసం కాదు. ఒక్క తరం మారే సరికి మానవత్వపు విలువలు ఎంతగా దిగజారిపోయాయో మీకు తెలియాలని మాత్రమే. మధ్యలో అడ్డురాకుండా చెప్పేది పూర్తిగా వినండి......
                        నిరుడు మీ అమ్మకి చాలా పెద్ద జబ్బు చేసిన సంగతి మీకు గుర్తు ఉండే ఉంటుంది. మీరప్పుడు నాకు సానుభూతి ఉత్తరాలు కూడా రాశారు కదా ! .అది మీరు మళ్లీ చెప్పనక్కర లేదు, నా కదంతా బాగా జ్ఞాపకం ఉంది. సరిగా అప్పుడే మీలో ఒకరికి ఇనస్పెక్షన్ జరుగుతోండడంవల్లా, ఇంకొకళ్లు అదే సమయంలో స్పెషల్ ట్రైనింగు మధ్యలో ఉండడం వల్లా, మృత్యు ముఖంలో ఉన్న తల్లిని చూడడానికి రాలేక పోయారు మీరు. కనీసం డబ్బేమైనా కావాలా -అని కూడా మీలో ఎవ్వరూ నన్ను అడగలేదు.
                           డాక్టర్ కిడ్నీ మార్చా లన్నాడు. నా కిడ్నీ సరిపడ లేదు. హెచ్చు ఖరీదు ఇచ్చి కొనాల్సి వచ్చింది. దొరకడం కూడా చాలా కష్టమయ్యింది. ఆశ చావక, అంతవరకు తరచు "డయలసిస్" చేయిస్తూ మీ అమ్మని బ్రతికించుకుంటూ వచ్చా. ఇల్లు బేరం పెట్టా. చివరిదాకా మృత్యువుని ఎదిరించాలనే అనుకున్నా. మీ అమ్మ లేకుండా నేను లేను.... అనిపించింది. చివరకు నాతో పడలేక మృత్యువు మీ అమ్మను నాకు వదలి వెళ్లిపోయింది." అకస్మాత్తుగా కంఠం గద్గదమై ఆయన మాట్లాడలేకపోయారు.
                          కోడళ్లు మొహమొహాలు చూసుకున్నారు. సుగుణమ్మ గారు, భర్త తనకోసం పడిన పాట్లు గుర్తు రాగా, చెమ్మగిల్లిన కళ్లను పైట చెంగుతో ఒత్తుకున్నారు. వాతావరణం గంభీరంగా మారింది. కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు.
                       గురునాధం గారే ముందుగా సద్దుకని మళ్లీ చెప్ప సాగారు. 'నా భార్య మంచం మీద ఉన్నన్నినాళ్లూ నాకు మాట సాయం, మనిషి సాయమే కాదు, మనీ సాయం  కూడా చేసిన వాళ్లు నా స్టూడెంట్లు, వాళ్ల  తల్లితండ్రులు,  ఆపై ఇరుగు పొరుగుల వారూను. వాళ్లు నన్ను ఇల్లు అమ్మనివ్వ లేదు. అవసరం ఉన్నంతా తలో కొంచెం చేబదులుగా సద్దారు. మొత్తానికి వాళ్ల పుణ్యమా అని, నాకు ఇల్లు, ఇల్లాలూ కూడా దక్కేలా చేశారు. మీరేమో ఓ కార్డుముక్క రాసి సరిపెట్టేశారు. చాలు, ఈ జన్మకి ఈ అనుభవం చాలు" అన్నారు ఆయన విరక్తిగా.
                        ఆ మాటలు విన్న సుగుణమ్మ గారు, "ఇదంతా మనసులో ఉంచుకునా ఈయన, "కొన్నాళ్లు మనం వెళ్లి పిల్లల దగ్గర ఉండి వద్దాము" అన్నప్పుడు, "సర్లే, ,చూద్దాం. ముందు వాళ్లు మనల్ని రమ్మననియ్యి" అన్నారు" అనుకుంది మనసులో.
                     గురునాధం గారే ముందుగా తేరుకున్నారు. "ఇప్పుడిక మీరు ఎంతసేపటినుండో వినాలని ఎదురు చూస్తున్న విషయంలోకి వద్దాం" అన్నారు. ఆపై జేబులోంచి రుమాలు బయటికి తీసి, నెమ్మదిగా కళ్ల జోడు తుడిచి మళ్లీ పెట్టుకుని, చెప్పడం మొదలు పెట్టారు.....
                        " మొదటి మాట... మిత్రుల ధర్మాన నిలబడ్డ ఈ ఇంటిని ఇక అమ్మే ఉద్దేశం నాకు లేదు. ఇది మీ అమ్మ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు. ఇది ఆమె ఉన్నన్నినాళ్లూ ఆమెతోనే ఉంటుంది.
                        రెండోది.... డబ్బు ! మీ అమ్మ జబ్బు పడ్డప్పుడు చేసిన అప్పుల్లో కొన్ని ఇంకా తీర్చవలసినవి ఉన్నాయి. అప్పులన్నీ తీర్చాక ఇంకా ఏమైనా మిగిలితే ఆమెను తీసుకుని తీర్థయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నా. మా అనంతరం మాట ఏమోగాని, ప్రస్తుతానికి ఈ ఇంటిమీద ఏ ఆశలూ పెట్టుకోకండి.
                       ఇక ఆఖరుమాట కూడా వినండి...... మీ అమ్మ వేరు, నేను వేరు అని నే నెప్పుడూ అనుకో లేదు. మమ్మల్ని విడదీసి పంచుకోడం మీ వల్ల నయ్యే పని కాదు. మృత్యువు కూడా ఆ పని చెయ్యకూడదు అన్నది నా ఆకాంక్ష. పుత్రుడు అంటే, "పున్నామ నరకం నుండి తప్పించే వాడు" అని అర్ధం చెపుతారు. నరకందాకా ఎందుకు, తల్లితండ్రుల్ని వృద్ధాప్యపు వడిదుడుకులనుండి రక్షించేపాటి ఔదార్యం కూడా ఉండటం లేదు ఈ నాటి కొడుకులకి !
                           ఎవరో, ఎప్పుడో, ఏదో మనకు ఒరగదోస్తారని, ఎవరూ ఎవరి మీదా ఏ ఆశలూ పెంచుకో కూడదు. ఈ కలియుగంలో స్వార్ధమే పరమార్ధం.
మా రోజులు బాగుండాలంటే మేమూ స్వార్ధపరులం కాక తప్పదు. కాని మీరు మా పిల్లలే నన్నది మేము ఎప్పుడూ మర్చిపోము. ఇదివరకు లాగే మీరు ఇక ముందు కూడా, మీకు ఎప్పుడు రావా లనిపించినా వచ్చి వెడుతూండండి."
                            చాలా సేపు ఏకబిగిని మాట్లాడడంతో ఆయనకు దాహం వేసింది కాబోలు, పక్కనున్న గ్లాసు ఎత్తి నీళ్లు నోట్లో పోసుకోబోయారు. కాని అందులో చుక్క నీళ్లు కూడా లేవు.
                     *                    *                   *                    *                    *
                            " పెట్టిన శలవు అయిపోయింది"  అంటూ గురునాధంగారి అబ్బాయిలు ఆ మరునాడే హైదరాబాదుకి ప్రయాణమయ్యారు. గేటు దాకా వెళ్లారు గురునాధం దంపతులు వాళ్లతో. వాళ్లని సాగనంపి వెనుదిరిగిన గురునాధం గారికి భార్య కళ్లల్లో కన్నీరు కనిపించింది.
                            ఆప్యాయంగా, భార్య బుజం చుట్టూ చెయ్యి వేసి ఇంట్లోకి నడిపిస్తూ అడిగారు గురునాధం గారు, "సుగుణా ! నేను తప్పుచేశా నంటావా" అని.
                         " లేదండీ, మీరెప్పుడూ తప్పు చెయ్యరు. నా కడుపు తీపి నా కళ్లను తడిపింది" అంది ఆమె అనునయంగా.
                        "గుండె నిబ్బరం చేసుకో సుగుణా. ఈ రోజుల్లో మనిషికి కావలసింది, ఏ పరిస్థితినైనా ఎదుర్కో గల మనోధైర్యం ! అది లోపిస్తే, స్వార్ధమే పరమార్ధ మైన ఈ కలియుగంలో మనిషి బ్రతకడం చాలా కష్టం. తల్లి తండ్రులకి, వాళ్లు బ్రతికి ఉండగానే, "మదర్సు డే", "ఫాదర్సు డే" - అంటూ దినాలు జరిపించేసి, ఆ రోజునే చేతులు దులిపేసుకోడం ఫేషన్‌గా మారిన ఈ రోజుల్లో మనం పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోడంలో అర్ధం లేదు. తల్లి తండ్రులు కూడా, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం త్యాగాలూ చేసెయ్యకుండా, కనుగలిగి, ముందు చూపుతో వృద్ధాప్యంలో పబ్బం గడుపుకోడం కోసం నాల్గు రాళ్లు వెనకేసుకోవాలి, తప్పదు. కన్న వాళ్లకీ, బిడ్డలకీ మధ్య తప్పని సరిగా ఉండవలసిన పరస్పర సహకారం లోపించడంతో వచ్చే వెలితి ఎప్పటికైనా జనం అర్ధం చేసుకుంటారో లేదో. ఇది ఒక విష వలయం ! ఒకరి సంగతి ఒకరికి పట్టని పరిస్థితిలో క్రమంగా జాతి నిర్వీర్యమై పోతుంది. స్వార్ధమే ఈ యుగ ధర్మం ! మనమేంచెయ్య లేము" అంటూ నిట్టూర్చారు ఆయన. ఇద్దరూ మెట్లెక్కి ఇంట్లోకి వచ్చారు. ఆమెకు ఇల్లంతా బోసిగా కనిపించింది.
పిల్లలు వెళ్లిపోయాక సుగుణమ్మ గారిలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది గురునాఢం గారికి. ఆ రాత్రి భోజనాలు ముగించి వచ్చి విశ్రాంతిగా కూర్చున్నాక ఆ విషయం ఎత్తారు ఆయన. అలవాటుగా తాంబూలం అందిస్తున్న భార్య చెయ్యి పట్టుకుని, "సుగుణా! నువ్వు మామూలుగా లేవు, దేనికో బాధ పడుతున్నా వనిపిస్తోంది. నా నిర్ణయం నీకు నచ్చలేదా? ఐతే చెప్పు, రేపే మనం బయలుదేరి పిల్లలదగ్గరకి వెళ్లిపోదాం. నువ్వు బాధ పడడం నేను చూడలేను" అన్నారు ఆయన.
                 " రెక్కలొచ్చిన పిట్టలు ఎగిరిపోక మనతో ఉంటాయా! అదికాదు..... మనిషికీ జంతువుకీమధ్య నున్న తేడాని గురించి ఆలోచిస్తున్నా. ఒక విధంగా చూస్తే అవే నయమనిపిస్తోంది. అవి ఒకసారి ఇల్లు వదలి వెళ్లిపోతే మళ్లీ వెనక్కి తిరిగిచూడవు.
                  నాకు జబ్బు చేసినప్పుడు మీరు ఓపిగ్గా వున్నారు కనుక ఒక్కరూ ఆ తిప్పలన్నీ పడగలిగారు. రేపు మనమిద్దరమూ వయసు మీరి కాలూ చెయ్యీ ఆడక అవస్థ పడుతూంటే .... అప్పుడు మనల్ని ఆదుకునేది ఎవరు.... అన్నది తల్చుకుంటేనే భయమేస్తోంది. చిన్నప్పటి నుండీ పెంచి పెద్ద చేసిన కన్నవాళ్ల మీద కనికరమన్నది లేకుండా, ఇంకా మననుండి ఏవేవో రాబట్టాలని వంతులేసుకుని మరీ పోటీ పడుతున్నారే?....అదే నాకు దుఃఖం తెప్పిస్తోంది" అంది సుగుణమ్మ దిగులుగా.
                ఏమీ మాట్లాడలేక కొంతసేపు మౌనంగా ఉండిపోయారు గురునాధం గారు. చివరికి సద్దుకుని, "నిజమే సుగుణా! మనకు చివరి రోజుల్లో పిల్లలు దక్షత అవుతారనే ఆశ పెట్టుకోడంలో అర్ధం లేదు. మానవత్వపు విలువలు నానాటికీ తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ఆ ఆశే దుఃఖం. ఎవరి మీదా ఆధార పడకుండా ముందు చూపుతో మన బ్రతుకు తెరువు గురించి మనమే ఆలోచించుకోవాలి. నువ్వు బాగా గుర్తుచేశావు! దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోడం మంచిపని" అంటూ, ఆలోచనలో పడ్డారు ఆయన.
                 సుగుణమ్మ, ఒక్కొక్క తములపాకుకీ సున్నం రాసి, ఈనెలు తీసి, వక్కపొడి చేర్చి భర్తకు అందిస్తూ, మధ్యమధ్య ఒక్కొక్క సారి తనూ తింటూ ఆయన ఏం చెపుతారో వినాలని మనసంతా ఆత్రం నింపుకుని ఎదురు చూస్తోంది.
                  ఇక తాంబూలం చాలు అన్నట్లు చేతితో సైగ చేసి, చెప్పసాగారు గురునాధంగారు. " నాకొక ఆలోచన తోస్తోంది, చెపుతా విను....... నాకు ఎన్నాళ్లనుండో ఉన్న కోరిక, నీతో కలిసి యాత్రలకు వెళ్లాలని. తిరిగి వచ్చాక మనం ఒక పని చేద్దాం! ఈ ఇంటిని ఒక వృద్ధాశ్రమంగా మారుద్దాం. మనం కాక మరో నలుగుర్ని చేర్చుకుందాం. కష్టాలూ, ఖర్చులూ సమంగా అందరం పంచుకుందాం. ఒకళ్ల కొకళ్లం ఆసరాగా ఉందాం. పిల్లలను మనం కాదనం. వాళ్లు చూడాలనుకుంటే, ఎప్పటిలాగే వచ్చి చూసి వెళ్లొచ్చు. ఇలా చేయడం వల్ల కనీసం మనకు స్వేఛ్చా స్వతంత్రాలైనా మిగిలి ఉంటాయి! ఎలా ఉంది నా ఆలోచన?"
                 "చాలా బాగుందండీ. అలాగే చేద్దాం" అంది సుగుణమ్మ.
                    కళ్ల మీదకు నిద్ర ముంచుకు వచ్చేవరకు వాళ్లు చాలాసేపు ఆ విషయాలే మాట్లాడుకున్నారు.                                                 
                      "సరిలే, సుగుణా, ఇక మనం సామాను సద్దుకుందామా" అన్నారు ఆయన.                                                                 
                      ఆశ్చర్యంతో "ఎందుకు" అన్నట్లుగా ఆయన వైపు చూసింది ఆమె.
                     "నాల్గు రోజుల్లో మనం బయలుదేరి తీర్థయాత్రలకు వెడదాం. ఇన్నాళ్లూ ఉద్యోగంతో నేనూ, సంసార బాధ్యతతో నువ్వూ ఏ సరదా లేకుండా బ్రతికేశాం. ఇప్పుడైనా తీర్థ యాత్రల పేరుతో స్వేఛ్చగా తిరిగి, నాల్గు ఊళ్లూ చూసివద్దాం" అన్నారు గురునాధం గారు.
                      సుగుణమ్మ చిన్నగా నవ్వుతూ, "తీర్థ యాత్ర ఏమిటి, "ప్రేమ యాత్ర" అనండి, బాగుంటుంది" అంది.
                      భార్య తన మనసుని అర్ధం చేసుకిన్నందుకు గురునాధం గారి గుండె ఆనందంతో ఉప్పొంగింది. కళ్లల్లో తడి, పెదవులపై చిరునవ్వు మెరుస్తూండగా ఆమె ఆయనకు వింత అందంతో కనిపించింది. ఆయన కళ్ల నిండా ప్రేమ నింపుకుని ఆమెనే చూస్తూ, కోటి రాగాల తీయదనం ఉట్టిపడే ఎలుగుతో "సుగుణా" అంటూ ఆర్ద్రంగా పలికారు ఆమె పేరుని.
                       "నీకు నేనూ, నాకు నువ్వూ...... ఏటి ఒడ్డున కోట కడదాం పదవే" అని పాడుతూ, రోడ్డువెంట పుచ్చపువ్వులా విరిసి ఉన్న వెన్నెలలో సైకిల్ తొక్కుకుంటూ పోతున్నారు ఎవరో !
------------------------------------------------------ 
రచన - వెంపటి హేమ, 
సుజనరంజని సౌజన్యంతో

No comments:

Post a Comment