పెరుమాళ్లకెరుక
ఈ కథను ఆస్వాదించండి.............
మేము కాపురముంటున్న కాలనీలోకి కొత్త కుటుంబమొకటి అద్దెకు దిగింది. కాలనీ మొత్తం కలిసికట్టుగా ఒక కుటుంబంలా మసలేవాళ్లం. మా కాలనీలో ఇంచుమించు అందరివీ సొంత ఇండ్లే.ఇండ్లు కట్టి ఉద్యోగరీత్యా వేరే వూర్లలో కాపురమున్న కుటుంబాలు ఓ ఏడెనిమిదుంటాయి. వాళ్ల ఇండ్లలో పర్మనెంటుగా అద్దెకున్న కుటుంబాలు ఓ నాలుగున్నాయి. మిగిలినవి వచ్చేవాళ్లు పొయ్యేవాళ్లుగా ఉంటాయి.
కొత్తగా ఎవరొచ్చినా వున్నన్నినాళ్లు వళ్లనుమాలో ఒకరిగా కలుపుకోవడం మా కాలనీ ఆచారం. ఆ తంతులో భాగంగానే కొత్తగా వచ్చిన ఇంటికి మా కాలనీ ఆడవాళ్లమంతా కలిసి ఓ సుముహూర్తంలో అడుగుపెట్టాం.
ఇక్కడ మా కాలనీ వాళ్ల గురించి కొంత చెప్పాలి. మా కాలనీలో సుమారు ఏభై ఇండ్లుంటాయి. ఆ ఇండ్లలో ఆడమగ ఇద్దరూ ఉద్యోగాలు చేసే ఇండ్లుకొన్ని. వాళ్లు పెళ్లీ పేరంటాల్లాంటి వాటికి తప్ప కలవరు. మిగిలిన వాటిల్లో వున్న స్త్రీలు కొంతమంది కడుపేకైలాసం, ఇల్లే వైకుంఠమన్నట్లుగా వాళ్లెప్పుడూ గడపదాటరు, కొంతమంది ఆడికో అమాసకో అడపాదడపా కలుస్తుంటారు. మేమొక పదిహేను మందిమి మాత్రం ప్రతిరోజూ ఎవరింట్లోనో ఒకరింట్లో తప్పక కలుస్తుంటాము. మగవాళ్ల టిఫిన్లు చేసి ఆఫీసులకు వెళ్లిపోయిన తర్వాత గబగబా వంటపని పూర్తి చేసుకుంటాము. ముందురోజే ఎక్కడ కలవాలన్నది నిర్ణయమవుతుంది. స్టోరుకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలన్నా, మార్క్ట్టెట్టుకు వెళ్లి కూరగాయలు తెచ్చుకోవాలన్నా అందరం కలిసే వెళ్తాం. మా గ్రూప్ లో ఎవరైనా చీరలు కొనాలన్నా, నగలు కొనుక్కోవాలన్నా ఇదే తంతు. వీలైనంతమంది ఆ కొనుగోలులో పాలు పంచుకుంటాం.
పది పన్నెండు మందిమి ఒక్కసారిగా వెళ్లేసరికి వీధిలోనే మా మాటలు విన్నట్ట్తుంది. ఆ ఇంటి ఇల్లాలు ’రండి రండి’ అంటూ సాదరంగా ఆహ్వానించింది. మాకందరికి పెద్దదిక్కుగా వున్న సత్యవతక్క మమ్మల్ని ఒక్కొక్కరినే ఆమెకు పరిచయం చేసింది.
వాళ్లు వరంగల్లు నుంచి వచ్చారు. ఆయింటి యజమానిపేరు సోమశేఖరం. బ్యాంకులో వుద్యోగం. ఆమె పేరు స్నేహలత. వాళ్లకిద్దరు పిల్లలు. పెద్దమ్మాయి హైదరాబాద్ లో రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. పేరు లహరి. చిన్నవాడు లోహిత్ ఎనిమిదవ తరగతి.
ఇవన్నీ మేం ఒక్కొక్కరం ఒక్కో ప్రశ్న వేయగా స్నేహలత నోటిద్వారా తెలుసుకున్న వివరాలు. ముఖ్యమైన ఈ విషయాల్ని అందించి ఇప్పుడే వస్తానంటూ స్నేహలత లోపలికెళ్లింది. మాకు కాఫీనో టీనో ఆఫర్ చెయ్యడానికి వెళ్లుంటుందని తెలుసు.
ఈ లోపల మా కండ్లన్నీ డ్రాయింగ్ రూంలోని అణువణువునూ దర్శించుకున్నాయి.కొత్తగా సర్దుకోడం వల్ల కాబోలు ఎక్కడా ధూళిదుమ్ము లేకుండా నీట్ గా వుంది. సోఫాలు, టీపాయ్, టీ. వీ., దివాను- మామూలే. అయినా ఆ సెలక్షన్లో ఎంతో నేర్పున్నట్లు వాటిని చూస్తూనే తెలుస్తోంది.
కార్నర్స్ లో చోటు చేసుకున్న ప్లవర్ వేజ్ లు సహజమైన రంగులతో, అంతకంటే సహజమైన రూపాలతో అప్పుడే చెట్లకు పూసిన పువ్వుల్లాగా కంటికింపుగా ఉన్నాయి. పెద్ద సోఫాకు ఎడమ పక్కగా పెట్టిన రోజా పూలగుత్తి సహజమైన వాసనలను వెదజల్లుతుంటే దానికి దగ్గరగా కూచున్న సౌమ్య వాటిని ముట్టిచూసి "ఏయ్! ఇవి చూడండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ గులాబీ వాసనతో ఎలా గుబాలిస్తున్నాయో’ అంది.
టీ.వి. పక్కగా వున్న కార్నర్ వుడెన్ స్టాండ్ లో పెట్టిన పిల్లల ఫోటోలను తదేకంగా చూస్తూ నిలబడిన ఆశ వెంటనే టి.వి. పైన పెట్టిన లిల్లీలకు ముక్కుచేర్చి ఇవికూడా అచ్చు లిల్లీల వాసనేస్త్రున్నాయంటూ అందరివైపు చూసింది.
ఈ లోపల స్నేహలత ఆ గదిలో ప్రవేశించడాన్ని చూసి ఎక్కడి వాళ్లక్కడ సర్దుక్కూచున్నారు. ’మీ అమ్మాయి అబ్బాయి ఫోటోనాండి’ అంది ఆశ. ’అవునండీ’ అని స్నేహలత సమాధానం. మళ్లీ ప్రశ్నల పరంపర మొదలైంది. ’ఈ ఫ్లవర్ వేజ్ లన్నీ ఎక్కడ కొన్నారండీ చాలా బాగున్నాయి?’ అంటూ సత్యవతక్క ప్రశ్నతో పాటే ఒక సర్టిఫికెట్ కూడా సమర్పించింది. ’హైదరాబాద్ లోనే నండి’ అంది స్నేహలత. ’నేచురల్ ఫ్లవర్స్ లాగా వాసనెలా వచ్చిందండీ’ అడిగింది సౌమ్య. అప్పుడప్పుడూ సెంటు స్ప్రే చేస్తానండీ’ అంది స్నేహలత.
ఆమె అలంకరణ, పిల్లల ఫోటోల్లోని డ్రస్ లు, వాళ్ల హెయిర్ స్టైల్స్, ఇంటిలోపలి డెకరేషన్ ఆమెకున్న కళానైపుణ్యాన్ని చెప్పక చెప్తున్నాయి.
మంచి ఈస్తటిక్ సెన్స్ వున్న మనిషి అనిపించింది. ఆమెముందు మా గ్రూప్ వాళ్లెవరిని నిలబెట్టినా దిగదుడుపుగానే ఉన్నామనిపించింది.
ఇంతలో ఓ యాభైయైదేండ్ల వయసున్న ఒక స్త్రీ trayలో juice glass లతో ప్రత్యక్షమైంది. ఆమెను పరిచయం చేయకపోవడాన్ని బట్టి ఆమె కట్టుకున్న చీరను బట్టి వంటమనిషనుకున్నాం. చెవులకు కమ్మలు తప్ప మరే నగా లేదు. కానీ మొహం కళగా వుంది. విడో, మొహాన బొట్టు లేకపోయినా అందంగా వుంది.
తర్వాత ఓ ఐదు నిముషాలు కూర్చోని మా ఇండ్లకు రమ్మని ఆహ్వానించి వచ్చేశాం.
దారిలో మంచి ’కళాపోసనున్న మనిషి’ అంది సత్యవతక్క రావుగోపాలరావును అనుకరిస్తూ.
"నిజమే అని అందరం అంగీకరించాం. ’కళా పోసనతో పాటు సదువు సంస్కారం కూడా వున్న మనిషే" అంది శాంత.
’ఆమె అదృష్టం. మంచి వంటమనిషి కూడా దొరికింది. బాగా నమ్మకస్తురాలిలా వుంది.’అని అన్నాను నేను.
మళ్లీ మల్లికా వాళ్ల పాప పుట్టిన రోజుకు స్నేహలతను కూడా ఆహ్వానించినట్లు చెప్పింది మల్లిక. కరెక్ట్ టైముకు ఒక నిముషం కూడా ఇటూ అటూ కాకుండా మల్లిక వాళ్ల గడపలో అడుగుపెట్టింది స్నేహలత. పంక్చువాలిటీ కూడా మెయిన్ టెన్ చేస్తుందనుకున్నాం. వెంట వచ్చిన వాళ్ల వంటమనిషి ఒక పెద్దపాకెట్ ను ఆమె పక్కన పెట్టింది. ’నువ్వికవెళ్లు’ అనగానే ఆ పెద్దావిడ వెళ్లిపోయింది.
అందరి చూపులు ఒక్కసారిగా స్నేహలత శరీరాన్ని తాకాయి. లైట్ క్రీం కలర్ కు బ్లాక్ బార్డరున్న సీకోగద్వాల్ చీర రోలింగ్ కారణంగా ఆమె శరీరం మీద పొందిగ్గా అమరింది. చెవులకు, మెడకు ముత్యాలు, నల్లరాళ్ల కమ్మల లాకెట్. చేతిలో అవే కాంబెనేషన్ తో గాజులు, మెడమీద చిన్నకొప్పు. చాలా సింపుల్ గా డీసెంట్ గా వుంది. అలంకరణ.
చక్కని అందం, దానికి తగిన అలంకరణ, సంస్కారం, కూర్చున్న వాలకం, మాట్లాడేతీరు మమ్మల్ని ఆమెకు కాస్త దూరంగానే వుంచాయి. ’ఏమే గీమే’ అని ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకొనే మేము ఆమె దగ్గర మాత్రం మొహమాటంగానే వున్నాము. ’ఏమండీ’ అంటూ ఆచితూచి మాట్లాడ్తున్నాము.
మల్లిక తన ఇంటికి ఇందిరాగాంధి దిగబడిందన్నట్లుగా చిరునవ్వుతో ఆమెను పలకరించింది. తన ఆడబిడ్డల్ని తీసుకొచ్చి పరిచయం చేసింది. అది చాలదన్నట్లు తను పనిమీద వెళ్తూ ’మీరు కంపెనీ ఇవ్వండ’ ని మమ్మల్ని పురమాయించి వెళ్లింది.
మల్లిక వాళ్లపాపను తీసుకొచ్చి చూపెట్టినప్పుడు ఏదో మాట్లాడాలన్నట్లు ’నీపేరేంటమ్మా’ అని బుగ్గగిల్లి పలకరించిందామె. ’హసిత’ అని పాప అనగానే ’చాలా ముద్దుపేరు’ అని అభినందించింది.
ఆ శాల్తీ చుట్టూ కూచున్న మాకు ముళ్లమీదున్నట్లుంది. ఎన్నో ఏండ్లుగా కాలనీలో వుంటున్నాము. ఎప్పుడూ ఏ ఫంక్షన్ లోనూ ఇంత బెరుకు ఫీల్ కాలేదు. అలా అని ఆమేం దేవలోకం నుంచి దిగి రాలేదు. అంత రిజర్వుడుగా ప్రవర్తించమనీ చెప్పలేదు. అయినా ఎవరూ కూడా మనసు విప్పి ఫ్రీగా మాట్లాడలేక పోయాము.
కొత్త కావడంవల్ల అలా వున్నామనుకోవడం కూడా అబద్ధమే. ఎందుకంటే ఎంతోమంది కొత్తవాళ్లు ఆ కాలనీకి వచ్చినప్పుడు మేమెప్పుడు ఇలా ఫీల్ కాలేదు. గలగలా మాట్లాడి మొదటిరోజే వాళ్ల బీరువాలోని చీరల్ని, నగల్నీ దర్శించి వచ్చిన దాఖలాలెన్నో వున్నాయి.
జీవన విధానంలో వున్న చిన్నచిన్న పద్ధతులు ఒక మనిషికి ఇంతటి వున్నతస్థానాన్ని ఆపాదిస్తాయా అని అనుకున్నాను మనసులో.
ఒక్కరోజు పరిచయంతో కొత్త వళ్లను మాలో కలుపుకుని స్టోరుకు, మార్కెట్ కు, బజారుకు మా వెంట తిప్పుకొనే మేము ఈమె విషయంలో మాత్రం అంత తొందరగా అడుగు ముందుకు వెయ్యలేక పోయాము.
ఒకరోజు సత్యవతక్క వాళ్లింట్లో సాయిభజన ఏర్పాటు చేశారు. భజనకు ముందు కార్యక్రమంలో భాగంగా సౌమ్య, లలితక్క, మంజుల, వేణి వాళ్లు వంటింట్లో ప్రసాదాలు తయారు చేస్తున్నారు.
నేనూ, ఝాన్సీ సాయి పటాలను తుడిచి పసుపు కుంకాలతో బొట్లు పెడ్తున్నాము. సత్యవతక్క, ఇంద్రాణి, మీనా, మాలతక్క, ఆశ పూల మాలలు కడ్తున్నారు.
ఆశ వున్నట్లుండి ’నీవు చెప్పమన్నావని స్నేహలత గారిని కూడా భజనకు పిలిచాను’ అంది. అంతకు ముందు సత్యవతి ఆమెను కూడా పిలవాలనే అనుకుంది. అంటీముట్టనట్లున్న వాళ్ల బంధం వల్ల ఆమె ఆస్తికురాలా, నాస్తికురాలా తెలియకుండా పిలవడం బాగుండదని సౌమ్య, లలితక్కలు కూడా తన అభిప్రాయంతో ఏకీభవించడంతో పిలవకుండా మానేసింది.
కానీ ఇప్పుడు ఆశ ఆ మాట అనడంతో అందరు కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యారు. ఎవరికి వాళ్లే అంతకు ముందు భజనకు కట్టుకోవాలనుకున్న చీరల స్థానంలో వేరే చీరల్ని కట్టుకునే ఆలోచనలో పడ్డారు.
పిల్లల్ని స్కూలు నుంచి ఏకంగా భజన దగ్గరికి రమ్మన్నాను. స్కూలు నుంచి ట్యూషన్ కెళ్లి అట్నుంచి రావడానికి ఏడవుతుంది. అప్పటికి భజన పూర్తయి హారతిచ్చే సమయం. అందుకని నేరుగా రమ్మాన్నాను.
ఇప్పుడామె భజనకు వస్తుందని తెలిసి పిల్లల్ని ఎందుకు రమ్మన్నానా? అని ఫీలయ్యాను. మాసిన యూనిఫారాలతో, జిడ్డుగారే మొహాలతో వచ్చే పిల్లల్ని చూసి ఆమె ఎక్కడ ఏడ్డిమడ్డిగా వున్నారనుకుంటుందోనని నాజంకు.
సాయి పటాలకు బొట్లు పెట్టి టీపాయ్ పైన క్లాత్ పరచి పటాలను పొడిగ్గా దానిపైన పెట్టి గోడకు ఆనించి అమర్చిన తర్వాత నా పని అయిపోయిందన్నట్లు ’ఇంటికెళ్లి మొహం కడుక్కోనొస్తాన’ ని బయలు దేరాను.
ఇంటికొచ్చి అందాకా తీసిపెట్టిన పాతపట్టుచీరను బీరువాలో పెట్టి ఈ మధ్యే మ్యారేజ్ డేకి కొనుక్కున్న టస్సర్ సిల్కు చీరను తీసుకున్నాను. దాంతో కూర్చొని భజన చేయడం కొంత కష్టమే. ఎటు తిరిగినా కదిలినా నలిగిపోతుంది. అయినా వేరే చీరలేవీ నచ్చలేదు. ఈ ఒక్కరోజు కదలకుండా కాస్త కష్టపడి కూర్చుందాములే అనుకున్నాను. స్నేహలత కోసం ఆ చీర కట్టుకోవడం.
పనిమనిషికి వీధిలోనే పిల్లల్ని భజన దగ్గరికి రావద్దని చెప్పమన్నాను. వాళ్లకోసారి చెప్పినా వినరు, అందుకని మంచిబట్టలు ఒక్కోజత తీసి మంచం మీద పెట్టాను. వచ్చేటట్లయితే మొహాలు కడుక్కుని వాటినేసుకుని రమ్మన్నాను.
6 గంటలకు భజన మొదలవుతుంది. కరెక్టుగా 5:50 కి భజనహాలులో అడుగుపెట్టిందామె. సాదరంగా ఆహ్వానించింది సత్యవతక్క ’నాకు రావడానికి వీలుగాక ఆశతో చెప్పి పంపాను’ అని అబద్దం కూడా ఆడింది అక్క.
స్నేహలత వెనక పూజబుట్ట పట్టుకుని నిలబడి వుంది వాళ్ల వంటమనిషి ’బుట్ట అక్కడ పెట్టి నువ్వెళ్లు’ అంది ఆమె.
భజన ముగిసిం తర్వాత ప్రసాదం తీసుకుని ’వస్తానండీ’ అని బయలుదేరిందామె. వాళ్లింటి వరకు వెళ్లి దిగబెట్టడానికి ఆశ తయారైంది.
భజన ముగిసింతర్వాత అందరూ వెళ్లిపోయినా మాగ్రూప్ వాళ్లం అంత తొందరగా కదలం. ఎక్కువైన ప్రసాదాల్ని పంచుకుని తింటూ ఆ రోజు ఏ పాట ఎవరు బాగా పాడారో చర్చించుకుంటూ మళ్లీ ఓ గంటసేపైనా గడపుతాం. అందుకే ఆమెను వదిలిపెట్టి మళ్లీ ఆశ వచ్చింది.
తనను ఆదరంగా స్నేహలత లోపలికి ఆహ్వానించినట్లు చెప్పింది. ఇంకోరోజు వస్తానని తాను వచ్చేసినట్లు చెప్పింది.
వస్తూవస్తూ స్టోర్లో చెక్కరిస్తూన్నారన్న విషయం గుర్తొచ్చి ఆమెకీ విషయం చెప్దామని వెనక్కెళ్లిందట.
స్నేహలత భజన అయిపోయే సమయానికి భజన దగ్గరికి రాలేదని వంటమనిషిని చివాట్లేయడాన్ని చెవులారా విని అది సమయం కాదనుకొని వచ్చేసిందట.
ఆమె తిడ్తుంటే ఆ నడివయసు మనిషి తప్పుచేసినందుకు తలవంచుకుని నోరెత్తకుండా నిలబడినట్లు కూడా చెప్పింది.
పనోల్లను అదుపులో పెట్టాలంటే అంతమాత్రం తిట్లు అప్పుడప్పుడూ పడడంలో తప్పులేదనుకొన్నాం.
ఒకరోజు ఆంజనేయస్వామి గుడినుండి వస్తున్నాం. వాళ్లవంటామె వెదురుబుట్ట చంకలో పెట్టుకుని ఎండిన పేడను ఏరుకుంటూ కన్పించింది.
’ఏమ్మా, ఈడుండావు’ అని ముందే పలకరించింది సత్యవతక్క ’కనకాంబరం చెట్లకు పేడ ఎరువేస్తే బాగుంటుందంటేను’ అంది. ఆ మాటనేటప్పుడు ఆమె నిలబడలేదు. ఆ మొహం పక్కకూడా చూడలేదు. ఆమె నిలబడి చూసినట్లయితే మావాళ్లు ఆమె ద్వారా చాలా సంగతులే రాబట్టే వాళ్లు. ఆ అవకాశాన్ని ఆమె మాకివ్వకుండా తనింకో దారిలో వెళ్లిపోయింది.
’దీని టెక్కు మండిపోను’ అంది సౌమ్య. ’నోరూ వాయీ లేని మనిషిలా వుంది’ అనుకున్నాను నేను.
వినాయకచవితి పండగొచ్చింది. ఆ సాయంకాలం మా అందరిండ్లలో వినాయకులను చూసి, మొక్కి, ప్రతి ఇంట్లోనూ ఐదేసి గుంజిళ్లుతీసి వొస్తున్నాము.ఎన్ని వినాయకులను చూశామో లెక్కకట్టుకుని సరిసంఖ్యలో రావడంతో ఇంకో వినాయకుణ్ణి చూడాలనుకున్నాం.
వెంటనే ఆశ స్నేహలత గారి పేరు చెప్పింది. అప్పటికి ఆమెవచ్చి రెండుమూడు నెలలైనా ’గారు, అండీ’ లతోనే మా స్నేహం ఇంకా కొనసాగుతూవుంది.
అందరం సరే అంటే సరే అనుకున్నాం. వాళ్లింటి వైపు నడిచాం. సందెవేళ కావడంతో తలుపు తీసే వుంది. అయినా పిలవకుండా పోవడం సభ్యతకాదని నిలబడ్దాం. ఉదయం నుంచి పండగపని, పిండి వంటలతో భుక్తాయాసం, మళ్లీ ఇప్పుడు ఇంతదూరం తిరగడం కాళ్లు పీకుతున్నాయని ఒక్కొక్కరమే బయటవున్న అరుగుల మీద కొలువుతీరాం. ఆటైంలో కరెంటు పోయింది కాబోలు.
కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ బయటికి రాలేదు.
కొంచెం గొప్పగా కన్పించే వాళ్లతో స్నేహంకోసం తహతహలాడే మనిషి ఆశ. అలాంటి వాళ్లతో రాసుకొని పూసుకొని తిరుగుతూ అదో గొపాగా ఫీలవుతుంది తను.
ఇప్పుడు గూడా తలుపు కొట్టమంటుంటే ఏం అవసరం లేదని తనకాయింట్లో బాగా చొరవ వున్నదానిలా లోపలికి దూరేసింది ఆశ.
వెళ్లింది నిముషంలోనే వెనక్కి తిరిగొచ్చి గుసగుసగా ’ఉయ్యాల్లో పండుకొని ఎంచక్కా వంటామెతో కాళ్లు పట్టించుకుంటావుందో. చూద్దురుగాని రండి’ అని మమ్మల్ని పిలిచింది.
అలా చెప్పాపెట్టకుండా లోపలికి వెళ్లడం సభ్యతకాదని చెప్పినా దొంగగా కిటికీలోనుంచి తొంగి తొంగి చూశాం.
ఆమె వెనక వరండాలో వేసిన ఉయ్యాల బల్ల మీద గోవిందరాజుల స్వామి ఫోజులో పండుకుని వుంటే ఆ నడివయసు ఆడామె నిల్చొనే వంగి కాళ్లు పడుతూ వుంది.
ఒకచోట గట్టిగా నొక్కిందో, మరేమైందో కాలిని విసిరింది. దాంతో నిల్చున్నావిడ పట్టుదప్పి పడిపోయింది. ఆమె ’అబ్బా’ అన్న అరుపుకు స్నేహలత కళ్లు తెరవడం, మమ్మల్నెక్కడ చూస్తుందోనని మేము పక్కకు తప్పుకోవడం ఒకేసారి జరిగింది.
’ఛీ,ఇక్కడొద్దురండీ’ అని సత్యవతక్క దారి తీయడంతో మేమూ ఆమెను అనుసరించాం.
ఒకరోజు మల్లిక జ్వరంగా వున్న కూతుర్ని తీసుకుని హెల్త్ సెంటరుకి వెళ్లి ఒక సంచలనాత్మకమైన వార్తను మోసుకొచ్చింది.
స్నేహలత వాళ్లవంటామె ఒళ్లుకాలి ఆస్పత్రికి వచ్చిందని ఎక్కువకాలడం వల్ల క్రీం పూసి, ఇంజక్షనిచ్చి గవర్నమెంటు ఆస్పత్రిలో అడ్మిట్ కమ్మని డాక్టరు సలహా ఇచ్చాడని చెప్పింది.
అంతకాలినా ఆమెతోపాటు ఇంట్లో వాళ్లెవరూ రాలేదని, మా కాలనీలో బండిమీద ఇస్త్రీచేసే సంజీవి పెళ్లాం ఓబులమ్మ వెంట బెట్టుకొచ్చిందని చెప్పింది.
ఆమె ఆస్పత్రిలో ఫలానా వార్డులో అడ్మిట్ అయింది అనే విషయం ఓబులమ్మ ద్వారా తెలుసుకున్న లలిత మాకా విషయం చేరవేసింది.
ఆరోజు శుక్రవారం మార్కెట్టుకు మేవంతా తప్పని సరిగా వెళ్లేరోజు. మార్కెట్టు పని కాగానే 12:30కి మాకాలనీకి వెళ్లే బస్సుఎక్కాలి. అప్పటికి 12:20అయింది. అది తప్పితే `1:30 కే బస్సు. ఏమైతే అయిందని ఆస్పత్రికి వెళ్లి ఆమెను చూసి వెళ్దామనుకున్నాం. మాలతక్క, ఝాన్సీ మాత్రం పిల్లలు, భర్త వస్తారని, లేటైతే ఇబ్బంది పడతారని మీరు చూసి రండని వెళ్లిపోయారు.
మేము రెండు ఆటోలలో ఆస్పత్రిలో అడుగుపెట్టాం. ఒళ్లుకాలిన మనిషి అని అడిగి ఏ వార్డులో వుందో తెలుసుకున్నాం.
మేము వెళ్లగానే కనపడిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాం. మంచం మీద ఆ నడివయసు మనిషి పడుకోనుంది. ఒకపక్క బుగ్గలు, కనురెప్పలు, మెడ, భుజం అంతా కాలిన బొబ్బలు, మంట లేకుండా వుండడానికి పూసిన క్రీముతో వికృతంగా వుంది.
మంచంమీద స్నేహలత భర్త కూర్చుని రసమన్నాన్ని స్పూన్ తో తినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె నోరు తెరవలేక నానా అవస్థలు పడుతూ చేత్తోనే వద్దని వారిస్తావుంది.
’ఈ ఒక్కసారి మెల్లగా నోరు తెరువమ్మా’ అని బతిమాలుతున్నాడాయన. ’పనిమనిషి పైన ఎంత దయాగుణం ఈయనకి’ అనుకున్నాం.
మేం ఆమెను చూడ్డానికి వచ్చామని తెలిసి ఆయన క్యారియరు అక్కడ ఉన్న ఐరన్ రాడ్ మీద పెట్టి బయటికి వెళ్లిపోయాడు.
పొరబాటున కాగిన నూనె మింద పడిపోయిందని చెప్పిందామె. ఎక్కువ మాట్లాడించి ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక, వూరికే నిలబడడం కూడా కష్టమనిపించి ఐదునిముషాలుండి వచ్చేశాం.
మేము బయటికి రావడం చూసి బయటవేపచెట్టు కింద నిలబడిన ఆయన లోపలికి వెళ్లిపోయారు.
ఒక పదడుగుల దూరంలో ఓబులమ్మ క్యారీరు కడుగుతూ మమ్మల్ని చూసి పరుగెత్తుకొచ్చింది. సారు భోజనం తెస్తే పెద్దోళ్ల ముందరెందుకని బయట తిన్నానంది.
’ఇంతకూ కాగిన నూనె ఎట్లా అంతగా మింద బోసుకునిందట. అదీ మొహంపైన’అడిగింది సత్యవతక్క.
’మీకా మహాతల్లి అట్లని జెప్పిందా? ఆమె జెప్పినా ఇనేవాళ్లకన్నా వుండొద్దమ్మా’ అనింది. అది మా తెలివి తక్కువ తనాన్ని ఎద్దేవా చేస్తున్నట్లపించింది.
’ఎవరో అయ్యగారి స్నేహితులొస్తారని వడలు సెయమనిందంట. ఈయమ్మ గారెలన్నీ సేశాక స్నేహలతమ్మ ఎలావుందో సూస్తామని తెచ్చి పెట్టమందట. ఈమె తీసుకెళ్లి ఇచ్చి ఇంకో వాయి గారెలు నూనెలో ఉడుకుతున్నాయని వంటింట్లోకి పరిగెత్తొంచిందట. ఆయమ్మ గారెనోట్లో పెట్టుకుని బొత్తిగా వుప్పులేదని, పిండిలో వుప్పు కలపమని చెప్పడానికి వంటింట్లోకొచ్చింది.
అప్పటికే పిండిమొత్తం అయిపోయింది. ఉప్పెయకుండా గారెలు చేస్తే ఎవరు తింటారని ఆయమ్మకు కోపమొచ్చి ’ముందే రుచి చూడమని ఇవ్వొద్దా’ అని గదమాయించిందట.
’ఇప్పుడడిగిందానివి ముందే నువ్వెందు కడగలేదు’ అనిందట ఈయమ్మ. అంతే ఆయమ్మకు కోపమొచ్చి ’ నూనె బాణలెత్తి ఈయమ్మ మిందికి ఇసిరిందట. ఈయమ్మ తప్పుకోబట్టి సరిపోయింది. లేకుంటే మొత్తం నూనె మొగం మింద బడేది. గుడ్డిలో మెల్లమాదిరిగా కొంచెం కాలింది’ చెప్పుకుంటూ వొస్తోంది ఓబులమ్మ.
’ఆయమ్మకెవరూ దిక్కులేదా?’ అడిగింది మల్లిక. ఇంతకాలినా వాళ్లవాళ్లెవరూ రాలేదని అడిగిన ప్రశ్న.
’ఎందుకు లేరూ. అయ్య ఆయమ్మ కొడుకే కదా! కూతుర్లు లేరు. పెద్ద కొడుకు, కోడలు బాగానే సూసుకుంటారట. వాళ్లు గుంటూరు దగ్గర పల్లెలో వుంటారు. కానీ ఈయమ్మకు సేసిపెట్టేవోళ్లు లేరని ఆయమ్మని పంపించదు.’- ఓబులమ్మ మాట ఎవరి చెవికీ ఎక్కడం లేదు.
స్నేహలతకు ఆవిడ అత్తా. వంటమనిషి కాదా! ఈ నిజాన్ని ఎవరం జీర్ణం చేసుకోలేక పోతున్నాం.
’ఆయమ్మ సూసే పోకడను బట్టి అందరూ ఆ తల్లిని పనిమనిషనే అనుకొంటారు. కానీ నోట్లో నాలుక లేని ఆ మహాతల్లి నాతో మాత్రం గుడ్డలిస్త్రీకీయడానికొచ్చినపుడు కష్టాలూ నష్టాలూ సెప్పుకోని కన్నీళ్లు బెట్టుకుంటుంది. ఏం జేస్తాం కలికాలమమ్మయ్యా.’ అని నిట్టూర్చింది ఓబులమ్మ.
మంచం మీద కూర్చొని తల్లిని తినమని వేడుకొంటున్న ఆ బ్యాంకాఫీసరు భార్య చేతిలో కీలుబొమ్మా లేక వాళ్లమ్మ మాదిరే నోరూవాయీ లేక సర్దుకు పోతున్న మనిషా. మా కందరికీ ఆయన మెతకతనమే ఇన్ని అనర్ధాలకు కారణమనిపించింది.
’దాని సంసారం కూలిపోను ఈ ఎత్తుబారం ఆశ దానితోక బట్టుకోని. తిరగాలని ఎంత పరుగులు దీసిందో’ అంది సౌమ్య.
’నాకేం తెలుసు. మీరందరూ కూడా ఆమె గొప్పతనాన్ని మెచ్చుకున్నోళ్లే కదా!’ అంది అమాయకంగా ఆశ.
’మంచి కళాపోసనున్న మనిషికదా!’ అంది ఎగతాళిగా సత్యవతక్కవైపు చూస్తూ ఇంద్రాణి. మా అందరి దృష్టిలో ఒకప్పుడు ఎంతో సంస్కారమున్న మనిషి అన్పించిన స్నేహలతాదేవి ఒక పిచ్చికుక్కలాగా మారిపోయింది.
అత్త ఆరళ్లను చూశాం. కానీ కోడలి కొలుపుల్ని చూడ్దం ఇదే మొదటిసారి.
అత్తనొక పనిమనిషిలాగా వాడుకోవడమే గాక, కేవలం ఒక మనిషిగా కూడా చూడని స్నేహలతాదేవిని తలోమాటా ఈనాటికీ నీచంగా అంటూనే వుంటాం.
సంస్కారం అన్నది ఇంటిని పొందిగ్గా, కళాత్మకంగా అమర్చుకోవడంలోనే వుండదని, మనసును మలుచుకోవడంలో వుంటుందని తెలిసినప్పటి నుంచి మేం కట్టే చీరల విషయంలోను, జిడ్డుకారే మొహాలతో కనబడే పిల్లల విషయంలోనూ కించపరచడం మానేసి చాలా కాలమైంది.
----------------------------------------------------------
రచన - మహాసముద్రం దేవకి,
సుజనరంజని సౌజన్యంతో
No comments:
Post a Comment