Wednesday, May 15, 2019

టెలిఫోనుతో నా అనుభవాలు


టెలిఫోనుతో నా అనుభవాలు
సాహితీమిత్రులారా!

ఎన్నో సాంకేతిక ఆవిష్కరణల్లాగే టెలిఫోన్ అనేది ఒక అద్భుతమయిన పరికరం. ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నవారి కన్నా, ఫోన్ కాల్‌కు ప్రాధాన్యత ఎక్కువని మనలో చాలామంది అనుభవం. మొబైల్ ఫోన్ ఈ అనుభవాన్ని మరింత బలపరచింది. ఫోన్ చెవికి అంటించుకున్న స్నేహితులకి మనం పక్కనే ఉన్నా, వరస క్రమంలో మనది రెండో స్థానమే! అన్నట్లు టెలిఫోన్‌ని ఆడిపోసుకోవడం ఈ వ్యాసం ఉద్దేశం కాకపోయినా, దాని ద్వారా నేనెదుర్కొన్న మంచి చెడులన్నీ ఇక్కడ పంచుతాను.

ఇరవయి అయిదేళ్ళ క్రితం, మా అన్నయ్య కొడుకు, గోవింద్ – వాడు మా కుటుంబంలోనే మొదటగా అమెరికాకు వెళ్ళి చదువుకున్న వాడు – హవాయి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సు ఎం.ఎస్ చేయటానికి వెళ్ళాడు. అపుడు మా అన్నయ్య ఇంట్లో టెలిఫోను కూడా లేదు. కొడుకు విమానమెక్కి వారమయింది. ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోలేక వాళ్ళమ్మా నాన్నలకు కంగారు. అన్నయ్య వాళ్ళింటి వీధి చివరి ఇల్లు నాగేశ్వర్రావు గారిది. పదోరోజు, ఒక ఆదివారం మధ్యాహ్నం వాళ్ళబ్బాయి పదేళ్ళ సాయిరాం మాఇంటికి ఒగరుస్తూ పరిగెత్తుకొచ్చాడు. “ఆంటీ, అంకుల్, మీకు ఫోన్. గోవిందన్నయ్య పిలుస్తున్నాడు. అరగంట అయినాక మళ్ళా చేస్తాడట!” అని చెప్పాడు. భోంచేసి మధ్యాహ్నం కునుకు తీస్తున్న మా అన్నయ్య, వదినె, అమ్మ ముగ్గురూ కట్ట కట్టుకుని నాగేశ్వర్రావు గారింటికి బయలుదేరారు. వాళ్ళింట్లో ప్రతీ గురువారం సాయిబాబా భజన జరుగుతుంది. అందుకని వాళ్ళను అందరూ భజన ఆంటీ, భజన అంకుల్ అనేవాళ్ళు. అందుకని భజన ఆంటీ కాఫీ పెడ్తానంటే, ఇంకా నిద్ర పూర్తిగా చెరగని మా అన్నయ్య మొహమాటంతో వద్దంటుండగానే, ఫోనొచ్చింది.

“ఎలా ఉన్నావ్? అంతా సెటిల్ అయిందా?” అన్న మొదటి ప్రశ్నలు అయాక మా గోవిందు ఏం చెప్పాడో కానీ అన్నయ్య “నువ్వు మాట్లాడు” అని వదినెకిచ్చేశాడు ఫోను. అప్పుడు ఇంకా స్పీకర్ ఫోన్ అంటే తెలీదు. అందుకని సంభాషణ ఒక వైపు మాత్రమే అర్థమయింది వెంట ఉన్న వాళ్ళకు. ఇంటికొచ్చాక వదినె చెప్పిన సారాంశం ఇది. గోవిందు ఇల్లు వదిలి, కుటుంబం వదిలి వెళ్ళటం ఇదే మొదలు. హఠాత్తుగా ఇలా వేళ్ళేసరికి సర్దుకోలేకుండా ఉన్నాడు. ఇక్కడున్నప్పుడు వాళ్ళమ్మ చేసి పెట్టే రుచికరమయిన భోజనాన్ని పాతకాలం వంటలు అని ఏడ్పించే వాడు. అస్తమానం తన దగ్గరున్న బాగున్నది ఏదయినా తనకు కావాలని మొండిచేసే తమ్ముడిమీద విసుక్కునేవాడు. కాలేజినుంచీ రాగానే కాచుక్కూర్చుని ముందు పక్కన కూర్చుని కాస్సేపు కబుర్లు చెప్తేనే కానీ, లోపలికి వెళ్ళనివ్వని అవ్వ (మా అమ్మ) అంటే చిరాకు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మాచ్ ఫైనల్స్ టీవీ లో చూస్తుంటే, కళ్ళెర్ర చేసి వెళ్ళి చదువుకొమ్మని కేకలేసే మా అన్నయ్య మీద పట్టరాని కోపం! వీటన్నిటికీ దూరం కావడం బాగానే ఉండాల్సింది. అయినా ఎందుకో ఏం బాగులేదని ఏడుస్తున్నాడు వాడు. ఇంజనీరింగ్ డిగ్రీ చేతికొచ్చిన చెట్టంత కొడుకు అలా గొడవ పెట్టడం అన్నయ్యకు అవమానంగా ఉంది. వీడెక్కడ పరిగెత్తి వచ్చేస్తాడో, దాంతో వాళ్ళ నాన్నకెంత కోపం వస్తుందో అని మా వదినెకు భయం!

తర్వాత పది రోజులవరకూ ప్రతిరోజూ ఫోన్ చేసేవాడు మా గోవిందు. చేసినప్పుడల్లా ఒకే పాట. ఇండియాకు వచ్చేస్తానని. రాను రాను కాల్స్ తగ్గిపోయి మెల్లిగా కుర్రాడు అక్కడే అలవాటు పడిపొయ్యాడు. అన్నయ్యకీ అనుభవంతో అర్థం చేసుకున్న అవసరం ఇంట్లో ఒక ఫోనుండాలి అని. కానీ అప్పట్లో ఫోను కావాలని దరఖాస్తు పెడ్తే ఒక ఏడాదిగ్గానీ ఫోను వచ్చేదికాదన్నది వేరే విషయం!

1987లో ఐటీ లో నా మొదటి ఉద్యోగం. మా ఆఫీసులో అప్పుడు ఒక వరుస పది టేబుళ్ళకు ఒకటి చొప్పున టెలిఫోను ఎక్స్టెన్షన్ ఫోన్లుండేవి. వాటికి నంబర్ డయల్ ఉండదు. మనం కాల్ చెయ్యలేము. కాల్ వస్తే తీసుకోవచ్చు. అందుకని ఫోన్లు ఆఫీసు పనులకు మాత్రమే ఉపయోగించేవారు. స్వంత కాల్స్ చేయాలంటే ఉద్యోగులు బయటికి అర్ధరూపాయ బిళ్ళలు చేతిలో పట్టుకుని బయలుదేరాల్సిందే! ఈ రకం టెలిఫోన్ పద్ధతిలో రిసెప్షనిస్ట్/టెలిఫోను ఆపరేటర్ చాలా ముఖ్యమయిన వ్యక్తి. అతనో, ఆమో తన సీట్లో డ్యూటీకి వచ్చాక కదలటానికి లేదు. ఎందుకంటే కాల్ వస్తే ఆఫీసులో వాళ్ళకు కనెక్ట్ చెయ్యగలిగేది ఈ వ్యక్తి మాత్రమే! ఇప్పుడు గంటలకొద్దీ ఆఫీసు బ్రేక్ టైముల్లో మొబైల్ ఫోన్స్ మీద ఉండే యువతీ యువకులను చూస్తే అప్పుడు ఫోన్లో మాట్లాడే వీలుకూడా లేని మా ఆఫీసు ప్రేమికులను గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నా టీం సహోద్యోగి రీటా, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ రాకేష్ ప్రేమికులు. వాళ్ళూ సాయంత్రం ఆఫీసు బయట ఎంజీ రోడ్లో కలుసుకుని రోడ్డువెంట తిరుగుదామని అనుకోవాలన్నా, రాకేష్ ఫోను చేస్తే, రీటాకు ఒకరు చెప్పి, ఆమె ఫోను దగ్గరికెళ్ళే లోపల అయిదు నిముషాలు అవుతుంది. అంతలోపల వాళ్ళ బాసో మరెవరో పిలిస్తే రాకేష్ ఫోన్ దగ్గర ఉండకపోవచ్చు!

మేం కొత్తగా స్వంత ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో ఫోనుకు అప్లై చేశాము. అప్పటికి కాచుకునే సమయం సంవత్సరం నుంచీ ఆరు నెలలకు తగ్గింది. అప్పటికి అక్కయ్యలు, అన్నయ్య ఇంట్లో ఫోన్లున్నాయి. వాళ్ళు మాకు ఫోన్ చేయ్యలంటే, పక్క ఇంటి డెనిస్ రిగో వాళ్ళకు చేసి మమ్మల్ని అడిగేవారు. ఇలా ఫోను వచ్చినప్పుడల్లా వాళ్ళింటికి వెళ్ళి కూర్చుని వాళ్ళను డిస్టర్బ్ చెయ్యటం ఎబ్బెట్టుగా ఉండేది. రిగో భార్య సావిత్రి ముఖంలో చిరాకు మా అమ్మాయి కూడా గమనించిందేమో! “ఆంటీ, ఫోను కిటికీలోంచీ బయట పెట్టండి. మాట్లాడేసినాక చెప్తాం!” అని అడిగింది సావిత్రిని. అమ్మా, కూతురూ ఇద్దరం రిగో వాళ్ళ డైనింగ్ రూం కిటికీలోంచీ ఫోన్లో మా సంభాషణలు చేసుకునేవాళ్ళం.

1997లో నేను మొదటిసారి కంపెనీ ద్వారా విదేశ ప్రయాణం చేయవలసి వచ్చింది. నేను, బెంగుళూరు నుంచీ ముంబయి, ఫ్రాంక్‌ఫర్ట్, అట్లాంటా, డల్లాస్ ల మీదుగా ఆస్టిన్ (టెక్సాస్) కు వెళ్ళాల్సి వచ్చింది. బెంగుళూరు, ముంబయి విమానాశ్రయాలు చూసిన కళ్ళతో ఒక్కొక్క అమెరికన్ ఏర్‌పోర్ట్లు చూస్తుంటే, వాటి వైశాల్యం, ప్రయాణీకుల కోసం అక్కడ అద్భుతంగా అమెర్చిన అనుకూలాలు మొదటిసారి చూసిన దిగ్భ్రాంతి నుంచీ బయట పడిన తర్వాత నేను గమనించిందొకటి. ప్రతీ విమానాశ్రయంలో ఎన్నో వందలకొద్దీ `పే’ ఫోన్లు. మా ఫ్లైట్లు ప్రతీ విమానాశ్రయంలో ఆగి మేమంతా దిగి నెక్స్ట్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేలోపలగానే, అమెరికన్లందరూ స్టీల్ కవర్డ్ కేబుళ్ళతో వ్రేలాడుతున్న ఫోన్లదగ్గరికి పరిగెత్తుతారు. ప్రతి ఆగిన చోట ఇంతగా ఎక్కడున్నది ఏం చేస్తున్నదీ వాళ్ళ వాళ్ళకు చెప్పే అవసరం ఉంటుందా అని ఆశ్చర్యమేసేది. మా సహోద్యోగులు తర్వాత చెప్పారు. ఆ ప్రయాణంలో నాది అదౄష్టం! నా ప్లైట్లు ఏవీ ఆలస్యం అయి, కనెక్షన్లు మిస్ అవలేదు. ఒకటో రెండో కనెక్షన్లు మిస్ అవటం సాధారణమట. అప్పుడర్థమయింది అంతగా ఫోన్లు చెయ్యవలసిన అవసరమేంటో!

జనాన్ని కలిపి ఇంత సహాయం చేయగల ఈ ఫోనుని కూడా దురుపయోగ పరచుకోవడంలో మనం లోటేం చెయ్యలేదు! ఒకప్పుడు ఆఫీసుల్లో ‘ఎమర్జెన్సీ’ అయితే తప్ప స్వంత కాల్స్ లో కాలం గడపరాదనేది వ్రాయబడని రూలు. కానీ చాలా ఆఫీసుల్లో గంటలకొద్దీ మొబైలు ఫోన్లమీద కాలం గడిపేవాళ్ళను చూస్తే ఆఫీసు టైమనేదానికొక ప్రత్యేకత ఉన్నట్లు కనిపించదు. మొబైలు ఫోన్లు నయం ఫోను పట్టుకుని లేచి దూరం వెళ్ళిపోయి సహోద్యోగుల ఏకాగ్రత అయినా చెడగొట్టరు. టేబుల్ మీదున్న ఫోన్లో ఎంత మీ కంఠం తగ్గించి మాట్లాడినా మీ ప్రక్కవారి కుతూహలం రేకెత్తాల్సిందే! ఈ కారణం వల్ల మా ఆఫీసులో కొన్నాళ్ళు, ఉదయం భోజనానికి ముందరి సమయం `క్వైట్’ టైం అని బయటినుంచీ వచ్చేకాల్సును కనెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఇలాంటి రూల్సు ఉద్యోగులందరూ గౌరవిస్తే తప్ప, వాటివల్ల ప్రయోజనం సున్న. వాళ్ళు స్వంతంగా ఫోన్లు చేసుకోవడాన్ని, బయటివాళ్ళు నేరుగా ఎక్స్‌టెన్షన్లకు ఫోన్ చెయ్యడాన్ని ఎలా ఆపగలం?

కార్డ్‌లెస్ ఫోను కొత్తగా వచ్చినప్పుడు దాన్ని కొని ఉపయోగించాలని నాకు మోజుగా ఉండేది. ఎవరో స్నేహితులు సింగపూరుకు వెళ్తుంటే, కార్డ్‌లెస్ తెచ్చిపెట్టమని అడిగాను. నేను సరిగ్గ చెప్పలేదేమో, `బేస్ డయలింగ్’ లేని, కార్డ్లెస్ మాత్రమే ఉన్న పరికరం తెచ్చిచ్చారు. అది కనెక్ట్ చేసుకోగానే ఇంట్లో కొత్త సమస్యలు మొదలయాయి. చాలా సార్లు ఇంట్లో కాల్స్ వచ్చినప్పుడు ఆ కార్డ్‌లెస్ ఎక్కడ దాక్కుని ఉంటుందో కనుక్కోలేం. మా అమ్మాయి శివాని గదిలో ఉంటుంది చాలా మటుకు. తను నిద్రలో తలుపు బిగించుకునో, ఫోను మాయం చేసి అది ఎక్కడికో వెళ్ళుంటే, ఇంక అంతే సంగతులు! ఈ కార్డ్‌లెస్ కు ఎందుకు మారామా అని నన్ను నేను నిందించుకోని రోజు లేదు ఈ పద్ధతీ అలవాటయేదాకా.

2000 ప్రాంతంలో అప్పుడే మొబైల్ ఫోన్లు కనిపిస్తున్నాయి. బెంగుళూర్లో ఎయిర్‌టెల్ మాత్రం దొరికేది. మా పక్కింటి సుభాష్ మా కంపెనీలోనే పని చేసే వాడు. వాడు కొత్తగా మొబైల్ కొనుక్కున్నాడు. అప్పట్నుంచీ, నన్నూ కొనుక్కొమ్మనేవాడు. ఇంట్లో ఆఫీసులో ఫోన్లుంటాయి కదా? మళ్ళీ ఇదెందుకు? వౄథా ఖర్చు. ఎక్కడయినా మరిచిపోయి వదిలేస్తే అదొక తంటా అనుకున్నాను. ఒక రోజు ఆఫీసు నుంచీ కారు డ్రైవ్ చేసుకుని వస్తున్నాను. పెద్ద వర్షం. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వస్తున్న నాకు కార్ ఒక చోట ఆగి పోతే గుండెలో రాయి పడింది. అటు ఇటూ ఎక్కడున్నానా అని చూశాను. హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్‌కు యాభయి అడుగుల దూరంలో ఉన్నాను. ఎలాగయినా ఇంటికి మా వారికి ఫోన్ చేస్తే ఎలాగో సహాయం తీసుకుని వస్తారు. కార్లో ఎప్పుడూ ఉంచుకునే గొడుగు తెరిచి వేసుకుని, భుజానికి బ్యాగు తగిలించుకుని కిందికి దిగాను. కాల్ ఫోన్లు ఏవీ ఉన్నట్లు కనిపించలేదు. మెల్లగా ఆలోచిస్తూ హైగ్రౌండ్ పోలిస్ స్టేషన్ వైపు నడిచాను. స్టేషన్లో ఎలాగూ ఫోనుంటుంది కదా అనుకుంటూ లోపల అడుగు పెట్టాను. కానీ పోలీసు స్టేషన్ మనం మామూలుగా రోజూ వెళ్ళే చోటు కాదు, అయినా తప్పదు మరో మార్గం లేదు అనుకుని స్టేషన్ మెట్లెక్కాను. ఉన్న నాలుగైదు టేబుళ్ళ దగ్గర ఇద్దరు ముగ్గురు పోలీసు కాన్స్‌టబుల్స్ గుమి కూడి మాట్లాడుకుంటున్నారు. కొందరు ఏవో ముందున్న ఫైళ్ళలో వ్రాస్తున్నారు. ఒక క్షణం వాళ్ళను గమనించాను. ఒక టేబిల్ దగ్గర ఒకరు వ్రాసుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి, “సార్! కారు చెడిపోయింది. ఇంటికి ఫోన్ చెయ్యాలి,” అని `మే ఐ?’ అన్నట్లు ముఖంపెట్టి అడిగాను. అతను తలెత్తి నావైపు, పోలీసు స్టేషన్ లో ఇదేం పని అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ, కాదనటానికి కారణం దొరక్క, ఖాళీ టేబుల్ మీదున్న ఫోన్ వైపు వేలు చూపించాడు. అంతే చాలనుకున్న నేను రిసీవర్ చేతికి తీసుకుని ఇంటి నంబరు డయల్ చేశాను.

మా వారు ఫోన్ ఎత్తారు. నేనేం చెప్పక ముందే నాకోసమే కాచుకున్నట్లు, “ఏమయింది. ఎందుకాలస్యం? వర్షం జోరుగా పడ్తోందా అక్కడ?” “అవును. కారు చెడిపోయింది.” “ఓహ్! అవునా, మన సందు కొసలో ఉన్న మెకానిక్‌ను పిలుచుకుని వస్తాను. ఎక్కడున్నావ్?” “హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ దగ్గర! అక్కడ్నుంచే ఫోన్ చేస్తున్నాను.”

అప్పట్లో కాల్ ఫోన్లు కూడా తక్కువ. అందుకని అంగళ్ళలో అనుమతి తీసుకుని ఫోన్ చేస్తే తర్వాత అంగడివారు అడిగినంత, రూపాయో, రెండో ఇచ్చి బయట పడేవాళ్ళం. కానీ పోలీస్‌స్టేషన్‌లో డబ్బిస్తానని ఎలా అడగటం? ఉచితంగా ఫోన్ చేసుకుని తప్పు చేసిందానిలా ముఖం పెట్టుకుని, `ఫర్వా లేదులే, పోలీసంటే పబ్లిక్ సర్వీసే కదా?” అనుకుంటూ నాకు నిశ్శబ్దంగా కాల్ చేసుకునే అనుమతి ఇచ్చిన ఇన్స్పెక్టరు వైపు ఒక సారి చూసి, “థాంక్‌యూ సార్!” అని గొణుక్కుంటూ బయటికి నడిచాను. వెనక్కు తిరిగి చూసే తప్పు మాత్రం నేను చెయ్యలేదు. అక్కడున్న ఎందరు నా వైపు విచిత్రంగా చూస్తున్నారేమో అని నా అనుమానం!

ఆరోజు తర్వాత సుభాష్ సలహా పాటించడంలో ఆలస్యం చెయ్యలేదు. కారున్న తర్వాత చెడిపోతుంది. ఈ సారి పోలీసు స్టేషన్ దగ్గరో, ఫోన్ బూత్ దగ్గరో చెడిపోతుందని గారంటీ లేదు. అందుకని నా మొదటి మొబైలు ఎరిక్‌సన్, కొత్తగా వచ్చిన ఏర్టెల్ వాళ్ళ సిం కార్డ్ కోసం డబ్బు పోయాల్సివచ్చింది. అయినా దాన్నొక ఇన్షూరెన్స్ ఖర్చులా అనుకోక తప్పలేదు.

ఇప్పుడు మొబైలు ఫోన్లు మనకెంత అలవాటు అయాయంటే, మనలో కొందరు మేలుకుని ఉన్న సమయంలో ఎక్కువ భాగం వాటిని చెవికి అంటించుకునే గడుపుతారు. అన్ని రకాల ఉపకరణాల్లాగే, మొబైల్సు వచ్చాక, ఇంట్లో ఉన్న పాతకాలం బేసిక్ ఫోను ఉపయోగం తగ్గిపోయింది. ఇళ్ళలో ఈ ఫోన్ల కనెక్షన్లు తీసేయ్యటం అభివౄద్ధి మార్గంలో సహజమయిన ముందడుగు! నాకు మాత్రం పాతకాలం ఫోనును మించింది లేదనిపిస్తుంది. నేల అడుగునుంచీ వ్యాపించి ఉన్న తీగల మీద ఆధారపడే ఆ ఉపకరణంలో, ‘సిగ్నల్ బాగా అందటం లేదు!’ అని కాల్ మధ్యలో సంభాషణ తెగిపోవటం ఉండదు కదా?
----------------------------------------------------
రచన: వింధ్యవాసిని, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment