రహదారి రైలుదారి తలోదారి
సాహితీమిత్రులారా!
ఈ కథను ఆస్వాదించండి................
ట్రైన్ సాయంత్రం నాలుగున్నరకి. స్టేషన్ పది కిలోమీటర్ల దూరం. కేబ్ అయినా ఆటో అయినా ముప్పావుగంట ప్రయాణం. పాత స్టేషన్ పక్కనే ఉంది నాలుగు కిలోమీటర్ల లోపే. సిటీ పెరగడంతో జనాభా పెరిగి ఇక్కడ టెర్మినేట్ అయ్యే రైలు రూట్లు పెరిగాయి. వాటిని ఉపయోగించుకోడానికి ట్రైన్ల సంఖ్యా పెరిగింది. దాంతో ప్రయాణీకుల తాకిడీ పెరిగింది. తప్పనిసరిగా ఈ ఊరికి టెర్మినస్‌లూ టెర్మినల్ పాయింట్లూ పెరిగాయి. దగ్గరి స్టేషన్ నుంచి బయల్దేరే ట్రైన్లు తగ్గాయి. ఉన్నవాటికి డిమాండ్ ఎక్కువై షార్ట్ నోటీస్‌లో ప్రయాణం పడితే రిజర్వేషన్లు కుంచించుకుపోయాయి. పాత స్టేషన్ నుంచి బయల్దేరే రైళ్ళలో నెల రోజుల ముందునుంచే ఆర్.ఎ.సి.లు, వెయిటింగ్ లిస్టులు. రిజర్వేషన్ కన్‌ఫర్మ్ కాదు. ఇది షార్ట్ నోటీస్ తప్పనిసరి ప్రయాణం.
మనకి రైళ్ళంటే రైలు బండి. రైల్స్ మీద నడిచే బండి. మనకి రైళ్లంటే రైల్స్ కావు. ఆ రైళ్ళలో స్లీపర్‌లుంటాయి. ఈ రైల్సు కిందా స్లీపర్‌లుంటాయి. దీనర్థం catwalk అంటే తెలియని వాళ్ళకి అర్థం కాదు. Catwalk అంటే పిల్లినడకలని, haven అంటే స్వర్గధామం అని అనువాదం చేసే మన జర్నలిస్ట్‌లకి, చానలిస్ట్‌లకి ఎప్పటికీ అర్థం కాదు. బూదరాజుగారు cat-పిల్లి నుంచి catt-కేటిల్ తరవాత catw పట్టించుకోకుండా cau-కాకస్‌కి వెళ్ళిపోడం కారణం కావచ్చు.
కొత్త స్టేషన్ నుంచి బయల్దేరే రైల్లో రిజర్వేషన్ దొరకడం వల్ల పది కిలోమీటర్లయినా మరోదారి లేదు. మధ్య దారిలో స్కూళ్ళుంటాయి. మార్కెట్లుంటాయి. ఒకరిదారిలోకి మరొకరు అడ్డం పడే ఆటోలు, టూవీలర్లుంటాయి. వారివల్ల ట్రాఫిక్ జామ్‌లుంటాయి.
కాల్ వర్క్ అయి, అదర్ సైడ్ చీఫ్ పూర్తయి, ఎప్పటిలానే క్రాస్ మరోరోజుకి వాయిదాపడేటప్పటికి లంచ్ టైమ్ అయింది. ఇంటికి చేరుకుని భోజనం చేసి రెడీ అయేటప్పటికి మూడు.
ఆన్‌లైన్‌లో ఒక్క కేబ్ గానీ ఆటో గానీ లేదు. ఓలా, ఊబర్ చుట్టుపక్కల ఎక్కడా లేవు. ఒక ఆటో కన్ఫర్మ్ చేసేక రెండు మూడు నిముషాల తరవాత చూస్తే కేన్సిల్ అయిపోయుంది. మూడుంపావవుతోంది. ఫరవాలేదు ఇంకా టైం ఉంది. పోనీ మెయిన్ రోడ్డు దాకా నడుచుకెళితే ఏదైనా ఆటో దొరకుతుందేమో? సామాను మోసుకుంటూ పెట్టె ఈడ్చుకుంటూ అంత దూరం ఎవడు వెళతాడు. ఈ కేబ్ వాడు వస్తాడేమో చూస్తే సరి. హమ్మయ్య… విల్ పికప్ ఇన్ టూ మినిట్స్. ఐదు నిమిషాలయింది. మూడూ ఇరవై రెండు. మూడున్నరకి బయల్దేరినా గంట టైమ్ ఉంటుంది. ఫరవాలేదు.
ఓలాలని ఊబర్‌లని నమ్మలేం. మెయిన్ రోడ్డు దాకా ఎలాగోలా లాగించేస్తే అక్కడేదైనా ఆటో దొరకొచ్చు. ఇంకా టైమ్ మూడే. ఓ బేగ్‌ని, మూడు చక్రాల పెట్టెను ఈడ్చుకుంటూ ఎండలో చెమటలుకక్కుతూ మెయిన్ రోడ్డెక్కేసరికి మూడుంపావు. ఫరవాలేదు ఇంకా టైమ్ ఉంది. ఖాళీగా వేగంగా వస్తున్న ఆటో దూరంగా కనబడేటప్పటికి మరో ఐదు నిముషాలైపోయాయి. ఆఁ… ఆఁ… చెయ్యడ్డం పెట్టినా ఆగకుండా అంత వేగంగానే ఆపకుండానే ఉడాయించాడు. లంచ్ కోసం కాబోలు. మరో పదినిమిషాల్లో దొరికినా ఇంకా గంట టైమ్ ఉంటుంది. ఫరవాలేదు.
టూ మినిట్స్‌లో వచ్చేస్తాడు కదాని సామానుతో గేటు బయటకొచ్చి ఎండలో చెమటలు కక్కుతూ నుంచున్న పదినిమిషాలక్కాని ఆ కేబ్‌వాడు రాలేదు. కుర్రాడు కాదు. ఏభై పైనే. పూర్తిగా గంట లేదు రెండు నిమిషాలు తక్కువ. అయినా ఫరవాలేదు. టైమ్‌కి చేరిపోవచ్చు. హర్డిల్స్ రేస్ ప్రారంభమయింది. జాగ్రత్తగా నెమ్మదిగా వెళుతున్నాడు. ఏ.సి. వల్ల చల్లబడి ప్రాణం కుదుటబడింది. ఇంకా జూనియర్ కాలేజ్ వదిలే టైమ్ అవలేదు. బతికేను. అబ్బా చచ్చేను, థియేటర్ దగ్గర జనం. కొత్త సినిమా రిలీజ్ ఇవాళ. థియేటర్ లోపల పార్కింగ్‌కి చోటులేదు అన్ని బళ్ళు రోడ్డు మీదనే ఉన్నాయి. ట్రాఫిక్ జామ్. ఇదే ఆటో అయుంటే…
పది నిముషాలు కాదు పావుగంట పట్టింది ఆటో దొరకడానికి. నేను వచ్చిన సందులోకే తిరిగాడు. “ఆ వేపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఈ సందుల్లోంచి ఇలా వెళితే త్వరగా చేరుకోవచ్చు” అన్నాడు అడక్కుండానే. ఎటో అటు గంటలోపల చేరుకోవాలి స్టేషన్‌కి. ఇటువేపు అన్నీ ఇరుకు సందులు అయినా సూపర్ స్పీడుగా వెళుతున్నాడు. ముందున్న వాళ్ళని గుద్దేస్తాడేమోనన్నంత దగ్గరకెళ్ళేక పక్కకి తిప్పుతూ సందు చేసుకుని దూరిపోతున్నాడు.
ఇప్పుడు ఆటో గురించి అనుకుని ఏం లాభం. అనుకున్న టైమ్‌కి చేరుకోవాలి. అడ్డంగా ఉన్న ట్రైసైకిల్ వాణ్ణి దాటుకుని స్పీడు పెరిగేటప్పటికి మూడూ నలభై. ‘స్పీడుగా వెళ్ళు’ అన్నప్పుడల్లా సరే సరే అంటున్నా డ్రైవర్లో స్పీడు లేదు. గేర్ మార్చి స్పీడు పెంచేసరికి ఎవడో ఒకడు అడ్డం రావడం, స్పీడు తగ్గిపోడం. 20 దాటి వెళ్ళలేకపోతున్నాడు. త్వరగా త్వరగా.
ఇంత స్పీడేంట్రా బాబూ. చంపేస్తాడా ఏం? అంత స్పీడెందుకయ్యా కాస్తా స్లో చెయ్. విన్నాడో లేదో కూడా తెలీడంలేదు. ఈ దారంతా చిన్న చిన్న సందులే. అందుకే ఇటుపక్కకి సాధారణంగా రాను. సరైన సమయానికి జాగ్రత్తగా చేరుస్తాడా? రోడ్డుకి రెండు వేపులా అరటిపళ్ళు, ఆపిల్స్, దానిమ్మలు, ఇంకేవేవో వస్తువులమ్ముతున్న బళ్ళు. గోచీగుడ్డంతున్న రోడ్డు మీద ఏదీ అడ్డం కాదన్నట్టు లాగించేస్తున్నాడు.
పావు తక్కువ నాలుగు. ఇంతా చేస్తే రెండు కిలోమీటర్లు. ఇప్పుడా స్కూలు విడిచిపెడితే. చస్తాం. కాదు చచ్చేను. వదిలేరు. కార్లు, ఆటోలు, స్కూటర్లతో రోడ్డు నిండిపోయుంది. పద్మవ్యూహంలో తగులుకున్నాడీ అభిమన్యుడు. ముందుకి దారిలేదు, వెనక్కి తిరగడం చేతకాదు. రోజూ ఈ సమయానికి ఇలా ఉంటే స్కూలు వాళ్ళూ పట్టించుకోరు, పోలీసులూ కంట్రోల్ చెయ్యరు. ఏం దారి? కదల్డం లేదు బండి. ఆగడం లేదు సెకండ్ల ముల్లు. చూస్తూండగానే పదినిమిషాలు గాల్లో కలిసిపోయాయి.
పావు తక్కువ నాలుగు. ఈ దారి స్టేషన్‌కెళ్లేదారికి ఎక్కడ కలుస్తుందో తెలీడంలేదు. ఆటోవాడికి కొట్టినపిండిలాగ కళ్ళు మూసుకుని పరిగెట్టిస్తున్నాడు. ఎంత దూరం వచ్చేం, ఇంకా ఎంత దూరం ఉందో తెలీడం లేదు. కొంపదీసి వీడు పాత స్టేషన్ వేపు వెళుతున్నాడో ఏంటో? కొత్త స్టేషన్ అని స్పష్టంగానే చెప్పానే. అందుకే వంద రూపాయలకి డబుల్ రెండొందలడిగాడు.
ఇంకా అరగంటే ఉంది. నాలుగైపోతోంది. నాలుగు కిలోమీటర్లే. ఇంకా సగం దూరం కూడా దాటలేదు. ఇలా అయితే మరో ముప్పావుగంటక్కాని చేరను. లాభం లేదు. దిగి ఆటోలో వెళ్ళడం తప్ప మరోదారి లేదు.
ఇంకా అరగంటపైనే ఉంది. నాలుగవలేదింకా. ముప్పావుదూరం వచ్చేశాం. కొత్త స్టేషన్ రోడ్డు మీదకి వచ్చేశాడు. హమ్మయ్య ఇక్కడ్నుంచి దారి తెలుసు. మరో పది నిముషాలలోపే స్టేషన్‌కి చేరిపోవచ్చు. ఆ సిగ్నల్ దాటితే ఇక ఆట్టే దూరం ఉండదు.
ఆటోలో కొత్త స్టేషన్‌కెళ్ళే డబ్బు ఈ సగం దూరానికే వదిలించుకుని పాత స్టేషన్ దగ్గర కేబ్ దిగిపోయాను. ఇంకా ఐదారు కిలోమీటర్లు వెళ్ళాలి. అరగంటలో వెళ్ళడం కష్టం. మధ్యలో మరో స్కూలుంది. కొత్త స్టేషన్ రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది. సరైన ఆటోవాడు దొరికితే బతికిపోతాను. డిక్కీలోంచి సామాను తీస్తూండగా వెనక బయల్దేరుతున్న ఆటోని ఆపి అందులోకి ఎక్కించేసేను, ఎంత అని అడక్కూండానే. ఎంతైనా ఫరవాలేదు. సమయానికి తీసుకెళ్ళగలిగితే చాలు. ఆటోవాడు అనుమానంగా అడిగేడు, కేబ్ లోంచి ఆటో ఎక్కుతున్నారేం అని. టైమ్ అయిపోతోంది. అరగంటలో సగం దూరం కూడా తీసుకురాలేకపోయాడు ట్రాఫిక్ జామ్‌ల వల్ల, నాలుగున్నరకి ట్రైన్ అన్నాను. ఇలాంటప్పుడు కేబ్ కన్నా ఆటోనే బెస్ట్ అని నాకర్థంకాని భాషలో అనుంటాడని అర్థం చేసుకున్నాను.
సిగ్నల్ నుంచి ఐదు నిముషాల్లో చేరుకున్నాడు స్టేషన్‌కి. నాలుగూ పదికి ఏ.సి. కోచ్‌లో సుఖంగా కూర్చున్నాను.
ఈ ఆటోవాడూ కుర్రాడు కాదు. నలభై పైనే. ఎక్కడమేంటి స్పీడందుకున్నాడు. సిగ్నల్స్ దగ్గర ఆగక తప్పడం లేదు. బళ్ళని ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న వాటికి ఎదురెళ్తూ రఁయ్ రఁయ్ మని పరిగెడుతున్నాడు. ఎలా వెళ్తున్నాడన్నది నేను పట్టించుకోలేదు. కదుల్తూన్న సెకండ్ల ముల్లు, కదిలిపోతున్న నిమిషాల ముల్లు. నాలుగుంపావు. ఎప్పటికి చేరుతాను. ట్రైన్ ఎక్కుతానా? మిస్సైతే ఏం దారి. బస్సులో ప్రయాణం నావల్లకాదు. ఫ్లైట్ అన్నది నా ప్లాన్‌లో ఎప్పుడూ ఉండదు. రేపుదయానికి ఎలాగైనా అక్కడుండాలి. చేరుకోగలనా లేదా?
ఏ.సి. ఇంకా పూర్తిగా పుంజుకోలేదు. కాని తిరుగుతున్న ఫాన్ కింద కూర్చునుంటే చల్లగానే ఉంది. కోచ్ జనం తక్కువగానే ఉన్నారు. ఇంకా ఐదు నిమిషాలుంది. నీళ్ళ బాటిల్ కొనుక్కుని రావచ్చు.
స్కూల్ దగ్గర ట్రాఫిక్ జామ్ దాటుకుని ఆటో పరిగెడుతూంది కొత్త స్టేషన్ రోడ్డు మీద. టైమ్ అయిపోయింది. ఐదు నిమిషాల్లో ఆ సిగ్నల్ దాటుకుని వెళిపోగలిగితే… అబ్బా! రెడ్ పడింది. చచ్చినట్టు ఆగాడు.
టూ మినిట్స్ మోర్. అనౌన్స్‌మెంట్ వెళుతోంది. ..వెళ్ళవలసిన …ఎక్స్ ప్రెస్ రెండవ నెంబర్ ప్లాట్ ఫారం నుండి బయలుదేరును.
ఆటోవాడు ట్రైన్‌కి నన్ను అందించడానికి తన శక్తిసామార్థ్యాలన్నీ ఉపయోగిస్తున్నాడు. పూర్తిగా రైట్‌సైడ్‌కి వచ్చి రాంగ్‌సైడ్‌లో అందరికన్నా ముందుకి వెళ్ళి సిగ్నల్ పడగానే ముందుకి దూకాడు. రోడ్డుమధ్యనున్న ట్రాఫిక్ పోలీస్ అంబ్రెల్లాకి కుడివేపు నుంచి ఎడమవేపు వెనక ఫాలో అవుతున్న బళ్ళని తప్పించుకుని ఎదురుగా ఖాళీగా ఉన్న రోడ్డుమీద సూపర్ స్పీడ్ అందుకున్నాడు. స్టేషన్ కారిడార్‌లో ఆటో ఆపి వాడిడగిన వంద తీసుకుంటూ అన్నాడు- సాధారణంగా మధ్యాహ్నం మందుకొట్టాక బండి తియ్యను. ఏదో మీకోసం- అని నాకర్ధం అయే భాషలోనే. దాని అంతరార్థం గురించి ఆలోచించేంత టైం లేదు. ట్రైన్ ఉందా వెళ్ళిపోయిందా అంతే బుర్రంతా. అనౌన్స్‌మెంట్ వెళుతోంది. రెండో నెంబర్ ప్లాట్‌ఫామ్ నుండి బయల్దేరుటకు సిధ్ధముగా ఉన్నది. పెట్టె లాక్కుంటూ బేగ్ మోసుకుంటూ పరిగెత్తాను. పరిగెడితే చాలదు. మెట్లెక్కుతూ పరిగెట్టాలి, రైలు కాదు ట్రైన్ పరుగెత్తక ముందే. హమ్మయ్య మెట్ల దగ్గరే ఎదురుగా ఉంది కోచ్. చెమటలు కారిపోతుంటే ఊపిరి తీసుకుంటూ కూలబడ్డాను. ట్రైన్ బయల్దేరింది. ఎవరూ చైన్ లాగలేదు. బండి ఇంక ఆగలేదు. ఎదురు సీట్లో ఆయన ఆదుర్దాగా చూస్తున్నాడు నా అవస్థ. నీళ్ళ బాటిల్ తీసి అందించాడు.
నాలుగు ఇరవై తొమ్మిది యాభై సెకండ్లు. టెన్… నైన్… ఎయ్ ట్… సెవన్… సిక్స్… ఫైవ్… ఫోర్… త్రీ… టూ… వన్… ప్లస్ వన్… ప్లస్ టూ… ప్లస్ వన్ మినిట్… ప్లస్ టూ మినిట్స్… సెకండ్లు నిమిషాలయ్యాయి… నిమిషాలు ఐదయ్యాయి… ఇంకా ఎంత సేపు…
--------------------------------------------------------
రచన: వేగోకృప,
ఈమాట సౌజన్యంతో
Ok....
ReplyDelete