Thursday, April 18, 2019

తవ్విపోత


తవ్విపోత




సాహితీమిత్రులారా!


ఈ కవితను ఆస్వాదించండి..............

తవ్వకాలలో దొరికిన శకలం
చరిత్రనేదో నిర్థారిస్తున్నట్టు
జ్ఞాపకంగా పదిలపర్చిన
ఒక సంవత్సరం కలిసి చదివిన ఓ అనుభవం
నే ప్రయాణిస్తున్న బస్సెక్కి ఎదురై పలుకరించింది

ఓ మిత్రమా!
నీవు నన్నుగా గుర్తుంచుకొన్నది
పొరలులేని నా బాల్యరూపాన్నే కదా!
అందుకే గుండెల్లో అలజడి
ఎవరి జీవితాన్ని వారు
భుజాన వేసుకొని విడిపోయినవాళ్ళం
ఇలా కలవడం యాదృచ్ఛికమా!

మనతోపాటు పాఠశాల ప్రాంగణంలో
తిరుగాడినవారెవరూ గుర్తులేరంటూనే
మనం గుర్తుచేసుకున్న వారందరూ
ఎవరు ఇప్పుడెక్కడున్నారో కదా!

విరామసమయంలో
చేది పోసినవి తాగి
చలోక్తులతో చిలకరించిన నీళ్ళు
ఏ పులకరింపుల నిచ్చాయో !
బావి ఆనవాళ్లేలేని ఈ రోజు
ఏ పదాలతో వివరించను?

జీవితానికి శెలవుచీటిపెట్టిన ఉపాధ్యాయుల్ని
మననం చేసుకున్నప్పుడే కదా
వాళ్ళు మనకెంత ధారపోశారో తెలిసేది?

మనం విడిపోయిన తరగతుల్నుండి
పోటిలను, ఆటుపోటులను ఎదుర్కొంటూ
జీవితాల్ని కట్టుకుంటూ
సృష్టించుకున్న కొత్త ప్రపంచంలోకి
నీకు అనుమతుందో లేదో!

పాత విద్యార్థుల పేరిట కలిసే చోటుల్లో
పచ్చసిరావో వ్యాపారివో
తెలుసుకుందామనే
మన పలకరింపులు
వాసనలేని కాడమల్లెలౌతున్నాయి

కొంత ప్రయాణం తర్వాత
తెరిచిన జ్ఞాపకాలను మూసేసి
ఎవరి జీవితంలోకి వాళ్ళం జారిపోయి
ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాల్లా విలవిలలాడతాం

అయినా!
ఈ అనుభవం
మరోజ్ఞాపకమై మిగిలేవుంటుంది
అది బాల్యాన్నే ముడివేసుకుంటుంది.
---------------------------------------------------------
రచన: జాన్ హైడ్ కనుమూరి, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

  1. మన పలకరింపులు
    వాసనలేని కాడమల్లెలౌతున్నాయి. బాగుంది ఈ వాక్యం. జాన్ గారు ఒకప్పుడు బ్లాగుల్లో తవికలు విరివిగా వ్రాసేవారు.

    ReplyDelete