తుఫాను ముగిసింది
సాహితీమిత్రులారా!
ఈ కవితను ఆస్వాదించండి ......................
అప్పటిదాకా ఆకాశం హుందాగా
నీలి పూల శాలువాను కప్పుకుని
ప్రశాంతం గానే ఉంటుంది
అంతలోనే చెప్పా పెట్టకుండా
మసి కప్పేసిన మబ్బులు
దట్టంగా కమ్ముకుంటాయి
హఠాత్తుగా ఆకాశం నుంచి అవాంతరం
ఏ హెచ్చరికా లేకుండా
హరికేనై విరుచుకుపడుతుంది.
ప్రచండమైన గాలివానను
ఆయుధంగా జేసుకుని
మూలాల్ని కుదిపేసే ఆవేశంతో
ఆకాశం అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది
వెన్ను జలదరించే భయాందోళనలతో
భూమి, చెట్లు నిస్సహాయంగా వణికిపోతాయి
అంతంలేని ఆగ్రహమో పంతం వీడని ప్రభంజనమో
వాగులు వంకలు ఏకం చేసి చేట్లుచేమలని క్రుంగదీసి
గాలివాన మొత్తానికి తగ్గుముఖం పడుతుంది
ఇంత ఆగడం చేసిన ఆకాశం
తుఫాను ముగిశాక కొత్త అందంతో మెరిసిపోతుంది
లంఖణం చేసి చిక్కిన చెంపలతో వున్నా
చారెడేసి కళ్ళతో అమాయకంగా
హృదయాన్ని దోచే నవయవ్వన తరుణిలా.
------------------------------------------------
రచన: వైదేహి శశిధర్,
ఈమాట సౌజన్యంతో
అసలు వర్షాలు లేక జనం మాడిపోతావుంటే ఈ తవికలెందుకు చెప్పు.
ReplyDeleteఆయన కవిత ఆయన రాసుకుంటే మీకేంటి నొప్పి. మిమ్మల్ని గాని ఇంకెవరిని గాని ఏమీ అనలేదుగా.
Delete