Sunday, April 28, 2019

ఏకాంతం కోసం


ఏకాంతం కోసం




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి.................

ఆ పెద్దావిడ ప్రతీ మంగళవారం ఆ పుస్తకాలాయన ఇల్లు శుభ్రం చేయడానికని వొస్తుంది. కాలింగ్ బెల్ విని తలుపు తీస్తూ మీ మనవడెలా ఉన్నాడని అడిగాడు ఆయన. లోపలికొచ్చి కాళ్ళు తుడుచుకునే పట్టా మీదే ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్టు నిలబడిపోయింది మా పార్కర్.

“నిన్ననే వాణ్ణి పూడ్చిపెట్టాం సర్!” నిర్లిప్తంగా చెప్పింది.

“అయ్యయ్యో! ఔనా?!” పుస్తకాలాయన ఇంకేమనాలో తోచక మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయానికాయన ఉదయపు ఫలహారం చేస్తున్నాడు. ఎప్పట్లానే బాగా నలిగిపోయిన నైట్ గౌనులో ఆరోజు పేపరు చేత్తో పట్టుకునున్నాడు. ఇప్పుడు ఏమీ జరగనట్టు తిరిగిపోయి ఫలహారం ముగించడమా, ఇంకేవైనా ఓదార్పు మాటలు అనాలా అర్థంకాలేదాయనకి. ఏమీ మాట్లాడకుండా పేపరు పట్టుకొని పక్క గదిలోకెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ, అది మొరటుతనంగా అనిపించిందతనికే.

“చర్చిలో అంతా సవ్యంగా జరిగిపోయిందా, మిసెస్ పార్కర్?” మొహమాటపడుతూ అడిగాడు.

“ఏమన్నారు సర్?” అర్థంగానట్టు అడిగిందావిడ.

“అదే, పిల్లవాడి ఆ… కార్యక్రమం ఏ ఇబ్బందీ లేకుండా…”

ఆవిడేమీ బదులివ్వలేదు. తలవంచుకుని మెల్లిగా ఆడుగులేస్తూ వంటింట్లోకెళ్ళిపోయింది. ఆయన నిట్టూర్చి తన ఫలహారం పనిలో పడ్డాడు.

ముసలావిడ వంటింట్లోకెళ్ళి చేతిసంచీ లోంచి తన పనిముట్లు తీసుకొని సంచీ చిలక్కొయ్యకి తగిలించింది. మెల్లిగా కుర్చీలో కూర్చొని వొంగి బూట్లు విప్పుకుంది. బూట్లు వేసుకోవడం, తిరిగి విప్పడం ఎంత నొప్పో ఆమెకు. అయితే ఆమెకా నొప్పి ఎంతగా అలవాటైపోయిందంటే, లేసులు విప్పదీయడం మొదలుపెట్టబోతుండగానే ఆమె పళ్ళు బిగుసుకుంటాయి, రాబోయే నొప్పిని ఊహిస్తున్నట్టుగా.

అతి ప్రయాస మీద బూట్లు విప్పి పక్కనపెట్టి కొంచెంసేపు కుర్చీలో అలాగే జారగిలబడి కూర్చుందామె, మోకాళ్ళు రుద్దుకుంటూ.

“గ్రానీ! గ్రానీ!” బయట వీధి లోంచి ఆమె మనవడు బూట్లతో సహా ఆమె ఒళ్ళోకెగబడ్డాడు.

“అబ్బబ్బా! అలా మీదపడొద్దని ఎన్నిసార్లు చెప్పాల్రా? చూడు, నా బట్టలెంత మురికి చేశావో!” విసుక్కుందామె. ఆమె మాటలేం పట్టించుకోకుండా వాడలాగే ఆమె ఒళ్ళో లేచి నుంచున్నాడు.

“గ్రానీ! ఒక్క పెన్నీ ఇవ్వవా!”

“ఫో అవతలకి! గ్రానీ దగ్గర పెన్నీల్లేవ్.”

“ఉన్నై, ఉన్నై, నాకు తెలుసుగా! గ్రానీ, ఒక్క పెన్నీ అంటే ఒక్కటి. ఇవ్వు గ్రానీ.” ఆమె మెడ చుట్టూ చేతులేసి తన చెంప ఆమె చెంపకి తగిలించి ముద్దుగా ఆడిగాడు.

“చాల్లే, నీ వేషాలూ నువ్వూ! నా దగ్గర పెన్నీలేమీ లేవంటున్నా కదా?” ఆమె చేతులు అప్పటికే తన హ్యాండ్‌బ్యాగులో చిల్లర డబ్బులకోసం తడుముతున్నాయి.

“సరే. నీకో పెన్నీ ఇస్తా. మరి నాకేమిస్తావూ, చెప్పు ముందు!”

వాడు ముద్దుగా నవ్వి అమ్మమ్మ మెడ చుట్టూ చేతులు ఇంకా గట్టిగా బిగించాడు.

“నా దగ్గిరేం లేదుగా గ్రానీ?” వాడి కంటి రెప్పలు ఆమె చెంప మీద చక్కిలిగిలి పెడుతూ…

పెద్దావిడ ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి నిలబడింది. సింకు నుంచి టీ గిన్నెలో నీళ్ళు నింపి స్టవ్ మీద పెట్టింది. ఆపైన, ఇంకో గిన్నెలోనూ బకెట్‌లోనూ నీళ్ళు పట్టింది. పంపు నుంచి ధారగా నీళ్ళు గుడగుడ శబ్దం చేస్తూ గిన్నెలో నిండుతుంటే ఆమెకు నొప్పి ఏదో తగ్గినట్టనిపించింది కాసేపు.

ఆ వంటింటి స్థితి గురించి ఏకంగా పుస్తకమే రాయొచ్చు. పుస్తకాలాయన వారమంతా తన ‘పని’ తానే చేసుకుంటాడు. ఆవిడ వారానికొక్కరోజు మాత్రమే వొచ్చి శుభ్రంచేస్తుంది. ఆ వారంలోగా ఆయన నానా కంగాళీ చేసిపెడతాడు ఇల్లంతా. టీ కాచుకుని ఆ చెత్తంతా ఒక పెద్ద జాడీలో పడేస్తాడు. చెంచాలు, కత్తులు, ఫోర్కులూ వాడి సింకులో పడేస్తాడు. ఎప్పుడైనా కడగక తప్పదనిపిస్తే, ఒక తువ్వాలుతో తుడిచి మళ్ళీ వాడేస్తాడు. ఆయన దృష్టిలో ఇల్లు శుభ్రం చేసుకోవడమంత దండగ పని ఇంకొకటి లేదు.

“ఇంట్లో హాయిగా ఇష్టమొచ్చినట్టు వుండండి. వారానికొకసారి పనిమనిషిని మాట్లాడుకుంటే వచ్చి శుభ్రం చేసిపోతుంది. ఆమాత్రం దానికి ఇల్లు ప్రతీరోజూ ఎందుకూ క్లీన్ చేసుకోవడం. వేస్ట్ ఆఫ్ టైమ్!” అంటాడాయన దగ్గరి స్నేహితులతో. అదీ ఆయన ‘పద్ధతి.’

ఆ పద్ధతి అందమంతా ఆ వంటిల్లు చూస్తేనే తెలిసిపోతుంది.

వంటిల్లంతా పెద్ద చెత్త కుండీలా తయారయింది. నేల మీద రొట్టె ముక్కలు, ఉత్తరాలు, ఖాళీ పేకెట్లు, సిగరెట్టు పీకలు, చెప్పనలవికాకుండా వుంది. అయినా ఎప్పుడూ ఆవిడ విసుక్కోలేదు. పైగా ఒంటరివాడనీ అతన్ని అంటిపెట్టుకుని వుండేవారెవరూ లేరనీ సానుభూతి కూడా. కిటికీ తలుపు తెరిచి ఆకాశం వంక చూసింది. అక్కణ్ణించి ఆకాశం ఎందుకో ఎప్పుడూ దిగులుగా అనిపిస్తుంది. ఉన్న ఒకటీరెండు మబ్బులు కూడా ఆకాశంలో టీ మరకల్లాగా అంచులు చిరిగిపోయి, అక్కడక్కడా చిల్లులు పడ్డ దుప్పట్లలా వుంటాయి.

ఆవిడ నేల చిమ్మడం మొదలుపెట్టింది. ‘ఏమిటో, నా పాడు జన్మకీ కష్టాలు తీరేలా లేవు. ఎంతకని భరించను, ఎన్నని సహించను!’ అనుకుని నిట్టూర్చింది.

ఆ మాట ఆమె గురించి ఆమే కాదు అందరూ అనుకునేదే. సాయంత్రం పనంతా ముగించి ఇంటికి నిదానంగా నడుచుకుంటూ పోయే ఆమెను చూసి అందరూ పాపం అనుకుంటారు. మా పార్కర్ బతుకంతా కష్టాలే కష్టాలు, అని చెప్పుకుంటారు. ఆవిడకదేమీ గొప్పగా అనిపించదు. ఆమాటకొస్తే అసలేమీ అనిపించదు. ఆవిడ ఫలానా నంబరు ఇంట్లో ఉంటుంది అన్నప్పుడు ఎలా వుంటుందో, ఆమెది ఎంత కష్టమైన బతుకో అనుకున్నప్పుడూ అలానే వుంటుంది. నిజంగా కష్టమైన బతుకే…

పదహారేళ్ళప్పుడు స్ట్రాట్‌ఫర్డ్ వదిలి లండన్‌కొచ్చిపడింది పనిమనిషిగా. ఓహ్! స్ట్రాట్‌ఫర్డ్! అంటే షేక్స్‌పియర్ పుట్టిన వూరే కదా? అందరూ ఆమెని అడిగేవాళ్ళే! ఏమో సర్, తెలీదు. ఆమెకు షేక్స్‌పియర్ ఎవరో లండన్ వచ్చాక కానీ తెలియలేదు.

ఇప్పుడా వూరి జ్ఞాపకాలు ఏమీ లేవు. ఏ చీకటి రాత్రో చిమ్నీగొట్టాం నుంచి నక్షత్రాలను చూడడం, లీలగా అమ్మ, ఇంటిముందు మొక్క ఏదో గుర్తులేదు కానీ మంచి వాసన వస్తుండేది. ఎప్పుడో జబ్బుచేసి మంచం పైన పడుకున్నప్పుడు ఒకటి రెండు సార్లు గుర్తొచ్చాయి, అంతే.

ఆమె మొదట పనిచేసిన ఇంట్లో భయంకరంగా వుండేది. రోజంతా వంటింట్లోనే మగ్గాల్సొచ్చేది. పైగా ఆ వంటమనిషి ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేని రాక్షసి. ఇంటి నుంచి వొచ్చే వుత్తరాలు కూడా చదవనిచ్చేదికాదు. చేతిలోంచి లాక్కొని చిమ్నీలో పారేసేది అవి చదువుకుంటూ ఊహల్లో తేలిపోతుందని. …పేడపురుగులు! అవును కదా! ఆ వంటమనిషి వాటినెప్పుడూ చూడలేదట. పేడపురుగులు చూడని వాళ్ళూ ఉంటారా? తన కాళ్ళు తాను చూసుకోని వాళ్ళెవరుంటారు. మా పార్కర్ ముఖంలో చిన్న నవ్వు కనిపిస్తుంది ఆ పేడపురుగులు గుర్తొచ్చినప్పుడల్లా.

ఆ ఇంటి నుంచి ఒక డాక్టరుగారి ఇంట్లో పని కుదిరింది. అక్కడా పగలూ రాత్రీ పని. రెండేళ్ళు అలుపెరగకుండా అలా పనిచేసి, ఒక బేకర్‌ని పెళ్ళాడింది.

“బేకర్‌ని పెళ్ళాడారా?” అన్నాడు పుస్తకాలాయన, ఆవిడ ఆ సంగతి చెప్పినప్పుడు. ఎప్పుడో ఇంట్లో ఇంకో ప్రాణి ఉంది అని గుర్తొచ్చినప్పుడు ఆ పుస్తకాల మధ్యలోంచి తలెత్తి ఆమె చెప్పేది వింటుంటాడాయన.

“అయినా బేకర్లే నయం లెండి. తిండికి లోటుండదు. పైగా శుభ్రమైన పని!” ఆవిడ నిజంగానా అన్నట్టు ఆయనవంక చూసింది.

“బేకరీలో బ్రెడ్ అమ్మడం, వచ్చీపోయే కస్టమర్లతో సరదాగా ఉండుండాలి కదా?”

“దుకాణంలో ఉండేంత తీరికెక్కడిది సర్? మొత్తం పదముగ్గురిని కన్నాను. ఏడుగురిని కప్పెట్టాను. తెలిసింది రెండే అనుకోండి నాకు, పురిటి మంచం లేకుంటే ఆస్పత్రి మంచం.”

“అనుకోవచ్చు, అనుకోవచ్చు,” వెన్నులోంచి చలి వచ్చినట్లు ఒక్కసారి వొణికి పెన్ను చేతిలోకి తీసుకుని తన పనిలో పడిపోయేడు.

ఏడుగురు పోయినా మిగిలిన ఆరుగురినీ పెంచి పోషించడమంటే మాటలా? ఇంతలో ఇంటాయనకి ఊపిరి తిత్తుల వ్యాధి సంక్రమించింది. లోపలంతా పిండి నిండిపోయిందన్నాడు వైద్యుడు.

“అమ్మా! ఇక్కడ కనక ఈయనని కోస్తే ఊపిరితిత్తులనిండా గోధుమ పిండే కనిపిస్తుంది మనకి. అయ్యా, మీరు కొంచెం గట్టిగా ఊపిరి పీల్చండి.” షర్టు పైకెత్తి పడుకున్న అతని వెన్ను పైన పెన్నుతో రాస్తూ అన్నాడు వైద్యుడు, ఆయన ఎంతో ప్రయాసతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆమెకెందుకో అతని నోటి నుండి గోధుమ పిండి పొగలా వచ్చినట్లు అనిపించింది.

ఆయన పోయిన తరవాత ఆరుగురు పిల్లలనీ పెంచేసరికి ప్రాణాలు కడబట్టిపోయాయి. సరిగ్గా ఆఖరి పిల్ల బళ్ళోకెళ్ళేసరికి తన చెల్లెలు భర్తతో సహా దిగింది, నీకు సహాయం చేస్తా అంటూ! సహాయం మాట దేవుడెరుగు, వచ్చిన రెండునెలలకి చెల్లెలు మెట్ల మీద జారి మంచాన పడడంతో చంటి బిడ్డలా అయిదేళ్ళపాటు పెంచాల్సిన పరిస్థితి వచ్చిపడింది. నిజంగా తన చెల్లెలు వయసొచ్చిన చంటి బిడ్డే!

ఆ తరవాత ఇద్దరాడపిల్లలూ జబ్బుచేసి పోయారు. జిమ్ సైన్యంలో చేరి ఇండియా పోయాడు. ఇద్దరు మగపిల్లలు జీవనోపాధి వెతుక్కుంటూ దేశాలు పట్టి వెళ్ళిపోయారు. ఆఖరిది ఎమిలీ తనతో మిగిలిపోయిందనుకుంటే అది ఎందుకూ పనికిరాని ఒక వెయిటర్ వెధవని పెళ్ళాడింది. వాడూ కడుపులో అల్సర్లు పుట్టి చచ్చిపోయాడు లెన్నీ పుట్టిన ఏడాది. ఇక మిగిలిందల్లా తన మనవడు లెన్నీ…

ఆలోచనల్లోనే గిన్నెలన్నీ కడిగి తుడిచి సర్దేసిందామె. నల్లగా మురికిపట్టిన కత్తులన్నీ కోసిన బంగాళాదుంపతో రుద్ది కడిగింది. భోజనం చేసే బల్ల, ప్లేట్లు కప్పులున్న అల్మారా, మిగతా వంటిల్లంతా కూడా శుభ్రంచేసి చేతులు తుడుచుకుంది.

…బుజ్జివెధవ పాపం ఎందుకో ఎప్పుడూ అనారోగ్యంగానే వుండేవాడు. వాడి వుంగరాల జుట్టు, నాజూకు రంగు చూసి అందరూ ఆడపిల్లనుకునేవారు. తనూ ఎమిలీ ఎన్నెన్నో చిట్కా వైద్యాలు చేశారు. ఆ వైద్యాలకోసం ఎమిలీ ఆదివారం పత్రిక పొద్దున్నే చదివేది. ఆ పత్రికకి సలహాల కోసం తల్లీ కూతురూ ఎన్నో ఉత్తరాలు కూడా రాసేవారు. అయినా లెన్నీ అసలు తిండి సరిగ్గా తిననేలేదు. ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా వాడు ఒళ్ళుచేయనేలేదు.

అమ్మకంటే వాడికి అమ్మమ్మంటే ప్రాణం. వాడు అమ్మమ్మ బిడ్డ.

“నువ్వు ఎవరి బేబీవీ?” అడిగింది మా పార్కర్, స్టవ్ తుడిచి జిడ్డు పట్టిన కిటికీ మీద సబ్బు రుద్దుతూ.

“నేను గ్రానీ బేబీని!”

ఒక పిల్లవాడి గొంతు తన గుండె కిందుగా నవ్వుతూ చెప్పింది. ఆ గొంతు ఎంతో ఆప్యాయంగా, ఎంతో దగ్గరగా తన గుండెలోంచి వస్తున్నట్టుగా వినిపించి మా పార్కర్ నిలువెల్లా కదిలిపోయింది ఒక్క క్షణం.

గది గుమ్మం దగ్గర అలికిడయింది. ఆమె తలెత్తి చూసింది. పుస్తకాలాయన తయారయి ఎక్కడికో బయల్దేరినట్టున్నాడు.

“మిసెస్ పార్కర్! నేను బయటికెళ్తున్నాను!”

“అలాగేనండి!”

“మీకివ్వాల్సిన డబ్బు బల్లమీద వుంది.”

“అలాగేనండి.”

ఆయన వెళ్ళబోతూ ఆగిపోయాడు.

“అన్నట్టు, కిందటి వారం మీరొచ్చినప్పుడు డబ్బాలోంచి కోకో పొడి బయటకానీ పడేశారా?”

“అబ్బే, లేదండి.”

“వింతగా వుందే. నాకు బాగా గుర్తు, డబ్బాలో ఒక చెంచాడు పొడి మిగిలేవుండాలి. ఇప్పుడు చూస్తే ఖాళీగా వుంది. కనపడకపోతే బయట పడేశారేమోననుకున్నా. నాకు చెప్పకుండా ఏదీ పడేయరు కదా!?” ఆయన గంభీరంగా ముగించి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, తన లౌక్యానికీ తెలివి తేటలకీ ఎంతగానో మురిసిపోతూ. తనేమీ అంత అమాయకుడూ తెలివితక్కువవాడూ కాదనీ, ఇంటి విషయాల్లో అప్రమత్తంగానే వుంటాడనీ తెలియజెయ్యడమే ఆయన ఉద్దేశ్యం.

ఆయన వెళ్ళిపోయిన గుర్తుగా తలుపు ధడాలున మూసుకుంది. మా పార్కర్ తన బ్రష్షులు, గుడ్డలూ తీసుకొని బెడ్రూములోకి నడిచింది చిన్నగా. పక్కలు దులిపింది, దుప్పట్లు తీసి కొత్త దుప్పట్లు పరిచి ముడతలు సరిచేసి వాటిని పరుపు కిందికి నెట్టింది. దిళ్ళు సర్దింది. ఆ ఒంటరితనంలో, నిశ్శబ్దంలో తన మనవడి ఆలోచన ఆమెను కుదిపివేస్తూనే ఉంది.

ఎలాగూ పోక తప్పనప్పుడు వాడంత నరకయాతన ఎందుకు అనుభవించాలన్న ప్రశ్న ఆమెని నిలవనీయడంలేదు. అంత పసి కూన ఒక్కొక్క ఊపిరి కోసం బ్రతుకునంతగా వేడుకోవాలా? ఆ చిన్నారిని అంత చిత్రహింసలు పెట్టి ఆనందించేదెవరు? ఎవరి తృప్తికోసం వాడి పోరాటం? ఆమెకు అర్థంకానిదదే.

వాడి పలుచటి గుండెలో ఏదో మరుగుతున్నట్టు వచ్చే గుర గుర శబ్దం. అది బైటికి రాదు వాడిని ఊపిరి తీసుకోనీయదు. దగ్గినప్పుడల్లా చేతులు కాళ్ళు కదిలిపోయేవి. కళ్ళు ఉబ్బుకొచ్చేవి. ఆ తరవాత అలసిపోయి దిండుకి చేరబడి వాడు గ్రానీ వంక కోపంగా చూసేవాడు.

తను కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

“నేనేం చేయనురా నా తండ్రీ!” చెమటకి తడిసిపోయిన వాడి జుట్టుని మొహం మీంచి పక్కకి జరిపింది. వాడు కోపంగా ఆమె చేయి పక్కకి తోసేసి కళ్ళు మూసుకున్నాడు. గుండెని మెలిపెడుతున్నట్టున్న బాధని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది.

ఇక తనవల్ల కాలేదు. చేతిలో వున్న తుడుపు గుడ్డ అలానే వదిలేసింది. ఆమె తన బతుకేదో తాను బతికింది. ఏదొచ్చినా నిబ్బరంగా నిలబడింది. ఆమె ఇంతవరకూ కన్నీళ్ళు పెట్టుకోలేదు బైటివారి ముందైనా తన పిల్లల ముందైనా. కానీ ఇప్పుడు లెన్నీ లేడు. తనకెవరూ లేరు. ఇప్పుడెవరికోసం బ్రతకాలి? తనకు మిగిలిందల్లా ఆ పసికూన ఒక్కడే. ఇప్పుడు వాడూ లేడు. ఈ కష్టాలన్నీతనకే ఎందుకు రావాలి? తనకే ఎందుకవుతుంది ఇలా?

“నాకే ఎందుకవుతుంది ఇలా?”

తెలియకుండానే ఆ ప్రశ్న మా పార్కర్ నోటినుంచి బయటకు వచ్చింది. గుండెను నులిపెడుతున్న బాధతో మా పార్కర్ తనేం చేస్తున్నదో తెలియని స్థితిలో వంటగదిలోకి నడిచింది, కోటు వేసుకుంది, తలకు టోపీ పెట్టుకుంది. ఇంట్లోంచి బైటకు వచ్చింది. ఎక్కడికి పోవాలి? ఎటువైపు నడవాలి? ఏం చేస్తే తన ఆలోచనలనుంచి తను తప్పించుకోగలదు?

బయట చలిగా వుంది. చల్లటి ఈదురుగాలి కత్తులతో కోస్తున్నట్లుగా ఉంది. అందరూ చకచకా నడిచిపోతున్నారు తమ శరీరాలన్నీ కప్పుకుని. పక్క మనిషిని పలకరించడానిక్కూడా ఓపిక, తీరిక లేని మనుషులు, ఎవరికీ ఆమె బాధ పట్టలేదు. ఎక్కడైనా కూర్చుని తీరుబడిగా ఏడవాలని వుందామెకు. కానీ ఇన్నేళ్ళ తరువాత ఏడుద్దామన్నా అవుతుందా? ఇన్నేళ్ళూ గుండెల్లో ఉగ్గబట్టుకువున్న ఏడుపు ఇప్పుడు మాత్రం బయటకు వస్తుందా?

ఆ ఆలోచన రాగానే లెన్నీ గుండెల మీదకెగబాకినట్టుగా అనిపించింది. అవున్నాన్నా, గ్రానీ కిప్పుడు ఏడవాలనుంది. ఏడుపంటూ మొదలుపెడితే అన్నిటికీ ఏడవాలి. రాక్షసిలాంటి వంటమనిషి, భర్త అనారోగ్యం, పుట్టిపోయిన తన పిల్లలు, ఇన్నేళ్ళ ఈ దుర్భరమైన జీవితం చివరికి లెన్నీ దగ్గరికి వచ్చి ఆగేదాకా జరిగిన ప్రతీదానికి ఏడవాలి. తీరిగ్గా పూర్తిగా గుండె బరువు తగ్గిపోయేలా ఏడవాలి. ఇన్నిటికి ఏడవాలంటే చాలా సమయం కావాలి. అయినా సరే. సమయం వచ్చింది. ఇక ఆగదు. తను ఏడవక తప్పదు. ఇక ఏడవాలి. కానీ ఎక్కడ?

“మా పార్కర్ బతుకంతా కష్టాలే కష్టాలు!” అవును. కష్టాలే. బిగబట్టుకున్న పెదవులు వణికాయి.

ఇంటికెళ్ళి ఏడవలేదు, అసలే బిడ్డ పోయిన బాధలో వున్న ఎమిలీ తట్టుకోలేదు, బెదిరిపోతుంది. బయటెక్కడైనా పార్కులో బెంచీ మీద కూర్చోని యేడుద్దామంటే, అందరూ చుట్టుముట్టి ప్రశ్నలడుగుతారు. పుస్తకాలాయనది పరాయి ఇల్లు. అక్కడ ఎలా ఏడవగలదు? ఏ దుకాణం మెట్ల మీదో కూర్చుని ఏడిస్తే పోలీసువాళ్ళు వచ్చి పొమ్మంటారు.

తనకు ఇష్టమైనంతసేపు ఎవరికీ తను కనిపించని చోటు, ఎవరూ తనని ప్రశ్నలడగని చోటు ఒకటి లేదా? ఇన్నాళ్ళకి ఈ ప్రపంచంలో తను పొగిలి పొగిలి ఏడవడానికి ఒక చోటంటూ కనీసం లేదా?

ఇంతలో వాన మొదలయింది. చల్లటి ఈదురుగాలి ఆమెను సూదులతో పొడిచింది. మా పార్కర్ అటూ ఇటూ చూసింది. లేదు, చోటెక్కడా లేదు.
----------------------------------------------------------
రచన: శారద ,
మూలం: కేథరిన్ మాన్స్‌ఫీల్డ్,
(మూలం: Katherine Mansfield –
 “The life of Ma Parker.”)
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment