Tuesday, April 30, 2019

కోహినూర్‌


కోహినూర్‌




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి......................

బ్రిటిష్‌ రాజ మాత (రాణీ మాత అనాలా?) పరమపదించిన సందర్భంలో టీవీ వార్తలు బ్రిటిష్‌ సామ్రాజ్య వైభవాన్ని మరొక్కసారి కొనియాడుతున్నాయి. తెర మీద ధగ ధగా ప్రకాశిస్తున్న వజ్ర వైడూర్యాలు కనిపిస్తున్నాయి. అన్నిటిలోకీ ప్రశస్తమైన కోహినూర్‌ వజ్రపు అందాన్నీ, అపురూపాన్నీ వర్ణిస్తున్నాడు వార్తాహరుడు.

“అబ్బ! ఎంత బాగుందో కదా?” అన్నది మీనాక్షి తెర వంకే కళ్ళార్పకుండా చూస్తూ.

“నిజమేనండీ,” అంటూ ఏకీభవించింది పద్మ. “మేము లండన్‌ వెళ్ళినప్పుడు దాన్ని చూశాం అబ్బ! ప్రత్యక్షంగా చూస్తే అది ఇంకా ఎంత మిరుమిట్లు గొలుపుతూంటుందో!”

“ఏమిటీ, మీరు దాన్ని చూశారా?”

“ఆఁ, అవునండీ. టవర్‌ అఫ్‌ లండన్‌ లో దాన్ని ప్రదర్శనలో పెడతారుగదా? అక్కడ చూశాం.”

“ఇంకా ఏమేం చూశారు?” అడిగింది మీనాక్షి కుతూహలంగా.

“ఓ, చాలా చూశామండి. ఇదిగో మన నెమలి సింహాసనం పీకాక్‌ త్రోన్‌ అంటారే అది చూశాం.”

“అదెక్కడా?”

“బ్రిటిష్‌ మ్యూజియంలో ఉంది. ఆ బ్రిటిష్‌ మ్యూజియంలో ఇంకా ఎన్నెన్నున్నాయో! అబ్బో! మన దేశం నుంచి తెచ్చినవే రకరకాల వస్తువులున్నాయ్‌”

“ఆఁ! అన్నీ మన దేశం నుంచి కొల్లగొట్టి తెచ్చినవే కదా!” అన్నాడు మీనాక్షి భర్త ప్రకాశం ఇంక ఊరుకోలేక.

మిగతా వాళ్ళు ఒకరిమొహాలొకరు చూసుకున్నారు. చివరికి మీనాక్షి నచ్చచెప్పే ధోరణిలో నెమ్మదిగా అంది, “కొల్లగొట్టడమంటే మరప్పుడు వాళ్ళదే కదా అధికారం? అందుకని తెచ్చారు. మన దేశం ఒక్క చోటనుంచే కాదు కదా?”

పద్మ వెంటనే అందుకుంది, “అవును, అనేకమైన దేశాల నుంచి ఎన్నెన్నో వస్తువులు తెచ్చిపెట్టారక్కడ.”

“అవును. అంటే అన్ని దేశాలనుంచీ దొంగిలించి తెచ్చారన్నమాట,” అన్నాడు ప్రకాశం.

నరేంద్ర పద్మ భర్త కొంచెం ఇబ్బందిగా కదిలాడు. “పోనీలెండి. ఇప్పుడేం చేస్తాం? చరిత్ర మార్చలేం కదా? గత జల సేతు బంధనం ఎందుకు?”

“గతాన్ని గురించి కాదు నేను మాట్లాడేది,” ప్రకాశం కొంచెం ముందుకి వంగి గట్టిగా అన్నాడు. “ప్రస్తుతం మాటే. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళైనా మన సొత్తు మనకి తిరిగి ఇవ్వమని మనం ఎందుకు అడగటంలేదు? నిజానికి అవ్వన్నీ మన దేశంలో ఉండాల్సినవి.”

నరేంద్ర నవ్వాడు. “చూడండి. ఆ బ్రిటిష్‌ మ్యుజియంలో ఎల్జిన్‌ మార్బుల్స్‌ అని ఉన్నాయి. అవి ఎక్కడనుంచి తెచ్చినవో తెలుసా? ఏథెన్‌స్‌ నగరంలో పార్థెనాన్‌ భవనం గురించి మీరు వినే ఉంటారు గదా?”

“అవునవును. పాలరాతితో కట్టిన పెద్ద ఆలయం లాంటిది కదా?” అనడిగింది మీనాక్షి ఉత్సాహంగా.

“అవును. ఆ భవనంలోని విగ్రహాలనీ, చెక్కడాలనీ లార్డ్‌ ఎల్జిన్‌ అనే అతను రెండు వందల ఏళ్ళ కిందటే తీసుకువచ్చాడు. ఎందుకో తెలుసా? వాటిని గ్రీసు దేశంలోనే ఉంచితే అక్కడి వాళ్ళు వాటిని సరిగ్గా కాపాడకపోవడమేగాక వాటిని పాడుచేస్తారని చెప్పి వాటిని బ్రిటన్‌కి తీసుకు వచ్చేశాడు. వాటిని తిరిగి ఇవ్వమని గ్రీకు ప్రభుత్వం చాలా సంవత్సరాలనుంచీ అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటూనే ఉంది. కానీ ఏం లాభం? ఇంకా అవి బ్రిటిష్‌ మ్యూజియంలోనే ఉన్నాయి. ఏది? కాబట్టి మన వస్తువులు తిరిగి వచ్చేందుకు యాభై ఏళ్ళు చాలవు, ఇంకా చాలా రోజులు పడుతుందని నా ఉద్దేశం,” అని నవ్వేశాడు నరేంద్ర.

“అంతవరకూ మనం చేతులు ముడుచుకు కూర్చోవాలనా మీ ఉద్దేశం?” తీవ్రంగా అడిగాడు ప్రకాశం.

“లేకపొతే? ఇప్పుడు వాటికోసం యుధ్ధం చేయమంటారా?” నరేంద్ర కాస్సేపు ఆగి అన్నాడు, “అదృష్టవశాత్తూ, ఎంత కొల్లగొట్టినా మన దేశంలో ఇంకా వెలలేని కళా సంపద మిగిలుంది.”

పద్మ మళ్ళీ అందుకుంది ఉత్సాహంగా. “నిజమేనండీ. ఇక్కడి మ్యూజియంలోనే మనం దేవుడి విగ్రహాలవీ చూశాం కదా? ఎప్పటివో? బీసీ నాటివా? ఆ తర్వాతవా?”

“అవును. అవక్కడకెలా వచ్చాయో తెలుసా?” వెటకారంగా అడిగాడు ప్రకాశం.

“కనీసం అవి మాత్రం దొంగిలించి తేలేదు కదా?” అన్నది పద్మ నవ్వుతూ.

“ఏం? ఎందుకలా అనుకుంటున్నారు?”

ప్రకాశం రెట్టింపుతో కొంచెం తబ్బిబ్బయ్యింది పద్మ. “అంటే మ్యూజియం వాళ్ళు కదా. వాళ్ళు అమెరికన్‌లు ఎప్పుడూ మన మీద అధికారం చెలాయించలేదు కదా అని.”

కొంచెం హేళనా, చాలా విచారమూ మిళితమైన నవ్వు నవ్వాడు ప్రకాశం. “అక్కడే మీరు పొరపడుతున్నది.”

“ఏమిటండీ మీరు మరీను. ఈ మ్యూజియం వాళ్ళందరూ వెళ్ళి మన పురాతన వస్తువులన్నీ దొంగిలిస్తున్నారంటారా?” నరేంద్ర కొంచెం విసుగ్గా అడిగాడు.

“వాళ్ళు స్వయంగా దొంగిలించక్కరలేదు. ఆ పని చేసేందుకు మన దేశం వాళ్ళే చాలామంది సిధ్ధంగా ఉన్నారు కదా. అయినా దొంగిలించిన వస్తువులని తెలిసీ కొనడం మాత్రం దొంగతనంతో సమానం కాదంటారా? ఇక్కడి మ్యూజియంలో ఆ బాపతు శిల్పాలు చాలానే ఉన్నాయి.”

అందరూ ఏం మాట్లాడాలో తెలియక కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. “ఒక విధంగా అదీ మన గొప్పే కదా,” అన్నది చివరికి పద్మ .

“మన గొప్పా? ఎలాగ?” ప్రకాశం ఇదివరకటి వెటకార ధ్వనితోనే అడిగాడు.

“అంటే మన శిల్ప కళ అంత గొప్పది కాబట్టే వేరే దేశాల వాళ్ళుకూడా వచ్చి అంత శ్రమ పడి మన శిల్పాలను తీసుకువెళ్తున్నారు కదా. అది మన గొప్పే కదా?” అన్నది పద్మ.

“నిజమేనండోయ్‌” అందుకున్నాడు నరేంద్ర. “అలాగే చూడండి, మన గొప్ప గొప్ప సంస్కృత గ్రంధాలెన్నో జర్మనీలో ఉన్నాయట వాళ్ళు పరిశోధనలు చేసేందుకు.”

“అలాగే ఈ మధ్య ఇటలీలో ఒక ఆయుర్వేదం యూనివర్సిటీ కూడా ప్రారంభించారని విన్నాను నేను,” అన్నది పద్మ. కానీ ప్రకాశం ఏమీ ఉత్సాహం కనపర్చలేదు.

“ఏమిటండీ, మీకు సంతోషంగా లేదా?” నరేంద్ర అడిగాడు.

“నాకు సంతోషంగా ఎలా ఉంటుందండీ? మన దేశంలో ఉండాల్సిన ప్రాచీన గ్రంధాలు జర్మనీలో ఉన్నాయనీ, మన దేశంలో ఉండాల్సిన రత్న మాణిక్యాలు ఇంగ్లండులో ఉన్నాయనీ, మన దేశంలో ఉండాల్సిన కళా సంపద అమెరికాలోకి రవాణా అయిపోయిందనీ ఇదంతా చూసి నేను సంతోషించాలా? మన గొప్ప బయటవాళ్ళు గుర్తిస్తే తప్ప మనకు తెలియనంత కాలం మన సంపదలన్నీ ఇలా కొట్టుకుపోవల్సిందే,” నిట్టూర్చాడు ప్రకాశం.

మిగతా వాళ్ళు మౌనం వహించారు. వాతావరణం కాస్త ఉల్లాసపరిచే ఉద్దేశంతో మీనాక్షి అన్నది, “అందుకేనండీ, మా పిల్లలకు మాత్రం మన సంస్కృతి గురించి అంతా నేర్పించాలనుకునేది. లేకపోతే, ఇలా బయట దేశంలో ఉండిపోతే వాళ్ళకు మన చరిత్రను గురించీ, మన గొప్పదనాన్ని గురించీ ఏం తెలుస్తుంది? అందుకే ఈ వేసవి శలవుల్లో మేం వెళ్ళినప్పుడు కాస్త నాలుగు చోట్లా తిరగాలని ఉంది.”

“నాలుగు చోట్లంటే ఆంధ్ర ప్రదేశ్‌ లోనా?” కుతూహలంగా అడిగింది పద్మ.

“ఊఁహుఁ. మొత్తం దేశమంతా ఎన్ని చోట్లు వీలైతే అన్ని.”

“వేసవి కాలంలో ప్రయాణాలా? అబ్బ! మీ ఓపికని మెచ్చుకోవాల్సిందే!” ఆ మాటలు వినేందుకే నీరసంవచ్చినట్టు కుర్చీలో వెనక్కి వాలాడు నరేంద్ర.

నిండుగా నవ్వాడు ప్రకాశం. “శ్రమ లేకుండా ప్రతిఫలం ఎలా వస్తుందండీ? ఎన్ని పుస్తకాలు చదివినా, సినిమాలు చూసినా, స్వయంగా చూసిన అనుభూతి వేరు. అక్కడ పెరిగామనే తప్ప మనం మాత్రం దేశంలో ఏం చూశాం? ఆ అద్భుతాలన్నీ ప్రత్యక్షంగా అనుభవిస్తే మనమేమిటో, మన విలువేమిటో తెలుస్తుంది,” మెరిసే కళ్ళతో మరో లోకంలోకి చూస్తున్నట్టున్నాడు ప్రకాశం.

“అబ్బ! వింటుంటేనే నాకు అసూయగా ఉంది. మీరు తిరిగిరాగానే అన్ని విశేషాలూ మాకు చెప్పాలి తెలిసిందా?” ఆత్రంగా అడిగింది పద్మ.

“తప్పకుండా,” అంటూ నమ్మ బలికారు మీనాక్షీ, ప్రకాశం ఇద్దరూ.
***

తమ దేశాటనమును తాజ్‌ మహల్‌ తో ప్రారంభించాలనే ఉద్దేశంతో ముందుగా ఢిల్లీలో దిగారు ప్రకాశం, కుటుంబం. ఎంత ప్రయాణ బడలికతో ఉన్నా, వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలని చూడాలనే ఉత్సాహంతో, ఢిల్లీలో ఉన్న కాస్త వ్యవధిలోనే జంతర్‌ మంతర్‌ కి బయల్దేరారు. తీరా అక్కడకి చేరాక ఏం చేయాలో బోధపడలేదు. తాము తప్ప అక్కడ వేరే యాత్రీకులెవరూ ఉన్నట్టు లేరు. యాత్రీకులు సరే, వేరే మనుషులు కూడా కనిపించలేదు. ఓ పక్కగా రకరకాల గుడిసెలూ, పాకలూ, చెట్లకి కట్టిన తాళ్ళూ, వాటి మీద ఆరేసిన బట్టలూ, అక్కడే గడ్డి మేస్తున్న పశువులూ, ఆ పరిసరాలన్నిటినీ పర్యవేక్షిస్తున్నట్టు ఠీవిగా నుంచున్న ఒక ఎద్దూ ఇవి తప్ప మనుషులెవ్వరూ కనిపించలేదు. ఇక్కడ టూరిస్టు గైడ్‌ లాంటి వారెవరైనా దొరుకుతారా అని ప్రకాశం వెతుకుతున్న సమయంలో ఒకతను ఆపద్భాందవుడులా వచ్చి తాను గైడునని చెప్పుకున్నాడు.

అతను హిందీలో చెప్తున్న వివరాలను తనకే సరిగ్గా బోధపడకపోయినా, పిల్లలకోసమని వీలైనంతవరకూ ఇంగ్లీషులోకి తర్జుమా చేసేందుకు ప్రయత్నించాడు ప్రకాశం. పిల్ల్లల కళ్ళు మాత్రం ఆ ఎద్దు మీదే ఉన్నాయి. అది ఎటువైపు చూస్తోందో, ఎటువైపు తిరుగుతోందో, తమ వద్దకు వస్తోందో లేదో అనే మీమాంసలో పడి వాళ్ళు తండ్రి చెప్తున్న విషయాలను అంతగా పట్టించుకున్నట్టు అనిపించలేదు. మీనాక్షి వాళ్ళకు ఎద్దు నుంచి ప్రమాదమేమీ లేదనీ, భయపడక్కరలేదనీ నచ్చచెప్పబోయింది కానీ, పిల్లలకు మాత్రం ధైర్యం చిక్కలేదు. ఇంతలో ఆ ఎద్దు ఈ సంబరంలో తానూ పాల్గొని అందరినీ పరామర్శించాలన్నట్టు వారివైపే విలాసంగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. వాళ్ళ భయాలన్నీ నిజంకావడం చూసిన పిల్లలు వాళ్ళున్న మెట్ల మీదనుంచి కిందకి దౌడు తీశారు. మీనాక్షికీ ప్రకాశానికీ వాళ్ళ వెంటే వెళ్ళక తప్పలేదు. అడుగులోనే హంసపాదన్నట్టు మొదటి ప్రయత్నమే ఇలా విఫలమవడంతో ప్రకాశం కొంచెం బాధ పడ్డాడు. “ఇదే యు. ఎస్‌ లో అయితే ప్రతి అల్లాటప్పా చోటా హిస్టారికల్‌ పాయింట్‌ అంటూ ఒక బోర్డు పెట్టి దాని ప్రత్యేకతలూ, ప్రాముఖ్యతలూ, దానికి సంబంధించిన వివరాలన్నీ రాసి పెడతారు గదా, ఇక్కడ అలాంటివేవీ ఎందుకు లేవు?” అని విసుక్కున్నాడు. దానికి సరైన సమాధానమేదీ తోచక మీనాక్షి “ఏమో?” అని ఊరుకున్నది. మర్నాడే తాము తాజ్‌ మహల్ని చూడబోతున్నామని గుర్తుకు వచ్చి ప్రస్తుతం కలిగిన ఆశాభంగానికి ఉపశమనం పొందాడు ప్రకాశం.

మర్నాడు ఆగ్రాలో హోటలునుంచి టాక్సీలో తాజ్‌ మహల్‌ చూడ్డానికి బయల్దేరారు. ఇంకా తాజ్‌ మహల్‌ చేరుకోక ముందరే అన్ని వాహనాలనీ నిలిపివేసి అందర్నీ దిగమని హెచ్చరించారు. “అదేమిటి? ఎందుకిలా?” అంటూ అయోమయంగానే టాక్సీ దిగారందరూ. అక్కడ వాతావరణ కాలుష్యం మూలాన తాజ్‌ మహల్‌ పాడవకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశారని గైడ్‌ వివరించడంతో మెచ్చుకోలుగా చూసింది మీనాక్షి, “చూశారా, మన వాళ్ళు కూడా మన సంపదను ఎలా భద్రపరుస్తున్నారో?” అన్నట్టు ప్రకాశం వైపు చూస్తూ.

“హుఁ. తాజ్‌ మహల్ని పాడు చేసేది మథురలో ఉన్న రిఫైనరీ తాలూకు పొగ అనుకున్నాను?” అన్నాడు ప్రకాశం. “అన్నీ పాడు చేస్తాయి,” అని సర్దేసింది మీనాక్షి. టాక్సీనుంచి నాలుగు అడుగులు వేయగానే, వాళ్ళ గైడొక వాన్‌ ముందు వాళ్ళని ఆపి అందులో కూర్చోమన్నాడు.

ప్రకాశానికి మతి పోయినట్టయింది. “ఇదేమిటీ?” అన్నాడు. “ఈ వాన్‌ లో ఎక్కి మనం తాజ్‌ మహల్‌ కి వెళ్తున్నాం,” అని చెప్పాడు గైడ్‌ “మరి వాతావరణ కాలుష్యమనీ, కార్ల లోంచి వచ్చే పొగ మూలాన తాజ్‌ మహల్‌ పాడవుతుందనీ కార్లాపేస్తే మళ్ళీ ఈ వానెందుకు?” అనడిగాడు ప్రకాశం.

అలవాటైన ప్రశ్న కాదనేమో గైడు ఏమీ జవాబుచెప్పకుండా, “త్వరగా ఎక్కండి,” అని తొందర పెట్టాడు. ఎక్కువైన అయోమయంతో వాన్‌ లోకి ఎక్కారు అందరూ. వాన్‌ లో వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. వాన్‌ లో కొన్ని గజాలు ప్రయాణం చేశాక, తాజ్‌ మహల్‌ ద్వారానికి ఒక వంద అడుగుల దూరంలో అది ఆగింది. మళ్ళీ అందరూ దిగి కాలినడకన మిగిలిన మేర దాటేందుకు బయల్దేరారు, దోవలోనున్న పెంటల్నీ, రొచ్చుల్నీ సాధ్యమైనంతవరకూ తప్పించుకుంటూ. దేశంలో మిగతా ప్రాంతాలలో ఎక్కువవుతున్న శుభ్రతని చూసి సంతోషించిన ప్రకాశానికి అక్కడి భీభత్సాన్ని చూస్తే హఠాత్తుగా ఒక ముఫ్ఫై ఏళ్ళు వెనక్కు వెళ్ళినట్టు తోచింది. “అందర్నీ ఎలాగూ నడిపిస్తున్నప్పుడు ఆ దోవ కాస్త శుభ్రంగా ఉంచ కూడదూ? అందులో ఇలాంటి ముఖ్యమైన యాత్రా స్థలానికి,” అని తనలో తానే గొణుక్కున్నాడు ప్రకాశం.

తీరా తాజ్‌ మహల్‌ చేరుకున్నాక ప్రకాశం అనుకున్నట్టు ముఖ ద్వారం లోనుంచి కాకుండా ఓ సందు లాంటి దాని గుండా పక్క ద్వారంలోనుంచి లోపలకి పంపించారు. లోపల అడుగడుగునా ఉన్న పోలీసు సిబ్బందిని చూసి కాస్త విస్తు పోయినా, ఆ ఏర్పాట్లు టెర్రరిస్టులనుంచి రక్షణ కోసమని గైడ్‌ చెప్పడంతో ప్రకాశం సమాధానం పడ్డాడు. ఆ రోజు ఆదివారం కావడంతో జనం చాలా మందే ఉన్నారు. హనుమంతుడి తోకలా పెరిగి పోతున్న క్యూని చూసి లోపలకి వెళ్ళేందుకు ఎంత సేపు పడుతుందోనని లెక్కలు కట్టడం మొదలు పెట్టాడు ప్రకాశం. నత్త నడకలా ముందుకు కదుల్తున్న ఆ క్యూలో పదేసి అడుగులకొక బందోబస్తు సిబ్బంది మనిషి వచ్చి “లైన్‌ లో నుంచోండి,” అని అదిలిస్తున్నాడు. ఇంకొక మనిషి వచ్చి ప్రకాశం చేతిలోని కామెరా లాక్కోబోయాడు. “దీంతో ఫోటోలు తీయకూడదు,” అన్నాడు.

“మరి వాళ్ళందరూ తీస్తున్నారు కదా,” అన్నాడు ప్రకాశం.

“అవి విడియో కామెరాలు,” అన్నాడు సిబ్బంది మనిషి.

“విడియో కామెరాలు అనుమతిస్తే స్టిల్‌ కామెరాకు ఏమిటి అభ్యంతరం?” అనడిగాడు ప్రకాశం.

“అట్టే వాగకు. రూల్సు రూల్సే. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ కామెరా మేం లాక్కోవాల్సి వస్తుంది,” అని బెదరించాడతను. “పోనీలెండి, ఎందుకొచ్చిన గొడవ,” అని మీనాక్షి వెనక నుంచి గొణగడంతో ప్రకాశం తగ్గాల్సొచ్చింది.

తాజ్‌ మహల్‌ దాకా వచ్చి ఫొటోలు తీయకపోవడం ప్రకాశం మనసునెంతో బాధించింది. చిట్టచివరికి అదిలింపులతో, బెదరింపులతో మొత్తానికి అసలు భవనాన్ని చేరారు ప్రకాశం కుటుంబం. గైడు తన ఉపన్యాసం మొదలు పెట్టాడు. ఆ భవనం కట్టడానికి ఎన్ని టన్నుల పాలరాయి వాడారో, ఎంత మంది శిల్పులూ, ఎంత మంది పనివాళ్ళూ శ్రమించారో, ఎన్ని రకాల మణి మాణిక్యాలు తెప్పించారో వగైరాలన్నీ చెప్తూ లోపలికి నడిపించాడు. గోడలో పొదిగిన రత్నాల అందాన్ని పొగుడుతూ, బాగా చూడండి అని తన చేతిలో ఉన్న టార్చి లైటుని గోడమీద రత్నానికి అదిమి పెట్టి స్విచ్చి వేశాడు. అదిరిపడ్డాడు ప్రకాశం. “అదేమిటి? ఫ్లాష్‌ ఫొటోలు తీయకూడదని చెప్పి మరిప్పుడు దాని మీద లైటు పెడితే అవి పాడైపోవూ? ఫర్వాలేదు, మాకు బాగానే కనిపిస్తున్నాయి. ఆ టార్చ్‌ లైటు తీసేయి,” అన్నాడు. గైడు పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ వేరే వేరే రత్నాల మీద అలా టార్చ్‌ లైటు నొక్కిపెట్టి తన ధోరణి కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రకాశానికి కోపం తన్నుకొచ్చింది. “అరే! నీక్కాదూ చెప్పేదీ? ఆ లైటు తీసేసెయ్‌ అవి పాడౌతున్నాయి,” అన్నాడు.

“ఏం ఫర్వాలేదండీ,” అని అతను మళ్ళీ నొక్కిపెట్టాడు.

“వెంటనే నువ్వు ఆపుతావా లేదా?” ఇంచుమించు అరిచినంత పని చేశాడు ప్రకాశం.

ముఖం గంటు పెట్టుకుని గైడు టార్చ్‌ లైటు ఆర్పేశాడు. అక్కడున్న మిగతా కాలమంతా ఉదాసీనంగా పొడిపొడిగా రెండు మాటలు చెప్పి ఊరుకున్నాడు. మొత్తానికి తాజ్‌ మహల్‌ ఘట్టం కూడా అసంతృప్తికరంగానే ముగిసింది. తరువాత కార్యక్రమం హైదరాబాద్‌ వెళ్ళి కొన్నాళ్ళు బంధువులతో గడపడం. కనీసం అక్కడ ఆశాభంగానికి ఆస్కారం లేదని ఊరట చెందాడు ప్రకాశం. ఏర్‌ పోర్టులో అన్నగారి కుటుంబాన్ని చూసిన సంతోషం, వాళ్ళు కనపరుస్తున్న ఉత్సాహం, ఆప్యాయత, మైమరపింపజేశాయి. కుదుటపడ్డ మనసుతో ఉల్లాసంగా ఇంటికి బయల్దేరాడు.

కారు గేటులోపలికి రాగానే ఏదో తేడా గమనించాడు ప్రకాశం. “ఏమిటీ ఏదో కొత్త భాగం కట్టినట్టున్నారే?” అనడిగాడు పరీక్షగా చూస్తూ.

“ఆఁ. అదంతా ఉందిలే. తర్వాత చెప్తాను,” అంటూ ఇంటి పక్కకి దారి తీశాడు ప్రకాశం అన్నయ్య.

“అటెక్కడకీ?” విస్తుపోయాడు ప్రకాశం, తన ముందున్న తలుపుల వేపు అయోమయంగా చూస్తూ.

“ఇప్పుడు గుమ్మాన్ని ఇటు పక్కకి మార్పించాంలే, వాస్తు దోషం పోవడానికి,” అన్నాడు వాళ్ళన్నయ్య.

పక్క తలుపులోంచి వెళ్తూంటే మళ్ళీ తాజ్‌ మహల్‌ లో ఉన్నట్టు భ్రమ కలిగింది ప్రకాశానికి. కానీ ఆ భావాన్ని వెంటనే అణిచేసుకుని అన్నని అనుసరించాడు.

లోపలికి వెళ్ళగానే ఇంకా కొన్ని అవకతవకలు కనిపించాయి. ఇదివరకు మేడ మీదకు వెళ్ళే మెట్లు ఇప్పుడు దేనికీ సంబంధించక గాలిలో వేళ్ళాడుతున్నట్టున్నాయి. ఇదివరకటి వీధి గుమ్మానికి అడ్డంగా కొత్త మెట్లు సాక్షాత్కరించాయి. మొట్ట మొదట ఇల్లు కట్టినప్పుడు అక్కడ మెట్లు పెట్టాలనుకోకపోవడాన, ఓ వారగా, పొందిగ్గా అమరినట్టు కాక, కొట్టొచ్చినట్టూ, దోవకడ్డంగా ఉన్నట్టూ అగుపించాయి. విశాలమైన దొడ్లోంచి వచ్చే వెలుతురుతో కళకళలాడే భోజనాల గది ఇప్పుడు దొడ్లో అర్థాంతరంగా లేచిన ఎ్తౖతెన గోడ మూలాన మసక చీకట్లో బితుకు బితుకు మంటోంది. విశాలంగా, ధారాళ మైన గాలీ, వెలుతుర్లతో ప్రకాశిస్తూ, సర్వాంగ సుందరంగా అలంకరించుకున్నట్టుండే ఇల్లు ఇప్పుడు బోసిగా, వెలవెలబోతూ, చీకటి గుయ్యారంలా కనిపించింది.

మాటలు రాక నోరు వెళ్ళబెట్టుకుని చుట్టూరా చూశాడు ప్రకాశం. చివరికి ఎలాగో నాలిక స్వాధీనం చేసుకుని, “ఏమిటిదంతా?” అనడిగాడు.

“చెప్పాను కదా. వాస్తు సరిగ్గా లేకపోతే ఎన్ని అనర్ధాలు జరగొచ్చో తెలుసా?”

“ఇప్పుడు ఏమి అనర్ధాలు జరిగాయి నీకు?”

“ఏవో చిన్న చిన్న అవాంతరాలు. ఇంకా పెద్దదేదో జరిగేంతవరకూ ఎందుకుకాచుక్కూర్చోవడం?”

“అయినా నీకసలు ఇలాంటి నమ్మకాలెప్పుడూ లేవు కదా? ఇప్పుడెందుకు మొదలయ్యింది?”

“తెలియక చాలా తప్పులు చేస్తాం. అయినా మన పూర్వీకులు ఎంతో జ్ఞానం సంపాదించి ఇలాంటి నియమాలన్నీ పెట్టారు. మనకా జ్ఞానం లేకపోగా అంతా మాకే తెలుసుననే గర్వం. అందుకే ఇలా అఘోరిస్తున్నాం. అయితే నెమ్మదిగా మన పొరపాట్లు తెలుసుకుని మన అలవాట్లు మార్చుకుంటున్నాం. ఇప్పుడెవరూ వాస్తు చూసుకోకుండా ఇల్లు కట్టడం లేదు తెలుసా? అదృష్టవశాత్తూ ఇదివరకే కట్టిన ఇళ్ళను పడగొట్టి మళ్ళీ కట్టించి దోషాలని దిద్దవచ్చని చెప్పాడాయన.”

“ఆయనెవెరూ?”

“అదే, వాస్తు పండితుడు. రేపు పెళ్ళిలో చూస్తావుగా.”

మర్నాడు పొద్దున్నే మేల్కొన్న మీనాక్షికి చక్కని మంగళవాద్యం వినిపించింది. ఆహ్లాదకరమైన ఆ సంగీతాన్ని తానొక్కత్తే విని ఆనందించడం ఇష్టం లేక ప్రకాశాన్ని లేపింది. కానీ అతను లేచివచ్చేలోగా సంగీతం కాస్తా ఆగిపోయింది. “అయ్యో!” అని ఉసూరుమంటున్న మీనాక్షిని, “ఇంతకీ ఏమిటా పాట?” అని కుతూహలంగా అడిగాడు ప్రకాశం.

“అదేనండీ. భజన పాట. మనం చాలా సార్లు విన్నాం.” అప్రయత్నంగా కూనిరాగాలు తీయడం మొదలు పెట్టింది మీనాక్షి. “ఓం, జయ జగదీశ హరే, స్వామి లా ల ల లాల ల లా. భక్త జనానాం ఊఁ, ఊఁ, తానన నానా, ఊఁ, ఊఁ, జయ జగదీశ హరే.”

“మంచి మేలుకొలుపే. ఎవరు వాయించారో గానీ.” కిటికీ దగ్గరికి వెళ్ళి నలు దిక్కులా గాలించాడు. కను చూపు మేరలో ఎవరూ కనిపించలేదు. “ఇంతలో మేళం వాళ్ళు ఎక్కడకి మాయ మయ్యారంటావు?”

“ఏమో. అసలది మామూలు మేళంలా లేదు కూడా.”

“పోనీలే. ఇవ్వాళ పెళ్ళిలో బోలెడు బాండు మేళాలు వినచ్చు,” అని ఉత్సాహ పరిచాడు ప్రకాశం.

అయితే కళ్యాణ మండపానికి బయల్దేరే ముందరే మళ్ళీ ఆ వాద్యం వినిపించింది. ఆత్రంగా గేటు దగ్గరికి పరిగెత్తిన వాళ్ళిద్దరికీ వీధిలోకి వస్తున్న ఎదురింటివారి కారు తప్ప ఇంకేమీ కనిపించలేదు. పాట మాత్రం ఇంక వినిపిస్తూనే ఉంది. ఇంతలో ప్రకాశం అన్నయ్య వచ్చాడు, “ఏమిటి చూస్తున్నారు?” అంటూ. “ఈ పాట ఎక్కడినుంచి వస్తోందోనని చూస్తున్నాం,” అన్నది మీనాక్షి.

“ఓ అదా? అది వాళ్ళ కారు రివర్స్‌ లో పెట్టినప్పుడు మిగతా వాళ్ళను తప్పుకోమని చెప్పేందుకు వస్తుంది,” అని వివరించాడతను.

“రివర్సుకి ఈ పాట పెడతారా?” ఆశ్చర్యంగా అడిగాడు ప్రకాశం.

“ఊఁ, ఎవరికేం కావాలో అది పెట్టుకోవచ్చు.”

“అంటే ఆయనెవరో చాలా భక్తుడన్నమాట,” మెరిసే కళ్ళతో అన్నది మీనాక్షి.

ఎంత భక్తుడైతే మాత్రం భజనపాటని అలాంటి ప్రయోజనంకోసం వాడుకోవడం ప్రకాశానికి నచ్చలేదు. కాని బయటకేమీ అనకుండా పెళ్ళికి బయల్దేరాడు. దోవలో మరెన్నో కార్లూ, లారీలూ వెనక్కు వెళ్తున్నప్పుడల్లా అదే పాటను వాయించడం గమనించి తెల్లబోయింది మీనాక్షి. ప్రకాశం మౌనంగానే ఉండిపోయాడు.

కానీ పెళ్ళి మంటపంలో వేస్తున్న పాట విని మాత్రం ఊరుకోలేకపోయాడు. “అదేమిటీ, గాయత్రీ మంత్రం వేస్తున్నారు?” అని ఆశ్చర్య పోయింది మీనాక్షి కూడా.

“ఏం?” అర్ధం కానట్టు చూస్తున్న అన్నగారికి విసుగ్గా బోధించాడు ప్రకాశం, “అది చాలా గోప్యంగా ఉంచాల్సిన మంత్రం కదా?” కొట్టిపారేశాడు వాళ్ళన్నయ్య. “ఆఁ, ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? కనీసం ఇలాంటి రికార్డులు మూలానైనా కుర్రకారుకి మన ఆచారాలూ, సాంప్రదాయాలూ తెలుస్తాయి.”

“అది మేమనాల్సిన డైలాగ్‌ కదా?” నవ్వడానికి ప్రయత్నించాడు ప్రకాశం. “ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు మాట్లాడతావేమిటీ?” “అమెరికాలోనైనా, ఇండియాలోనైనా యువతరం అంతా ఒకటే.”

ఇంకేం మాట్లాడాలో తెలియలేదు ప్రకాశానికి. గంట కిందట పుచ్చుకున్న బ్రహ్మచర్యాన్ని అప్పుడే వదులుకోడానికి సిద్ధపడుతున్న పెళ్ళికొడుకును చూస్తే అన్నయ్య చెప్పిన మాట అంత అసందర్భంగా తోచలేదు. మిగతా పెళ్ళంతా ఆ ఆలోచనలతోనే గడిపేశాడు.

రెండు రోజుల తర్వాత పెద్ద తరం వాళ్ళ ఆసక్తి ఏపాటిదో తెలిసొచ్చింది ప్రకాశానికి. ఊళ్ళో జానపద కళా ప్రదర్శన జరుగుతూంటే పిల్లలతో బయల్దేరుతూ అన్ననీ, వదిననీ కూడా రమ్మన్నాడు ప్రకాశం.

“ఆఁ, ఏవో లంబాడీ బట్టలూ, పిచ్చిపూసలూ తప్ప అక్కడేముండవు,” అని చప్పరించేశారు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళ పిల్లలు మాత్రం “స్టార్‌ హోటెల్స్‌ లో మంచి బూటీక్‌ పెడతారు. దానికైతే వస్తాం,” అన్నారు. ఇంక వాళ్ళను బలవంత పెట్టకుండా ప్రకాశం కుటుంబం వెళ్ళొచ్చారు. పిల్లలు బాగా ఆనందించారు. ఇంకో రోజు సాలార్‌ జంగ్‌ మ్యూజియం కి వెళ్దామంటే, “ఆ పాత చెత్తంతా చూడాలంటే తలనొప్పి బాబూ,” అని నిరాకరించారు. తర్వాత అజంతా , ఎల్లోరా వెళ్తూ కూడా రమ్మని ఆహ్వానించినా, ఎండల్లో ప్రయాణం కష్టమని నీరసపడ్డారు. పైగా ప్రకాశం వాళ్ళని కూడా హాయిగా ఇంట్లో కూర్చోక ఈ అనవసరపు తిరుగుళ్ళెందుకని ఒక ఉచిత సలహా కూడా పడేశారు. కానీ ప్రకాశం దాన్ని పట్టించుకోలేదు.

చివరికి తిరిగి యు.ఎస్‌కి వెళ్ళే రోజు వచ్చింది. వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చిన నలుగురు స్నేహితులు అన్నగారితో పిచ్చాపాటీ మాట్లాడుతూంటే వింటూ కూర్చున్నాడు ప్రకాశం. ఒకసారి ఈ ప్రయాణపు అనుభవాలు నెమరు వేసుకుంటే తను సాధించినదేమిటో అర్ధం కావటం లేదు. చూడాలనుకున్నవన్నీ చూశారు. కానీ ఏమిటో అనుకున్న అనుభూతి కరవైంది. ఎన్ని అందాలని చూసినా, ఎన్ని అద్భుతాలని దర్శించినా, ఏమిటో వెలితి గానే ఉన్నది. అదేమిటో, అదెలా తీర్చాలో మాత్రం తెలియటం లేదు.

వచ్చిన వాళ్ళలో ఒకాయన తన గుండె జబ్బు గురించి చెప్తూ, “డాక్టరు ఏదో లోపల బెలూన్‌ పెట్టాలంటున్నాడు. కానీ నాకు సందేహంగానే ఉంది. మాకు తెలిసినతను విశాఖలో ఎవరో యోగాతో గుండె జబ్బులని నయం చేస్తాడని చెప్పాడు. అక్కడకి వెళ్దామనుకుంటున్నాను,” అన్నాడు.

“ముందర్నించీ క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తూంటే అది గుండె జబ్బు నివారించడానికి పనికొస్తుందేమో కానీ, ఒకసారి వచ్చాక దాన్ని కుదుర్చేందుకు ఎలా వీలవుతుంది?” అనడిగాడు ప్రకాశం.

“మీకు యోగాలో నమ్మకం లేనట్టుంది. అది చాలా గొప్ప విద్యండీ.”

“నేను కాదనటంలేదు. కానీ దాని ప్రయోజనం దీర్ఘాభ్యాసంతో కనిపిస్తుంది కానీ, మందులా నాలుగు డోసులు వేసుకుంటే ఏం లాభం లేదంటున్నాను.”

“మీకు తెలియదండీ, మన వాళ్ళు ఎన్నెన్ని మహిమలు సంపాదించారో,” అని అవతలి అతను తీర్మానించడంతో ప్రకాశం నోరు మూసుకున్నాడు. మన పూర్వీకులు ఎంతో జ్ఞానం సంపాదించిన మాట నిజమే. అయితే అదేమిటో మాజిక్‌ లా అనుకుంటున్నారేకానీ, అది శాస్త్రబంధమైన నియమాలతో రూపొందించబడినదని ఎందుకు ఆలోచించరో అతనికి అర్ధం కాలేదు.

ఊరికే గతాన్ని గొప్ప చేసి మాట్లాడితే ఏం లాభం, ఆ గతాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతే?

ఇంతలో సంభాషణ పిల్లల చదువుల మీదకు మళ్ళింది. ఇంజనీరింగూ, కంపూటర్లూ తప్ప ఇంకేమీ చదువులున్నట్టు కనిపించలేదు. ప్రకాశం ఉబుసుపోకకి అడిగాడు, “ఇప్పుడెవరైనా అసలు చరిత్రా, సాహిత్యం లాంటి సబ్త్ల్జెకు చదువుతున్నారా? అని.

“ఎందుకూ? అవేమైనా తిండి పెడతాయా? అయినా వాటిని ఎలాగూ తీసేశారు కదా?”

“అందరికీ బిల్‌ గేట్స్‌ లాగా అయిపోవాలని కోరిక,” అన్నాడు ప్రకాశం అన్నయ్య నవ్వుతూ.

“ఏం? కొంతమందికైనా విశ్వనాథ సత్యనారాయణలానో, మల్లం పల్లి సోమశేఖర శర్మ లానో అవ్వాలని ఉండదా?” రెట్టించాడు ప్రకాశం.

“పిల్లలకున్నా వాళ్ళ తల్లి తండ్రులొప్పుకోవద్దూ ఆ చదువులకి?”

“మీరే చెప్పండి. మీ పిల్లలు తెలుగు సాహిత్యం చదువుతామంటే మీరొప్పుకుంటారా, మెడిసిన్‌ చదవమంటారు గానీ.” ఆ సవాలుతో ప్రకాశం ఆత్మపరీక్ష చేసుకోవాల్సొచ్చింది. అతనికే ఆశ్చర్యం కలిగేటట్టు జవాబు వచ్చింది. “తప్పకుండాను. వాళ్ళకు దేంట్లో ఆసక్తి ఉంటే అదే చదవమంటాను.”

“మరి జీవనోపాధో?”

“దానికేం సమస్య లేదు. మన సాహిత్యం గురించి పరిశోధనలు చేసే వాళ్ళు అక్కడి యూనివర్సిటీలలో చాలా మందే ఉన్నారు.”

“కావచ్చు. మీదంతా కడుపు నిండిన బేరమండీ. కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రం అది కుదరదు..”

ఆ మాటల్లో తన ప్రయాణాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడానికి ఆధారం దొరికినట్టనిపించింది ప్రకాశానికి.

***

తిరిగి ఇల్లు జేరిన ప్రకాశానికీ, మీనాక్షికీ ఘనంగా స్వాగతమిచ్చారు పద్మా నరేంద్రలు వాళ్ళింట్లో పెద్ద పార్టీతో. “మీకొక శుభ వార్త. ఏమిటో చెప్పుకోండి చూద్దాం.”

“ఏమిటో మాకెలా తెలుస్తుంది? మీరే చెప్పాలి,” అన్నది మీనాక్షి నవ్వుతూ.

నరేంద్ర గొంతు సవరించుకున్నాడు. “ఏం లేదండీ. వెళ్ళేముందు ప్రకాశంగారన్న మాటలు మమ్మల్ని చాలా ప్రభావితం చేశాయి. ఇక్కడి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాక మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం. మీరు చెప్పినట్టు మన సంస్కృతి గురించీ, మన చరిత్ర గురించీ, మన విలువను మనకు తెలిపేటట్టుగా ఒక చిన్న స్కూల్‌ లాంటిది నడపాలని నిశ్చయించుకున్నాం. పేరుకి పిల్లలకోసమనైనా, పెద్దలు కూడా అక్కడ నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. మీరు ఊళ్ళో లేనప్పుడు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం. ఒక్క పేరు మాత్రం మీ చేత పెట్టిద్దామని ఆగాం. చెప్పండి, ఏం పేరు పెట్టమంటారు?” అందరూ ప్రకాశం వేపు ఆత్రంగా చూశారు. అందర్నీ కలయజూశాడు ప్రకాశం. తాము వెళ్ళే ముందర జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. తమ ప్రయాణపు అనుభవాలన్నీ గుర్తొచ్చాయి. చివర్లో అన్నగారింటిలో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. “కోహినూర్‌ అని పెట్టండి,” అన్నాడు గంభీరంగా.

“అదేమిటి?” అంటూ ఆశ్చర్యపోయాడు నరేంద్ర.

“అవును. మన దేశంలోని వాళ్ళకు శ్రధ్ధ లేకా, తీరిక లేకా, పోషణ లేకా మరుగున పడిపోతున్నవన్నీ మనం ఇక్కడ భద్రపరిచి ముందుతరాల వారికి పొందుపరుద్దాం. తర్వాత ఎప్పుడైనా అక్కడి వాళ్ళకు వాటి మీద కోరిక కలిగితే, ఇక్కడకి వచ్చి వాటి గురించి నేర్చుకోవచ్చు,” అన్న ప్రకాశం వేపు ఆశ్చర్యంగా చూశాడు నరేంద్ర. చిరునవ్వు నవ్వాడు ప్రకాశం.
--------------------------------------------------------
రచన: మాచిరాజు సావిత్రి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment