దిల్లీ నుంచి హరిద్వార్ వరకు…
సాహితీమిత్రులారా!
ఈ కథను ఆస్వాదించండి...................
డిసెంబరు నెల ఆఖరి రోజులు. దిల్లీ చలి గట్టిగానే ఉంది. స్వెట్టర్లు వగైరాలన్నీ మంచి వాడకంలో ఉన్నాయి. తెల్లవారితే హరిద్వార్, రిషికేశ్ ప్రయాణం పెట్టుకున్నాను. స్కూలు సెలవులు. ఇంట్లో చేసేదేమీ లేదు, నాలుగు నెలలుగా ఎందుకో హరిద్వార్ వైపు మళ్లింది మనసు. మధ్య మధ్య సెలవులు రాకపోలేదు. మురళికి తీరిక లేని ఉద్యోగం. ఆదివారం ఒక్కరోజు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వద్దాం అంటే వినడు. బాస్‌కి ఇష్టం ఉండదు, సిటీ దాటి వెళితే… అంటాడు. పనిని పూజించటం నాకూ ఇష్టమే. కానీ జీవితమంటే జీవికకోసం చేసే పనొక్కటేనా?
విసుగొచ్చి రమ్మని అడగటం మానేసేను. హాయిగా టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో నా ఒక్కదానికి టికెట్ బుక్ చేసుకున్నాను. ఎవరైనా తోడొస్తే వెళ్ళాలని అనుకోలేదు. వస్తే మురళీ, నేను. లేదా ఇలాటి ప్రయాణం నాకు కొత్త కాదు.
ముందురాత్రి ఆఫీసు నుండి వస్తూనే అయిష్టాన్ని మళ్లీ ప్రకటించాడు.
“నిమ్మీ, నువ్వు అంత అర్జెంటుగా ఒక్కదానివీ ఇప్పుడు హరిద్వార్ వెళ్లాలా?” రొట్టెలు చేస్తున్న నా వెనకాల వచ్చి సీరియస్‌గా అడిగాడు. ‘వెళ్ళాలనే కదూ… అతని అభ్యంతరం ఏమిటో!’
“నాకు కొంచెం పనితీరుబడి అయినపుడు వెళ్దాం అన్నాను కదా. ఒక్కదానివీ, ఆ ట్రావెల్స్‌లో వెళ్లాలా? రోజంతా అపరిచితుల మధ్య నీ యాత్రని ఏం ఎంజాయ్ చెయ్యగలవు?” అసహనంగా అడిగాడు.
“అదేమిటి, అపరిచితులేమిటి? ఒక్క పలకరింపుతో స్నేహితులు కారా?”
“అహా, నీకు స్నేహితులు కాని వాళ్లు ఎవరు? పోనీ ఆ స్నేహితులు ఎవరైనా నీతో వస్తున్నారా… లేదు.”
“ఎవరి పనులు వారికున్నాయి. ఇన్నేళ్లుగా నీతో ఉన్నా, నువ్వో అపరిచితుడిగానే కనిపిస్తున్నావు ఆమాటకొస్తే.”
“ఔను మరి, నువ్వు మరో ప్రపంచంలో బ్రతుకుతుంటావు. జీవితాన్ని అనుభవించక ఎందుకివన్నీ నీకు. ఈ యాత్రలేమిటి ఈ వయసులో. హాయిగా ఏదైనా పార్టీకి రమ్మంటే విసుక్కుంటావు. ఉట్టినే చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలేశావు. ఎంతసేపూ మీ శక్తి ఫౌండేషన్ వాళ్లు నడిపే ఆడపిల్లల బడి, వాళ్ల చదువు, కాశీ, హరిద్వార్ యాత్రలు, ఈ నేత చీరలూ, ఆధ్యాత్మికానందాలూ…”
నా ఆలోచనల పట్ల, పనుల పట్ల లేశమంతైనా అతనికి అవగాహన లేదన్న విషయం మరొకసారి స్పష్టం అయింది. ప్రకృతిలోకి వెళ్లొద్దామంటే అర్థం కాదు, పిల్లల మధ్య మసులుతూ వాళ్లని చదివించటంలో ఉన్న ఆనందం అర్థం కాదు. నిట్టుర్చాను. వంట ముగించి పళ్లేలు డైనింగ్ టేబిల్ మీద సర్దమని అప్పగించాను. టి.వి.లో న్యూస్ చూస్తూ తినటం ప్రారంభించాడు.
భోజనం ముగిస్తూ మురళి మళ్లీ చెప్పాడు, “నిమ్మీ, మరో దశాబ్దమో, పుష్కరకాలమో మనం ఈ ప్రపంచంలో, ప్రపంచంతో పాటే హాయిగా రంగురంగుల జీవితాన్ని గడిపెయ్యచ్చు. ఆ తర్వాత మనం చేసేందుకేమీ ఉండదు, ఎలాటి ఛాలెంజిలకీ ఎదురెళ్లక్కర్లేదు. నువ్వు కోరుతున్న జీవితం అప్పుడు తీరిగ్గా మొదలెట్టచ్చు. దానికెలాటి డెడ్ లైన్లూ, ఒత్తిళ్లూ ఉండవు. ఇప్పుడు నా ఉద్యోగ బాధ్యతలు నన్ను మరో ఆలోచన చెయ్యనివ్వవు. జీవితాన్ని మరి కొన్నేళ్లు సవాళ్లమధ్య నడిపించాలని ఉంది. దానిలో నాకు బోలెడు ఆనందం, తృప్తి కనిపిస్తున్నాయి. మెట్టు తర్వాత మెట్టు ఎక్కుతూంటే వచ్చే ఆ నషా నాకు మరింత ఆత్మవిశ్వాసం అందిస్తోంది. అర్థం చేసుకో. నువ్వు నాకిష్టమైన జీవితమేంటో ఒక్కసారి కళ్లు తెరిచి చూడు. తర్వాత నేను నీ దారిలోకొస్తాను, కనీసం ప్రయత్నిస్తాను.”
“మరళీ, నువ్వన్నట్టు మరో పది, పన్నెండేళ్లు పోయాక మన ఓపికలు, ఉత్సాహం తగ్గాక కొత్తగా మొదలెట్టే మరొక జీవితముండదు. మనిద్దరం కోరుకునే జీవితాలు, మనకి తోచే ఆనందాలు సమన్వయం చేసుకోవటంలోనే అసలైన సవాలుందని నేననుకుంటాను.”
నా మాటలు నచ్చనట్టు చూశాడు. చెప్పటమైతే చెప్పాను కానీ, నేను ఆవైపుగా ఎంతవరకు ప్రయత్నిస్తున్నాను? రాత్రి పడుకోబోతే నిద్ర తేలిపోయింది. మురళి మాటలు ఎప్పటివో జ్ఞాపకాలని తీసుకొచ్చాయి.
ఆధ్యాత్మికత గురించి మొదటిసారిగా నాతో మాట్లాడిన హోండా అంకుల్! దిల్లీ మొదటిసారి బదిలీ మీద వచ్చినప్పుడు ఇల్లు దొరక్క, జనక్ పురిలో ఉన్న స్నేహితురాలి ఇంట్లో ఉన్న రెండు నెలలు, అక్కడి పరిచయాలు… ‘నీలో ఒక ఫిలసాఫికల్ కోణం ఉందని నీ ముఖం చెబుతోం’దంటూ ఓ సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తుంటే డాబ్రీ మలుపులో పలకరించిన ఓ ఎనభై ఏళ్ల వృద్ధుడు! హోండా కంపెనీలో పనిచెయ్యటంతో అసలు పేరు కేవల్ సింగ్ మాయమైపోయి ఆ పేరే స్థిరపడింది కాలనీలో.
ఆఫీస్ వదిలి ఇల్లు చేరే సమయానికి కాలనీ మొదట్లో దారి కాచి మరీ చెప్పే కబుర్లు: ఆయన పసివాడుగా పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన రోజుల దగ్గర మొదలైతే, తను ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా చేసిన పనులు, ఉద్యోగ జీవితమిచ్చిన ఆత్మవిశ్వాసం, పెంపకానికి తెచ్చుకున్న కొడుకు, అతని కుటుంబం చూపే నిరాదరణ, భార్యకీ తనకీ పెళ్లైన తొలినాళ్ల నుండీ ఉన్న దూరాలు…. అన్నీ చెప్పుకొచ్చే ఆ పెద్దాయన తనతో పాటు ఇంటివరకూ వచ్చి, గ్రీన్ టీ తాగి మరీ వెనక్కి మళ్లిన ఆ రోజులు! తెలియకుండానే చాలా ఆత్మీయుడైపోయాడు. నిత్యం కాలనీలో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించేవాడు. సాయంకాలపు కబుర్లలో ఒకరోజు చెప్పాడు, భార్య ఆరోగ్యం సరిగా ఉండట్లేదని, ఆసుపత్రి ఖర్చులు ఎక్కువ అయ్యాయని. తను కూడబెట్టుకున్నదానితో నడుపుకొస్తున్నా, కొడుక్కి అదంతా అనవసర ఖర్చు క్రింద అనిపిస్తోందని చెప్పాడు. భార్య తన మనసులో ఎలాటి అసంతృప్తులున్నాయో ఎన్నడూ చెప్పనేలేదంటూ నిట్టూర్చాడు. అనుక్షణం చుట్టూ ఉన్న ప్రపంచంలో దేనినో అన్వేషించే తన పట్ల ఒక నిరసన ఆమె కళ్లలో ఇన్నేళ్లుగా కనిపిస్తూనే ఉందని, దానిని తను పోగొట్టలేకపోయానని చెప్పాడు. అది ఆమెను ప్రేమించేందుకు అడ్డుకాలేదని చెప్పటం గొప్పగా అనిపించింది. ముందునుంచీ ప్రపంచాన్ని ఆబ్జెక్టివ్‌గానే చూస్తున్నా, ఆమె ఉనికి తనలో ద్వైదీభావనల్ని రేపి, తన వెతుకులాట ఒక కొలిక్కి రాకుండా అడ్డుపడుతోందేమో అని విచారంగా చెబుతుండేవాడు.
వారణాసి వెళ్ళివస్తూ ఆయన కోసం తెచ్చిన తెల్లని కాటన్ లాల్చీ, పజామా చూసి మురిసిపోయి, ఇంటికెళ్లి తొడుక్కొచ్చి చూపించిన ఆ పసిమనసు… దిల్లీ వదిలిన తర్వాత రెండేళ్లు ఫోన్ పలకరింపులు నడిచి, ఉన్నట్టుండి ‘భార్య పోయిందనీ, లోకంలో తన బాకీలన్నీ తీరిపోయాయనీ, తను స్వతంత్రుడు, స్వేచ్చాజీవి అయ్యాననీ’ చెప్పాడు. స్వంత అపార్ట్‌మెంట్‌లో కొడుకుతో సరిపడక ఇంటి టెరేస్ మీద తన వంట తను వండుకుంటున్నానంటూ చెప్పిన కబురు ఆయన చెప్పిన ఆఖరి కబురు. ఆ తర్వాత చాలా రోజులకి ఆ ఫోన్ ఆయన మరిక లేరన్న కబురుని మాత్రమే అందించింది. ఆయన తరచుగా చెబుతూ వచ్చిన ఆధ్యాత్మికత ఏమిటో నాకు అంతగా పట్టుబడలేదు. ఆయన కబుర్లు చెప్పే రోజుల్లో ప్రశ్నలే లేవు.
మళ్లీ మురళి ఉద్యోగ రీత్యా దిల్లీ వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకున్న భావన వెంటాడింది. జనక్ పురి వెళ్లి ఆ రోడ్ల మీద తిరిగినప్పుడు ఒక ఓదార్పు తోచింది. తెల్లవారవస్తోంది, నిద్ర ఇక రాదని తెలిసి, ఆలోచనలు త్రుంచి మంచం దిగాను. తెల్లవారి ఆఫీస్ బయల్దేరుతూ నిర్లిప్తంగా అడిగాడు, “సాయంత్రం మెట్రోలో వచ్చేస్తావా? నేను ట్రావెల్స్ దగ్గరకి వస్తాను.”
‘రాను, నువ్వు వచ్చి కరోల్ బాగ్‌లో ఉన్న ట్రావెల్స్ దగ్గర బస్ ఎక్కించాలి.’ కచ్చితంగా చెప్పాను.
రాత్రి పదిగంటలకి కరోల్ బాగ్‌లో ట్రావెల్స్ ముందు మురళి, నేను ఇద్దరం మాటలు రానట్లు నిలబడ్డాం. నాలా ఒక్కరూ ప్రయాణిస్తున్న వారూ లేకపోలేదు. చుట్టూ ఉన్నవారిని చూస్తున్నా. అతను, ఆమె ఒక ప్రక్కగా నిలబడి ఉన్నారు. బహుశా చైనీస్ లేదా కొరియన్ అయి ఉండచ్చు. చిన్న గొంతులతో మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రా నుండి వచ్చిన యాత్రికులు చాలా ఎక్సైటెడ్‌గా, పెద్దగా తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటే ఆంధ్రాలో ఉన్నట్టే అనిపిస్తోంది.
బస్సు బయలుదేరటంతో చెయ్యి ఊపుతూ వెనుక నిలబడిపోయిన మురళిని చూస్తుంటే నిజంగా ఒక క్రొత్త వ్యక్తిని చూస్తున్నట్టే అనిపించింది. ఇదేనా నాలో అతను భయపడే ఆధ్యాత్మికత. అది అంత సులువుగా పట్టుబడేదేనా? అతని కోసం కాదూ పిల్లలే వద్దన్న నిర్ణయాన్ని గౌరవించింది. పెళ్లినాటికి మురళి నానమ్మ మంచం మీద ఉంది. అతని తల్లిదండ్రులు లేరు. పెళ్లైన కొత్తలోనే చెప్పేడు, ‘నిమ్మీ, నానమ్మని చూసుకోవలసిన బాథ్యత ఉంది. ఇద్దరం ఉద్యోగాలకి వెళ్తాం. మనకి పిల్లలు వద్దు. వాళ్లకి సరైన న్యాయం చెయ్యలేమని నాకు భయం.’ పిల్లల గురించి అప్పటిదాకా ఎలాటి అభిప్రాయం లేకపోయినా సహజంగా ఒకరో ఇద్దరో పిల్లలు నా జీవితంలోనూ ఉంటారనుకునేదాన్ని. మురళి మాటలు యదార్థాలయ్యాయి. నానమ్మ సుదీర్ఘమైన అనారోగ్యం, నేను చేస్తున్న ఉద్యోగంలో ఎలాటి ఆకర్షణా కనిపించక వదిలెయ్యటం… పిల్లలు కావాలని అనిపించనే లేదు. అమ్మ ఒకటి రెండు సార్లు అడిగి చూసింది. ఋణానుబంధాలు అని నిట్టూర్చింది. నానమ్మ మా జీవితాల్లోంచి వెళ్ళిపోయేసరికి నలభైయ్యో పడిలోకి రానే వచ్చాను. ఎప్పుడో సరదాగా చేసిన బి.యెడ్. డిగ్రీ చూస్తే పిల్లల ప్రపంచం పిలుస్తున్నట్లనిపించింది.
బస్సు ఒకటి రెండు చోట్ల ఆగి వేగం అందుకుంది. ఒక చల్లని గాలి తెమ్మెర పదునుగా తగులుతోంది. ప్రక్కన కిటికీ అద్దం పగిలి ఉంది, కర్టెన్ వెనుక ఇప్పటిదాకా గమనించనేలేదు. అప్పుడు చూశాను, నా ప్రక్కన ఉన్న ఆ కొరియన్ లేదా చైనీస్ ఆమెని. అరె, ఇద్దరికీ చెరొకచోటా సీట్లు దొరికినట్టున్నాయి. నా సీట్ ఇస్తే వాళ్లిద్దరూ కలిసి ప్రయాణించచ్చు అనిపించింది. సభ్యత కాదేమో అని ఒక్కక్షణం అనిపించినా, ఆమె వైపు తిరిగి సంభాషణకి ఉపక్రమించాను.
నా పలకరింపుకి ముందు పెద్దగా స్పందించలేదు. నిద్రలో ఉందా? ఒకటికి రెండు సార్లు ‘ఏదైనా సహాయం కావాలా?’ అంటూ నేను వెంటపడటంతో నా వైపు తిరిగి, “సారీ, మీకు నిద్రాభంగం కలిగించినట్టున్నాను, ఆ కిటికీ గ్లాస్ పగిలిందని గమనించాను కానీ పట్టించుకోలేదు,” అంది మర్యాదపూర్వకంగా.
“లేదు లేదు. నా నిద్రకేమీ భంగం కాలేదు. మీరిద్దరూ కలిసి కూర్చుంటారేమో, నా సీట్ మార్చుకుంటాను.” మరీ స్వంత విషయాలు అడుగుతున్నానా? ఎంతైనా భారతీయత నాలో చిక్కగానే ఉంది.
అలాటిదేమీ లేదని, తాము సౌకర్యంగానే ఉన్నామని చెప్పింది. ఆమె పేరు సిడ్నీ అని చెపింది. అప్రయత్నంగానే ఆ రాత్రి ప్రయాణం చాలా ఆసక్తికరంగా నడిచింది, సిడ్నీతో సంభాషణ మధ్య. తెలవారి హరిద్వార్‌లో దిగాం. చలికి మరింత ముడుచుకుపోతూ మాకోసం కేటాయించిన గెస్ట్ హౌస్‌లోకి దారితీశాం. సిడ్నీవాళ్ల రూమ్ నా ప్రక్క రూమ్ కావటంతో మా కబుర్లు మరి కొంచెంసేపు కొనసాగాయి. సిడ్నీ, ఆమె భర్త స్టీవ్ కూడా నాలాగే యోగా, మెడిటేషన్ క్లాసులకోసం వచ్చారట. నేనైతే రెండు రోజుల్లో వెనక్కి వెళ్లిపోతాను, వాళ్లు ఆరువారాలు ఉంటారట. రెండేళ్లకోసారి వస్తూనే ఉంటారట. స్నానం చేసి తయారవుతున్నంతసేపూ సిడ్నీ చెప్పిన కబుర్లు మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఆమె స్నేహంగా పంచుకున్న తన జీవితచిత్రం కళ్లముందు కదిలింది. బహుశా ఒక అపరిచితురాలినన్న ధైర్యం ఆమె మనసువిప్పి చెప్పుకునేలా చేసిందేమో!
చదువుకోసం అమెరికా వచ్చిన సిడ్నీ, స్టీవ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. యూనివర్సిటీ చదువు ముగించుకుని మనసుకు నచ్చిన పెయింటింగ్స్ వేస్తూ, జీవిక కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో అతనితో పరిచయం అయింది. అతను యూనివర్సిటీ రోడ్‌లో ఒక చిన్న ఫోటో స్టూడియో నడుపుతుండేవాడు. అది ఏమంత ప్రోత్సాహకరంగా లేకపోవటంతో, తన అమ్మమ్మ నేర్పిన బేకింగ్ పనులు మొదలెట్టి ప్రక్కనే చిన్న బేకరీ ఒకటి తెరిచాడు. బేకరీ ముందు పెట్టేందుకు అందమైన పెయింటింగ్ ఒకటి సిడ్నీకి పురమాయించాడు. ఆమె వేసిన పెయింటింగ్ అతనికి బాగా నచ్చటం వరకు బానే ఉంది. కానీ ఎంత ఖరీదు కట్టాలో ఆమెకి, అతనికి కూడా అర్థం కాలేదు. తనలో ఉన్న కళ విలువ ఏమిటో తెలిసున్నా ప్రాథమిక రోజుల్లో గుర్తింపు అవసరం కనుక తన పెయింటింగ్ విలువను తక్కువగా నిర్ణయించాలా లేక ఆర్థికావసరాలు నిలదీస్తుంటే ఎక్కువ చెప్పాలా అన్న సందిగ్ధం సిడ్నీది; ఆమె అవసరాన్ని అర్థం చేసుకున్నా తన ఆర్థికస్థితిని కూడా చూసుకోవాలన్న ఆలోచన స్టీవ్‌ది. అయినా, ఆమె ఊహించిన దానికన్నా ఆ పెయింటింగ్ ఖరీదు రెండింతలు కట్టాడు.
సిడ్నీ ఆశ్చర్యంతో నిలబడిపోయింది. ఆమెకి చెప్పాలని ఉంది, తను సర్వశక్తుల్నీ కూడగట్టి ఆ పెయింటింగ్ వేశాననీ, దాన్ని ఉచితంగా ఇవ్వాలనే ఉన్నా ఈ నెల కూడా ఉద్యోగప్రయత్నం సఫలం కాకపోతే స్వంత ఊరు వచ్చెయ్యమన్న తల్లి హెచ్చరిక గుర్తొచ్చి దానికి వెల కట్టాల్సివస్తోందని. మౌనంగా నిలబడిపోయిన ఆమె వంక అతను నవ్వుతూ చూశాడు. ‘నీలో నిజమైన కళ ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుందుకు ముందు మరో ఉద్యోగం నువ్వు చూసుకోవలసిందే. నన్ను చూస్తున్నావుగా.’ అన్నాడు. అతనికి తన మనసులో మాట తెలిసిందన్నది ఆమెకు అర్థమైంది. వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే అతను అన్న మాటలు, ‘సిడ్నీ, ఉద్యోగం వచ్చేవరకు ఈ డబ్బు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకో. అవసరమైతే నా బేకరీలో పార్ట్ టైమ్ ఉద్యోగం ఇస్తాను.’ ఆమె మనసంతా భారమైంది. అతని మాటలు, ఆతని కళ్లల్లో ఉన్న అపారమైన దయ తలుచుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎదుటి మనిషి అవసరాన్ని కనిపెట్టి, సహాయం చెయ్యగల పెద్ద మనసున్నవాడు.
ఆ తర్వాత ఆమె ఉద్యోగంలో కుదురుకుంది, వీలున్నప్పుడల్లా అతని బేకరీకి వెళ్లి వాలంటరీగా అతనికి సహాయం చేస్తుండేది. అక్కడ పనిచేస్తున్న మిగిలిన వారిపట్ల అతని ప్రవర్తన చూసి సిడ్నీ ఎప్పటికప్పుడు నివ్వెరపోతూనే ఉంది. ఒక వ్యాపారస్థుడిలా, యజమానిలా కాక తోటి పనివాడిలా వాళ్ల కష్టసుఖాల్ని కనిపెట్టే అతని తాపత్రయం చూసి తనక్కావలసిన వాడు ఇలాటి వాడే అన్న నిర్ణయం చేసుకుంది. తన అభిప్రాయాన్ని అతనికి చెప్పినప్పుడు నవ్వి, ‘నాకు ఎవరూ లేరు, ఆస్థులు లేవు. ప్రపంచంలో నన్ను కట్టిపడేసే శక్తి ఏదీ ఇంతవరకూ కనిపించలేదు. నా జీవిత పథం వేరు. నాతో నీకు సుఖం లేదు.’ అంటూ సున్నితంగా ఆమెను నిరుత్సాహపరచబోయినా ఆమె అతన్ని ఖండించివేసింది.
అతనిలోని వేదాంతి ఆమెను ముందుగా ఆకర్షించిన మాట నిజమే అయినా, కుటుంబం ఏర్పాటై, పెరుగుతున్న సందర్భంలోనూ అతను అంతే నిర్వికారంగా ప్రపంచాన్ని చూడటం ఆమెకు కష్టం కలిగించటం మొదలుపెట్టింది. ముద్దు మాటలతో, చేష్టలతో ఇల్లంతా సందడి చేసే పిల్లల్ని దగ్గరకు తియ్యడు. పనులు ముగించుకుని ఇల్లు చేరినా తనదైన లోకంలో బ్రతికే స్టీవ్‌ని చూస్తే రానురాను ఆమెలో ఒక అభద్రత మొదలైంది.
అతను తరచు భారతదేశం గురించి, హిమాలయాల గురించి, గంగానది గురించి మాట్లాడుతుండేవాడు. ఆమె అలవాటుగా వినటం నేర్చుకుంది. తన అమ్మమ్మ ఈ విషయాల్ని గురించి చెప్పిందని, హరిద్వార్, రిషీకేశ్ చూసి రావాలని చెబుతుండేవాడు. ఒకటి రెండుసార్లు వెళ్లి వచ్చాక తనలో తనే ఆలోచనలో మునిగి ఉండే భర్తని చూసి సిడ్నీదిగులు పడింది. అతను బేకరీ వ్యవహారాలు చాలా వరకు తన దగ్గర పనిచేస్తున్న వాళ్లకి అప్పగించి నిరంతరం ఏదో తనదైన లోకంలో మునిగిపోతుండేవాడు. ‘నువ్వు మామూలుగా ఉండు’ అంటే, ‘ఉన్నాను’ అనేవాడు చిరునవ్వుతో.
పిల్లలకి తండ్రి అంటే ఒక మౌని. దూరంగా మాత్రమే కనిపించే నిజం. ఊహ తెలుస్తున్నకొద్దీ తమ స్నేహితుల నాన్నలని చూసి నాన్న తమతో ఎందుకు అలా ఉండడని తల్లిని ప్రశ్నించటం మొదలైంది. సిడ్నీ భర్తని అర్థం చేసుకుందుకు ప్రయత్నిస్తోంది. పిల్లల జీవితాల్లో కనబడుతున్న లోటు కళ్లారా చూస్తూ ఏం చెయ్యాలో తోచక అతన్నే ప్రశ్నించింది. తను యావత్తు ప్రపంచం పట్ల సమానమైన ఆదరంతోనే ఉన్నానని చెప్పాడు.
‘నీ పరిచయమైనపుడు ప్రపంచం పట్ల నీ సహానుభూతి చూసి నువ్వు కావాలనుకున్నాను. నేనూ పిల్లలూ నిన్ను మిస్ అవుతున్నాం స్టీవ్, అర్థం చేసుకో. పిల్లలతో అందరి నాన్నల్లాగా ఉండు.’ నిబ్బరంగానే చెప్పింది. క్రొత్తగా అతనిలో ఒక అసహనం కనిపించింది.
బస్సు గమ్యం చేరటంతో సిడ్నీ కబుర్లు అక్కడికి ఆగాయి.
ప్రయాణం పొడవునా పదేపదే చెబుతోంది, ప్రపంచమంతా భారతదేశాన్ని ఆధ్యాత్మిక గురువుగా నిర్ణయించేసిందని. సిడ్నీ స్నానం చేసి తయారై వచ్చింది. ప్రయాణం, నిద్రలేమి తాలూకు అలసట ఎక్కడా లేకపోగా, ఒక క్రొత్త ఉత్సాహమేదో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె భావిస్తున్నట్టు ఈ వాతావరణమే దానికి కారణమా?
సాయంత్రం గంగా హారతికి ఇంకా సమయముంది. ముగ్గురం ఒక చోట కూర్చున్నాం. అతను విదేశీయుడిలా కనిపించలేదు. ఆమె చెప్పినట్టుగానే భారతీయతను కలవరించి, భారతీయతను తొడుక్కున్న వ్యక్తిగానే ఉన్నాడు. ఇద్దరి ముఖాల్లో అనిర్వచనీయమైన ఆనందం. మురళి కూడా వచ్చివుంటే ఎంత బావుణ్ణు అనిపించిందోక్షణం. పక్కనే కలకలం వినిపించి చూస్తే ఒక ఏడాది పాపాయి పాకుతూ గంగా ప్రవాహపు అంచు వరకూ వెళ్లింది. అంతవరకూ కబుర్లమధ్య పాపాయిని మరిచిన పెద్దలు చటుక్కున చూసి, కేకలు వేసి, ఒక్క అంగలో పాపాయిని చేతుల్లోకి తీసుకుని, గుండెలకి హత్తుకున్నారు. పాపాయి పకపకా నవ్వుతోంది. తల్లి కాబోలు, పాపాయిని గట్టిగా కోపంగా అడుగుతోంది- నీళ్లల్లోకి వెళ్ళిపోతావా అలా? అంటూ. తల్లి ఇంకా తనతో ఆటాడుతోందన్న ఊహతోనే పాపాయి మళ్ళీ పకపకమంది. ఇదంతా అరక్షణంలో జరిగింది, స్టీవ్ ముఖం మునుపటికన్నా విప్పారింది.
‘పాపాయిని చూశావా? ఎంత హాయిగా నవ్వుతోందో!? లౌకికమైనదేదీ తాకలేని నవ్వు. భయం అనేది తెలియని నవ్వు. తనని కాపాడుకునేవాళ్లు ఉన్నారు అన్న భరోసా, తను చెయ్యదలచుకున్నది చెయ్యబోయింది. సిడ్నీ, నేనూ పాపాయిలానే ఆలోచించాను అప్పట్లో, మన పిల్లల కోసం నువ్వున్నావు. ఇక కుటుంబపరమైన, లౌకికపరమైన బాధ్యతలు నన్ను అంటవని, మనసుకు తోచింది చేస్తూ వచ్చాను. కానీ అది నాకు ఆనందాన్నీ, తృప్తినీ కాక అశాంతినిచ్చింది.’ అతను నిజాయితీగా చెబుతున్నాడు.
ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అది ప్రతివారి జీవితంలోనూ అవసరమేనా? మురళి ఆపాదించినట్టు వయసుతో దానికెలాటి నిమిత్తం లేదా? ఎలాటప్పుడు దానివైపు ఆకర్షింపబడతారు? అది భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యమా? తనలోకి తాను చూసుకోవటమా? యావత్ ప్రపంచాన్ని నిర్లిప్తంగా చూడగలిగే నిబ్బరమా? అది శాశ్వతమా, తాత్కాలికమా?
“క్షమించండి, ఒక్క ప్రశ్న అడగొచ్చా?” అంటూ నా మనసులో సందేహాన్ని బయటపెట్టాను. అతను నావైపు తిరిగి, “మిస్ నిర్మలా, నాకేం కావాలో, ఎటువైపు వెళ్తున్నానో స్పష్టమైన దృష్టి లేకుండా చాలా కాలం ఒక అయోమయంలో గడిపేశాను. చిత్రంగా సిడ్నీ నాకు గురువై నన్ను సరైన దారిలోకి మళ్లించింది. తనే చెబుతుంది,” అన్నాడు. సిడ్నీ నావైపు చూసి మొహమాటంగా నవ్వింది.
“ఏమో, స్టీవ్ కుటుంబానికి దూరమైపోతున్నాడన్న భయం నన్ను వెంటాడేది. అప్పుడే నా ఆఫీసులో ఒక ఇండియన్ పరిచయమైంది. ఆ పరిచయం మంచి స్నేహంగా మారింది. ఆమె తల్లి కొన్నాళ్లు కూతురి దగ్గర ఉండేందుకు వచ్చింది. అనుకోకుండా ఒకసారి ఆమె దగ్గర నా భయాల్ని, బెంగల్ని చెప్పుకున్నాను. ఆమె బాగా చదువుకున్న వ్యక్తి. ఎన్నో విషయాలు చెబుతుండేది. నా సందేహాలు పెరుగుతూ పోయాయి. నా ఆసక్తి చూసి మరింత చెప్పేది.
భగవద్గీత గురించి చెబుతూండేది. ఏ సమస్యకైనా గీత జవాబు చెబుతుందనేది. నా భర్తకి తను అన్వేషిస్తున్నవిషయం పట్ల అవగాహన లేకపోవటమే అతని ప్రవర్తనకి కారణం అని చెప్పిందావిడ. ఆధ్యాత్మికత అనేది ప్రపంచాన్నుంచి పారిపొమ్మని చెప్పలేదు. లౌకికపరమైన బాధ్యతల్ని సంపూర్ణంగా నిర్వహిస్త్తూనే, ఒక తెలివిడితనంతో ప్రపంచాన్ని దూరంగా ఉంచాలనీ, మంచి, చెడుల మధ్య ఊగిసలాడే మనసుని మచ్చిక చేసుకోవాలనీ, దాన్ని విశాలం చేసేకొద్దీ ఎలాటి విషయాన్నైనా సంయమనంతో తీసుకునే బలం వస్తుందనీ చెప్పింది. మనలో సహజంగా ఉండే ఆనందం, శాంతి, ప్రేమల్ని చుట్టూ ప్రపంచానికి పంచిపెట్టాలనీ ఆమె నాకు చెప్పింది. ఇదంతా ఇంత సరళంగా ఉందన్నది నాకు సంతోషాన్నిచ్చింది. నాకు యోగా, మెడిటేషన్ పరిచయం చేసిందావిడే.
స్టీవ్‌తో ఈ విషయాల్ని చెప్పినప్పుడు మొదట్లో నమ్మేవాడు కాదు. తనకి మాత్రమే సంబంధించినదనీ, నాకు అవగాహన లేని విషయమనీ కొట్టిపారేసేవాడు. నాతోపాటు ఆమె దగ్గరకి రమ్మన్నా వచ్చేవాడు కాదు. ఆ సమయంలో ఆమె తిరిగి ఇండియా వెళ్లిపోయింది. నేను నా పోరాటాన్ని ఒంటరిగా చేసేందుకు సిధ్ధమయ్యాను. నేర్చుకున్న పాఠాల్ని అతనికి చెప్పటం ఆపలేదు నేను. నా మానసిక శక్తి కోసం మొదలెట్టిన యోగా, మెడిటేషన్ లాటి వాటిలో పిల్లలకీ శిక్షణ మొదలుపెట్టాను. క్రమంగా నేను నేర్చుకున్నది నాకు సాధనలో అందుబాటులోకి వచ్చి, ఒక శాంతివైపు నన్ను నడిపిస్తోందన్నది తెలిసొచ్చింది. ఇదంతా జరిగేందుకు దాదాపు ఏడాది పైనే పట్టింది. అప్పటికి స్టీవ్‌లో కొంచెం మార్పొచ్చింది. నేను చెప్పేదాన్ని ఖండించటం మాని, వినటం మొదలుపెట్టాడు. తన బేకరీని ఎవరికైతే అప్పగించాడో వాళ్లు నెమ్మదిగా తనని ప్రక్కన పెట్టినట్టు గమనించాడు. ఒక నిస్సహాయత అతన్ని ఆవరించింది. నెమ్మదిగా కుటుంబానికి దగ్గరవుతూ వచ్చాడు. ప్రపంచాన్ని మళ్లీ తనదిగా చేసుకుంటున్నకొద్దీ అశాంతి మాయమవుతూ వచ్చిందని, బాధ్యతలను పంచుకోవటం మొదలెట్టాక సంతృప్తి, ఆత్మవిశ్వాసం అనుభవంలోకి వస్తోందనీ తెలుసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఎలాటి ఆరోపణలూ లేవు.”
సిడ్నీ సుదీర్ఘంగా వివరించింది. ఆమె చేతులు అనునయంగా నన్ను చుట్టాయి. అప్రయత్నంగా నాకళ్లు తడిబారాయి.
మురళి బాహ్యప్రపంచపు మోహంలో కూరుకుపోయాడని, నాకు తెలుసనుకుంటున్న జీవితపు విలువల్ని గ్రహించలేకపోతున్నాడని అనుకున్నాను. తను నమ్మినదానిపట్ల నిబధ్ధుడుగా ఉన్న విషయాన్ని మాత్రం తేలిగ్గా తీసుకున్నాను. నేనూ, మురళి మావైన విశ్వాసాల్ని మాత్రమే గౌరవించుకుంటూ, ఒకరినొకరం అర్థం చేసుకుందుకు ప్రయత్నించనేలేదు. మురళికి ఇదంతా చెప్పాలి.
హోండా అంకుల్ తనకు దగ్గరకాలేని భార్యపట్ల అసహనంతోనే చివరికంటా జీవించాడు. ప్రేమించానని చెప్పుకున్నా భార్య మనసులో వెలితిని ఏనాడూ నింపే ప్రయత్నమూ చెయ్యలేదు. ఐదారు దశాబ్దాల వివాహ బంధం ఇద్దరినీ అపరిచితుల్లానే నిలబెట్టింది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దగ్గరగా చూస్తూకూడా తనదిగా చేసుకోలేకపోయాడు. ఏమో, అలా ఆలోచిస్తే దిగులేసింది.
తెలవారి తిరుగుప్రయాణమవుతూ, సిడ్నీని, స్టీవ్‌ని దిల్లీలో మా ఆతిథ్యం తీసుకుందుకు రమ్మని ఆహ్వానించి బస్సెక్కాను. నేను చెప్పబోయే కబుర్లు వినేందుకు సిధ్ధంగా ఉండమని, ముఖ్యంగా సిడ్నీ కథ చెబుతాననీ మురళికి ఫోన్‌లో చెప్పేను.
దిల్లీ జనసమ్మర్దం లోంచి హరిద్వార్ రావటం ఈసారి ఒక కొత్త తెలివిడిని, ఆనందాన్ని ఇచ్చింది.
(కథ వెనుక కథ: గడచిన వేసవిలో నా అమెరికా యాత్రలో పరిచయమైన సిడ్నీ, స్టీవ్ నిజంగానే నన్ను కొంత ప్రభావితంచేశారు. వాళ్లకి భారతీయత, గంగానది, హిమాలయాలు, ఆధ్యాత్మికత పట్ల ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ విస్మయాన్ని కలిగించింది. వదిలి వచ్చిన తర్వాత కూడా వాళ్ల ఆలోచనలు నన్ను వదలక ఈ కథని రాయించాయి. – ర.)
-------------------------------------------------------
రచన: అనూరాధ నాదెళ్ళ,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment