Tuesday, April 23, 2019

బంగార్రాజు ముద్దు


బంగార్రాజు ముద్దు
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.................

బంగార్రాజెక్కిన విమానం హైదరాబాద్ ఎయిర్‌పోర్టుని సమీపిస్తున్న కొద్దీ అతన్లోని ఉద్విగ్నత ఎక్కువవడం మొదలు పెట్టింది. ‘అమెరికాలో అడుగు పెట్టిన ఏడాది తరువాత గానీ మళ్లీ భారతదేశపు ముఖాన్ని చూడడానికి వీలవదని జ్యోతిష్కుడెవడయినా అమ్మకి చెప్పి వుంటే నేనసలు అమెరికా గూర్చి కలలోనయినా ఊహించడానికి వీలయ్యేదా?’ అని మొదట్లో అనుకున్నాడు. రెండేళ్ల తరువాత అని మరుసటేడాది అనుకున్నాడు. అది కాస్తా మూడేళ్ల తరువాత, నాలుగేళ్ల తరువాత… అలా అభివృద్ధి చెంది, గ్రీన్ కార్డ్ చేతికొచ్చి అతనీ విమానమెక్కేసరికి పదేళ్లు గడిచాయి.

నిజానికి బంగార్రాజు తల్లి, ‘మా అబ్బాయికి గ్రీన్ కార్డ్ ఎప్పుడొస్తుంది?’ అని ఆస్థాన జ్యోతిష్కుణ్ణి సాధించడం బంగార్రాజు అమెరికా విమానం ఎక్కిన మరునాటి నించే మొదలుపెట్టింది. మొదట్లో ఇవాళో, రేపో అన్నతను కాస్తా రెండేళ్లు గడిచేసరికి శనిజపం చేయించాలనీ, కుజుడికి కోపం తగ్గించడం కోసం పూజలు చెయ్యాలనీ, గురుడికి హోమం చేయించాలనీ చెప్పడమే గాక వాటిని చేయించి ఇంకో రెండేళ్లు సాగదీసేసరికి, ఇంకతను వాళ్ల గుమ్మం తొక్కకుండా చీపురుకట్టతో అతనికి శాంతి చేయించింది.

బంగార్రాజు అమెరికా వెళ్లిన మహర్దశ వై2కె. అది ఏ జాతకాల్లోనూ, ఏ గ్రహానికీ సంబంధించినది కాదు; ఏ గ్రహమూ ఇంకోడింట్లో దూరడం వల్లనో ఇంకొకణ్ణి ఓరగానో, లేక కోరగానో చూడడం వల్లనో సంభవించినది కాదు. అది అమెరికావాడి తెలివితక్కువతనం. కాకపోతే సోమరితనం. లేకపోతే, నాలుగంకెలుండే క్రీస్తుశకం కాలమానాన్ని కాస్త కుదించి, చివరి రెండంకెలతో సరిపుచ్చుకొమ్మనమని ఎవరు మాత్రం ఎలా చెబుతారు? ఎవరి తప్పయితేనేం గానీ అది బంగార్రాజుకి ఒప్పే చేసింది.

అతను చేసింది బీయేనే అయినా, తిరిగింది భీమవరం లోనే అయినా అతని నైకి షూసునీ, లీవైస్ జీన్సునీ, టామీ హిల్ఫైగర్ టీషర్టునీ, రేబాన్ గాగుల్సునీ చూసిన వాళ్లందరూ అతనికి అమెరికా ముద్రని టీనేజర్‌గా వున్నప్పుడే వేసేశారు. ఆ ముద్రకి కొద్దిగానైనా స్థానబలిమిని కలిగించాలని ఏ గ్రహానికో దురద పుట్టడం వల్ల కాబోలు కోబాల్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. అదే ముద్రని ఐ.ఎస్.ఐ. ముద్రగా భావించిన ధనలక్ష్మి అతణ్ణి అర్జెంటుగా కొనేసుకుంది. పెళ్లి కాకముందరే ఆమె పేరుని ఐశ్వర్యగా మారుస్తాననే అతని ఇంగితం వెనుకనున్న మహత్తరమయిన ప్రేమని ఆమె ఘాటుగా ప్రేమించేసి, “ఐ లవ్యూ సో మచ్‌రా బంగారూ!” అన్నది అతని కౌగిట్లో కరిగిపోతూ.

ఆ కౌగిటిని అట్లాగే పట్టుకుని ఆ వై2కె మహర్దశలో బంగార్రాజు తనతో అమెరికా తీసుకుపోవడానికి ఆమె పొట్టలోని బాబిగాణ్ణి ధనలక్ష్మి తల్లిదండ్రులు అడ్డం పెట్టారు. ‘వాడు పుట్టగానే తప్పకుండా వస్తాను,’ అని విమానమెక్కిన బంగార్రాజుని బాబిగాడి బారసాలకి రానీయకుండా ముందుచూపుతో సింగిల్ ఎంట్రీ వీసాని మాత్రం అతనికి రాయించిన అమెరికా వాడడ్డొచ్చాడు. ధనలక్ష్మిని కూడా, అమెరికా కాన్సులేట్ చుట్టూ పొర్లు ప్రదక్షిణాలు చేస్తానని ఆమె బెదిరించేదాకా లాగి, రెండేళ్ల తరువాత అయితేనేం, ఆమెనీ బాబిగాణ్ణీ శాన్ ఫ్రాన్సిస్కోలో వున్న బంగార్రాజుని చేరనిచ్చాడు. మనవరాలు కత్రీనా పుట్టినప్పుడు వెళ్లి తీరాలన్న బంగార్రాజు తల్లికి మాత్రం సైంధవుడిలా అడ్డుపడ్డాడు. మనవరాలు కత్రీనా పుట్టినప్పుడు వెళ్లి తీరాలంటూ అదే బెదిరింపుని బంగార్రాజు తల్లి చేస్తే, ‘ఇక్కడ కాదు, వీసా వెంకటేశ్వరస్వామి దగ్గర చేసి రామ్మా. తరువాత వెయ్యి డాలర్లు కట్టు. అయితే వీసా వస్తుందని గ్యారంటీ ఏమీ లేదు,’ అని ఆ కాన్సులేట్ వాడన్నవాడని, ఆ అన్నవాడు చేతన్ పటేల్ అన్న భారతీయుడిలా ఉన్నవాడని ఆవిడకి మండిపోయి ఆవిడకొచ్చిన అచ్చతెలుగులో వాడి మీద శాపనార్థాలని కుమ్మరించింది.

అందరికీ రెండుమూడేళ్లల్లో గ్రీన్ కార్డ్ రావడమేమిటీ, వీడికిన్నేళ్లు పట్టడమేమిటీ? అని ఆమె అందరితోను వాపోతుండేది. సరయిన లాయర్ని చూస్కొని వుండడు, అని ఎవరయినా కిసుక్కున అంటే, మీకు ఇబిత్రీ కేటగిరీ గూర్చి తెలుసా? అని వెంటనే ప్రశ్నించేది. ఇండియాలో ఇ, బిర్యానీలో బి, త్రిషాలో త్రి. ఈ మూడింటినీ కలిపితే మావాడి గ్రీన్ కార్డ్ కేటగిరీ. అర్థమైందా? అని ఘాటుగా బోధించేది. ఆవిడకి అంత అర్థమయ్యేలా చెప్పింది బంగార్రాజే. అప్పటికే అమెరికాలో ఎవరికయినా ఫోన్ చేసి తన పేరు చెప్పాల్సి వచ్చినప్పుడు, బి యాజ్ ఇన్ బిర్యానీ, ఎ యాజ్ ఇన్ అమెరికా, ఎన్ యాజ్ ఇన్ ఎన్టీ రామారావ్ అంటూ చెప్పడం అలవాటు జేసుకున్నాడు.

“నేను ఇంజనీరింగ్ చేస్తానంటే నువ్వు అడ్డం కొట్టావ్. ఆ డిగ్రీ వుంటే అప్లై చేసిన రెండేళ్లల్లో గ్రీన్ కార్డ్ వచ్చుండేది,” అన్నాడు బంగార్రాజు.

ఉద్యోగం సక్రమంగానే చేస్తున్నా, ఇంజనీరింగ్ డిగ్రీలున్న వాళ్లతో ఏమాత్రం తొణకకుండా పోటీ పడుతున్నా, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఉన్నా, గ్రీన్ కార్డ్ అప్లికేషన్ల విషయంలో మాత్రం ఆ ఇంజనీరింగ్ డిగ్రీ వున్నవాళ్లేమో తిరుపతిలో స్పెషల్ దర్శనం లైన్లోనూ తనేమో ధర్మదర్శనం క్యూలోనూ ఉన్నట్లనిపించి, అతనికి మంటెత్తినా చెయ్యగలిగిందేమీ లేదు గనుక సహిస్తున్నాడు.

“అప్పుడు నాకేం తెలుసురా? నువ్వు ఇంజనీరింగ్ చెయ్యడానికి కష్టపడడమెందుకని, పైగా ఏదో నా కళ్ల ముందుంచుకుందామనీ వద్దన్నాను గానీ డబ్బుకు లేకనా? ఈ మధ్య ఇక్కడ పేటకో ఇంజనీరింగ్ కాలేజీ తెరుస్తున్నారు. వాళ్లకి ఫీజులు కడితే చాలట. ఎవరూ క్లాసులకి కూడా వెళ్లరట. వాటిల్లో చదువుతున్న పిల్లలంతా ఎప్పుడూ ఇంటి చుట్టుపక్కలే కనిపిస్తుంటారు. ‘క్లాసులకి వెళ్లరేమిట్రా?’ అనడిగితే, ‘అక్కడ చెప్పేవాళ్లెక్కడున్నారు ఆంటీ?’ అంటారు. ఆ కాలేజీ వాళ్లనడిగి ఓ డిగ్రీ సర్టిఫికెట్ పంపేదా?” ఆశగా అడిగిందావిడ.

“అదేదో గ్రీన్ కార్డుకి అప్లై చేసేటప్పుడే చేసుండాల్సింది. ఇప్పుడు లాభం లేదు,” అన్నాడు బంగార్రాజు.

వాడి బియ్యే డిగ్రీని అడ్డం పెట్టుకుని నా మనవరాల్ని చూడనీకుండా ఆపుతోంది ఈ వెధవ వీసా, అని ఆవిడ అమెరికాని ఆడిపోసుకోని క్షణం లేదు. ప్రస్తుతం ఆ మనవరాలు కత్రీనా, ఆవిడ వొళ్లోనే కూర్చుని, ధనలక్ష్మి టీషర్టుని పట్టుకుని లాగుతూ, అన్నయ్య బాబిగాడితోనూ, అమ్మమ్మ, తాతలతోనూ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అతనికై ఎదురు చూస్తోంది. ఆ పిల్ల చికాకునీ, ఏడుపునీ చూసిన వాళ్లెవరయినా బంగార్రాజు అక్కడకి రావడం ఆ పిల్లకి ఇష్టం లేదనుకునే అవకాశముంది గానీ, అర్ధరాత్రి ఒంటిగంటకి రెండేళ్ల పిల్లని నిద్రలేపి పట్టుకొచ్చారని చెబితే మాత్రం ఆ పిల్లని అపార్ధం చేసుకున్నందుకు చాటుగానయినా సరే, చెంపలేసుకుంటారు. ధనలక్ష్మీ బాబిగాడూ అప్పటికి నెలరోజుల క్రితమే -– గ్రీన్ కార్డ్ వచ్చి వారం ఇంకా పూర్తి కాకుండానే — పుడుతూనే అమెరికన్ సిటిజెన్‌షిప్పుని చేత పట్టుకొచ్చిన కత్రీనాతో సహా హైదరాబాద్ చేరుకున్నారు. ఇండియా వెళ్లడం మొదటిసారి కావడం వల్ల ధనలక్ష్మి తాను అక్కడ కనీసం రెణ్ణెల్లుండాలంది. బంగార్రాజుకి అన్నాళ్లు సెలవు దొరికే అవకాశమే లేదు గనుక ఆమే పిల్లలూ ముందు వెళ్లేలా, నెల తరువాత అతను వాళ్లని చేరేలా, వచ్చేటప్పుడు మాత్రం అందరూ కలిసి తిరిగి వచ్చేలా టిక్కెట్లు కొనుక్కున్నారు. అందుకే అతను ఇప్పుడు ఒంటరిగా వస్తున్నాడు.

బంగార్రాజు ఉద్వేగానికి లోను కావడానికి ఎంతో చిన్న కారణం చాలంటుంది అతన్ని పన్నెండేళ్లుగా అబ్సర్వేషన్‌లో వుంచిన ధనలక్ష్మి. ‘ఐ లవ్యూ బంగారూ,’ అని మొదటిసారి ఆమె నోట్లోంచి రాగానే అతని కళ్లల్లో నీళ్లని చూసి ఉబ్బితబ్బిబ్బైపోయింది గానీ, తరువాతనించీ ఎవరయినా నీ చొక్కా బావుంది, యు లుక్ నైస్ టుడే లాంటి సాధారణ వ్యాఖ్యలు చెయ్యగానే అతని కళ్లల్లో తడిని చూడడం అలవాటయిన తరువాత, ‘డీహైడ్రేషన్ వస్తుంది. ఈ నీళ్లు తాగండి,’ అని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకునే నీళ్ల బాటిల్ని అతని చేతికివ్వడం మొదలు పెట్టింది. సీతారామయ్యగారి మనవరాలు సినిమాని ఇంట్లో చూస్తున్నప్పుడయితే అతను కళ్లు తుడుచుకుంటూ పక్కన కూర్చున్న ఆమె చీర కొంగుని పూర్తిగా తడిపేశాడు. అప్పట్నించీ అతని పక్కన కూర్చుని సినిమా చూసేటప్పుడు ఆమె ముందుగానే నీళ్ల బాటిల్తో బాటు ఒక హాండ్ టవల్ని కూడా ఒళ్లో రెడీగా పెట్టుకునేది.

అలాంటి బంగార్రాజు ఉద్విగ్నతని హిమోన్నతశిఖరాల నెక్కించింది అతను ఫ్లైట్‌లో చూసిన హిందీ సినిమా.

ఆ సినిమాలో, కాషాయ వస్త్రాలని కట్టుకుని, నెరుస్తున్న బవిరిగడ్డంతో వున్న ఒకాయన ఇండియాలో అడుగు పెట్టగానే మోకాళ్లని నేలకానించి, వంగి నేలని ముద్దు పెట్టుకొని, మేరా భారత్ మహాన్ అంటాడు. ఆ వెనకే దిగిన ఒక సూట్‌వాలా గొంతుని బట్టి ఆ గడ్డపాయన్ని తన తండ్రిగా గుర్తిస్తాడు. ఆ సూట్‌వాలా అమెరికా వెళ్లి మొదట్లో చాలా కష్టాలు పడి, ఆ కష్టాలని తన తల్లిదండ్రులకి తెలియజెయ్యడం ఇష్టం లేక తన ఫోన్ నంబరూ అడ్రస్సు వాళ్లకి తెలియనివ్వడు. పదేళ్ల తరువాత బిజినెస్‌లో విజయవంతుడై ఇండియా కొస్తాడు. ఆ గడ్డపాయన, అక్కున చేర్చుకోవడానికి ఆ సూట్‌వాలా తల్లి ఈ లోకంలో లేదన్న వార్తని కొడుక్కి చేరవేస్తాడు. అందువల్లనే తను అయిదేళ్ల క్రితం సన్యాసం పుచ్చుకున్నాడనీ, తెలిసిన వాళ్లెవరయినా కొడుకు ఆచూకీ చెబుతారేమోనని అమెరికాలో వున్న శిష్యబృందం పిలిస్తే వెళ్లి, చికాగోలో సిన్హా గారింట్లో, హూస్టన్‌లో హెగ్డే గారింట్లో, మేరీలాండ్‌లో మెహతా గారింట్లో, శాన్ ఫ్రాన్సిస్కోలో శాస్త్రి గారింట్లో, ఇలా దేశం నలుమూలలా కొడుకు గూర్చి ఆచూకీ అడిగి తిరిగొస్తున్నాననీ చెబుతాడు. మరి, ఒకే ప్లేన్‌లో వున్నా మనం ఇప్పటిదాకా కలవలేదెందుకని? అని ప్రశ్నిస్తాడు సూట్‌వాలా. నేను బిజినెస్ క్లాసులో వచ్చాను. మరి నువ్వు? అంటాడు తండ్రి. ఎకానమీలో, అంటాడు కొడుకు. మరి అందుకు, అని జవాబిస్తాడు తండ్రి. ఈలోగా బ్యాక్‌గ్రౌండ్లో ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ,’ అని పాట వస్తూండడంతో సూట్‌వాలాకి తన కర్తవ్యం గుర్తొచ్చి, అమ్మ లేకపోతేనేం, జన్మనిచ్చిన ఈ నేలతల్లి వుండగా అని, యే మిఠ్ఠీ, యే ధరిత్రి, యే జన్మభూమి అంటూ ఆ నేల మీద ముద్దుల వర్షాన్ని కురిపిస్తాడు.

ఈ సంభాషణ జరుగుతున్నంతసేపూ బంగార్రాజు కళ్లల్లో ఫౌంటెన్లు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. విండో సీట్లో కూర్చున్న అతను చేతికందిన గుడ్డతో కళ్లు తుడుచుకుంటుంటే, ‘చూడండి, ఇతను నాకొంగు లాగుతున్నాడు,’ అని పక్కసీట్లో కూర్చున్నావిడ అరవడం వినిపించింది. అదిరిపోయిన బంగార్రాజు, ‘క్షమించండి, మా ఆవిడనుకున్నాను,’ అని కళ్లల్లోంచి గంగాగోదావరులని ప్రవహింపజేస్తుంటే, ఆవిడ, ‘ఈ పట్టుచీరెకంటిన నీళ్ల మరకలు డ్రైక్లీనింగ్ చేసినా పోవు,’ అని విసుక్కుంటూ తన రుమాలుని అతనికిచ్చింది – ‘మళ్లీ ఇవ్వఖ్ఖర్లే’దని నొక్కి చెబుతూ. తరువాత, ‘మధ్య సీటు నాకొద్దంటే, పక్కనవున్నది నీ తమ్ముడి వయసువాడంటూ అయిల్ సీట్లో కూర్చున్నారు. ఇప్పటికయినా ఇట్రండి,’ అని మొగుడి మీద చికాకుపడి, లేచి, ఆయన చేత సీటు మార్పించింది. ఇంకా నయం! నేను నిద్రపోతూ ఆవిడ భుజమ్మీద తలవాల్చినప్పుడు చూసింది కాదు, అనుకుని తేలిక పడ్డాడు బంగార్రాజు.

బంగార్రాజు చూసిన ఆ సినిమా అతని మనోక్షేత్రమ్మీద పదునైన నాగలితో పర్రులని చేసింది. ఎయిర్‌పోర్టులో తల్లి వేచివుంటుందని అతనికెలాగో తెలుసు. ఆమె మీద ముద్దులవర్షాన్నెలాగూ కురిపిస్తాడు. ఇక మిగిలింది జన్మభూమికి – అదే, ధరిత్రికి – ముద్దు పెట్టడం. ధరిత్రి అన్న పదాన్ని అతను మొదటిసారి విన్నది ఆ ఫ్లైట్‌లోనే అయినా, కాంటెక్స్టుని బట్టి జన్మభూమికి దాన్ని పర్యాయపదంగా అర్థం చేసుకున్నాడు. ఏదయినా కొత్త పదాన్ని గుర్తుంచుకోవాలంటే ఆ పదాన్ని అదే పనిగా వాడుతూండాలి, అన్న హైస్కూల్ మాష్టారి ఉపదేశం ఆ సినిమా చూస్తున్నప్పుడే గుర్తొచ్చి దాన్ని పాటించాలని మనసులో నోట్ చేసుకున్నాడు. ధరిత్రిని పదే పదే తలుచుకున్నాడు. విమానం దిగగానే తను చెయ్యబోయే మొదటి పని అదేనన్న నిర్ణయానికి అతనొచ్చాడు.

విమానం లాండ్ అయిన తరువాత అది మెల్లిగా గేట్ల దగ్గరికి చేరుతుండగానే ప్రయాణీకులందరూ గబగబా లేచి నిలబడ్డారు. నడుస్తున్న విమానం లోంచి దూకేయరు కదా అని బంగార్రాజు భయపడ్డాడు. రైలు గానీ బస్సు గానీ కదుల్తున్నప్పుడు ఎక్కడం దిగడం ఎంత అలవాటున్నా, ఆ ఎత్తులోంచి దూకితే మక్కెలు విరగడం ఖాయమన్నది అతనికి తెలుసు. అయితే, ఫ్లైట్ అటెండెంట్‌కి తప్ప ఇంకెవరికీ విమానం తలుపులని ఎలా తియ్యాలో తెలిసినట్లు లేదు. ప్రయాణీకులంతా ఆమె తలుపు తీసేదాకా అలాగే నిల్చుండి పోయారు.

అందరూ అలా నిల్చునుండగానే, ఎక్స్‌క్యూజ్ మీ అంటూ ఒక నడివయస్కుడు విమానం వెనుక మొదలు పెట్టి, తోసుకుంటూ వచ్చి, సరిగ్గా బంగార్రాజు సీటుపైన వున్న ఓవర్‌హెడ్ లగేజ్ క్యాబిన్ తెరిచి అందులోని కారీ-ఆన్ బయటకు లాగాడు. అందులో వున్న బంగారు ఇటుకల బరువుని అతను ఆపలేక కాబోలు బంగార్రాజు నెత్తిమీద దాన్ని దభీమని పడేసి, సారీ అని జనాంతికంగా అనేసి, ఎక్స్‌క్యూజ్ మీ అంటూ ముందుకు దూసుకుపోయాడు. ఆ సూట్‌కేస్ కాలిమీద నించి పోవడం వల్ల తట్టుకోలేని బాధతో ఒకాయన కోపంగానే, మీకన్నా ముందునించే ఇక్కడున్నాం అన్నాడు. అందుకేగా ఎక్స్‌క్యూజ్ మీ అన్నాను, అని తొక్కడానికి మిగిలిన పాదాలని వెదుక్కుంటూ నడివయస్కుడు ముందుకి సాగిపోయాడు.

మొత్తానికి బంగార్రాజు విమానం లోంచి కుడికాలుని జెట్ బ్రిడ్జ్ మీద ఆనించగానే, భారతదేశపు బంగారు నేలని అక్కడే ముద్దు పెట్టుకోవాలనిపించి, ముందుకి వంగాడు. వెనక వస్తున్న వాళ్లకి అతనేం చెయ్యబోతున్నాడో ముందుగా అతను మాటవరుసకయినా చెప్పక పోవడంతో, వాళ్లు తిరుపతి క్యూలో నిల్చున్నప్పటి లాగా అతన్ని ముందుకు తోశారు. బాలన్స్ లేక అతను ముందుకు పడినా గానీ అతని ముందుపళ్లు అతని తోనే ఎయిర్‌పోర్ట్ బయట వేచి వున్న ధనలక్ష్మి దాకా చేరడానికి కారణం అతని నుదురు ముందుగా ఆ జెట్ బ్రిడ్జ్ ఫ్లోర్‌ని తాకడం. అతని ఎడమకాలు విమానాన్ని వదిలి ముందుకు రానని మొరాయించడంతో బంగార్రాజు ఒక పక్కకి పడ్డాడు. అతని కుడిచేతి పట్టుని దాదాపు విదిలించుకున్న అతని కారీ-ఆన్ ఏ కళనుందో గానీ ఎగిరి అతని మీద పడి కావలించుకొంది.

“నేలని ముద్దు పెట్టుకోవడం ఇక్కడ కాదండీ, ముందర. చలానా కట్టి, టోకెన్ తీసుకున్న తరువాత!” వీల్‌ఛెయిర్ని విమానం దాకా పట్టుకొచ్చిన ఒక ఎయిర్‌పోర్ట్ ఎంప్లాయీ ఉచితసలహా నిచ్చాడు గానీ అతనున్న చోటు నించి అంగుళం కూడా కదల్లేదు. బంగార్రాజు వెనక వచ్చినవాళ్లు ఓ పాతిక మంది, ‘ఆ పడేదేదో కొద్దిగా పక్కకు పడొచ్చుగా, మరీ మధ్యలో పడ్డాడు,’ అని విసుక్కుంటూ అతని కాళ్ల మధ్య అడుగులేస్తూ అతన్ని దాటుకుంటూ, సూట్‌కేసులని అతని మీదుగా లాక్కుంటూ వెళ్లారు. ఆ తొక్కిసలాటలో తన ప్రాణాలు పోతాయేమోనని అతను కాళ్లు దగ్గరకు తీసుకుంటూ భయపడ్డాడు గానీ, జాలిపడ్డ ఒక తోటి ప్రయాణీకుడు చేతిని అందించగానే, బతికాన్రా దేవుడా! అనుకుంటూ లేచి నిలబడి, కారీ-ఆన్ లాక్కుంటూ, ‘జెట్ బ్రిడ్జ్ నేల కాదు గదా! పైగా, నేలకి కనీసం ఇరవై అడుగుల ఎత్తులో వుంటుంది! అసలు దాన్ని ముద్దు పెట్టుకోవాలనే బుద్ధి తక్కువ ఆలోచన నాకెలా వచ్చిందసలు?’ అని తనని తను తిట్టుకుంటూ ముందుకు నడిచాడు.

ఎయిర్‌పోర్ట్ టర్మినల్‌లో అడుగు పెట్టగానే, అక్కడ పెద్ద బంగారు అక్షరాలతో, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో — ‘మీ జన్మభూమిని తనివి తీరా ముద్దు పెట్టుకోండి. పక్కన చలానా కట్టండి.’ అని రాసివున్న బోర్డు కనిపించింది. అతనితో పాటుగా వచ్చిన కొందరు 500 రూపాయలకి చలానా కట్టి, ‘ఇక్కడ ముద్దు పెట్టండి,’ అని బాణం వేసి చూపించిన చోట నేల మీదికి వంగి, ముద్దు పెట్టి వెళ్ళిపోవడాన్ని అతను చూశాడు. అంతమంది అలా ధరిత్రికి ముద్దులివ్వడం చూసి అతని కళ్లు కుండపోత వర్షాన్ని మామూలు పరిస్థితుల్లో అయితే కురిపించేవే గానీ ఈ చలానా విశేషమే ఆ మేఘాలని తరిమి కొట్టింది.

నిలబడి, ఈ తంతుని ఆశ్చర్యంగా చూస్తున్న బంగార్రాజుని చూసి, “ఏం సార్? మీకు జన్మభూమంటే గౌరవం లేదా?” అంటూ మనో వైజ్ఞానిక్ దబావ్‌ని ప్రదర్శించాడో యూనిఫాం వేసుకున్న వ్యక్తి.

“అందరూ ముద్దు పెట్టిన చోట నన్నెలా ముద్దు పెట్టమంటావయ్యా? వాళ్ల జెర్మ్స్ నాకు అంటి, లేనిపోని రోగాల్ని తెచ్చిపెడితే ఇక్కడున్న నాలుగురోజులూ మంచమ్మీదే గడపాల్సొస్తుంది,” అన్నాడు బంగార్రాజు.

“డెట్టాల్తో క్లీన్ చేస్తాం సార్. ఇంకొక అయిదొందలు అంతే!”

“ముద్దు పెట్టుకోవాల్సింది మట్టినయ్యా, మార్బుల్ ఫ్లోర్‌ని కాదు.”

(అతను చూసిన హిందీ సినిమాలో సూట్‌వాలా మొహానికి మట్టి అంటడం అతనికి ఇంకా గుర్తుంది. పైగా, ఆ బవిరిగడ్డంవాడు పిడికిలి లోంచి మట్టిని నేల మీదికి జారుస్తాడు కూడా ఏదో డైలాగ్ చెబుతూ.)

“మట్టి చల్లుతాం సార్. ఇంకో అయిదొందలు. అంతే. రెడీగ వుంది,” అని పక్కనే వున్న ఎర్ర బకెట్టుని చూపించాడు. అందులో మట్టో, ఇసకో వున్నమాట నిజమే గానీ, బంగార్రాజుకి మాత్రం దాన్ని చూడగానే రైల్వే స్టేషన్లలోనూ, బస్టాండుల్లోనూ, సినిమాహాళ్లల్లోనూ, ‘ఇక్కడ ఉమ్మివేయుము,’ అని రాసివున్న ఎర్ర బక్కెట్లు కళ్ల ముందు ప్రత్యక్షమై, అతన్ని నిలువెల్లా జలదరింపజేశాయి. ‘బాబోయ్!’ అని అరిచి అక్కణ్ణుంచి పరుగెత్తుకెళ్లి ఇమ్మిగ్రేషన్ లైన్లో పడ్డాడు.

అతనికి మళ్లీ ధరిత్రి గుర్తొచ్చింది ఇమ్మిగ్రేషన్ అయిన తరువాత లగేజ్ కోసం కన్వేయర్ బెల్ట్ దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు. లగేజ్‌ కోసం అతను ఎస్కలేటర్ మీద ఒక ఫ్లోర్ దిగి రావలసి వచ్చింది. చుట్టూ చూసి, ఇదీ నేలంటే! ఇదే ధరిత్రి అంటే! గ్రౌండ్ ఫ్లోర్! పై అంతస్తులో ‘నేలని ముద్దుపెట్టుకోండి’ అని చెప్పి మోసం చేస్తున్నారు అనుకున్నాడు. వంగి, ముద్దు పెట్టుకోవడానికి అనువయిన ధరిత్రి ఎక్కడయినా ఉన్నదేమోనని చుట్టూ కలియజూశాడు. ఇంతలో చిన్న గొడవ ఒకటి అతని దృష్టి నాకర్షించింది.

“ఎక్కడ పడితే అక్కడ నేలని ముద్దు పెట్టుకోకూడదు. ఈ ఎయిర్‌పోర్టుకి రూల్సున్నాయ్. ఫీజు ఎగ్గొడదామనే ఈ దొంగబుద్ధెందుకో. మళ్లీ డాలర్లల్లో సంపాదిస్తారు. పద. వెయ్యి రూపాయలు ఫైన్ కడుదువు గాని,” అని ఒక యూనిఫాం వ్యక్తి ఒకతన్ని చెయ్యి పట్టుకుని కౌంటర్ దగ్గరికి తీసుకెడుతున్నాడు. ఆ లాక్కెళ్లబడుతున్న వ్యక్తిని తన తల మీద కారీ-ఆన్ పడేసిన వ్యక్తిగా బంగార్రాజు గుర్తించాడు. తిక్క కుదిరింది వెధవకి, అనుకున్నాడు తల మీద బొప్పిని తడుముకుంటూ. ఆ ట్రీట్‌మెంటుని చూసినందుకో లేక మరెందువల్లనో గానీ ఇంకెవరూ అక్కడి నేలని ముద్దాడాలని తపిస్తున్నట్లు అతనికి కనిపించలేదు. ‘ఎట్లాగో ఈ ధరిత్రి మీద అడుగు పెట్టగానే ముద్దు పెట్టలేదు. వీలయినప్పుడు పెడతాను. ఇంక చేసేదేముంది?’ అని బంగార్రాజు సరిపుచ్చుకున్నాడు.

కస్టమ్స్ నించి బయట పడగానే బంగార్రాజుకి ధనలక్ష్మీ, బాబిగాడు, కత్రీనా, తల్లీ, అత్తమామలూ కనపడ్డారు. కత్రీనా కట్రీనాని తలపించేలా చికాగ్గా ఏడుస్తూ, తల్లి చంక దిగిపోతానంటోంది. వాళ్లిద్దరినీ కలిపి ఒకేసారి కావలించుకోగానే ధనలక్ష్మి అతనికి టూ లీటర్ వాటర్ బాటిల్ని అందించింది. తరువాత, పదేళ్ల బాబిగాడి తలని చేత్తో నిమురుతూ అలాగే పట్టుకుని తల్లిని కావలించుకుని, ఆమె రెండు బుగ్గలనీ ముద్దుల వర్షంలో ముంచేశాడు. ధనలక్ష్మిని చూడగానే నీళ్లని నింపుకున్న అతని కళ్లు, జననీ జన్మభూమిశ్చ పాట గుర్తొచ్చి తల్లి మీద కుంభవృష్టిని కురిపించాయి.

“ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటి ముద్దుల వర్షాన్ని నామీద కురిపించాడు. మళ్లీ ఇప్పుడు! నువ్విలాగే పదేళ్లకోసారి వస్తూండరా,” అన్నదతని తల్లి కళ్లని చీరెకొంగుతో ఒత్తుకుంటూ.

మిఠ్ఠీ – ధరిత్రి – జన్మభూమి అనుకుంటూ అతను నేల వైపు చూసేటంతలో, ధనలక్ష్మి, “అయ్యయ్యో! ఇది ఎట్లా కిందపడి పొర్లుతోందో చూడు. ఇదుగో, యాదమ్మా, దీన్ని ఎత్తుకుని రావే. ఆ వంటి నిండా మట్టితో దాన్ని నేను ముట్టుకోను. ఇంటికెళ్లి స్నానం చేయించిన తరువాత దాన్ని పడుకోబెట్టు,” అని ఆజ్ఞని జారీ చెయ్యడం వినిపించింది.

నేలకి బదులుగా కత్రీనా వంటిని అంటుకుని వున్న మిఠ్ఠీని ముద్దు పెట్టుకుంటే ఆ ధరిత్రిని ముద్దు పెట్టుకున్నట్లే గదా అన్న బ్రిలియంట్ ఐడియాతో అతను కత్రీనాని ముట్టుకోబోతుంటే, ధనలక్ష్మి అతన్ని ఇవతలకి లాగింది.

“ఒక రోజంతా ప్రయాణం చేసొచ్చావ్. నీ క్రిములని దానికంటించబోకు.”

“మరి, నువ్వు నన్ను ముట్టుకున్నావ్ గదా!”

“ఇది వేరు,” అంటూ అతని పెదాలతో తన పెదాలను కలపబోయింది. “అబ్బ! కంపు! అమెరికన్ ఎయిర్‌పోర్టుల్లో కనిపించే జంటల్లాగా ఎంచక్కా పెదాలు కలిపే ముద్దు కోసం ఎదురు చూస్తుంటే, లాండ్ అయ్యే ముందర పళ్లు తోముకుంటే ఏం పోయిందట?” అని చికాకుపడి సుతారంగా పెదాలని అతని పెదాలకి తాకించి దూరంగా జరిగింది.

బంగార్రాజు ఆమె కోపాన్ని పట్టించుకోక పోవడానికి కారణమయిన ధరిత్రికి అతను ఇవ్వాలనుకున్న ముద్దుని తలుచుకుని, నెల రోజులుంటాగా, ఈ ధరిత్రి ఎక్కడికీ పోదులే! అనుకుని ఎయిర్‌పోర్ట్ నించి అందరితో కలిసి బయటపడ్డాడు.

నెల రోజుల పాటు ఇండియాలో తిరిగాడన్న మాటే గానీ, ఎక్కడా అతనికి తన పెదాలతో నేలని తాకడానికి మనస్కరించలేదు. పొరబాటున దేన్నన్నా తాకగానే, హాండ్ శానిటైజర్‌ని చేతులకి రాసుకొమ్మనమని ధనలక్ష్మి అతనికి వెంటనే అందించేది. ధనలక్ష్మి పక్కన లేకపోయినా ఆమె కళ్లతో చూడడం అలవాటయినందువల్లనో ఏమో, ఎక్కడ చూసినా అతని కళ్లని ఎక్కువగా ఆకట్టుకొంది నేలమీది చెత్తా, చెదారం, కారాకిళ్లీ మరకలూను. ఆఖరికి, నిజంగా పుట్టిన చోటంటూ వెళ్లిన అతని అమ్మమ్మగారి ఊళ్లో కూడా అతని కోరికని నెరవేర్చుకోలేక పోయాడు. అక్కడ వాళ్ల సావిట్లో జంతువులు చేసిన రొచ్చుని చూస్తే అతనికి అక్కణ్ణుంచి ఎంత తొందరగా పారిపోదామా అని అనిపించింది. పోనీ తిరుపతి వెళ్లినప్పుడో? ఎంతయినా పుణ్యతీర్థం కూడాను అనుకున్నాడు గానీ అక్కడ రోజూ లక్షలమంది తిరుగుతారని తెలుకున్నాక ఆ ఆలోచననే దగ్గరికి రానివ్వలేదు. పైగా, వాళ్లు అక్కడ ఉన్నప్పుడు వర్షం కురిసి మడుగులు కట్టాయి కూడా. షూస్ వేసుకున్న కాళ్లతోనే వాటిని దాటుకుంటూ నడవడం కష్టమయితే ఇంక ముద్దెక్కడ పెట్టుకుంటాడు? హైదరాబాద్‌లో సరేసరి! చిన్న వర్షాలకే రోడ్లు కాస్తా చెరువులుగా మారతాయి. వర్షం కురవనప్పుడు? అని మీరడగొచ్చు. కాంపౌండ్ వాల్ దగ్గర్నుంచీ మొదలు పెట్టి అంతా గచ్చుమయం చేసిన (అతనున్న) ఇళ్లల్లో మట్టికి తావేదీ? బస్సులూ కార్లూ వెడుతూ ఇంట్లోకి విసిరేసిన దుమ్మునీ, ధూళినీ అతనెలా ముద్దు పెట్టుకుంటాడు, ధనలక్ష్మి ఎలా కుదరనిస్తుందీ?

నెల రోజులిట్టే గడిచిపోయి, బంగార్రాజు కుటుంబసమేతంగా అమెరికా వెళ్లే ఘడియ రానే వచ్చింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మిగ్రేషన్ అయిపోయి, విమానం ఎక్కడానికి వెయిట్ చేస్తున్నప్పుడు ఏదో కలకలం వినిపించి అటువైపు చూశాడు. ఎవరో ఒక ప్రయాణీకుణ్ణి ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వాళ్లు పట్టుకుని గదమాయిస్తున్నారు, ఇక్కడ ముద్దు పెట్టడానికి వీల్లేదంటూ. బంగార్రాజు అతణ్ణి వెంటనే గుర్తు పట్టాడు. వీడు నా ఫ్లయిట్ లోనే వచ్చాడు, అని ధనలక్ష్మికి చెప్పి, కుతూహలంతో వాళ్ల దగ్గరికి వెళ్లబోయాడు. ఇంతలో సెక్యూరిటీ మనుషుల చేతుల్లో ఉన్నతను కాస్తా వాడిపోయిన తోటకూర కాడలాగా వాళ్ల చేతుల్లోంచి కిందకు జారి నేలమీద వెల్లకిలా పడిపోయి గిలగిల కొట్టుకోవడం మొదలు పెట్టాడు. సెక్యూరిటీ వాళ్లు, అర్జెంటుగా డాక్టర్‌ని పిలవండి అని వాకీ-టాకీలో చెబుతూ అతణ్ణి వదిలిపెట్టారు. క్రింద పడ్డతను కాస్తా చటుక్కున బోర్లాపడి నేలని ముద్దు పెట్టుకుని గర్వంగా లేచి, కాలర్ ఎగరేసుకుంటూ అక్కణ్ణించి బయల్దేరి బంగార్రాజు కెదురొచ్చాడు.

“మీకు ధరిత్రిని ముద్దు పెట్టుకోవడానికి బయట నెలరోజుల అవకాశముండగా ఇక్కడ, ఇంత నాటకమాడడం…” అని మధ్యలోనే ఆగిపోయాడు బంగార్రాజు.

“నేను ఎయిర్‌పోర్టులో ముద్దు పెట్టుకోవాలని ప్రతిజ్ఞ చేశాను. లేకపోతే, ఫ్లయిట్ దిగినప్పుడు నాచేత వెయ్యిరూపాయల జరిమానా కట్టిస్తారా?” అని రుసరుసలాడుతూ అతను వెళ్లిపోయాడు.

అప్పటి దాకా ధరిత్రిని ముద్దు పెట్టుకోలేదన్న బంగార్రాజు పుండు మీద వాడెవడో అంత సునాయాసంగా ముద్దు పెట్టడం కారం జల్లినట్లనిపించింది. అలాగని ఆ కారాన్ని అంతమంది మధ్య తుడుచుకోనూ లేడు, ఆ పుండుని కడుక్కోనూ లేడు. వాళ్లెక్కబోయే విమానానికి నెక్స్ట్ స్టాప్ ఇండియా బయటేనని బంగార్రాజుకి తెలుసు. ఆ ఆలోచన రాగానే బంగార్రాజు కళ్లలోంచి చిరుజల్లు మొదలయింది. అతని వాలకాన్ని కనిబెట్టిన ధనలక్ష్మి అతను ఏమాలోచిస్తున్నాడో తెలుసుననుకుని, “గ్రీన్ కార్డ్ వచ్చిందిగా, ఈసారి పదేళ్లు ఆగక్కర్లేదు లెండి మళ్లీ రావడానికి,” అని చేతిలో రెడీగా పెట్టుకున్న హాండ్ టవల్ని అందిచ్చింది.

“ఐషూ, ఈ పాలిథీన్ కవర్లో ఏమిటిది?” అమెరికాలో ఇంటికి చేరిన వారం తరువాత ఒక సూట్‌కేసుని తెరిచినప్పుడు కనిపించిన కవర్ని చూపించి అడిగాడు బంగార్రాజు.

“అదా! హుసేన్ సాగర్లో నిమజ్జనం చెయ్యబోయేముందు వినాయకుడి వీపుని గోకి తెచ్చిన మట్టట. వచ్చేటప్పుడు మా అమ్మ ఇచ్చింది,” అన్నది ధనలక్ష్మి.

బంగార్రాజు ముందు ఆ పాలిథీన్ కవర్ని ముద్దు పెట్టుకోవడం ఏమిటో, తరువాత తనమీద ముద్దుల వర్షాన్ని ఎందుకు కురిపిస్తున్నాడో అర్థం కాకపోయినా, “ఐ లవ్యూ సో మచ్‌రా బంగారూ!” అన్నది ధనలక్ష్మి అతని కౌగిలిలో తడిసిపోతూ.
-------------------------------------------------------
రచన: తాడికొండ కె. శివకుమార శర్మ, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment