తోలుబొమ్మలాట – 01వ భాగం
సాహితీమిత్రులారా!
ప్రారంభం
శివరాత్రి దాటి వారం రోజులైనా చలి ఉరవడి ఇంకా అణగలేదు. రాత్రి నాలుగవ జామున్నించి విజృంభించి పొద్దు పొడిచి బారెడు ఎక్కేదాకా కొనసాగుతూనే ఉంది.
ఇంటి ముందరి వేపచెట్టు కింద నేలంతా రాలిన పండుటాకుల్తో పసుపు పచ్చని దుప్పటి పరచినట్టుగా ఉంది.
తూరుపు కొండలమీంచి ఉరకలేసి దిగివచ్చిన నీరెండ, ఆకులమీది మంచు తడిని సోకి వింతగా ప్రతిఫలిస్తోంది.
ఎండ పొడలో పొద్దుకు ఎదురుగా గొంతుక్కూచుని ఉన్నాడు షిండే గోవిందరావు. రెండు అరచేతుల్ని గుప్పెడుగా కర్రను ఊదుకొని, ముంజేతుల మీదుగా నుదురు ఆన్చి నేలను చూస్తూ నిశ్చలంగా ఉన్నాడు.
లేత ఎండ అతని శరీరాన్ని తడువుతూ ఉంది. చలి తాలూకు జలదరింపుల్ని సుతారంగా తుడిచేస్తూ ఉంది.
బాతిన నంబర్రాయిలా కూచుని ఉన్నాడు అతను.
వీధి కూడలిలోని వేదికమీంచి దిగివచ్చి గొంతుక్కూచున్న గాంధీ తాత విగ్రహంలా ఉన్నాడు.
ఆడవాళ్ళు ఇళ్ళ ముందు కసువూడుస్తున్నారు.
పొరక విసుర్లకు లేచిన దుమ్ము పైకి కదులుతూ ఎండదారుల్లో తెరలు తెరలుగా ఎగబాకుతోంది.
ప్లాస్టిక్ బిందెల్ని కావడి దబ్బకు ఇరువైపులా గుత్తులుగా వేలాడేసుకుని బస్సుమార్గం కేసి వెళుతున్నారు ఇద్దరు యువకులు.
వీధిలో కదులుతోన్న జీవన దృశ్యాల తాలూకు శబ్దాలేవీ గోవిందరావు తపస్సమాధిని భంగపరచలేక పోతున్నాయి.
మనస్సు లోపలి పొరల్లో రగులుతూ ఉన్న దృశ్యాలు బైటి ప్రపంచానికీ ఆయనకూ మధ్య తెరగడుతున్నాయి.
అంతలో – మనిషి నీడ ఒకటి ఆయన మీదుగా వాలి మెల్లిమెల్లిగా కదులుతూ … ఆయన వెనక భాగాన పొడవుగా సాగిపోతూ … నీడ తాలూకు శరీరం వచ్చి బారెడు దూరంలో ఆగింది.
కొన్ని క్షణాల మౌనం అనంతరం …
‘‘నాయనా! ఓ నాయినా!! ..’’ పిలుపు.
గోవిందరావు కళ్ళు తెరవలేదు.
మరో మలుపుకు కూడా తలెత్తి చూడలేదు.
పిల్చేది ఎవరో అర్థమవుతూనే ఉంది.
గొంతెత్తి సమాధానం ఇచ్చేందుకు మనస్సు సహకరించలేదు.
‘‘నిన్నే నాయనా!’’ మరో రెండడుగులు దగ్గరగా జరిగింది స్వరం.
అప్పుడు తలెత్తాడు ఆయన.
రెండు సార్లు రెప్పలు తాటించి ఎదురుగా ఉన్న కొడుకు కిరీటికేసి చూశాడు ‘ఏమి’టన్నట్టుగా.
కొంతసేపు తటపటాయించి తర్వాత మెల్లగా గొంతెత్తాడు కిరీటి. ‘‘వాల్లొచ్చినారు నాయనా!’’
గోవిందరావు నొసలు ముడివడింది.
‘‘మద్రాసు బేరగాల్లు … మునిరావు ఇంటికాడుండారు .. బేరం బాగుందెంట .. మంచి బొమ్మయితే పదైదొందల దాకా రేటు పలుకుతాందెంట … ఇంతకంటే మంచి ఛాన్సు రాదంటాడు మునిరావున్న …’’ చెప్పుకు పోతున్నాడు.
మళ్ళీ కళ్ళు మూసికొన్నాడు గోవిందరావు.
‘‘ఏం నాయనా మాట్లాడవూ?’’ కిరీటి గొంతులో తడిజీర.
తలెత్తి ఓసారి కొడుకు మొహంలోకి చూశాడు గోవిందరావు. వ్యక్తీకరణకు అందని భావాన్నేదో గుప్పిస్తూ చూపుల్ని మరోవైపుకు తిప్పుకున్నాడు.
కర్రను బలంగా నేలకు ఊదుకని, మోకాళ్ళు చిటపటలాడుతోండగా లేచి నిల్చున్నాడు.
కళ్ళు బైర్లు కమ్మినట్టయింది. ఒళ్ళంతా జివ్వున నీరసం ఆవహించింది. కద్ది క్షణాలు కర్రమీదనే భారాన్నిమోపి, తిమ్మిరెక్కిన కాళ్ళను నెమ్మదిగా కదిలిస్తూ తప్పటడుగులు వేశాడు.
అప్పటికే చలిపారిపోయి ఎండవేడిమి చురక్కిమంటోంది.
ఇంట్లోకి వెళుతోన్న తండ్రి ఉద్దేశం కిరీటికి బాగా అర్థమైంది.
‘‘నువ్వా బొమ్మలు అమ్మనీకుంటే నేను మందుదాగి సావాల …’’ చెప్పాడు వెనక నుంచి.
సమాధానమివ్వకుండా ఇంట్లోకి నడిచాడు గోవిందరావు.
దొడ్లో కెళ్ళి పళ్ళపొడిని అరచేతిలో రాల్చుకొని, వదులైన పళ్ళనూ, అవి ఊడినచోట చివుర్లనూ సుతారంగా వేలితో రుద్దసాగాడు.
కొడుకు పరిస్థితి దయనీయంగానే ఉంది.
సన్న సన్న అప్పులు ఒకదానికొకటి పెనవేసికొని ఉరితాడులా మెడకు బిగుసుకంటున్నాయి. బతికేందుక్కూడా కష్టంగానే ఉంది. తనతో విభేదించి వేరుకుంపటి పెట్టుకొని పదేళ్ళు కాపస్తోంది. తన ప్రాణంలాంటి తోలుబొమ్మలతో తను మాత్రం కూతురి వద్దే ఉంటున్నాడు.
ఇప్పుడు వాడి దృష్టి బొమ్మల మీద పడింది.
ఇరుగు పొరుగుల్లాగే తనూ వాటిని అమ్ముకొని కష్టాల్నించి బైటపడాలనుకుంటున్నాడు.
అందుకే నెల రోజులుగా పోరు బెడుతున్నాడు.
తుండుగుడ్డ తీసి మొహమ్మీది చెమటతో బాటు ఆలోచనల్ని కూడా తుడుచుకొనేందుకు ప్రయత్నిస్తూ ఇంట్లోకి నడిచాడు గోవిందరావు.
అడ్డగోడకు అవతల చెరోవైపు గోడకానుకొని కూచుని కన్పించారు కూతురు, అల్లుడు.
అప్పుడే బైట్నించి ఇంట్లోకి వచ్చింది మనవరాలు వనజ. ‘‘తాతా టీ’ అంటూ జాగ్రత్తగా పట్టుకొచ్చిన టీ గ్లాసు మీది కాగితాన్ని తీసివేసి గ్లాసును ఆయనకు అందించింది.
రోడ్డుదాకా వెళ్ళి రూపాయి పెట్టి టీ తెచ్చింది ఆమె.
టీ గుటకవేస్తూ ‘‘సుబ్బారావూ! విన్నెవా వాని మాటలు!’ అన్నాడు అల్లునికేసి తిరిగి.
‘‘ఆ …’’ పొడిగా సమాధానించాడు అంబోరు సుబ్బారావు.
‘‘ఈ రోజు, రేపు, చూసి ఇంట్లో దూరేట్టుండాడు .. విగ్రహాలను ఎత్తకపోయి అమ్ముకొనేట్టుండాడు …’’ కొడుకు ప్రవర్తనకు అర్థం చెబుతున్నాడు.
వెంటనే అందుకుంది ఆయన కూతురు కమలాబాయి. ‘‘అవున్నాయినా! నిజమే … ఏం జేస్తాడు మరి! వాని కడుపు గాల్తా ఉండె … నేదరి పిల్లోల్లను పస్తులు పడుకోబెట్టు కొంటాడా యేంది?’’ అంది. ‘‘మేమంటే అమ్మా బిడ్డలం కూలినాలిజేసి తిండికి సంపాదించుకొస్తాండం. వానింట్లో పనికి బోయేదెవురు సెప్పు?’’
‘‘అట్లంటే ఎట్లమ్మా! ఏదొక అవస్థపడి పెండ్లాం పిల్లోల్ల సాక్కోవాలి. బొమ్మలాట గాల్లంతా బొమ్మలమ్ముకనే బతుకుతున్నారా? బిందెల వ్యాపారమో … కూలి పనులో .. ఏదొక పని …’’ చెబుతూ చిన్నగా నిట్టూర్చాడు.
‘‘బొమ్మలమ్ముతే దుడ్డొస్తాది. తింటాడు … తిని తిరుగుతాడు … దుడ్డయి పోయినాంక .. మల్ల .. మల్లేమమ్మాల? .. నన్నమ్మినా దుడ్లొస్తాయంటే నన్నూ బేరం పెట్టేవాడే గదా!’’ ఆయన గొంతులో ఆవేదన సుడులు దిరిగింది.
‘‘తోలు బొమ్మలమ్మి దుడ్లు సంపాదించేది కూడా పక పురుషత్వమేనా? తోలు విగ్రహాలకు పానం బోయాల. తైతక్కలాడించాల. పూట గడుపుకోవాల. గ్లాసు పక్కన పెడుతూ ‘‘మీ పరిస్థితి మాత్రం ఏమంత బాగుందనీ! కూలికిబోతే కుండగాలాల. లేకుంటే ఎండ గాలాల. చేతినిండా విద్య ఉండీ ఎందుకమ్మా ఈ అగచాట్లన్నీ? అందుకే నాయినా – మీ చెయిన ఇల్లు గట్టుకొని గీపెడతావుండా … పెట్టె దించండి తల్లీ! వాడొచ్చి ఇంట్లో జొరబడక ముందే విగ్రహాల పెట్టె దించండి నాయినా… ఒక ప్రయత్నం చేసి చూద్దాం … తప్పేముంది?’’
వాళ్ళ నుంచి సమాధానం రాలేదు.
మరోసారి రెట్టించినా మౌనమే.
ఎందుకో తడబడుతున్నారు.
మరేదో సమాధానం చెప్పలేని అయోమయంతో కొట్టుమిట్టాడుతున్నారు.
కొద్దిసేపు వాళ్ళకేసి చెవులు విప్పార్చి, మెల్లిగా తలెత్తి తూర్పుగోడ కేసి చూశాడు గోవిందరావు.
అటక మీద పరుపు చుట్టలా ఐదడుగుల పొడవున పడుకొని ఉంది వెదురు తడికల పెట్టె. పాత పంచెగుడ్డతో దాన్ని కప్పి కట్టి ఉన్నారు. సన్నని బూజు, మసి దువ్వతో పురాతన వాసనలు చిమ్ముతూ ఉంది గుడ్డ. అక్కడక్కడా బట్ట చిరుగుల్లోంచి మాగిన రంగుతో జింకతోలు తాలూకు బొచ్చు కన్పిస్తూ ఉంది.
‘‘మన తాత ముత్తాతల్నుంచీ, మన అబ్బ ముదెబ్బల హయాం నుంచీ ఆ పెట్టెనే నమ్ముకొని బతికినారు .. ఎన్ని తరాలో … ఎన్నెన్ని తరాల్నుంచో మన పెద్దోల్లందర్నీ అదే సాకింది … మన హయామంతా దాన్నే నమ్ముకని బతికినాం. ఇప్పుడు మాత్రం మనకింత పిడచ పెట్టించదా సుబ్బారావూ! … ఇన్ని రోజుల్నుంచి మొత్తుకొని చెప్పినా మీ తలకెక్కలేదు గదబ్బీ!’’ ప్రాధేయ పూర్వకంగా అన్నాడు.
కళ్ళెత్తి ముసలాయన కేసి కొంతసేపు తదేకంగా చూశాడు సుబ్బారావు. ‘‘ఎందుకు మామా నీకు ఉత్త ఆశ?’’ అన్నాడు నిర్వేదంగా.
‘‘కిరీటి వాలకం సూస్తావుంటే దౌర్జన్యంగా విగ్రహాల్నెత్తకపోయి అమ్ముకనేట్టుండాడు .. అవునా కాదా? .. చెప్పండి .. మీక్కూడా లోపల్లోపల వాటిని అమ్మాలనే ఉన్నట్టుంది. మీ పాలిపచ్చే తృణమో ఫణమో ఒళ్ళోవేసుకుని అనుభవించాలని ఉంది .. కదూ! .. నా కర్థమయితా ఉందిలే … అయితే నాయినా! – నేనెన్నోసార్లు జెప్పింటా .. ఈ విగ్రహాలు అమ్మడమంటే నన్ను సంపి బాగాల్జేసి కుప్పల్లెక్కన అమ్ముకోవడమేనని .. ఇవి అమ్మనీకుంటే వాడు సస్తానంటాడు … అమ్ముతే నేన్జస్తబ్బీ! .. అందుకే చివరి ప్రయత్నం చేస్తాం నాయినా! చావడం కన్నా బతకడం గొప్పగదా! ఇన్ని తరాలుగా కూడుబెట్టిన విద్య ఇప్పుడెందుకు పెట్టించదో సూడాలబ్బీ!’’
కొంతసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
మెల్లిగా తలెత్తి గడ్డం కింద చేతులాన్చుకొని తండ్రికేసి తదేకంగా చూడసాగింది కమలాబాయి.
ఆయన చూపులు అటకమీదున్నాయి.
వెదురు దబ్బల పెట్టెలోకి ప్రవేశించేందుకు తహతహ లాడుతున్నాయి. పెట్టెకు ప్రాణ స్పందనల్ని పరిచయం చేసేందుకు కొట్టుకు లాడుతున్నాయి.
నెలకిందట ఆయనీ ప్రతిపాదన చేసినప్పుడు అన్ని ఆర్థిక బాధల్లోనూ తమకు ఆశ్చర్యం కలిగింది.
‘‘ముది మదితప్పి మాట్లాడటం లేదుగదా!’’ అన్పించింది.
నెల రోజులుగా ఇదే గొడవ.
ఆయనకు తోడు వెంకోజిబావా, రామోజి చిన్నాయనా.
వాళ్ళింకా పాతకాలం నాటి ఎండా వానల్లోనే తడుస్తూ ఆలోచిస్తున్నారు. మనిషి బతుకులో వచ్చిన మార్పునెందుకో అంగీకరించలేక పోతున్నారు. తమ కళను ఆదరించేంత మెత్తని ఎదలు ఇంకా పల్లెజనాలకు ఉన్నాయని నమ్ముతున్నారు.
వాళ్ళ ఆలోచనా విధానం అట్లా సాగటానికి కారణం తమ వైపున కూడా లోపాలుండటమే. వాళ్ళ ప్రతిపాదనను ఖండిస్తున్నారు తప్ప తాము మాత్రం మెరుగైన బతుకుదెరువును వెతుక్కోగలిగారా?
చివరి ప్రయత్నం చేద్దామంటున్నాడు ఆయన.
ఇన్ని రకాల జీవన పోరాటంలో జవసత్వాలుడిగి బాగా అలిసిపోయారు తాము.
ఆయన పట్టుదలను పూర్తిగా ఖండించేంత ధైర్యం కలగటం లేదు.
చూద్దాం – ఈ చివరి పోరాటాన్ని సైతం.
మెల్లిగా లేచి నిలబడింది ఆమె.
తండ్రి చూపులెంట పెట్టేదాకా కళ్ళెత్తింది.
గోడకానుకొని సందిగ్ధంగా కూచుని ఉన్న మొగునికేసి తిరిగింది.
‘‘రా … ఎట్టయితే అట్టయితది … దించుదాంరా!’’ పిల్చింది.
సుబ్బారావు కళ్ళనిండా ఆశ్చర్యం.
నమ్మలేనట్టుగా చూశాడు ఆమెకేసి.
‘‘దించడమంటే మాటలు గాదు. దించడానికెంత సేపు? .. నిమిసం పట్టదు … దించినాంక ఆడాల …బొమ్మలాట ఆడాల … ఆ … ’’ చెప్పాడు బెదిరిస్తున్నట్టుగా.
‘‘దించినాంకె ఊరకుంటామా?’’ నవ్వింది. ‘‘మన మాడించకున్నే అవే ఆడతాయిరా!’’
కూతురికేసి మెచ్చుకోలుగా చూశాడు గోవిందరావు.
‘ఇంకా ఆలస్యమెందు’కన్నట్టుగా అల్లునికేసి చూశాడు.
మరేమీ మాట్లాడలేదు సుబ్బారావు.
భార్య, తను చెరోవైపు పట్టి – మధ్యన కూతురు చేసాయం చేస్తోండగా అటకమీదున్న వెదురు తడికల పెట్టెను జాగ్రత్తగా కిందకు దించారు.
పెట్టె పైన దట్టంగా దుమ్ము పేరుకొని ఉంది. పొయ్యి నుంచి వచ్చే పొగతో కలిసి అది కర్దువ్వగా మారివుంది.
పాత గుడ్డ తెచ్చి దుమ్మునంతా రాలగొట్టింది వనజ.
అప్పటికే ముసలాయన పెట్టెను సమీపించి ఉన్నాడు.
దాని ముందు గొంతుక్కూచున్నాడు.
చేతులు చాచి ఆప్యాయంగా తడివాడు.
బొటనవేలి లావున్న గుడ్డపేలికల పగ్గంతో పెట్టెను ఆసాంతం చుట్టి కట్టి ఉన్నారు.
జాగ్రత్తగా దాన్ని విప్పి చుట్టచుట్టి గోడకున్న చీలకు తగిలించాడు సుబ్బారావు.
పెట్టెను కప్పి ఉన్న పంచెగుడ్డను తొలగిస్తోంటే – చీకు పట్టి ఉన్నందున అది పరపర చిరుగుతూ వచ్చింది.
గుడ్డ తొలగిన మేరా మాగుడు రంగుతో తడికల పెట్టెకు అంట గరిపించి ఉన్న జింక చర్మం పాత వాసన కొడుతూ …. చేయి తమకంతో తడువుతోంటే రంగుల బొచ్చు వూడుతూ …. పురాతన మార్మిక స్మృతుల్ని కదుపుతూ …. గోవిందరావు మునివేళ్ళకు పాతికేళ్ళ వయస్సు కిందటి స్పందనలు ఊపిరి పోసుకొంటూ ….
అల్లునితో కలిసి చెరోవైపు పట్టుకని పెట్టె మూతను అటు ఇటు కదిపి సుతారంగా పైకిలేపి పక్కన పెట్టి ….
ఆతృతగా …. తాను దాచిన నిధి నిక్షేపాలు కుదురుగా ఉన్నాయో లేవోనని వెదకుతోన్నట్టుగా …. కళ్ళు చికిలించి …. హృదయాన్ని పలికించి …. పణికే శరీరంతో పెట్టె లోపలికి తొంగిచూస్తూ ….
పెట్టెనిండా పడుకని ఉన్నాయి తోలు విగ్రహాలు …. వినాయకుడు, చదువుల తల్లి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు .. రామకృష్ణులూ …. రావణ, దుర్యోధన, మైరావణ, ఆంజనేయ, భీమార్జున జరాసంధ …. సీతమ్మ తల్లి, రుక్మిణి, సత్యభామ …. బంగారక్క, జుట్టుపోలుగాడు. కేతిగాడు …. వగైరా మూర్తులు .. నిశ్శబ్దంగా పడుకని …. వాళ్ళ శరీరాలకు నెత్తురు మాంసాలిచ్చే వాళ్ళులేక .. వాళ్ళ గొంతుకు శబ్దాలిచ్చే వాళ్ళులేక …. వాళ్ళ జీవితాలకు కథలిచ్చే వాళ్ళు లేక …. దీర్ఘ నిద్రలో …. సుదీర్ఘమైన నిద్రలో ….
బొమ్మల పైన్నే నోటు పుస్తకాల దొంతర …. జింక చర్మం అట్టలుగా కుట్టిన రాతకాగితాల దొంతర .. ద్విపద రూపంలోని బొమ్మలాట కథల్ని మోసి మోసి పెళుసెక్కి రంగుమారిన కాగితాలున్న రాతపుస్తకాల్ని ఎదలమీదుంచుకొని …. వాళ్ళ ఊపిరుల్లాంటి శబ్ద సంచయం కలిగిన పుస్తకాల్ని నిశ్శబ్దంగా మోస్తూ ….
రాత పుస్తకాల్ని తీసి పక్కన పెట్టేందుకు సుబ్బారావు ప్రయత్నిస్తోంటే – ‘‘ఒరే నాయినా! జాగ్రత్త …. కాగితాలు ఇరికిపోతాయి’’ హెచ్చరించాడు గోవిందరావు.
తోలు బొమ్మల్ని తడువుతూ ఉంటే ఆయన మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది …. డేరా కట్టటం, బొమ్మలు తెరకెత్తటం …. ఆడించటం …. తోలుతో బొమ్మను తయారుచేయటం ….
గంభీరమైన ఓ తోలు బొమ్మను పట్టి పైకిలేపుతూ ‘‘రామాయ.. రామభద్రాయ.. రామచంద్రాయ వేదసే.. శ్రీరామ చంద్రుల వారు.. ఈ విగ్రహాన్ని అక్కింగుండ్ల చెన్నారెడ్డి రాయించినాడు. మహానుభావుడు.. మేకపోతునిచ్చి, ఉప్పు పప్పు సంభావనలిచ్చి. రంగులకు దుడ్డిచ్చి .. నా హయాంలోనే రాయించినాడు మారాజు..’’ చెప్పాడు.
బొమ్మలన్నిట్ని ఒక్కొక్కదాన్ని బైటపెడుతూ, దుమ్ము దులుపుతూ, కీళ్ళు ఊడిన చేతుల్ని కాళ్ళను జాగ్రత్తగా అంటగలుపుతూ, వ్యాఖ్యానిస్తూ …. ప్రపంచాన్ని మరచిపోయాడు ముసలాయన.
సద్దన్నానికి పిలుపు రావటంతో సుబ్బారావు లేచి లోనికెళ్ళాడు.
గోవిందరావు మాత్రం కదల్లేదు.
కూతురు పిల్చినా పట్టించుకోలేదు.
మనవరాలు ప్రాధేయపడినా లేవలేదు.
‘‘తెరమీదకెత్తుతే ఈ విగ్రహం ఎంత ఉగ్రంగా ఉంటుందను కున్నెవురా సిన్నోడా! పిల్లలయితే జడుసుకుంటారనుకో.. సీతమ్మ వారి సుట్టూ కావిలున్నె రాకాసి మూకలకు పెద్ద ఇది..’’
వినాలని కుతూహలంగానే ఉంది వనజకు.
ఆకలితో నకనకలాడే పేగులు ఆమెనక్కడ నిలబడనీలేదు.
సద్దన్నం తింటూ ముసలాయన ఆనందం వింటూ ఉండబట్టలేక పళ్ళెంతో సహా ఇవతలికి వచ్చాడు సుబ్బారావు. ‘‘కథ మర్చి పోయినాము.. అడుగులూ తాళమూ .. అన్నీ పాతబడినాయి … గొంతు కూడా మనమాట వింటుదనే నమ్మకం లేదు. ఆడగలమా మామా? నాకయితే నమ్మకం లేదబ్బా’’! అన్నాడు.
అతనికేసి వింతగా చూశాడు గోవిందరావు.
నమ్మలేనట్టుగా చూశాడు.
‘‘మనం పుట్టింది బొమ్మలాటగాల్లకురా నాయాలా!’’ అన్నాడు రోషంగా.
‘‘మన అమ్మా నాయినోల్లు సచ్చేదాకా ఆడతానే ఉన్నేరు. గుర్తు లేదా? మీ నాయనైతే మరీ …. ఆడతా ఆడతా .. ఆంజనేయస్వామి చేత లంకాదహనం సేయిస్తా .. స్టేజి మీదనే పానాలిడ్సిండు …. ఆట మధ్యన ఆపితే గ్రామానికి అరిష్టమనీ, మీనా వంగడ బిగదీసి కరువు కడుతుందనీ సావు సంగతి బైటికి పొక్కకుండా తెల్లార్లూ ఆటాడినం .. గుర్తులేదా! .. బొమ్మలాట గాల్లంరా మనం ….బొమ్మను పట్టుకొంటే పూనకమొచ్చినట్టు కథా, పాటా, మాటా, గజ్జెల అడుగులూ, తాళాల లయా …. అన్నీ పరిగెత్తుకంటారావా! పిరికి మాటలు మాట్లాడ్తావు గదరా నాయాలా!’’ అంటూ పెట్టెలోని ఓ బొమ్మను చేతికి తీసికొన్నాడు.
‘‘సీతమ్మ వారు. అశోక వనంలో రావణాసురునికి నీతుల్జెప్పిన సీతమ్మ తల్లి విగ్రహం.
ఒక లంక యేలుచు నుబ్బెదవీవు – సకల లోకాలకు స్వామి రాఘవుడు.
అఖిల కంటకుడవీవన్ని లోకముల – నఖిల లోకారాధ్యుడా రాఘవుండు.
వేదచోరుడవివేకివి నీవు – వేదంబులకు నెల్ల వేద్యుండతండు.
కర్మ పూరిత ఘన కాయుండవీవు – నిర్మల గుణ యశోనిధి రాఘవుండు
నిన్నిట మర్దించి నీరూపమణచి – నన్ను దోడ్కొనిపోవు నమ్ము రాక్షసుడ.
తరమెరుంగక రామ ధరణీశుతోడ – దొరలితే భస్మమై త్రుంగెదుగాక’’
ద్విపదను రాగయుక్తంగా పాడుతున్నాడు. లయబదర్ధగా చిటుకలు వేస్తూ రాగం తీస్తున్నాడు.
వీధిలోంచి ఎవరైనా వస్తారేమోనని అనుమానంగా తొంగి చూసింది కమలాబాయి.
బొమ్మలు దించిన సంగతీ, ఆటాడేందుకు పల్లెకు వెళ్ళబోతున్నామనే విషయమూ తెలిస్తే నవ్వుకొంటారు కాబోలు …. ఈనాటికి కూడా బొమ్మల్ని ఆడించి బతకాలని చూడటం అనాగరిక చర్యగా కూడా భావిస్తారేమో!
పాట ఆపి ముసలాయన తన పని తాను చేసుకుపోతున్నాడు.
భోంచేసి బైటకు నడిచాడు సుబ్బారావు.
బీడీ అంటించి రెండు దమ్ములు పెరికి మళ్ళీ లోపలికి వచ్చాడు.
ముసలాయన ఇంకా బొమ్మల్ని సవరిస్తూనే ఉన్నాడు. గ్రంథాలు చదివినట్టు వాటిని దీక్షగా పరిశీలిస్తున్నాడు. మధ్యమధ్యన ఏదేదో గొణుక్కొంటున్నాడు.
మనవరాలు అతని దగ్గరగా కూచుంది.
తాత చర్యల్ని ఆసక్తిగా గమనిస్తోంది.
‘‘మీ అమ్మ నీ అంతున్నప్పుడు జోరుగా ఆడతాంటిమి. మీ అవ్వ అమ్మ లిద్దరూ స్త్రీ విగ్రహాలు ఎత్తుకొని ఆడతాండిరి. మీ అమ్మ గొంతు ఎంత ఇంపుగా వుండె నాయినా….! ‘‘తనలో తనే గొణుక్కొంటున్నట్టుగా ఆమెకు చెబుతున్నాడు. స్మృతుల్ని కెలుక్కొంటున్నాడు.
గోడ వారగా నేలమీద కూచున్నాడు సుబ్బారావు.
ముసలాయన చేసే పనికేసి తదేకంగా చూడసాగాడు.
ముసలాయన్ను ముంచెత్తుతూ ఉన్న అంతుతెలీని ఆనందమేదో సుబ్బారావుకు ససేమిరా అర్థం కావటం లేదు. బొమ్మలతో ఎట్లా అన్నం పుట్టించాలనుకంటున్నాడో అవగాహనకు రావటం లేదు.
బొమ్మలతో అన్నం పుట్టించే మార్గం వేరే ఉంది. ఆ దారి గురించి కిరీటి పోరాడుతున్నాడు. తను కూడా ఆ మార్గాన్ని గురించే సూచాయగా చెబుతున్నాడు. తమ వద్దనున్న తోలుబోమ్మలన్నిట్నీ మద్రాసు వ్యాపారస్తులకు అమ్మితే యాభై వేలకు పైగా డబ్బొస్తుంది. దాంతో ఏదైనా వ్యాపారం చేసుకు బతకొచ్చు.
బొమ్మల్ని అమ్మే మాటెత్తితే చాలు మండిపడుతున్నాడు ఆయన. తరతరాలుగా కూడబెట్టుకుంటూ వచ్చిన ఆస్తిట అది. తమ బతుకుదెరువుకు మార్గాలుగా నిల్చిన కరముట్లుట అవి. తనను చంపి వాటిని అమ్మమంటాడు. ఇరుగు పొరుగులు బొమ్మల్ని అమ్మి ఆ సొమ్ముతో సుఖంగా బతకటాన్ని తీవ్రంగా ఖండిస్తాడు. ఛీత్కరిస్తాడు …. తార్పుడు వ్యవహారంగా దూషిస్తాడు. ఆ బొమ్మలు తమను పెంచి పోషించిన తల్లిదండ్రులంటాడు. తమకు చదువులు సేర్పిన గురువులంటాడు. తమ సమస్తం అవేనంటాడు.
బొమ్మల్ని గురించి కదిలిస్తే చాలు – తరతరాలుగా వాటి తోటి సంబంధాల్ని గురించిన కథలన్నీ చెప్పుకొస్తాడు. పెద్ద శెట్టి గార్ల గౌరవాలూ, మన్ననలూ, మర్యాదలూ, సంభావనలూ పురాణంలా విప్పుతాడు.
ఇంత కష్టకాలంలో కూడా అతను మనస్సు మార్చుకోలేదు.
తిండికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.
పస్తులున్న దినాలు జీవితాల మీద క్రూరంగా దాడిచేశాయి.
చిన్న చిన్న అప్పులే రానురాను మెడల మీద కొండంత బరువులై, వీపులు వంగిపోయి, నడుములు కుంగిపోయి …. నడిచేందుక్కూడా చేతగాక …. బతికేందుకు మార్గంలేక .. బతుక్కంటే చావే సుఖంగా అన్పిస్తోన్న తరుణంలో …. బొమ్మల్ని అమ్మేందుకు కిరీటి చేస్తోన్న ప్రయత్నాల్ని సమర్థించటం తప్పులేదని తామనుకొంటోన్న తరుణంలో …. ముసలాయన కొత్త ప్రతిపాదన ….
‘పల్లెకు వెళ్ళి బొమ్మలాట ఆడాలిట’
ఆయన ధైర్యమేమిటో అర్థంగాకుండా ఉంది.
పుస్తకంలోని కాగితాలు విరిగిపోకుండా జాగ్రత్తగా పేజీలు తిప్పుతూ కళ్ళు చికిలించి చూస్తూ అక్కడక్కడా గొంతెత్తి పాడుతున్నాడు ఆయన. పుస్తకాన్ని చూడకుండా కథను కొనసాగించేందుక్కూడా ప్రయత్నిస్తున్నాడు.
పాత రోజులు గుర్తు కొచ్చాయి సుబ్బారావుకు.
బొమ్మలాటలు జోరుగా ఆడే కాలాల్లో పగలంతా తామిట్లే మననం చేసికొనే వాళ్ళు. రిహార్సల్స్ వేసికొనే వాళ్ళు. ఆ వాతావరణాన్ని మళ్ళీ సృష్టించుకొంటున్నాడు ఆయన. తమ రోజువారి సహజ జీవన వ్యాపారంలా సాధారణంగానే స్పందిస్తున్నాడు. బొమ్మలాట ఆడబోవటం కొత్తగా, వింతగా అనుభూతించటం లేదు. బొమ్మల్లో అంతగా లీనమై పోయాడు. పాతకాలం నాటి వాతావరణాన్ని తన చుట్టూ సజీవంగా నిలుపుకొన్నట్టుంది. బొమ్మలాడే ప్రకృతిలో మమేకమైపోయాడు.
ఈ వ్యవహారమంతా ససేమిరా మింగుడు పడటం లేదు సుబ్బారావుకు. బొమ్మల్ని ఎత్తుకొని పల్లెకు వెళ్ళటం పల్లె జనానికి కొత్తగా పరిచయం చేయటం, ఆటకోసం వాళ్ళను పప్పించటం …. ఇవన్నీ మామూలుగా జరిగే పనులుగా అతని మనస్సు ఏ మాత్రం నమ్మటం లేదు – ఏదొక అద్భుతం జరిగితే తప్ప.
------------------------------------------------------
రచన: సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment