Sunday, September 16, 2018

నీళ్ళు(కథ)


నీళ్ళు(కథ)



సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..............
“దీన్నిండా తప్పులే… మళ్ళీ వ్రాసుకురా… నీకు తెలియకపోతే నీ సీనియర్‌ని కన్సల్టు చెయ్యి. మరో అరగంటలో ఇది కావాలి… ” అన్నాడు ఆఫీసరు, జోగినాధం అంతకుముందు తయారుచేసిన డ్రాఫ్టు మళ్ళీ అతని చేతికి అందిస్తూ.

జోగినాధం వినయంగా “అలాగేనండీ” అంటూ ఆ కాయితం అందుకున్నాడు. గది దాటి యివతలకి వచ్చేసరికి అక్కడే లోపలికి వెళ్లేందుకు కాబోలు నిరీక్షిస్తూ నిలబడి ఉన్న కుసుమ అతనికి కనిపించింది. ఆమె ఆఫీసరుగారి మాటలు వినే ఉండాలి, అందుకు నిదర్శనం ఆమె అతని వంక చూసి నవ్విన నవ్వు.

ఉమాపతి తన సీట్లో తీరికగా కూర్చుని ఉండి కళ్ళెగరేసి “ఆ కాయితం మళ్ళీ నీ చేతుల్లోకే వచ్చిందేమిటయ్యా మహానుభావా?” అని అడిగాడు.

జోగినాధం మొహం తుడుచుకుని సిగ్గుపడుతూ “దీన్నిండా తప్పులున్నాయిట… మళ్ళీ రాసుకు రమ్మన్నారు.” అని చెప్పాడు.

ప్రక్కనే కూర్చుని ఏదో ఫైలు తిరగేస్తున్న లక్ష్మీపతి తల ఎత్తి చూసి “ఉద్యోగంలో చేరి నెల పదిహేను రోజులే కదా అయింది? ఏవో చిన్న చిన్న తప్పులుంటే తాను దిద్ది టైపిస్టు కివ్వగూడదూ? అంతా హోషులే బ్రదర్… ఆ కుర్చీ అటువంటిది” అన్నాడు.

ఉమాపతి “సరే… ఇకనేం? ఆ కాయితం యిలా తీసుకురా… గబగబా ఏదో గిలికి యిచ్చి పెందలాడి బయట పడిపోదాం… అన్నట్టు యివాళ సినిమా ప్రొగ్రాం కూడా ఉంది.” అన్నాడు.

జోగినాధం ఆ కాయితం ఉమాపతికి అందించి అతని ముందు కుర్చీలో కూర్చుని “మీ యిద్దరూ సినిమాకు వెడుతున్నారా?” అని అడిగాడు.

ఉమాపతి, లక్ష్మీపతి వంక చూశాడు. లక్ష్మీపతి కూడా ఆ ప్రశ్న విని జోగినాధం వైపు చూశాడు. అతడు విసుగుతో జోగినాధాన్ని ఉద్దేశించి “నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదోయ్… మనం ముగ్గురం ఒకే రూములో ఉంటూ ఒకే హోటల్లో భోజనం చేస్తున్నాము… అయినా నువ్వు అదేమిటో అంటీ అంటనట్టు ప్రవర్తిస్తూ ఉంటావు. మొన్న నొకసారి కూడా యిలాగే సినిమాకు పోదాం రమ్మంటే, రానంటే రాను పొమ్మన్నావు. అలా స్నేహపూర్వకంగా అడిగినప్పుడు మొహంమీద కొట్టినట్టు రాను పొమ్మంటే ఎలా ఉంటుందో ఆలోచించావా?” అన్నాడు.

ఉమాపతి “ఎందుకులే బ్రదర్! అతని తీరు తెలిసి వచ్చింది కదా! ఇక ఏమీ మాట్లాడక వూరుకో!” అని తాను పనిలో మునిగిపోయాడు.

జోగినాధం యిరుకున పడ్డాడు. అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని “క్షమించండి” అనగలిగాడు. ఉమాపతి వినిపించుకున్నట్టు లేదు.

మరో అయిదు నిమిషాల్లో ఉమాపతి తాను తయారు చేసిన కొత్త డ్రాఫ్టు జోగినాధం ముందు పడేసి లేచి నుంచుని జేబులు సర్ధుకుని లక్ష్మీపతి నుద్దేశించి “త్వరగా తెమలవోయ్” అన్నాడు. లక్ష్మీపతి ఫైలు మడిచి అవతల పడేసి “నేను సిద్ధమే” అంటూ లేచి మళ్ళీ జోగినాధం వంక చూసి “మరి ఈయనగారి మాటేమిటి?” అని అడిగాడు. ఉమాపతి జేబుల్లో చేతులుంచుకుని జోగినాధం వంక తిరిగి “ఏమంటావు?” అని అడిగాడు.

అతడు కాయితం మడతపెడుతూ లేచి నుంచుని “నేనెందుకు లెండి బాబూ! మిరిద్దరూ వెళ్లిరండి. నేను రూములోనే వుంటాను.” అన్నాడు.

ఉమాపతి కొద్దిగా కోపం తెచ్చుకుని అడుగులు ముందుకు వేశాడు. లక్ష్మీపతి సీటులోనుంచి లేచి యివతలకి వస్తూ “ఏం? మాతో రావడం యిష్టం లేదా నీకు?” అని అడిగాడు.

జోగినాధం నీళ్ళు నవులుతూ “పతీ! నా దగ్గర డబ్బు…” అంటూ ఆగిపోయాడు.

అంతలోనే అందుకుని లక్ష్మీపతి “భలేవాడివే జోగినాధం! నీ దగ్గర డబ్బు వుంటేమటుకు నిన్ను టిక్కెట్లు కొననిస్తామా? మరేమిటో అనుకున్నాను. అదా నీ సందేహం? ఊఁ! ఇకనైనా బయలుదేరు. డబ్బు మా దగ్గర వుందిలే…” అన్నాడు.

జోగినాధం “అది కాదండీ బాబూ! మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను రానుగాని, నన్ను విసిగించక మీరు వెళ్లిరండి…” అన్నాడు విసుగుతో.

ఉమాపతి నిష్ఠూరపడుతూ “అదయ్యా! సంగతి… డబ్బును గురించి ఎంతమాత్రం కాదు. కేవలం ‘యీ జులాయి వెధవలతో ఎందుకు తిరగాలీ’… అని అతని బాధ. అతను బుద్ధిమంతుడు. జాగ్రత్తపరుడు… సినిమాలూ షికార్లూ అతనికి గిట్టవు. కాబట్టి యికమీదటనైనా మనం అతన్ని పిలిచి అవమానం చెందక్కరలేదు. అర్థమయిందా? పోదాంపద…” అన్నాడు.

లక్ష్మీపతి “అదీ నిజమే. ఇవాళ మనం సినిమాకు తీసుకువెడతామంటే వెంటనే వస్తే, మళ్ళీ తనెప్పుడైనా ఆ మాట అనవలసి వస్తుందేమోనని దిగులు కూడా ననుకుంటాను.” అంటూ జేబులోనుంచి తాళంచెవులు తీసి బల్లమీదికి విసిరి “అయ్యా! జోగినాధంగారూ, ఇవిగో రూము తాళాలు. మేము వెళ్ళొస్తాం…” అన్నాడు.

మరుక్షణంలో వారిద్దరూ చేతులు కలుపుకుని బయటకి వెళ్లిపోయారు. జోగినాధం మనస్సు చివుక్కుమన్నది. లక్ష్మీపతి ఎంత మాట అన్నాడు! తమతో కలసి సినిమాలకూ షికార్లకూ రానంత మాత్రంలో అంత మాట అనడమేనా?

అతడు చుట్టూ చూశాడు. అప్పటికే అంతవరకూ అక్కడవున్న యితర గుమాస్తాలు కూడా వెళ్లిపోయారు. మూలగా కుసుమ ఒక్కతే మాత్రం తన సీటులో కూర్చుని ఏదో కాయితం టైపు చేస్తున్నది. జోగినాధం వుండి వుండి ఆమెవైపు చూస్తూ ఆఫీసరు గదిలోనుంచి పిలుపుకోసం ఎదురు చూస్తున్నాడు.

అంతలో అతనికి దూరంగా కిటికీలో ఎత్తుగా ఉంచబడిన నీళ్ళ కూజా కనిపించింది. నీళ్లు మరింత చల్లగా వుండటం కోసం దాని చుట్టూ జనపనార తాడు అల్లివుంచారు. దాని పక్కనే రెండు గాజు గ్లాసులున్నాయి.

జోగినాధం నెమ్మదిగా లేచి వెళ్లి శుభ్రంగా తళతళలాడుతున్న గ్లాసును చేతిలోకి తీసుకుని దాన్ని నీళ్ళతో నింపి చెయ్యి పైకెత్తి ఒక్క నిముషం సేపు దానివంక కన్నార్పకుండా చూశాడు. గ్లాసులో నీళ్లు తెల్లగా మిలమిల లాడుతున్నాయి. అటువైపునుంచి ప్రసర్తిస్తున్న వెలుగు కిరణాలవల్ల అవి క్షణక్షణానికీ మరింత మెరిసిపోతున్నాయి. అతడు నెమ్మదిగా ఆ గ్లాసు నోటిదగ్గర వుంచుకుని గుక్క తర్వాత గుక్కగా నింపాదిగా తాగాడు. తర్వాత గ్లాసు అక్కడ వుంచి మూతి తుడుచుకుంటూ తలతిప్పి చూసేసరికి తన వంకనే కన్నార్పకుండా చూస్తున్న కుసుమ కనిపించింది. అతడు సిగ్గుపడిపోయి త్వరత్వరగా తన సీటులోకి వెళ్లి కూర్చున్నాడు. కుసుమ అంతవరకూ యీ తంతు అంతా తన పని ఆపుకుని మరీ చూసింది కాబోలు. అతడు కుర్చీలో కూర్చోగానే మళ్లీ టైపు శబ్దం ప్రారంభమైంది.

కొద్ది నిమిషాల తర్వాత ఆఫీసరుగారి గదిలో బెల్ మ్రోగింది. కుసుమ గబగబా లేచి లోపలికి వెళ్లి మళ్లీ వెంటనే తిరిగి వచ్చి జోగినాధంతో “మిమ్మల్ని పిలుస్తున్నారు…” అన్నది.

జోగినాధం కాయితం చేతిలోకి తీసుకుని ఒక్క ఉదుటున లేచి వెళ్లి ఆఫీసరుగారి ముందు నిలబడ్డాడు. ఆయన అతని చేతిలో కాయితం అందుకుని చూసి తలయెత్తి “ఊఁ! ఎవరిని కన్సల్టు చేశావు?” అని అడిగాడు.

జోగినాధం నెమ్మదిగా “ఉమాపతి వ్రాసి యిచ్చాడండీ…” అని చెప్పాడు.

ఆయన చురుకుగా చూసి “అలాగా! చూడు జోగినాధం! నువ్వు అలా ఉన్న విషయం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని ఒక్క సంగతి గుర్తుపెట్టుకో. అతను గ్రాడ్యుయేటు. పైగా అనుభవం ఉన్నవాడు. అత నీనాడు నీకు స్నేహితుడు కాబట్టి సహాయం చెయ్యడం బాగానే ఉంది. కానీ ఎన్నాళ్లిలా? నువ్వు కొత్తవాడివి. పైగా నీకు చదువు తక్కువే. అయినా నువ్వు కొంచెం చొరవ తీసుకుని పనిలో అభివృద్ధి చూపించాలి. వారిమీదా వీరిమీదా కొత్తల్లో ఆధారపడటం తప్పేమీ కాదు. వాళ్లు సహాయం చెయ్యటమూ తప్పు కాదు. కాని నువ్వుకూడా స్వతంత్రించి కొంచెం యింప్రువ్‌మెంట్ సాధించాలి. నాలుగు వాక్యాలు స్వంతంగా తప్పులులేకుండా వ్రాయడం బ్రహ్మ విద్యేమీ కాదు. సరే… నువ్విక వెళ్ళు… ఆ టైపిస్టును రమ్మని చెప్పు… ఈ కాయితం యివాళ వెళ్లిపోవాలి…” అన్నాడు.

జోగినాధం తలవూపి యివతలికి వచ్చి కుసుమ నుద్దేశించి “మిమ్మల్ని పిలుస్తున్నారండీ…” అని చెప్పాడు. ఆమె లేచి ఆఫీసరు గదిలోకి వెళ్లింది.

జోగినాధం టైపుమెషిను దగ్గర నిలబడ్డాడు. కన్నార్పకుండా దానివంకకే చూశాడు. కుసుమ లోపల ఆఫీసరుగారి గదిలో “అలాగేనండీ… యిప్పుడే చేసియిస్తాను.” అంటున్నది. అతడు టైపుమిషను దగ్గరగా జరిగి ఒకవిధమైన చాపల్యంతో వ్రేలు కదిపి ఒక మీట నొక్కాడు. లోపల కాయితం చుట్టివున్న సిలిండరు ‘ధన్’మని పెద్ద శబ్దం చేస్తూ మరో వైపుకు కదిలింది. అతడు అదిరిపడ్డాడు.

అంతలో కుసుమ చేతిలో కాయితంతో వచ్చి “అదేమిటి? టాట్యులేటర్ నొక్కారా? అలాచేస్తే మెషిను పాడైపోతుంది. మీరిలా కూర్చోండి… మీ కాయితమే యిది. ఇప్పుడే ఆఫీసరుగారికి అందించాలి… ఆ తర్వాత యిద్దరం కలిసే వెడదాం…” అంటూ కూర్చుని తనపనిలో నిమగ్నురాలయింది. జోగినాధం “అలాగే నండీ” అంటూ తలవూపి ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతనితో కుసుమ యిదే మొదటిసారి మాట్లాడటం.

జోగినాధం కనురెప్పపాటు అయినా లేకుండా చూస్తూ కూర్చున్నాడు. అతనికి కుసుమ నైపుణ్యం అబ్బురం కలిగించింది. ఆమె పలుచని బంగారు రంగు వేళ్లు టైపుమెషిను మీద వేగంగా అందంగా కదులుతున్నాయి. ఆ కళ్ళలో ఏదో మంత్రశక్తి ఉన్నట్టు అనిపించిందతనికి. తాను పుట్టినప్పటినుంచీ పద్దేనిమిదేళ్ళ వరకూ – అంటే స్కూల్ ఫైనల్ పాసయ్యే వరకూ – ఉన్నది గుంటూరు జిల్లాలో ఒకమారుమూల పల్లెటూళ్ళో. తాను ఎనిమిదవ తరగతి వరకూ చదువుకున్నది పక్కవూరిలోని మిడిల్ స్కూల్లో. ఆ వూరు కూడా పెద్దదేమీ కాదు. తన మిడిల్ స్కూల్ చదువు పూర్తికాగానే తన తల్లి యింక చదువు మానుకోమన్నది. కాని, ఆ సంవత్సరంనుంచి స్కూల్ ఫైనల్ వరకూ పై తరగతులు కూడా ఏర్పాటు చేసి ఆ స్కూల్‌ను హైస్కూలుగా మార్చారు. ఆ సదుపాయం రావడంతో అతని తల్లి మనసు మార్చుకుని ఊరు విడిచి ఎక్కడికీ పోనక్కర లేదుకదా అనే ఆలోచనతో మళ్లీ ఫోర్తుఫారంలో చేరమన్నది. ఆ విధంగా అతడు, రెండు నెలల క్రిందట యీ ఉద్యోగం వచ్చేవరకూ, రైలు ప్రయాణం కూడా ఎన్నడూ చేయలేదు. ఇప్పుడు మెషిను ముందు కూర్చుని ‘చకచక’ టైపు చేస్తున్న కుసుమను చూస్తూవుంటే ఎంతో గొప్పగా వింతగా వుంది.

ఆమె ఆ కాయితం పూర్తి చేసి ఆఫీసరు గదిలోకి వెళ్లింది. జోగినాధం లేచి మంచినీళ్ళ కూజా దగ్గరికి వెళ్లి మూతతీసి లోపలి నీటివంక ఒక్కక్షణం చూశాడు. అలా చూస్తూ వుండగానే – తనవూరిలో… తన చినచెల్లెలు దాహంతో బాధపడుతూ కూర్చునివుంది. ఎండ నిప్పులు చెరుగుతున్నది. వెచ్చని గాలి రివ్వున వీస్తున్నది. యింటి ముందు బయట ప్రదేశంలో దూరంగా సుడిగాలి గిర్రున తిరుగుతున్నది. తన తల్లి సగం మాత్రమే నిండిన బిందెను బుజాన పెట్టుకుని ఎండలో యింటికి నడిచి వస్తున్నది. అన్నం తింటూ కూడా నీళ్ళను పొదుపుగా వాడుకోవాలి అక్కడ… స్నానం చేసేందుకు సరేసరి… ఆ ఉప్పు నీళ్ళకు కూడా రేషనింగే… అతని కళ్ళు చెమర్చాయి. వెంటనే గ్లాసు నీళ్ళతో నింపుకుని గడగడ త్రాగాడు.

తర్వాత వెనుదిరిగి చూసేసరికి ఎంతసేపటి నుంచీ తనను గమనిస్తున్నదో కుసుమ… అక్కడే చేతులు కట్టుకుని నిలబడి వుంది. ఆమె హఠాత్తుగా అతని చేతివంక చూసి “అరె! మీ చేతికి ఆరు వ్రేళ్ళున్నాయే!” అన్నది ఆశ్చర్యంగా.

జోగినాధం తన ఎడమచేతిని చూసుకుని నవ్వాడు.

కుసుమ “రండి… అయిదున్నర దాటింది… ఇళ్ళకు చేరుకుందాం…” అంటూ దారితీసింది.

జోగినాధం ఆమె ననుసరించి మెట్లు దిగుతూవుండగా ఆమె మళ్లీ “చేతికి ఆరు వ్రేళ్ళుంటే అదృష్టం అని అంటారే… నిజమేనా అండీ?” అని అడిగింది. అతడు నిట్టూర్చి “ఆఁ! ఏం అదృష్టమో!” అన్నాడు.

ఇద్దరూ మెట్లు దిగి వీధిలోకి వచ్చి నడవటం ప్రారంభించారు. పేవ్‌మెంట్ మీద జోగినాధం కుసుమ పక్కగా నడుస్తున్నాడు. అతనికిది పూర్తిగా కొత్త అనుభవం. అతనికిప్పుడు పందొమ్మిదోయేడు. ఇంతవరకూ అతడు పధ్నాలుగేళ్ళ తన చెల్లిలితో తప్ప పరాయి ఆడపిల్లతో ఎన్నడూ మాట్లాడి ఎరుగడు. ఇప్పుడు కుసుమవంటి అందమయినదీ, నాగరికురాలూ అయిన పడుచు వెంట నడవటం అతనికి చాలా యిబ్బందిగానే వున్నా ఒక వింత ఆనందాన్ని కూడా యిస్తున్నాదని చెప్పక తప్పదు.

ఆమె నడుస్తూనే “ఏమండీ! ఇందాక పతిద్వయం మీమీద అలిగి వెళ్లినట్టున్నారే!…” అన్నది.

“అవునండీ! పోయినవారంలో కూడా ఒకసారి యిలాగే జరిగింది. వాళ్లిద్దరూ సినిమాలకూ, సర్కసులకూ పోతూ నన్నుకూడా రమ్మంటారు. నా దగ్గర వాటన్నిటికీ డబ్బెక్కడ వుంటుంది చెప్పండి… మా వూళ్ళో యింటిదగ్గర మా అమ్మా, యిద్దరు చెల్లెళ్ళూ వున్నారు. పెద్ద చెల్లెలికి పధ్నాలుగేళ్ళు… దానికి పెళ్లి కావలసి వుంది… చిన్న చెల్లెలు ఆరేళ్ళది… మాకు ఆస్తిపాస్తులేవీ లేవు. పైగా మా వూళ్ళ సంగతి తెలుసుగా మీకు? అక్కడ మంచినీళ్ళు కూడా ‘బిందె యింత’ అని కొనుక్కోవాలి. అందువల్ల నేను జీతం అందుకోగానే నాకోసం అతి తక్కువ డబ్బు వుంచుకుని మిగిలినదంతా అక్కడికి పంపుతాను. అలాంటప్పుడు నాకు వీళ్ళతో తిరగడం ఎలా సాధ్యపడుతుంది చెప్పండి…” అంటూ ఆగాడు జోగినాధం. కుసుమ జాలిగా అతని వంక చూసింది.

అతడు మళ్లీ “నా దగ్గర డబ్బు ఉండదని తెలిసి కూడా నన్ను తమతో రమ్మని బలవంతం చేస్తారు. అన్నిటికీ తమ డబ్బు పెట్టుకుంటామంటారు. అది నాకు బొత్తిగా యిష్టం వుండదు. అలా అని చెబితే వాళ్ళకు కోపం పొడుచుకొచ్చేస్తుంది…” అన్నాడు.

కుసుమ నవ్వి “బాగానేవుంది…” అన్నది.

జోగినాధం “మీ రెప్పుడూ మా ప్రాంతాలకు రాలేదు కదండీ. అక్కడ నీటిచుక్క కనిపించదు. అన్ని కాలాల్లోనూ ఒకటే కరువు. బావులన్నీ ఎక్కడో పాతాళంలోకి వెళ్ళే సొరంగాల్లాగా వుంటాయి. తొంగి చూస్తే అడుగున ఏమీ కనిపించదు. పెద్ద తాడు బొక్కెనకు కట్టి లోపలికి వొదులుతూ వుంటే ఎంతకూ నీళ్ళు తగలవు. చివరకు బొక్కెన రాళ్ళ మీదపడి శబ్దం వినిపిస్తుంది. ఇక నీళ్ళు ఎక్కడో చిన్నిగుంటలా కొద్దిగా వుంటాయి. బొక్కెనను అక్కడికి జరిపి నీళ్ళు రాబట్టుకోవాలి… మా ప్రాంతాలలో బొక్కెనలెలా వుంటాయో తెలుసా మీకు? కిరసనాయిలు డబ్బాలుంటాయి చూశారూ. వాటిని సగానికి తెగగొట్టి అతుకు వేసి నీళ్ళను ఈడ్చుకు వచ్చేందుకు వీలుగా తయారుచేస్తారు. మధ్యాహ్నం పూట సూర్యుడు నడినెత్తి మీద వున్నప్పుడు మాత్రం బావిలోపల ఎక్కడో నీళ్ళు తళతళా లాడుతూ కొంచెంగా కనిపిస్తాయి. అందరూ రాత్రి వేళల్లో వెళ్లి మరునాటికి కావలసిన నీళ్ళు తెచ్చుకోవలసిందే. తెల్లవారితే జల ఉండదు… చుక్కగూడా మిగలదన్న మాట…” అంటూ ఆగి మళ్లీ నిట్టూర్చి “అందుకే నాకు మా వూరంటే బొత్తిగా యిష్టంలేదు… మా వాళ్ళను కూడా యిక్కడికి తీసుకువొచ్చేద్దా మనిపిస్తూవుంటుంది అప్పుడప్పుడు… అయినా నాకిక్కడ వొచ్చేది చాలవొద్దూ…” అన్నాడు.

కుసుమ అతడు చెప్పినదంతా కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా విన్నది. అతడు మళ్లీ “రెణ్ణెల్ల క్రిందట నేను ఉద్యోగంలో జాయినయేందుకు వచ్చేటప్పుడు రైలు కృష్ణానది మీదినుంచి పరుగెత్తుతూ వుండగా చూసి ఆశ్చర్యంతో బొమ్మలా అయిపోయాను. మీరు నమ్మరేమో! అన్ని నీళ్ళు ఒక్కచోట చూడటం అదే నాకు మొదటిసారి. చిన్నప్పుడెప్పుడో సముద్రం చూశానుగాని అది ఉప్పునీళ్ళు కదా! ఇంత నదీ, యిన్ని నీళ్ళూ వున్న ప్రాంతం సంపన్నం కాకుండా ఎలా వుంటుంది చెప్పండి? నీళ్ళు పుష్కలంగా ఉన్న చోటే నాగరకత… మా ప్రాంతాలలో మనుషులు వొంటినిండా పోసుకునేందుకూ, కడుపునిండా తాగేందుకూ పుష్కలంగా నీళ్ళూ లేకనే చిక్కిపోతున్నారని నాకప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది. ఇక్కడ నాకు చాలా హాయిగావుంది. రోజూ ఉదయం లేచీలేవగానే కృష్ణకు వెళ్లి స్నానం చేస్తాను. సాయంకాలం ఆఫీసు నుంచి వెళ్లీవెళ్ళగానే బావి దగ్గర మళ్లీ స్నానం చేస్తాను. ఇప్పుడెంతో హాయిగా ఆరోగ్యంగా వున్నాను… అంతా నీళ్ళలోనే వుంది సుమండీ…” అని ఒక్కక్షణం ఆగి “నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి అయితే మాకూ నీళ్ళకరువు తప్పుతుందనీ, మెట్ట పొలాలన్నీ మాగాణి భూములవుతాయనీ అనుకుంటున్నారు. అది ఎప్పటికో…” అన్నాడు నిట్టూర్చి.

కుసుమ నవ్వి “అయితే మీ నిర్వచనం ప్రకారం నీళ్ళే నాగరికతకూ సౌభాగ్యానికీ మూలకారణం అన్నమాట…” అన్నది.

జోగినాధం తలూపుతూ “అంతేనండీ… నిస్సందేహంగా అందులో మీకేమీ అనుమానం అక్కర్లేదు. అది కరెక్టు.” అన్నాడు. కుసుమ ఆ మాటలు విని మళ్లీ నవ్వింది.

అప్పటికి వారు చాలాదూరం నడచివచ్చారు. కుసుమ ఒకచోట ఆగి “ఇదే మాయిల్లు… రండి… ఒక్క నిముషం కూర్చుని పోదురుగాని…” అన్నది.

జోగినాధం “ఎందుకులెండి… యిప్పుడు…” అంటూ ఏదో చెప్పబోయి ఆమెవంక చూసి ఆగి “సరే పదండి…” అన్నాడు. ఆమె నవ్వుతూ మెట్లెక్కి తలుపుతట్టి “మా అన్నయ్య యింట్లోనే వున్నాడనుకుంటాను… మిమ్మల్ని పరిచయం చేస్తాను.” అన్నది.

ఆరేళ్ళ పలుచని ఎర్రతేలువంటి పిల్ల తలుపు తెరిచి లోపలికి వెడుతూ “అక్కయ్య వొచ్చింది.” అంటూ రాగం తీసింది. కుసుమా, జోగినాధం గుమ్మం లోపలికి వెళ్ళేసరికి కిటికీ పక్కగా వున్న కుర్చీలో ఒకదాన్లో ఎవరో కూర్చుని పేపరు చూస్తున్నారు. కుసుమ అటుతిరిగి “అన్నయ్యా! నువ్వెంతసేపయింది వచ్చి?” అని అడిగింది. ఆ వ్యక్తి పేపరు తప్పించి “ఇప్పుడే, పది నిముషాలయి వుంటుందేమో…” అంటూ జోగినాధం వంక చూశాడు. కుసుమ “వీరు మా ఆఫీసులో పనిచేస్తున్నారు. మిస్టర్ నాధ్ గారు. ఈయన మా అన్నయ్య కామేశం. ఇక్కడ కాలేజీలో లెక్చరరు.” అని ఒకరినొకరికి పరిచయం చేసి “మీరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి. నేనిప్పుడే అయిదు నిముషాల్లో కాఫీలు పట్టుకొచ్చేస్తాను” అంటూ లోపలికి వెళ్లింది.

ఆ యిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఆయనకు యిరవై అయిదేళ్ళకు మించి వుండదు వయస్సు. సన్నగా, ఎర్రగా వున్నాడు. కళ్ళకొక రిమ్‌లెస్ జోడు ఉంది. ధరించిన దుస్తులు చాలా నాగరికమైనవీ, ఖరీదైనవీనూ. ఆయన పేపరు పక్కన వుంచి జోగినాధం ఉద్యోగాన్ని గురించీ, అతని చదువును గురించీ ఏవేవో ప్రశ్నలు వేశాడు.

కొద్ది నిముషాల్లో కుసుమ దుస్తులు మార్చుకుని చేతుల్లో కాఫీ కప్పులతో వచ్చింది. తానొక కుర్చీలో కూర్చుని ఆ యిద్దరికీ కాఫీలు అందించి అన్నగారి వంక తిరిగి “వీరు యివాళ చాలా చిత్రమైన విషయం చెప్పారన్నయ్యా. అది మీ ఎకానమిస్టు లెవరూ యింతవరకూ కనిపెట్టలేదని బల్ల గుద్ది మరీ చెప్పగలను” అన్నది.

ఆయన తల ఎత్తి చూసి నవ్వుతూ “ఏమిటో అది…” అన్నాడు. కుసుమ జోగినాధం వంక తిరిగి “చెప్పనా?” అని అడిగింది. జోగినాధం బిడియపడుతూ “ఎందుకు లెండి…? నాదంతా ఏదో పిచ్చివాగుడు…” అన్నాడు.

ఆమె “అలా కాదు… చెప్పితీరాలి… అన్నయ్యా! వీరంటారు కదా, నీళ్ళే సర్వ నాగరికతకూ, సౌభాగ్యానికీ కారణంట… నీళ్ళు దొరకని చోట్లా లేక తక్కువగా ఉన్నచోట్లా నాగరికత అభివృద్ధి చెందదనీ, ప్రజలు సంపన్నంగా ఉండరనీ కూడా వారి సిద్ధాంతం… ఇప్పుడు చెప్పు… మీ ఎకనమిక్స్‌లో ఈ విషయం యింతకుముందు ఎవరైనా చెప్పారా?” అన్నది.

ఆయన నవ్వాడు. కాఫీ కప్పు ఎదురుగా టీపాయ్ మీద ఉంచి “అది మంచి పాయింటే… మీరు చెప్పింది సబబుగానే ఉంది. కాదనను…” అన్నాడు.

కుసుమ జోగినాధం వైపు “చూశారా? మీరు గెలిచారు” అన్నట్టు చూసింది.

కామేశం మళ్లీ తల పంకించి “కాని యిందులో ఒక తమాషా ఉంది… మీరు చెప్పినట్టు నదులెక్కువగా ఉన్న చోట్లా, వర్షాలు ఎక్కువగా కురిసే చోట్లా తప్పకుండా అభ్యుదయం ఉంటుంది. కాని అవి విపరీతంగా ఉన్నా బాధే. ఉదాహరణకు చూడండి. ఇప్పుడు నదులకు వరదలు వొస్తున్నాయి. పంటలన్నీ గంగపాలై పోతాయి. లెక్కలేనంత మంది ప్రజలు నిర్వాసితులైపోతారు. అకాలంలో వర్షాలు కురిశాయనుకోండి… అప్పుడూ పంటలు ధ్వంసమే. కాబట్టి ఎటూ గట్టిగా రూలింగ్ యిచ్చేందుకు వీలులేదు…” అంటూ ఆగి, “అన్నట్టు మీ వూరేది?” అని అడిగాడు.

జోగినాధం చెప్పాడు. కుసుమ అందుకుని “వాళ్ళ వూరును గురించి యిప్పుడు నాకు చెప్పారన్నాయ్యా! అటువంటి వూళ్ళు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను. నీళ్ళుకూడా కొనుక్కుంటే గాని దొరకవుట అక్కడ. తాగేందుకూ, వొంటికి పోసుకునేందుకూ అన్నిటికీ నీటి కరువట” అన్నది.

ఆయన “అందులో విచిత్రమేముంది? అలా ఎన్నో వూళ్ళున్నాయి మన దేశంలో. అన్నట్టు ఈ సందర్భంలో మా స్నేహితుడొకాయన చెప్పిన విషయం ఒకటి గుర్తు వస్తున్నది. ఆయనను అటువంటి వూళ్ళో ఎవరో భోజనానికి పిలిచారట. అదే మొదటిసారి ఆయన ఆ వూరికి వెళ్ళడం. భోజనం చేస్తూ వుండగా ‘మంచినీళ్లీరేమిట’ని ప్రక్కవారిని అడిగాడట. వాళ్ళు ఆయన విస్తరి ముందున్న ఒక చిన్న గాజుగ్లాసును చూపించి ‘అదిగో అవే మంచినీళ్ళు’ అన్నారట. ఆయన గ్లాసులో తెల్లగా తేనె కలిపినట్టున్న ఆ ద్రవం చూసి అంతవరకూ ఏదో డ్రింక్ అనుకున్నాట్ట. తీరా చూస్తే అవే మంచినీళ్ళు” అన్నాడు.

కుసుమా, జోగినాధం ఒక్కసారిగా నవ్వారు. తర్వాత జోగినాధం లేచి “ఇక వెళ్లి వస్తానండీ…” అన్నాడు. అన్నా చెల్లెళ్లిద్దరూ అతన్ని గుమ్మందాకా సాగనంపి ఉండిపోయారు.

అతడు నెమ్మదిగా నడిచి రూము చేరుకుని తాళం తీశాడు. లోపలికి వెళ్లి చీకటిపడుతున్నందున లైటువేసి స్నానానికి సిద్ధమైనాడు. చిన్న కొల్లాయి గుడ్డ ఒకటి కట్టుకుని భుజం మీద మరో టవల్ వేసుకుని బావి దగ్గరికి చేరుకున్నాడు. మొదట ఒక పెద్ద బాల్చీ నిండా నీళ్ళు తోడుకుని నూతి పళ్ళెం మీద కూర్చున్నాడు. హాయిగా, ప్రశాంతంగా ఒకదాని తర్వాత ఒకటిగా మూడు పెద్ద బొక్కెనల నీళ్ళు పోసుకున్నాడు.

ఇంట్లో మరో భాగంలో అద్దెకున్న ఒక గుమాస్తా భార్య నీళ్ళకోసం చేతిలో బిందెతో తమ వాటా గుమ్మంలో నిరీక్షిస్తూ నిలబడి ఉంది. అతడామెను చూడనే లేదు. ఆమె లోలోపల “అతడు తనను చూసికూడా త్వరగా తెమలక బాధపెడుతున్నాడ”ని అనుకుంటున్నది.

జోగినాధం నెమ్మదిగా అరగంట తర్వాత నూతి పళ్ళెం దిగి యివతలికి వచ్చాడు. ఇంటి యజమానురాలు అంతసేపటినుంచీ యీ తంతు అంతా చూస్తూనే ఉంది. ఆమె నెమ్మదిగా అతన్ని మందలిస్తూ “అలా పనివేళా గంటల తరబడి నూతిపళ్ళెం మీద కూర్చుండిపోతే ఎలా చెప్పు నాయనా? ఆవిడ యిందాకటినుంచి నీళ్ళకోసం తొందర పడుతూ నీ కారణంగా అక్కడే నిలబడి ఉంది… చూడలేదూ?” అన్నది. జోగినాధం నాలిక కరుచుకుని ప్రక్కకు తిరిగిచూసి “పొరపాటయి పోయిందండీ…” అన్నాడు.

అతడు తర్వాత రూములో కొద్దిసేపు విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆవేళ జరిగిందంతా మననం చేసుకున్నాడు. తన రూమ్ మేట్స్ యిద్దరితోనూ తాను అలా వ్యవహరించడంలోని ఉచితానుచితాలు బేరీజు వేసుకుని ఆలోచించాడు. చివరకు తానేమీ తప్పు చెయ్యలేదని నిర్ణయించుకున్నాడు. అయినా ఆ యిద్దరూ తనకు మంచి మిత్రులు. అటు ఆఫీసులోనూ వాళ్ళు చేస్తున్న సహాయం అమూల్యమైనది. ఇద్దరూ చక్కగా చదువుకున్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు. వాళ్ళకు తనమీద అంత అభిమానం ఉండటం తనకెంతో మంచిది. దాన్ని తాను పోగొట్టుకోకూడదు.

ఉమాపతి గోదావరిజిల్లావాడు. మంచి సంపన్న కుటుంబంలో పుట్టినవాడు. అతని తండ్రికి పిత్రార్జితమైన తోటలూ, పొలాలూ, దొడ్లూ పుష్కలంగా ఉన్నాయి. అతను బుద్ధిగా చదువుకున్నాడు. ఏ క్లాసులోనూ తప్పలేదు. డిగ్రీ రాగానే చిన్నదే అయినా దొరికిన ఉద్యోగంలో వెంటనే చేరాడు. అతడు యింటికి నయాపైసా కూడా పంపనక్కర లేదు. ఇక లక్ష్మీపతి ఉన్నాడంటే అతని తండ్రి మొదట్లో బాగా కష్టాలు పడ్డవాడు. అయితేనేం ఆయనకు డబ్బు విలువ, తత్వమూ బాగా తెలుసు. కొంత డబ్బు సంపాదించిన తర్వాత యిక మన తెలివితేటలూ ప్రమేయమూ లేకుండానే ఆ డబ్బు అతిగా పెరిగిపోతుందనీ అందులో అతిశయోక్తి ఏమాత్రమూ లేదనీ ఆయన దృఢ విశ్వాసం. కావలసిందల్లా కొంచెం లౌక్యమనీ, డబ్బు మదుపు పెడితే అది పెరిగే చోట్లూ, తరిగే చోట్లూ ఉన్నాయనీ, పెరిగేచోట్లు గమనించి మదుపుపెట్టే మాత్రపు తెలివితేటలు చాలుననీ, యిక ఆవైపు కూడా అప్పుడప్పుడు తప్ప చూడనక్కరలేదనీ ఆయన అంటూ ఉంటాడు. ఆయన అలాగే చేసి ఆస్తులు అలాగే పెంచాడు కూడా. లక్ష్మీపతి ఆయనకు ఒక్కడే కొడుకు. ఇంట్లో అతని మాటకు ఎదురన్నది లేదు.

జోగినాధం మనస్సులో కుసుమ మెదిలింది. ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది. దబ్బపండు వంటి శరీరచ్ఛాయ ఆమెది. ఆమె నాజూకైన సన్నని బంగారపు పుల్లలవంటి వ్రేళ్ళు టైపు మెషిను మీద చకచక కదలుతూ ఉంటే చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆమె కన్నులు చెంపకు చేరడేసి ఉండి తళతళ లాడుతున్న నీళ్ళను గుర్తుకు తెస్తాయి. ఆమె అన్న కామేశం అంత చిన్న వయస్సులో కాలేజీ లెక్చరరు అయినాడంటే ఎంతో తెలివిగలవాడయి ఉండాలి. ఆయన కూడా స్ఫురద్రూపి.

జోగినాధానికి తన చెల్లెలు గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఒక వన్నె తక్కువగా కుసుమ రంగే. అయినా నీళ్ళ కరువు మూలంగానూ, తగిన పోషణ లేకనూ ఆ పిల్ల జబ్బుపడి లేచిన దానిలా ఉంటుందెప్పుడూ. కాని ఆ అమ్మాయి తెలివితేటలూ, వోర్పూ పనిపాటలలో నేర్పూ చెప్పుకోదగ్గవి. దానికి పెళ్లి చేసి ఒక యింటిదాన్ని చేస్తే తమ బాధ్యత సగం తగ్గుతుంది. దానికి ఎక్కడ వ్రాసిపెట్టి ఉందో మరి… అది కాస్తా అయితే తన తల్లినీ, చిన్న చెల్లెలినీ తీసుకుని యిక్కడికి మకాం మార్చేయవచ్చు. అప్పటికి తన శని తప్పినట్టవుతుంది. అయినా ఆడపిల్ల పెళ్లి మాటలతో, ఆలోచనలతో అవుతుందా? దానికెంత కష్టపడాలి? కట్నం పేచీ లేకుండా ఎక్కడైనా సంబంధం కుదిరితే బాగుండిపోను… అయినా తన పిచ్చిగాని, కట్నం లేకుండా ఎవడు పెళ్లికి ఒప్పుకుంటున్నాడీ రోజుల్లో!

అతడు లేచాడు. రూముకు తాళం వేసి వీధిలోకి వచ్చి నడవటం ప్రారంభించాడు. అక్కడొకటీ, అక్కడొకటీ వీధి దీపాలు వెలుగుతున్నాయి. దూరంగా ఎక్కడో రైలు ‘గుప్పు గుప్పు’మని పొగ వొదులుతూ పరుగెత్తి పోతున్నది.

జోగినాధం కామేశాన్ని గురించే ఆలోచిస్తున్నాడు. అతన్నీ, తన చెల్లెలినీ మనసులో పక్కపక్కనే నిలబెట్టుకుని మాటిమాటికీ ఆలోచనలో మునిగిపోతున్నాడు. చివరకు హోటలు ముందుకు వచ్చేసరికి తలవూపి ఏదో నిశ్చయానికి వచ్చాడు.

అతడు హోటల్లో ఒక బల్లముందు కూర్చుని అరిటాకు కడుగుతూ ఉండగా పక్కనే ఉన్న యిద్దరు సర్వర్లు “మంచినీళ్ళ పంతులుగా రొచ్చారు…” అనుకుని నవ్వుకున్నారు. తర్వాత వారిలో ఒకడు ఏకంగా ఒక జార్ నిండా నీళ్ళు తెచ్చి జోగినాధం పక్కనే బల్లమీద ఉంచి వడ్దన ప్రారంభించాడు. అతడు భోజనం చేసినంతసేపూ వారిద్దరూ ప్రతి పూటా చేసినట్టే ఆపూట కూడా అతడెన్ని గ్లాసుల నీళ్ళు తాగాడో లెక్కపెట్టారు. చివరకు లెక్క ఎక్కడో తప్పింది. ఒకడు పదిహేను గ్లాసులనీ, మరొకడు పధ్నాలుగు గ్లాసులు మాత్రమేననీ కొంచెంసేపు తమలో తాము తర్కించుకుని తర్వాత సర్దుకున్నారు.

జోగినాధం భోజనం ముగించి చెయ్యి కడుక్కుని రూము చేరుకున్నాడు. లైటువేసి పక్క మీద వాలి కాయితమూ కలమూ తీసుకుని ఇంటికి ఉత్తరం రాశాడు. మామూలు యోగక్షేమాలతో బాటు అతడు కుసుమ అన్నగారి విషయం కూడా అందులో ప్రస్తావించి “కులగోత్రాలవంటి చిక్కులు రాకుండా ఉంటే, ఆయన ఒప్పుకుంటే నిజంగా మన చెల్లాయి అంత అదృష్టవంతురాలు ఎక్కడా ఉండదనే నా విశ్వాసం. నేను రేపే అన్ని వివరాలూ తెలుసుకుని మళ్లీ నీకు వ్రాస్తాను” అని వ్రాశాడు.

తర్వాత కాయితం, కలం ప్రక్కనే ఉంచి ఆవులించి చిటికవేసి వెల్లకిలా పడుకుని పైకప్పువంక చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే అతని కళ్ళు మూతలుపడ్డాయి.

పది గంటలు దాటిన తర్వాత సినిమానుంచి వచ్చిన యిద్దరు మిత్రులూ గాఢంగా నిద్రపోతున్న జోగినాధం వంక చూసి నవ్వుకున్నారు. ఉమాపతి మెల్లిగా “తలుపు బార్లాగా తీసిపెట్టి ఎలా దిట్టంగా నిద్రపోతున్నాడో చూడు…” అన్నాడు లక్ష్మీపతితో.

లక్ష్మీపతి కిటికీ పక్కగా పడివున్న కార్డును చేతిలోకి తీసుకుని చూసి “ఇది నీదేనయ్యా… ఇవాళే వచ్చినట్టున్నది” అన్నాడు. ఉమాపతి దాని అందుకుని చదివి అవతల పడేస్తూ “నాన్నగారు వ్రాశారు. మళ్లీ వరద లొస్తున్నాయట. ఈ ఏడుకూడా పంటల రాబడి తక్కువగా ఉంటుందేమోనని వ్రాశారు. అది ప్రతి రెండు మూడేళ్ళకూ మామూలే. వరద రావడం నిండు పంటను తుడిచిపెట్టి పోవడం… మా పొలాలు కొన్నిటికి పరవాలేదు కాని, కొన్ని మాత్రం బాగా దెబ్బతింటాయి” అంటూ నిద్రపోతున్న జోగినాధం వంక చూసి మళ్లీ, “ఈ గురువుగారికేమో నీళ్ళ కరువు. త్రాగేందుకూ నీళ్ళుచుక్క కూడా లేక వీళ్ళు అవస్థపడుతూ ఉంటారు. మాకేమో వరదలు… ఎంత తమాషాగా ఉందో చూడు” అన్నాడు.

లక్ష్మీపతి ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా దుస్తులు మార్చుకుని జోగినాధం వైపు చూస్తూ ఉమాపతితో “ఉత్తరం రాస్తున్నాడయ్యా యింటికి…” అని మళ్లీ ఏదో రహస్యం చెబుతున్నట్టు నెమ్మదిగా “పోయిన నెలలో అనుకుంటాను… అంటే యిక్కడికి వచ్చిన పది పదిహేను రోజులకు అతను యింటికి వ్రాసిన ఉత్తరం ఒకటి నేను చదివాను. తప్పే అనుకో. అయినా ఎంత తమాషాగా ఉందో తెలుసా! అబ్బ! దారుణం. ఒక మతి చలించినవాడు రాసినట్టున్నది ఆ ఉత్తరం… ఇక్కడ ఒంటినిండా పుష్కలంగా కావలసినన్ని నీళ్ళు పోసుకుంటూన్నాననీ, కరువుతీరా నీళ్ళు తాగుతున్నాననీ, తన వొంటి రంగు మారి ఆరోగ్యం కూడా పూర్వం కంటె ఎంతో బాగున్నదనీ వ్రాశాడు. పైగా నీళ్లు తాగేటప్పుడు తల్లినీ, చెల్లెళ్ళనూ తలుచుకుని తలుచుకుని మరీ తాగుతాట్ట. అదీగాక అంతకు ముందెప్పుడో వాళ్ళ వూళ్ళో చిన్న చెల్లెలు నీళ్ళబిందె దొర్లించి కష్టపడి తెచ్చుకున్న నీళ్ళన్నిటినీ నేలపాలు చేసిందని తల్లి ఆ చిన్నపిల్లను చావబాదిన వృత్తాంతం అతను నాకు చెప్పాడు. ఉమాపతీ! అది నువ్వు విన్నట్టయితే నిలువునా వొణికిపోయి ఉండేవాడివి…” అన్నాడు.

జోగినాధం నిద్రలో మరోవైపుకు తిరిగి పడుకున్నాడు. ఉమాపతి మెల్లిగా ఆ ఉత్తరం అందుకుని మడత విప్పాడు. ఇద్దరూ మోకాళ్ళ మీద కూర్చుని ఆ ఉత్తరాన్ని చివరివరకూ చదివి మొహాలు చూసుకున్నారు. తర్వాత దాన్ని యథాపూర్వకంగా మడిచి యథాస్థానంలో ఉంచి ఇవతలికి వచ్చారు.

ఉమాపతి నెమ్మదిగా గొంతు తగ్గించి “అంటే మనం వెళ్లిన తర్వాత కుసుమ వెంట వాళ్ళ యింటికి వెళ్ళాడన్నమాట.” అన్నాడొక విధంగా చూస్తూ. లక్ష్మీపతి “అంతే అయు ఉండాలి మరి…” అని బదులు పలికాడు.

మరునాడు ఆఫీసులో జోగినాధం సాయంకాలం నాలుగుగంటలు దాటేవరకూ కుసుమను పలకరిద్దామని ఎంతగానో ప్రయత్నం చేశాడు. కాని, వీలుపడలేదు. నలుగురూ అక్కడే ఉండటమూ, పైగా కుసుమ చాలా హడావిడిగా పనిలో మునిగి ఉండటమూ అందుకు ముఖ్యకారణాలు.

నాలుగున్నరకే అతడు తన పని పూర్తిచేసుకుని తీరికగా కూర్చున్నాడు. ఉమాపతికి ఆ రోజున అసలు పని లేనట్టే లెక్క. అతని సీటు తీరే అంత. పని బహు కొద్దిగా మాత్రమే ఉంటుంది. లక్ష్మీపతి మాత్రం ఏవేవో ఫైళ్ళు తిరగవేస్తూ రిఫరెన్సులకోసం తంటాలు పడుతున్నాడు.

జోగినాధం నీళ్ళ కూజా వంక చూశాడు. మళ్లీ అటూయిటూ చూశాడు. నెమ్మదిగా లేచి కూజా దగ్గరికి వెళ్లి నీళ్ళు గ్లాసులోకి వంచుకున్నాడు. చేతితో గ్లాసు పైకెత్తి పట్టుకుని ఒక్క క్షణం చూసి తర్వాత గడగడ త్రాగాడు.

అది గమనించి శర్మ అనే మరో గుమాస్తా ఏమీ పనిలేక తీరికగా కూర్చుని ఉండి, నవ్వి, “మన కూజాలో నీళ్ళన్నీ ఒక్క జోగినాధంగారే కాజేస్తున్నారండీ… అదేమి చిత్రమో ప్రతి అరగంటకూ ఆయనకు దాహమవుతూ ఉంటుంది” అన్నాడు.

వైనతేయరావు అనే మరో గుమాస్తా ఫైలులోనుంచి తలపైకెత్తి చూసి “బహుశా అదేదో జబ్బయి ఉంటుంది” అని మళ్లీ తల దించుకున్నాడు.

జోగినాధం నవ్వేందుకు ప్రయత్నించాడు. ఉమాపతీ, లక్ష్మీపతీ, ఒకరివంక ఒకరు చూసుకున్నారు.

ఇంతలో టైపు మెషిను చప్పుడు ఒక్క నిముషం ఆగినట్టు కాగా జోగినాధం తల ఎత్తి చూశాడు. కుసుమ బల్లమీద చెయ్యి ఉంచుకుని తీరికగా, విశ్రాంతిగా కూర్చుని ఉంది. జోగినాధం నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి గొంతు తగ్గించి “ఏమండీ… మీతో కొంచెం మాట్లాడాలి…” అన్నాడు.

ఆమె నవ్వి “మాట్లాడండి…” అన్నది.

అతడామె ముందు కుర్చీలో కూర్చుని ఏదో చెబుదామని నోరు తెరిచేసరికి తన కొంప ఏదో మునిగినట్టు ఆఫీసరు గదిలో బెల్ ‘గర్’మని మ్రోగింది. ఆమె హడావిడిగా లేచి “తర్వాత మాట్లాడుకుందాం… ఆఫీసరు పిలుస్తున్నారు. అన్నట్టు యివాళ మేము సినిమాకు వెడదామనుకున్నాం. మీరూ రండి, మా అన్నయ్య సంతోషిస్తాడు. పైగా మీరు మాట్లాడనూ వచ్చు…” అంటూ హడావిడిగా ఆఫీసరు గదిలోకి వెళ్లింది.

జోగినాధం కొద్ది క్షణాలు అలాగే కూర్చుండిపోయాడు. ఇవాళ ఏది ఏమయినా సరే వారితో యీ విషయం ప్రస్తావించి వివరాలు తేల్చుకుని ఉత్తరం వ్రాయాలి. నిజంగా యీ సంబంధం కుదిరితే అమ్మ ఎంతగా సంబరపడిపోతుందో!

కుసుమ మరో అయిదు నిమిషాలకు గాని యివతలికి రాలేదు. వస్తూనే ఒక కాయితం చూపించి జోగినాధంతో “ఇదుగో యీ ఒక్కటీ అందజేస్తే వెంటనే మనం వెళ్లిపోవచ్చు…” అంటూ చకచక పనిచెయ్యసాగింది.

జోగినాధం ‘అలాగే’ అని తలవూపి లేచి నెమ్మదిగా నడిచి యివతలి వరాండాలో నిలబడి జేబులో చేతులుపెట్టి వెదికాడు. రెండు రూపాయ నోట్లు కనిపించాయి. అతడు తేలికగా నిట్టూర్చి మళ్లీ తన సీటులోకి వచ్చి కూర్చున్నాడు. ఉమాపతి లక్ష్మీపతితో ఏదో రహస్యం మాట్లాడుతున్నాడు.

ఉన్నట్టుండి ఉమాపతి శర్మ అనే గుమాస్తాతో “మీ రిందాక జోగినాధం నీళ్ళు తాగడం గురించి మాట్టాడారు చూశారూ! మీరా విషయంలో మరికొంత తెలుసుకోవడం అవసరం… వాళ్ళ ప్రాంతంలో వూళ్ళన్నీ ఎప్పుడూ కరువుతో కొట్టుకుపోతూ ఉంటాయి. ఎక్కడా నీళ్ళు చుక్కకూడా దొరకదు. కడుపునిండా తాగేందుకు, వొంటినిండా పోసుకునేందుకూ నీళ్ళుండవు. తాగేందుకు బిందెడు నీళ్ళు మూడణాలు పెట్టి మరీ కొనుక్కోవాలి. అటువంటి వూరినుంచి వొచ్చినవాడికి ఇక్కడ పుష్కలంగా నీళ్ళు దొరికేసరికి కోతికి కొబ్బరికాయ దొరికినట్టే కదా” అన్నాడు.

జోగినాధం “అవును. భగవంతుడి దయ అలా ఉంది. మాకు నీళ్ళు లేవు. మీరేమో వరదల్లో మునిగిపోతున్నారు” అన్నాడు.

ఉమాపతి “భగవంతుడి దయ అనకు… అధర్మం పెరిగిపోతే అంతే… నీటిచుక్క దొరకదు…” అన్నాడు.

లక్ష్మీపతి అందుకుని “అలా కాదు. మీది మరీ దారుణం. నువ్వే చెప్పావు ఒకసారి గుర్తుందా? మీ చిన్న చెల్లాయి నీళ్ళబిందె దొర్లించడం సంగతి” అన్నాడు.

శర్మా, వైనతేయరావూ ఒక్కసారిగా “ఎవరా చెల్లాయి? ఏమా కథ? అది చెప్పండి ముందు” అన్నారు.

లక్ష్మీపతి జోగినాధం వంక తిరిగి “చెప్పనా?” అని అడిగి తర్వాత అతని సమాధానం కోసం ఎదురు చూడకుండానే ప్రారంభించాడు. “అతనే చెప్పాడు వొచ్చిన కొత్తల్లో. ఒకసారి వాళ్ళ యింట్లో జరిగిన విషయమే. రాత్రి అంతా కష్టపడి బావికీ యింటికీ తిరిగి ఒక బిందెడు మంచినీళ్ళు సంపాయించుకున్నారట. మర్నాడు ఉదయం వాళ్ళ చెల్లెలు – చిన్నపిల్ల – గ్లాసు ముంచుకోబోగా ప్రమాదవశాత్తూ బిందె దొర్లిపోయింది. నీళ్ళన్నీ నేలపాలై పోయాయి. ఆడపిల్ల భయంతో బిగుసుకుపోయి నిలబడిపోయింది. తల్లివచ్చి రెక్క పుచ్చుకుని గొడ్డును బాదినట్టు చావగొట్టిందట… ఇలా అని అతనే చెప్పాడు నాకు. కావలిస్తే అడగండి…”.

జోగినాధం వంచిన తల ఎత్తలేదు. ఉమాపతి “ఇక ఇతను స్నానం ప్రారంభించాడా… అది గంటల తరబడి సాగుతుంది!… ఒక్కొక్క బొక్కెనే తోడుకుని ‘యిది చెల్లాయికి’, ‘యిది అమ్మకు’, ‘యిది చిన్నచెల్లాయికి’ అని గొణుక్కుంటూ వొంటిమీద పోసుకుంటాడండీ… తాగేటప్పుడూ అంతే..గ్లాసు పైకెత్తి పట్టుకుని చూస్తాడు మీరు గమనించారో లేదో. ఆ చూడటం నలక లున్నాయేమోనని మాత్రం కాదు… కళ్ళు మూసుకుని ఏమిటో గొణుక్కుని మరీ తాగుతాడు. రోజూ తెల్లవారుతుండగానే కృష్ణకు బయలుదేరి పోతాడు. సాయంకాలంపూట యింట్లో బావి ఉండనే ఉంది. ఇక హోటల్లో సర్వర్లందరూ యితని కేం బిరుదు యిచ్చారో తెలుసా! ‘మంచినీళ్ళ పంతులుగారు’. మొన్న నేను విన్నాను.” అన్నాడు.

శర్మ “ఇది వింత కేసే” అన్నాడు. వైనతేయరావు వంకరగా నవ్వి గంభీరంగా “ఇదొక మానసిక వ్యాధి అయి ఉంటుంది” అన్నాడు.

జోగినాధానికి కోపం ముంచుకు వచ్చింది. వీళ్ళందరూ తనను గేలిచేసి ఏడిపించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం స్పష్టంగా తెలిసిపోయింది. ఆ క్రౌర్యం అతడు భరించలేకపోయాడు. అందర్నీ నిప్పులు చెరిగే కళ్ళతో చూశాడు. కుసుమ అన్నీ విన్నది కాబోలు సానుభూతితో చూస్తున్నది.

వైనతేయరావు ఊరుకోకుండా “ఏది ఏమయినా అలా బొత్తిగా” అని ఏదో అనబోతూ ఉండగా, జోగినాధం పెద్దగా “ఇక తమరేమీ మాట్లాడకండి సార్. ఇప్పటికే చాలా అసహ్యంగా మాట్లాడారు. మిమ్మల్ని అర్థం చేసుకోగలను లెండి. అంత బొడ్డూడని పసివాణ్ణేమీ కాదు.” అన్నాడు.

శర్మ అనే గుమాస్తా కలగజేసుకుని “అదేమిటండీ… మిమ్మల్ని యిప్పుడేమన్నామనీ మీకు అంత కోపం? ఏదో నీళ్ళు ఎక్కువగా తాగుతారనీ…” అంటూ ఉండగా ఇక జోగినాధం వూరుకోలేకపోయాడు. విసురుగా సీటులో నుంచి లేచి “ఆపండిక… మీరింకా అలాగే మాట్లాడుకుంటూ పోతే ఏం చేస్తానో నాకే తెలీదు.” అంటూ ఉద్రేకంతో ఊగిపోతూ “అవునండీ… నేను నీటిచుక్క దొరకని వూళ్ళో పుట్టి పెరిగాను. ఇక్కడ నీళ్ళు చూసేసరికి కోతికి కొబ్బరికాయ దొరికినట్టే అయింది. విపరీతంగా తాగుతున్నాను. అంతేకాదు… కావలిస్తే మూర్ఛవాడిలా పొట్ట పగిలేట్టు నీళ్ళు తాగుతాను. పిచ్చివాడిలా గంటల తరబడి స్నానం చేస్తాను. లేకపోతే ఏదన్నా మంచి ముహూర్తం చూసి కృష్ణలో పడి చస్తాను. అయితే మాత్రం? మీకెందుకు?” అన్నాడు.

తర్వాత కణతలు పట్టుకుని సీటులో కూర్చుండిపోయాడు. అంతటా నిశ్శబ్దమైపోయింది. ఎవరూ పెదవి కదపలేదు. కుసుమ టైపు చేయడంలో మునిగిపోయి ఉంది. జోగినాధం యింత జరిగిన తర్వాత ఎప్పుడో అక్కడినుంచి పారిపోయి ఉండేవాడు. కాని, యివాళ కుసుమతో, ఆమె అన్నగారితో మాట్లాడాలి. అది తప్పదు.

ఒక పావుగంట తర్వాత చాలామంది యిళ్ళకు వెళ్లిపోయారు. కుసుమ టైపుమెషిను మీద కవరువేసి సిద్ధమై జోగినాధం వంక చూసింది.

అతడు లేచి నిలబడి రుమాలుతో మొహం తుడుచుకుని ఆమె వెంట బయలుదేరాడు. ఇద్దరూ మెట్లు దిగుతూ ఉండగా ఆమె జోగినాధంతో “మీరెందుకలా యిరిటేట్ అవుతారు?” అన్నది.

జోగినాధం వెంటనే సమాధానం చెప్పలేదు. కాని, ఒక్క క్షణం ఆగి “అలా మనిషిని నిస్సహాయంగా చేసి వెర్రివాణ్ణి చేస్తుంటే ఎలా సహించడం చెప్పండి? ఏమయినా కారణం ఉందా అంటే ఏమీలేదు. నా చేతికి ఆరువేళ్ళున్నాయి కదా! అది పట్టుకుని నన్ను నలుగురిలో ఎగతాళి చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అవును నిజమే… మా వూళ్ళూ, మా ప్రాంతమూ వట్టి దౌర్భాగ్యపువే. నీళ్ళ కరువు ఉంటే దౌర్భాగ్యం కాక మరేమిటి? అయినా మధ్య నేనెందుకు వెర్రివాణ్ణవుతాను. ‘ఇదొక మానసిక వ్యాధిట’. ఆ వైనతేయరావు పిలక నా చేతిలో ఉంది. ఏమనుకుంటున్నాడో ఏమో? బోడిపేరూ వాడూనూ… ఈసారి యిలా ఏమన్నా వాగితే ఆఫీసరుతో చెప్పేస్తాను…” అన్నాడు.

కుసుమకు నవ్వు వచ్చింది. కాని ఆమె నవ్వలేదు. అతడు ఆఫీసరుకు చెబుతా నన్నప్పుడు, తోటి పిల్లవాడిమీద కోపగించి మేష్టారితో రిపోర్టు చేస్తానని బెదిరించే బడి పిల్లవాడు గుర్తుకువచ్చాడామెకు.

ఇద్దరూ కుసుమ ఇంటిముందు ఆగేసరికి లోపలినుంచి గోలగా నవ్వులు వినిపిస్తున్నాయి. కుసుమ తలుపు తట్టి అతనివైపు చూసి “ఎవరో బంధువులు దిగినట్టున్నారు” అన్నది.

తలుపు తెరిచిన చిన్నపిల్ల మామూలుగానే “అక్కయ్య వచ్చిందో” అని రాగం తీస్తూ లోపలికి వెళ్లింది.

హాల్లో చాపమీద కూర్చుని క్యారమ్సు ఆడుతున్న వ్యక్తులను చూడగానే కుసుమ ఆనందంతో పరుగెత్తుకు వెళ్లి “అరె! నువ్వెప్పుడొచ్చావ్ వసంతా?” అని అడిగింది. జోగినాధం గుమ్మం దగ్గరగా నిలబడి ఉండిపోయాడు. ఆ వసంత అనబడే అమ్మాయి “ఇప్పుడే… ఒక అరగంట అయిందేమో. లోపల అమ్మ ఉంది…” అన్నది.

జోగినాధం ఆశ్చర్యపోతూ చూశాడు. అంత అందమైన స్త్రీ నతడు ఇంతవరకూ చూడలేదు. ఆమె ఎడమ చేతికొక వాచీ, కుడిచేతికి మూడో నాలుగో బంగారు గాజులూ ఉన్నాయి. ఆ బంగరురంగు ఆమె వంటిమీద బొత్తిగా కనిపించకుండా ఉంది. నల్లని చిలిపి ముంగురులు కొన్ని నుదుటిమీద పడుతూవుంటే వాటిని ఎడమచేతి వ్రేళ్ళతో పైకి తోసుకుంటున్నదామె. నవ్వుతున్నప్పుడు బుగ్గలు ఎంతో అందంగా సొట్టలు పడుతున్నాయి. ఆమె వయస్సు పదహారేళ్ళకు మించి ఉండదు.

కుసుమ జోగినాధంతో “సారీ! యిలా రండి మీరు. కూర్చుని ఉండండి, యిప్పుడే వస్తాను” అన్నది.

కామేశం ఆ మాటలు విని తల తిప్పి చూసి “అరె! మీరూ వచ్చారా? గుడ్. ఇలా కూర్చోండి” అంటూ మళ్లీ తన ఆటలో లీనమైపోయాడు.

కుసుమ కొద్ది నిముషాల్లో యివతలికి వచ్చింది. జోగినాధం అక్కడే వారి ఆట చూస్తూ కూర్చుని ఉన్నాడు. కుసుమ ముందుకు వచ్చి “అన్నయ్యా! యివాళ మరి సినిమా ప్రోగ్రాం ఎలారా?” అని అడిగింది.

కామేశం “దానికేం?” అన్నాడు. అంతలో లోపలినుంచి ఒక ముప్ఫయి అయిదేళ్ళ స్త్రీ వచ్చి “అవును… దానికేం? మీరు సినిమా మానుకోవడమెందుకూ? అందరూ సరదాగా వెళ్లిరండి. నేను యింటిదగ్గర వంటా వగైరాలు చూసుకుంటాను” అన్నది.

కుసుమ “ఇంకా టైముందిగా. రెండాటలాడి పోదాం. నేనూ అన్నయ్యా ఒక పార్టీ” అన్నది.

వసంత కాయిన్స్ తీస్తూ “అలా వీల్లేదు. నేనూ మీ అన్నయ్యా ఒక పార్టీ” అన్నది.

కుసుమ “నెరజాణవే నువ్వు… అప్పుడే అన్నయ్యను కలిపేసుకుంటున్నావ్. ఆగవమ్మా కొంచెం గుర్రాన్ని కట్టెయ్. కోర్సు పూర్తి కానీ…” అన్నది.

జోగినాధం చిత్రమైన అవస్థలో పడ్డాడు. అంతలో మళ్లీ కుసుమ అతన్ని ఉద్దేశించి “సరే రండి… సార్.. మీరూ నేనూ ఒక పార్టీట… కూర్చోండి” అన్నది.

అతడు సిగ్గుపడుతూ “నాకు బొత్తిగా రాదండీ… ఎలా?” అన్నాడు.

కామేశం “ఫరవాలేదు. ఇక్కడ అందరూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్… ఎవరికీ బాగా రాదు. ఏదో సరదాగా ఆడుకుంటాం కానీ మరొకటి కాదుగదా! రండి రండి.” అన్నాడు.

జోగినాధం బిడియపడుతూ కూర్చున్నాడు. టాస్ వేయగా కుసుమకు అనుకూలంగా పడింది. ఆమె జోగినాధానికి స్ట్రయికర్ అందించి “ఊఁ! కానివ్వండి” అన్నది.

జోగినాధం ఎడమచేతితో స్ట్రయికర్ను బలంగా కొట్టాడు. వసంత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి “మైగాడ్! ఈయన ఎడమచేతి వాటం… పైగా ఆరువేళ్ళున్నాయి” అన్నది.

కుసుమ “అన్నట్టు మరిచేపోయాను. వసంతా! వీరు మిస్టర్ నాధ్ అని మా ఆఫీసులో పనిచేస్తున్నారు” అని పరిచయం చేసింది. వసంత చేతులు జోడించింది.

ఆమె మళ్లీ జోగినాధంతో “ఈమె మా మేనత్త కూతురు. పేరు వసంత. సెకెండియర్ బి.ఎస్సి. వుడ్‌బి మిసెస్ కామేశం… అంటే మాకు కాబోయే వదినగారన్నమాట. వాళ్ళకు తొందరగానే ఉందిగాని మా మామయ్య అండ్ కో పెద్దవాళ్ళందరూ ‘ఆయ్! తొందర పనికిరాదు. ముందర పిల్ల చదువు పూర్తి కావల్సిందే. అందాకా అలా ఉండండి, వేరువేరుగా కలలు కంటూ’ అని మందలించారు. అదన్నమాట అసలు విషయం” అన్నది.

వసంత బుగ్గలలో గులాబులు విచ్చుకున్నాయి. కొంచెం ఎర్రబడిన మొహంతో ఆమె కుసుమను మోచేత్తో పొడిచి మెల్లగా “ఛీ వూరుకోవే!” అన్నది.

కామేశం నవ్వి జోగినాధంతో “మా వాళ్ళు మరీ రాలుగాయి పిల్లలండీ బాబూ!” అన్నాడు.

జోగినాధం దిగాలుపడిపోయాడు. ఒక్కసారిగా మనిషిలో సత్తువ సన్నగిల్లి నీరసం ఆవరించింది. ఆట ఆడుతూనే వున్నాడు కాని మనసంతా చీకాకైపోయింది. సినిమా రీలులో లాగా తన వూరూ… చెల్లాయిలూ, తల్లీ, గడ్డికూడా మొలవని చవిటి నేలా, రాళ్ళు పగిలే ఎండలూ, వెచ్చని యీదురు గాలీ, నీళ్ళులేని బావులూ, నీళ్ళకోసం పాట్లూ, ఎక్కడ చూసినా నీరసంగా నిస్తేజంగా వుండే జనమూ… మనసులో తిరిగిపోయారు.

ఒక ఆట పూర్తి అయింది. కుసుమ “కాబోయే దంపతులు గెలిచారు. సరే యిక యిది కట్టిపెడదాం… టైమవుతున్నది. అన్నయ్యా! నువ్వు తయారేనా?” అన్నది.

కామేశం లేచి “జస్ట్ వన్ మినిట్” అంటూ లోపలికి వెళ్ళాడు. జోగినాధం కూడా లేచి చొక్కా గుండీలు సర్దుకుంటూ “నేనుకూడా వెళ్లి వస్తానండీ” అన్నాడు.

కుసుమ ఆశ్చర్యపోయి “అదేమిటండీ, మీరు కూడా వస్తానన్నారుగా… పైగా మా అన్నయ్యతో ఏదో మాట్లాడాలన్నారు కదా?” అన్నది.

జోగినాధం ఏం చెప్పాలో తెలియక “ఏమీ లేదులెండి” అని వూరుకున్నాడు. కుసుమ “మరి?” అని రెట్టించి అడిగింది. జోగినాధం యిక అక్కడ నిలబడలేక పోయాడు. “ఏమీ లేదులెండి… కాలేజీ విషయాలేమైనా చెబుతారేమోనని కాసేపు తీరికగా మాట్లాడుదామనుకున్నాను. వీలైతే నైట్ కాలేజీలో చేరుదామని వుందనుకోండి. అంతకంటే మరేమీ లేదు. మరోసారి మాట్లాడుతాను లెండి. అదేమీ పెద్ద ముఖ్య విషయం కాదుగా! వెళ్లి వస్తానింక…” అంటూ వీధిలోకి వచ్చేశాడు. కుసుమ అలాగే ఆశ్వర్యంతో నిలబడిపోయింది.

అతడు నేరుగా రూముకు వచ్చేశాడు. తలుపులు తెరిచే వున్నాయి. ఉమాపతీ, లక్ష్మీపతీ, చెరొక పక్కా పడుకుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. వాళ్లిద్దరూ ఒకచోట చేరితే యిక కబుర్లకూ నవ్వులకూ లోటుండదు. ఏవేవో కాలేజీ కబుర్లు చెప్పుకొని విరగబడి నవ్వుకుంటూ వుంటారు.

జోగినాధం రావడం చూసి యిద్దరూ కబుర్లు ఆపేశారు. అతడు లోపలికి వెళ్లీ వెళ్ళడంతోనే పక్కమీద వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. ఉమాపతి, లక్ష్మీపతి వంక చూసి కన్నుగీటుతూ “సినిమాకు వెళ్ళలేదా గురువుగారూ?” అని అడిగాడు జోగినాధాన్ని. జోగినాధం “లేదంటూ” తల అడ్డంగా వూపాడు.

తర్వాత అతడు లేచాడు. క్రితం రాత్రి తాను యింటికి వ్రాసిన ఉత్తరం యివతలికి తీసి దాన్ని ముక్కలు ముక్కలుగా చింపి కిటికీ నుంచి విసిరివేశాడు. ఆ కాయితపు ముక్కలు గాలి విసురుకు చెల్లాచెదరై ఎటెటో ఎగిరిపోయాయి.

ఒక అరగంట దాదాపు నిశ్శబ్దంగానే గడిచింది. తర్వాత ఉమాపతి లేచి “నాకు ఆకలి వేస్తున్నది బాబూ, హోటలుకు వచ్చేవాళ్ళు రావచ్చు” అన్నాడు. జోగినాధం కదలలేదు. లక్ష్మీపతి లేచి చొక్కా తొడుక్కుని “ఊఁ! పోదాం పద…” అన్నాడు.

ఇద్దరూ గదిదాటి బయటికి వచ్చారు. ఉమాపతి ఆగి అనుమానంగా “మనం తప్పు చేస్తున్నా మనిపిస్తున్నదోయ్… అతని సంగతి మనకు తెలుసుకదా! కేవలం అమాయకుడు. ఒకసారి వెళ్లి ‘రమ్మ’ని పిలుద్దాం. రాకపోతే సరే, యిద్దరం వెళ్లిపోదాం. అప్పుడు మన తప్పేమీ వుండదు” అన్నాడు.

తర్వాత మళ్లీ యిద్దరూ లోపలికి వెళ్లి జోగినాధాన్ని తట్టి లేపారు. అతడు కళ్ళు తెరిచి చూసి “ఏమిటండీ?” అని అడిగాడు.

ఉమాపతి “మీరు వచ్చినప్పటినుంచీ ఎన్నడూ యిలా మేము వేరుగా వెళ్ళలేదు. మీరూ రండి భోజనానికి…” అన్నాడు.

జోగినాధం కళ్ళలో ఎందుకో నీటిపొర నిలిచింది. అతడు గద్గదస్వరంతో “నాకీపూట ఆకలి లేదండీ…నిజం… మీరిద్దరూ వెళ్లిరండి” అన్నాడు.

ఉమాపతి అతని నుదుట చేయి ఉంచి చూసి “ఒళ్ళు కొంచెం వేడిగానే ఉంది. అయినా అన్నం మానటం మంచిది కాదేమో!” అన్నాడు.

జోగినాధం తలవూపి “కాదులెండి. నేనీపూట ఏమీ తినలేను. మీరిద్దరూ వెళ్లిరండి” అన్నాడు. దానితో వారిద్దరూ మరేమీ మాట్లాడకుండా వీధిలోకి వెళ్లిపోయారు.

జోగినాధానికి ఎందుకో ఏడుపు పొంగి వచ్చింది. అతడింత వరకూ ఎన్నడూ తల్లినీ చెల్లెళ్ళనూ వొదిలి వున్నవాడు కాదు. ఈ రెణ్ణెల్ల నుంచీ అతడు ఎన్నో పర్యాయాలు ఏడుపును దిగమ్రింగుకున్నాడు. కాని యివాళ ఆఫీసులో జరిగిన ఉదంతం అతన్ని కలతపెట్టింది. కాని అతడు దాన్ని అట్టే లెక్కచేయలేదు. దాని తర్వాత కుసుమ యింట్లో జరిగినదంతా అతన్ని చాలా క్షోభ పెట్టింది. తాను నిన్నటినుంచీ చాలా ప్రేమగా కట్టుకున్న పేకమేడలు ఒక్కసారిగా కూలిపోయినట్టయింది. అతడు లోలోపల దుఃఖంతో దిగులుతో మెలికలు తిరిగిపోతూ అలాగే పడుకున్నాడు. ఇంతలోనే అతనికి గాఢంగా నిద్రపట్టింది.

అతడు కళ్ళు విప్పి చూసేసరికి రూములో చిన్న బల్బు వెలుగుతున్నది. ఎక్కడా ఏ అలికిడీ లేదు. ఉమాపతి, లక్ష్మీపతి, యిద్దరూ గురకలు పెడుతూ నిద్రపోతున్నారు.

అతడు లేచి బల్లమీద వున్న ఉమాపతి రిస్టువాచీ చేతిలోకి తీసుకుని చూశాడు. అయిదు గంటలకు యిరవై నిముషాలు తక్కువ. ఇక కదిలితే మంచిది. తెల్లగా తెల్లవారిన తర్వాత నదికి బయలుదేరి వెళ్ళటం యిక మానుకోవాలి. లేకపోతే వీళ్ళతో చిక్కే. త్వరగా వెళ్లి వాళ్ళు లేవకముందే రూముకు చేరుకోవడం మంచిది. క్రిందటిరోజు ఆఫీసులో జరిగిన ప్రహసనం మళ్లీ జరగదని హామీ ఎక్కడా లేదు కదా! అతడు త్వరత్వరగా రూము తలుపులు దగ్గరకు లాగి మెట్టు దిగి వీధిలోకి వచ్చాడు. క్రింది మెట్టు దిగుతూ వుండగా ఎందుకో గుండె జలదరించింది.

వీధి చివర ఒక కుక్క అరుస్తున్నది. ఏ యింటి పెరటిలోనో దాక్కునివుండి గుడ్లగూబ ఒకటి వుండి వుండి కూత పెడుతున్నది. వీధులలో అక్కడొకరూ, అక్కడొకరూగా జనం పలుచగా తిరుగుతున్నారు.

జోగినాధం మనసులో తన వూరూ, నెర్రెలు విచ్చిన పొలాలూ, రాత్రిళ్ళు నిద్రలేకుండా నీళ్ళు మోస్తూ తిరుగుతున్న తల్లీ చెల్లెలూ, నీళ్ళబిందె దొర్లించి చావు దెబ్బలుతిన్న చిన్నచెల్లెలూ, నిస్తేజంగా నీరసంగా వుండే జనమూ, వెచ్చని హోరుగాలీ, రాళ్ళు పగిలే ఎండలూ, గిర్రున సినిమారీలు లాగా తిరిగిపోయాయి. లోలోపల “నాగార్జునసాగర్ పూర్తి అయితే మాకూ యీ బాధలు తప్పి బోలెడన్ని నీళ్ళు వస్తాయి…” అనుకున్నాడతడు.

నది మెట్ల క్రింద రొద చేస్తూ ప్రవహిస్తున్నది. దూరంగా వంతెన మీద ఏదో రైలు చప్పుడు చేస్తూ పోతున్నది. చల్లని, జీవంపోసే గాలి హాయిగా తెరలుతెరలుగా వీస్తున్నది. మెట్ల దగ్గర అప్పుడే నలుగురైదుగురు మనుషులు స్నానం చేస్తున్నారు. వారిలో ఒకాయన ఏవేవో మంత్రాలు చదవుతున్నాడు. పలుచని వెలుతురు మందంగా వ్యాపిస్తున్నది.

జోగినాధం చొక్కా విప్పి తువాలు కట్టుకుని నెమ్మదిగా నీళ్ళలోకి దిగాడు. చల్లని నీళ్ళు మంచులాగా మోకాళ్ళకు పైగా తగిలేసరికి శరీరం పులకరించి నట్టయింది. మరొక అడుగు ముందుకు వేసి మెట్టు దిగాడు. హాయిగా, “ఎంత బావుంది!” అనుకున్నాడు. మరొక అడుగు ముందుకు… తానిలా హాయిగా మనసు తీరా స్నానం చేస్తూవుంటే తన వూళ్ళో తన వారెలా వున్నారో అనే బాధ అతని మనసులోకి వచ్చింది. అమ్మ రాత్రి అంతా నీళ్ళకోసం తిప్పలుపడి యిప్పుడే కొద్దిగా నడుం వాల్చి వుంటుంది.

మరొక మెట్టు క్రిందికి… అతని మనసులో తన వూరూ, తన యిల్లూ, యింటి వెనక ఎండిన పున్నాగ చెట్లూ, పొలాలూ, నీళ్ళులేని బావులూ, అన్నీ మళ్లీ సినిమారీలు లాగా తిరిగిపోయాయి. మళ్లీ “నాగార్జునసాగర్ పూర్తి అయితే మాకూ యిబ్బందులు తప్పుతాయి. అప్పుడు కావలసినన్ని నీళ్ళు…” అనుకున్నాడు. మరొక అడుగు ముందుకు వేశాడు. మెట్ల మీద నిలబడ్డవారు ఆందోళనతో అతని వంక చూస్తున్నారు.

అంతలో అతని కాళ్ళు తేలిపోయాయి. అతని గుండెలు ఝల్లుమన్నాయి. “అరె! భగవంతుడా! ఏమయిపోతున్నాడు తాను? ఎందుకలా నీళ్ళు తనను లాక్కుపోతున్నాయి? గుండ్రంగా రంగులరాట్నం తిరిగినట్టవుతున్నదేమిటి? కాళ్ళకు మెట్లు అందవేం? ఆ మనుషులు కనిపించరేం? తన కళ్ళకీ నీళ్ళు అడ్డు వస్తున్నా యెందుచేత?”

దూరంనుంచి కేకలు లీలగా వినిపించాయి. నీళ్ళు తన చుట్టూ ఒక గోడ కట్టినట్టుగా ఏర్పడి వొడ్డునున్న వారిని చూసేందుకే వీలు లేకుండా చేశాయి.

అతడు గొంతు పెద్దది చేసి అరిచాడు. వెంటనే అతని గొంతులోకి నీళ్ళుపోయాయి. రెండవసారి మళ్లీ అలతోపాటు కొంచెం పైకి వచ్చినందువల్ల కాబోలు అతనికి దూరంగా మనుషులు కనిపించారు. అతడు చేతులెత్తి నమస్కారం చేసి “బాబోయ్ రక్షించండి…!” అని అరిచాడు. దానితో మరి కాసిని గుటకలు వేశాడు. అతని మనసులో క్షణంలో సగంలో మళ్లీ సినిమా రీలులో లాగా తన వూరూ, తల్లీ చెల్లెళ్ళూ, నీళ్ళు లేని బావులూ, నెర్రెలు విచ్చిన పొలాలూ, వెచ్చని హోరుగాలీ… తన స్నేహితులిద్దరూ, కుసుమా, కామేశం… కాంతివేగంతో మనసులోకి వచ్చి వెళ్లిపోయారు.

అంతలోనే అతడు మూడవసారి పైకి లేచాడు. మళ్లీ చేతులెత్తి ఒడ్డున ఉన్నవారి నుద్దేశించి “బాబోయ్! రక్షిం…” అన్నాడు. అంతే. ఆ చేతులు నీరసంగా వాలిపోయాయి. పగబట్టిన పాముల సమూహంలా నీళ్ళు అతన్ని ‘రివ్వు’న లోపలికి లాక్కుపోయాయి. కొద్ది క్షణాల్లోనే ఒడ్డున ఉన్నవారికి అక్కడ ఏమీ కనిపించలేదు.

నది తన దోవన తాను భీకరంగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించిపోతున్నది. ఎక్కడో కొన్ని వందలమైళ్ళ దూరంలో మారుమూల పల్లెటూళ్ళో వూరియింట్లో నిద్రలోవున్న తల్లిప్రేగు కదిలింది.
(ప్రథమ ప్రచురణ: భారతి, 1965.)
----------------------------------------------------------
రచన: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment