Friday, September 7, 2018

ప్రయాణంలో పదనిసలు


ప్రయాణంలో పదనిసలు




సాహితీమిత్రులారా!


ఆదివారం కావడంతో, పొద్దున్నే కూడా జనంతో కిట కిట లాడి పోతోంది సికింద్రాబాదు బస్ స్టాండు. సూర్యుడు యదావిధిగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

“ఏమోయ్ ఎక్కడికి వెళ్తున్నావోయ్..” బాగా పరిచయమైన కంఠం విని పక్కకి చూసాడు గోపి. ఆ పిలిచింది తన ఇంటి ఓనరు వెంకట్రావుగారు. చూట్టానికి సన్నగా, పొడుగ్గా బుర్ర మీసాల్తో పాత సినిమాల్లోని రమణారెడ్డి లాగా అదోరకమైన కామెడీ ముఖంతో కనిపిస్తాడు.

“ఏమిటీ యేదైనా దూర ప్రయాణమా?” ‘అబ్బే, సరదాగ కొన్ని బస్సులు కొనుక్కుందామని వచ్చాను. పొద్దునే ఇక్కడకు దాపురించాలా స్వామీ అని మనసులో అనుకొని పైకి చెప్పాడు.

“అవునండి రేపు సోమవారం శలవే కదానీ నాగార్జునసాగర్ కు బయల్దేరాము.

“ఊహూ! మాటవరసకైనా అన్నావు కాదేం, నేను కూడా అక్కడికే. వీళ్ళు ముగ్గురూ ఎవరూ? మీ ఆఫీసు వాళ్ళా?”

“కాదండీ కాలేజీనుంచే ఫ్రెండ్సు. ఇతను రంగరాజు.. మలక్ పేట ఆంధ్రాబాంక్ లో పని, ఇతను చంచలమూర్తి, వాడు మురళి.. వీళ్ళిద్దరూ పోస్టల్ డిపార్ట్మెంటు, ప్రస్తుతం ముషీరాబాదులో రూమ్మేట్స్.” ఇంటి ఓనర్ని అందరికీ పరిచయం చేసాడు గోపి.

“ఐతే ఇకనేం పదండి అందరం కలిసే సాగర్కి పోయివద్దాం. ఒక్కణ్ణే వెళ్ళాల్సొస్తుం దనుకుంటే తోడుగా మీరందరూ దొరికారు” ఉషారుగా చిటికెలేస్తూ ఊగిపోతున్నారు వెంకట్రావుగారు.

“అవును నిజంగానే దొరికిపోయాం మరి!” నీరసంగా గొణిగాడు గోపి. ఉదయాన్నే వడ దెబ్బ తగిలి సోష వచ్చినట్టుగా ఉంది గోపి ఫ్రెండ్స్ కి. పక్కకి లాగి గోపి చెవిలో చెప్పారు
“పెళ్ళికి వెళ్తూ పిల్లిని తెచ్చుకున్నట్టు ఈ శనేశ్వరం గాడేమిట్రా మనతో కూడా వస్తా నంటున్నాడు. మనం వేరే ఏదైనా టాక్సీలొ గాని, లేకపోతే మాచెర్ల దాక రైల్లో వెళ్ళి అట్నుంచి బస్సులో గానీ పోదాం. ఆయన్ని మాత్రం త్వరగా వదిలించేస్కోరా..”.

“ఇదిగో నాకసలే ఈ టైపు ముసలి వాళ్ళంటే ఎలర్జీ. కోపం వచ్చి ఏమన్నా రాంగ్ పెట్టుకున్నా నంటే ఆపైన నీకే నష్టం, మీఇంటి ఓనర్ కదా..” వార్నింగ్ ఇచ్చాడు రంగరాజు.

“వూర్కోండి రా.. నెను తెల్లార్లేస్తే ఆయన గారి మొహమే చూడాలి. ఈంకొ విషయం.. ఏంటంటె యీయన గారొక పేద్ద చాదస్తం చ్చాటర్ బాక్సు. మనకీ దార్లో మంచి కాలక్షేపం కూడ అవుతుంది.. రానీండిరా పోనీ..” భరోసా ఇచ్చాడు గోపి.

“ఏంటయ్యోయ్, మా గోపీ చెవులో వూదర గొడుతున్నట్టున్నారే.. నాకేమన్న చెముడనుకున్నారా, మీ గుసగుసలన్నీ వినిపిస్తునే వున్నాయ్. నా నిమిత్తం ఖర్చులేవీ మీరు పెట్టక్కర్లేదులే.. ప్రయాణం పూర్తవగానే అణా పైసల్తొ సహా లెక్క గట్టి మరీ ఇచ్చేస్తా. కాకపొతే తిరిగొచ్చిందాకా మీలొ ఎవ్వరో ఒక్ఖరే ఖర్చులనీ పెడితే లెక్కలు తేలిగ్గా చూసుకోవచ్చు. ఏమంటావోయ్ గోపీ?”

“ఆహ డబ్బు గురించి కాదండీ. మేమంతా బాచిలర్ గాళ్ళం.. చాన్నాళ్ళ తర్వాత యీ ప్రోగ్రాం వేసుకున్నాం. సాగర్లో మాకోసం హోటల్ రూములవీ ముందే బుక్ చేసుకున్నాం. మాతో జాయిన్ అయితే మీకు బోర్ కొడుతుందేమోననీ…” ఆఖరి ప్రయత్నంగా కన్విన్స్ చెయ్య బోయాడు.

“ఇదిగో అబ్బాయీ, నీ పెరేమిటన్నావ్.. చెంచా మూర్తా?? మీరిద్దరూ..” ఆయన్ను మధ్యలోనే ఆపుతూ “ఆగండాగండీ. చెంచా మూర్తి కాదు – చంచల.. చంచల.. మూర్తి. ఆది గూడ నేను కాదు. నన్ను ముద్దుగ మురళి అంటారు “క్రిష్ణుడిలా ఫ్లూటు వాయిస్తున్న పోజు పెట్టాడు.

“అదే లేవయ్య, చెంచల మూర్తి.. దేముడి పేరేలే… నా నోరు తిరక్క అలా వచ్చి చచ్చింది” “ఆమాట కొస్తే అస్సలు ఎవ్వరికీ కూడ నోరు గిరగిరా తిరగదండి. ముఖంలో ఆ వున్నచోటేదో అక్కడె వుంటుంది. బుర్ర సరిగ్గా పంజేయకే ఇలా అవాకులూ చవాకులూ నోట్లోంచి పేలతాయి మరి.” నలుగురి లో చెంచా మూర్తి అన్నందుకు కాస్తంత ఉక్రోషంతో చెప్పాడు.

“వొరేయ్ మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. అసలు పాయింటుకు రారా మూర్తిగా. ఇదిగోండి వెంకట్రావు గారూ మీరు మాతో పాటు రావటానికి అభ్యంతరాల్లేవు గానీ, మా ఫ్రెండ్సుకు కొంచెం నోటి దురద (బొటన వేలుని మందు తాగే లాగా పెట్టి), అలాగే చేతి వాటం (ఎడం చేతిని కుడి చేతిలో పేక కలుపుతున్నట్టుగా రాస్తూ) కూడ కాస్త యెక్కువ. సో, మావల్ల మీకు యిబ్బందిగా వుండచ్చేమో..” గట్టిగా మీ దారిన మీరు వెళ్ళండి అని అందామన్నా కూడా ఆయంతో కష్టమేనని, వచ్చే వారమే రూం ఖాళీ చెయ్య మన్నాడంటే హైదరాబాద్ లో బాచిలర్లకి యిల్లు దొరకటం యెంత బ్రహ్మ ప్రళయమో అనుభవైక నైవేద్యం మరి.. అందుకే కొంచెం అర్ధింపు గానే నసిగాడు గోపి.

“యిదిగోండి అబ్బాయిలూ, మళ్ళీ చెబుతున్నా, నాకు మీవల్ల యెటువంటి యిబ్బందులూ వుండవ్, బస్సొచ్చే టైమౌతోంది.. మరి అలోచించకుండా మొత్తం అయిదు టిక్కెట్లూ తీసేస్కోండి.” ఘంటాపధంగా డిసైడ్ చేసేశారు. ఇంకా తప్పదన్నట్లు కౌంటర్ కేసి కాల్లీడ్చు కెళ్ళాడు గోపి. యీ లోగా వెంకట్రావు గారు మిగతా ముగ్గురినీ ఏడు తరాల వెనకనుంచీ బయోగ్రఫీ స్కానింగు తీసే కార్యక్రమంలొ మునిగి పోయారు.

***

యిదిగో కండక్టరూ, నాకు ఇంకో ఎగస్ట్రా టిక్కెట్టు యివ్వవోయ్. కదుల్తున్న బస్సు లోంచి పొలికేక పెట్టాడు వెంకట్రావు గారు.”అదేంటి సార్,అయిదుగురికీ ఇందాక టిక్కట్లు కొన్నాం గదా నమ్మకంలేదా?”

“నమ్మకం లేక కాదయ్యా, ఒక వేళ నాది పోతే.. సేఫ్ సైడుగా మరొకటి ఉంటుందని”

” ఆ అలాగా? మరి ఈ ఎక్స్త్రా టిక్కట్టు కూడా పోతే” రెట్టించాడు రంగరాజు.

” పిచ్చివాడా, నేను వొంటరి వాణ్ణి కదా. ఈ సమ్మర్లో ఎక్కడెక్కడకి తిరగాలని పిస్తుందోనని సీనియర్ సిటిజెన్ బస్పాస్ కూడా ముందే కొన్నాలే “. ఆయన సంగతిబాగా తెల్సిన గోపీ మాత్రం అది మామూలే అన్నట్టు కిక్కురు మనకుండా కూర్చున్నాడు.

“ఈయన అతిజాగ్రత్తకి,చ్చాదస్తానికి వీరతాడు వెయ్యాల్సిందే, తప్పదు ” తల అడ్డంగా తిప్పి నుదిటిమీద అరచేత్తో కొట్టుకొంటూ లోపల్లోపల అనుకోబోయి పైకే గొణిగాడు చంచల మూర్తి.

“అదిగో అదే భగవంతుడి సృష్టి లోపం అంటాన్నేను. చూశావా లోపల అనుకోబోయినా ఒక్కోసారి పైకే వచ్చేస్తాయి ఇలా మాటలు. నా మటుకు నేను ఏదీ లోపల్లోపల అనుకోను. అంతాపైకే, అదే బెస్టు కదా? ” ఈయనతో మాట్లాడటం కష్టం గానీరా, సాగర్ వెళ్ళాక మన రెండు రూముల్లో ఒకటి ఇచ్చి రెండో దాంట్లో మనం అడ్జస్టు అవుదాం”. ఒళ్ళు విరుచు కోవడానికి కూడా వోపిక లేకుండా నాలుగ్గంటలు బుక్కయిపోయిన గోపీని జాలిగా చూసి బస్సు దిగుతూ చెప్పాడు చంచల మూర్తి.

***

“ఇటు చూడవయ్య మురళీ, యీ డాము పైనుంచి క్రింద నీళ్ళ అడుగు దాక యెంత లోతు వుంటుందంటావ్?”

“ఎమో తెలియద్సార్, అయినా దిగితే గాని లోతు తెలీదంటారు కదా? ఒకవేళ నన్ను కొంపదీసి వో తాడు పట్టుకొని క్రిందకి దూకి కొలిచి చెప్పమంటల్లేదుగదా?”

“నువ్వు మరీ వెర్రి బాగులాడివి లా వున్నావే.. ఉట్టుట్టి నే అడిగా, నీకు యెంత అంచనా వుందో నని”

“మీ అంచనాలు తరుమారవ్వ, ఆ గిలిగింతలు నా దగ్గరెందుకులెండి. అంతా సవ్యంగా వుంటే వచ్చే యేడు పెళ్ళి గూడ చేసుకొని సెటిలవుదామనుకొంటున్నా. యిలా డాముల మీదనుంచి దూకే ఆలోచనలు పెట్టకండి ప్లీజ్..”

” ఏమో అనుకొన్నా నీఫ్రెండు గోపీలా కాకుండా.. నీకు కాస్త భవిష్యత్తు మీద ఆశ వున్నట్టుగ తోస్తోంది నాకు.”

“స్వామీ మీ దయ. పాపం గోపీ కూడ మీయింట్లో అద్దెకు దిగక ముందుదాకా గొప్ప ఆశావాదే. నాకు మటుకు యీ ప్రయాణం సజావుగా పూర్తయి ఇంటికి ఆరోగ్యంగా చేరగలిగితే గాని మిగతా భవిష్యత్తు ఎట్లా వుంటుందో ఆలోచించే ధైర్యం లేదు.” ఖచ్చితంగా చెప్పేశాదు రంగరాజు.

“వొరేయ్, భవిష్యతు మాటలకేం గానీ ముందు కాస్త వర్తమానంలోకి రండి. ఇంతాదూరం వచ్చాం, ఇక్కడకి 10 – 12 కి. మీ. దూరంలో యీ క్రిష్ణ ఒడ్డునే ఒక పల్లెటూరు వుంది, మంచి సీనిక్ గా కూడ వుంటుంది. త్వరగా లంచ్ చేసి వెళ్ళొద్దాం పదండి” చెప్పాడు గోపి.

” ఊ పదండి, సీనరీ లన్నా ఫోటోలన్నా నాకు మా చెడ్డ సరదా.” ముచ్చట పడ్డాడు వెంకట్రావు గారు.

“తియ్యడానికా.. దిగడానికా?” ముందు యీయన ప్రతిచోటకీ రడీ అవుతాడేంటిరా బాబూ ” గొణుగు తున్న మురళి కేసి వెంకట్రావు గారు గుర్రుగా చూడటంతో- పదండి చస్తామా అన్నట్టు మొఖనికి నవ్వు పులుముకొన్నాడు.

“యేం తగులు కున్నాడురా పొద్దున్నించీ యీయన. పోనీ కాం గా ఫాలో అయి వస్తాడా అంటే అదీ లేదు. గ్రామ రాజకీయాలనుంచి ప్రపంచ యుధ్ధాల దాకా.. తెరచిన నోరు ముయ్యకుండ దంచి కొడుతున్నాడయ్యే. పొరపాటున ‘ఊ’ కొట్టక పోయినా, లేదా మధ్య మధ్యలో వింటున్నామా లేదా అని అనుమానం వచ్చినా చిన్న చిన్న క్విజ్ లు పెడుతున్నాడు కూడ.” వాపోయాడు మూర్తి.

“యిప్పుడు చెప్పవోయ్, క్రిందటి దశాబ్దంలో ఇరాన్ వార్ జరిగినప్పుడు వాడిన మిస్సైళ్ళ పేర్లేమిటి?”

“శుభమా అని సాగర్ కి వస్తే, యీ మిస్సైళ్ళ గోలేమిటి మహానుభావా. ఈ క్రిష్ణ లో గనక మొసళ్ళూ గట్రా వుంటే వాటి నొట్లో తల పెట్టినా కొంచెం బెటరుగా వుండేలా వుంది” దూరంగా నడుస్తూ, రంగరాజు బలి అవటం చూసి అన్నాడు మురళి.

“చెప్పే తీరలంటారా, వేరే దారి లేదా” రోషంగా అన్నాడు రాజు, “నాకు అంత G.K. గనక వుంటే యెప్పుడో IAS అయ్యే వాడిని.”

“ఆ మాత్రం తెలీదుటయ్య, స్కడ్లయ్యా.. స్కడ్లు. మరియు పేట్రియాటికు మిసైళ్ళూనూ. ఇకపోతే.. యీ సాగర్ దేనికి ప్రసిధ్ధో అదయినా తెలుసా?”

“సుమారుగా కూడ తెలియదు సార్, యే మాత్రం అంచనా వేసే పరిస్తితి లో కూడా లేను. మెదడు మొద్దు బారి పోయి.. మొత్తం మర్చిపోయాను. నన్ను వదిలెయ్యండి స్వామీ..” ఆయన దగ్గర్నుంచి యివతల పడి మిత్రులతో చెప్పాడు” జీళ్ళ పాకంలా తగులుకొని, చెవిలో జోరీగ లాగా, కుట్టడానికి వచ్చే కందిరీగ లాగా.. వెంటాడుతున్నాడు గదరా మీ ఇంటాయన. పోనీ ఓ పదో పన్నెండో కిలో మీటర్లు నడిస్తే కాస్తంత ఆ చ్చాట్టర్ బాక్స్ నీరసం వచ్చి వాగుడు తగ్గించి మనల్ని బతికిస్తాడేమో చూడాలి ”

“యేంటయ్య మళ్ళా మీలో మీరే గొణుక్కుంటారూ? త్వరగా బయల్దేరండీ”

“యీయన గారి తిరుగుడు తొందర.. తిరపతెళ్ళ! అయినా యేం బాడీరా బాబూ, ఒక అలుపూ సొలుపూ లేదు. బుర్రమీసాలు మెలేసుకుంటూ మరీ మన బుర్రలు తాటి ముంజెల్లా భోంచేస్తూ మనతో సమానంగా తిరిగేస్తున్నాడు.”

“మెల్లగా.. మెల్లగా..నీ కామెంట్లు అయనగ్గానీ చెవిన బడితే నాకు డేంజర్రోయ్.” గొపీ బాధ గొపీది మరి.

“అందుకేరా.. వీడీమధ్య ఓనరు గారి ఉపన్యాసాలు వినీ వినీ యెదుటి వాడు చెప్పడం పూర్తి కాకుండానే అవునన్నట్లుగా తలాడించేస్తున్నాడు. అదుగో ఇప్పుడు రాజు గాడు ఎలా దొరికాడో విను” వానకి కాస్త వెనగ్గా నడుస్తూ కిసుక్కు మన్నారు గోపి, మురళి, ముర్తి.

“మొన్నో కొత్త తెలుగు సినిమా చూశానోయ్ రాజూ. అందులో హీరో చిన్న విలన్ని ముందే మర్డర్ చేసి, పెద్ద విలన్ని చంపేలోపు పోలీసులు అడ్డు పడతారు. వెంటనే జేబు లోంచి ఒక పేద్ద వీరప్పన్ మీసం తీసి మూతికి అంటించుకుంటాడు. అంతే.. పిచ్చి పోలీసులు హీరో పక్క పక్కనే తిరుగుతూ కూడ అతన్ని గుర్తు పట్టి చావలేరు. పైగా అతన్నే అడుగుతారు ‘ఇటు వైపు.. ఎర్ర చొక్కా వేసుకొని మూతికి మీసాల్లేని ఒక వ్యక్తి పరిగెట్టటం చూశావా అని..”

కొత్త సినిమాలంటే వెంకట్రావు గారికి ఎలర్జీ అని అర్ధమయ్యింది రాజు కి. ఇంక అంతే రెచ్చి పోసాగాడు” నేను కూడ మొన్న ‘ గిలి గిలి గోల ‘ అనే తెలుగు సినిమా చూశానండి. అందులో అయితే, హీరో తన గుడ్డి చెల్లినీ మూగ తల్లినీ, అందమైన హీరోయిన్నీ ఆటోలో గుడికి తీసుకెల్తుంటాడు. హీరో చేతిలో కొబ్బరి కాయని పదే పదే క్లోజప్పులో యెందుకు చొపిస్తున్నారో ముందు మనకు అర్ధం కాదు. ఆ కొబ్బరి కాయను గుళ్ళో దేవీ పాదాల దగ్గర గట్టిగ విసిరి కొట్టగానే అది రెండు చెక్కలై, ఒక చెక్క అతని తల్లి గొంతు మీద, రెండోది చెల్లి నుదుటిమీద తగుల్తుంది. ముందుగ చెల్లి గావు కేక”

అన్నయ్యా.. అమ్మా.. నాకు మీరందరూ కనిపిస్తున్నారోచ్ !” తర్వాత తల్లి కూడా కీచు కేక “బాబూ.. అమ్మాయ్.. నాకు మాటలు వచేస్తున్నాయర్రా! అంతా ఆ దేవి మహిమర్రా!’ ఆ తర్వాత సీను మారి హీరొ హీరోఇన్ లతో ‘ తోట కొస్తావా.. బీటుకాస్తావా’ అనే గ్రూపు సాంగ్ సింగపూర్ లో మొదలౌతుంది” ఇంతసేపటికి.. తను మాట్లడుతూ, వెంకట్రావు చేత వూ కొట్టగలిగించాను అని విచిత్రంగా మురిసిపొతున్నాడు రంగరాజు.

“వీడి సినిమాల గోల సిగ దరగా. ఇంకా యెంత దూరం రా? నడిచి నడిచి చేతులు పీకుతుంటె..” చెప్పాడు చంచల మూర్తి.

“విచిత్రంగా వుందే.. బాగా నడిస్తే కాళ్ళు గుంజాలి గానీ చంచాల మూర్తి చేతులు పీకుతున్నాయంటాడు?” అర్ధంగాలా మురళికి.

“పిచ్చివాడా మనవాడి పేకాట పిచి మర్చిపొయ్యావా? ఇప్పుడు మనం ఓ కే అనాలే గానీ హొటల్ రూం వెళ్ళే దాకా యెందుకూ, యీ చెట్టు కింద దుప్పటి పరిచి ముక్కలు పంచినా ఆశ్చర్య పడక్కర్లా” మురళి సందేహాన్ని పటాపంచలు చేశాడు గోపి.

“బాగా గుర్తుచేశావ్.. యీ పక్కనే అడ్వాన్సు గా ఒక సిట్టింగు వేద్దామేంటీ? చెట్ల మధ్యలో పేకాట వెరైటీగా కూడ వుంటుంది”

“వెరైటీయే గాదు.. గండు చీమలు, తేళ్ళు గట్రా కుడితే మంటగా కూడా వుంటుంది మరి. పేకాట పోగ్రాం- రాత్రి మందు సిటింగు లో కానిద్దాం గానీ ముందర అక్కడెదో చిన్న కొట్టు లాంటిదేదో కనిపిస్తోంది కాస్త పొట్టకేమన్నా దాణా కొట్టిద్దాం పదండి.” కసిరాడు గోపి.

“అప్పుడే ఆకలేమిటయ్యా ఏకంగా రాత్రి హోటల్కెళ్ళాక డిన్నర్ చెయ్యొచులే.” తిండి కంటే సైటు సీయింగే ముఖ్యం అన్నుట్టు చెప్పాడు వెంకట్రావు గారు.

“అయ్యా పొద్దున్నుంచీ మా బుర్రల్ని వరసపెట్టి బిర్యానీ మాదిరి భోజనం చేస్తున్నారు కాబట్టి మీకు ఆకలి వుండకపోవచ్చు ఆ కనపడే కొట్లో యేది దొరికితే అది అర్జంటుగా తినకపోతే అడుగు ముందుకు పడేట్టు లేదు మాకు.” చెప్పాడు రాజు. ఆ కొట్టు కం ఇన్ల్లు సెటప్పు దగ్గరకు రాగానే చంచల మూర్తి చూపు చురుగ్గా పని చేసింది. ” ఏంటి.. ఇది కలా నిజమా. ఇంత మారుమూల వూళ్ళోని సాధారణ మైన కొట్లో ఇంత టెక్నాలజీ పార్కు వెలిసిందా? విచిత్రం కాకపోతే ఇక్కడ కంప్యూటర్లు వుండటం యేమిటి? యెవడన్నాడ్రా ఇండియా ముందుకు పోవటం లేదని? వాళ్ళ గొంతుల్ని పేక ముక్కల్తో కోసేస్తా” ఆవేశంతో వూగి అరిచాడు.”నీ వీరంగం ఆపవయ్యా మగడా… కొంపదీసి ఇదేమన్నా తాకట్టు కొట్టేమో” వెంకట్రావు గొంతులో అనుమానం తొంగి చూసింది. షాపు వాడిని అడిగాడు.. “యెవరివి బాబూ యీ కంప్యూటర్లూ సెటప్పూనూ?”

“ఓర్ కిసీకా హైతో హమారే పాస్ క్యోం రెహ్తా… మావే హై బుడ్ఢా” స్టీలు ప్లేటు మీద మట్టి రాయితో గీరినట్టుగా వురిమాడు షాపు వాడు.

“వండర్ఫుల్. ఇండియాలో పల్లె పల్లెల్లో ఐ. టీ. ఇంత పురోగమిస్తోందా. గ్రామీణ వాతవరణంలో బడ్డీ కొట్లల్లో కూడా ‘e కామర్సు’ మూడు ‘మైక్రో సాఫ్ట్ లు’ ఆరు సన్ సాఫ్టుల్లా విరబూస్తోందన్న మాట. ఆనందంతో రాజు గట్టిగా ఓ సారి బల్ల గుద్దాడు. షాపు వాదు కోపంగా చూడటంతో, “ఆ అబ్బే ఏంలేదూ.. ఈ బల్ల ఏ మెటీరియల్ తో చేసివుంటారా అని..” నీళ్ళు నముల్తూ నాలిక్కర్చు కున్నాడు.

“ఇక్కడ సిర్ఫ్ ఇంటర్నెట్టే నహీ.. షాం కో హం ఒరాకిల్, జావా భీ సిఖా దేగా. పొద్దు గూకులా పేకాట భీ ఇధర్ చలేగ ”

“యేంటి పేకాట కూడానా?” ఆ మాట వింటూనే చంచల్ మూర్తి ఎగిరి గంతేసి లోపలికి దూకి, వెనకాలున్న మరో ముగ్గురితో నాలుగో హేండుగా మారిపోయి చతుర్ముఖ పారాయణంలొ క్షణాల్లో సెటిల్ అయిపోయాడు.

“చచ్చాంపో. ఇంక యీ మూర్తి గాణ్ణి ఇప్పట్లో బయటకి లాగటం మన వల్ల కాదు. కొంచెం సేపు వేడి వేడి బజ్జీలు, టీ లాంటివేమైనా కొట్టిస్తాడేమో షాపు వాడినడగండిరా” నీరసంగా కూలబడ్డారు మిత్ర బృందం. ఓ అరగంట పోయాక మూర్తి ని పిలిచాదు గోపి “మా టిఫిన్లు అయినాయి, ఇంక నీ పేకాట నించి లే.., ఇప్పుడు టైము ఎంతయ్యిందో తెలుసా?”

కుడిచేత్తో ఆఠీణ్ రాణిని కింద పడేసి, కళావరు రెండు తీసుకుని, పేకని మళ్ళీ కుడి చేతిలోకి మార్చుకొని ఎడం చెయ్యి గొపి ముఖం కెసి ముందుకు చాపాడు. టైము చూసుకో మన్నట్లుగా. “వీడి పేకట పిచ్చ పందులు తోల.. కనీసం టైము చూసుకొనే టైము కూడా లేదు వెధవ కిప్పుడు. ముక్కూ మొహం తెలీక పోయినా వాళ్ళతో రెచ్చిపోయి మరీ ఆడేస్తున్నాడు చూడు” బిల్లు కట్టడానికి షాపు వాడి చేతిలో వంద రూపాయల నోటు పెడుతూ చెప్పాడు. నోటుని యెగా దిగా చూసి వెనక్కి పావలా చిల్లర ఇచ్చాడు. “యేమిటీ యీ బజ్జీలు, చాయి కలిపి తొంభై తొమ్మిది రూపాయల ముప్పావలానా?” వెంకట్రావు గారు తన గణిత పరిజ్ఞానాన్ని రిఫ్రెష్ చేసుకుంటూ వేళ్ళు తెరుస్తూ మూస్తూ అవస్తలు పడుతున్నారు.

“ఫిర్? ఉస్ చారనా భీ అక్కర్లేకపోతే వాపస్ దేవ్.” హుంకరించాడు షాపు వాడు. గడ్డం తీసేసి క్లీన్ షేవ్ చేసిన బిన్ లాడెన్ లా వున్న షాపు వాడు.. కొట్టినా కొట్టవచ్చు నని కొంచెం తగ్గాడు వెంకట్రావు గారు. ఒకవేళ కొంపదీసి బిన్లాడెనే ఇండియా పారిపోయీ యీ పల్లె ప్రాంతాల్లో ఇలా కంప్యూటర్లూ, ఇంటర్నెట్టూ పెట్టుకు బతికేస్తున్నాడేమొ అన్న అనుమానం కూడ పెద్దాయనకు రాక పోలేదు. తొందరగా అక్కడ్నుంచి కదలకపోతే ఏ. కే. 47 తో కాల్చినా దిక్కులేదని , “ఇదిగో చెంచు ముర్తీ.. పద పద మిగతా పేకాట రాత్రికి హోటల్లో ఆడుకోచ్చులే”లోపల చంచల మూర్తి మాత్రం నిదానంగా మూడు సార్లు పేకని అటూ ఇటూ షఫుల్ చేసి, కట్టలోంచి వచ్చిన ఒక ముక్కని చిద్విలాసంగా తన ముక్కల మధ్య వుంచాడు. పక్కన ప్లేటు లోంచి ఒక మెరపకాయ బజ్జీని మధ్యకు కొరికి, కచా పిచా నముల్తూ, అక్కడి ముగ్గురి అగంతకులనీ ఒకసారి తేరిపార జూసి, చిన్నగా నవ్వి, చేతిలోని ముక్కల్ని మరొసారి విడి విడిగా బ్రేక్ చేసి టేబుల్ మీద పరిచి గట్టిగా చెప్పాడు, “షో”. “వీడి పేక చాతుర్యానికి పాడె కట్టా.. పెద్ద పండితుడి లా ఆ పోజు చూడు. షో చెప్పడానికి పెద్ద సీనే చేస్తున్నాడిక్కడ. బాబూ ఇంకా లే.. కాసేపు ఇక్కడే వుంటే, యీ బిన్ లాడెన్ గాడు మన అందరి దగ్గరున్న డబ్బంతా లాక్కునేలా వున్నాడు.” ఆ నలుగురూ చంచల మూర్తిని బలవంతంగా రెక్కలు పట్టి బయటకు లాగారు.

***

ఆ రాత్రి ముందుగా అనుకున్నట్టుగా వెంకట్రావు గార్ని హొటల్లో ఒక రూంలో వుండమని, బుక్ చేసిన రెండో రూములో మిత్రులు నలుగురూ చేరారు. తిరిగి తిరిగి వున్నందువల్ల పెద్ద శాల్తీ తొందరగానే నిద్రలోకి జారుకుంది. పక్కరూం లోంచి వెంకట్రావు గురక ఇవతలి రూం లోని మిత్రులకు గులాం ఆలిఖాన్ వాద్య నాదం లా లయ బధ్ధంగా వినిపిస్తోంది. మొదటి సారిగా జాతికి స్వాతంత్రం వచినంత సంతోషం గా వుంది వాళ్ళకి. గంతులు వేస్తున్నారు. ఈంక రక రకాల రంగుల మందు సీసాలు, సొడా బుడ్లు, వేడీఇ వేడీ బిర్యానీ పొట్లాలూ, చిప్సూ, జీడిపప్పు ప్యకెట్లూ ఏదీ తక్కువ లేకుండా సిసలైన బ్యాచిలర్ల మందు పార్టీకి ఆ రూంలొ రంగం సిధ్ధం చేశారు. చంచల మూర్తి అయితే ఎందుకైన మంచిదని మరో రెండు కొత్త పేక దొంతులు కూడ కొని తెచ్చాడు. నైటు క్లబ్బుని తలదన్నే మందు వాతవరణం వెల్లి విరుస్తోందా గదిలో.

రాత్రి సుమారు మూడు గంటల దాక ఆడుతూ ..చిత్తుగా తాగుతూ తలుపులు మూసుకోకుండానే నిద్రలోకి జారు కున్నారు మిత్రులు. అప్పుడే వూహించని సంఘటనొకటి జరిగింది. ఆ హోటల్లో యేవో డ్రగ్సు మారకం, బ్లూ ఫిల్ములూ, వ్యభిచారల్లాంటివి జరుగుతున్నయని టిప్పు దొరికి, వానులోంచి పోలీసులు సడెన్ గా ప్రతి రూమూ చెకింగు కోసం రైడుకు దిగబోతున్నారు. అయితే తెల్లవారుజామునే నిద్ర లేచే అలవాటున్న వెంకట్రావు పోలుసుల వాను అగిన అలజడి కి లేవటం, రాబోతున్న ప్రమాదాన్ని గ్రహించి.. పక్క రూము లో అస్తవ్యస్తం గా లుంగీలు ధరించి చెల్లా చెదురుగా పడుకొని వున్న గోపీ బృందాన్ని చూసి, ఖాళీ బాటిళ్ళనీ, తినేసిన ఫుడ్డు పొట్లాల్నీ పేక ముక్కల్నీ చక చక కవర్లల్లో పడేసి కిటికీ లోంచి బిల్డింగు వెనక వైపు దూరంగా పారేసి క్షణాల్లొ శుభ్రం చేసేశారు. పైగా అదే రూం లో పక్కనే ఖాళీగా వున్న సోఫా కుర్చీలో తానూ ముడుచుకొని అమాయకంగా పడుకొన్నారు కూడా. పోలీసు బూట్ల చప్పుడు చేసుకొంటూ ఆ గదిలోకి వచ్చి బాచిలర్సుతో తమ దైన శైలిలో అనుమానపు ప్రశ్నలు మొదలెట్టారు.

అపుడు వెంకట్రావు గారు కలగ చేసుకొని…” అయ్యా వీళ్ళు నా మనవళ్ళండీ.. అందరం విహార యాత్రకని హైద్రాబాదు నుంచి వచ్చాం..” ఆయన నాన్ స్టాప్ పాతకాలం వాగ్ధాటికి పొలీసులకి ఇంక అక్కడ టైము వేస్టనిపించి సారీ చెప్పి మరీ వెళ్ళి పోయారు. ఇంత ఆట పట్టించిన వెంకట్రావు గారు సమయానికి అడ్డు చక్రం వెయ్యక పోయి వున్నట్లయితే, యీ పాటికి పోలీసు వ్యాన్లో వుండి పొద్దున్నే వూచలు లెక్కబెట్టే వాళ్ళం అన్న నిజం తల్చు కుంటుంటే వాళ్ళకి వెన్నులొ ఎక్కడో వణుకు తగ్గట్లేదు. తాము చేసిన వీరంగానికి జైల్లో ఇరుక్కున్నట్టయితే నిజంగా ఎంత పరువు నష్టమో కదా! అమాంతం నలుగురూ వెంకట్రావు గారి కాళ్ళ మీద పడ్డారు. ఇప్పుడాయన వాళ్ళకి ఆ ఉషొదయాన చ్చాట్టర్ బాక్స్ చ్చాందసుడి లా కాదు.. సాక్షత్తూ తమని కాపాడిన చక్రధారి లాగ కనిపిస్తున్నారు!
----------------------------------------------------------
రచన - ప్రసాద్ కొమ్మరాజు, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

No comments:

Post a Comment