Wednesday, September 12, 2018

పాదూఖండం


పాదూఖండం




సాహితీమిత్రులారా!




సాధారణంగా ఒక పద్యకావ్యాన్ని విమర్శించేటప్పుడు అందులోని వర్ణనలూ, పద్య శిల్పం, సౌందర్యం మొదలైన విషయాలని వివరించడం పరిపాటి. కావ్యంలో అవి ముఖ్యమైన అంశాలే అయినా, ఒక కావ్యం మహాకావ్యం అవడానికి అవసరమైనది ప్రధానంగా అందులోని రసపోషణ. ఐతే రసమనేది ఆకాశంనుండి ఊడిపడే పదార్థమేమీ కాదు. కావ్యంలోని పాత్రల చిత్రణ, కథాకథనం, సంభాషణలు, వర్ణనలు ఇవే రసపోషణకు కారకాలూ, ప్రేరకాలూను. ఇక్కడ కావ్యమంటే, కథాకావ్యమని నా ఉద్దేశం.

రామాయణకల్పవృక్షం – పాదూఖండంలో ఇవి ఎలా నిర్వహింపబడ్డాయో అనుశీలించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం. సాధారణంగా స్వతంత్ర కావ్యాలలో అయితే ఈ విషయాలను గమనించడం కొంత సులువే. అనువాద లేక అనుసరణ కావ్యాలలో పాత్రపోషణ, సంభాషణలు, కథాకథనం మూలానికి భిన్నమైన సందర్భాలను మాత్రమే గుర్తించి గ్రహించాల్సి ఉంటుంది. కల్పవృక్షం వాల్మీకానికి అనుసరణే. అయితే విశ్వనాథ అసాధారణ కవి. కాబట్టి కల్పవృక్షంలో అలాంటి విశేషాలను గుర్తించడం కష్టమైన పని కాదు.

పాదూఖండంలో మనకి కనిపించే పాత్రలు వాల్మీకి రామాయణంలోనివే. భరతుడు, కైక, రాముడు, లక్ష్మణుడు యిలా.అయితే విశ్వనాథ రచనలో అవే పాత్రలు ఒక వినూత్న వ్యక్తిత్వంతో ప్రకాశిస్తాయి. పాత్రస్వభావాన్ని ఎన్ని రకాలుగా ఉద్దీపింపజెయ్యవచ్చునో అన్ని రకాల techniques పాదూఖండంలో గమనించవచ్చు. ఉదాహరణకి చిత్రకారుడు తన కుంచె అంచుతో గీసిన ఒక్క రేఖతో తన చిత్రానికి ఒక కొత్త అందాన్ని కూర్చినట్లుగా ఒకే ఒక్క మాటతోనో, చిన్న సన్నివేశంతోనో పాత్రకి విశిష్ట వ్యక్తిత్వాన్ని కలిగించడం ఒక technique. అయోధ్య రాజకర్తలు, మంత్రులు భరతుని దగ్గరకు వెళ్ళి అతణ్ణి రాజ్యాభిషిక్తుని కమ్మని కోరుకుంటారు. అయోధ్యా సింహాసనానికి భరతుడు తగినవాడని తనని పొగుడుతారు. అప్పుడు భరతుడు రాజ్యాభిషేకాన్ని తిరస్కరిస్తాడు. రాముణ్ణి తిరిగి అయోధ్యకు తేవడానికి అయోధ్య అంతా తరలి వెళ్ళాలని ఆదేశిస్తాడు. ఇంతవరకూ కల్పవృక్షం వాల్మీకాన్ని యథాతథంగా అనుసరించింది. తర్వాత ప్రజలందరూ చాలా సంతోషించి యాత్రా ప్రయత్నాలు ప్రారంభిస్తారు వాల్మీకంలో. కల్పవృక్షంలో వాళ్ళంటారూ,

“నీ వొక్కండవును బ్రజా
భావ మహాసాగరంబు పట్టిన లోతుల్
భావంబున నెఱిగిన మే
ధావంతుడ వంచు సమ్మదంబున బలుకన్”

ఇది ఆశ్చర్యకరమైన మాట! భరతుడి వ్యక్తిత్వాన్ని మరింత దీప్తిమంతం చేసే మాట. అయితే విశ్వనాథ కల్పన అంతటితో ఆగిపోదు! అప్పుడా మాటలకి భరతుడి ప్రతిస్పందన ఎలా ఉంటుందని ఊహిస్తాం? ఏమూహించినా ఇలా అంటాడని ఊహించలేం!

“భరతుడు నవ్వి యీ దృశము భావము లోపలనుంచి ధారుణీ
వరుడవు గమ్మటంచు నను బల్కితిరీ వెడమాట పొండు”

అని అంటాడు. ఈ చిన్న మాటతో భరతుడి వ్యక్తిత్వం ఎంతగా ఎదిగిందో, విస్తరించిందో పాఠకులకు అనుభవైకవేద్యం.

వివిధ సన్నివేశాలలో వివిధ పాత్రల ప్రవర్తన ఆయా పాత్రల స్వభావాన్ని వ్యక్తీకరిస్తుంది. తన ప్రవర్తన ద్వారా వాల్మీకంలో కన్నా కల్పవృక్షంలో భరతుడు ఔన్నత్యాన్ని పొందిన సన్నివేశం ఒకటి పాదూఖండంలో ఉంది. భరద్వాజుడు భరతుణ్ణి తన ముగ్గురు తల్లులని పరిచయం చెయ్యమన్నప్పుడు భరతుడు కౌసల్యని రాముని తల్లిగా, మహితాత్మురాలిగా పరిచయంచేస్తాడు. అలాగే సుమిత్రను అకలంకాత్మగా పరిచయం చేస్తాడు. తర్వాత వాల్మీకంలోని భరతుడు కైకను తన తల్లిగా పరిచయం చేస్తూ మరల ఆమెను దూషిస్తాడు. అదే సన్నివేశాన్ని కల్పవృక్షంలో ఇలా చిత్రించారు విశ్వనాథ:

“అని వచించి కైకేయి ముఖాబ్జమందు
జూచి చూపును మఱలించి చూడకుండ
మాటలాడక యుండిన మౌని నవ్వి
యీమె నీ చెప్పకయె నాకు నెఱుగ నయ్యె”

ఈ చిత్రణ ఒక్క భరతుడి పాత్రనేకాక ఆ సన్నివేశం మొత్తాన్ని ఔచితీమహితంగా తీర్చిదిద్దింది! ఒకే సందర్భానికి రెండు పాత్రలు స్పందించే తీరులోని అంతరాలని చూపించడం ద్వారా ఆ పాత్రల స్వభావాలని పాఠకుల మనస్సులలో ముద్రించడం మరొక technique. భరతుడు యమునా నదిని దాటుతూ ఆమెనిలా ప్రార్థిస్తాడు –

“తల్లీ! పద్మాక్షుని రామచంద్రు గొని రాలేనా! కనీసంబు త
చ్చ్రీ పాదూయుగమైన మోసెద గటాక్షింపంగదే! వాహినీ!”

ఈ మాటలను కౌసల్య, కైక ఇద్దరూ వింటారు. విని ఎవరేమనుకుంటారో ఒక పద్యంలో చెప్తారు విశ్వనాథ:

“అనిన గౌసల్య భరతుడు వనము నందె
యుండిపోవునొయం చెద నుమ్మలికము
పొందె, గైకేయి భరతుని ముసురు దుఃఖ
మొత్తిగిలె నంచు సంతసం బొందె నెడద”

ఒకే మాటలు ఇద్దరికి రెండు రకాలుగా అర్థమయ్యాయి. ఆ అర్థమవడంలోని తేడా ఆ పాత్రల స్వభావాలలోని అంతరాన్ని ఎంత బాగా పట్టిస్తోంది! కౌసల్య బేల మనసు భరతుడు కూడా రాముని పాదసేవకంకితమై అడవిలో ఉండిపోతాడేమోనని అనుకుంటుంది. కైకేయికి మాత్రం తెలుసు రాముడు రాజ్యానికి రాడు, భరతుణ్ణి రాజ్యం విడిచి రానివ్వడూ అని. కనీసం ఒక మధ్యేమార్గం భరతుడికి తట్టిందని ఆమె సంతోషిస్తుంది. నిజానికి ఆ మధ్యే మార్గం ఆ క్షణంలో భరతుడికి కూడా తెలీదు. రాముడు ససేమిరా అయోధ్యకు రానన్నప్పుడు యమున కరుణవల్లనో యేమో ఈ మాటలు అప్పుడతనికి గుర్తుకువచ్చి ఉండాలి. అదే అతని చేత పాదుకలని అడిగించింది. అయితే ఈ మనోవ్యాపార విశ్లేషణ విశ్వనాథ వాచ్యం చెయ్యడు. పాఠకుల ఆలోచనకే వదలి పెడతాడు.

కల్పవృక్షంలో కైక పాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అయోధ్యాకాండే కాదు, రామాయణమంతా కూడా చాలా అద్భుతంగా పోషింపబడిన పాత్ర అది. అయితే పాదూఖండంలోని విశేషమేమిటంటే మొత్తం రామాయణంలో కైకేయిని అర్థం చేసుకుని ఓదార్పు వాక్యాలు పలికిన ఒకే ఒక వ్యక్తి భరద్వాజుడు. అది జరిగేది ఈ ఖండంలోనే! వాల్మీకంలో కూడా భరద్వాజుడు ఈ సందర్భంలో ఓదార్పు వాక్యాలు పలుకుతాడు. అయితే పాదూఖండంలో భరద్వాజుని మాటలు చదివితే, అవి విశ్వనాథ మాటల్లాగే అనిపిస్తాయి. విశ్వనాథ కైక పాత్రని ఆ రకంగా తీర్చడం వెనకాలున్న ఆలోచన ఆ మాటలలో ప్రతిధ్వనించినట్లుగా తోస్తుంది.

“సకలము కర్మాధీనము
సకలము నియమిత ఫలంబు చాన! యిది యే
రికి తెలియబోవదవ్వా
రికి మాత్రము నీ కృతి విపరీతార్థమగున్!

కర్మ చిట్టకములు కాననేరని వారి
కీ వొకర్త వేమి యీశ్వరుండు
దుష్ట కర్మ యుతుడు తోచును లోకమ్ము
నజ్ఞతకును మాయ యనుట యెల్ల

దేవతలును, మానవులును,
దేవతలీ కృతికి నిన్ను దెలతురు మనుజుల్
నీ విధములు నిందింతురు
నీ వెయ్యది కోరెదిందు నీవే కనుమా!”

తన కైక పాత్ర చిత్రణకి ఒక హేతుబద్ధమైన పునాది నిర్మించడానికే విశ్వనాథ భరద్వాజుని నోటినుండి ఈ మాటలను పలికించాడేమో!

ఇక కథాకథనం గురించి. కథ ఒకటే అయినా చెప్పే విధానంలో తేడా ఉంటే అదే కథ కొత్తగా అనిపిస్తుంది. “నా భక్తి రచనలు నావిగాన” అని మొదటే శపథం చేశారు విశ్వనాథ. దానికి తగ్గట్టుగానే కల్పవృక్షంలోని కథాకథనం నిత్యనూతనంగా సాగుతుంది. వాల్మీకి రామాయణంలో ఒకొక్క కాండా సర్గలుగా విభజింపబడింది. ఒకొక్క సర్గ ఒకొక్క ఘట్టంగా సాగుతుంది. కల్పవృక్షంలో కాండలు ఖండాలుగా విభజింపబడ్డాయి. ఒకో ఖండం ఒకో ఖండకావ్యంగానే భాసిస్తుంది. ఒక రకంగా చూస్తే పాదూఖండానికి నాయకుడు భరతుడు. మొదటినుంచీ కూడా మొత్తం కథనమంతా భరతుని చుట్టే సాగుతుంది. అది చదువుతున్నప్పుడు నాకొక అనుమానం వచ్చింది. భరతుడు రాముడి దగ్గరకు వస్తున్నప్పుడు ముందుగా లక్ష్మణుడు చూస్తాడు. చూసి యుద్ధానికి వస్తున్నాడని అనుమానిస్తాడు. ఈ సన్నివేశం చిత్రించాలంటే, ఒక్కసారిగా కథనం భరతుడి నుంచి రాముడి వద్దకు మారాలి. ఈ మార్పు పాదూఖండంలోని కథాప్రవాహాన్ని(flow ని) భగ్నం చేస్తుంది. ఈ సమస్యని విశ్వనాథ ఎలా పరిష్కరిస్తాడా అన్నది అనుమానం. చాలా ఉత్కంఠతో ఆ ఘట్టం కోసం ఎదురుచూశాను. భరతుడు రామునిదగ్గరకు రావడం జరిగిపోయింది. వస్తూనే రాముని పాదాలపై పడడం జరిగిపోయింది. అయితే నేననుకున్నది సరైనదే, కథాగమనానికి భంగం అని ఆ సన్నివేశాన్ని విశ్వనాథ వదిలేశారు అని అనుకున్నాను. అయినా అంత ముఖ్యమైన సన్నివేశాన్ని వదిలేస్తారా అని మళ్ళీ అనుమానం. రామ భరతుల సంవాదం అయిపోయి భరతుడు రామపాదుకలని తీసుకుని బయలుదేరుతాడు. అప్పుడు చూపించారు విశ్వనాథ, తన కథాకథన శిల్ప మహత్వాన్ని. అలా వెళ్లిపోతున్న భరతుణ్ణి రాముడూ, సీతా అలా చూస్తూ ఉంటే, లక్ష్మణుడు అన్నగారి ఆనతి తీసుకొని భరతుడి దగ్గరకు వస్తాడు. వచ్చి భరతుడి కాళ్ళమీద పడి క్షమించమంటాడు. భరతుడు ఆశ్చర్యపోయి కారణమడుగుతాడు. అప్పుడు లక్ష్మణుడు భరతుడు వస్తున్నప్పుడు తను అనుమానించిన సన్నివేశాన్ని వివరించి, అన్న రాముడు చెప్పింది అక్షరాల నిజమయ్యింది అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు. కథా కథనంలో విశిష్టత అంటే ఇది! కథ నిలా నడిపించడం వల్ల మూడు ప్రయోజనాలు కలిగాయి:

భరతుడి చుట్టూ తిరిగే పాదూఖండ కథనానికి భంగం కలగలేదు.
భరతుణ్ణి క్షమాపణ కోరుకోవడం ద్వారా లక్ష్మణుడి పాత్రకి ఔన్నత్యం కలిగింది. పైగా అతని నోటి నుండి ఆ సన్నివేశం చెప్పించడం ద్వారా మరింత రసవంతం అయ్యింది.
వాల్మీకంలో ఆ సన్నివేశాన్ని చిత్రించే ముందు, సీతారాముల వన విహార వర్ణన కొంత ఉంటుంది. ఆ వర్ణనని అనసూయాఖండానికి (అంటే భరతుడు తిరిగి వెళ్ళిపోయాక) మార్చారు విశ్వనాథ. భరతుడు వచ్చే వరకూ రాముని మనస్సులో కూడా తండ్రి గూర్చిన ఒక ఆవేదన ఉన్నట్టుగా చిత్రించారు. ఇది రాముని పాత్రకి గొప్పతనాన్ని ఇస్తుంది. ఎందుకంటే, వాల్మీకంలోనూ కల్పవృక్షంలోనూ కూడా, భరతుడికి తండ్రి గూర్చిన పీడకల వచ్చినట్లుగా చిత్రించబడింది. భరతుడికే అలాంటి భావన కలిగినప్పుడు, రాముడికి కలగదా, కలిగితే సీతతో హాయిగా వనవిహారం ఎలా చేస్తాడు అన్న సందేహం కలుగుతుంది. ఆ సందేహానికి తావీయని కథనం విశ్వనాథ వారిది.
ఇక సంభాషణల గూర్చి చెప్పాలంటే, ఇంచుమించు పాదూఖండమంతా ఉదహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుహుడు, సుమంత్రుడూ, భరతుడూ మధ్య జరిగే సంభాషణ. రామ భరతుల సంవాదం సరే సరి! అవి పాఠకుల అనుభవానికే వదిలిపెడుతున్నాను. అయితే చాలామంది గమనించకపోయే అవకాశం ఉన్న ఒక్క సందర్భం గురించి మాత్రం వివరిస్తాను. రామాయణంలో భరద్వాజుని విందు ప్రసిద్దమైనదే. రాముని అన్వేషిస్తూ వచ్చిన భరతుడికి, అతని పరివారానికీ ఒక రాత్రి గొప్ప విందుని ఏర్పాటు చేస్తాడు భరద్వాజుడు. ఇంద్రవైభోగాన్ని చూపిస్తాడు. దాన్ని గురించి మొత్తం ఒక సర్గంతా వర్ణిస్తాడు వాల్మీకి. ఇంతకీ ఈ విందులోని పరమార్థమేమిటి, అది అంతలా ఎందుకు వర్ణించాడు అన్న సందేహం సామాన్య పాఠకులకి కలగవచ్చు. దాన్ని కొంత ధ్వనింపచెయ్యడానికి విశ్వనాథ, భరద్వాజుడి చేత తను తీర్చిన విందెలా ఉందని భరతుణ్ణి అడిగిస్తాడు. భరతుడంటాడూ,

“మరులును గొంచు నీ యుటజమండలి యందె నివాసముందు మం
దురు రఘురామ దర్శనము త్రోవనె పట్టరు కృష్టచేతసుల్”

అని తన సేనగూర్చి చెప్తాడు.

అది విని భరద్వాజుడు, పోనీ “ఈ రేయికూడ నుండియ పోరాదా” అని భరతుణ్ణి అడుగుతాడు. దానికి భరతుడు “దవ్వుపోవలె స్వామీ! శ్రీరాముండేమనునో తీరిక లేదెడద నేమి తెల్పుదు” అని అంటాడు. ఈ చిన్న సంభాషణలో భరద్వాజుడి విందు వెనుకనున్న ఆంతర్యాన్ని ఎంతగా ధ్వనింపచేసాడో, భరతుడి మనస్స్థితిని ఎంతలా వ్యంజింపజేసాడో చూడండి!

చివరగా ఇందులోని రసపోషణగురించి, నాకు తోచిన ఒక విశేషాన్ని ప్రస్తావించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. అయోధ్యాకాండ ఒక రకంగా భక్తుల కథల సమాహారం. దశరథుని భక్తి ఒకరకమైతే, కౌసల్య భక్తి ఒకరకం. లక్ష్మణుడు, గుహుడు, అయోధ్యా ప్రజలు ఇలా అందరూ రాముని భక్తులే. కైకకూడా ఒక రకమైన భక్తురాలే! ఈ భక్తులందరిలోకీ పరమ భక్తుడు భరతుడు. ఆ పరమ భక్తుని కథే పాదూఖండం. అందుచేత ఇందులో ప్రథానంగా కనిపించేది భక్తి రసం. కానీ కల్పవృక్షం శాంతిరస ప్రధానం. వాల్మీకంలోనిది కరుణ అని అంటారు. ఒక రకంగా చూస్తే భక్తి, కరుణ, శాంతి రసాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. భక్తుల కథలూ వాళ్ళ కష్టాలూ కరుణామయాలు. చివరకి భగవంతుని అనుగ్రహంతో అవి శాంతిని పొందుతాయి. పాదూఖండంలో కూడా ఇదే గమనించవచ్చు. భరతుడి పాత్రపై మనకు చాలా జాలి కలుగుతుంది. ఒక వంక తండ్రిని కోల్పోయాడు, తల్లి నిందల పాలయ్యింది, అందరూ తనని అనుమానిస్తారు. అన్నిటికన్న ముఖ్యం తన దైవం అడవులు పట్టిపోయాడు. అవును రాముడు కేవలం భరతుడికి అన్నే కాదు, దైవం కూడా.

“…రాముడన్నగా
రా పయి నేను దమ్ముడనటంచును నూహయె లేదు నాకు దా
నో పరముండు రాముడని, యొక్కడ జీవుడ నంచు నెంచెదన్!”

ఇది అద్వైత భక్తి! కల్పవృక్షం అద్వైత మతానుసారంగా విశ్వనాథ రాసానని చెప్పుకోవడంలో అర్థమిదే.

అంతటి పరమ భక్తుడైన భరతుడు, తన దైవమైన రాముణ్ణి పూర్తిగా తన వశం చేసుకోలేక పోయాడు. చివరకు ఆ దైవానికి గుర్తుగా అతని పాదుకలను స్వీకరిస్తాడు. రామాయణ కాలంలో విగ్రహారాథన ఉన్నదో లేదో తెలీదు. ఉండకపోవడానికే ఎక్కువ అవకాశం. అలాటప్పుడు ఈ పాదుకల ఆరాధనే ప్రథమ విగ్రహారాధనగా భావించవచ్చు. అలా భావించమనే విశ్వనాథ ఉద్దేశం. అందుకే భరతుని పాదుకల సేవను, అచ్చం నేటి విగ్రహారాథనలాగే వర్ణిస్తారు పాదూఖండం చివరలో.

ప్రొద్దునే లేచి పులికాపుపెట్టును
నింబరసాభిషేకంబు సేయు
తడియెల్ల బ్రావార మిడి మార్జనము సేయు
భక్తితో పీఠంబుపైని జేర్చు
సేవకుల్ తెచ్చిన పూవుల నర్చించు
ధూపదీపాదులతో యజించు
నలత సహస్రనామార్చన గావించు
నైవేద్య మిడిన యన్నమ్ము దినును

ఊర్ధ్వ సంవ్యానమును గటి కుగ్గకట్టి
నిలిచి సాష్టాంగపడి నొసల్ నేలతాక
లేచి స్తోత్రమ్ములను బాడి లీన మగును
బరమ భాగవతుండైన భరతరాజు.

పాదూఖండం ఆ పరమ భాగవతుని కథ. చదివిన కొద్దీ చవులూరించే రసమయ గాథ.
--------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో 

No comments:

Post a Comment