Monday, September 17, 2018

అద్దెకిచ్చి చూడు(కథ)


అద్దెకిచ్చి చూడు(కథ)
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

“వెళ్ళండి. ఇకమీదట నా ఇంటికి రావాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోండి.” మెత్తగానే చెప్పినా, కర్ణకఠోరంగా వినిపించింది నీనా కపూర్ కంఠం.

రుద్ర మొహం చూస్తే భయం వేసింది–ఎక్కడ ఆమె పీక పిసుకుతాడేమోనని.

“పద పోదాం,” తెలుగులో మెల్లిగా అన్నాను.

మాట్లాడకుండా నా వెనకాలే మెట్లు దిగాడు. కారెక్కేటంతవరకూ ఇద్దరి మధ్యా మౌనం. అప్పటివరకూ అదుపులో పెట్టుకున్న ఫ్రస్ట్రేషన్, కోపం కారు గేర్లు మార్చడంలో చూపించాడు.

“మానసీ, ఎందుకాపేవు నన్ను? ‘తన ఇల్లా!’ ఎంత ధైర్యం? ముందువైపు బాల్కనీ చూశావా? పైకెళ్ళే మెట్లకి ఇనుపతీగలు చుట్టించింది. మెట్లెక్కుతుంటే చెయ్యి అడ్డం పెటింది. అక్కడేం కట్టించిందో ఏమో!”

అవి ప్రశ్నలు కావనీ తనలో ఉప్పొంగుతున్న ఆవేశం బయటపడుతోందనీ తెలుస్తూనే ఉంది.

ఆ తరువాత ఢిల్లీలో ఆ పశ్చిమ్ విహార్ నుంచి చాణక్యపురిలో ఉన్న మా గవర్నమెంట్ క్వార్టర్స్‌కి చేరుకునేవరకూ మాటల్లేకుండానే ఎవరి ఆలోచనల్లో వాళ్ళం పడ్డాం.

ఐదేళ్ళ కిందట ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లందరూ కలిపి కట్టుకున్న హౌసింగ్ సొసైటీలో మాకు పై అంతస్తు అలాట్ అయింది. చెప్పకేం! సంతోషంగానే అనిపించింది. వంటింటి పక్కనుంచి డాబామీదకి వెళ్తే, చిన్నదే అయినా, పనివాళ్ళకోసం కట్టించిన ఒక గది, బాత్రూమ్ అదనంగా దొరికాయి. మేమున్న గవర్నమెంటు ఇల్లు ఎంత విశాలంగా, ఎన్ని వసతులతో ఉన్నప్పటికీ ఇది స్వార్జితంతో కట్టుకున్నది. అలాట్మెంట్ లెటర్ పుచ్చుకున్న వెంటనే రుద్రకి ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్ వచ్చి, యు.ఎస్. వెళ్ళాల్సి వచ్చింది.

అప్పుడే కొత్తింటి గురించి మామగారితో మాట్లాడితే, ఆయనిచ్చిన సలహా: “అసలే కాలం బాగాలేదు. మీరేమో నాలుగేళ్ళు దేశం వదిలి పోతున్నారు. ఎవరైనా ఆక్రమించుకుని కూర్చున్నారంటే కష్టం. ఎవరికైనా అద్దికిచ్చేస్తే నయం. నాకు మిగిలినదే మూడేళ్ళ సర్వీస్. కావాలని మరీ ఆఖరి పోస్టింగ్ మాస్కోలో ఎంచుకున్నాను. మరి నేనూ ఉండను చూసుకోడానికి.” ఆయన పని చేసేది ఆల్ ఇండియా రేడియోలో.

నాన్నగారెలాగూ మెతకే. తన ఉద్యోగమూ, సాయంకాలాలు స్నేహితులతో చదరంగమూ తప్ప ఈ గొడవలు ఆయనకి పట్టవు.

ప్రాపర్టీ డీలర్ల మీద నమ్మకం లేక న్యూస్ పేపర్లో అడ్వర్టయిజ్ చేస్తే, అద్దెకోసం వచ్చిన వాళ్ళల్లోకల్లా ఈ నీనా కపూరయితే భద్రం అనుకున్నాం. ముప్పయిల్లో ఉన్న వొంటరి స్త్రీ. మృదువైన మాటలు. గౌరవనీయమైన ప్రవర్తన. ఏదో ఉద్యోగం అని చెప్పింది కానీ అప్పుడు పట్టించుకోలేదు. కానీ, ఒక్కతే ఉంటుంది కాబట్టి ఎప్పుడు చెప్తే అప్పుడు ఖాళీ చేస్తుందనే ధీమాతో తాళాలప్పజెప్పేం. 11 నెల్ల లీజ్ మీద సంతకం పెట్టింది.

మామగారటు మాస్కో, మేం ఇటు ఆస్టిన్ బయల్దేరేం కొన్నాళ్ళ తేడాతో. మొబైల్ ఫోన్ల కాలం కాదది.

మొదటి నెల యూనివర్సిటీ కాంపస్‌లో ఉన్న ఇంటికి కావలిసిన అదనపు సామాను కొనడం, రుద్ర పనిలో చేరడంతోటే సరిపోయి కపూర్ గురించి పట్టించుకోలేదు. నెల నెలా బాంకులో అద్దె డిపాజిట్ చేస్తానన్న మనిషి ఒక్క పైసా కట్టలేదని బ్యాంకుకి ఫోన్ చేస్తే తెలిసింది. ఆమెకి ఫోన్ చేస్తే–ఫాన్లు పెట్టించాను. వంటింటి షెల్వ్‌స్ కట్టించాను. బాల్కనీ రెయిలింగ్ ఎత్తు చేయించాను. టైల్స్ మార్పించాను. వార్డ్ రోబ్స్ చేయించాను– అన్న సమాధానాలేవో వచ్చేవి రెండు, మూడు నెల్లు. ఆ తరువాత ఫోనెప్పుడూ మోగేదే తప్ప ఎవరూ ఎత్తినది లేదు. చూస్తుండగానే లీజ్ గడువు దాటేపోయింది.

రెండేళ్ళ తరువాత ‘మా అమ్మాయిని స్కూల్లో చేర్పిద్దాం, అమ్మా వాళ్ళింట్లో ఉంటుంది మేం తిరిగి వచ్చేదాకా’ అనుకుని ఢిల్లీ వచ్చినప్పుడు, అడ్మిషన్స్ కోసం తిరగడంతోనే టైమ్ గడిచిపోయింది. ఆఖరి రోజు ఇల్లెలా ఉందో, ఈవిడ ఎప్పుడు ఖాళీ చేస్తుందో అని చూసి పోదామని వస్తే, తలుపులకి పెద్ద తాళం కప్పలు వేళ్ళాడుతున్నాయి. హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ పంత్ గారి ఇంటికి వెళ్ళి అడిగితే, “అదేమిటమ్మా! మీరు ఆవిడకి ఇల్లమ్మేశారట కదా? సొసైటీ అనుమతి లేకుండా అలా ఎలా చేశారు?” ఎదురు ప్రశ్న వేశారు. గుండె గుభిల్లుమంది. నిర్ఘాంతపోయి “అదేమిటి అంకుల్! ఇల్లెందుకు అమ్ముతాం? పేపర్లేమైనా చూపించిందా?” అడిగాను.

“అవేవీ చూపలేదు కానీ ఒక సర్దార్ వస్తూ పోతూ ఉంటాడు. ఇప్పుడావిడకి నాలుగు నెల్ల పాప కూడా. ఇంట్లో చేరింది మొదలు కార్పెంటర్లూ, మేసన్లూ రాని రోజు లేదు. చుట్టుపక్కలవారిని ఇంట్లోకి రానియ్యదు. ఎవరెవరో చాలామంది వాచ్‌మన్ రెజిస్టర్లో సంతకం పెట్టి తన వద్దకి వస్తూ ఉంటారు. వారంగా ఇంట్లో లేదనుకుంటాను. సొసైటీ మెయింటెనెన్స్ మాత్రం కడుతోంది.” అన్నారాయన.

శంకిస్తున్న మనస్సుతోనే విమానం ఎక్కాను. రుద్రతో చెప్తే, “ఆ ముసలాయన పంత్‌కి అనుమాన రోగం లెద్దూ. ఏదో కారణం ఉండే ఉంటుంది. వెనక్కెళ్ళాక చూసుకుందాం. ఇల్లు మింగెయ్యదు కదా?” అన్నాడు.

గత్యంతరం లేక నోరు మూసుకున్నాను.

రుద్ర ఫెలోషిప్ పూర్తయి, ఎబిసి న్యూస్‌లో అప్రెంటిస్ షిప్ పూర్తి అయేటప్పటికి నాలుగేళ్ళు దాటింది. మామగారికి ఎక్స్‌టెన్షన్ దొరికి ఇంకా రష్యాలోనే ఉన్నారు. తిరిగి ఇంటికి వెళ్ళాక, మొదటి ఆదివారమే కొత్తింటికి వెళ్ళాం. కపూర్ ఆహ్వానించింది. టీ ఇచ్చింది. లివింగ్ రూమ్‌కీ డైనింగ్ స్పేసుకీ మధ్య గ్లాస్ పార్టీషనేదో కట్టించినట్టుంది. రుద్ర లీజ్ గురించీ, ఇన్నేళ్ళూ కట్టకపోయిన అద్దె గురించీ అడుగుతుంటే, నేనే లేచి ఇంటి లోపలికి వెళ్ళాను. మూడు బెడ్రూముల్లో రెండిట్లో చెక్క పార్టిషన్లూ, బల్లలూ, రెజిస్టర్లూ కంప్యూటర్లూ, వాటిముందు పని చేస్తున్న ఐదారుగురు మనుష్యులూ కనిపించారు. ఏదైనా ఆఫీస్‌లో అడుగుపెట్టానా అన్నంత అనుమానం వేసింది. “రుద్రా, ఒకసారి ఇటు రా!” అని పిలవడంతో వచ్చాడు. అదంతా గమనించి, “ఏమిటిదంతా? ఇదేమైనా కమర్షియల్ స్పేస్ అనుకున్నారా, ఇల్లనుకున్నారా? అద్దెకిచ్చినది ఇందుకా?” కేకలు మొదలుపెట్టాడు.

“శాంతం, శాంతం. బి.పి. పెరుగుతుంది. మరీ ఎక్కువ ఆవేశపడితే నష్టం జరిగేది మీకే!” తాపీగా చెప్తూ, నిద్రకళ్ళతో ఉన్న ఒక చిన్నపిల్లని గదిలోనుంచి ఎత్తుకుని తీసుకొచ్చింది. “పంత్ అంకుల్ చెప్పినది నిజమేనన్నమాట. సరే, ఇది మీ వ్యక్తిగతం. కానీ ఈ టైపిస్టులూ, ఈ వ్యవహారం ఏమిటి? ఇన్నేళ్ళ అద్దె కట్టి, ఖాళీ చేయండి. వారం టైమిస్తున్నాను.” చరచరా బయటకి నడుస్తూ నన్నూ లాగాడు.

మళ్ళీ నాలుగు రోజుల తరువాత ఒక ఆదివారం వచ్చి చూస్తే, ఫ్లాట్ బయటకి ఉన్న రెండు తలుపుల మధ్యా, కపూర్ నియమించిన స్వంత వాచ్‌మన్ కుర్చీమీద కూర్చుని కనిపించాడు. కిందకి దిగి, సొసైటీ మీటింగ్స్ జరిగే గదిలోకొచ్చాం. అక్కడున్న ఆరుగురికీ సంగతంతా ముందే తెలిసినట్టుంది.

“రుద్రా, నెమ్మది పడు. ఆ వస్తూ పోతూ ఉండే సర్దార్‌కి ముందే పెళ్ళయిందిట. ఎక్సటర్నల్ ఎఫైర్స్ మినిస్ట్రీలో యుడిసి. తన విజిటింగ్ కార్డిచ్చాడు. వివరాలివిగో. ఇంకో సంగతి. గమనించావో లేదో కానీ, పేదవాళ్ళకి మట్టితో పక్కా ఇళ్ళు రూ.50,000లో కట్టిస్తామని ఈమె మడ్ హౌసింగ్ అన్న ప్రాజెక్టేదో మొదలుపెట్టిందని చాలా చోట్ల గోడల మీద పోస్టర్లు అంటించున్నాయి. ఈమె ఇంట్లోనే ఆఫీసేదో తెరిచిందని అనుమానం వచ్చి, ఇళ్ళ కోసం వచ్చేవాళ్ళని లోపలకి రానివ్వద్దని వాచ్‌మన్లందరికీ చెప్పే ఉంచాం. ఈవిడకి ప్రైవేట్ వాచ్‌మన్‌ను పెట్టుకునే అనుమతి లేదని నోటిఫికేషన్ పంపాం. ఎందుకైనా మంచిది. నువ్వూ, మీ ఆవిడా ఈ చుట్టుపక్కలే ఇల్లేదైనా అద్దెకి తీసుకుని ఉండండి. రోజూ వత్తిడి తెస్తే తట్టుకోలేక ఖాళీ చేస్తుందేమో. కోర్టుల గొడవ పడలేం.” అన్నారు పంత్.

సరే, చేసేదేం ఉంది? అద్దె పోతే పోనీ, కనీసం ఇల్లయినా దక్కితే అదే మహా భాగ్యం. ఇంకా హౌసింగ్ లోన్ కూడా పూరిగా తీర్చలేదు అనుకుంటూ, ఎదురుగా ఉన్న సందులో ప్రైవేట్ ఇల్లొకటి అద్దెకి తీసుకున్నాం. అదృష్టం కొద్దీ సొసైటీ గేటుకి సరిగ్గా ఎదురుగా ఉందది. పాపని అమ్మ ఇంటినుంచి మా దగ్గిరకే తెచ్చుకుని ఇక్కడి స్కూల్ బస్సులోనే పంపడం మొదలెట్టేం.

బాల్కనీనుంచి చూస్తే ఒక ఎర్రటి మారుతీ కార్లో కపూర్ వస్తూ, పోతూ కనిపించేది. మా ఇంట్లో మేము అడుగు పెట్టడానికి తిరిగి ప్రయత్నించలేదు. చుట్టుపక్కలే అద్దెకి ఉన్నాం అని కపూరుకి తెలియకపోయే అవకాశం లేదు. నిమ్మకి నీరెత్తినట్టు ‘ఏం చేస్తారో చేసుకోండి!’ అన్న చూపులు విసిరేది కింద కూరల బళ్ళ వద్దా, దుకాణాల్లోనూ కనిపిస్తూ.

మూడు నెలలు గడిచాయి. ఒక సాయంత్రం రుద్ర ఇంటికి వస్తూనే చెప్పాడు, “స్కూల్లో నా క్లాస్‌మేట్ ఈశ్వర్, కైరోలో పోస్టింగని వెళ్ళాడని చెప్పాను గుర్తుందా? ఇవ్వాళ క్లబ్‌లో కనిపించాడు. ఈ కపూర్ బాయ్ ఫ్రెండ్ సంగతి తెలిసినప్పుడు ఈశ్వర్ ఎందుకు గుర్తు రాలేదో మనకి! ఎంతయినా అదే మినిస్ట్రీలో అండర్ సెక్రెటరీ కదా? సర్దార్ ప్రస్తావన రాగానే, ‘ఇంక నాకొదులు. చూస్తానుగా ఎలా ఖాళీ చేయదో!’ అన్నాడు.”

చాలా రోజుల తరువాత రుద్ర నుదిటిమీద అడ్డగీతలు లేకపోవడం చూశాను.

వారం తిరగలేదు. పంత్ అంకుల్ ఫోన్ చేసి, “మానసీ, రుద్రకి చెప్పు. ఇంక మీ ఇల్లు మీదే. ఆమెకి వారం కావాలిట సామాన్లు సర్దుకోడానికి. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు వచ్చి తాళాలు తీసుకొమ్మని మీకు చెప్పమంది. మీకు ఫోన్ చేయదట.” అన్నారు. మాకు ఫోన్ చేయకపోతే వచ్చిన నష్టం ఏమీలేదు. ముందు ఇల్లంటూ ఖాళీ చేస్తోంది. అదే చాలు.

నాలుగు రోజుల తరువాత ట్రక్కులు రావడం మొదలవగానే, రుద్రా నేనూ పైకెక్కుతుంటే, మంచాలూ, సోఫాలూ కిందకి దిగడం కనబడ్డాయి. తలుపు వద్దకి చేరినప్పుడు, మొక్కల గోలేలని ఎత్తుతున్నవారితో కపూర్, ‘బాబూ, వాటికీ ప్రాణం ఉంది. జాగ్రత్త. గోలేలు విరిగాయంటే నిష్కారణంగా ఎండిపోతాయి’ అంటోంది. నవ్వాలో, ఏడవాలో తెలియలేదు. మెయిన్ చెక్క తలుపుకి భాగంగా సన్నటి గ్లాస్ ఉంది. మరి సెక్యూరిటీ అనవసరం అనుకుందో ఏమిటో కానీ దానికి గ్రిల్ కూడా లేదు. పెద్ద అల్మారా ఒకదాన్ని ఆ తలుపునుండి బయటకి తీసుకురావడానికి వీలుపడటంలేదు. ‘ఫరవాలేదు. గాజుకేమిటి? పగలనీయండి. అల్మారా ఖరీదయినది.’ అంటోంది సామానెత్తుతున్న వాళ్ళతో. హఠాత్తుగా ఢమ్మన్న శబ్దంతో పగలనే పగిలింది గ్లాస్ డోర్! ప్రాణం ఉసూరుమంది. మొత్తానికి ట్రక్కులు బయల్దేరాయి. సర్దార్ ఎక్కడా కానరాలేదు.

మొత్తానికి ఆ పార్టిషన్లూ అవీ తీయించి, ఇంటిని ఇల్లుగా బాగు చేయించుకున్నాం. ప్రభుత్వపు ఇల్లు సరెండర్ చేసి, మా సామాను ఇక్కడికి మార్చుకొని, ‘దరిద్రం వదిలింది’ అనుకుని ఊరటపడ్డాం.

పట్టుమని రెండు వారాలు కాలేదు. మధ్యాహ్నం భోజనం చేసి కూర్చున్నానో లేదో, ‘ఒక్కసారిగా చాలామంది వచ్చారు మాడమ్, మీ ఇంట్లో అద్దెకున్నావిడకి వీళ్ళేవో డబ్బిచ్చారట…’ ఇంటర్‌కమ్‌లో వాచ్‌మన్ ఫోను. విషయం అర్థమై, నీరసంగా ‘పంపండి’ అన్నాను.

పదిహేనుమందో ఎంతో ఉంటారు. ‘కపూర్ మాడమ్ ఏమయింది?’ అనడుగుతూ ఇంట్లో కాలు పెట్టారు. కాయకష్టం చేసుకుని బతికేవారిలా కనిపిస్తున్నారు. యుపి యాసతో ఒకళ్ళగొంతు మరొకరు దించేస్తూ ఉంటే, ‘కూర్చోండి ముందు. మంచినీళ్ళిమ్మంటారా?’ అడిగితే, అందరూ కలిపి కూడబలుక్కున్నట్టు, ‘ఊ, ఊ’ అంటూ తలలూపారు.

“ఇప్పుడు ఒకళ్ళు చెప్పండి. సంగతేమిటి?” అడిగాను.

యాబైల్లో ఉన్న ఒకాయన మిగతావారిని ఊరుకొమ్మని సైగ చేసి “అమ్మా, వీళ్ళందరూ మా తమ్ముళ్ళ, చెల్లెళ్ళ కుటుంబాలు. వీళ్ళు నా భార్యా కొడుకూ. మొత్తం ఆరిళ్ళకీ మూడు లక్షలిచ్చాం. మాటలా మావంటివాళ్ళకి? తలమ్ముకుని కట్టాం ఆవిడకి, ఇల్లుంటుందన్న ఆశతో. ఆ మాడమ్ వెళ్ళిపోయిందని తెలిసి అడ్రెస్ అడగడానికొచ్చాం. ఆవిడని ఎక్కడ కలుసుకోవాలి?” దిగాలుగా వచ్చింది ప్రశ్న.

కపూర్ ఖాళీ చేయడమే మహాభాగ్యం అనుకున్న మేము, మా సమస్య తీరిందనుకున్నామే తప్ప ఆమెక్కడికి వెళ్తోందో పట్టించుకోలేదు. ‘ఆచూకీ తెలిసినప్పుడు నాకు ఫోన్ చేస్తే తప్పకుండా అడ్రెస్ చెప్తాను.’ అన్న వాగ్దానం తీసుకుని వాళ్ళు కదిలారు.

ఆ సాయంత్రమే ఈశ్వర్‌కి ఫోన్ చేసి చెప్తే, సర్దారుకి ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పాడు. అరగంట తరువాత తిరిగి ఫోన్ చేసి, ‘అతనేమో… కపూర్‌ తనతో తెగతెంపులు చేసుకుందనీ, ఆవిడెక్కడికి వెళ్ళిందో తనకి తెలియదనీ అంటున్నాడు. నిజమో అబద్ధమో దేవుడికే తెలియాలి.’ అన్నాడు.

కొన్ని వారాలపాటు ఇలాగే ఎంతమంది ఆశతో వచ్చి నిరాశతో తిరిగిపోయారో లెక్కే లేదు.

ఈ లోపల మారుతీ కంపెనీ నుంచి ఫోన్ల పరంపర. కపూర్ కారు లోన్ కట్టడం లేదట. ఆవిడ ఇక్కడ లేదు మొర్రో! అంటున్నా వినకుండా వాళ్ళ సేల్స్ రెప్రెజెంటెటివ్స్ ఇంటికే రావడం ప్రారంభించారు. దేని భరోసాతో లోన్ ఇచ్చారు? అని అడిగితే, తన పేరు మీద ఉన్న ఇంటి పేపర్లని బట్టి ఇచ్చారట. సాయంత్రం రుద్రతో చెప్తే, “అలా ఎలా చూపించగలిగింది? ఏవో నకిలీ కాగితాలు తయారుచేయించినట్టుంది. గుండెలు తీసిన బంటులా ఉందే! బతికిపోయాం. ఎందుకైనా మంచిది. మీ పిన్ని కొడుకు జయకర్ లాయరు కదా, ఒక ముక్క తన చెవిన వేసి ఉంచు. ఎటు తిరిగి ఏమవుతుందో!” అని హెచ్చరిక పారేశాడు.

రెండు నెల్లయింది. ఈసారి వాచ్‌మనూ, ఇంటర్‌కమూ ఏదీ లేకుండానే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా ఇద్దరు పోలీసులు. అయోమయంగా చూస్తూ లోపలికి రమ్మని అంటూ కుర్చీలు చూపించాను.

“నీనా కపూర్ కారు లోన్ వాయిదాలు చెల్లించడం లేదని మారుతీ కంపెనీ నుండి ఫిర్యాదు వచ్చింది. ఇంటి దస్తావేజులూ అవీ చూపించండి. ఇల్లు మీదే అని సాక్ష్యం చెప్పేవాళ్ళెవరైనా ఉంటే, వాళ్ళనీ పిలవండి,” అన్నాడు ఒకతను. వాళ్ళకి టీ పెడుతూ, రుద్రకి ఫోన్ చేసి ‘అర్జెంటుగా ఇంటికి రమ్మని కారణం’ చెప్పి పంతునీ, జయకర్‌నీ కూడా పిలిచాను. గంట లోపల ఇల్లంతా నిండింది. రుద్ర తనతో పాటు డిడిఏ అధికారి ఒకతన్ని తెచ్చాడు. మొత్తానికి పోలీసులకి నమ్మకం కలిగి బయల్దేరారు.

ఒకరోజు పేపర్లో– ‘లక్ష్మీ నగర్ నివాసినైన (ఫలానా చిరునామా) నీనా కపూర్ అను నేను, అఫిడవిట్ (ఫలానా తేదీ) ద్వారా గ్లోరియా థామస్‌గా నోటరీ వెంకటేశన్ సాక్ష్యంగా పేరు మార్చుకున్నాను’– న్యూస్ పేపర్ రెండో పేజీలో ఉన్న చిన్న ఏడ్ మీద నా దృష్టి పడింది.

ఆ పేరేమీ అసాధారణమైనది కాకపోయినా నా ఇన్‌స్టింక్ట్ మాత్రం ఏదో చెప్తోంది. 197 డైరెక్టరీకి ఫోన్ చేస్తే, ఆ చిరునామా ఎవరో థామస్‌కి చెందినదంటూ, ఫోన్ నంబర్ ఇచ్చారు. ఫోన్ ఎత్తి, ‘హలో’ అన్న స్వరం, ‘మొక్కలకీ ప్రాణాలుంటాయి!’ అన్న అదే గొంతు!
-----------------------------------------------------------
రచన: కృష్ణవేణి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment