Saturday, September 8, 2018

శుచిముఖి చెప్పిన మెటా కవిత్వం


శుచిముఖి చెప్పిన మెటా కవిత్వం




సాహితీమిత్రులారా!


కం. ఏ యంగకమును భావన
      చేయక వ్రాయంగ రాదు, చేసిన నానం
      దాయత్తత మది చొక్కు, బ
      రాయత్తపు బుద్ధి చెలువ నలవియె వ్రాయన్!

చూసేందుకు చిన్నదయినా తోడినకొద్దీ ఆలోచనామృతాన్ని ఊరించే పద్యం ఇది. దీని గురించి తవ్వుకుంటూ పోతే అలంకారశాస్త్రపు లోతుల్లోకి వెళ్ళిపోవలిసిందే! ఈ పద్యం అంటున్నది ఒక హంస. ఆ హంస పేరు శుచిముఖి. పింగళి సూరన రచించిన ప్రభావతీప్రద్యుమ్నమనే కావ్యంలోని పద్యం.

సంస్కృత సాహిత్యంలో కావ్య తత్త్వాన్ని గురించిన శాస్త్రీయ చర్చ చాలానే జరిగింది. దానినే అలంకారశాస్త్రమనీ, కావ్యశాస్త్రమనీ, సౌందర్యశాస్త్రమనీ – ఇలా చాలా పేర్లతో వ్యవహరిస్తారు. తెలుగులో అలాంటి స్వతంత్రమైన విమర్శ ప్రాచీన సాహిత్యంలో పెద్దగా జరిగిన దాఖలాలు కనిపించవు. చాలావరకూ తెలుగు లాక్షణికులు సంస్కృత లక్షణ గ్రంథాలను యథాతథంగా అనువదించారు. సంస్కృత గ్రంథాలలోని విషయాన్ని తెలుగులో చెప్పడానికి, తెలుగు ఉదాహరణలు ఇవ్వడానికి మాత్రమే వారి రచనలు పరిమితమయ్యాయి. అయితే, కవిత్వాన్ని గురించిన కవిత్వం కొంత తెలుగులో విశేషంగా కనిపిస్తుంది. దీనిని మెటా కవిత్వం అనవచ్చు. చాటు కవిత్వంలో దీని ఉనికి స్పష్టంగా తెలుస్తుంది. ‘ఘనతర ఘూర్జరీకుచయుగక్రియ గూఢము గాక,’ ‘నిరుపహతిస్థలంబు’ మొదలైన పద్యాలు మెటా కవిత్వానికి ఉదాహరణలు. కవిత్వం ఎలా ఉండాలో అల్లసాని పెద్దన సుదీర్ఘంగా వర్ణించి చెప్పిన ‘పూతమెరుంగులున్ పసరుపూప బెడంగులు చూపునట్టివా కైతలు’ అన్న ఉత్పలమాలిక ప్రసిద్ధమైనదే!

చాటుకవిత్వాన్ని అలా ఉంచితే, కావ్యాలలో కూడా ఈ మెటా కవిత్వం అక్కడక్కడ దర్శనమిస్తుంది. ఇది చాలా వరకూ కావ్య అవతారికలకి మాత్రమే పరిమితం. కవి తన కవిత్వ గుణాలని వివరించే పద్యాలలోనూ, కవి స్తుతి, కుకవి నింద వంటి వాటిల్లోనూ కవిత్వాన్ని గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. కథలో అంతర్భాగంగా, కవితా స్వరూపాన్నీ కవిత్వ తత్త్వాన్నీ గూర్చి వివేచన చేసిన కవి బహుశా ఒక్క పింగళి సూరనే! కవిత్వ లక్షణాల గురించి కళాపూర్ణోదయంలో చెప్పిన ‘చలువగల వెన్నెలల చెలువునకు,’ అనే పద్యం కవితా గుణాలని అందంగా వర్ణిస్తుంది. అలాగే ప్రభావతీప్రద్యుమ్నంలో కూడా, శబ్దసంస్కార మెచ్చటను జాఱగనీక… అంటూ దేవేంద్రుని నోట మహాకావ్యలక్షణాలను విశేషంగా పలికించాడు. అయితే, కవిత్వాన్ని గూర్చిన మీమాంస ఒకటి రెండు పద్యాలతో మాత్రమే సరిపెట్ట లేదు సూరన. కథలో భాగంగా కవిత్వానికీ కవిత్వ మీమాంసకూ ప్రముఖ స్థానాన్ని కల్పించాడు. కళాపూర్ణోదయంలో నాయకుడయిన మణికంధరుడు స్వయానా కవి. ప్రభావతీప్రద్యుమ్నంలో అత్యంత ప్రముఖమైన పాత్ర శుచిముఖి. శుచిముఖి ఒక దేవహంస మాత్రమే కాదు, అచ్చంగా కవి కూడాను. స్వయంగా దేవేంద్రుడే శుచిముఖి గూర్చి, వాగ్దేవతవో కాక యాకె దిద్దిన కవివో! అంటాడు. ‘శబ్ద సంస్కార పూతంబను బుద్ధి నద్దేవియ నాకు శుచిముఖి యను పేరిడియె’ – అని శుచిముఖి తన పేరు గురించి చెప్పుకుంటుంది. పైగా, తన పెంపుడు చిలుకతో కవిత్వపు పోటీలో నెగ్గినందుకు గానూ సరస్వతి శుచిముఖికి, ఉపమాతిశయోక్తి కామధేను అనే బిరుదును కూడా ఇస్తుంది. గొప్ప వాక్చాతుర్యం గల ఆ శుచిముఖి కావ్య కథా గమనంలో చాలా ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. నాయికా నాయకులైన ప్రభావతీ ప్రద్యుమ్నులను ఒకరికొకరిని పరిచయం చేయడం మొదలు, ఇద్దరినీ ఒకటి చేసే వరకూ ఆద్యంతం శుచిముఖే కథని నడిపిస్తుంది!

ప్రభావతి సౌందర్యాన్ని శుచిముఖి ప్రద్యుమ్నునికి వర్ణిస్తున్న సందర్భంలో చెప్పే పద్యం ఇది. నాయిక సౌందర్య వర్ణన కావ్యాలలో, అందులోనూ ముఖ్యంగా ప్రబంధాలలో, సర్వసాధారణంగా కనిపించే అంశమే. అయితే అందులో తనకి మాత్రమే స్వంతమైన ఒక కొత్తపుంతను తొక్కాడు పింగళి సూరన. పాత కవిసమయాలకూ, ఆలంకారిక సంప్రదాయాలకూ కట్టుబడుతూనే, కొత్తదనాన్ని మెరిపించడం సూరన ప్రత్యేకత. ఆ కొత్తదనం కేవలం మాటలకీ ఊహలకీ మాత్రమే పరిమితం కాకుండా, లోతైన ఆలోచనకి తెరతీసేదిగా ఉంటుంది. ఇక్కడ ప్రభావతి అందాన్ని ప్రద్యుమ్నునికి వర్ణించి చెపుతున్నది ఒక హంస. శృంగారనైషధంలో కూడా, నలుని దగ్గర దమయంతి అందచందాల వర్ణన చేసేది హంసే. అయితే ఇక్కడున్న హంస మామూలు హంస కాదు. సరస్వతి చేత బిరుదందుకొన్న కవిహంస! కవికి వర్ణనలో ఉపకరించే పరికరాలు ఉపమాది అలంకారాలు. ఈ కవిహంస, ప్రభావతి గురించి చెప్పడం మొదలుపెడుతూనే, అందమైన స్త్రీ శరీరాన్ని వర్ణించేందుకు సాధారణంగా కవులు ఉపయోగించే ఉపమా సామగ్రినంతా ఒక పద్యంలో చిట్టా చెప్పి, అవేవీ ప్రభావతి సౌందర్యాన్ని వర్ణించడానికి పనికిరావంటుంది! ఆ అనడంలో కవులు ఒక ఆనవాయితీగా వాడే ఉపమానాల మీద వెక్కిరింత స్పష్టంగా ధ్వనిస్తుంది: ‘నెత్తమ్ములనుచు, గ్రొన్నెలలంచు, వటఫలశ్రీలంచు, తాబేటిచిప్పలనుచు… ఇట్టివి గదయ్య చెప్పబోయిన నుపమలు, వీని దడవ సిగ్గొదవు నవ్వెలది నెంచి.’ ఇందులో ఒకొక్కటి ఒకో శరీరభాగానికి పోలికగా చెప్పడం కవిత్వ సంప్రదాయం. ప్రభావతి శరీర వర్ణనలో మాత్రం ఇలాంటి పోలికలు చెప్పాలంటే సిగ్గు వేస్తుందట! నిజానికి ఇలా అనడం కూడా ఒక అలంకారమే, దీన్ని వ్యతిరేకాలంకారం అంటారు. తమాషా ఏమిటంటే, ఏ ఉపమానాలనయితే వెక్కిరించిందో, మళ్ళీ ఇంచుమించు అవే ఉపమానాలతో ప్రభావతి సౌందర్యాన్ని వర్ణిస్తుంది. అయితే, అవన్నీ కేవలం గుర్తుకోసం చెప్పినవే అనీ, తన కవిత్వ ప్రజ్ఞంతా ఉపయోగించి వర్ణించినా ఆమె సౌందర్యంలో కోటితమాంశమైనా మాటల్లో చెప్పలేకపోయాననీ వాపోతుంది. పైగా, అది తన శబ్దశక్తి లోపం కాదనీ, ప్రభావతి సౌందర్య మహత్వం అనీ నిశ్చయంగా చెపుతుంది. ఆమె రూపాన్ని వర్ణించేందుకు మాటలు కరువయ్యాయి కాబట్టి, పోనీ ఆమె చిత్రాన్ని గీసి చూపుదామన్నా అది కూడా సాధ్యం కాదంటుంది. ఎందుకు సాధ్యం కాదో చెపుతున్న పద్యమిది.

ఏ యంగకమును భావన చేయక వ్రాయంగ రాదు – ప్రభావతి చిత్రాన్ని గీయాలంటే ఆమె శరీరాకృతిని మనసులో మళ్ళీ దర్శించాలి, భావన చేయాలి. చేసిన నానందాయత్తత మది చొక్కు – కాని అలా చేసినప్పుడు, ఆమె సౌందర్యానికి మనసు ఆనందపారవశ్యంలో మునిగిపోతుంది. పరాయత్తపు బుద్ధి చెలువ నలవియె వ్రాయన్! – మనసు పరవశమైపోయినప్పుడు దానికి అదుపు ఉండదు. చిత్రం గీయాలంటే ఆ గీసే చిత్రం పైన ఏకాగ్రమైన దృష్టి ఉండాలి. ఆనందంలో పరవశమైపోయిన మనసు గీయడం పైన ఎలా శ్రద్ధ పెట్టగలుగుతుంది? అందువల్ల ఆమె చిత్రాన్ని లిఖించడం అసంభవం!

ఇదీ శుచిముఖి తన అసహాయతను గూర్చి యిచ్చిన వివరణ. పైపైన చూస్తే ఈ మాటలన్నీ ప్రభావతి సౌందర్యాధిక్యాన్ని సూచిస్తాయి. కొంచెం లోతుగా ఆలోచిస్తే, కవిత్వరచనలో కవి పొందే ఒక ద్వైదీభావ అవస్థని చక్కగా వివరించే పద్యమిది. ఈ అవస్థ ఏ కళాసృజనకైనా అన్వయిస్తుంది! కవి తాను రచించే కావ్యంతో ఒక తన్మయత్వాన్ని (కథ, పాత్రలు, భావాలు, అనుభూతులు – ఇలా ఏవైనా) పొందుతాడు. అలా కాకపోతే అందులో ఒక కృత్రిమత్వం వచ్చిపడుతుంది. ఒకరి చిత్రాన్ని గీసేటప్పుడు, చిత్రకారుడు ఆ వ్యక్తిని చాలా ఏకాగ్రంగా పరిశీలించి తన మెదడులో ఆ వ్యక్తి రూపాన్ని స్పష్టంగా ప్రతిష్ఠించుకోవాలి. అయితే, ఒక కవితనయినా చిత్రాన్నయినా చక్కగా తీర్చిదిద్దాలంటే నైపుణ్యం కావాలి. దానికి కొంత బుద్ధి పరిశ్రమ అవసరం. అసంకల్పితంగా అప్రయత్నంగా వచ్చేసేవి కావు. ఉదాహరణకు, ఒక కావ్యాన్ని రచించేటప్పుడు – వాడే భాషనుంచీ, కథా నిర్మాణం, పాత్ర నిర్వహణం, రసపోషణం వరకూ చాలా శ్రద్ధగా వాటిపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. పరవశమైన మనసు వీటిపైన ధ్యాస పెట్టడం ఎలా?! ఇలాంటి Catch-22 పరిస్థితి కొద్దో గొప్పో ప్రతీ కళాకారునికీ ఏర్పడుతుందనుకుంటాను. ఆ అవస్థని చాలా గొప్పగా ఒక చిన్న పద్యంలో హంస చేత చెప్పించాడు సూరన. ఆ అవస్థని కళాకారులు ఎలా దాటతారు అంటే, ఆ శక్తినే ‘ప్రతిభ’ అన్నారు ఆలంకారికులు. ఆ ప్రతిభ శుచిముఖి సొత్తు. అందుకే ప్రభావతి సౌందర్యాన్ని చిత్రం గీసి చూపలేకపోయినా పదచిత్రాలతో చక్కగా వర్ణిస్తుంది.

ఇలా కావ్యసృజన గురించీ, కావ్యానుభవాన్ని గురించీ గంభీరమైన అంశాలెన్నిటినో కథాగమనంలో అంతర్గతంగా పొందుపరిచాడు సూరన. ఉదాహరణకి, నాయిక సౌందర్యాన్ని గురించి విన్న నాయకుడు ఆమె గురించే ఆలోచిస్తూ విరహంలో మునిగిపోవడం అనేది శృంగార ప్రబంధాలన్నిటిలోనూ ఉండే విషయమే. అదే అంశం ఈ ప్రభావతీప్రద్యుమ్నంలో చాలా కొత్తగా సాగుతుంది. ప్రభావతి గురించి శుచిముఖి ద్వారా తెలుసుకున్న ప్రద్యుమ్నుడు, ఆ హంస చేసిన వర్ణన ద్వారా ప్రభావతి సౌందర్యరూపాన్ని ఊహించే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నమంతా ఒక భావుకుడు చేసే కావ్య రసాస్వాదనలాగా, ఒక యోగి చేసే తపస్సులాగా కనిపిస్తుంది. ప్రభావతి అందమైన రూపమనే బ్రహ్మాన్ని చేరడానికి, హంస చెప్పిన యథార్థ వాక్కులనే ఉపనిషత్తుల మార్గాన్ని అనుసరించి, ప్రద్యుమ్నుడు ధ్యాన మననాది సాధన చేశాడని వర్ణిస్తాడు సూరన. దీనిని కావ్యపరంగా అన్వయించుకుంటే – రసం అనేది బ్రహ్మం, ఆ రసబ్రహ్మాన్ని చేరుకొనే మార్గం కవివాక్కులు (అంటే కావ్యం), ఆ కావ్యాన్ని సహృదయంతో ఆస్వాదించడం భావుకుడు చేసే సాధన! ఈ ప్రయత్నమంతటికీ పరాకాష్ఠ ఈ పద్యాలు:

ఉద్యదపేక్ష పక్షివనితోక్తుల వెంబడి జంచరీక చం
ద్రాద్యుపమానశోభకు సహస్రగుణంబుగ హెచ్చ గేశ వ
క్త్రాద్యఖిలాంగలక్ష్మి మదికందిన యంతయునున్ నయించి యా
హృద్యతరాంగిమూర్తి సొబగెల్ల నొకింతగ జూచు నాత్మలోన్

మది గొనినంత మేరయును మాన కతం డుపమానకోటి యొ
ప్పిద మఖిలంబు నిట్లు గడు బెక్కు మడుంగులుగా దలంచి త
త్తదవయవత్వ సుస్థితికి దార్పగ నమ్మదిరాక్షిరూప మె
య్యది యదియే కనంబడియె నచ్చపుబుద్ధికి లేవగమ్యముల్!

శుచిముఖి చేసిన వర్ణనలో, ప్రభావతి శరీరాంగాలకు పోలికలుగా చెప్పిన తుమ్మెదలు, చంద్రబింబమూ మొదలైన ఉపమానాల సౌందర్యానికి వెయ్యిరెట్లుగా ఆయా శరీరభాగాలను ఊహించుకొన్నాడు ప్రద్యుమ్నుడు. అలా ఊహించి ఊహించి తన మనసుకి కొద్ది కొద్దిగా కనిపించే ఆమె శరీరాకృతిని జాగ్రత్తగా పొందుపరచుకొన్నాడు. అలా కొంచెం కొంచెం పొందుపరచుకొంటూ పోగా చివరికి ఆమె రూపం ఎలా ఉంటుందో, సరిగ్గా అలాగే ప్రద్యుమ్నునికి దర్శనమయ్యిందిట! ‘అచ్చపుబుద్ధికి’ చేరలేని తీరాలంటూ లేవు అని తీర్పునిచ్చాడు కవి. ఇది, యేషాం కావ్యానుశీలనవశాత్ విశదీభూతే మనోముకురే వర్ణనీయ తన్మయీభవన యోగ్యతా తే హృదయ సంవాద భాజః సహృదయాః – అని ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలో యిచ్చిన సహృదయుని నిర్వచనానికి సరిగ్గా సరిపోతుంది. అంచేత అచ్చపుబుద్ధి అంటే సహృదయతే! ప్రద్యుమ్నుడు అచ్చంగా కావ్యాస్వాదన చేసే సహృదయుడే.

ప్రభావతీప్రద్యుమ్నాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన డేవిడ్ షూల్మన్, వేల్చేరు నారాయణరావు, ఆ అనువాదానికి రాసిన సుదీర్ఘమైన వెనుకమాటలో ఈ కావ్యం గురించి చాలా లోతైన చర్చ చేశారు. అందులో వారు ప్రద్యుమ్నుడు చేసిన యీ సాధన అలంకారికులు చెప్పే రసాస్వాదనకి పూర్తిగా భిన్నమయినదనీ, రసాస్వాదనలో ‘సాధారణీకరణ’ అనే ప్రక్రియ జరిగితే, ఇక్కడ జరిగినది ‘ప్రత్యేకీకరణ’ (అంటే ప్రద్యుమ్నుడు తనకే స్వంతమైన ప్రభావతి రూపాన్ని సృష్టించుకోవడం) అనీ ప్రతిపాదించారు. ఇది కొంత వివరంగా విశ్లేషించవలసిన అంశం. సాధారణీకరణ అనేది భట్టనాయకుడు ప్రవేశపెట్టగా అభినవగుప్తుడు పెంచి పోషించిన సిద్ధాంతం. దానికి భిన్నంగా కూడా అనేక రససిద్ధాంతాలు ఉన్నాయి. కాబట్టి సూరన రససిద్ధాంతానికి పూర్తిగా భిన్నమైన ఒక సరికొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడని అనుకోవచ్చునా అన్నది సందేహాస్పదం. ఏదేమైనప్పటికీ, తన కావ్యాన్ని ప్రబంధలక్షణాలకు అణుగుణంగా ఒక సాంప్రదాయిక శృంగారప్రబంధంగా నడిపిస్తూనే, ఒక నూతన దృక్పథాన్నీ లోతైన తాత్త్విక చింతననీ సూరన అందులో అద్భుతంగా పొందుపరిచాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment