పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి(అనువాదకథ)
సాహితీమిత్రులారా!
ఈ అనువాదకథను
ఆస్వాదించండి...........
పాకిస్తాన్‌లో దిగి రెండు గంటలైనా కాలేదు, ఉద్యోగమిమ్మని నాచేతికి ఐదారు దరఖాస్తులొచ్చాయి. అప్పటికి నేనింకా ఆఫీసుకెళ్ళి రిపోర్టయినా చెయ్యలేదు. నా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి ఇంకా పదిహేను గంటల సమయం కూడా ఉంది. అయినా వినతి పత్రాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్ నుండి తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ దగ్గర్నుండి హోటల్ సిబ్బంది దాకా అందరూ ఉద్యోగం కోరుతూ అర్జీలిచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే అందరూ అదివరకే తయారుచేసి పెట్టుకున్న దరఖాస్తు పత్రాలనివ్వటం. ‘ఏం ఉద్యోగంకోసం విన్నపం పెట్టుకుంటున్నారు?’ అనడిగితే, ‘ఏ పనైనా ఫరవాలేదు’ అన్నారు. వీళ్ళందరూ తెల్లవారుతూ ఇంటినుండి బయటికొచ్చేప్పుడే ఒకటి రెండు దరఖాస్తు పత్రాలు తయారుచేసుకుని బయలుదేరేలా ఉన్నారు.
పాకిస్తాన్‌లోని వాయవ్యప్రాంత నగరమైన పెషావర్‌లో నాకు ఉద్యోగం. నగరంలో ఏ మూలన చూసినా నటి శ్రీదేవి ముఖం కనిపిస్తోంది. ఎక్కడ కాస్త ఖాళీ ఉంటే అక్కడ శ్రీదేవి ఉన్న పోస్టర్‌ని చూడవచ్చు. ఆటోరిక్షాల వెనకున్న తెర మీద కూడా శ్రీదేవి నవ్వుతూ ఊగుతూ ఉంది. హిందీ సినిమాల్లో శ్రీదేవి పేరు మారుమోగుతున్న కాలం అది. పాకిస్తాన్‌లో అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆమె గనక పోటీ చేసి వుంటే కచ్చితంగా నెగ్గివుండేది. వాయవ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయుండేదేమో, ఎవరికి తెలుసు!
నేను బస చేసిన హోటల్ నుండి బయటకెళ్ళి ఇల్లు వెతుక్కోవాలంటే వందలాదిమంది బ్రోకర్‌లు ఉన్నారు. వాళ్ళు హోటలుకే వచ్చి నన్ను తీసుకెళ్ళి ఇళ్ళు చూపించేవారు. ఒకరితో వెళ్ళి చూసొచ్చాక మరొకరు వచ్చి తీసుకెళ్ళి అవే ఇళ్ళను చూపించేవారు. పాకిస్తాన్‌లో ఇల్లు వెతకడం బాగా అలుపొచ్చే పనే. అప్పటికే వర్షాకాలం మొదలైపోయుండడంవల్ల తలుపులన్నీ ఉబ్బి బిగుసుకుపోయున్నాయి. తలుపులను తోసి, కాదు, పగలగొట్టి తియ్యాల్సొచ్చింది. ఇంటిముందున్న ట్యూబ్ లైట్ స్విచ్ ఆన్ చేస్తే, ఇల్లంతా చూసి బయటికొచ్చేటప్పుడు అది వెలుగుతుంది.
ఒక ఇంటికి వెళ్ళినప్పుడు డైనింగ్ టేబిల్ మీద ప్లేట్లలో భోజనం సగం సగం తిన్న దశలో ఉంది. టేబుల్ కోళ్ళు నాలుగూ నీళ్ళు నింపిన నాలుగు డబ్బాలలో నానుతూ ఉన్నాయి. ఆ భోజనం తింటూ ఉన్న మనుషులు మాత్రం కనబడలేదు. దాన్ని తినలేని చీమలు కూడా కనబడలేదు. నెమ్మదిమీద తెలిసిందేంటంటే ఇళ్ళు చూపించేప్పుడు ఈ బ్రోకర్‌లు ఆ ఇంటి ఆడవాళ్ళనీ పిల్లల్నీ ఒక గదిలో పెట్టి తలుపేసేస్తున్నారని. ముఖ్యంగా యవ్వనంలో ఉన్న స్త్రీలను ఎవరి కంటా పడనీయరని. ఐదు గదులున్న ఒక ఇల్లు చూసేందుకు వెళ్ళామంటే బ్రోకర్ నాలుగు గదులనే చూపిస్తాడు. అన్ని గదులూ చూడటం సాధ్యం కాదు.
మొదటి వారం చూసిన వాటిలో నాకు ఒక్క ఇల్లూ దొరకలేదు. అయితే బ్రోకర్లు ఇచ్చిన ఉద్యోగ దరఖాస్తు పత్రాలు మాత్రం చాలానే పోగయ్యాయి. దానిలో ఒకటి సైరా దరఖాస్తు. చేతిరాతలో ఉన్న ఎన్నో అప్లికేషన్‌ల మధ్య ఆమెది మంచి కాగితంపై అందంగా అచ్చువేయబడి ఉంది. వివరాలవీ చక్కగా ఉన్నాయి. ఉద్యోగానికి అవసరమైన అర్హతలన్నీ ఉన్నాయి. ఇంటర్వ్యూకి పిలవబడినవారిలో ఆమె పేరు కూడా ఉంది. నేను ఊహించినట్టే మనిషి కూడా తేడాగానే ఉంది. వచ్చిన అమ్మాయిలందరూ బుర్ఖా ధరించి తల కప్పుకునే వచ్చారు. ఈమె బుర్ఖాలాంటిదేమీ వేసుకోలేదు. జుట్టు ఎడం వైపు సగం కంటిని కప్పుతూ జలపాతంలా జారుతోంది. నవ్వాలా వద్దా అన్నట్టు ముఖాన ఎల్లవేళలా అంటిపెట్టుకునున్న ఒక సన్నటి చిరునవ్వు. అడిగిన ప్రశ్నలు వేటికీ ఆమె టేబుల్‌కేసి చూస్తూ జవాబివ్వలేదు. ఆమె భుజాన పొడవైన లెదర్ సంచీ వేలాడుతూవుంది. లోపలికొచ్చినప్పుడూ, తిరిగి వెళ్ళేటప్పుడూ ఆమెలో ఆత్మవిశ్వాసం కనబడింది. అయినా ఏం ప్రయోజనం? ఆమెకు ఆ ఉద్యోగం దక్కలేదు.
మా ఆఫీసులో ఏ ఉద్యోగానికి ప్రకటన ఇచ్చినా తక్కువలో తక్కువ రెండువందలకు పైగానే దరఖాస్తులొచ్చేవి. వాటిని తిరగేస్తుంటే అందులో కచ్చితంగా సైరా దరఖాస్తు కూడా కనిపించేది. ఒక్క ప్రకటనని కూడా వదలదనుకుంటా. ఆమెను పదే పదే ఇంటర్వ్యూలలో చూడటంవల్ల ఆమె నాకు బాగానే పరిచయం అయింది. ఇంటర్వ్యూ పేనల్ అడిగే ప్రశ్నలన్నీ ఆమెకు కంఠోపాఠం. అన్నిటికీ సరిగ్గానే జవాబిచ్చేది. అయినప్పటికీ పేనల్‌ను ఆమె జయించలేకపోయేది.
సైరాకి ఇరవైరెండేళ్ళు. ఆమెకు పదహారేళ్ళప్పుడు పెళ్ళయ్యి, పదిహేడులో విడాకులొచ్చి, మళ్ళీ పెళ్ళి చేసుకుంటే, ఆ పెళ్ళి కూడా విఫలమైంది. పట్టుదలంటే ఏంటో ఆమెలో చూడవచ్చు. నాకు ఫోన్ చేసి ఏవైనా ప్రకటనలు రాబోతున్నాయా? ఆ వివరాలేంటీ? అనడిగేది. అయితే ఒక్కసారి కూడా పేనల్ నిర్ణయం ఏంటనో, తనకెందుకు ఆ ఉద్యోగం రాలేదనో అడిగేది కాదు.
ఒకరోజు నాకొక శుభలేఖ వచ్చింది. ఇంతకుముందు నన్నెవరూ అలా పెళ్ళికి పిలవలేదు. ఒక పాకిస్తాన్ వివాహం ఎలా జరుగుతుందో చూడాలన్న ఆశ ఉండేది నాకు. మరి కొందరు తోటి ఉద్యోగులూ ఆ పెళ్ళికి వెళ్తుండటంతో నేనూ వాళ్ళతో కలిసి వెళ్ళాను. అదే నేను మొట్టమొదట చూసిన మహమ్మదీయుల పెళ్ళి అనొచ్చు. సైరా చెల్లెలు పెళ్ళికూతురు. వాళ్ళ ఆచారం ప్రకారం వరుడూ వధువూ ఒకరినొకరు చూసుకోనేలేదు. విడివిడిగా కుర్‌ఆన్‌లో సంతకాలు చెయ్యడం మాత్రమే పెద్ద సంప్రదాయ వేడుకగా భావిస్తారు.
లాహోర్‌నుండి రప్పించిన అమ్మాయిల ముజ్రా నాట్యం రహస్యంగా జరిగింది. వాకిట ఇద్దరు తుపాకీలు పట్టుకుని రక్షణ ఇస్తున్నారు. పెషావర్‌లో ఇలాంటి డాన్సులకి అనుమతి లేదు. నలుగురు అమ్మాయిలూ ఎన్నో సినిమాల్లో మనం చూసినట్టే సినిమా పాటలకి డాన్సులు చేశారు. మగవాళ్ళు డబ్బు నోట్లను వాళ్ళమీద చల్లడం మొట్టమొదటసారి చూశాను. కొంచం తెగించిన మగరాయళ్ళు లేచి దగ్గరకెళ్ళి వాళ్ళ రవికల్లో నోట్లు దూర్చారు. ముజ్రా నాట్యం రాజస్తాన్‌లో పారంపర్యంగా కొనసాగుతున్న కళారూపం అని చెప్పారు. అయితే నేను చూసింది మాత్రం హిందీ సినిమాలు చూసి నేర్చుకుని ఆడిన అమ్మాయిల్నే!
సైరా నన్ను పిలిచి తన తల్లికీ తమ్ముడికీ పెళ్ళికూతురుకీ అందరికీ పరిచయం చేసింది. వాళ్ళందరికీ నా గురించి ముందే తెలుసని అర్థమయింది. నా గురించి సైరా చాలా చెప్పినట్టు చెప్పారు. ఉద్యోగ ప్రకటనలు ఏవైనా వస్తే వాటి గురించి ఆమె ఫోన్ చేసినప్పుడు తెలియజేయడం, ఆమె వచ్చినప్పుడు అప్లికేషన్ పారం ఇవ్వడమే నేను చేసిందల్లా! నా మీద అంత గౌరవభావం వచ్చేంతగా నేనేమీ చెయ్యలేదు తనకి. అయినప్పటికీ వాళ్ళ అభిమానాన్ని అంగీకరించాను.
ఒకరోజు సాయంత్రం ఐదుగంటల సమయంలో అప్లికేషన్ ఫారం తీసుకోడానికి వచ్చిన సైరా నన్ను చూడాలని అడిగిందట. నాకు బాగా గుర్తుంది. అంతకు కొన్ని గంటల క్రితమే ఒక భూకంపం వచ్చి మేమందరం భయపడిపోయున్నాము. మా ఆఫీసున్న నాలుగవ అంతస్తు ఒక్క క్షణం ఒక పక్కకి ఒరిగి, మళ్ళీ మరోవైపుకి ఒరిగి నేరుగా నిలబడింది. ఆఫీసులో సగంమంది భయపడి ఇళ్ళకెళ్ళిపోయారు.
ఈ అమ్మాయి వేరే గ్రహంనుండి వచ్చిన మనిషిలా ఏ కంగారూ లేకుండా కనిపించింది. నా ముందున్న కుర్చీలో కూర్చుని అప్లికేషన్ ఫారం నింపడం గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది. నేను చెప్పాను. కొంతసేపటికి ఏ ప్రశ్నా అడగడంలేదేమా అని తల పైకెత్తి చూస్తే ఆమె కళ్ళనిండా నీళ్ళు! పెదవులు పైకీ కిందకీ వణికాయిగానీ చిన్న ఏడుపు శబ్దమైనా బయటికి రాలేదు. ఆమె ఎంత నిబ్బరంగా దాచుకోవాలనుకున్నా కళ్ళలో నీళ్ళు మాత్రం ఆగట్లేదు. నేను కంగారుపడి, “ఏంటి, ఏమైంది?” అనడిగాను.
ఆమె నోరు మెదపడానికి ప్రయత్నించింది. ఆమెవల్ల కాలేదు. మాటలు మింగేస్తోంది.
“నాకెందుకు ఉద్యోగం రావడంలేదో నాకు తెలుసు.” అంది.
“ఎందుకు?”
“నా కట్టూబొట్టూ ఎవరికీ నచ్చదు. తలమీద ముసుగువేసుకుని రావాలని కోరుకుంటారు. రెండుసార్లు పెళ్ళిచేసుకుని విడిపోయినదాన్ని అన్నది మరో కారణం. అయినప్పటికీ నేనెందుకు ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నానంటే నా కొడుకుని క్రిష్టియన్ కాన్వెంట్‌లో చదివించడానికే…”
“మీకొక కొడుకున్నాడా?”
“ఐదేళ్ళు. తొలి భర్తకి పుట్టినవాడు. నా అప్లికేషన్‌లు చదివేవారు మీరొక్కరే. పేనల్లో ఉన్న అందరికీ నా అప్లికేషన్‌లో లేని మరెన్నో వివరాలు తెలుసు.”
మా ఆఫీసునుండి వెలువడే ప్రతి ఉద్యోగ ప్రకటనకీ నిరాశచెందకుండా దరఖాస్తు పంపిస్తుంది. ఆమెకున్న ఒకే ఒక జీవిత లక్ష్యం మా ఆఫీసులో ఏదో ఒక ఉద్యోగంలో చేరడమే అన్నట్టు ప్రవర్తిస్తోంది. ఒకసారి డ్రైవర్ ఉద్యోగానికి ప్రకటన ఇచ్చినప్పుడు కూడా దానికి దరఖాస్తు పెట్టింది. ఇంతకంటే తక్కువ అర్హతలున్న ఉద్యోగం మా ఆఫీసులో లేదు. చిట్టచివరి స్థాయిదైన ఈ ఉద్యోగం చెయ్యడానికి ఐక్యూ 150 ఉండాల్సిన అవసరంలేదు. అయినప్పటికీ ఆమె దరఖాస్తు పెట్టింది. ఆ ఉద్యోగం కూడా ఆమెకి రాలేదు. నాలుగేళ్ళు పూర్తయ్యి నేను పెషావర్ వదిలేసి వెళ్ళిపోయేప్పటికి కూడా ఆమె దరఖాస్తులు పెడుతూనే ఉంది.
పెషావర్‌లో మా పక్కింట్లో నివసించినతని పేరు అహ్మద్. పెద్ద బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేసేవాడు. మంచి వ్యక్తి. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం అన్న తేడాల్లేకుందా తెల్లవారు ఝామున బాతులు కాల్చడానికి వెళ్ళొచ్చాకే ఆఫీసుకెళ్ళేవాడు. నేను వీడ్కోలు తీసుకోడానికి వెళ్ళినప్పుడు ఎముకలు విరిగిపోయేంత గట్టిగా కౌగిలించుకుని వీడ్కోలిచ్చాడు. నేను కొన్ని వస్తువులు వదిలి వెళ్ళాల్సి వచ్చింది. వాటిని నాకు చేరవేస్తానని అతను హామీ ఇచ్చాడు. అమెరికాకి వచ్చాక అహ్మద్‌కు ఫోన్ చేశాను. అతను నన్ను మాట్లాడనివ్వలేదు. ఫోన్ తీయగానే, “మీకు ఒక పూలగుత్తి వచ్చింది!” అన్నాడు.
“పూలగుత్తా! నాకెవరు పంపిస్తారు?” అన్నాను.
“నిన్న ఒక అమ్మాయి వచ్చి ఒక పూలగుత్తి ఇచ్చి వెళ్ళింది. ఆమె పేరు సైరా. చాలా అందమైన అమ్మాయి!” అన్నాడు.
“పూలగుత్తిలో ఏం పువ్వులున్నాయి?” అడిగాను.
“కార్నేషన్ పువ్వులు మాత్రమే!”
“ఏం రంగువి?”
అతను “లేత ఎరుపు” అన్నాడు.
పువ్వుల నిఘంటువు ప్రకారం లేత ఎరుపు కార్నేషన్ పువ్వులకు ‘నిన్ను ఎప్పటికీ మరిచిపోను’ అని అర్థం. మగవాళ్ళు ఆడవాళ్ళకి పువ్వులు పంపించడం ఆనవాయితీ. నేను చదివిన నవలల్లోగానీ చూసిన సినిమాల్లోగానీ ఒక అమ్మాయి మగవాడికి పూలగుత్తి పంపించిన సందర్భం లేదు. చివరివరకు ఒక విచిత్రమైన మనిషిగానే సైరా అనిపించింది. దేశం వదిలి వెళ్ళిపోతున్న చివరి రోజున ఒక అమ్మాయి ఒక మగవాడికి కానుక ఇచ్చిందంటే, అది కచ్చితంగా దేన్నో ఆశించి అయుండదు.
మిత్రుడు ‘అందమైన అమ్మాయి’ అన్నాడు. అది తప్పు. ఆమె గొప్ప సౌందర్యవతి! ఇందులో బాధాకరమైనదేమిటంటే ఆమెకు అది తెలియదు. నేను పాకిస్తాన్‌లో చూసిన ఆడవారిలోనే ఆమెకంటే అందమైన అమ్మాయిని చూడలేదు. దేశం విడిచి వచ్చేప్పుడైనా ఆమెకు ఉద్యోగం ఎందుకు దొరకదోనన్న నిజమైన కారణాన్ని చెప్పి వుండవచ్చని నాకనిపించింది.
మిత్రుడు అహ్మద్ ‘ఉక్కిరిబిక్కిరి చేసే అందం!’ అని పదే పదే అనేవాడు. అది ఇదే. ఏ కోణంనుండి చూసినా ఆమె అందంగానే కనబడుతుంది. బైబిల్‌లో వచ్చే సాలమన్ కథలో రాచభవనంలో చలువరాయితో నిర్మించిన నేల గురించి ఒక ప్రస్తావన వుంటుంది. రాణి షీబా రాజుని చూడటానికి వచ్చినప్పుడు ఆ నేలను చూసి నీళ్ళేమోననుకొని తన దుస్తులని కొంచం పైకెత్తి పట్టుకుని నడిచిందట. ఆమె ముఖంకంటే ముందుగా ఆమె పాదాలను చూసి రాజు మోహించినట్టుగా కథ ఉంది. సైరా నన్ను మొట్టమొదటిసారి చూడటానికొచ్చినప్పుడు కాలిమీద కాలేసుకుని కూర్చుంది. సగం పాదం కనిపించే చెప్పులు వేసుకుంది. పాదం అంతలా మెరవడం అప్పుడే చూశాను. ఆమెకు ఉద్యోగం దొరక్కపోవడానికి కారణం ఆమెకున్న అపారమైన అందమే. ఆమెకున్న అంత అందాన్ని అమ్మాయిలే భరించలేరు. ఆమెతో పని చేసేవాళ్ళు ఓర్వలేరు. అంత అందాన్ని ఆఫీసే ఓర్వదు.
చాలాకాలం తర్వాత అరబిక్ తెలిసిన ఒక మిత్రుడు సైరా అంటే ‘నవ్వు చెదరనిది’ అని ఒక అర్థం ఉన్నట్టు చెప్పాడు. ఆమె పువ్వులు తీసుకుని నన్ను చూడాలని వచ్చినప్పుడు కూడా కచ్చితంగా ఆమె పెదవులమీద ఆ చిరునవ్వు అలానే ఉండి ఉంటుంది. ఏడున్నరకి వచ్చిందని అహ్మద్ చెప్పినట్టు గుర్తు. నేను అప్పుడు అట్లాంటిక్ సముద్రం మీద న్యూయార్క్‌కు వెళ్తున్న విమానంలో 35000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నాను.
-----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్,
మూలం: ఎ. ముత్తులింగం
(మూలం:‘పూంగొత్తు కొడుత్త పెణ్’.),
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment