Monday, September 10, 2018

బట్టలు ఆరేయడంలోని లింగస్పృహ


బట్టలు ఆరేయడంలోని లింగస్పృహ




సాహితీమిత్రులారా!


స్వగతం అనే శీర్షికలో వ్రాయబడిన
అంశం ఇది ఈమాట మాసపత్రికలో
చూడండేమిటో ఇది ........

పనికి కూడా ఆడ, మగ లింగభేదం ఉంటుందా అని నాకు నేనే ప్రశ్నించుకుంటే గనక, ఇక నేను ఇది రాయలేను. నా వరకూ ఉంటుంది.

ఇల్లు ఊడవడం, కడపలు కడగడం(ఇలాంటి పని ఒకటుంటుందని మా పిల్లలకు తెలుసా?), దాని మీద ముగ్గేయడం, బగోన్లు తోమడం, వాకిలి ఊడవడం, అలుకు జల్లడం(ఇది కూడా మా పిల్లలకు తెలుసా?), బియ్యం పొయ్యి మీద పెట్టడం… ఇవన్నీ నా చిన్నప్పుడు మా అమ్మ పనులు. అయినా, అవన్నీ నేను మా అమ్మకు ఇష్టంగా చేసిపెట్టేవాణ్ని.

ఫిల్టర్‌లో నీళ్లు పోయడం, కూరగాయలు కోయడం, పాలప్యాకెట్‌ కట్‌చేసి గిన్నెలో పోయడం, పిల్లలకు స్నానాలు చేయించడం, రేపు ఉదయానికని గుర్తుపెట్టుకుని ఇవ్వాళ రాత్రే రెడ్‌ రైస్‌ నానబెట్టడం… ఇవన్నీ నా పిల్లలమ్మ పనులు. అయినా, అవన్నీ నేను చేసిపెడతాను, నా పనితీరు తను మెచ్చకపోయినా.

ఇన్ని ఆడ పనులు చేయగలిగినవాడిని, బట్టలు మాత్రం ఉతకలేను.

సమస్య ఎక్కడొస్తుందంటే, మా వాళ్లు ఏ సెలవులకో పది పదిహేను రోజుల పాటు ఊరెళ్తారు. ఒక్కోసారి, చివరి రోజు వేసుకున్న బట్టలు అలాగే వదిలేస్తారు. మరి వాళ్లు తిరిగొచ్చేదాకా వాటిని అట్లా వదిలేయాల్సిందేనా? తప్పిదారి నా పిల్లల బట్టలు ఉతకాల్సి వస్తే? సరే… ఎంతైనా నా పిల్లలే కదా! కానీ అదే ఎంతైనా నా భార్యే కదా అనుకోలేను. ఒకవేళ ఖర్మగాలి గప్‌చుప్‌గా ఏ బాత్రూములోనో పిండేసినా, వాటిని బయట ఆరేయలేం. ఎందుకంటే, సామాజికంగా ఆ చర్యలో చాలా సంకేతార్థం ఉంది. ఒక విధంగా అది నా పుంసత్వాన్ని పణంగా పెట్టడం. మరి దానికి నేను ఎలా సిద్ధపడగలను? పోనీ, అంత గంభీరమైన మాటల జోలికి పోకున్నా, అసలు నేను వాటిని నా చేతుల్తో ముట్టలేను. ఈ తాకనోర్వనితనం కూడా నా మగాధిక్యతలో భాగమేనా? మరి ఈ ఆధిక్యత ఒక్క నా భార్య దగ్గరేనా? ఎందుకంటే, ఒకవేళ నాకే గనక ఒక కూతురుండి, దాని బట్టలు పిండాల్సి వస్తే… కచ్చితంగా పిండేవాణ్ని. అంటే, ఇది కేవలం నా భార్యకూ నాలోని భర్తకూ సంబంధించిన వ్యవహారం.

ఎప్పుడైనా మనం హోటల్లో తిన్నప్పుడు– మగవాళ్లు ప్లేట్లు తీస్తుంటారు కదా… ఇందరి ప్లేట్లు తియ్యగలిగినవాడు ఇంట్లో భార్య ప్లేట్‌ తీయగలడా అని ఆలోచించేవాణ్ని. ‘తీయడు’ అని మనం ఊహించడం సత్యదూరం కాదనుకుంటా. అలా ఎందుకు? ఎందుకంటే, ఈ భూమ్మీద అతని పూర్తి మగస్పృహను ‘ప్రదర్శించాల్సిన’ ఏకైక జీవి ఆమే కదా పాపం. పైగా, అది వాడి స్వీయగౌరవానికి సంబంధించిన అంశం కూడా. ఆమె మీద వాడికి ఆ మాత్రం స్వల్పమైన ఆధిక్యత గనక ఉండకపోతే అది వాడికి చావుతో సమానం. తరాలుగా వస్తున్న ఈ ఆటలో వాడూ తన వంతు ఆటను ఆడి పోవాల్సిందే కదా. మరి ఇంత తతంగం ఉన్నప్పుడు, నేను ఆమె బట్టలు ఎండేయడానికి ఇబ్బంది పడటం ఏమంత పెద్ద విషయం?

ఇన్ని తెలిసిన మొగుణ్నన్న గౌరవం కూడా లేకుండా, నా ‘పల్లెటూరి పెండ్లాం’ అప్పుడప్పుడూ నన్ను ఇలా నిలదీస్తుంటుంది: “నీ బట్టలు ఎండేసుటానికి నాకు ఇబ్బందిగానప్పుడు, నా బట్టలు ఎండేసుటానికి నీకెందుకు ఇబ్బందయితంది?”

జవాబుగా నేను నవ్వడం తప్ప ఏమీ చేయలేను. కాకపోతే– మా మామయ్యను మా అత్తమ్మ ఇలాంటి ప్రశ్న అడగగలిగేది కాదని మాత్రం కచ్చితంగా చెప్పగలను!
-------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment