ఆవిడ
సాహితీమిత్రులారా!
ఈ కథను ఆస్వాదించండి............
శ్రీ లక్ష్మీ విలాసులో ప్రొద్దుటే ఒక ప్లేటు ఇడ్లీ తిని కాఫీ తాగడం అలవాటైంది కొద్ది రోజులుగా. హోటలు ఎదుటే వున్న గవర్నమెంటు హాస్పిటల్లో రొటేషను మొదలు పెట్టినప్పణ్ణించి, మా మెడికల్ ప్రొఫెసర్తో రౌండ్సుకు వెళ్ళే ముందు ఇదొక తంతు.
ఈ బుధవారపేట నాకెప్పుడూ వేరేగా కనిపించలేదు. కోట దగ్గరైనా, రాజవిహార్ అయినా మద్దూరు నగరైనా ఈ పేటలో అయినా అన్నీ ఒకే రకంగా, ఎక్కడా ఏ ప్రత్యేకతా లేకుండా కనిపిస్తాయి. అంతా చెప్పుకోవడం ఈ పేట చుట్టుపక్కల వేశ్యావృత్తి కొంత ఎక్కువే అని.
అసలు వేశ్యలంటే వాళ్ళ మొఖాల మీద రాసి ఉంటుందని అనుకునేటంత అమాయకుణ్ణి కాదు కాని ఒక ఆడ మనిషి వేష భాషలను బట్టి కొంతవరకూ వాళ్ళ జీవితాలను ఊహించొచ్చేమో అనిపిస్తుంది. ఎంత పెద్ద చదువులు చదివినా కొంతవరకు లోకపుతీరు తెలుసుకోవాలని చెప్తూ ఉండేది మా నాయనమ్మ. మరి కాబోయే డాక్టరుగా అలాంటి ఊహలు నాకు ఉండాలో లేదో అని తర్జన చేసేటంత సమయం ఎన్నడూ చిక్కలేదు. ఎంతసేపటికీ మెడికల్ సీటు ఎలా సాధించాలా అనే తప్ప నాలాంటి మామూలు వాళ్ళకు ఇలాంటివి పట్టవనుకుంటా. లోకపుతీరు తెలిసి మెలగాలంటే మరి మనిషిని బట్టి, వాళ్ళేసుకున్న బట్టలను బట్టి మందులివ్వాలి మరి, రోగాన్ని బట్టికాక. రాను రాను మెకానికల్ పట్నపు బతుకుల్లో మనుషులను విభజించే రీతులు మారిపోయి చాన్నాళ్ళు అయినట్లు తోస్తుంది, కొంతవరకూ పాత వాసనలు పోయినాకూడా అసలు ఇదే మంచిదని ఖచ్చితంగా చెప్పేలా మాత్రం లేదు ఈ తీరు ఎంతయినా.
వేరే ప్రాంతాల్లో పుట్టి పెరిగిన నాకు ఈ రాయలసీమ కర్నూలు వాతావరణం బాగా నచ్చింది. చాలా మంది అమ్మాయిలు బస్సెక్కే దగ్గరైనా, కొంచెం పక్కకు జరగమని చెప్పడానికైనా, ‘ అన్నా ‘ అని పిలిచి మరీ అడిగే సంప్రదాయం చూసి కొంతవరకూ ముచ్చటేసింది కూడా. మనుషుల ప్రవర్తన ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకుంటా, ఎంతో సౌమ్యంగా తమ దార్లో తాము తలకూడా తిప్పకుండా వెళ్ళిపోయే అమ్మాయిలను ఏవో కామెంట్లు చేస్తూ బయట రోడ్డుమీద తిరిగే వెధవలంటే నాకుండే చిరాకు కర్నూలుకొచ్చాక ఇంకొంచెం ఎక్కువే అయింది. దానికి కారణమిదే అని సరిగ్గా చెప్పలేను కాని ఇక్కడి ఆడపిల్లల ఒద్దిక కొంతవరకూ సాయపడిందని చెప్పొచ్చు.
ఏదో ఆలోచిస్తా నడిచినా చుట్టూతా మనుషులున్నారని గుర్తు పెట్టుకోవాలి, శ్రీను మాటలకు ఆలోచనల్లోంచి బయటకు జారాను.
ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియక వాడి మొఖంలోకి చూసాను.
నాతో పాటు రౌండ్సుకు వచ్చే నా క్లాస్మేటు శ్రీను హోటల్ పక్కన కొంత వారగా నిలబడి వున్న ఒకావిడ వైపు తను అటువైపు చూడకుండా నన్నే చూడమని కళ్ళతో సైగ చేస్తూ చెప్పాడు. నేను వెంటనే తల తిప్ప బోతే చిన్న గొంతుతో, మరీ అంతలా అందరికీ తెలిసేలా చూడకు రమ్మని పిలిచినా పిలిచేస్తుంది, హెచ్చరిస్తూ చెప్పాడు.
హోటల్లోకి వెళ్తూ కొంత చూసీ చూడనట్టుగా గమనించాను, తను ఒక చెయ్యి నడుం మీద పెట్టుకుని లోకాన్నే ప్రశ్నిస్తున్నట్టు నిలబడుంది ఒకావిడ. క్లాసులో అమ్మాయిలతో అన్నిరకాల జోకులేసే నాకు కూడా చూడ్డానికి కొంచెం బెరుకుగా అనిపించింది. తను మాత్రం నా లాంటి అనామకులను రోజుకు కోటొక్కమందిని చూసినదాని లాగ అసలు మమ్మల్నే కాదు, చుట్టుపక్కల ఉన్న మనుషులంతా ఎవో చీమలో, ఈగలో అన్నట్టు పెద్దగా పట్టించుకోకుండా నిలబడి వుంది అంతే. ఈ లోపు హోటల్లోకి దూరడంతో టిఫిను తినే పనిలో పడ్డామిద్దరమూ.
మరుసటి రోజుకూడా తను రాత్రంతా అక్కడే నిలబడుందా అన్నట్టు మళ్ళీ కనిపించింది. ఈ సారి రోడ్డు దాటకముందునించే గమనించడం వల్ల కొంత సమయం తీసుకుని ఆవిడను పరిశీలనగా చూసాను. మనిషిని చూసి వయసు చెప్పడం కష్ఠమే అయినా నలభై అన్నా వుండొచ్చేమో అనుకున్నా. జుట్టు సిగలాగా వేసుకున్నట్టుంది. అంత అందగత్తె అని చెప్పలేకపోయినా ఏదో ఆకర్శణ వుంది ముఖంలో, అది పచ్చ పొదిగిన చిన్న ముక్కుపుడక వల్ల ఇంకొంచెం ఎక్కువై ఉండొచ్చు. పవిటను కుడిచేతికిందుగా చుట్టూతిప్పి ఎడంవేపు చీరలో నడుం దగ్గర చెక్కింది. అయినా వేశ్యలదగ్గరకెళ్ళేవాళ్ళు అందచందాలను బేరీజువేసి వెళతారేమో నాకు తెలియదు. కానీ ఈవిడ అందరిలా ఏదో ఒక విటునికోసం ఎదురుచూస్తున్నదంటే నా మటుకు నాకు నమ్మబుద్ధికాలేదు.
అయినా ఆ సందు మొదట్లో హోటలు పక్కన పొద్దున్నే నిలబడి ఉండే పని తన వృత్తిపని కోసం తప్ప మరింకేముంటుంది అనిపించింది.
ఎవరో ఒకాయన సైకిలు మీద కూర్చుని, ఎడంకాలు కింద పెట్టి తనతో మాట్లాడుతుంటే, తను మాత్రం రోడ్డు వైపు చూస్తూ ఆయనకు పెడమొఖంగా నిలబడి ఉంది. అదే దారిన పోతున్న ఒక కానిస్టేబులు ఆవిడను పక్క చూపులు చూసుకుంటూ వెళుతూ వుంటే తను అంతకు ముందు రోజులాగే మళ్ళీ చెయ్యిని నడుం మీదకు చేరుస్తూ ‘ ఏరా కళ్ళు ముందుకు పెట్టుకు నడుపు, గుడ్లు అటూ ఇటూ తిప్పుక నడుస్తె ముందు ఏదో రాయి తగిలి మూతి పండ్లు రాల్తయి ‘ గొంతు పెంచి గట్టిగా చెప్పింది. అసలు ఆవిడ గొంతే అంతో లేక కోపంతో అనిందో కాని మాతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉలికిపడ్డారనుకుంటా. హోటలు బయట మొక్కజొన్న కంకులమ్మే బండి దగ్గర నిలబడున్న నలుగురూ మాట్లాడ్డం ఆపేసి, మాతో పాటు తలలు తిప్పి చూసారు, ఒక్క క్షణం మాత్రమే. ఆ కానిస్టేబులు ఒక్క మాటయినా మాట్లాడకుండా తనను కాదన్నట్టు, ఒకింత జంకినట్టు తన దారిన తను వెళ్ళిపోయాడు. ఉరిమింతర్వాత అప్పటిదాకా ఒకే స్వరంలో లేని ధ్వనులన్నీ ఒక్కసారిగా గాడిలో పడ్డట్టు, రోడ్డు మీదుండే గొణుగుడంతా మళ్ళీ మామూలు లెవెల్లోకొచ్చేసింది.
మా శ్రీను గాడు, నా భుజం మీద చెయ్యి వేసి నా చూపులు కూడా మరల్చుకోమని, ఆవిడ నిన్ను కూడ అలాగే తిట్టగలదు జాగ్రత్తరోయ్ అని హెచ్చరించకపోతె, నా ముందు పళ్ళు విరిగేలా క్రింద పడే వాడినే హోటలు మెట్లు తగిలి.
మళ్ళీ తెల్లారి అదే తంతు, అప్పుడే అర్ధమైంది, అసలు ఆమె తనుండే ఆ మూలను సొంత ఇల్లులాగే చూసుకుంటుందని, తను వ్యభిచారే కాక, ఒకరిద్దరిని చేరతీసి వ్యాపారం కూడా నడుపుతుందేమోనని మొదటిసారిగా అనుమానమేసింది. తన కింద ఒకరిద్దరు ఆడపిల్లలను చేరదీసి అలవాటయిన క్లయింట్లను వెదకడమే ఆమె పని అనుకుంటా. అసహ్యం వేసింది, ఇంతకీ చేసేది బ్రోకర్ పని అన్న మాట, పైగా ఆ రోడ్లో పొయ్యే వాళ్ళందరిని బెదిరించడం ఒకటి.
ఆ రోజు బిల్లు కడుతూ హోటల్ ప్రొప్రయిటరును అడిగాను, అసలావిడ గురించి పోలీసు కంప్లైంటు ఇవ్వొచ్చుకదా అని.
ఆయన నా దిక్కు చూసి మళ్ళీ ఆవిడకెక్కడ వినిపిస్తుందో అన్నట్టు మెల్లగా, మీకెందుకు సార్ అసలు పోలీసోళ్ళకే ఆవిడంటే భయం అని చెప్పాడు. ఆయన మాటల్లో అసలు ఈ విషయాలన్నీ నీకెందుకోయి అన్న ధ్వని వినిపించి ఆశ్చర్యమేసింది, ఈయనేంటి ఇలా ఆవిడను సపోర్టు చేస్తూ మాట్లాడేలా వున్నాడే అని. అయినా నాకు మనుషులెప్పుడు సరిగ్గా అర్ధమై చచ్చారుగనక అనుకుని నోరుమూసుకుని బిల్లుపోగా వచ్చిన చిల్లర ప్యాంటు జేబులో వేసుకుంటూ బయటపడ్డాను.
శ్రీనే తరువాత చెప్పాడు, ఎక్కడనించి ఆరా తీసుకుని వస్తాడో ఏమిటో, ఆ ఏరియా డీ ఎస్పీ ఒకప్పుడు ఇక్కడే ఇన్ స్పెక్టరుగా వున్నప్పుడు తనను చేరదీసాడని. చేరదీసాడో, రేప్ చేసాడో ఎవరికి తెలుసు కానీ అప్పణ్ణించి ఆవిడసలు ఎవ్వరినీ ఖాతర్ చెయ్యదని. పైగా ఆ డీ ఎస్పీ ప్రాణాలు తన చేతిలోనే వున్నట్టు అందరినీ ఆయన పేరు చెప్పి తిట్టడం కూడా అలవాటే అని. అంత నోరున్నావిడ దగ్గరికి వెళ్ళే కంటే రోట్లో తల పెట్టడం సులభమేఏమో అని.
నేనే అన్నాను, మరి ఆవిడ తనను తాను కాపాడుకోవడానికే అలా నోరు పెంచుతుందేమో అని. నువ్వన్నదీ నిజమేనేమో ఎవరికి తెలుసు, కొందరంతే బతకాలంటే తప్పదు మరి అంటూ జీవిత సత్యం చెప్తున్నట్టు చూసాడు నా వైపు. శ్రీను, ఉన్నట్టుండి పేదవాళ్ళకోసమే తను పుట్టినట్టు ప్లేటు ఫిరాయిస్తూ మాట్లాడే శ్రీను, మెల్లగా గొణిగాడు, మనకేం తెలుసు ఎవళ్ళ బాధలు వాళ్ళకుంటయి, అని. ఆవిడ చెడ్డదై మనల్ని చెరిపింది లేదు కదా, అయినా. మనిషిని చూసి మంచాళ్ళా చెడ్డ వాళ్ళా ఎలా చెప్పగలం అని నన్నే అడిగాడు.
ఇంకో రోజు, అందరి ముందే చేతికందిన కట్టెతో ఒకడిని కొడుతూ కనిపించింది, ఏంటో గొడవ అని చూడ్డానికి వెళ్ళబోతే హోటలాయిన ఆపేసాడు. మీకెందుకు సార్ ఆవిడతో వుండే ఆడపాపను ఎవడో ఏదో అన్నాడని గొడవ చేస్తూ వుంది, మీ పనిలో మీరు పోండి సార్ లేకపోతె మీ పనికూడ అయితది మట్టసంగ, మా మంచికోరి చెప్పాడాయన.
తను అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా అర్ధమైతున్నట్టు అనిపించింది నాకు, తను చేరదీసిన వాళ్ళకు పోలీసులనించి, లోకల్ రౌడీలనించి రక్షణ కోసమన్నట్టుగా కొంతవరకు కవచంగా పనిచేస్తుంది ఈవిడ, తనకు నోరు తప్ప వేరే ఆయుధం లేదనుకుంటా, ఇవ్వాళ ఎదో ఒక కట్టె చేతిలో వున్నా కూడా.
ఈ రోజేమో, అక్కడెవరూ లేరు కాని తను పెద్దగా ఏడుస్తూ అరుస్తూంది, ‘ మగలంజకొడుకులంతా ఒకటేరా అని తెలిసినా కూడ పెంచి పెద్ద చేసిన కదర ముండా కొడుకా ‘ అని ఎవరినో తిడుతూంది. ఇక ఈవిడ ఇంతే అని మా దారిన మేం టిఫిను చేస్తున్నాం ఏదో మాటల్లో పడిపోతూ. హోటల్ బోయ్ లేడనుకుంటా, ఓనర్ టీ తెచ్చి ఇస్తూ చెప్పాడు, ఆవిడ దగ్గర ఒకే ఒక్క అమ్మాయి వుండేదట. ఆ అమ్మాయిని తన కొడుకే లేవదీసుకు పోయాడట పొద్దున లేచి చూసుకుంటే ఇద్దరూ లేరట. ఆవిడ బాధ ఇంతకీ బంగారు గుడ్లు పెట్టే బాతు పోయినందుకే అన్నమాట. దానికి కొడుకుని ఇంత పచ్చిగా తిట్టవలిసిన అవసరం ఏం వుందో అర్ధం కాలేదు. వ్యభిచారపు జబ్బుకు ఇన్నాళ్ళూ ఉన్న డబ్బు మందు ఇకముందు లేదే అనే ఈ ఏడుపంతా.
తన కొడుకును తనే తిడుతోంది. ఆవిడకు ఒక కొడుకున్నాడని అప్పుడే తెలిసిన మాకు, ఆవిడ నోట్లోనించి వస్తున్న తిట్లు వినకుండా వున్నాం ఇంక. అసలు సభ్య సమాజంలో మగ వాళ్ళు కూడా ఎప్పుడూ తిట్టుకోని మాటలు ధారాళంగా వచ్చేస్తున్నాయి ఇవ్వాళ. గుమిగూడిన జనం మొఖాల్లో కనిపించని ముసి ముసి నవ్వులు, పైకి నవ్వితే తమనెక్కడ తిడుతుందో అని. ఆ తిట్ల ప్రవాహం భరించలేక మేంఉ హాస్పిటలు వెఇపు నడిచాం, రొటీను ప్రకారం.
సాయంత్రం హాస్టలుకు వెళ్ళే ముందు మళ్ళీ ఏం చూడాల్సొస్తుందో అని భయపడుతూనే టీ తాగుదామని హోటల్లోకి వెళ్తే కౌంటరు ముందున్న టేబుల్ దగ్గర కూర్చుని టీ తాగుతూ కనిపించింది ఆవిడ. పొద్దుటి కోపం కనిపించలేదు కాని, రోజంతా ఏడుస్తున్నట్టే వుంది. మొహమంతా పీక్కు పోయి, అసలు మామూలు ఆడ మనిషిలాగే కనిపించింది దగ్గరి నించి చూస్తే.
తను వేరే ఎవరూ చుట్టూ లేనట్టే, ఈ లోకంలో తనకు మిగిలిన పనల్లా ఆ కాలే టీని సాసర్లో ఒంపుకుని ఒకసారి ఊది తాగడమే అన్నట్టు కనిపించింది. ఎంతో ఉద్వేగంతో మెడనరాలన్నీ బిగుసుకున్నట్టు ప్రొద్దుట కనిపించిన ఈ మనిషిలో ఇంత ప్రశాంతత వుందా అనిపించింది.
అసలు ఇదే మొదటిసారి తనని చూస్తూ వుండేదుంటే, కొద్దిరోజులుగానో, ఇవ్వాళ పొద్దుట చూసిన జ్నాపకాలు కానీ లేకుండా ఉంటే, ఆవిడ నాకు కొత్తగా కనిపించేదే కాదు. అందుకేనేమో మొన్నెన్నడో చూసిన ఇంగ్లీషు సినిమా ‘ ది ఇయర్ ఆఫ్ లివింగ్ డేంజరస్లీ ‘ లో వాక్యాలు గుర్తొచ్చినయి, ‘ ఈ దేశంలో కాక ఇంకెక్కడైనా పుట్టి వుంటే ఈవిడ మర్యాదస్తురాలే అయివుండేది ‘ , అని. నా ఈ దేశవాసులంతా భాగ్యవంతులూ, శాంతి తత్వం వుట్టిపడేవాళ్ళూ అయి వుండేవాళ్ళు అనిపిస్తుంది, మనిషిని చూడగానే అంచనా వేసే మన వెధవ మనస్తత్వాలే లేకుంటే.
ముందు ముందు డాక్టరుగా తప్పకుండా మనిషిని చూసే చేస్తాను వైద్యం అని నాకు తెలుసు. మొఖం చూసి మందులిచ్చి సంఘంలో గొప్ప డాక్టరుగా పేరు తెచ్చుకోవడానికివే సోపానాలు అన్నట్టు ఇప్పుడిప్పుడే పాఠాలు మొదలు పెట్టాను. మనంచూసేవన్నీ నిజాలే అని నమ్మే మెజారిటీ వాళ్ళలో నేనున్నందుకు నన్ను నేను అభినందించుకోవాలి కూడా. అలా అయితే అనవసరమైన రిస్కులుండవు.
లోకరీతిప్రకారం నడుచుకునేవాళ్ళలో అవార్డు పుచ్చుకున్నవాళ్ళలా, మా నాయనమ్మ మెచ్చుకునేలా ఆవిడకు దూరంగా ఇంకో మూలకున్న టేబులు వైపు నడిచాము, శ్రీను, నేను.
టీ తాగాక వెళుతూ, అన్నా, నేనిక వెళ్తాను అని ఓనరుకు చెప్పి, బయటకు నడిచింది. ఆవిడ గొంతులో ప్రొద్దుటి కోపం కాని, ఏడుపు కాని ధ్వనించలేదు.
చూస్తుండగానే హోటలు బయట చెట్టుకింద, కంకులమ్మే బండి పక్కనే వున్న రిక్షా ఎక్కి మా ముందే వెళ్ళిపోయింది.
ఓనర్ మాకు టీ తెచ్చి ఇస్తూ చిన్న గొంతుతో పొద్దున సగంలో ఆపిన కథ పూర్తి చేసాడు. ఆవిడ చేర దీసిన అమ్మాయి చిన్నప్పుడెప్పుడో తల్లి వదిలేసి పోతే తనే పెంచిందని, ఆవిడ కొడుకు ఒక పెద్ద లోఫర్ అని, వాడు ఇప్పుడు ఆ అమ్మాయిని లేవదీసుక పోయింది ఎక్కడో అమ్మెయ్యడానికే తప్ప ఏదో సదుద్దేశంతో కాదు అందుకే తను కోపం పట్టలేక, ఇంకేం చేయ్యాలో తోచక లోకం మీద కసితో పొద్దున అట్లా తిట్లు అందుకుంది అని. తను హోటల్ పెట్టిన ఇరవై ఏండ్లుగా ఆవిడ ఒక్కటీ అడగలేదని, వున్నంతలో తినిందే తప్ప మందిని అడగడమెన్నడూ లేదని బాధగా చెప్పాడు. ఇక ముందు ఆవిడకు తన ఒళ్ళమ్ముకునో, ఇలా మంది మీద నోరు చేస్తూనో బతకాల్సిన అవసరం లేదట. ఆవిడ ప్రేమించిన, చుట్టూ మూగే ఈగల్లాంటి జనానికి కొంత బెదురు పెడుతూ అయినా సరే కాపాడాలనుకున్న ఒకే ఒక్క అమ్మాయి కూడా కుక్కల పాలే అయిందని ఇకముందు తను రోజూ కనిపించక పోవచ్చు అని చెప్తూ, ఆవిడ మిమ్మలను ఇక విసిగించదు లెండి అన్నాడు.
ఎవరు ఎవరిని విసిగించారో నాకర్ధం కాలేదు.
జాలిగా మొఖం పెట్టిన నన్ను చూస్తూ, ఆవిడ గురించా లేక ఇకనుంచీ పూర్తిగా తెలియకుండా ఎవరినైనా అంచనా వేయొద్దని మనకావిడ తెలియజెప్పినందుకా నీ బాధ, సూటిగా వచ్చిన శ్రీను ప్రశ్న నాకిక వినబడనట్టు తల బయటకి తిప్పేసాను.
----------------------------------------------------------
రచన: విప్లవ్,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment