Sunday, September 9, 2018

సంగీత నాటకాలు


సంగీత నాటకాలు



సాహితీమిత్రులారా!


(1959, ఆంధ్రప్రదేశ్ సంగీత నృత్య నాటకోత్సవాలకు ప్రత్యేక సంచికగా వెలువడిన నాట్యకళలో వెనుక ప్రచురితమైనది.)

నాటకాలలో సంగీతం ఉండాలా అక్కర లేదా, నాటకాలలో పద్యాలు ఉండాలా అక్కర లేదా? పద్యాలు సంగీతంతో పాడవచ్చునా కూడదా అనే వివాదాలతో ప్రమేయం ఏమాత్రమూ లేని – పూర్తి సంగీత నాటకాలు ఈ వ్యాసం లోని ప్రసక్తాంశం. నాటకం రచన ఎంతో బాగుండి, నటకులు ఎంతో ప్రతిభతో నటించి, నిర్వాహకులు ఎంతో దక్షతతో నిర్వహిస్తేనే ఏ నాటకమైనా ప్రేక్షకుల మన్నన పొందడం సాధ్యమవుతుంది. ఇన్నీ కలిసివచ్చినప్పుడు అటువంటి వచన నాటకానికా, లేక సంగీత నాటకానికా ప్రేక్షకులు ఎక్కువగా రంజిల్లేది అని అడిగితే, ఈ నాటికీ కూడా కాస్తోకూస్తో సంగీతంవుంటే (అది నిర్దుష్టంగా నిర్వహింపబడినపుడు) వచన నాటిక కంటే సంగీతం ఉన్న నాటకానికే త్వరగా రంజన కలుగుతుంది అని చెప్పాలి.

ప్రాచీన నాటక చరిత్ర పరిశీలిస్తే చరిత్రాతీతుడైన భరతముని నాటినుంచీ కూడా సంగీత ప్రసక్తి మేళ తాళ ప్రశంస నాటక లక్షణంలో విధిగా వస్తూన్నవి. ‘అవసానుకృతియే నాట్యం’ అన్నారు గాని, నాట్యం యథాజీవితమనిగాని, నాటకం జీవితానికి ఛాయాపటవత్ ప్రతిబింబం అనిగాని అనుకోడానికి వీలు లేదు. జీవిత యథార్థతనుంచి రసానందానుభూతిద్వారా ప్రేక్షక మానసాలకు ఉడ్డీనత కలిగించేదే ఉత్తమ కళ. సంగీత నాటకంవల్ల అది త్వరగా సిద్ధిస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఆపెరాలు అంటే సంగీత నాటకాలూ, బ్యాలేలు అంటే నృత్య నాటకాలూ – రెండు ప్రక్రియలూ స్వతంత్రంగా ఒకదానితో ఒకటి ప్రమేయం లేకుండా వర్ధిల్లాయి. 17 వ శతాబ్ది ప్రాంతంలో ఇటలీలో ఆపెరాలు ప్రారంభించేదాకా పాశ్చాత్య దేశాల్లో సంగీత నాటకాలు పుట్టలేదు. భారత దేశంలో 12వ శతాబ్ది ప్రారంభంలో వెలసిన జయదేవునిద్వారా మన దేశానికి అంతటికీ అన్ని ప్రాంతాలకీ ఈనాటికీ ఆరాధ్యమైన గీతగోవిందం అనే మహా సంగీత నాటకం లభించింది. ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ అన్న జయదేవుని ప్రజ్ఞాత్మకమైన బిరుదాన్ని బట్టి, అది వట్టి సంగీత నాటకమే కాకుండా నృత్య నాటకం అని కూడా గ్రహించవచ్చు. భరత నాట్య శాసానికీ, అలంకార శాస్త్రానికీ, గీతగోవిందం లక్ష్యప్రాయమై నాటినుంచి నేటివరకూ పరమ ప్రామాణికమయింది. ఓఢ్ర వంగదేశాలలో సరిహద్దులలోగల కిందు బిల్వం, కెందూలి అని పిలవబడే జయదేవుని జన్మ గ్రామంలోను, పూరీ జగన్నాథంలోను, ఇంకా అనేక ఇతర క్షేత్రాలలోను, విష్ణుప్రీతికరములైన ఉత్సవ దినాలలో గీతగోవిందాన్ని తరతరాలుగా ప్రదర్శిస్తున్నవారు ఈనాటికీ ఉన్నారు.

12వ శతాబి మాట అటుంచి, క్రీస్తుకు పూర్వం సుమారు 10వ శతాబ్ది నుంచి 4వ శతాబ్దివరకూ ఎప్పటివాడో స్పష్టంగా తెలియని భరతాచార్యుని నాట్యశాస్త్రంలోనే నాటకాలలోని ప్రావేశికీ నైష్క్రామికీ ధ్రువాగానాలు మన తెలుగు యక్షగానాల్లో అనాదిగా వినవస్తూ, పాత్రలు ప్రవేశించేటప్పుడూ, నిష్క్రమించేటప్పుడూ గానంచేసే దరువులే అని పరిశోధకులు స్పష్టపరిచారు. దీనినిబట్టి, పాశ్చాత్య దేశాలలో ఆపెరాలు బయలుదేరడానికి సుమారు 20 శతాబ్దాలు ముందే మన దేశంలో సంగీత నాటకాలు సర్వలక్షణలక్షితాలై పరిఢవిల్లినట్లు తేటతెల్లమవుతోంది. అయితే, ఈ నాటకాలను తొలిదశలో మన దేశంలోని వివిధ భాషా ప్రాంతాలలో పల్లీజనులు, ఆటవికులు, కొండజాతులు, తమ తమ ప్రాంతాలలో వెలసిన దైవతములను గురించిన పురాణగాథలతో వారి వారి భాషలలో ప్రదర్శిస్తూండేవారు. ఆయా నాటకములలోని గేయఫణితులను 15వ శతాబ్దినుంచి అన్నమాచార్యులవంటి సాహిత్యపరులైన వాగ్గేయకారులు స్వీకరించి సంకీర్తనములను, పదాలను రచించే వరకు, ఈ యక్షగానాలు సాహిత్య పరిణతిలేక, గ్రామవినోదాలుగా మాత్రమే ఉంటూ వచ్చేవి. సుమారు 12, 13 శతాబ్దాలకు చెందిన రాజు కళింగగంగు వేములవాడ భీమకవి శాపంచేత రాజ్యభ్రష్టుడై, తిరగి రాజ్యప్రాప్తి పొందడానికి తోడుపడినవారు ఆ విధంగా గ్రామగ్రామమూ సంచారంచేసే భాగవత మేళాలవారే. అన్నమాచార్యులకు సమకాలికుడైన సాళ్వ నరసింహరాయలనే విద్యానగర చక్రవర్తి కూడా, సమ్మెట గురవరాజు అనే దుష్టసామంతుని దుండగాలను గురించి, అటువంటి భాగవత మేళమువారి నాటక ప్రదర్శనద్వారా తెలుసుకొని, ఆ తర్వాత సైన్యాన్ని పంపి గురవరాజును దండించాడట. అంతేకాదు, సాళ్వ నరసింహరాయలకు ప్రోలుగంటి చెన్నయ్య సౌభరి చరిత్రము అనే జక్కుల కథ (యక్షగానము) రచించి అంకితమిచ్చాడు. ఆతర్వాత ఒక శతాబ్దానికి కందుకూరి రుద్రయ్య రచించిన సుగ్రీవ విజయ యక్షగానం వచ్చింది. ఓబయ్య మంత్రి రచించిన గరుడాచల యక్షగానము కూడా ఈ విధముగా పామర నాటక రంగమునుండి సాహిత్యపరుని గంటముచేత దిద్ది తీర్చబడినదే కనుక, సుమారు ఇదేకాలానికి చెంది ఉండవచ్చు.

ఆంధ్రదేశాన్ని పాలించిన వేంగీ చాళుక్యుల మొదలు ఆయా రాజవంశాల కొలువుకూటాలలో సంగీతానికీ నాటకానికీ ఏపాటి గౌరవాదరాలుండేవో స్థూలంగా పరిశీలించి గ్రహించవచ్చు. వైదికధర్మావలంబియై బహు శ్రోత్రియంగా ధర్మాద్వైతస్థితికి పాటుపడిన రాజనరేంద్రునికొలువులో రాజు మంత్రిపురోహిత సేనాపతిదండనాయక దౌవారికమహాప్రధానానంతసామంత విలాసినీపరివృతుండైనట్లు, అపార శబ్దశాస్త్రపారగులైన వైయాకరణులు, వారి తర్వాత పౌరాణికులు ఆ వెనుక మహాకవులు, తార్కికులు, అయిన పిదప, వైణిక గాయకులు చిట్ట చివర పంక్తిలో ఉండినట్లు నన్నయగారి భారతాన్ని బట్టి తెలుస్తుంది. కాకతీయ సామ్రాజ్యంలో మట్టుకు గణపతిదేవ చక్రవర్తి కొలువులో సేనానియైన జాయప్ప నృత్తరత్నాకరము, గీత రత్నాకరము, రచించిన గాయకుడూ లక్షణకర్తా అయి ప్రసిద్ధి పొందినట్లు ఇటీవల పరిశోధకులు వెలువరించిన నృత్యరత్నాకరాన్ని బట్టి తెలుస్తోంది. గణపతి దేవునికి తన సమకాలికుడయిన దేవగిరి యాదవ రాజైన సింహణుడితో రాజకీయ స్పర్థ మాత్రమేగాక, కవిగాయక పోషణలో కూడా స్పర్ధ ఉండేది. సింహణుడి కొలువులో ఉండిన శార్‌ఙ్గదేవుడు సంగీత రత్నాకరం రచించాడు. అది యీనాటికీ ఉత్తర దక్షిణ దేశ సంగీతజ్ఞులకు ప్రామాణిక గ్రంథము. కాకతీయుల తర్వాత వచ్చిన రెడ్డి రాజులలో కుమారగిరి వసంత రాజు, పెదకోమటి వేమారెడ్డి – నాట్యశాస్త్ర వ్యాఖ్యాతలయి, నర్తక గాయకులను పోషించారు. వారికి సమకాలికుడైన రేచర్ల వెలమరాజు సర్వజ్ఞ సింగమనీడు సంగీతరత్నాకరానికి వ్యాఖ్య వ్రాశాడు. విద్యానగర స్థాపన కారకుడై వేదపారంగతుడయి భాష్యకర్తగా ప్రసిద్ది చెందిన విద్యారణ్యుడు సంగీతసారం రచించాడు. ఈ చారిత్రక కాలంలో శ్రీనాథుని నాడు మాత్రం ప్రేమాభిరామ సంస్కృత వీధినాటకం పేరొకటి క్రీడాభిరామంద్వారా వినబడుతుంది. 15వ శతాబ్దంలో విద్యానగరము నేలిన సాళువ నరసరాజు కాలంలో యక్షగానం రాజదర్బారులకు ఎక్కిన సంగతి ముందు చెప్పుకొన్నాము. ఈ కాలం దాటేసరికి, మనం రాజవంశాలను దర్బారులను వదలి, కూచిపూడి చేరుకోవలసి వస్తుంది.

ఐతిహ్యాలనుబట్టి, కూచిపూడి భాగవత మేళములవారిని భరత లక్షణానుసారులనుగా చేసి, వంశపారంపర్యంగా పురుషులే వేషధారణచేసి, నాటకములను ఆడవలెనని కట్టడి చేసినవాడు సిద్ధేంద్రయోగి అని చెప్పుతున్నారు. సిద్ధేంద్రుడు నారాయణ తీర్థులకు శిష్యుడని ఒక వాదము. ఆయనకు ఈయనకు కూడా అత్తవారింటికి నదిలో ఈదుకొని పోతుండగా వరదరావడమూ, నదీగర్భంలో ఆపత్సన్యాస స్వీకారమూ – ఈకథ ఇద్దరికీ జరిగిందని చెపుతారు. నారాయణ తీర్థుల మహా యక్షగానం అయిన కృష్ణలీలా తరంగిణి పూర్తిగా సంస్కృతపు కీర్తనలతో, శ్లోకాలతో తరంగాలనబడే 12 అంకాలలో రచింపబడింది. ఆ తరంగాలను కూచిపూడివారు అనాదినుంచీ అనూచానంగా తమ ఆటలలో ప్రదర్శిస్తూ అభినయిస్తున్నారు. దాని తర్వాత సిద్దేంద్రుని భామాకలాపం కూచిపూడివారికి ప్రధాన ఆలంబనమయింది. చరమ జీవిత కాలంలో నారాయణ తీర్థులు దక్షిణాదికి వెళ్లిపోయి సత్యభామ కథనే పారిజాతాపహరణంగా కూర్చి, తంజావూరు ప్రాంతానికి తనతోపాటు వలసపోయిన కూచిపూడి వారి వారసులయిన మేలటూరి వారికిచ్చాడు. అందుకే వారు అప్పటి నుండి నేటివరకూ ఆ తమిళ దేశం మధ్య- తెలుగు సంగీత నాటకాలనే ఆడుతుంటారు. అటు తర్వాత కూచిపూడివారి ప్రదర్శనల్లో తరిగొండ వేంకమాంబగారి గొల్ల కలాపము, భాగవతుల రామయ్యగారి గొల్ల కలాపము రాణ చెందాయి. చారిత్రకంగా ఆలోచిస్తే నారాయణతీర్ధులూ, సిద్ధేంద్రయోగీ, పదకర్త అయిన క్షేత్రయ్య 17వ శతాబ్దానికి ఆవలి యీవలి సగాలలో యాభై సంవత్సరాల యెడంలో జీవించి ఉండినట్లు, ముగ్గురూ కూడా కూచిపూడివారికి ఉపదేశకులయినట్లూ తోస్తుంది. ఇటు పైని కూచిపూడివారు తరచుగా తీర్థులూ, క్షేత్రయ్య మొదలైన వాగ్గేయకారులు చేసినట్లే, ప్రదర్శనలకు రాజపోషణకు తంజావూరు మధురలు యాత్రలు చేసి వస్తూండినట్లు కనబడుతుంది. తంజావూరునేలిన నాయక రాజులకు, మహారాష్ట్ర రాజులకు అంకితము చేయబడిన సలాము, దర్వులు మున్నగునవి కూచిపూడివారి తరువాత నాటకాలలో వినబడుతూండడమే దానికి దృష్టాంతం.

ఇంతవరకూ అస్పష్ట చారిత్రక యుగం గడిచింది. 17వ శతాబ్దినుంచి, తెలుగుసంగీత నాటకచరిత్ర – తంజావూరులో స్వర్ణ యుగాన్ని స్థాపించుకొన్నది. అప్పుడు తంజావూరునేలిన నాయక రాజులూ, వారి తర్వాత పరిపాలించిన మహారాష్ట్ర రాజులూ ఆ స్వర్ణయుగ నిర్మాతలు. 17వ శతాబ్ది తొలిదశకంలో కృష్ణా ప్రాంతం నుంచి నారాయణ తీర్థులతో పాటు తంజావూరు ప్రాంతానికి వెళ్ళిన కూచిపూడి భాగవత కుటుంబాలే అప్పటిరాజైన అచ్యుతప్ప నాయకుని తమ నాటక ప్రదర్శనములద్వారా మెప్పించి, అచ్యుతరాయసముద్రమనే గ్రామాన్ని అరణం పొందారు. అదే తర్వాత మేళత్తూరు, లేక మేలటూరు అయింది. ఈ మేలటూరులో భాగవత కుటుంబాలవారు నాటినుంచి నేటివరకు తెలుగులోనే అనేక వాగ్గేయ రచనలను సంగీత నాటకాలను రచించి ఏటేటా తమ గ్రామంలోను, దక్షిణ దేశంలోని ఇతర గ్రామాలలోను ప్రదర్శిస్తూ వచ్చారు. మేలటూరు వాగ్గేయ కారులలో ప్రసిద్ధులు శబ్దకర్తయైన కాశీనాథయ్య, పదాలను కీర్తనలను రచించిన వీరభద్రయ్య, సుమారు 12 తెలుగు నాటకాలదాకా రచించిన వేంకటరామశాస్త్రి. ఈ వెంకటరామశాస్త్రి త్యాగరాజుకు సమకాలికుడు.

అచ్యుతప్ప నాయకుని కుమారుడయిన రఘునాథనాయకుడు కృష్ణ దేవరాయలవలె కవి పండిత గాయక పోషకుడై సాహిత్యభోజుడని ప్రసిద్ధి పొందాడు. తాను స్వయంగా గజేంద్రమోక్షము, రుక్మిణీ కృష్ణవివాహము, జానకీ పరిణయము అనే యక్షగానాలను రచించాడు. రఘునాథుడు సంగీత శాస్త్ర నిష్ణాతుడుకూడ. అతని మంత్రియైన గోవిందదీక్షితుడు వ్రాశాడని చెప్పబడుతున్న సంగీతసుధ అనే లక్షణ గ్రంథం రఘునాథనాయక కర్తృకంగానే రచింపబడింది.

రఘునాథుని కుమారుడైన విజయ రాఘవ నాయకుడు 28 యక్షగానాలను రచించాడు. ఈయన కొలువులోని ఇతని పుత్రుడు మన్నారు దేవుడు, కోనేటి దీక్షితకవి, పురుషోత్తమ దీక్షితుడు, కామరసు వేంకటపతి సోమయాజి, పసుపులేటి రంగాజమ్మ, కృష్ణాజి, వీరందరూ యక్షగాన కర్తలే.

వీరుకాక, విజయ రాఘవుని దర్బారును అలంకరించిన గాయక నర్తకులలో అగ్రేసరురాలైన చంద్రలేఖ, రూపపతి, చంపకవల్లి, మూర్తి, కోమలవల్లి, లోకనాయిక, శశిరేఖ, రత్నగిరి, భాగీరథి మున్నగు వారందరూ వివిధ నాటక నృత్య ప్రదర్శనలలో పాల్గొని మన్నన పొందేవారు. విజయరాఘవుని యక్షగానంలో ప్రసిద్దమైనవి రఘునాథాభ్యుదయమూ విప్రనారాయణ చరిత్రా. అష్టభాషా విశారదమైన పసుపులేటి రంగాజమ్మ యక్షగానాలలో ప్రసిద్ధమైనది మన్నారు దాస విలాసము.

1704 వరకు మైసూరునేలిన చిక్క దేవరాయలు తాను మూగవాడయినప్పటికీ, కళువె వీరరాజు అను కవీశ్వరుని సాహాయ్యంతో ఆంధ్ర కొరవంజి, నాట్యవిద్యా విలాసము మొదలైన 14 యక్షగానాల రచనకు కారకుడయినాడు.

విజయరాఘవనాయకుని తర్వాత తంజావూరు మహారాష్ట్ర రాజుల వశమైంది. ఈ రాజులు తమ మాతృభాష మహారాష్ట్రమైనా, పాలించేది ద్రావిడ దేశమే అయినా, సంస్కృతాంధ్ర భాషలలో సంగీత సాహిత్య గ్రంథాలను స్వయంగా రచించి, అనేక కవి పండిత గాయకాదులను పోషించి, నాయక రాజులు ప్రారంభించిన సంస్కృతీ బీజాలను ఇతోధిక భక్తి శ్రద్ధలతో పోషించారు. వీరిలో 1684 నుంచి 1712 వరకూ పాలించిన శాహభూపాలుడు (శాహజీ) దాదాపు 20 యక్షగాన నాటకాలను, అనేక పదాలను రచించాడు. వాటిలో ప్రసిద్దమైనవి శంకర పల్లకి సేవా ప్రబంధ నాటకము, విష్ణుపల్లకి సేవా ప్రబంధ నాటకము. శంకరపల్లకి సేవ తిరువారూరులోని త్యాగరాజస్వామి పల్లకి సేవను గురించి ఉత్సవ సంప్రదాయ కీర్తనాత్మకముగా రచింపబడిన యక్షగానము. దీనిని ప్రతి శుక్రవారము ఆలయపు దేవదాసులు నృత్య సంగీతాత్మకంగా ప్రదర్శించేవారు.

ఈ శాహభూపాలుని ఆస్థాన వాగ్గేయకారుడు, బహుళ యక్షగాన పదకర్తా అయిన గిరిరాజకవి కర్ణాటక సంగీతరత్న త్రయంలోని త్యాగరాజుకు సాక్షాత్తు పితామహుడే. గిరిరాజు యక్షగానాలలో ముఖ్యమైనవి శాహేంద్ర చరిత్రము, లీలావతీ కల్యాణము, రాజ మోహన కొరవంజి. తంజావూరులో ఈనాటికీ ఉన్న సరస్వతీమహల్ అనే ప్రాచీన గ్రంథాలయం శాహజీ భూపాలుని శ్రద్దాభక్తులవల్లనే సేకరింపబడింది. తద్ద్వారానే నాయక రాజులనాటి యక్షగానాలు, మహారాష్ట్ర రాజులనాటి యక్షగానాలు ఇంకా అనేక ప్రాచీనాంధ్ర సంస్కృత పద్యకావ్యములు తాళపత్రములపై లిఖింపబడి, భద్రపరుపబడి, మనకు ఈనాటికీ లభిస్తున్నవి.

ముందు మేలటూరు వాగ్గేయకారులలో చివర చెప్పుకొన్న వేంకటరామ శాస్త్రి త్యాగరాజుకు సమకాలికుడు. వయోజ్యేష్ఠుడు. నారసింహోపాసకుడైన ఈయన నాటకాలలో ప్రసిద్ధమైనది ప్రహ్లాదచరిత్ర. ఈ తెలుగు నాటకం తంజావూరు గ్రామాలలో నృసింహజయంతి రోజుల్లో ఏటేటా ఇప్పటికీ ప్రదర్శిస్తూంటారు. మిగిలినవి ఉషాపరిణయం, రుక్మాంగదచరిత్ర, హరిశ్చంద్ర, మార్కండేయ మొదలైనవి.

త్యాగరాజు నౌకాచరిత్రము. ప్రహ్లాద భక్తి విజయం, సీతారామ విజయం అనే సంగీత నాటకాలను రచిస్తూండినపుడు తరచు తనకంటే వయోధికుడైన వెంకటరామశాస్త్రికి వినిపించి ఆయన మెప్పు పొందేవాడట. త్యాగరాజు బాల్యంలో తన తాతగారైన గిరిరాజకవి నాటకాలను, శాహభూపాలుని కొలువులో శాహజీ నాటకాలను ఆ తర్వాత మేలటూరు నాటకాలను కూడా ప్రదర్శిస్తూండగా అనేక పర్యాయములు దర్శించి, తన నాటకాభిలాషకు దోహదం చేసుకొన్నాడు. భక్తిరస ప్రాధాన్యము వల్లను, సంగీత సాహిత్య రచనాదక్షత లోను, త్యాగరాజు నాటకాలు మేలటూరు నాటకాల కంటే ప్రత్యేకత కలిగి ఉంటాయి.

త్యాగరాజుకు సమకాలికుడై తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపుర వాస్తవ్యుడైన మద్దిరాల వెంకటరాయకవి స్థానిక దైవతమైన కుక్కుటేశ్వరుని నిత్యోత్సవాలకుగాను ఏకాంతసేవావిలాసమనే యక్షగానం రచించాడు. దీనిని పిఠాపురంలోని కళావంతులు ఆనాడు నృత్యగానాలతో ప్రదర్శించేవారట కాని, ఈనాడు పూజారులలో ఒకరిద్దరి గాత్రాలలో హరించుకపోవడానికి సిద్ధంగా ఉన్నది.

ఇవిగాక, 18, 19 శతాబ్దాలలో ఆంధ్ర దేశంలోని ఆయా ప్రాంతాలలో అనేక గ్రామనాటక సంఘాలు వెలిసి అనేక వీథి నాటకములు, యక్షగానములు రచింపబడ్డాయి. వేములపల్లె విరాటపర్వం, లేపాక్షి రామాయణం, మానికొండ రామాయణం, ధర్మపురి రామాయణం, ఇలాంటివే. 18వ శతాబ్దిలో భద్రాచలంలో యాదవదాసు అనే అతడు గరుడాచల నారసింహుడి కథను (చెంచు లక్ష్మి) ఓబయ్య మంత్రి రచించిన దానికంటే అధునాతన పద్ధతులలో యక్షగానంగా రచించాడు. చెంచులక్ష్మి నాటకంగా ఇది ఆంధ్ర దేశంలో చాలా ప్రాంతాలలో జనరంజకత పొందింది.

19వ శతాబ్దంలో యక్షగానం క్రమంగా హరికథగా పరిణామం పొందింది. అంటే యక్షగానంలోని సూత్రధారుని కథాకథన గద్య పద్యాలకు తోడు ఆయా పాత్రల సంభాషణ దరువులను, గద్య పద్యాలను కూడా కథకుడే ఏకపాత్రాభినయంగా, అభినయ గాననృత్యాత్మకంగా చెప్పుకుంటూ పోవడం అభ్యాసంలోకి వచ్చింది. గోగులపాటి కూర్మనాథుడనే సింహాచల నివాసియైన వైష్ణవ వాగ్గేయకారుడు రచించిన మృత్యుంజయ విలాసమనే శివకథ ఈ విధంగా హరికథా పద్దతిలో చెప్పబడి జనరంజకత పొందిన యక్షగానాలలో మొదటిది. యక్షగానాలను ఇంతటితో విడిచి పెట్టి, మనం ఆధునిక యుగంలోకి అడుగిడవలసి ఉంటుంది.

సుమారు 19వ శతాబ్దపు రెండవ సగం ఆంధ్రదేశానికి మరాఠీ పార్శీ థియేటర్ నాటక సమాజాలవారు వచ్చేనాటికి మన ప్రాంతంలో కూచిపూడివారివీ, ఇంకా ఆ సంప్రదాయంలో ఆయా జిల్లాలలో వెలసిన భాగవత కుటుంబాలవారివీ యక్షగాన ప్రదర్శనలూ, వీథి నాటకాలూ, కళావంతుల నట్టువరాండ్రకలాపాలూ ఉంటుండేవి. ఆనాటికప్పుడే బ్రిటిషు సామ్రాజ్యం బలపడి, ఆంగ్లవిద్యా ప్రభావం మనపట్టణాల్లో విద్యాధికులలో తలసూపనారంభించింది. దాని తొలిఫలితం యేమంటే జాతీయ కళారూపాలయిన వీథి నాటకాలూ, కలాపాలూ పల్లెలకూ దేవస్థానాలకూ మిగిలిపోయి, పట్నవాసాలలో ఆంగ్లరంగస్థల పద్దతి నాటక రచననూ ప్రదర్శనలనూ ప్రారంభించారు. వీరేశలింగం పంతులుగారు, వేదం వెంకటరాయశాస్త్రిగారు, తిరుపతి వెంకట కవులవంటివారు కొందరు సంస్కృత నాటక పద్ధతిని పద్య గద్యాత్మకములైన నాటకాలను వ్రాశారు. కోలాచలం శ్రీనివాసరావుగారు, ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారు మొదలైనవారు పద్యగద్యాత్మకములుగా మాత్రమే కాకుండా, పార్శీ మరాఠీ నాటకములలో ఆనాడు తాము వినియుండిన పాటల వంటి పాటలతో కూడిన నాటకాలను రచించి ప్రదర్శించారు. ఎక్కువ పద్యాలు కొద్దిగా పాటలతో పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు, ఎన్నో పద్యాలతో చిలకమర్తివారు, తిరుపతి వేంకట కవులు, బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు నాటకాలను వ్రాశారు.

ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారు, గోపాలాచార్యులుగారు, చక్రావధానుల మాణిక్యశర్మగారు, అయినాపురపు సోమేశ్వరరావుగారు, సోమరాజు రామానుజరావుగారు, కొప్పరపు సుబ్బారావుగారు మొదలైనవారు తమ నాటకాలలో ఒక్కొక్క దానిలో 25, 30 పాటలకు తక్కువ కాకుండా చేరుస్తూ వచ్చారు. వీరందరి కంటేకూడా మైలవరం వారి నాటకాలకు సంగీత గురువయిన పావట్ల కాంతయ్యగారి పాటలు–సావిత్రి, మానసంరక్షణము, కృష్ణతులాభారము నాటకాలకు వ్రాసినవి– బహుజనరంజకత పొందాయి. అంతేకాదు ఈ పాటలవల్ల నైతేనేమి. అర్ధశతాబ్దిపాటు ఆంధ్రనాటక రంగమును ఏకచ్ఛత్రాధిపతులై ఏలిన యడవల్లి, కపిలవాయి, జొన్నవిత్తుల, అద్దంకి వంటి గాయక నటులు దిద్దితీర్చిన పద్యగాన సంప్రదాయంవల్ల నైతేనేమి, ఒక విశిష్టమైన ఆంధ్రరంగస్థలబాణీ అంటూ ఒకటి ఏర్పడింది. ఇంతకుముందు వివరించిన ప్రాచీన యక్షగానాది నాటక చరిత్రకు తర్వాత ఇంతవరకు రంగస్థల సంప్రదాయ కథను ముందు సూచించబోయే ఆదర్శ సంగీత నాటక పరిణామానికి ముందటి యుగపు విశిష్టలక్షణంగా విశదీకరించడమయింది. దాని ఫలితం ఏమిటంటే జనానీకంలో సంగీతాభిరుచి వివిధశాఖలై అనేకమైన చీలికలు కాసాగింది. అదేలాగంటే, ప్రాచీన శాస్త్రీయ సంప్రదాయం రుచించేవారూ, ఆ తర్వాత వచ్చే పార్శీ మట్లకూ మరాఠీ మట్లకూ చెవి ఒగ్గేవారూ; హిందూస్థానీ టుమ్రీ, గజల్, టప్పా బాణీలకు చెవి కోసుకునేవారూ. ఈ విధంగా ప్రేక్షకులలో అనేక అభిరుచులవారు తయారయినారు. ఇవన్నీ కాక, పల్లె ప్రజలలో తరతరాలుగా పాదుకొనిపోయి వస్తున్న జానపద గేయరీతులు వాటి ‘నేవళీకం’ కోలుపోకుండా ఇంకా సజీవమై సంఘ గౌరవానికి మాత్రం దూరమై ఉంటున్నాయి.

20వ శతాబ్దిలో సినిమా వచ్చింది. తొలి తెలుగు సినిమాలలో నటీనటులూ గాయకులూ రంగస్థలం మీదనుంచి సరాసరి తెర పైకి వెళ్ళినవారు కావడంచేత ఆనాడు రంగస్థలపు బాణీలో మరాఠీ హిందీ శైలులలో సంగీతం వినవచ్చేది. రాను రాను హిందీ సినిమాలు మన ప్రాంతీయ ప్రేక్షకులకు కూడా ఆదర పాత్రములు కావడంతో, ఆనాటికానాడు అక్కడి బెంగాలీ, పంజాబీ, పర్షియన్, అమెరికన్, ఆఫ్రికన్, మెక్సికన్, స్పానిష్ సంగీతపు బాణీలు తునకలు తునకలుగావచ్చి మన ప్రేక్షకుల పైన, తెలుగు చిత్ర నిర్మాతల పైన దాడిచేసి, వారిలో చాలమందిని, ముఖ్యంగా యువకతరంవారిని లోబరచుకొన్నాయి. దీనితో అభిరుచులు మరీ శాఖోపశాఖలుగా చీలిపోయాయి. మన తెలుగు సినిమాలలో చాలమంది దర్శకులు డోలక గీతులూ, పర్షియన్ రీతులూ, ఇంకా ఇటీవల వచ్చే రాక్ ‘ఎన్’ రోల్ పాటలూ అనుసరించి పాటలిస్తేనేగానీ నిర్మాతలు వొప్పుకోవటంలేదు.

సంగీతంలో అభిరుచి ఇన్ని రీతులుగా చీలింది అని ఎందుకు వివరించవలసి వచ్చిందంటే, వ్రాసే కవి తాను ఎవరికోసం వ్రాస్తున్నాడో వారికి తెలిసిన ఒక భాషలో – ఒకే భాషలో – తన కావ్యాన్నో, నాటకాన్నో వ్రాస్తాడు. అదే గేయమో, సంగీత నాటకమో అయినప్పుడు, దానిని ప్రదర్శించవలసి వచ్చినప్పుడు తన ప్రేక్షకులకూ శ్రోతలకూ పరిచితమై, వారు అభిలాష కనపరచి, తలలూపగలిగే బాణీలో తన గేయాలకు సంగీతపు వరుసలను అమర్చవలసి ఉంటుంది. ఈనాటి సంగీత నాటక రచయిత తానే సంగీత నిర్మాత కూడా అయినప్పుడు కాని, ఒక కవి రచించిన సంగీత నాటకమునకు తాను సంగీతము కూర్చేటప్పుడు కాని, ఎటువంటి అభిరుచి కలవారిని మనస్సులో పెట్టుకుని పని చేయవలసి ఉంటుంది? ఒకటే సమాధానము. తాను ఏ శ్రోతలను రంజింపజేయాలని ఉంటుందో వారి అభిరుచుల ప్రకారమే చేయవలసి ఉంటుంది.

పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం మన ఆధునిక సాహిత్యంలో అనేక కొత్త అందాలను తీర్చుకొన్నది తెలుగు గేయం. జాతీయములైన రగడలు మొదలయిన మాత్రాచ్ఛందస్సులలో నుండి ముత్యాల సరాలవంటి గేయాలను గురజాడవారూ వారిననుసరించినవారు చాలమంది నవ్యకవులు రచించారు. ఇటువంటి గేయాలతోను, పద్యాలతోను కలిపి, నిర్వచనంగా పూర్తి గేయనాటికలను రచిద్దామని పూనుకొని, కృతకృత్యులయిన వారిలో శివశంకరస్వామిగారు మొట్టమొదటివారు. యక్షగాన నామకమయిన ప్రాచీన సంగీత నాటకంలో సూత్రధారుని సంధివచనాలలో, ఇంకా ఇతర పాత్రల సంభాషణలలో గద్యం ఉంటూ ఉండేది. దరిమిలా వచ్చిన రంగస్థల నాటకాలు ఇంచుమించు అన్నీ కూడా పద్యాలూ పాటలూ కత్తిరించి, సంభాషణలతో మాత్రమే ఆడినా ఆడవచ్చు. కాని, నవ్యసాహిత్య సంప్రదాయంలో మాత్రం సంపూర్ణ గేయనాటకాలు రావడం ప్రారంభించాయి. శివశంకరుల సంపూర్ణ గేయనాటకాలలో ‘సహజయాన పంథీ’ అనే పేరు గల నాటకానికి ఇతివృత్తము వంగకవియైన చండీదాసు రజకిని యైన రామమణిని ప్రేమించిన గాథ. వారు ఆ నాటకాన్ని వ్రాసే రోజులలోనే ఈ వ్యాసకర్త తన తొలి సంపూర్ణ సంగీత నాటకానికి అదే ఇతివృత్తాన్ని స్వీకరించడం జరిగింది. రెండు నాటకాలు ఒకే ‘ప్రతిభ’ సంపుటంలో ప్రకటింపబడడమే గాకుండా, 1941 ఫిబ్రవరి మాసంలో మద్రాసులోనే శివశంకరుల నాటకం రంగస్థలం పైని ప్రదర్శితమయింది. ఈ వ్యాసకర్త రచించిన ‘చండీదాసు’ వాయు ప్రసారితమయింది ఆ మాసంలోనే, శివశంకరులు సుమారు 15 సంపూర్ణ సంగీత నాటకాలు వ్రాశారు. పద్మావతీ చరణ చారణ చక్రవర్తి చాలసార్లు రంగస్థలం పైని ప్రదర్శించబడింది.

వాయు ప్రసారంలో (1989లో) తొలుతటి సంపూర్ణ సంగీత నాటకం మల్లవరపు విశ్వేశ్వరరావుగారి బిల్హణీయం. ఆ తర్వాత శ్రీశ్రీ మోహినీ రుక్మాంగద మొదలయిన కొన్ని సంగీత నాటకాలు వ్రాశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఊర్వశి, శర్మిష్ణ, విద్యాపతి, ధనుర్దాసు, గుహుడు, ఉమర్ ఖయాం, ఆండాళ్ కల్యాణము, దక్షయజ్ఞము, మొదలగు సంగీత నాటకాలను ఎక్కువ భాగం పాటలతోటీ, తగుమాత్రం పద్యాలతోనూ సంభాషణలతోనూ కూడా వ్రాశారు. ఇవన్నీ వాయుప్రసారంలో ఎన్నిక గన్నవి.

మల్లవరపు విశ్వేశ్వరావుగారు షెల్లీ రచించిన ‘ప్రొమిథియస్ అన్‌బౌండ్’ను సంపూర్ణ సంగీత నాటకంగా అనువదించారు. ఇదీ, ఇంకా వారు కళాపూర్ణోదయ గాథ ననుసరించి చేసిన ‘కలభాషిణి’ థారావాహి నాటికాగుచ్ఛం, ‘శారదోత్సవం’ మొదలైనవి వాయు ప్రసారంలో పేరు పడ్డవి. విశ్వనాథ సత్యనారాయణగారి కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని, మారీచుడు, సుమిత్ర, ఊర్మిళ, గోదావరి మొదలైన సంగీత నాటకాలు బహుళ గేయాత్మకాలై వాయు ప్రసారంలో గణ్యత పొందాయి.

సి. నారాయణరెడ్డిగారి నాగార్జునకొండ, కర్పూర వసంత రాయలు మొదలైన కొన్ని గేయ నాటకాలు మునుముందు మన సంగీత నాటకాలకు మంచి పరిణతి రాగలదని సూచిస్తాయి.

ఆంధ్ర నాటకరంగ చరిత్రలో కృషిచేసిన కీ. శే. కొప్పరపు సుబ్బారావుగారు పాశ్చాత్య దేశాలలోని బర్లెస్క్ లేక, హాస్య సంగీత నాటకాలను దృష్టిలో పెట్టుకొని, అల్లీముఠా అనే సంగీత నాటకాన్ని రచించి, అనేక ప్రదర్శనలు చేయించారు.

ప్రాచీన గేయనాటక రూపమైన యక్షగానానికి ఇటీవల మళ్లీ మంచి కాలము రాగలదని తోస్తోంది. ఉదాత్త సాహితీ శిల్పదక్షులయిన మహాకవులు ఈ ప్రక్రియను చేపట్టి ఆదరిస్తున్నారు. కాటూరి వేంకటేశ్వరరావుగారి శ్రీనివాస కళ్యాణం, దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రిగారి సాగరమథనమూ మాళవికాగ్నిమిత్రమూ విప్రనారాయణ చరిత్రమూ అనే యక్షగానముల రచనలో ఈ వ్యాసకర్త తన సంప్రదాయ సంగీతానుభవమూ, ధాతుకల్పనా, వినియుక్తములైనందుకు తనను తాను ధన్యుడుగా భావిస్తాడు.

18 సంపూర్ణ గేయ నాటకాలనూ, 30 వరకూ గద్య పద్య గేయాత్మక నాటకాలనూ రచించిన ఈ వ్యాసకర్త, తన గేయ నాటకాలను వాయుప్రసారంలో మాత్రమేకాక, ఐదారింటిని రంగస్థలం పైని నాట్యాత్మకంగా కూడా ప్రదర్శింపజేసిన అనుభవాన్ని పురస్కరించుకొని, సంగీత నాటకముల రచన గురించీ, ప్రదర్శన నిర్వహణముల గురించి కొన్ని సూచనలతో ఈ వ్యాసాన్ని ముగించగలడు.

సంగీత నాటకానికి – ఆ మాటకొస్తే ఏ నాటకానికైనా కూడా ఇతివృత్తం సుప్రసిద్దమై ఉంటేనూ, పాత్రలు స్వరూప స్వభావ వాచకాదులవల్ల స్పష్టంగా తెలిసిపోతుంటేనూ – ప్రదర్శన చాలా సుకరం. అలా లేనిచోట్ల కథావివరణా పాత్రనిర్దేశమూ ప్రదర్శనానికి ముందు తప్పక అవసరం అవుతాయి. పాత్రలు ఎంత తక్కువుంటే అంత మంచిది. మొత్తం 5, 8 కంటే మించకూడదు. ఏ పాత్రకాపాత్ర తన పాట ఏదో పొడుగ్గా తాను పాడుకొంటూ ఉంటే మిగిలిన పాత్రలు స్తబ్దంగా నిల్చుండో కూర్చుండో వుండే ఘట్టాలుండకూడదు. పాత్రల పాటలలోనే సంభాషణలు, కథాగతీ (action) సంఘటనలూ సాగిపోతూ వుండాలి. ఒక్కొక్కచోట కథ మెల్లిగా సాగే బరువైన ఘట్టాల్లో బరువైన పాటలు ఉండాలి కాని, మిగిలినచోట్ల లయాన్వితంగా త్వరితంగా సాగిపోయే సంవాద గేయాలూ, లయలలో ఛందాలలో మార్పులు చేసుకుంటూ పోవాలి. మధ్య మధ్య ప్రకటనా వివరణా అక్కర లేకుండానే స్థలనిర్దేశమూ, పాత్ర నిర్దేశమూ, సమయసూచనా తెచ్చి పెట్టుకొన్నట్లు కాకుండా సహజంగా గేయ సంభాషణలో సాగిపోవాలి. కథా కథనము (narrative) చెయ్యడానికీ, ఒక్కొక్క సంఘటనలో కలిగించిన రసాన్ని తీవ్రతరం చేసి సుస్థిరం చెయ్యడానికీ బృందగానాలను (Choruses) ఉపయోగించాలి. ఈ బృందగానాలను పాడే గాయకబృందం కథలో ఆయా ఘట్టాలలో సహజంగా సమకూడే పాత్రలైనా కావచ్చు, లేదా, ఏ సంబంధమూ లేని వట్టి ఆఖ్యాతృ బృందం కావచ్చు. ఘట్టాలలో సహజంగా సమకూడే పాత్రలే బృందగానం పాడే అవకాశం ఉండే నాటకానికి పాత్రలు తక్కువ వుండాలనే నియమం వర్తించదు. అంతమందీ చక్కగా పాడేవారిని సమకూర్చుకోవడం నిర్వాహకుని పూచీ.

సంగీత నాటకంలో సంగీత నిర్వాహకుని బాధ్యతే గురుతరమైనది. మన ప్రేక్షకులలో ఉండే వేరు వేరు సంగీతపు బాణీల అభిరుచులను గురించి ఈ వ్యాసంలో ముందు విశదీకరించాము. నిర్వాహకుడు ఈ బాణీలకు కొన్ని తారతమ్యాలను ఏర్పాటు చేసుకొని, తన ఇతివృత్తాన్నిబట్టిగాని, దేశకాలములనుబట్టిగాని, తన నాటకంలోని వేరు వేరు ఘట్టాలలో పాత్రల ఉత్తమ మధ్యమాధమములని ప్రాచీన శాస్త్రాలలో చెప్పబడిన వర్గాలలో ఆయా వర్గాలకి చెందిన పాత్రలకు, ఆయా సన్నివేశాలలోని రసాలకు, అనుగుణమైన సంగీతపు బాణీలను కూర్చుకోవలసి ఉంటుంది. ప్రతి ఒక్క బరువైన పాటకూ రెండో మూడో తేలికగా రక్తిగా సాగిపోయే వరుసలుండాలి. నేపథ్య జంత్రసంగీతం ఉండీ ఉండనట్లుగా వినిపిస్తూ, పాటలలోని మాటలను స్పష్టంగా తెలియనిస్తూ, గాత్రములు పాడని సమయాల్లో ఆయా రసావేశాన్ని ఉత్తేజపరచి సుస్థిర పరుస్తూ ఏ స్వరసంపుటికి పక్క ఏ స్వరాలు పలికిస్తే ఎక్కువ ఫలితం ఉండగలదో దాన్ని సాధించాలి.

సంగీత నాటకాలలో పాడే గాయకులందరికీ తమ వాచకం (పాటలు) క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. ఒక్కొక్క వ్యక్తి తన పాటలను క్షుణ్ణంగా పాడగలిగి ఉండడమే కాకుండా మొత్తంమీద సాముదాయిక కృషిగా నటులు అంతా యంత్రపు చక్రాలవలె ఒకరికొకరు అతికి, పరస్పర సహకారముతో జయప్రదం చేయవలసి ఉంటుంది.

సంగీత నాటకాలలో వీలైతే అంటే లభిస్తే, నాట్యశాస్త్ర దక్షులైన నటుల నాట్యానికి పూర్తి ఆస్కారం ఉంది. లేకపోతే సకృత్తుగా ముద్రలతో, అంగ విన్యాసములతో కొంత నాట్యాభినయం ఉండవచ్చు. నాట్యమూ గానమూ రెండింటిలోనూ కృషిచేసిన నటబృందము సంగీత నాటకాలకు చాలా ఆవశ్యకం. ఒక గురుకులంలో వలె ఈ బృందానికి దినచర్యగా అంగవిన్యాసాదికాలు పాదలయ విన్యాసాలు డ్రిల్లుగా అభ్యాసం చెయ్యాలి. దేశమంతటా ప్రధాన పట్టణాలలో జాతీయ నాట్య మందిరాలు ఏర్పడి, అక్కడ అటువంటి గురుకులాలు ఏర్పడిననాడు మాత్రమే అలాంటిది సాధ్యమౌతుంది. లేనినాడు నాట్యాన్నీ గానాన్నీ విడదియ్యడం ఒక పద్దతి. నాటకంలోని గేయభాగమంతా తెరలో మైకోఫోన్‌లో ఒక నటబృందం గానాభినయం చేస్తూంటే మరొక బృందం రంగస్థలంపై నాట్యాభినయం చేయించడం. ఈ వ్యాసకర్త 10 సంవత్సరాలక్రితం తన సంగీత నాటకాలను ఆ విధంగానే బాలికల చేత నాట్య ప్రదర్శనములుగా చేయించాడు.

ఈ వ్యాసం సంగీత నాటకాల రచనను గురించి ప్రదర్శనను గురించి, మన దేశంలోని జిజ్ఞాసువుల దృష్టి మరల్చడానికి ఉద్దేశింపబడ్డది. అందుకని మన ప్రాచీన ఆధునిక సంగీత నాటకాల చరిత్రను స్థాలీపులాకంగా ప్రదర్శించామే కాని, ఈ రంగంలో కృషి చేసిన ఏ పేరునైనా ఇందులో చేర్చక పోయి ఉంటే, అది ఉద్దేశపూర్వకం కాదనీ, వస్తువిస్తరణ భీతిచేతా, స్థాలీపులాక దృష్టిచేతనూ మాత్రమే అనీ విజ్ఞులైనవారు గ్రహించుకొందురు గాక.
----------------------------------------------------------
రచన: బాలాంత్రపు రజనీకాంతరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment