Saturday, September 29, 2018

మిథ్య ఎగ్జిబిషన్


మిథ్య ఎగ్జిబిషన్





సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..............

“అన్యాయం! అక్రమం!! లోపల ఘోరం జరిగి పోతోందక్కడ… కానీ లోపలికి వెళ్ళాల్సిందే! అన్యాయాలు అరికట్టాల్సిందే!”

ఏటీవీ, బీటీవీ, సీటీవీ, డీటీవీ… ఇలా పేర్లు రాసి వున్న రకరకాల మైకు గొట్టాలు పట్టుకుని అరుస్తూ వున్నారు కొందరు పూనకం పట్టినట్టు. కింద మెత్తటి పట్టలు, పైన షామియానాలు, మధ్యన నీడలో గుంపులు గుంపులుగా మైకుల్లో మాట్లాడుతున్న వారి చుట్టూ జనాలు మూగివున్నారు. ‘వాళ్ల మాటలు నమ్మకండి. లోపల ఏం జరిగినా అది మన మంచికోసమే’ అంటూ నవ్వుతూ ప్రేమగా ఆహ్వానిస్తున్నారు మైకుల్లో మాట్లాడుతున్నవారు. జనాలు దగ్గరకు రాగానే లాగి ఎగ్జిబిషన్ గుమ్మం దగ్గరికి వారిని నెడుతున్నారు.

దేశంలోని ప్రజలందరికీ అదొక పెద్ద పండుగ. ఆరోజు గుమ్మం దగ్గరకి నెట్టబడ్డ వారందరికీ నమస్కరించి ఒక పూలగుత్తి అందించి ఆ ఎగ్జిబిషన్ కాంపౌండ్ లోపలికి పోనిస్తారు. ప్రతి నగరంలోనూ ఆరోజు అక్కడక్కడ ఎన్నిక చేసిన ప్రాంతాల్లో ఎన్నో తళుకుబెళుకులతో కాంపౌండ్లు కట్టి ప్రభుత్వం ఆ పండుగ నిర్వహిస్తుంది. ప్రజల్లో చాలామంది ఆ పండుగలో ఆసక్తిగా పాల్గొంటారు. వింత వింత అలంకారాలతో భారీగా నోరు తెరుచుకుని అదేమిటో అర్థంకాని ఒక జంతువు నోటిద్వారం గుండా కాంపౌండ్ లోపలికి వందలాది మంది జనం క్యూలో నిలబడి పోతూ వున్నారు. అలాగే అవతల ఆ జంతువు ఇంకో ద్వారం నుండి గుంపులు గుంపులుగా మరికొందరు బైటకి వస్తూ వున్నారు. అక్కడక్కడా అంగట్లో బొమ్మలు, ఆటవస్తువులు, పిల్లలు పెద్దలతో వాతావరణమంతా కోలాహలంగా వుంది.

ఆ భారీ ప్రాంగణంలో రకరకాల ఎంబ్లమ్స్ వున్న బనీను ఒకటి వేసుకుని, ఒక తురాయి చెట్టుకింద టేబుల్ పైన పట్ట పరుచుకుని వున్నాడు ఒక వ్యక్తి. కాంపౌండ్ అంతా రంగు రంగుల పట్టలు పరుచుకుని ఎక్కడ చూసినా అలాంటివారే కనిపిస్తున్నారు. ప్రతి టేబుల్ చుట్టూతా పది పదిహేను మంది గుమిగూడి వున్నారు. టేబుల్ మీద పరిచివున్న గుడ్డపై మూడు రంగుల ముక్కలని అటూ ఇటూ మార్చి మార్చి పరుస్తున్నాడు ఒక వ్యక్తి. అలా మూడు ముక్కలని మార్చుతూనే, “రండి బాబూ రండి! మాయా లేదు, మర్మం లేదు! ఒకటికి పది, పదికి వంద, వందకి వెయ్యి! రండి బాబూ రండి!” అని అరుస్తూ జనాలని పిలుస్తూ వున్నాడు. ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో భాషలో అరుపులు. ఏ ప్రాంతం ప్రజలని ఆ ప్రాంతపు భాషల్లో పిలుస్తున్నారు.

అక్కడ ఆడా మగా తేడా లేదు, ఆట నిర్వహిస్తున్న వాళ్ళలోను, ఆట ఆడుతున్న వాళ్ళలోను. అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

“ఏంటిది?” ఒక టేబుల్ దగ్గర ఆగి అక్కడ వున్న ఒక మనిషిని అడిగాడో యువకుడు. వయసు ఓ ఇరవై ఏళ్ళు ఉండొచ్చు.

“జాగ్రత్తగా గమనించు. కింద జోకరున్న ముక్క మీద పందెం కాయి. చాలా ఈజీ. ఇవన్నీ నేను సంపాదించిన డబ్బులే! చూడు!” సగం మడిచిన యాభైలు, వందలు, ఐదొందలు కాగితాల బొత్తిని జేబులోంచి తీసి చూపించి డబ్బుని మళ్ళీ జేబులోకి తోసుకున్నాడు ఒక మనిషి.

“అసలు నీదగ్గర ఎంట్రీ కార్డు ఉందా?” అడిగాడు ఇంకో వ్యక్తి.

“ఉంది. ఎందుకు?”

“అదుంటేనే ఆడనిస్తారు. అందుకు.”

“రా… రా… ఇటు చూడు. ఈ ముక్కమీద పెట్టుకో! నేను కూడా వంద కాస్తున్నాను,” అంటూ 100 నోటుని మధ్య ముక్కపై వేశాడు ఇంకో వ్యక్తి.

యువకుడు సందేహంలో పడ్డాడు.

“ఏంటి? ఆలోచిస్తున్నావా? అక్కడ చూడు! ఇక్కడ చూడు! ఇటు చూడు! ఎక్కడ చూసినా ఆడేవాళ్ళు నీకు కనపడుతుండారా- లేదా?” ఎగదోశాడు ఒక మనిషి.

ఆ పక్కన ‘ముక్క తెరు, ముక్క తెరు!’ తొందరపెడుతున్నారెవరో.

ముక్కలు మారుస్తున్న ఒక వ్యక్తి ముక్కలు తెరిచాడు. ఆశ్చర్యంగా వంద నోటున్నచోట జోకర్ బొమ్మ. జోకర్ బొమ్మపై వున్న వంద తీసుకుని రెండు ఐదొందల కాయితాలు అక్కడ పడేశాడు ఆట నడుపుతున్న ఒక వ్యక్తి. వందకి వెయ్యి రూపాయలు తిరిగి ఇస్తున్నా ఇసుమంతైనా విచారం మొహంలో కనపడలేదు. ఎందుకన్నది ఈ యువకుడికి అర్థంకావడం లేదు. డబ్బు సంపాదించడం ఇంత సులభమా! ఆశ్చర్యం!

“ఈసారి కట్టవోయ్!” ప్రోత్సహించాడు ముందు పలకరించిన ఒక మనిషి.

యువకుడు సంశయిస్తూ పది రూపాయల కాగితం తీసి ఒక ముక్కపై పెట్టాడు.

వందొచ్చింది.

ఇరవై వేశాడు.

రెండొందలు వచ్చింది.

వంద కట్టాడు.

వెయ్యొచ్చింది.

ఇంక చాలు వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాడు యువకుడు.

“అదృష్టం మనపక్క ఉన్నప్పుడే ఆట ఆడాలి.” ఇంతలో ప్రోత్సహించిన ఇంకో వ్యక్తి అందుకున్నాడు.

“మంచి ముక్కని ఎన్నుకోవడంలోనే వుంది మన భవిష్యత్తు!” మేధావి అని రాసుకున్న బనీను వేసుకున్న మరో వ్యక్తి అప్పుడే వచ్చి చిరునవ్వుతో కొందరికి సూచనలు ఇస్తున్నాడు.

కాంపౌండు బయట మైకుల గోల. లోపల కాయ్ రాజా కాయ్ గోల. రకరకాల భాషలలో పాటలు వినపడుతున్నాయి. విలేఖర్లు, కెమేరామన్లు రకరకాల వ్యక్తులను ఇంటర్‌వ్యూలు చేస్తున్నారు. బహుశా వాళ్ళు లోపలున్న స్టాల్స్ యజమానులు కావచ్చు.

యువకుడు ఐదొందలు కట్టాడు.

పోయింది.

సరిగ్గా కనపడలేదు ఆ ముక్క… తనలో తనే గొణుక్కున్నాడు. వచ్చిన డబ్బే కదా పోతే పోయిందిలే అందుకున్నాడు.

ఈ సారి వెయ్యి కట్టాడు. లక్కీ. పదివేలు వచ్చాయి.

మళ్ళీ ముక్కలు మంత్రించినట్టు అటూ యిటూ వేగంగా మారిపొయ్యాయి.

“మంచి ముక్క చూసి జాగ్రత్తగా ఎన్నుకోండి! మన భవిష్యత్తు, మన జీవితం బాగుండాలంటే మంచి ముక్కని ఎన్నుకోవాలి!” అంటూ ఇంతకుముందు అరుస్తున్న బనీను మేధావి ఇప్పుడు కరపత్రాలు పంచుతున్నాడు.

మధ్యలో కొందరు మోటర్‌సైకిళ్ళపై బీప్ బీప్ మనే హారన్లతో వచ్చి హెచ్చరిస్తున్నారు.

“ఎవ్వరూ డబ్బు పెట్టి ఆడకండి! ప్రలోభాలకు లొంగకండి!” అరుస్తూ అంతే వేగంగా వెళ్ళిపోతున్నారు.

ముక్కలు మార్చే ఒక వ్యక్తి యథావిధిగా వేగంగా మంత్రించినట్టు ముక్కలు మారుస్తున్నాడు. కొందరు అయిదువందలు, వంద కాగితాలు ముక్కలపై పందెంగా విసురుతున్నారు.

ప్రోత్సహించిన ఇంకో వ్యక్తి హఠాత్తుగా, “ఇదే ఇదే!” అంటూ ఎడమ వేపున్న ముక్కపై తన జేబులోని డబ్బులకట్ట అంతా తీసి పెట్టేసి, ఇతడికి కన్నుకొట్టి, “అంతా పెట్టు నువ్వు కూడా,” అని తొందర పెట్టాడు.

ఇంకో వ్యక్తి కన్నుకొట్టి సైగచేయడంతో యువకుడికి నమ్మకం పెరిగింది. జేబులోని మొత్తం అంతా తీసి చివరి ముక్కపై పెట్టాడు, ఈ దెబ్బతో రాత మారిపోవాలి… అనుకుంటూ. డబ్బు సంపాదించడం సులభమే, అని మనసులో క్షణకాలం అనుకున్నాడు కూడా.

ఒక వ్యక్తి ముక్క తెరిచాడు. తెల్లగా వుంది తెరిచిన ముక్క. యువకుడి కళ్ళు మసకబారాయి. పగలే రాత్రిలా చిక్కటి చీకటి. ఏదో లోతైన లోయలోకి జారిపోతున్నట్టనిపించింది. కళ్ళముందే మోసం జరిగినట్టయింది. ఏడుపు వస్తుందా? రావడం లేదు. కాని వస్తున్నట్టే వుంది. తన డబ్బుతో పాటు ఇచ్చినట్టే ఇచ్చి వాడి డబ్బు కూడా వాడు గుంజేసుకున్నాడు. ప్రోత్సహించిన ఇంకో వ్యక్తి డబ్బు కూడా ఆడిస్తున్న ఒక వ్యక్తి రెండు చేతులతో ముందుకు లాక్కున్నాడు.

ప్రోత్సహించిన వ్యక్తికి బాధలేదా? నవ్వుతున్నాడు! అవును… లోపల సంతోషం… ఉన్నట్టుంది సన్నగా…

“నీ మాట విని మొత్తం పోగొట్టుకున్నాను.” యువకుడు గొణిగాడు.

“నా డబ్బు పొయ్యి నేనేడుస్తుంటే నీ ఏడుపొకటి! పోరా అవతలకి! ” ఇంకో వ్యక్తి కొట్టబోయాడు, ఒక వ్యక్తిని చూసి కన్నుకొడుతూ.

అన్యాయం… దారుణం… మోసం… ఘోరం…

కాంపౌండ్ బయట నుంచి బీప్ బీప్ మని చప్పుళ్ళు. ‘ఎవరూ డబ్బు పెట్టి ఆడకండి. నిజాయితీగా ఆడుకోండి. సరదాగా ఆడుకోండి. డబ్బు పోగొట్టుకుని జీవితాలను నాశనం చేసుకోకండి.’ అంటూ హెచ్చరికలు.

యువకుడి కళ్ళముందటి చీకటి తెరలు మెల్లగా మాయమయ్యాయి. కళ్ళు తడిబారాయి. కన్నీరు చుక్కలుగా రాలిపడింది.

బనీను మేధావి ఎదురయ్యాడు.

తన విషయం మొత్తం చెప్పాడు మోచేత్తో కన్నీళ్ళు తుడుచుకుంటూ.

“పోయిందా! అరరే… మొత్తం పోయిందా? అయ్యయ్యో! పోతుంది. ఎందుకుపోదూ? ఇది అయిదేళ్ళకి ఒకసారి వచ్చే పెద్దపండగ కదా! జాగ్రత్తగా మంచి ముక్కని గుర్తించి ఎన్నుకోవాలి. అప్పుడే కదా మనకి ఫ్యూచర్ బాగుండేది.” అన్నాడు బనీను మేధావి.

“ఇప్పుడెలా సార్? నా బతుకు బజారున పడిపోయింది.”

“నీదేకాదు. నీలాంటి చాలామందే ఉన్నారు మరి. నేనింతకు ముందే చెప్పాను గదా! ఇప్పుడిక ఏమీ చేయలేం! అయిదేళ్ళు ఆగాల్సిందే. తప్పదు. అప్పుడు గెలువు నువ్వు! ఇంతకింత గెలువు! గుర్తుంచుకో! మంచిముక్కపై పందెం కట్టు! నాకు చాలా పనులున్నాయి. నేను అందరినీ హెచ్చరించాలి!” బనీను మేధావి వేగంగా వెళ్ళిపోయాడు.

ఇంతలో బీప్ బీప్ మని సైరను మోతతో ఒక జీపు వచ్చి ఆగింది. అందులో కూర్చున్న వ్యక్తి అడిగాడు. “ఎందుకేడుస్తున్నా?”

యువకుడు చెప్పాడు.

“ఒకపక్క అరుస్తూనే వున్నాం గదరా బాడుకోవ్! డబ్బులు పెట్టి ఎందుకాడినవ్? మీరు బాగుపడర్రా? గొంతు పొయ్యేట్టు బైకుల్లో, జీపుల్లో అరుస్తూ తిరగతానే వుండాం గదరా?”

కూర్చున్న వ్యక్తి అడిగాడు, “ఎక్కడ ఆడావో గుర్తుందా?”

“గుర్తుంది సార్. 79 నెంబరు.” చూపించాడు యువకుడు.

కూర్చున్న వ్యక్తి వేగంగా అక్కడికెళ్ళాడు. కర్ర పైకెత్తాడు అరుస్తూ. “డబ్బులతో ఆడతా వుండార్రా మీరు? ఎన్నిసార్లు జెప్పాల్రా మీకు? వీడి డబ్బులు పోయింది మీకాడేనా?”

“వీడెవడో నాకేం తెలుసు సార్? ఇక్కడెవరూ డబ్బులు పెట్టి ఆడ్డంలేదు సార్? ఇవి ఉత్త టోకెన్లు సార్!” ఎర్రగా వున్న టోకెన్లు తీసి బయటపెట్టాడు ఒక వ్యక్తి.

“లేదు. డబ్బులు పెట్టే ఆడాను నేను. టోకెన్లు గురించి నాకు అసలు తెలీదు.” ఒక మనిషిని చూపించి, “ఇతని డబ్బులు కూడా పొయ్యాయి.” అన్నాడు యువకుడు.

ఒక మనిషి “ఎవుర్రా రేయ్? నేను డబ్బులు పెట్టి ఆడానా?” అంటూ చెయ్యి పైకెత్తాడు.

“సరే మర్చిపో ఏమయిందో. నువ్వు ఇలారా…” అంటూ దూరంగా తీసుకెళ్ళి పర్సులోంచి ఐదు వందల కాగితం ఒకటి తీసి చేతిలో పెట్టాడు కూర్చున్న వ్యక్తి.

“ఇక్కడొక పక్కన మీరు చెప్తూనే వున్నా అందరూ డబ్బులు పెట్టి ఆడుతూనే వున్నారు సార్!”

“రేయ్! ఆ అయిదొందలు ఇటివ్వరా!”

“వద్దు సార్! నీను ఊరికి పోవాల సార్! ఇంకేం మాట్లాడను సార్!”

“అయితే ఇంకేమీ మాట్లాడకుండా నోర్మూసుకునే వెళ్ళు!”

యువకుడు అటు తిరిగి జంతువు ఇంకో ద్వారం వేపు నడిచాడు.

బనీను మేధావి వచ్చి భుజమ్మీద చెయ్యి వేసి అన్నాడు,” ఐదేళ్ళ తర్వాత ఇంతకింత డబ్బు తెచ్చి నమ్మకమైన ముక్కమీద పందెం కాయి! ఇంతకింతా సంపాదించు! తప్పదు!”

అతడిని ఏవేవో ఆలోచనలు కమ్ముకుంటున్నాయి. ‘నీకంతా తెలిసిపోయింది, నువ్వెళ్ళు. ఇక మళ్ళీ రాకు,’ అంటూ ఎవరో తరుముతున్నట్టుగా వుంది. జంతువు నోటిద్వారం నుంచి ఇంకా గుంపులు గుంపులుగా జనం వస్తూనేవున్నారు. యువకుడు పెద్దగా “అంతా మోసం! ఎవరూ డబ్బులుపెట్టి ఆడకండీ!” అని పెద్దగా అరిచాడు. ఎవరికీ వినపడలేదు.

యువకుడు జంతువు ఇంకో ద్వారం నుంచి బయటకొచ్చి వెనక్కి తిరిగి చూశాడు. లైట్ల వెలుగులో లోపల తెలియలేదు గాని బయట అంతా చీకట్లు ముసురుకుని వున్నాయి. ఆకాశం నల్లగా వుంది.

వింత వింత అలంకారాలతో భారీగా నోరు తెరుచుకున్న అర్థంకాని జంతువు నోటిద్వారం పైన పెద్దక్షరాలతో ‘మిథ్య ఎగ్జిబిషన్’ అని రాసి ఉంది. ఆ జంతువు నోటిద్వారానికి అటూ ఇటూ వరుసగా భీకరంగా తెల్లటి బట్టల్లో రాక్షసుల బొమ్మలు. ఇంతకు ముందర నోరు తెరుచుకుని ఆహ్వానిస్తున్నట్టున్న ఆ బొమ్మలు ఇప్పుడు నిజమైన రాక్షసులుగా కనిపిస్తున్నాయి. దీపాలు పురుగుల్ని ఆకర్షించినట్టు తమ ధగధగలతో మనుషులని ఆకర్షిస్తున్నాయి.

యువకుడు నిస్త్రాణతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. తిరిగి లేచేసరికి అక్కడ ఏమీ లేదు. మైదానం అంతా ఖాళీగా ఉంది. ఎవరూ లేరు. ఎండ మండుతూ ఉంది. సుడిగాలికి రంగురంగుల చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ బ్యాగులు దుమ్ములో సుళ్ళు తిరుగుతున్నాయి. యువకుడి ముఖం మీదకు ఒక చిత్తుకాగితం వచ్చి కొట్టుకుంది. అది ఒక దినపత్రిక. అక్కడ ఎగురుతున్న చిత్తుకాగితాలన్నీ అవే. పెద్దపండగ దిగ్విజయం! మాయ లేదు మర్మం లేదు! అందరికీ లాభం పంచిన పండగ! డబ్బు లేదు, జూదం లేదు. అన్యాయం మోసం అసలే లేవు! అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ఆ కాగితాల నిండా రాసి వుంది, రాక్షసుల రంగురంగుల బొమ్మల చుట్టూ. ఒక వ్యక్తి, ఒక మనిషి, ఇంకో వ్యక్తి, మరింకో వ్యక్తి, కూర్చున్న వ్యక్తి, బనీను మేధావులందరూ ఒకరినొకరు అభినందించుకుంటున్న ఫోటోలు కనిపిస్తున్నాయి.

ఇంక ఈ వైపుకు చస్తే రాను! గొణుక్కున్నాడు యువకుడు, అనుకున్న వెంటనే అన్నీ మర్చిపోతూ.
----------------------------------------------------------
రచన: దగ్గుమాటి పద్మాకర్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment