సేతు బంధ కావ్యము - కొన్ని వర్ణనలు
సాహితీమిత్రులారా!
ఈ వర్ణనలు సేతుబంధము అన్న ప్రాకృతకావ్యం లోనివి. ఈ కావ్యానికి దసముహవధ మని మరొక పేరు. ఈ కావ్యకర్త వాకాటకవంశ ప్రభువైన ప్రవరసేనుడు. ఈతడు కాళిదాసు కాలమునకు దగ్గరివాడు. సేతుబంధ కావ్యానికి ఒకానొక వ్యాఖ్య వ్రాసిన రామదాసు – కాళిదేసే ప్రవరసేనుడంటారు. అది విపరీతమైన ఊహ. ఈ కవులిద్దరి శైలిలో భేదమే అందుకు ఋజువు. ప్రవరసేనుడు రచించిన గాథలు కొన్ని గాథాసప్తశతిలో ఉన్నవి. ఈ సేతుబంధమును గూర్చిన వివరాలు, ప్రవరసేనకవి కవిహృదయమునూ ఆవిష్కరించే ప్రయత్నం
ఈ వ్యాసం.
కొన్ని వర్ణనలు :-
పొద్దు. నీలాంబరము మనోహరంగా కనిపిస్తోంది. దిక్చక్రము సుదీప్తమై భాసిస్తోంది. భావుకుడైన ఒక ప్రాకృతకవి ఆ ప్రకృతిలో శుభకరుడు, సర్వభూతక్షేమంకరుడు అయిన శివుని దర్శించి ప్రార్థిస్తున్నాడు.
ణమహ అ జస్స ఫుడరవం కణ్ఠచ్ఛాఆ ఘడన్త ణఅణగ్గిసిహమ్|
ఫురఇ ఫురిఅట్టహాసం ఉద్ధపడిత్తతిమిరం విఅ దిసాఅక్కమ్||
సంస్కృతఛాయ:
నమత చ యస్య స్ఫుటరవం కణ్ఠచ్ఛాయాఘటమాన నయనాగ్నిశిఖమ్|
స్ఫురతి స్ఫురితాట్టహాసమూర్ధప్రదీప్త తిమిరమివ దిక్చక్రమ్||
ఎవని నయనాగ్ని శిఖలతో కూడిన కంఠపు నీలి కాంతి, ఎవని అట్టహాసముచేత శిరమున దగ్ధమైన చీకటి, ఆ అట్టహాసముతో రగిలిన నిప్పు రవ్వలునూ, దిక్చక్రమును స్ఫురింపజేయుచున్నదో అట్టి శివునకు జోత.
విచిత్రమైన భావన యిది. కళ్ళెదుట కనిపించే ఆకాశము, దిక్చక్రమనే కవిత్త్వ వస్తువులను ఒక దేవతామూర్తి యొక్క విలాసములతో ఉత్ప్రేక్షించినాడు. కానీ, ఆ మూర్తి విలాసములతో ప్రతీయమానమయ్యే వస్తువు అనంతంగా, అత్యంత సుందరంగా ఉంది. శివుని కంఠచ్ఛాయ నీలము. ఆ నీలము దిగంతాలలో వ్యాపించింది. అంటే భవుడు నటరాజమూర్తిగా ఆనందతాండవము చేస్తున్నట్టుగా, (మండల) నృత్యసమయములో వేగంగా భ్రమిస్తున్న కారణాన ఆ మహేశ్వరుని కంఠవర్ణమైన నీలము సర్వదిశావ్యాప్తమైనదని, విశాలాంబరమైనదనిన్నీ వ్యంగ్యము. ఈశ్వరుని తలపై తిమిరము దగ్ధమై – మహేశ్వరుడు భాస్కరుడై భాసించుట మరొక చమత్కారము.
శివేతర క్షతము (అమంగళ వినాశము) కొఱకై
శివుని ప్రార్థించిన ప్రాకృతకావ్యశ్లోకమిది.
అనంతమై, అపరిమితమైన వస్తువును మూర్తిమంతమైన పరిమితమైన వస్తువుతో నుత్ప్రేక్షించుట, నిశ్చలమైన, నిర్జీవమైన వస్తువును జీవన్తమైన వస్తువుతో సమన్వయించుట, ఒక్క శ్లోకమున నొక్క గాథను యిముడ్చుట, సౌందర్యనిధిని పోలిన వస్తువుకు సామాన్యవస్తువుతో నుపమించి ఒప్పించుట, సూక్ష్మమైన వస్తుశకలమును దిగంతరముల వ్యాపించిన మహోన్నతవస్తువుతో కల్పించుట, భావగంభీర్యము, కొండొకచో భావనాऽగమ్యములు (Abstract ideas), నిశితదృష్టి, ఆధునికత, స్వతంత్రమైన భావనాబలము, దానికి తగిన ఊహ, ఊహను కట్టెదుట నిలుపగల కవనచాతుర్యము, అడుగడుగునా రసపరిపోషణ, అనాయాసమైన భాష, సునాయాసమైన ఛందస్సు – ఇవన్నీ ప్రాకృతకవిత్త్వ లక్షణాలు.
పొద్దు వర్ణన అది. పొద్దు క్రుంగే సమయములో
రవిమండల వర్ణన ఇది.
దీసఇ విద్దుమఅమ్వం సిన్దూరాహఅగఇన్దకుమ్భచ్చాఅమ్|
మన్దరధాఉకలఙ్కిఅవాసుఇమన్డలనిఅక్కలం రఇవిమ్వమ్||
ఛాయ:
దృశ్యతే విద్రుమాతామ్రం సిన్దూరాహతగజేన్ద్రకుంభచ్ఛాయామ్|
మన్దరధాతుకలఙ్కితవాసుకిమండలనిశ్చక్రలం రవిబిమ్బమ్||
పడమర దిక్కు అంబరాన అస్తమించే రవిబింబము పగడము వలె ఎఱ్ఱగా ప్రకాశిస్తోంది. ఆ సూర్యబింబము సిందూరము దాల్చిన గజేంద్రుని కుంభచ్ఛాయ వలె కనిపిస్తోంది. మందరపర్వతమును రాపాడి, ఆ పర్వతపు ధాతువులవలన ఎర్రబారిన వాసుకి, తనను వలయముగా చుట్టుకుందా అన్నట్టు ఆ గోళం మెరుస్తోంది.
రవిబింబము పగడంలా కనిపించుట – సాధారణంగా సంస్కృతకవుల వర్ణనాసామాగ్రి లోని వస్తువే. పెద్ద విశేషము కాకపోవచ్చును. ఏనుగు కుంభమునలంకరించిన నాగసంభవ ద్రవ్యవిశేషమైన సిన్దూరము విడ్డూరము కాదు. భారవి కిరాతార్జునీయ కావ్యంలో దేవగజములను “సిన్దూరైః కృతరుచయః…” (కి. 7-8) అని వర్ణించినాడు. అసలైన విశేషము ఆ తర్వాతి సమాసములో – మన్దరధాఉకలఙ్కిఅవాసుఇమన్డలనిఅక్కలం – (మన్దరధాతుకలఙ్కితవాసుకిమండలనిశ్చక్రలం) ఉన్నది.
మన్దర = మందరపర్వతము యొక్క; ధాతు = మూలికల చేత; కలంకిత = మలినమైన; వాసుకి మండల = వాసుకి అను దేవసర్పముచేత వలయముగా; నిశ్చక్రిలం = చుట్టుకొనబడినది.
సాగరమథనమున సర్పరాజు వాసుకిని కవ్వంగా చేసి, మందరపర్వతాన్ని ఊతముగా పెట్టి పాలకడలిని చిలికిన పురాణకథ నిచ్చట అన్వయించుకోవాలి. నిఅక్కలం అన్న ప్రయోగంలో యున్నది ఆసక్తికరమైన, బలీయమైన భావనాబలం మొత్తమున్నూ. పగడంలా మెరిసిపోతున్న సూర్యగోళాన్ని ఎర్రటిచర్మము గల వాసుకి సర్పం వలయముగా చుట్టుకుందట! వాసుకి చర్మమెందుకు ఎఱ్ఱబారింది? మందరపర్వతానికి కవ్వముగా చేసిన శ్రమకి లభించిన ఫలితమది. ఆ పనిలో భాగంగా గైరికాది ధాతువులను రాచుకుని సర్పము తాలూకు చర్మము ఎఱ్ఱబడిపోయిందట!
రవిబింబం చూశాం కదా, శశిబింబాన్ని చూద్దాం. ఇందాక ఏనుగు తిలకపు ఉపమతో రవిబింబాన్ని తీర్చిన కవి, ఈ సారి ఏనుగు పదచిహ్నంతో అస్తమిస్తున్న శశిబింబాన్ని ఉత్ప్రేక్షిస్తున్నాడు.
తావ అ అత్థణిఅమ్వం ణవసలిలాఉణ్ణగఅపఅచ్ఛవికలుసో|
పత్తో అరుణుణ్ణామిఅపాసల్లన్తగఅణోసరన్తో వ్వ ససీ||
ఛాయ:
తావచ్చాస్తనితమ్బం నవసలిలాపూర్ణగజపదచ్ఛవికలుషః|
ప్రాప్తో అరుణోన్నమిత పార్శ్వాయమానగగనాపసరన్నివ శశీ||
చంద్రుడు పశ్చిమాద్రిని క్రుంగిపోతున్నాడు. ఆ బింబము ఒక చిన్న కొత్తనీటి కుంటపై యేనుగు కాలు మోపితే ఏర్పడిన గుండ్రని ముద్రలాగా, తూర్పున ఉదయిస్తోన్న బాలభానుని అరుణరేఖలు తనను దూరముగా పశ్చిమము వైపుకు నెట్టేసినట్టుందని ఉత్ప్రేక్ష.
అడుసులో ఏర్పడిన ఏనుగు కాలిముద్ర – ఇది ప్రాకృతకవన ముద్ర. ఇది విలక్షణం, విచిత్రం, అసాధారణమున్నూ. ఈ ముద్ర స్వతంత్రము, కానీ యే మూలనో పై వర్ణన వెనక ఆదికవి వాల్మీకి ప్రేరణము ఉందా అనిపిస్తుంది.
సంధ్యారాగోత్థితైస్తామ్రై రన్తేష్వధికపాణ్డరైః |
స్నిగ్ధైరభ్రపటచ్ఛేదైః బద్ధవ్రణమివాంబరమ్||
(వాల్మీకిరామాయణము, కిష్కింధాకాండ. 28.5)
వర్షము వెలసిన తర్వాత అల్పజలసంచయంతో తెల్లగా నున్న మేఘాలతో కూడిన యంబరము సంధ్యారాగాంచితమై – శరీరంపై ఏర్పడిన పుండుకు బట్టతో కట్టిన తెల్లటి కట్టులాగా, మధ్యభాగంలో ఎఱ్ఱగా. చివరల లేతరంగులోనూ ఉందట. మేఘము ‘పుండు’లా ఉందనేది ఈ శ్లోకలో ఉన్న అసాధారణత్త్వము, విలక్షణత్త్వమున్నూ. ప్రాకృత కవులైనా, సంస్కృతకవులైనా నాటి కాలంలో ఏ కవిత్త్వమైనా ఆదికవి వాల్మీకి కవిత్త్వంలో ఏదో ఒక్క పార్శ్వంలో సంగతము కావలసినదే. ఆ మహర్షి కవిత్త్వ మహత్త్వమది. మహర్షిని ప్రేరణ స్వీకరించటం మరే కవికైననూ గౌరవమే కదా.
సంస్కృతప్రబంధసాహిత్యంలో యిలాంటి విపరీత, అసాధారణమైన వర్ణలు ఎక్కడో తప్ప కనబడవు. తెలుగులో ఆముక్తమాల్యదకారుడి ధోరణి ఇలాంటిదే. కొంతలో కొంత నంది తిమ్మనగారు. అస్తమిస్తున్న నిశాకరుని ‘బాగా యెండకు కాలిన కామధేనువు పేడముక్క’గా ఊహించి, ఆ భావాన్ని సంస్కృతీకరించి, చరమాద్రి దావాగ్ని సంప్లుష్ట సురసౌరభేయీ కరీషైకపిండమని, తెలుగు ప్రబంధం పారిజాతాపహరణంలో చంద్రుణ్ణి అందంగా తిట్టేడు.
ఇంకా – అంబరాన్ని ఆర్ణవంగా దర్శించి, తారకలను ఆర్ణవగర్బములో పగిలి పైకి తేలిన ముత్యముల రాశితో ప్రాకృతకవి ఉత్ప్రేక్షిస్తాడు. ఒక్క ముత్యము ఏర్పడాలంటేనే అపురూపమైన స్వాతిచినుకొక్కటి అవసరం. ఐతే సముద్రగర్భములో ఏదో ఒక్క విపరీతం ఘటించి శుక్తిసంపుటములు (ముత్యపు చిప్పలు) విచ్ఛిన్నమయినవని ఊహించడం అసాధారణమైన, అసంబద్ధమైన ఊహ (Absurd/Weird thought).
అంత పెద్ద ఆకాశం మహాపద్మములా ఉందని మరొక ఊహ. శరత్కాలంలో యేర్పడిన ఇంద్రధనువో? దినమణి అయిన సూర్యుని కిరణాలతో ప్రకాశితమై, జారిన ఘనలక్ష్మి వడ్డాణమట ఇంద్రధనువు! ఆకాశాన వికసించిన మందారపువ్వు తాలూకు పుప్పొడి అట!
భారవి కిరాతార్జునీయంలో బంగారు రంగులో ఉన్న పుప్పొడి ఆకాశంలో గొడుగులా పేరుకుందంటాడు. బహుశా ప్రాకృతకవి దర్శించిన పద్మం తాలూకు పుప్పొడి సంస్కృతకవి కవనవిలాసానికి గొడుగుపట్టిందా?
వర్షాకాలము దాటిపోయినది. జనసామాన్యం రాచకార్యాలకూ, దండయాత్రలకూ వెళుతున్నారు. శరత్కాలారంభంలో ప్రయాణము మొదలెట్టటం ఆనవాయితీ. ఆ సన్నివేశములో ప్రాకృతకవిత్త్వంలో ఇంద్రచాపాన్ని శృంగారచిహ్నముగా మార్చి, ’దిశాకన్య పయోధరాలపైన అంతరిక్షము చిత్రించిన నఖచిత్రము వలె హరివిల్లు’ న్నదని కవి వర్ణిస్తాడు.
అదే శరత్కాలంలో –
ధుఅమేహమహుఅరాఓ ఘణసమఆఅడ్డిఓ ణ అవిముక్కాఓ|
ణ హపాఅవసాహాఓ ణి అఅట్టాణాం వ పడితాఆఓ దిసాఓ||
ఛాయ:
ధుతమేఘమధుకరాః ఘనసమయాకృష్టావనతముక్తాః|
నభః పాదపశాఖాః నిజకస్థానమివ ప్రతిగతా దిశః||
ఆకాశమనేది ఒక వృక్షము. ఆ చెట్టు కొమ్మలు – దిశలు. వర్షాకాలము అన్న పురుషుడు ఆ కొమ్మలను వంచినాడు. అప్పుడు ధవళమేఘశకలముల పోలిన తుమ్మెదలు ఒక్కచోటున చేరినాయి. ఆపై అతని పట్టు వీడగానే అవి ఎగిరిపోయి, తిరిగి యథాస్థానములను పొందినాయి.
ఈ శ్లోకములో చెప్పిన కవిత్త్వపు భావము వెనుక చెప్పని (ప్రతీయమానమయ్యే) భావసంపద ఎంతో ఉంది. ధవళమేఘతతి తుమ్మెదలబారు. వర్షాకాలమునకు ముందు తుమ్మెదలు దిశలను శాఖలపై అనేకమైన తేనెపట్టుల నేర్పరిచినాయి. ఆ తేనెపట్టులే ఘనమేఘములు. ఆ తేనెపట్టులను కాలపురుషుడు భూమికి సమాంతరంగా క్రిందకు వంచి, విదల్చి ప్రాణికోటి జీవికకై (మకరంద) వర్షమును కురిపించాడు. ఆపై ఆతడు శరత్కాలంలో కొమ్మను వదిలివేస్తే, తుమ్మెదలు (వెలిమబ్బులు) తమ నిజస్థానములకు చేరినాయి. ఇదంతా పాఠకుడు తనకు తాను ఊహించుకోవాలి. ఇక్కడ పాఠకుడూ ఒక కవి!
సంక్లిష్టమైన భావం కదూ. ఈ సంక్లిష్టత పద్యంలో లేదు. మనలో ఉంది. ఆధునిక యంత్రయుగంలో ఉన్నాం కాబట్టి ఈ సంక్లిష్టత. మేఘాలు, నక్షత్రాలు, తారకలు, చంద్రుడు – ఆధునిక యుగంలో ఇవన్నీ భోగాలు మనకు!
పైని శ్లోకములో మరొక విశిష్టత ఉన్నది. కేవలమొక వర్ణనామాత్రంగా కాక ఈ శ్లోకము తనంతట తానుగా ఒక ప్రత్యేకమైన ‘కథ’ను వినిపిస్తోంది. ప్రాకృత కవనలక్షణమిది. దీనికి గాథాసప్తశతి అంతా ఉదాహరణమే. ఈ లక్షణము కారణాన ఆలంకారికులు ప్రాకృతగాథలనేక పట్టుల ఉదాహరణముగా స్వీకరించినారు.
వివరమైన గాథకే కాక, నిశితమైన పరిశీలనమునూ ప్రాకృతమున కద్దు.
శరచ్చంద్రోద్భవ వర్ణనను వివరముగా పరిశీలిద్దాము.
పజ్జత్తసలిలదోఏ దూరాలోక్కన్తణిమ్మలే గఅణఅలే|
అచ్చాసణ్ణం వ ఠిఅం విముక్కపరభాఅపాఅడం ససిబిమ్బమ్||
ఛాయ:
పర్యాప్తసలిలధోతే దూరాలోక్యమాననిర్మలే గగనతలే|
అత్యాసన్నమివ స్థితం విముక్తపరభాగప్రకటం శశిబింబమ్||
వర్షాకాలము నింగిని పూర్తిగా కడిగివేసి, నిర్మలముగా చేసింది. ఆపైని సుదూరపర్యంతము గగనమున విస్పష్టముగ గోచరమగు శరచ్చంద్రబింబము – గగనతలము నుండి ముందుకు వచ్చి, కనులకు దగ్గరగా కన్పట్టుచున్నది. చంద్రబింబము ముందునకొచ్చియున్నది. వెనుకనెక్కడో గగనతలమున్నది.
[ముదురునీలపు రంగు శీతల వర్ణజాలానికి చెందిన రంగు (Cool Color). లోతైన ఆలోచనలకూ, భావజాలానికి ముదురునీలపు రంగు ప్రతీక. ముదురు నీలి/నీలి/నలుపు వర్ణపు తలముపై తెలుపు రంగుతో కూర్చిన అక్షరజాలాన్ని/తెల్లని బొమ్మను జాగ్రత్తగా గమనిస్తే, ఆ అక్షరాలు/బొమ్మ కలిగిన ధవళతలము ముందుకు వచ్చినట్టు, అంటే వెనుకటి నీలి తలంపై నుండి ‘ప్రొజెక్ట్’ చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఆధునిక కాలంలో వర్చ్యువల్ రియాలిటీ సిమ్యులేటర్లలో, వెండింగ్ మిషన్, ఇతర టచ్ స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌ల తెరల రూపకల్పనలోనూ ఉపయోగిస్తున్నారు. ఈ ప్రొజెక్షన్ ఎఫెక్ట్‌ను వేల యేళ్ళ క్రితం అదే రంగుల సమన్వయంలో ప్రాకృతకవి దర్శించడం అబ్బురం కాదూ!]
దృష్టిని దిగంతాలకు సారించే అనూహ్యమైన కల్పనలనే కాక ప్రాకృతకవి సూక్ష్మమైన పరిశీలనలను కూడా కవిత్వములో దర్శింపజేస్తాడు.
మఅరన్దగరుఅవఖ్కం పాసోఅల్లంత వణలఆవిచ్ఛూఢమ్|
ణ ముఅఇ కుసుమగ్గోచ్ఛం ఆసాఇఅమహురసం పి మహుఅరమిహుణమ్||
ఛాయ:
మకరన్దగురుకపక్షం పార్శ్వాయమానవనలతావిక్షిప్తమ్|
న ముఙ్చతి కుసుమగుచ్ఛమాస్వాదిత మధురసమపి మధుకరమిథునమ్||
సుగ్రీవుని కపిసేన సేతువు నిర్మాణము కొఱకు పర్వతములను పెళ్ళగిస్తున్నారు. కొండరాళ్ళు, చెట్లూ అల్లల్లాడిపోతున్నవి. ఆ కొండల మధ్యన ఒక కుసుమగుచ్ఛము. ఆ పూలలో మకరందం కోసం ఓ తుమ్మెదజంట వచ్చి వ్రాలినది. తనివితీరా ఆ జంట మధువు గ్రోలింది. అప్పుడు సరిగ్గా వానరులు కొండను పెకలించేరు. దానితో పూలగుబురు కదిలింది. దానితోబాటు ఆ పైని అడవి తీవె. అంత కోలాహలము జరుగుతున్నా కూడా భ్రమరమిథునము పూలపై జారిన దట్టమైన మకరందానికి రెక్కలు అంటుకున్న కారణమున ఆ చోటి నుండి కదలలేక పోయింది!
ఉత్కంఠగా కథను నిర్వహిస్తూ, కాస్త యెడంగా వచ్చి చేసిన కొంటెకల్పన ఇది. కథాక్రమాన్ని చెరుపక, కథలో అంతర్భాగంగా కథకు చెందని విషయాన్ని చెప్పుట. మకరందానికి రెక్కలు అంటుకుని ఎగురలేకపోయిన మధుకరమిథునము కళ్ళల్లో మెదలటమే గాక, కొండరాళ్ళు పెకలిస్తున్న నేపథ్యంలో భ్రమరముల జంట పాఠకుని మదిని ఒక చిత్రమైన, సున్నితమైన ’అనుకంప’ను రేకెత్తించుట సహృదయులకు తెలియవస్తుంది.
-----------------------------------------------------------
ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము - అనే వ్యాసం నుండి
దీని రచయిత రవి. ఈ మాట- జనవరి 2016
No comments:
Post a Comment